గ్యాలరీకి దూరంగా కవనం: అనంతు

 

 

అనంతుకి బాగా అతికే ట్యాగ్ లైన్ – “కేవలం కవి కాదు!” అటు వచనం, పత్రికా రచనం, ఇటు కవనం, చిత్ర లేఖనం, చలనచిత్రానుభవం- అనంతు అనేక కోణాల kaleidoscope! మాటలో మంత్రం, విశ్లేషణలో గాఢత్వం, కదలికలలో జీవన తృష్ణ, దూరాల్ని జయించే ప్రేమ, భిన్న ఉద్వేగాల కూటమి! తొంభైల తరవాత తరంలోని సంక్లిష్టతల అంతు తెలిసిన వాడు. ఇప్పటి జీవితపు నుడీ నాడీ వెతికి పట్టుకున్న వాడు. నిశ్శబ్దంగా ఉండలేని వాడు – అనంతు. తక్కువే  రాసినా  ఎక్కువ కాలం  గుండెని బొంగరం తిప్పినట్టు తిప్పే  అనంతు కవిత్వాన్ని “ద్వీప కూటమి” శీర్షికతో  ఈ పన్నెండున హైదరాబాద్ లో ఆవిష్కరిస్తున్నారు “ప్రేమ లేఖ” మిత్రులు. ఈ సందర్భంగా అనంతు లోగుట్టు తెలిసిన నలుగురు – నామాడి శ్రీధర్, అఫ్సర్, ఒమ్మి రమేష్, ఎం. ఎస్. నాయుడు, పెద్ది  రామారావు-  అన్న  నానా  మాటలకు అనంతు సమాధానాలివి:

*

నామాడి శ్రీధర్ : ఎందుకీ కవిత్వం అంటే నువ్వేమంటావ్?

అనంత్: నాకు ఎందుకీ కవిత్వం అంటే నా దగ్గర తయారీ సమాధానం లేదు. బహుశా నేనే నన్ను ఆ ప్రశ్న వేసుకోకపోవడం  వల్లే.

కానీ అసలు ఎందుకీ కవిత్వం అనేది చాలా పొరలున్న ప్రశ్న. అది నాకు మాత్రమే సంధించిన లేదా వర్తించే ప్రశ్న కాదు.

మేలైన, లోతైన, ఘాడమైన, లలితమైన కవిత్వం ఎక్కడ అభివ్యక్తిగా, సృజన ప్రక్రియగా తలెత్తుకుని వుంటుందో ఆ జాతికీ, ఆ భాషకీ ఇంకా ఉద్వేగ, ఆక్రోష, ఆకాంక్ష, సౌందర్య  ప్రకటనలు బహిరంగంలోనూ సజీవంగా వున్నాయని లెక్క. అలాంటి కవిత్వం జలాలుద్దీన్ రూమీదయినా, చీనీ లీపోదయినా; అమెరికన్ జనపద వాగ్గేయకారుడు పీటె సీగర్ దయినా, దళిత విప్లవకారుడు శివసాగర్ దయినా; వీట్ మిన్ స్వాతంత్ర్య ఉద్యమ నేత పో చి మిన్ దయినా, స్ఫటిక కవి ఇస్మాయిల్ దయినా సరే మనసుకు దగ్గరై, అర్థమై, మక్కువా అవుతుంది నా మటుకు నాకు.

మన సకల ఉద్వేగాలను కించిత్ కెరలించేది కవనం. అందుకే కవిత్వం.

అయితే కొద్దిపాటికి చెందిన వ్యాసంగమే ఏ సమాజంలోనయినా కవిత్వం. కొందరి మధ్యే ప్రభవించి, పల్లవించి, ప్రవహించే జల అది ఇంకా ఇక్కడ. కవిత్వం కళ. సృజన వేరు. కళ వేరు. చాలా సార్లు సృజన సహజాతం కావచ్చు. పిచ్చుకలు అల్లే అందమైన గూడు లాగా. కానీ కళ తర్ఫీదు వ్యవహారం. రస ఆస్వాదనకు (appreciation) ఏ ప్రక్రియలోనయినా తర్ఫీదు, సాధన తప్పనిసరి. కవిత్వం మినహాయింపేమీ కాదు.

శ్రీ శ్రీ లాంటి కవి మన కవిత్వానికి  icon (మహాకవి) కాకపోయివుంటే మన వచన కవితానుడి ఇన్ని గడులు, సుడులు దాటుకుని ఇంత పెద్ద గెంతుతో వచ్చేది కాదు. కానీ శ్రీ శ్రీ (తరహా) ది మాత్రమే కవిత్వం అయి తక్కినది కాకుండా (చాలా నాళ్ళు) పోవడంలో శ్రీశ్రీ కి కీడు చేసిన వాళ్ళ వాటానే ఎక్కువ. శ్రీశ్రీ లో tautological అంశ కూడా వుంది. అది ఆ కాలానికి తగింది. దాన్ని సందర్భం నుంచి వేరుచేసి తక్కువచేయలేం. కానీ ఆ tautology ఇప్పుడు redundant.

జాషువా, నారాయణబాబు, పఠాభి, దిగంబర కవులు, బైరాగి, వజీర్, ఇస్మాయిల్, అజంతా, మో లాంటి కవులు శ్రీశ్రీ తరహాని పటాపంచలు చేయగలిగారు. అందుకే తర్వాత తరాలకు శ్రీశ్రీ ఇక emotional baggage కాలేదు అంతగా. అయితే మన గొప్ప కవుల్లో చాలా మంది కార్డ్ హోల్డర్స్, గ్యాలరీ ప్లేయర్స్. లేదా showmen అనవచ్చు. అంటే గ్యాలరీ పట్ల విపరీతమైన స్పృహ వున్న ప్రదర్శకులు (performers/charmers). ఇది నిందార్థంలో కాదు. నిశ్చిత అర్థంలోనే. కానీ కార్డులనుంచి, గ్యాలరీలనుంచి విముక్తం అయి వికసించిన, వినిపించిన నిజ కవిత్వం మనకు చాలా తక్కువ. దానికి  ప్రబలమైన కారణాలు మన అతితార్కిక అభౌతికవాద అకమ్యూనిష్ఠాగరిష్ఠు కుబ్జ విమర్శకుల దుందుడుకుతనం, డాంబికం, జడత్వ కొలమానాలూ, పటాటోప ప్రదర్శనం, దూషణం. ఇది చాన్నాళ్ళు కొనసాగింది. కాబట్టే మన socalled  avant-garde writers’ ensemble ఏనాడో dead poets’ society గా మారిపోయింది. పైగా ఎప్పుడో శివసాగర్ చేసిన ఈ ప్రకటననీ, విశ్లేషణని anti-revelutionary elements పెట్టే శాపనార్థాలుగా ఇప్పటికీ తమ శ్రేణుల్లో చెలామణీ చేసుకుంటూ ఆత్మవంచనకు పాల్పడుతూ డాంబికంగా వుంది ఆ సంఘం.

ఇక కొత్త అని చెప్పలేం కాని, భిన్న మైన విమర్శను రంగం మీదకు తీసుకు వచ్చాయి అస్తిత్వ ఉద్యమాలూ, అదే కాలంలో ప్రవేశించిన post-modernism. అయితే అప్పటి వరకూ మిణుకు ఉనికిలో వున్న విమర్శ వీటి నుంచి వినమ్రంగా నేర్చుకున్నది శూన్యం. ఇంకా విషాదం ఏమిటంటే… అస్తిత్వ వాద ఉద్యమాలు, post-modernist లూ  అప్పటి వరకూ వున్న విమర్శలోని ఓగును తగిలించుకుని బాగును విసర్జించడం.

అందుకే ఇప్పటి కవిత్వం కార్డులనుంచీ, గ్యాలరీ కోసం ప్రదర్శణల నుంచీ విముక్తం అయినట్టు పైకి కని, వినిపించినా సాహిత్య విమర్శ గైర్హాజరీ వల్ల  ఇటీవలి కవిత్వంలో కవిత్వమే మృగ్యం. కవిత్వం ఒంటరిగా మనలేదు. సత్ విమర్శ నిశ్వాసం. అది లేని కవనమే ఇప్పటి చెలామణీ మరి.

 

నామాడి శ్రీధర్: రచనకీ, ఆచరణకీ మధ్య కవిలో ఎంతెంత దూరమని చదువరి కొలుస్తాడంటాను. నువ్వేమంటావు?

అనంతు: రచన ముఖ్యమా, రచయిత ముఖ్యమా అన్న చర్చ ఈ నాటిది  కాదు. అత్యంత ఎక్కువగా కార్ల్ మార్క్స్ మీద ఈ నాటికీ జరుగుతోంది. యంగ్ మార్క్స్ అనీ, లేటర్ మార్క్స్ అనీ. రచయిత ఏ కాలంలో, ఏ సందర్భంలో ఏమన్నాడు, కాలానుగుణంగా రచయిత అభిప్రాయాల పరిణామంలో వైవిధ్యాలనూ, వైరుధ్యాలనూ బేరీజు వేస్తూనే వున్నారు చదువరులు. అలా వేస్తూనే వుంటారు. అయితే రచయిత కన్నా రచన కీలకం అనే వర్గంతో నాకు సమ్మతి వుంది.

ముందు తరం పరిమితుల ఎరుక కల్పించుకోవడమే తరువాతి తరం పరిణతి. ఎరుక అదంతకదే మన దరి చేరి రాదు. మనమే కల్పించుకోవాల్సి వుంటుంది. మన చొరవతో, చైతన్యంతో. ఆ చొరవ, చైతన్యమే ఆచరణ. కార్యాచరణ అంటే అన్నిసార్లూ చౌరస్తాలో నిలబడి నినదించడం, నిరసించడం మాత్రమే కానక్కర్లేదు. ఆయుధాలు పట్టుకుని అడవికి వెళ్ళడమొక్కటే ఆదర్శ ఆచరణకు అన్నిసార్లూ గీటురాయి అని ఎవరైనా బుకాయించి దబాయిస్తే చెల్లదు. కొన్నిసార్లు ఇంటిలో సమాయత్తమయి తలుపు తీయడం కూడా కార్యాచరణే. ఆ తలుపు దాటేలోపే ఎన్ని సంశయాలు, ఎన్ని సందిగ్ధాలు. అవన్నీ తీరకుండా అడుగు కదలదు కొన్నిసార్లు. అలాంటప్పుడు ఆలోచనే ఆచరణ. అట్లాంటి కాలంలో కీలక ఆచరణ ఆలోచన చేయడమే. మన సమ సమాజానికి అనుగుణమయిన నమూనా మనం రచించుకునే వరకూ ఆలోచించడమొక్కటే, చర్చించడమొక్కటే, తర్కించడమొక్కటే, ఆ ఆలోచనల ప్రసారానికి పూనుకోవడం ఒక్కటే ప్రధాన ఆచరణ.

రచన లేదా సృజన కర్తవ్యం అన్ని సందర్భాలలో ఖాళీలను పూరించడం మాత్రమే కాదు. సృజన ఖాళీలను సృష్టిస్తుంది కూడా కొన్ని సందర్భాలలో, కొన్ని కాలాలలో. అఖాతాలను ఏర్పరస్తుంది సాహిత్యం. ఆ ఖాళీలను, అఖాతాలను పూరించాల్సింది చదువరులే. ఎందుకంటే రచయిత తదుపరి కదా చదువరి. సాహిత్యం అంటే కేవలం తెలుగు సాహిత్యం అనే అర్థంలో కాదు. మన ఆవరణలోకి, అందుబాటులోకి వచ్చిన అన్ని భాషల సారస్వతం అనే స్థూల అర్థంలోనే. కొద్ది మంది రచయితలు ఏనాడో ప్రతిపాదించిన విలువలు, ఆయా పాత్రల ఆదర్శ జీవన శైలులు ఇంకా మన కనుచూపు మేరలో కూడా మన సమాజంలో సాధ్యమా అన్నది నేటికీ ప్రశ్నార్థక మే. ఆ రచయితలు అంతటి ఖాళీ సృష్టించి వెళ్ళిపోయారు. ఇక చదువరుల ఆచరణే దాన్ని భర్తీ చేయాలి కదా. గొప్ప రచనలు ప్రతిపాదించిన విలువలు మన అందమైన బుక్ షెల్ష్ లలో దాచుకుని ప్రదర్శనకు పెట్టుకోడానికి కాదు. ఒక రచయిత, మేధావి ప్రతిపాదించిన ఒక ఆమోదయోగ్యమైన జీవన/సమాజ నమూనా అతని జీవిత కాలంలో ఆచరణలో సాధ్యం కాక పోవచ్చు. అలాంటి sensible value systemsని, ideal societyనీ నిర్మించుకునే బాధ్యత చదువరులదే. అంటే ప్రజలదే. ఆ బాధ్యత రచయితది కాదు. రచనే రచయిత మౌలిక ఆచరణ. రచన బాగోగులను నిలకడగానయినా నిగ్గుతేల్చేది చదువరులే. చదువరులలో ముందు వరస తర్ఫీదు అయిన విమర్శకులదే.

anant

ఒమ్మి రమేశ్ బాబు: ఉద్యమాలకీ – కవిత్వానికీ, కవికీ- ఉద్యమాలకీ ఇప్పుడు ఎలాంటి సంబంధం వుంది? ఎలాంటి సంబంధం వుండాలి?

అసలు సంబంధంవుండి తీరాలా? తెలుగులో ఉద్యమ కవిత్వం అనేది నినాద ప్రాయం అయ్యిందన్న విమర్శ సరైనదేనా? నిజానికి నినాదం అనే పదాన్ని తక్కువ చేసి చూడటం తగునా?

అనంతు: కవిత్వం అనే ఉద్వేగ సృజన ప్రక్రియ లేకుండా ఎలాంటి ఉద్యమాలు నడవడం అయినా పెద్ద వెలితే. ప్రపంచ వ్యాప్తంగా నడిచిన ఉద్యమాలకు కవిత్వం చాలా సార్లు కొత్త ఊపిరిలూదింది. చాలా చోట్ల ఉద్యమాలను కొత్త దారులు పట్టించి ఉర్రూతలూగించింది. ఉత్తేజాన్ని రగిలించింది. మన దగ్గర వచ్చిన పలు ఉద్యమ కవిత్వం స్వభావంలో స్థూలంగా ఆయా ఉద్యమ భావాల ప్రచార, ప్రసార పాత్రనే పోషించిందనే చెప్పకతప్పదు. Broadly it is propagandistic in nature.  నిజానికి ఉద్యమంలో కవిత్వం పాత్ర అది కూడా కానీ, అంతే మాత్రం అయితే కానేకాదు. So called విప్లవోద్యమ కవిత్వంలో ప్రధానంగా కనిపించే దూకుడు లక్షణం కవిత్వాన్ని బ్యాక్ బెంచ్ వేయించింది. Metaphorical గా మాట్లాడితే విప్లవాన్ని కాంక్షించే మన కవిత్వంలో భుజాన గన్ను వుండటం మాత్రమే డామినేట్ చేసింది. కానీ ఒక చేతిలో రొట్టె ముక్కా రెండో చేతిలో రోజా మొగ్గా మిస్ అయ్యింది. అందుకే ఇక్కడి విప్లవ కవిత్వంలో నా మల్లియ రాలెనునీ మొగలి కూడ రాలెనునా మల్లియనీ మొగలీ ఆకాశం చెరెను’( మావో కవితకు శివసాగర్ అనువాదం) లాంటి aesthetics, sensibilities, subtleties వున్న orgoanic metaphors తో కవిత్వం చాలా చాలా అరుదుగా వచ్చింది.

నినాద ప్రాయంగా మారిపోయింది విప్లవ కవిత్వం అన్న మాట ఇది వరకే చాలా మంది అనేసి నిర్ధారించేసారు. కానీ అది వాచ్యంగా, డొల్లగా, రొడ్డ కొట్టుడుగా, tautological గా, redundant గా మారిందనే అర్థంలోనే అనుకుంటా. విప్లవ కవిత్వం నిజంగానే నినాదప్రాయంగా మారి వుంటే అంతకన్నా ఏం కావాలి? నినాద ప్రాయం అన్న పదప్రయోగం నిందార్థంలో ఇక్కడ వాడుతున్నారు. లయాత్మక నినాదంలా వుండే ఉర్దూ గజల్ అయినా, పోర్చుగీసు ఫాదూ (Fado)అయినా, సౌందర్యాత్మక తత్వ ధారలను నినాదాల మల్లే పరిమళించే జపనీయ హైకూ అయినా కవిత్వంలో నేటికీ అద్భుతమే కదా? అందుకే కవిత్వం నినాదంగా మారడం ఒక మంచి కవిత్వ లక్షణమే అని నా అబిప్రాయం. అయితే ఆస్థాయిలో తెలుగులో కవిత్వం కైగట్టింది ఒకరో ఇద్దరో.

ఇక అస్తిత్వ ఉద్యమాల కవిత్వంలోని ascertaining tone మితి మీరి, ధ్వనించి కవిత్వాన్ని మింగేసిన సందర్భాలే ఎక్కువ. Statusquoని negate చేయడం, negationతో తమ identity ని establish చేయడం, ఆధిపత్యాన్ని dismantle చేయడం మేరకు అస్తిత్వ ఉద్యమ కవిత్వం ఒక అదివరకు లేని పరిభాషని, అభివ్యక్తిని తెలుగు కవిత్వానికి జోడించింది. ఇది చాలా మెరుగైన జోడింపే. కానీ అక్కడే ఆగి తనని తాను విపరీతంగా రిపీట్ చేసుకుంటోంది అస్తిత్వ ఉద్యమ అభివ్యక్తి. కవిత్వంలో polimical discourse ఎంత భిన్నంగా, అందంగా, అర్థవంతంగా చేయవచ్చో చెప్పేందుకు ఉద్యమ కవిత్వం నుంచి ఉదాహరణలు ఇచ్చేందుకు చేతి వేళ్ళే మిగిలిపోతున్నాయి. వాదమే, వాదనే దానంతకదే కవిత్వం కానే కాదు అనేందుకు మాత్రం అందులోంచి కోకొల్లల ఉదాహరణలు చూపించవచ్చు. కవిత్వం సాధన చేయవలసిన సృజక ప్రక్రియ. కవిత్వం అన్ని తక్కిన కళల్లాగే తర్ఫీదు అవసరం వున్న కళ. అయితే మనకు కొత్త కొత్త inspirations పొందేందుకు చొరవ, చదువు వుండాలి. కదలికా(mobility) కావాలి. మనకు కొత్త కొత్త influences ఎప్పటికప్పుడు ఏర్పడేదందుకు మన తలుపులూ, తలపులూ ఎల్ల వేళలా బార్లా తెరిచే వుండాలి. కేవలం కవిత్వానికే కాదు ఇంకే సృజన కయినా సరే.

 

అఫ్సర్: నీ కవిత్వంలో మంత్ర వాస్తవికత వినిపిస్తోంది. నిజమేనా?

అనంతు: నిజం కాదు. మంత్రవాస్తవికత అంటే magic(al) realism అయితే అది నా కవిత్వంలో లేదనే చెప్తాను. magic(al) realism ని డీల్ చేయగలిగేంత కవిత్వ రచనా పరిపక్వత నాకింకా  రాలేదనుకుంటా. మన రచనల్లో మంత్రవాస్తవికత అనేది మనకు తెలియకుండా చోటుచేసుకునే యాధృచ్ఛిక అంశ కాదు. అది స్పృహతో కూడిన అభివ్యక్తి. పరిణత రచయిత పట్టు అది. Lautréamont రాసిన మలదరోర్ శ్లోకాల నుంచి, మార్క్వెజ్ కాల్పనిక రచనలు, ఎమ్మా అందెజెవస్కా కవిత్వం వరకు magic(al) realism పలురచనల్లో పలురకాలుగా వ్యక్తమయ్యింది. మంత్రవాస్తవికత అని సగర్వంగా అనదగ్గ తెలుగు రచన పతంజలి ఒక దెయ్యం ఆత్మకథ.  అయితే పతంజలి తన కథ చూపున్న పాటని మార్క్వెజ్ కి అంకితమిచ్చాడు. కానీ అందులో మంత్రవాస్తవికత నాకయితే కనిపించలేదు. వున్నదల్లా మాంతాజ్. గోపిని కరుణాకర్ రాసిన కానుగపూల వాన కూడా మంత్రవాస్తవికత పాళ్ళున్న రచన తెలుగులో.

కవిత్వంలో మంత్రవాస్తవికత సాధ్యం కావాలంటే చాలా సాధనతో పాటు, ఆ రచనకి బలమైన తాత్విక పునాది వుండటం ప్రధానం. అది అంత సులభం కాదు; కనీసం కవిత్వంలో. మంత్రవాస్తవికతని ఎస్టాబ్లిష్ చేసేందుకే కొంచెం పెద్ద కాన్వాస్ అవసరం. అందుకే మంత్రవాస్తవికతకి కవిత చాలా ఇరుకైన చోటే.

నా కవితల్లో నేను వాస్తవ, వాస్తవేతర అంశాల, ఉద్వేగాల, భావనల మధ్య కొల్లాజ్ చేయడానికి అక్కడక్కడా చిన్న ప్రయత్నం చేసానేమో మహా అయితే.

anant1

అఫ్సర్: బైరాగి, వజీర్ రెహ్మాన్ లు నీలో ఎంతెంత వున్నారు?

అనంతు: అస్సలు లేరు. ఆలూరి బైరాగివి నేను ఒక ఏడాది క్రితం వరకూ ఒక్క రచనా చదవలేదు. ఆ పేరు సురేంద్ర రాజు నోట 20 ఏళ్ళ క్రితం విన్న గుర్తు. అంత versatile thinker writer అయిన బైరాగి సారస్వతం అందుబాటులో లేకపోవడం తెలుగు సాహిత్య దుర్మార్గాలలో టాప్ టెన్ లో ఒకటి.

బైరాగి కవిత్వంలో వుండే stoicism ఏమైనా నా కవిత్వంలో కనిపిస్తే (ఇదీ నా పరిశీలనే) అది కేవల యాధృచ్ఛికమే. అంతకన్నా ఒక్క వంతు బైరాగి ప్రభావమూ నా మీద వుండేందుకు భౌతిక ఆస్కారమే లేదు.

నా కవిత్వంపైన ఇద్దరి ప్రభావం వుండేది. అది ఎప్పటికప్పుడు కనిపించకుండా, లేకుండా చేసుకోవడమే నేను సచేతనంగా చేసే ఏకైక ప్రత్నం. ఆ ఇద్దరూ నామాడి శ్రీధర్, ఎం ఎస్ నాయుడు.

వజీర్ రెహ్మాన్ నాకిష్టం. అంతే. ఆ ఇష్టం వల్ల నా కవితల్లో వజీర్ ఛాయలున్నాయంటే మరీ ఇష్టం. ప్రభావితమయ్యానా? ప్రశ్నార్థకమే.

 

ఎం ఎస్ నాయుడు: కవితలు రాయడం ఎలా అలవడింది? కొనసాగించడానికి ఏంటి motivation?

అనంతు: కవిత్వం నాకు ఇష్టంగా మారింది నేను హైదరాబాద్ వచ్చిన తర్వాతే(1993).

త్రిపురనేని శ్రీనివాస్, నామాడి శ్రీధర్, ఒమ్మి రమేశ్ బాబు, శశి, సత్య శ్రీనివాస్, సిద్దార్థ, ఎం ఎస్ నాయుడు, ఇంద్ర (ఇది అంబటి సురేంద్ర రాజు కవితా కలం పేరు), అఫ్సర్, యువక(కలేకూరి ప్రసాద్), జ్వాలాసాగర్ (ఇది వెల్చేటి రాజీవ్ కలం పేరు), అలిశెట్టి ప్రభాకర్, సీతారాం, దెంచనాల శ్రీనివాస్, మహెజబీన్, గోరటి వెంకన్న…. వీళ్ళ కవిత్వం నాకు అటీవలి inspiration.

నేను రాసినవి చూసిందీ, చదివింది, నవ్వుకున్నదీ, గేలిచేసిందీ, మెచ్చకున్నదీ, దిద్దిందీ వీళ్ళే. కవిత్వం అంటే నాకు అది వరకు వున్న చిన్న చూపు పోగొట్టిందీ వీళ్ళే.

శివసాగర్ తో వ్యక్తిగత పరిచయం ఏర్పడ్డాక, గంటలకొద్దీ, రోజులకొద్దీ గడిపాకా అతని కవిత్వం పట్ల విపరీతమైన మోహం కలిగింది. నిజ అర్థంలో మన దేశంలో విప్లవకవి దళితుడయిన కామ్రేడ్ శివసాగరే సగర్వంగా.

ఎం ఎస్ నాయుడు: అసలు కవిత్వాన్ని నువ్వు ఎలా చూస్తావు?

అనంతు: మోహంగా. ఇష్టంగా గాలించి చదువుతాను మంచి కవిత్వాన్ని. అంతే మోతాదులో ఇతరులు నా కవిత్వాన్ని ఎలా చూస్తున్నారన్న ఉత్సుకత అందరిలాగే నాకూ వుంది. కొందరు నాది భావ కవిత్వం, దుఃఖ గీతిక, ప్రణయ కవిత్వం, అంతఃపుర దుఃఖం…. అనేసారు. నిజంగా 20 ఏళ్ళ క్రితం ఈ మాటలు నా కవిత్వం గురించి  అని వుంటే (నేనప్పుడు రాసి వుండివుంటే)కుమిలి కుమిలి ఏడ్చేవాడినేమో. కానీ ఇప్పుడు అవి నాకు compliments. భుజమే తట్టే తోడు మిగలని జీవన అవశేషానంతర ప్రయాణంలో శిశిరం మాత్రమే మిగిలితే అదే నా మకుటం. ఏటా వచ్చే శిశిరాన్ని రద్దు చేసే ఆత్మ వంచన కాదు నాది. వసంతాన్ని మాత్రమే project చేయడం మోసం. రుతుమయం కదా కవనం, జీవనం.

ఎం ఎస్ నాయుడు: కథలు ఎందుకు రాయలేదు? కథా విమర్శ జోలికి వెళ్ళినట్టుగా కవితా విమర్శకి ఎప్పటికి వస్తావు?

అనంతు: నా అలజడి జీవితంలో దొరికిన తీరికలో కవిత్వం మాత్రమే అమరింది. అంతే.

కథ రాసేందుకు చాలా నిర్మల జీవనం, తీరిక దైనందినం వుండాలి.  లేదా controlled schizophrenia వుండాలి.

ఎందుకంటే “Art is collective obsession and controlled schizophrenia’’ అని Leibniz అన్న మాట వందొంతులా నిజం. అది వీలు లేని కేవల agitated souls కాల్పనిక సాహిత్యం అంత సులభంగా సృష్టించ లేరు. కథ రాయాలని నా ఆశ. అది ఇంకా మిగిలిన కోరికే. కానీ అంత తీరిక లేకే. కానీ నా మది గది నిండా ఎన్నో కథలు సీమ కొడవళ్ళలా వేలాడుతూనే వున్నాయి. వెక్కిరిస్తున్నాయి. ఆ వెక్కిరింతల నుంచి తప్పించుకునేందుకు నేను అప్పుడప్పుడూ కథల అనువాదాలకు పాల్పడి నా low spirits ని boost చేసుకుంటుంటాను. అప్పటికీ నాకు తనివి తీరకపోతే సమకాలీన కథలను “నేను ఫలానా కథ(ల)ని ఎలా అర్థం చేసుకున్నానంటే…‘’ అనే సాకుతో అడపాదడపా కథలపైన నా విశ్లేషణ రాస్తుంటాను. అయితే అదంతా కథా విమర్శ అనేసుకునే భ్రమ లేదు నాకు.

కథా విమర్శ బాధ్యతాయుతమైన సృజన ప్రక్రియ. నాకు కథా విమర్శన కానీ, కవిత్వ విమర్శన కానీ serious గా pursue చేసే జీవని, నిజాయితీ, తీవ్ర ఇష్టం, academic interest లేకుండా పోయాయి.

కానీ అలాంటి విమర్శకుల అవసరం తక్షణం మాత్రం మన సాహిత్యానికి చాలా వుంది. అందుకే నేను మరీ చెప్తున్నాను; సృజన కాదు ఖాళీలను పూరించేది; చదువరుల విమర్శ మాత్రమే.

 పెద్ది రామారావు: నాటకం ఎంత  గొప్ప ప్రక్రియో రుచి చూసిన వాడివి. మళ్ళీ ఈ (బోడి) కవిత్వం ఏంటిరా?

అనంతు: నాటకం నిజంగానే కవిత్వం కన్నా అనంత ఇంతలు గొప్ప శక్తి కలది. కానీ కవిత్వాంశ లేని నాటకం మృతప్రాయం. కవిత్వం అంశ అన్ని కళల్లోనూ ఆకుపచ్చగా వుండితీరాలి.

నా కన్నా ముందే, నా కళ్ళ ముందే కవిత్వం వెలిగించినవాడివి నువ్వు. నువ్వే కవిత్వం బోడి అన్నావంటే, అది నాటకం వత్తాసుతో నీ లోని నాటక పక్షపాతి పలికిన మాటే. ఆ పక్షపాతితో నాకు అనియమ ఏకీభావం వుంది. నిజమే మనం అనుకున్న నాటకం చేయలేకపోయాం. మనం కలగన్న నాటకం అమలుకు అట్లాంటి బృందం తయారు కాకపోవటం, దాన్ని మనమే తయారు చేయలేకపోవడం మన బలహీనతే.

నాటకం (collective performing art form) సజీవంగా లేని జాతి, భాష more and more individualistic mode లోకి పోతోందని అర్థం. జాతి సాంస్కృతిక ముందడుగు మెరుగయిన నాటకంతోనూ వేయాల్సివుంటుది. సజీవ సంభాషణ అయిన ప్రదర్శనా రూపం లేని జాతి statusquoist అయిపోతుంది అలవోకగా.

నేను నాటకంలో అయిన నా తర్ఫీదును కొనసాగించలేకపోయిన మాట నిజమే కానీ, నాటకాలతో సంబంధం ఈ నాటికీ వుంది. గరికపాటి ఉదయభాను సారథ్యంలో నడుస్తున్న భూమిక అనే సంస్థ వేసే నాటకాలలో మూడింటికి సంగీతం నిర్వహించి పాటలూ రాసాను. పరిషత్తు నాటకాలంటే చిన్న చూపు లేదు నాకు. అందుకే కవలసోదరులు Peter Shaffer and Anthony Shaffer రాసిన నాటకం ప్రేరణగా అనుసృజించి ప్రియాప్రియా చంపొద్దే అనే పేరుతో పరిషత్తు కోసం నాటకం రాసాను. దానికి ఎన్ని అవార్డులొచ్చాయో లెక్కేలేదు.

కానీ నామటుకు నాకు లౌకిక విజయం కన్నా ఆత్మిక తృప్తి పరమం.

HCU అధ్యాపకులు భిక్షు అభ్యర్థన మేరకు నేను అనువదించిన గ్రీకు రచయిత సోఫోక్లీజ్ రచన ఆంటిగొనీ చాలా సార్లు పలు దర్శకుల బిడ్డగా ప్రదర్శనకు నోచుకుంది. వాటన్నింటిలో రాజీవ్ వెల్చేటి చేసిన ప్రదర్శన, interpretation నాకు చాలా ఇష్టం. ఇది పుస్తకంగా రావడానికి పురిటిపొప్పులు పడుతూనే వుందని నీకూ తెలుసు చాలా ఏళ్లుగా.

నేను కథ రాయాలా? నాటకం రాయాలా? అన్న మీమాంసకు గురయితే నా ఓటు ముమ్మాటికీ నాటకానికే ఈ నాటికీ. నేను నాటకం రాయకపోతే, సినిమా తీయకపోతే పోయేదేమీ లేదు… కానీ పోయే లోపు నాటకం మాత్రం రాస్తాను; నా తరహా సినిమా కూడా రాస్తాను; తీస్తాను. ఇది నా నిశ్చయం.

*

 

 

మీ మాటలు

  1. లాలస says:

    కవిత్వం కవితల్లోనే కాదు జీవితంలో, క్షణాలో, ఘడియల్లో, మాటల్లో ఉంటుంది పొయెట్రీ నాట్ జస్ట్ కళ, బట్ ఒక స్ర్టాంగ్ సెన్స్. అందుకే ఎక్కువ మంది కవిత్వం రాయలేరు.చదవలేరు. రాసే వారి మీద, చదివే వారి అమాయకంగా వెటకారాలాడుతుంటారు.పొయెటిక్ సెన్స్ గుప్పున కొట్టింది నాకు ఇంటర్వ్యూ చదివితే. ఇదే కదా మనం కోరుకుంటున్నంది అకవిత్వం బారి నుంచి రక్షణ

  2. Kcube Varma says:

    Chaala lotaina amaroka unna sveeya visleshana.. congrats sir..

  3. ఎ కె ప్రభాకర్ says:

    “నాటకం (collective performing art form) సజీవంగా లేని జాతి, భాష more and more individualistic mode లోకి పోతోందని అర్థం. జాతి సాంస్కృతిక ముందడుగు మెరుగయిన నాటకంతోనూ వేయాల్సివుంటుది. సజీవ సంభాషణ అయిన ప్రదర్శనా రూపం లేని జాతి statusquoist అయిపోతుంది అలవోకగా.”
    అనంతు లోతుని తెలియజేసే మాటలు .
    నాటకం కవిత్వానికి అంతిమ సోపానం అన్న యెరుక , కవనం ఖాళీలను పూరించడమే కాదు ; స్రుజిస్తుందన్న స్ప్రుహ , కవిత్వం నినాదంగా మారడం మంచి లక్షణమే అని చెప్పగల చొరవా ఇవన్నీ నాకు బాగా తాకాయి అనంతూ !
    గుండె నింపినందుకు థాంక్స్ .

  4. satya srinivas says:

    చాలా లోతైన విషయాల్ని స్పష్టంగా చెప్పావు,

  5. Sai Padma says:

    కొన్ని తరాల సంఘర్షణ, ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ఏం చేస్తున్నా దాని నీడ , నోస్టాల్జియా ని దాటి సలుపుతూనే ఉంటుంది..
    చాలా విషయాలు, స్పష్టంగా నిజాయితీగా చెప్పారు
    సాహిత్యపు దుర్మార్గాల గురించి.. వాదపు బాక్సుల గురించీ కూడా ఇంకా తెలుసుకొనే అవకాశం వస్తే బాగుంటుంది
    అన్నీ దగ్గరగా చూసిన మీలాంటి వారి ద్వారా

  6. Mahamood says:

    అనంత్ గారికి వషయాలు లోతుగా తెలుసు. అన్నీ విశ్శజనీనమైనవి. ఏ ఒక్కచోటో కుదించుకుపోయినవి కాదు బాగా విస్తరించినవీనూ. ఏ ప్రక్రియ నైనా మన రంగంగా ఎంచుకోవాలంటే ఎంత లోతైన సాధన చేయాలో ఈ సంభాషణ ద్వారా అర్థమౌతుంది.

  7. కె.కె. రామయ్య says:

    ” కవిత్వం ఎక్కడ అభివ్యక్తిగా, సృజన ప్రక్రియగా తలెత్తుకుని వుంటుందో ఆ జాతికీ, ఆ భాషకీ ఇంకా ఉద్వేగ, ఆక్రోష, ఆకాంక్ష, సౌందర్య ప్రకటనలు బహిరంగంలోనూ సజీవంగా వున్నాయని లెక్క. జాతి సాంస్కృతిక ముందడుగు మెరుగయిన నాటకంతోనూ వేయాల్సివుంటుది. ” అబ్బురం కలిగించింది మీ సంభాషణ.

    హైకూ మాంత్రికుడు గాలి నాసర రెడ్డి, విషాద ఏకా౦త కాశీభట్ల వేణుగోపాల్ గారూ, నిర్నిద్ర నిషాదం ‘మో’ గార్ల
    పరామర్శ కూడా మీ నుండి ఆశిస్తున్నాము.

    మీ జీవన ప్రయాణం కవనమయ రుతుమయంగా ఇలాగే కొనసాగాలని ఆకాక్షిస్తున్నాను.

    బైరాగి సారస్వతం అందుబాటులో లేకపోవడం తెలుగు సాహిత్య దుర్మార్గాలలో టాప్ టెన్ లో ఒకటి అన్న అనంతు గారూ! ఆదిత్య కొర్రపాటి అనే ఆలూరి బైరాగి యువ వీరాభిమాని ఈ లోటు సరిదిద్దే అవకాశం ఉంది, కొంత ఆలస్యంగా నైనా.

    ( త్రిపురనేని శ్రీనివాస్, అనంతు, నామాడి శ్రీధర్, అఫ్సర్, ఒమ్మి రమేష్, సిద్దార్థ, ఎం. ఎస్. నాయుడు, సీతారాం, అంబటి సురేంద్ర రాజు, పెద్ది రామారావు లనేకులు కేవలం కవులే కాదు …. త్రిపుర అభిమానులు కూడా అనే ట్యాగ్ లైన్ ఇక్కడ అతికించ్చొచ్చో లేదో. )

  8. Ajit Kumar says:

    “రచన ముఖ్యమా, రచయిత ముఖ్యమా అన్న చర్చ ఈ నాటిది కాదు. అత్యంత ఎక్కువగా కార్ల్ మార్క్స్ మీద ఈ నాటికీ జరుగుతోంది. యంగ్ మార్క్స్ అనీ, లేటర్ మార్క్స్ అనీ…….”
    కార్ల్ మార్క్స్ రచయిత కాదనుకుంటాను.
    అలాగే విప్లవ కవిత్వం అంటే ప్రాచీన కావ్యాలలో వ్రాయబడ్డ యుద్ధవర్ణన వంటిదే.
    అలాగే కవిత్వం చెప్పగలగడమంటే మగవాడు ఆడంగితనాన్నితనకుతాను అన్వయించుకోవడం

  9. ‘… దానికి ప్రబలమైన కారణాలు మన అతితార్కిక అభౌతికవాద అకమ్యూనిష్ఠాగరిష్ఠు కుబ్జ విమర్శకుల దుందుడుకుతనం, డాంబికం, జడత్వ కొలమానాలూ, పటాటోప ప్రదర్శనం, దూషణం.’ ఏం చెప్పదలిచావు అనంతూ! దేన్ని కాదని దేన్ని నెత్తికెత్తుకుంటున్నావు? పరుచూరి కృష్ణప్రసాదు అనే వాడి చెత్త రచనను కవిత్వమంటో దళిత కవిత మీద దాడి చేయబోయి, తన జీవుని వేదనను పోస్ట్ మోడర్న్ అని అనుచరులతో ప్రచారం చేయించుకోబోయి, ఆ పేరిట మార్క్సిజం మీద దాడి చేయబోయి… కుదరక చెయ్యి ముడుచుకున్న ‘మో’ మార్గం బాగుంటే తప్పక అనుసరించు. దానికి దేశ దేశాలలో చాల గిరాకీ వుంది. గ్యాలరీ అంటే అదే. కవిత్వాన్ని నేటి శిష్ట వర్గ సౌకర్యాల పరిధికి కుదించే సాము గరిడీలు మానేద్దామని చెప్పడానికిలా రాశాను. మిత్రులు అర్ఠం చేసుకుంటారనుకుంటాను.

  10. నేను సారంగకి ఇచ్చిన ఇంటర్వూకి స్పందనగా అన్నహెచ్చార్కె చేసిన మిత్ర వైరుధ్య దాడికి ఇది నా సమాధానం.
    ఈ నా ఆలస్యం క్షంతవ్యం. కారణం నా పుస్తక ఆవిష్కరణ.
    ప్రశ్న…
    హెచ్చార్కె
    ఏం చెప్పదలచావు అనంతూ?
    అనంతు
    మై డియర్ కామ్రేడ్ హెచ్చార్కే, విప్లవ విమర్శ ఎదుగుదల కుంటుపడిందని చెప్పదలచాను. అది నవీన జీవన పోకడల బేరీజుకు కొలమానాలను తయారుచేసుకోవాలనీ, తర్ఫీదు అవ్వాలనీ, సాధన చేయాలనీ చెప్పాను. ఇవన్నీ నిబద్ధతతో సామ్యవాద సమాజాన్ని స్వప్నించే విమర్శకులు నేర్వ వలసిన అవసరం గుర్తుచేసాను.
    నా జీవన పరిమితుల్లో సోషలిస్ట్ విమర్శని persue చేసే వెసులుబాటు లేదని నా పరిమితినీ అంగీకరించాను సవినమ్రంగా.
    (హెచ్చార్కే లో తలెత్తిన ఈ ప్రశ్న నా ఇంటర్ వ్యూ మొత్తం చదివాక వచ్చింది కాదని అనుకుని, తను ఉటంకించని పేరా చదివిన తర్వాత తనకే తలెత్తిన ప్రశ్న అనుకునీ ఈ నా సమాధానం.)
    ఇక ఇంటర్వూ మొత్తం చదివాకా నేను ఏమి చెప్పదలచుకున్నదీ హెచ్చార్కేకి బోధ పడకుంటే వినమ్రంగా మరోసారి చదవమని అడగటం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయత నాది.
    నాకు కూడా చాలా విషయాలు ఒకటికి రెండు సార్లు చదివిన తర్వాత అర్థం అవుతాయి.

    ప్రశ్న
    హెచ్చార్కే
    దేన్ని కాదని, దేన్ని నెత్తికెత్తుకుంటున్నావు?
    అనంతు
    వివక్షనీ, ఆధిపత్యాన్నీ కాదని నేను నా జీవితాంతం సమతనీ, మమతనీ నెత్తికెత్తుకుంటూనే వుంటాను.
    నా చిన్ని పరిధిలో. నా ఇంటర్వూలోనూ అదే చేయబోయాను.
    ఇక కామెంట్ లో ఉటంకించిన పాత కక్షల పరిచూరి కృష్ణప్రసాదు వ్యవహారం హెచ్చార్కే రివిజిటింగ్ మాత్రమే. అందుకు ఇక్కడ రిలవెన్సే లేదు. కనీసం నా దృష్టిలో.
    ఎందుకంటే సదరు పరిచూరిది చెత్త రచన అని హెచ్చార్కే అనేసాడు. హెచ్చార్కే జడ్జిమెంట్ మీద నాకు ఆ మాత్రం గురి ఇంకా మిగిలే వుంది.
    ఇక మో గురించి నేను ఏమి అనుకుంటున్నానో నా ఇంటర్వూలో చెప్పలేదా కనీసం చూచాయగానయినా. అతను విపరీతమైన పాండిత్య ప్రకర్ష ప్రదర్శించే గ్యాలరీ ప్లేయర్ అయిన షోమ్యాన్ కవి.
    అయితే కవితా సాధనలో నేనింకా నేర్చుకోవలసిన ఉన్నత కవి.
    ఏ కవి దృక్పథాన్ని అయినా వ్యతిరేకించినంత మాత్రాన అతని మెరుగయిన తర్ఫీదు ముందు వినమ్రంగా వుండకుండా వుండలేను నేను… అది మో అయినా సరే.
    ఇక మో వర్గం బాగుంటే తప్పక అనుసరించు… అనడం హెచ్చార్కే లోని అనవసర దుందుడుకుతనం.
    గ్యాలరీకి బాగా గిరాకీ వుంది…అందుకని అలాంటి కవిత్వం నేను రాస్తున్నానని హెచ్చార్కే అభిప్రాయానికి వస్తే మాత్రం ముందు నా కవిత్వం చదవమని సవినయంగా కోరుతాను.
    (మమత కోరిన వెంటనే మరుక్షణం పంపినట్టే నీకూ నా కవితా పుస్తకం అందే లోపు పిడిఎఫ్ పంపగలను అన్నా.)
    కవిత్వం నేటి శిష్ట వర్గ సౌకర్యాల పరిధికి కుదించే సాము గరిడీలు మానేద్దామని చెప్పడానికి ఇలా రాసాను. ఇదీ హెచ్చార్కే వ్యాఖ్య.
    అలా నేను రాయలేదని నా కవిత్వం చదివిన వెంటనే హెచ్చార్కే తెలుసుకుంటాడని నా లోని చిరు సాహిత్య విమర్శకుడిని ప్రగాఢ నమ్మకం.
    అత్యంత అసంబద్ధంగా, నిరాధారంగా వున్న హెచ్చార్కే కామెంట్ ని అతని చిర కాల మిత్రడినయిన నేను మాత్రం అర్థం చేసుకోలేను. అందుకు తన మిత్రుల జాబితాలోంచి నా పేరు తొలగించినా… నాకు అదే పాత హెచ్చార్కే నాలో పదిలం.

మీ మాటలు

*