వ్యక్తుల హక్కులా? వ్యవస్థల హక్కులా?

 

krishna1

-కృష్ణుడు 

~

దేశ రాజధాని ఢిల్లీలో మనకు అత్యంత అందమైన, చరిత్రాత్మకమైన పార్లమెంట్ భవనం ఉంది. దాని ప్రక్కనే నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌లు ఉన్నాయి. మధ్యలో సువిశాలమైన రాష్ట్రపతి భవన్ ఉన్నది. ఇండియాగేట్ ముందు పచ్చిక బయళ్లలో సాయంత్రం కుటుంబాలు సేదదీరుతూ కనిపిస్తాయి. ఇండియాగేట్‌కు సమీపంలోనే ఢిల్లీ హైకోర్టు, ఆ పై సుప్రీంకోర్టు కనిపిస్తాయి. మొత్తం దేశ రాజకీయ ఆర్థిక, సామాజిక వ్యవస్థ ఈ భవనాలనుంచే నిర్ణయమవుతుంది. పార్లమెంట్ సమావేశాలు అవుతుంటే చాలు చుట్టుప్రక్కల ఎంతో హడావిడి కనిపిస్తుంది. భద్రత కట్టుదిట్టంగా మారుతుంది. పార్లమెంట్ సభ్యులు, కేంద్రమంత్రులు, అధికారులు హడావిడిగా తిరుగుతుంటారు. మొత్తం దేశాన్ని ఇక్కడినుంచే నడిపిస్తున్నామన్న భావన వారిలో కనిపిస్తుంది. మనకూ అనిపిస్తుంది.

దేశాన్ని వారు ఇక్కడినుంచే నడిపిస్తున్నారన్న మాట వాస్తవమే. కాని ఎలా నడిపిస్తున్నారు? మన భారత రాజ్యాంగం నిర్మించిన వ్యవస్థలనన్నిటినీ వారు సవ్యంగా నడిపిస్తున్నారా? లేక తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారా అన్న అనుమానాలు మనకు కలగక మానదు. అన్ని వ్యవస్థలూ రాజకీయ వ్యవస్థకు అనుకూలంగా మారుతున్నాయి. అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సిబిఐ, పోలీసు యంత్రాంగం, ఎన్నికల కమిషన్, సివిసి, మానవ హక్కుల కమిషన్ ఆఖరుకు సమాచార కమిషన్ కూడా రాజకీయ వ్యవస్థకు అనుగుణంగా మారుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలు కాపాడుకునేందుకే కాక తమ ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక నేరాలు, అవినీతి, నేరాలు, కాపాడుకునేందుకు ఈ వ్యవస్థల్ని ఉపయోగించుకుంటున్నారు. అవినీతి అక్రమ భూయిష్టం కాని వ్యవస్థలేవీ కనిపించడం లేదు. న్యాయాస్థానాలే కాదు, సివిసి, సిబిఐ, కమిషన్‌లు అన్ని చోట్లా అస్మదీయుల్ని నియమించుకుంటున్నారు. పార్లమెంట్ లో కూడా నేరచరితుల్ని, కాంట్రాక్టర్ల్ని, మాఫియాను నియమిస్తున్నారు. వారే కలిసి తమకు అనుకూల చట్టాల్ని చేసుకుంటున్నారు. సభలో 50 మంది ఉంటే చాలు మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నుల్ని మార్చి పడేసే నిర్ణయాల్ని తీసుకోగలుగుతున్నారు. తాము తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలపై ఎన్ని వేల కోట్ల భారం పడుతుందో న్న ఆలోచన లేకుండా గుత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంట్రాక్టులు, టెండర్లు,కేటాయింపులు, అనుమతుల్లోనే కాదు, రక్షణ శాఖ కొనుగోళ్లలో వేల కోట్ల అక్రమాలు జరుగుతున్నాయి. కూడా నలుగురైదుగురు ఉంటే చాలు, ఏ నిర్ణయాన్నైనా నిలిపివేయగలుగుతున్నారు. నింగినుంచి నేల వరకు దేన్నైనా కబళించడానికి భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అవకాశం కల్పిస్తున్నది. రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లే కాదు, మాఫియా కూడా పరస్పర ఆశ్రితాలుగా మారిపోయాయి.

మరో వైపు కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల్ని పెంచి పోషించడం, తద్వారా తాము ప్రయోజనం పొందడమే అభివృద్దికి కొలమానం అనుకుంటున్నారు.క్రోనీ కాపిటలిజం విశ్వరూపంగా పార్లమెంట్, చట్ట సభలు మారుతున్నాయి. నిదేశాల్లో ఉన్న నల్లధనం గురించి కమిటీలు వేసేందుకు మనం ఆలోచిస్తున్నాం కాని అసలు మన ఎంపిలు ఎన్నికలల్లో గెలిచేందుకు కోట్లాది రూపాయలు ఎలా ఖర్చు పెట్టారని ఆరా తీసిన వారు లేరు. విదేశాల్లో ఉన్న మన వారి నల్లధనం కంటే ఎక్కువ అక్రమ సంపద మన దేశంలోనే ఉన్నదన్న విషయంలో అతిశయోక్తి లేదు. ఎన్నికల్లో కోల్పోయిన సొమ్నును తిరిగి ఆర్జించడానికి అధికారంలోకి వచ్చాక అక్రమాలు తప్పవు. ఈ విషవలయంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థ సాగుతోంది. ఆఖరుకు ఎంపి లాడ్స్ నిధులను కూడా స్వాహా చేస్తున్నారు. తాము ఓట్లు కొనుగోలు చేసి అ«ధికారంలోకి వచ్చాము కనుక తమ అక్రమాలను ప్రశ్నించే హక్కు వారికి లేదని భావిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఒక్కర్ని కూడా జైలుకు పంపించిన దాఖలాలు లేవు.

ఒక అంచనా ప్రకారం తిరుపతి కి ప్రతి ఏటా 8 నుంచి 9 కోట్ల మంది భక్తులు వెళతారు. ఇతర మందిరాలు, మసీదులు, మఠాలు, తీర్థయాత్రలకు వెళ్లేవారినికలిపితే 50 కోట్లమంది దాటుతారు. వీరంతా పాపపుణ్యాలపై నమ్మకం పెట్టుకున్నవారు. హత్య, మోసం, దొంగతనం, అత్యాచారాలు అక్రమాలు చేసిన వారిని నేరస్తులని వారు భావిస్తారు. కాని నేరం చేసిన వారే అ«ధికారంలో ఉంటారని వారు ఊహించలేరు.ఊహిస్తే వారు దేవుళ్లను వ్యవస్థలను బాగు చేయాలని, వాటిని నేరస్తులనుంచి ప్రక్షాళన చేయాలని భావిస్తారు. కాని మన దేశంలో ఓటర్లను కూడా నేరాలకు పురికొల్పుతున్నారు. వారిని కొనుగోలు చేస్తున్నారు. అవినీతిపరులు, నేరచరితులు కూడా అభిమాన సంఘాలు, భక్తులు తయారవుతున్నారు. ముహూర్తం చూసి జైలుకు వెళ్లేవారు తయారయ్యారు.

దేశంలో పలుకుబడి గల వారికి, ధనికులకు మాత్రమే ప్రభుత్వం, న్యాయవ్యవస్థ ఇతర యంత్రాంగాలు సహకరిస్తున్నాయి. రాజకీయ అవసరాలు దేశంలో అవినీతికి అక్రమాలకు చట్టబద్దత కల్పిస్తున్నాయి. న్యాయ వ్యవస్థకూడా రాజకీయ అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటోంది. రాజకీయ నాయకుల కేసులను విచారించేందుకు ఏళ్ల పాటు సమయం తీసుకుంటున్న కోర్టులు కొట్టివేయడానికి ఎక్కువ కాలం తీసుకోవడం లేదు,. అదే సామాన్యుల కోస్లు వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈదేశంలో వేలాది మంది అమాయకులు జైళ్లలో మగ్గుతున్నారు.. అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల వాపోయారు. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక చట్టాలు చేసేందుకు, దమనకాండను అమలు చేసేందుకు న్యాయాస్థానాలు తోడ్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. న్యాయమూర్తులపై వస్తున్న అవినీతి ఆరోపణలు, తమ పదవీ కాలం ముగిసిన తర్వాత వారు చేపడుతున్న పదవులు న్యాయవ్యవస్థ విశ్వనీయతపైనే అనుమానాలు కలిగించేలా చేస్తున్నాయి.

ఆర్థిక సంస్కరణలు ప్రవేశించిన తర్వాత దళితుల అణిచివేత తగ్గలేదు సరికదా, పెరిగింది. గతంలో రాజకీయ ప్రాబల్యం కోసం దళితుల అణిచివేత జరిగితే ఇప్పుడు ఆర్థిక కారణాల రీత్యా అణిచివేత జరుగుతున్నది. అభివృద్ది పేరిట దళితుల ఆవాసాలు, స్థలాలు కూల్చివేసిన సంఘటనలు ఎన్నో. అడిగితే రిక్షా తొక్కేవాడి చేతుల్లో మొబైల్ ఫోన్ ఉండటమే సామాజికన్యాయమేనని మురిసిపోతున్నారు. చరిత్ర అంటే గ్రామాలు కూలిపోవడం, జీవితాలు శిథిలం కావడం, నెత్తుటి మరకలపై రహదారులు వేయడం, మాల్స్‌ను బహుళ అంతస్తులు నిర్మించడంగా భావించే రోజులు వస్తున్నాయి.

ముఖ్యంగా అధికార వ్యవస్థ దాదాపు అవినీతి, అక్రమాల మయంగా మారింది. అధికార వ్యవస్థ రాజకీయ నాయకులు అడ్డదారిన తొక్కడానికి సహకరిస్తున్నది. చాలా మంది అధికారులు రాజకీయనేతల అడుగులకు మడుగులొత్తడమే కాక, కార్పొరేట్లకు ఎర్రతివాచీ పరుస్తున్నారు. అందుకే వారు రిటైరైన తర్వాత ప్రభుత్వ పదవుల్లోనో, కార్పొరేట్ పదవుల్లో నో కొనసాగుతున్నారు. ఆఖరుకు విదేశీ దౌత్యసంబంధాలు కూడా వ్యాపార ప్రయోజనాలకు అనుగణంగా సాగుతున్నాయి. మనకు స్వతంత్ర విదేశాంగ నీతి అంటూ లేకుండా పోయిందని చెప్పడానికి పలు ఉదాహరణలున్నాయి.

ఢిల్లీ నుంచి క్రింది స్థాయి వరకు వచ్చే సరికి వ్యవస్థల బూటకత్వం, వాటి వి«ధ్వంసం, ఉల్లంఘన మరింత ఎక్కువవుతుంది. గ్రామస్థాయిలో ఉండేవారికి వ్యవస్థల గురించి తెలిసే అవకాశమే తక్కువ. ప్రతి రాష్ట్ర రాజధాని ఒక మినీ ఢిల్లీగా మారింది. ప్రభుత్వాలు మారినా రాజకీయాలు మారడం లేదు. వ్యవస్థల్ని తమకు అనుకూలంగా మార్చుకునే వారు మారడం లేదు. సామాన్యుడి విలువ తగ్గుతున్నదే కాని పెరగడం లేదు. మనం చూస్తున్న అభివృద్ది ఎవరికోసం? అన్న ప్రశ్న ఎప్పటికీ విలువైన ప్రశ్నగా మిగిలిపోతోంది. గత 34 సంవత్సరాల నా జర్నలిస్టు జీవితంలో వ్యవస్థల పనితీరు దిగజారిందే కాని మెరుగైన దాఖలాలు కనపడడం లేదు.

ఈదేశంలో చాలా మంది వ్యక్తులకోసం పోరాడుతున్నారు. కాని వ్యవస్థల్ని నిజాయితీగా నిర్మించానికి వెనుకాడేవారిని, నిర్మించిన వాటిని విధ్వంసం చేసిన వారిని, వాటిని తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకునే వారిని ఎవరూ ప్రశ్నించడం లేదు. వ్యక్తుల హక్కుల కన్నా వ్యవస్థల హక్కులు కాపాడడం ముఖ్యం వ్యవస్థలు లేకుండా సమాజం లేదు. అది లేని రోజు అంతా కుప్పకూలిపోతుంది. అరాచకమే తాండవిస్తుంది.

( కృష్ణారావు రాసిన నడుస్తున్న హీన చరిత్ర పుస్తకావిష్కరణ ఈ నెల మే 29న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రలో జరిగింది. ఈ సందర్భంగా చేసిన ప్రసంగం)

మీ మాటలు

  1. D Subrahmanyam says:

    కృష్ణా రావు గారు నాకు ఎన్నో సంవత్సరాలగా డిల్లీలో మంచి మిత్రుడు. వారు డిల్లీలో ఆంధ్రజ్యోతి దినపత్రికకు సహా సంపాదుకులుగా ఉన్నప్పుడు ప్రతీ బుధవారం వారు “ఇండియా గేటు” అనే శీర్షిక ఆంధ్రజ్యోతి కి రాసే వారు. నాకు ఆ దినపత్రికలో చాలా నచ్చిన రెండు శీర్షికలలో అదొకటి. బుధవారం పొద్దున్నే లేచి ఆ శీర్షిక చదివి వారిని ఫోన్ ద్వార నిద్దరలేపి అభినందంచడం ఒక వ్యాపకం అయిపొయింది. వారు దేశం లో జరిగే హీన రాజకీయాల్ని చాల నిశితంగా విశ్లేషిస్తూ రాసే వారు. ముఖ్యం గా 2014 తర్వాత మన దేశ రాజకీయాల్లో వచ్చిన మార్పులను చాల బాగా పర్తిసీలించి విశ్లేషించే వారు. వారి శీర్షికలో వస్తువు తో పాటు, వారు చెప్పే విధానం, వాడే భాషా కూడా చాల బావుండేవి. వారు రాసిన రెండు మూడు వ్యాసాలు బావులేవని అనిపించినప్పుడూ కూడ వారిని ఉదయం లేపి చర్చించడానికి వీలు కలిపించిన మంచి మనిషి కృష్ణ రావు గారు. ఈ మంచి పుస్తకాన్ని అందరూ చదవాలి. ఈ పుస్తక పరిచయం మేము డిల్లి లో జూన్ 30 న పెడుతున్నాం .

  2. గోర్ల says:

    జాతీయ రాజకీయాలను ప్రాంతీయ కోణంలో, ప్రాంతీయరాజకీయాలను జాతీయ కోణంలోరాసిన జర్నలిస్టు కృష్ణుడు. భారతీ రాజకీయాలపై ఉత్తరాదికి సంబంధించిన చాలా మంది జర్నలిస్టులు, అనలిస్టులు, వ్యాఖ్యాతలు చాలా పుస్తకాలే రాశారు. మన తెలుగు నేల నుండి జాతీయ రాజకీయాలను విమర్శనాత్మకంగా రాసుఈ పుస్తకంలో. ఇది భారతీయ సామాజిక, రాజకీయ, ఆర్థిక చరిత్రను మనకు చూపిస్తుంది. రాజకీయాలు ఎటు వైపు నుండి ఎటు వెళ్తున్నాయి. ఎట్లా వెళ్తున్నాయి. ఈ విషయాలను మూల స్థాయి నుండి పట్టుకుని రాసిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ఢిల్లీ స్థాయిలో రాజకీయాలను అర్థం చేసుకుని వాటిని సులభంగా సగటు పాఠకునికి అర్థం అయ్యేలా రాశారు. ఇందులో కవితాత్మక రచనా శైలీ చదవు వరులను ఆకట్టుకుంటుంది. ఈ మధ్య కాలంలో మీడియాలో పనిచేస్తున్న వారు రాసిన మంచి పుస్తకాల్లోఇదీ ఒకటి.

  3. A. Krishna Rao says:

    సుబ్రహ్మణ్యం గారికి, బుచ్చయ్య గారికి ధన్యవాదాలు. మీ లాంటి చైతన్యవంతులైన మిత్రులే నాకు ప్రేరణ.

    • D Subrahmanyam says:

      బలే వారే కృష్ణారావు గారు. మీలో ఆ శక్తి ఉంది. నేను మీతో స్నేహం వల్ల చాలా నేర్చుకున్నాను.

Leave a Reply to D Subrahmanyam Cancel reply

*