నిషేధంతో వెలిగిన ‘మరీచిక’                 

                                                                                    

 

“ఈ పుస్తకం ఎవరూ చదవడానికి వీల్లేదు” అని ఒక పుస్తకాన్ని ప్రభుత్వం నిషేధించడం, చాలా అస్తవ్యస్తమైన సమాజంలో జరిగే పనిలా కనిపిస్తుందా లేదా? ఈ పుస్తకం చదవడానికి వీల్లేదు, నువ్విలా రాయడానికి వీల్లేదు, ఈ సినిమా నువ్వు చూడ్డానికి వీల్లేదు, ఈ సినిమా నలుగురిలోకీ రావడానికి వీల్లేదు___________ఈ ధోరణి నిరంకుశమే కాదు, ఇది పాఠకుల, ప్రేక్షకులను వ్యక్తిగతంగా వారి ఆలోచనా శక్తిని అవమానించే ధోరణి కూడా! ఏ సమాజంలో అయినా సరే –

మరీచిక నవలని అలాగే ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం ఆరునెల్ల పాటు నిషేధించింది. ఎప్పుడో మాల పల్లి నవల తర్వాత కొన్ని దశాబ్దాలకు ప్రభుత్వ ఆగ్రహానికి ఆ పైన నిషేధానికి గురైన తెలుగు నవల.

ఇది కాలేజీలో ఉండగా చదివినపుడు దీన్ని ఎందుకు నిషేధించారో బొత్తిగా అర్థం కాలేదు. ఇందులో అంతగా రక్తాన్ని మండించి నక్సలైట్లలోకో, లేక హిప్పీల్లోకో తోసి అటేపు పరిగెత్తించే అంశాలేవీ కనిపించలేదు, 90 లలోని పరిస్థితుల ప్రకారం !  కానీ నవలా కాలం 1978 కాబట్టి అప్పటి సాంఘిక  వాతావరణం ప్రకారం దీన్ని అర్థం చేసుకోవాలి

సాంఘిక సమస్యల గురించి రాసి, తద్వారా ఆ నవల నిషేధానికి గురవడం వల్ల వాసిరెడ్డి సీతాదేవి ఒక ప్రత్యేక గౌరవాన్ని పొందినట్టే! ఆ సమయంలో ఆమెకు పాఠకులు, ప్రజా సంఘాల మద్దతు పుష్కలంగా లభించింది. మహా కవి నుంచి మామూలు పాఠకుడి వరకూ అఖిల భారత స్థాయిలో సీతాదేవి కి తోడుగా నిలబడి గొంతెత్తారు.

అసలింతకీ మరీచిక ను ఎందుకు నిషేధించినట్టు? అందులో అంత నిషేధించాల్సిన అంశాలేమున్నాయి? ఎవరిని ఏ వైపుగా ప్రేరేపించగలిగి ఉండేదని ప్రభుత్వం భావించింది? సవాలు చేసిన సీతాదేవి కి కోర్టులో ఏం దొరికింది? నిషేధమేమైంది?

ఈ నవల ప్రారంభానికి ముందు సీతాదేవి ఇది ఇంత సంచలనం సృష్టిస్తుందని ఊహించి ఉండరు బహుశా! రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు అమ్మాయిల రెండు కథల కథ ఇది. బాగా డబ్బున్న కుటుంబం  నుంచి వచ్చిన శబరి, పట్టుమని పద్ధెనిమిదేళ్లు కూడా నిండని పసిది. డబ్బులో పుట్టి డబ్బులో  పెరగడం వల్ల సామాన్యమైన జీవితం ఎలా ఉంటుందో,ఆకలి ఎలా ఉంటుందో, కష్టం ఎలా ఉంటుందో,శ్రమ ఎలా ఉంటుందో  అనుభవం లోకి రాని  సుకుమారి . బాధ, కనీసం ఆకలి, అవసరం   ఎలా ఉంటాయో చవి చూడాలని, డబ్బు, నగలు, విలాసాలతో నిండి కుళ్ళి రొటీన్ కంపు కొడుతున్న జీవితం నుంచి బయట పడాలని అమాయకంగా ప్రయత్నించే అమ్మాయి. మరో వైపు ఆమె స్నేహితురాలు మిడిల్ క్లాస్ జ్యోతి,వ్యవస్థను నిశితంగా పరిశీలిస్తూ, ఆలోచనలన్నీ విప్లవోద్యమాల వైపు పయనిస్తుంటే, అటు వైపు మళ్ళే దారిలో ఉంటుంది.

లోకాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని శబరి కి డబ్బు పిచ్చిలో పడి కొట్టుకునే తల్లిదండ్రులు! తెలిసిన వాళ్ళలో బాగా డబ్బున కుర్రాడిని చూసి వాడికి శబరిని ఇచ్చి పెళ్ళి చేసేయాలనే తొందరలో ఉంటారు తప్ప కూతురు కాలేజీలో ఏం చదువుతోందో కూడా పట్టించుకునే ఆసక్తి  ఉండదు వాళ్లకి . వాడంటే శబరికి ఏ ఇంటరెస్టూ ఉండదు. ఎప్పుడూ చెదరని బట్టల్లో, ఖరీదైన అలంకరణలో డబ్బుకు ప్రతీక గా కనపడే అతడంటే శబరికి చీదర.

ఆ పిల్ల సర్కిల్లో ఎటు చూసినా డబ్బు, దాని వల్ల వచ్చే విలాసాలు , డబ్బులో పొర్లే మనుషులూ! వీటన్నిటికీ దూరంగా వేరే జీవితం, మామూలుగా హాయిగా, హడావుడి లేని జీవితం కావాలి! ఉక్కిరికి బిక్కిరి చేసే ఈ డబ్బు లేకుండా హాయిగా ఊపిరి పీల్చుకునే వెసులుబాటు కావాలి. అది ఎక్కడ దొరుకుతుందో తెలీదు. ఎవరి దగ్గరికి పోతే దొరుకుతుందో తెలీదు.

ఎటూ కాని వయసులో ఉన్న పిల్లలు ఎలాటి పరిస్థితుల్లో బురదలో అడుగేస్తారో సరిగ్గా, శబరి కోసం కూడా అలాటి అవకాశం ఒకటి వెదుక్కుంటూ వస్తుంది. కాలేజీ నుంచి కార్లో ఇంటికి వస్తూ, దార్లో మత్తులో పడి పిచ్చి పిచ్చి గా ప్రవర్తిస్తున్న ఇద్దరు యువతీ యువకుల్ని చూస్తుంది. ఒంటి మీద బట్టలూ, సరైన స్పృహా రెండూ ఉండవు వాళ్ళిద్దరికీ!

తెలీని ఉత్సుకతతో వాళ్లతో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తే వాళ్ళు మత్తుతో ఏవేవో మాట్లాడ్డమే కాక కాక ఇంకో సారి రమ్మని, స్వర్గానికి తీసుకుపోతామని చెప్తారు. ఫలితంగా మరో సారి వాళ్ల దగ్గరికి వెళ్ళి మొదటి సారిగా LSD టాబ్లెట్ వేసుకుని మాదక ద్రవ్యం అనుభవాన్ని చవి చూస్తుంది. . శబరిని తమ హిప్పీ గ్రూప్ లోకి లాగాలనే వాళ్ల ప్రయత్నం సఫలమవుతుంది.  పెళ్ళి కొద్ది రోజుల్లో ఉందనగా, శబరి నగలు డబ్బు తీసుకుని జాన్ అనే హిప్పి తో పారి పోతుంది. పోయే ముందు “తాను ఆత్మ హత్య చేసుకుంటున్నాని”ఉత్తరం  రాసి పెట్టి,కట్టుకున్న చీర చెప్పులు కాలవొడ్డున విడిచి పోతుంది.

లోగో: భవాని ఫణి

లోగో: భవాని ఫణి

ఆ తర్వాత గుర్తు తెలీని శవమేదో కుళ్ళి పోయి దొరికితే అదే శబరి అనుకుని సంస్కారాలు చేస్తారు కుంగి పోయిన ఆ తల్లి దండ్రులు! (హిప్పీల వ్యవహారం కొంత తీవ్రంగానే ఉండుండాలి నవలా కాలం లో). బాంబే లో రోడ్ల వెంట పిచ్చి వాళ్లలా ఒంటి మీద స్పృహ లేకుండా తిరిగే హిప్పీలను,వాళ్లలో రకాలని చూసి తెల్సుకుని భయపడి పోతుంది. తప్పటడుగు వేశానని గ్రహిస్తుంది.  ఇంటికెళ్ళి పోతానని ఏడుస్తుంది. పోనివ్వరు వాళ్ళు . కానీ అలా ఏడ్చి గొడవ చేసినపుడల్లా ఒక మత్తు టాబ్లెట్టో పాకెట్టో ఇచ్చి ఆ పిల్లను మత్తులోకి తోసి అక్కడే ఉంచేస్తారు వాళ్ళు.

మరో పక్క జ్యోతి, సమాజంలో అసమానతలను  చూస్తూ భరించలేక వాటిని రూపు మాపడానికి ఏదో ఒకటి చేయాలనుకుంటుంది. శబరి తో హిప్పీలను కలవడానికి వెళ్ళినపుడు , తన వాదనతో వాళ్లని మార్చి తన మార్గం వైపు తీసుకురావాలనుకుంటుంది. అది సాధ్యం కాక తిరిగి వచ్చ్చేస్తుంది. కొన్నాళ్ళకి , విప్లవోద్యమం వైపు వెళ్ళక తప్పదని నిశ్చయించుకుని, తను నక్సలైట్లలో చేరుతున్నానని తండ్రికి ఉత్తరం రాసి పెట్టి వెళ్లి పోయి ఉద్యమంలో చేరుతుంది.

నెమ్మదిగా అక్కడి కఠిన జీవితానికి అలవాటు పడుతుంది. ఎవడో ఒక భూకామందుని చంపే ఆపరేషన్ లో అవకాశం పొంది సత్యం అనే తన సహ నక్సలైట్ తో కల్సి వెళ్తుంది. కానీ ఆపరేషన్ ఫెయిలై పోలీసుల కాల్పుల్లో సత్యం గాయపడతాడు.అతడిని తీసుకుని కొండల్లో పడి పారి పోతుంది. అలా మైళ్ళ కొద్దీ నడిచాక, పోలీసులు దరి దాపుల్లోనే కనిపిస్తారు కొండ మలుపులో! ఇక తప్పించుకోవడం అసాధ్యమని గ్రహించి సత్యం , ఆమెను వెళ్ళిపొమ్మని తను పోలీసులు చేతిలో మరణిస్తాడు. జ్యోతి అడవి దాటి గ్రామంలో అడుగు పెట్టడం తో కథ సమాప్తం!

నవల నిషేధానికి గురి కాకపోయి ఉంటే, ప్రభుత్వం దృష్టితో చూసినా  పాఠకులకు ఇందులో నిషేధించాల్సిన తీవ్రమైన అంశాలున్నాయని తోచదు. అయితే 1978-82నాటి సాంఘిక వాతావరణాన్ని బట్టి ఈ నవలను దాని నిషేధాన్ని చూడాలి కాబట్టి, ఇప్పటి ధోరణుల్ని బట్టి అంచనా వేయడం కష్టమే! నవల విడుదల అయ్యాక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1982 ఫిబ్రవరిలో నిషేధం విధించగా, ఆర్నెల్ల తర్వాత 1982 ఆగస్ట్ 10 న హైకోర్టు ధర్మాసనం నవలపై నిషేధం చెల్లదని తీర్పు ఇచ్చింది. కట్లు తెంచుకుని మరీచిక మళ్ళీ స్వేచ్చగా  రెక్కలు విదుల్చుకుని  బయటికి వచ్చింది. ఈ ఆర్నెల్ల  కాలం లో  పౌర హక్కుల సంఘాలే కాక సామాన్య పాఠకులు, ప్రజాస్వామిక వాదులు, పాఠకులు ఎందరో మరీచిక ను విడుదల చేయాలని నిరసనలు చేశారు. అరసం, విరసం,విశ్వసాహితి, జనసాహితి,హిందీ లేఖక్ సంఘ్,వంటి సంస్థలన్నీ సీతాదేవికి సంఘీభావాన్ని ప్రకటించాయి. సహజంగానే నిషేధం ఎత్తి వేశాక పుస్తకం కోసం పాఠకులు ఎగబడ్డారు.అంతకు ముందు పెద్దగా పట్టించుకోని వారు సైతం కొని చదవడం తో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి.

బోయి భీమన్న, శ్రీ శ్రీ, కె. రామ లక్ష్మి,కన్నాభిరన్ వంటి పలువురు ప్రముఖులు నిషేధం పై, పోలీసు వైఖరి పై తీవ్ర వ్యాఖ్యలతో నిరసన వ్యక్తం చేశారు

ఈ నవల్లో నక్సలిజం  పట్ల సీతాదేవి అటు సానుభూతి గానీ, ఇటు వ్యతిరేకత గానీ, ప్రకటించినట్లు స్పష్టంగా ఏమీ కనిపించదు. నవల చివర్లో జ్యోతిని గ్రామం వైపు వెళ్ళిపొమ్మని సత్యం బలై పోతాడు. జ్యోతి గ్రామం వైపు వెళ్ళింది అంటే జన జీవన స్రవంతి లో కలవడానికి వెళ్ళిందని అర్థం కాదు.పైగా నవల ముందు మాటలో సీతాదేవి “జ్యోతి ప్రజా జీవనాన్ని ఊపిరిగా పీలుస్తూ, రైతు కూలీల మధ్య ఉండే ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. అంతే కాక జ్యోతి పాత్రతో మరో నవల రాస్తానని కూడా పాఠకులకు మాట ఇచ్చారు. నక్సలిజం వైపు మళ్ళేటపుడు, దుందుడుకు స్వభావంతో తాత్కాలికావేశంతో నిర్ణయాలు తీసుకోడం పనికి రాదనే సందేశం మాత్రం అందుతుంది.

వర్గ శత్రువులను హత్యలు చేయడం ద్వారా నవ సమాజం నిర్మాణం జరగదని, ఒకడు చస్తే వేల మంది పుట్టుకొస్తూనే ఉంటారని, క్షేత్ర స్థాయిలో ప్రక్షాళన జరగాలనీ జ్యోతికి వచ్చిన కల ద్వారా రచయిత్రి సూచిస్తారు. ఈ కలలో జ్యోతి తన గ్రూప్ తో కల్సి భూషయ్యను చంపడానికి వెళ్తుంది. స్వయంగా జ్యోతే వాడి తల  నరికి పారేస్తుంది. అయితే ఆ తెగి పడిన తల జ్యోతితో మాట్లాడుతుంది.”నన్ను చంపావు సరే, నా కొడుకున్నాడు గా. వాడు కూడా రేపు నాలాగే భూస్వామే అవుతాడు.నువ్విప్పుడు దోచుకెళ్ళే డబ్బుని వాడు ఏడాది తిరక్కుండానే మళ్ళీ సంపాదిస్తాడు” అని ఎద్దేవా చేస్తూ, వ్యవస్థ లో మార్పు రానంత వరకూ వ్యక్తిగత హత్యల వల్ల ప్రయోజనం లేదని కథానాయిక కు క్లాస్ తీసుకుంటుంది.

ఆరుద్ర ఈ నవల కు ముందుమాట గా రాసిన వ్యాసంలో “సీతాదేవి కి నక్సలిజం  పై ఎంత సానుభూతి ఉన్నా, ఆమె దానికి సంపూర్ణంగా వ్యతిరేకి” అని, “నక్సలిజం  వైఫల్యాన్ని ఆమె సంపూర్ణంగా నవల్లో చిత్రించారు” అనీ అంటారు.. ఒక ఆపరేషన్ విఫలమైతేనో, ఒక సత్యం మరణిస్తేనో నక్సలిజం  విఫలమైనట్టు కాదని, జ్యోతి తిరిగి గ్రామం వైపు నడవడం ద్వారా రచయిత్రి సూచిస్తారు.  కానీ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వాసి రెడ్డి సీతాదేవే నవల నక్సలిజం వైఫల్యాన్నే చర్చిస్తుందని అంగీకరించారు. నవల లోని నిషేధిత భాగాలు ఏ విధంగా యువతను నక్సలిజం వైపుగా ఏ విధంగా ప్రేరేపిస్తాయనే విషయాన్ని నిషేధించేటపుడు ప్రభుత్వం ప్రజలకు వివరించాలని ఆమె ఆభిప్రాయ పడ్డారు.

Vasireddy_sithadevi

ప్రభుత్వం నిషేధించిన పేజీల్లో మాత్రం కొంత చర్చ, సంభాషణల రూపం లో నడుస్తుంది.  ఆ పేజీల్లో అప్పుడు వార్తా పత్రికల్లో రోజూ నడుస్తున్న భూస్వాముల హత్యలూ, గిరిజనుల ఆక్రోశాలూ, వాటి మీద రఘురాం, మూర్తి, సతీష్ పాత్రల మధ్య సంభాషణలున్నాయి.యువతీయువకులు అటువైపు ఆకర్షితులు కావడానికి ఏ యే అంశాలు ఆలోచనలు రేకెత్తిస్తాయో, వారి రక్తాన్ని ఉరకలు పెట్టించే అంశాలేంటో సతీష్ చేత చెప్పిస్తారు రచయిత్రి. ప్రభుత్వాన్ని కలవర పెట్టిన అంశాలివే అప్పట్లో!  ఆ నాడు ఉనికిలో ఉన్న సాంఘిక పరిస్థితుల మూలాన ఆ సంభాషణ యువతను చెడు దారి పట్టించేలా ఉందని ప్రభుత్వం భావించిందన్నమాట.

ఆరుద్ర ఒక వాలిడ్ పాయింట్ లేవనెత్తారు. ఈ నవల్లో హిప్పీల జీవితాలు, వాళ్ళు వాడే మాదక ద్రవ్యాల వివరాలు, వాటి పేర్లు మొత్తం వివరిస్తారు రచయిత్రి. “ప్రభుత్వానికి హిప్పీ పిల్ల కథ గురించి ప్రభుత్వం వారికి ఏ విధమైన అభ్యంతరం లేదని వారు ఉటంకించిన పేజీల సంఖ్య చూస్తే తెలుస్తుంది. సాంఘిక దురన్యాయాలకు ఎదురొడ్డి పోరాడాల్సిన యువత హిప్పీలలో చేరి క్షీణించి పోతే పాలకవర్గీయులకు పబ్బమే! ఎటొచ్చీ విప్లవకారులైతేనే తంటా” అంటారు . ఈ నవల రాస్తున్నపుడు సీతాదేవి ఆంధ్ర ప్రదేశ్ యువజన సర్వీసుల విభాగంలో డైరెక్టర్ స్థాయిలో ఉన్నతోద్యోగిగా ఉన్నారు. డిపార్ట్మెంటల్ గొడవలకు ఆమె సాహిత్య శిశువును బలి చేయడం తగదని రాస్తూ ఆరుద్ర ఈ నవల నిషేధానికి ఇతరత్రా కారణాలున్నాయనే హింట్ కూడా ఇచ్చారు

ఈ నవల్లో మొత్తం అక్కడక్కడా 20 పేజీల్లో అభ్యంతర కర విషయాలున్నాయని పేర్కొంటూ ప్రభుత్వం దాన్ని నిషేధించింది. ఏ యే  పేజీలు అభ్యంతరకరమో గవర్నమెంట్ గెజిట్ ఆర్డర్ లో వివరంగా ఆ పేజీలు ప్రింట్ చేసి మరీ ఇచ్చారని విన్నాను. అంటే నవల నిషేధంలో ఉన్నా, ఆ నిషేధించిన పేజీల్లో ఏముందో ప్రభుత్వ గెజిట్ చూసి చదివి తెలుసుకోవచ్చన్నమాట! ప్రభుత్వ గెజిట్ అందరికీ అందుబాటులోనే ఉంటుంది :-) ! అలా ఉంటాయన్నమాట నిషేధాల ప్రహసనాలు !

ప్రశ్నించిన వాళ్ళని, గొంతెత్తిన వాళ్లని నిషేధించడం, నిర్మూలించడం చరిత్రలో ఎంత సహజమో నిషేధం పట్ల నిరసనా, తిరుగుబాటూ అంతే సహజమూ , ప్రజాస్వామ్య వ్యవస్థలో అది అనివార్యమూ కనుక ప్రజా సంఘాలు, సాహితీ సంఘాలు ,పాఠకులు కళాకారులు, రచయితలు పెద్ద ఎత్తున నిరసనలు చేసి కోర్టుకెళ్ళారు. న్యాయం కావాలని గొంతెత్తి వాసి రెడ్డి సీతాదేవి తరఫున నిలబడ్డారు. నిలబడి గెలిచారు.

పుస్తకాల నిషేధం గురించి రంగనాయకమ్మ విలువైన, ఆలోచించ దగ్గ అభిప్రాయాలను మరీచిక నిషేధానికి ముందే ఒక చోట వ్యక్తపరిచారు . యండమూరి తులసి దళం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా, ఆ నవలను నిషేధించాలనలేదు ఆమె !

‘ఆదివారం ’ అనే వారపత్రిక  13-9-1981 సంచికలో ఆమె పుస్తకాల నిషేధం గురించి  తన అభిప్రాయాలను ఇలా చెప్పారు-

‘‘ఒక రచనని నిషేధించడం అంటే , దాన్ని ప్రచురించకుండా ఆపుతారు. అప్పటికే ప్రచురణ అయిన పుస్తకాల్ని పోలీసులు పట్టుకుపోతారు. ఆ నిషేధ రచనల్ని చదివే పాఠకుల్ని అరెస్టులు చేసి, లాకప్పుల్లో పెట్టి వారి నించీ లంచాలు లాగుతారు. చివరికి వారి మీద కేసులుపెట్టి శిక్షలు వేస్తారు.  ఇది ఏ రకంగానూ ఆర్గ్యుమెంటకి నిలబడే విషయం కాదు.

ఎందుకంటే-

 పాఠకులు ఒక ‘రచన’ను చదవడానికి  సిద్ధంగా వున్నప్పుడు ఒక ‘చట్టం’ వచ్చి వారిని

దండించాలనడం  పరమ హాస్యాస్పదమైన, ప్రజాస్వామ్య వ్యతిరేకమైన విషయం. మనుషుల్ని భయపెట్టి  ఒక పని నించీ ఆపగలమనుకోవడం మనుషుల శక్తీ, మనుషుల ప్రత్యేకతా తెలియని వాళ్ళు చేసే ఆలోచన.   ‘భయం’ అనేదానికి జంతువులు లొంగుతాయి గానీ మనుషులు లొంగరు. లొంగకూడదు.

…. ..

ఒక పుస్తకాన్ని నిషేధించడం అంటే కొందరు ‘మేధావులు’ మొదట దాన్ని చదివి- ‘ఇది చెడ్డ పుస్తకం,  మిగతా వాళ్ళంతా దీన్ని చదవకూడదు’ అని నిర్ణయించడమే. ఆ మేధావులు, ‘మేధావులు కాని’ వారితో  ఇలా అంటారు- ‘‘ఫలానా పుస్తకం మీరు చదవకండి, చెడిపోతారు. మేం మొదట చదివి చూశాం. మేం  మేధావులం కదా? అంచేత ఎంత చెడ్డ పుస్తకాలు చదివినా మేం చెడిపోం. మీరున్నారే, మీరు మాలాగా  మేధావులు కారు గదా, ఇలాంటి పుస్తకాలు చదివితే మీరు చాలా చెడిపోతారు. కాబట్టి ఏది మంచి పుస్తకమో,   ఏది చెడ్డ పుస్తకమో మేం చదివి మీకు చెపుతూ వుంటాం…

 

ఈ రకంగా ఏది మంచో ఏది చెడ్డో మేధావులే నిర్ణయిస్తూ వుంటారు.

కొందరు మేధావులు చేసే నిర్ణయాలకి కోట్ల కోట్ల మంది జనం కట్టుబడివుండాలనడం మేధావుల దురహంకారం తప్ప  ఇంకేమీ కాదు.

ఫలానా  పుస్తకాన్ని ప్రచురించకూడదనీ, చదవకూడదనీ చట్టం వచ్చినంతమాత్రాన దాన్ని ప్రచురించడమూ ఆగదు,  దాన్ని చదవడమూ ఆగదు. కాక పోతే రహస్యంగా…..బహిరంగ రహస్యంగా!

అందుచేత నిషేధాలకన్నా సరియైన, బలమైన, ఆయుధం ఏమిటంటే ఆవిషయంలో పాఠకులకు సరియైన   అభిప్రాయాలు కలిగిస్తూ ‘ఎడ్యుకేట్’ చెయ్యడం. పాఠకుల్ని హేతుబద్ధంగా ఆలో్చించేటట్టు చేసే మార్గం ఒక్కటే  ఈ విషయంలో    సరైన మార్గం.’’

నిషేధం సంగతి పక్కన ఉంచి,నవల కంటెంట్ విషయానికొస్తే నవల గబ గబా నడిచి పోయిన అనుభూతి కల్గుతుంది. రెండు సీరియస్ ఇష్యూలను తీసుకున్న రచయిత్రి వాటి మీద  సీరియస్ గా కాన్సంట్రేట్ చేయలేదనిపిస్తుంది కొన్ని చోట్ల.

శబరి జీవితం అలా ముగిసి పోవాల్సిందేనా? ఆ పిల్ల హిప్పీల్లో కల్సి పోయి ఉంటుందనే సందేహం డ్రైవర్ మాటల వల్ల తండ్రికి వచ్చి అది ధృడపడినా, ఆ వైపుగా ఆమె ఆ ఆచూకీ కనుక్కునేందుకు గట్టి ప్రయత్నాలేమీ సాగవు. అలాటి పిల్లను మళ్ళీ ఇంటికి తీసుకు రావడానికి భయపడ్డారా? ఒక్కగానొక్క కూతురు! నవల చివర్లో శబరి ఆచూకీ కనుక్కునేందుకు కొంత ఆసక్తి చూపిస్తాడు తప్ప, మరేదో పని వచ్చి దాన్ని పక్కకు పెడతాడు తండ్రి! అది చాలా అసహజంగా కనిపిస్తుంది. ఇహ ఆ తర్వాత అమాయకంగా వెళ్ళి ఇష్టం లేకుండా హిప్పీల్లో ఇరుక్కు పోయిన శబరి జీవితం, పద్ధెనిమిదంటే పద్ధెనిమిదేళ్ళ శబరి జీవితం అలా అంతమై పోవలసిందేనా?

ఇక జ్యోతికి విప్లవ భావాలు ఏర్పడడానికి, నక్సలిజం వైపు మళ్ళాలన్నంత తీవ్రంగా ఆ ఆలోచనలు  డెవలప్ కావడానికి గట్టి బేస్ దొరకదు నవల్లో! విప్లవోద్యమ నాయకుల్ని ప్రత్యక్షంగా కల్సుకున్నట్టు గానీ, విప్లవ సాహిత్యం విరివిగా చదివినట్టు గానీ ఉండదు. ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టు మాత్రం చూపించి వదిలేస్తారు రచయిత్రి. అన్నిటికంటే ఘోరంగా అనిపించే విషయం, మాట్లాడితే విప్లవ సూక్తులు వల్లించే జ్యోతి, శబరి పట్ల అసలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంది నవల్లో! శబరి హిప్పీల వైపు మళ్ళుతోందని జ్యోతికి తెలుసు. హిప్పీల దగ్గరికి తను కూడా వెళ్ళి మాట్లాడుతుంది. వాళ్ళని తన వైపు తిప్పుకోవడం అసంభవం అని గ్రహించగానే విసుగు చెంది వాళ్లను వదిలేసి వస్తుంది తప్ప శబరిని అటు వైపు వెళ్లకుండా, ఆ ఉచ్చు లో పడకుండా ఆపాలని ఏ ప్రయత్నమూ గట్టిగా చెయ్యదు. తను చెయ్యడం అటుంచి “మీ అమ్మాయి యాక్టివిటీస్ ఇలా ఉన్నాయి” అని శబరి తల్లి దండ్రులకు కూడా సమాచారం ఇవ్వదు. విప్లవ నినాదాలు చేసుకుంటూ నక్సలైట్లలో కల్సి పోతుంది. తర్వాత శబరి కొంపదీసి హిప్పీల్లొ గానీ కల్సి పోయిందా అనే ఆలోచన అయినా రాదు .

సాటి స్నేహితురాలి జీవితం నాశనం కాబోతున్నదని తెలిసీ ఆ వైపుగా ఏ బాధ్యతా చూపించని జ్యోతి విప్లవోద్యమాల్లో ఏ మాత్రం బాధ్యత వహిస్తుందనే ప్రశ్న అప్పుడే తలెత్తుతుంది. దానికి తగ్గట్టే,చివర్లో ఆమె గాయపడిన సత్యాన్ని పోలీసులకు వదిలేసి (అదొక్కటే మిగిలిన చాయిస్ అనుకోండి)గ్రామం వైపు వెళ్ళి పోతుంది. ఆమె పలాయనం చిత్తగించిందా లేక గ్రామం లో పీడిత వర్గాలను ఉత్తేజితం చెయ్యడానికి వెళ్ళిందా అనే సందేహానికి జవాబు మన ఉహకు వదిలేస్తారు రచయిత్రి .

రచయిత్రి మాత్రం జ్యోతి రైతు కూలీల కోసమే పని చేస్తూ ఎక్కడో ఉండే ఉంటుందని నమ్ముతారు. తిరిగి ఆమె పాత్రను కొనసాగిస్తూ మరో నవల రాయాలని కూడా అనుకున్నారు

రెండు తీవ్ర సమస్యల్ని చర్చించి, వాటి వల్ల కంటే నిషేధం వల్ల జనాకర్షణ పొంది, సంచలనం సృష్టించిన మరీచీక నవల ఆన్ లైన్లో ఉచితంగానే దొరుకుతుంది. నవల పై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తి వేస్తూ హై కోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఆన్ లైన్లో చదవొచ్చు

వెదికి చదవడమే తరువాయి

 

చిన్న సరదా కొసమెరుపు:

ఆంధ్ర జ్యోతి 1982 దీపావళి సంచిక  వాసిరెడ్డి సీతా దేవి కి ఒక సరదా బిరుదునిచ్చింది “నిషిద్ధ నవలా శోభిత” అని :-)

 

*

 

 

 

 

 

 

మీ మాటలు

 1. చందు తులసి says:

  సుజాత గారూ విశ్లేషణ బావుంది. పాలకుల అమాయకత్వం గానీ పుస్తకం నిషేధిస్తే ఏం ప్రయోజనం..?

  నేనెక్కడో చదివానండీ… ఈ నవల యువతను జీవితం పట్ల విరక్తి కలిగిస్తుందనీ, ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని…. అందుకే నిషేధించారని..

  • కోదండ రామయ్య says:

   “నేను ఎక్కడో చదివాను” అంటే కుదరదు – దీన్ని కప్పు దాటుడు వ్యవహారం అంటారు. ఎక్కడ చదివారో స్పష్టంగా చెప్పండి చందు గారూ. ఈ నవల ఆంధ్రబూమి వార పత్రికలో సీరియల్ గా వచ్చినప్పుడు తమరే లోకంలో ఉన్నారో కదా !
   – భవదీయ కోదండ రామయ్య

   • చందు తులసి says:

    కోదాడ రామయ్య గారూ.. మీ స్పందనకు థాంక్యూ…
    మనం చాలా చదువుతుంటాము…
    చదివిన విషయాలు గుర్తు పెట్టకుంటాము..
    ఎక్కడ చదివినది అంతగా గుర్తుంచుకోము.

    చెప్పక తప్పదు అంటే…..అపుడు కదా ఆలోచిస్తాము…
    ఇక నేను చదివింది ఆ నవల అనుబంధ పేజీల్లోనే… కొత్తగా వచ్చిన ముద్రణలో.

    మీరు ఆంధ్రభూమి సీరియల్ గా వచ్చినపుడే చదివారు… తప్ప ఆ తరువాత పరిణామాలు తెలుసుకోలేదేమో… అనిపిస్తోంది.
    మీరెవరో… మీ అసలు పేరూ నాకు తెలుసు. మీతో వాదించలేను సర్.‌
    నాది కప్పదాటు అన్నారు సంతోషం. నాకు ఈత ఇంకా రాలేదు. కప్ప దాట్లు తప్పవు.
    నేనో పిల్ల ఈతగాన్ని. గజీతగాన్ని కాదు..కదా.

    నా సమాచారం

 2. ప్రభుత్వం నిషేధించిన పేజీల్లో మాత్రం కొంత చర్చ, సంభాషణల రూపం లో నడుస్తుంది. ఆ పేజీల్లో అప్పుడు వార్తా పత్రికల్లో రోజూ నడుస్తున్న భూస్వాముల హత్యలూ, గిరిజనుల ఆక్రోశాలూ, వాటి మీద రఘురాం, మూర్తి, సతీష్ పాత్రల మధ్య సంభాషణలున్నాయి.యువతీయువకులు అటువైపు ఆకర్షితులు కావడానికి ఏ యే అంశాలు ఆలోచనలు రేకెత్తిస్తాయో, వారి రక్తాన్ని ఉరకలు పెట్టించే అంశాలేంటో సతీష్ చేత చెప్పిస్తారు రచయిత్రి. ప్రభుత్వాన్ని కలవర పెట్టిన అంశాలివే అప్పట్లో!
  ఆ రోజుల్లో ఆ మేరకు ముద్రించి ఆ పాఠాన్ని మాత్రమే అమ్మిన సందర్భం.

  అప్పట్ట్లో కొంత మేధావులు ‘మరీచిక’ కి నిషేధం దానికి అనవసరమైన ప్రచారం కలిపించింది అని కూడా అన్నారు. ఆ ప్రచారా హోరులో కొనుక్కుని చదివి చప్పరించిన వారు ఉన్నారు.
  హిప్పీ ల కల్చర్ ఒక్కటే కాదు, ఆ తరాన్ని ప్రభావితం చేసింది.

  సీతాదేవి గారి మాగ్నమ్ ఓపస్ మట్టి మనిషి. దాన్ని పరిచయం చెయ్యండి మీ పాఠకులకి.

 3. chandolu chadrasekhar says:

  నేను ముపై ఏళ్ల క్రితం ఈ నవల చదివాను .నిషేధం కాక ముందే యువతరాన్ని ఆకట్టుకుంది .అప్పట్లో విప్లవ విద్యార్దులు బలంగా వున్నారు .ఈ నవల ప్రభావం తో యువతరం నక్సల్ ఉద్యమలోకి వెళ్ళతారేమొ అని ప్రభుత్యం నిషేధం చేసింది .పబ్లిష్ ఐన చాల కాలానికి ,నిషేధించారు .

 4. కోదండ రామయ్య says:

  @ చందు తులసి
  కోదండను కోదాడ చేశారు – ఏమి చిత్రం ?
  మీరు ఎప్పుడూ కొత్త కొత్త ముద్రణ లే చదువుతారన్న మాట – అందుకే కాబోలు మీకు అన్నీ తాజా వార్తలు తెలుస్తుంటాయి.
  నా కన్నీ పాసిపోయిన , “య్యాక్ థూ ” సంగతులే తెలుస్తాయి. మరీచిక తర్వాత పరిణామాలన్నీ పూస గుచ్చినట్టు చెబితే మేము కూడా తెలుసుకుంటాము కదండీ. మీ రాతలను బట్టి చూస్తే కప్పలేమిటి పాము దాట్లే దాటేలా ఉన్నారు . అంత ఆవేశం పనికిరాదు చందు తులసి గారూ !
  మీ శ్రేయోభిలాషి కోదండ రామయ్య

  • చందు తులసి says:

   కోదండ రామయ్య గారూ….అది నా వివరణ మాత్రమే. మిమ్మల్ని నొప్పించాలని కాదు…
   మీరు నా వ్యాఖ్యతో బాధపడితే సారీ సర్…

 5. THIRUPALU says:

  విశ్లేషణ ప్రజాస్వామికంగా ఉంది. అదీ నిషేద నవలను విశ్లేషించడం మరీ బాగుంది. ఇంకా డీప్ గా ఉండి ఉంటే బాగుండేది. మీరు కేశవరెడ్డి గారి మునెమ్మను విశ్లేషించి నంత డీప్ లేదు

 6. manjari lakshmi says:

  నన్ను అప్పట్లో బాగా ఆకర్షించిన నవలను పరిచయం చేసినందుకు సుజాత గారికి ధన్యవాదాలు

 7. ప్రభుత్వాలు పుస్తకాల్నీ, సినిమాల్నీ నిషేధించటం సరికాదు. సరే. సెన్సార్ బోర్డ్ ఎర్ర సినిమాలపై “కట్లు” ఝళిపించినప్పుడు ఒకలాగా, బూతు సినిమాలని చూసీచూడకుండా వదిలేసినప్పుడు మరో లాగా స్పందించే మేధావులని ఎలా అర్ధం చేసుకోవాలి? రెండు సందర్భాల్లోనూ ప్రజల విజ్ఞతని ఒకేలా గౌరవించవచ్చు కదా.

 8. Sashanka says:

  ఆ తర్వాత ఎప్పుడో అమ్మకాలు పెంచుకోవటం కోసమే ఆ నిషేధం విధింప చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. పుకార్లే సుమా.

  అదలా ఉంచి రంగనాయకమ్మ గారు కోరుకునే సమ సమాజంలో నిషేధాలుంటాయా? అసలు ఉండవా?

  -శశాంక

మీ మాటలు

*