కుంచెకీ, రంగుకీ మధ్య సం‘చారి’   !

 

-శివాజీ 

~

       చాలా మంది ఆర్టిస్టు లకి మల్లె చారిలోనూ పాత ప్రశ్నే వచ్చి పడింది… జనం మెచ్చినది మనం చేయవలెనా?  మనం చేయునది జనం చూడవలేనా?  అనే.  కానీ  మధ్యస్తంగా వుంటే పోలా ?  అనే మరోప్రశ్న బిట్క్వశ్చన్లా వచ్చి పడిందతనికి.  ఫలితంగా ‘ చారి చిత్రకళ’ అనేది చారి ‘ఇలస్ట్రేషన్ ‘ పనితో మొదలయింది.

పూర్వంనుంచీ గల డ్రాయింగుల పిచ్చి పాకానపడింది, అది మోహన్ ఆశ్రమంలో మొగ్గలు వేసింది.  కొన్ని పత్రికలకు పని చేసి చూశాడు.  ఇతని పాదాలకు పేద్ద చక్రాలు కలవని, వున్నచోట ఉండడనీ చక్కని పేరు పొందాడు.  కథలకి, వ్యాసాలకి, అట్టమీది బొమ్మలకీ ఇతనినే వాడండి అనే పబ్లిసిటీ వచ్చేలోగానే చిత్రకళ అనే కేన్వాస్ పెయింటింగ్ లో శ్రద్ధ వహించాడు.   అడపాదడపా గేలరీ గ్రూప్ షోల్లో చిన్నపాటి తడాఖా ప్రదర్శించాడు.  నల్లటి రేఖలతో కళకళ లాడే రంగుల్లో బొమ్మల్ని వృద్ది  చేశాడు…

chari2

         ఇది ఇలా వుండగా చారి ఇంట్లో గల పొయ్యి లో పిల్లి  లేవకపోగా పిల్లల్ని పెట్టి పెద్ద చేస్తోంటే, మరోవంక చారి చార్కోల్, అక్రిలిక్స్ తో పెయింటింగుల సంఖ్య పెంచాడు.
ఆమధ్య కొన్ని పెయింటింగ్స్ చేసేకా అతనికి మరొక చిక్కని సందేహం వచ్చింది.   తను వేస్తున్నది రంగుల ఇలస్ట్రేషనా ?  రేఖలు గల పెయింటింగా ?  అని.  అలాగే మనం చూసేది, చదివే పదార్ధం వలె ఆధునికమైనది కాదా?  శైలి పెంచినపుడు వేసిన బొమ్మ వెలిగిపోతే అదే చాలదా? …  ఒకసందేహం మరో సందేహానికి దారి వేసింది.  అంతా ఒకటే అని, వేసింది ఏదయినా బాగా వేయాలి, పనితనం గొప్ప తెలియాలి, అప్పుడదే అద్భుతం కాదా అనే సమాధానమూ పుత్తుకొచ్చిన్దతనికి.  అసలు ఏ చింతా లేకుండా గోడలకు తగ్గ బొమ్మలు, రంగులకు  తగ్గ ఫ్రేములతో మార్కెట్ రంగంలో రాణించే చిత్రకళ కన్నా సొంత బుద్ధితో, నేర్చి శ్రమించి   మంచి  పెయింటింగ్ అని మనకి ముందుగా నచ్చేదే నయం  అని
చారీకి అనిపించింది.  అందుకే కేన్వాస్ లపై తన ముచ్చట తీర్చి దిద్దుకుంటున్నా…  ‘ నిన్నటికంటే ఇవ్వాళ, నేటికంటే రేపు  ఇంకా బాగా అనిపించేదాకా ఊరుకునే ప్రసక్తే లేదంటాడు.  ఇకనేం?!  ఉద్యోగం సద్యోగం లేకుండా పెయిన్టింగే  పనిగా  పెట్టుకుని బోలెడు పెయింటింగ్ లు చేసేడు.  “నడుస్తుందిలే ” అని సరిపెట్టుకునే ధోరణికి పొదల్చుకోలేదన్నాడు.
         ‘మార్కెట్ బూమ్’ వల్ల మాత్రమే స్థిరపడిన చిత్రకళాకారులు, పెద్దకళాకారులూ ఆశీర్వదిస్తేనే ముందుకు పోవాలన్న ముచ్చట కట్టిపెట్టి పెయింటింగ్ చేయడం  మీదనే మనసు పెట్టడం వలన కాబోలు కేన్వాసులు అతనిచేతిలో ధగ ధగలాడాయి. మన ఊరే, మన పాటే, మన మాటే కావచ్చుగాక, అది సుస్వరం, సు’వర్ణం’ (రంగులేనండీ బాబోయ్) స్వీయశైలీ కావడం అత్యవసరం అన్న చూపు కలిగిన పని మొదలయింది చారిలో –
chari3
మనుషులూ, వస్తువులూ, కదలికలు- దేనిమీద మనసుపడినా చారి వాటిని రంగుల్లోకి ‘దించే’ శ్రద్ధలో పడ్డాడు.  ఫలితమూ బాగుంది.  సిద్దిపేటలో పుట్టి ,  కార్తూనింగ్ తో కొంచెం పెరిగి  ఇంకా బాగా ఎదగటానికి 90 ల్లో హైదరాబాదుకు సరఫరా అయ్యాడు.  చిత్రకళాశాల సర్టిఫికేట్ పేచీలేదతనికి.  బ్రష్ లు, పెన్సిళ్ళు, చార్ కోల్ లు అరిగి, కరిగేలా బోలెడు కృషి చేశాడు.  ఇప్పుడు కొత్త బొమ్మల్లో కొత్తదనం కోసం, శైలి కోసం పడ్డ చారి తపన నెరవేరింది.  వీలయితే ఓసారి అతని బొమ్మల్ని నెట్లోనో, ఎగ్జిబిషన్ లోనో చూసి చారిని మనసారా అభినందించండి.
చారీ నువ్వింక ఎనక్కి తిరిగి చూడాల్సిన పని లేదన్నట్టు ….
                                                                                       *

మీ మాటలు

 1. A very fine artist. He did excellent illustrations and cover pages for both of my books. All the best with your exhibition, Chari.

 2. చందు తులసి says:

  అవును. నాకూ…అనిల్ రాయల్ గారి పుస్తక ఆవిష్కరణ సభలోనే చారి గారి పరిచయం అయింది.‌అనిల్ గారి కథలకూ మంచి చిత్రాలు వేశారు… చారి గారి ఆల్బమ్ లోనూ చాలా మంచి బొమ్మలున్నాయి.. బెస్టాఫ్ లక్ చారి గారూ.

 3. DrPBDVPrasad says:

  బెంగాలీ ప్రజలు చిత్రకళను బాగా ఆదరిస్తారు
  ప్రజల ఆదరణ పెరిగేలా చూసుకొనే బాధ్యత కళాకారుల పైనా సాహిత్య వేత్తలపైన ఉంది.
  ఆర్టిస్ట్ చారిగారికి,వ్యాసకర్తకు,ప్రచురించిన సారంగకు అభినందనలు

 4. p.srinivasa chary says:

  థాంక్యూ ప్రసాద్ గారు …మన దగ్గర అలాంటి వాతావరణం లేకపోవడం బాధాకరం.

 5. ఉత్తర తెలంగాణ సం స్కృతిని ఒడిసి పట్టిన వాడు.
  కుంచె తో తన మూలాల్ని ప్రపంచం కళ్ళకు చూపిన వాడు.
  రంగులు చిలకరించి అభిమానులను కైవసం చేసుకున్న వాడు.
  అభినందనలు చారి గారూ :)

 6. కె.కె. రామయ్య says:

  రంగుల ఇలస్ట్రేషనా? రేఖలు గల పెయింటింగా? అంటూ P.S. చారి గారు పడ్డ చిత్రకళా తపనని ( బ్రష్ లు, పెన్సిళ్ళు, చార్ కోల్ లు అరిగి, కరిగేలా చేసిన కృషిని ) అభినందిస్తూ పరిచయ వ్యాసం రాసిన తల్లావజ్జుల శివాజి గారికి నెనర్లు. ఆర్టిస్ట్ చారి గారికి అభినందనలు.

 7. Krishnamurthy punna says:

  చిత్రం చారి శీలే ! శుభకామనలు !

  • srinivasa chary says:

   థాంక్యూ పున్నా కృష్ణమూర్తి గారూ …

 8. Sivalakshmi says:

  నేను పబ్లిష్ చేసిన బజరా “అల్లిబిల్లి కథలు” అనే పిల్లల పుస్తకానికి చారిగారే ఆర్టిస్ట్.
  కథలెంత గొప్పగా ఉన్నాయో బొమ్మలూ అంతే మనోహరంగా పిల్లల్నీ,పెద్దల్నీ అలరిస్తున్నాయి.
  అభినందనలు చారి గారూ!

 9. srinivasa chary says:

  థాంక్యూ శివలక్ష్మి గారూ …

మీ మాటలు

*