పిల్లలా…!  నో వే…!

 

 

-రాజ్యలక్ష్మి

~

 

 

హేండ్ బేగ్, లంచ్ బాక్స్ భుజానికి తగిలించుకుని, లిఫ్ట్ కోసం ఆగకుండా దాదాపు పరిగెత్తుతున్నట్టే మూడంతస్తులు ఎక్కి, ఆఫీసులో తన సీట్ దగ్గరకు వెళ్లి లాగిన్ అయి, “అమ్మయ్య!  లేట్ కాలేదు” అనుకుంటూ అనుకుంటూ నీరసంగా కుర్చీలో కూలబడింది సౌమ్య.  లేకపోతే నెలలో రెండు లేట్లకి ఒక లీవ్ కట్.  ఇంకానయం, లాప్‌టాప్ లేదు.  లేకపోతే అది మోస్తూ ఇన్ని అంతస్తులు ఎక్కాలంటే…  అమ్మో!

ఇంతలో “హాయ్…” అంటూ భార్గవి వచ్చింది.  “ఏంటి నిన్న రాలేదు, ఒంట్లో బాలేదా?” సౌమ్యని అడిగింది.

“నేను బాగానే ఉన్నాను. అనన్యకి మొన్నటి నించీ జ్వరం.  ఇంకా తగ్గలేదు.”

“మరెందుకు వచ్చావు?  ఈరోజు కూడా సెలవు పెట్టాల్సింది.”

“నేను అదే అనుకున్నాను.  కానీ మేనేజర్‌కి ఫోన్ చేసి సెలవు అడిగితే, ఫస్ట్ వీక్ కదా రిపోర్ట్స్ ప్రిపేర్ చేయాలని రమ్మన్నాడు.  అందుకే దానిని క్రెచ్‌లో దింపి, మందులు జాగ్రత్తగా వేయమని చెప్పి వచ్చాను.  సాయంకాలం మళ్ళీ డాక్టర్ దగ్గరకి తీసుకు వెళ్ళాలి.  ఈ రిపోర్ట్స్ అవగానే వెళ్లిపోతాను.“

“ఓ.కె.  ఏదైనా సహాయం కావాలంటే చెప్పు” అంటూ భార్గవి తన సీట్ దగ్గరకి వెళ్లిపోయింది.

సౌమ్య పేరుకు తగ్గట్టే చాల సౌమ్యంగా ఉంటుంది.  తన పని చాలా శ్రద్ధగా చేస్తుంది, ఎవరూ వంక పెట్టడానికి వీలు లేకుండా.  తనేమో, తన పనేమో అన్నట్టుగా ఉంటుంది.  ఇల్లు, ఆఫీసు తప్ప వేరే ప్రపంచం లేదు.  ఎవరినీ ఒక మాట అనదు, ఎవరన్నా తనని అన్నా తిరిగి సమాధానం చెప్పడం చేతకాక, తనలో తనే బాధపడుతుంది.

భార్గవి ఇందుకు పూర్తిగా విరుద్ధం.  తను ఎవరిజోలికీ వెళ్ళదు కానీ, ఎవరైనా తన జోలికి వచ్చారంటే మాత్రం ఊరుకోదు.  ఆఫీసులోనూ, బయటకూడా ఎవరికైనా సహాయం చేయడంలో ముందుంటుంది.  అందులోనూ ఆడవాళ్ళంటే ఇంక వెనకా ముందూ చూసుకోదు.  ఒక మహిళాసంస్థలో వాలంటీర్‌గా కూడా పనిచేస్తోంది.

భిన్న ధృవాల్లాగా లాగా ఇద్దరి మనస్తత్వాలలో ఏమాత్రం పోలిక లేకపోయినా ఇద్దరూ మంచి స్నేహితులు.  పక్కవారి మీద అంత దయ, ప్రేమ చూపించే భార్గవి అదే సమయంలో అంతలా ఎలా పోట్లాడగలదనేది సౌమ్యకి ఎప్పుడూ అంతుపట్టని విషయం.  “అందుకే పోట్లాడతా” అని నవ్వుతుంది భార్గవి.

“మా అక్క న్యూరాలజి చేయాలనుకుంది, ముఖ్యంగా సర్జన్ అవుదామనుకుంది.  సీట్ కూడా వచ్చింది.  కానీ వాటిల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, పిల్లలతో కష్టమని మా అమ్మానాన్న రేడియాలజి చేయమన్నారు” అని సౌమ్య చెప్తే “మీరు ఏం చదవాలో మీ అమ్మానాన్న నిర్ణయించడమేమిటి, అందులో పి.జి. లెవెల్లో?” అని భార్గవి చాలా ఆశ్చర్యపోయింది.  “ఇలాగే ఈ తల్లిదండ్రులు ప్రేమ, భధ్రత పేరుతో పిల్లలని ఇండివిడ్యుయాలిటి లేకుండా, బలహీనులుగా తయారు చేస్తారు” అని బాధపడింది.  “అలా ఇల్లు, ఆఫీసు అంటూ బావిలో కప్పల్లాగా ఉండద్దు.  కాస్త బయటకొచ్చి ప్రపంచాన్ని చూడండి” అంటుంది ఎప్పుడూ.   భార్గవి స్నేహంతో సౌమ్య కూడా కొంచెం ఆలోచించడం నేర్చుకుంది, ఆమెలాగా ఎదిరించలేకపోయినా.

“నిన్న ఆఫీసులో గొడవ అయిందట కదా!” లంచ్ రూంలో అడిగింది ఉష.

“నిన్న నువ్వు లేవు కదా! ప్రియ మెటర్నిటి లీవ్ అప్లై చేస్తే రాకేష్ అవమానకరంగా మాట్లాడాడుట.  తను పాపం రెస్ట్ రూంలో ఏడుస్తుంటే భార్గవి చూసి కంప్లైంట్ చేయించింది. ఆఫీసులో పెద్ద గొడవ.  ఆడవాళ్ళందరమూ కూడా ప్రియకి సపోర్ట్ చేసాము.  అపాలజీ చెప్పకపోతే వుమెన్ ప్రొటెక్షన్ సెల్‌కి కంప్లైంట్ చేస్తామనేటప్పటికి, రాకేష్ ఇక తప్పక అపాలజి చెప్పాడు.  ఈ క్రెడిట్ అంతా భార్గవికే.” అంది సూజన్.  ఇలాంటివాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయింది సౌమ్య.

“మా అఫీసులో ఒకేసారి ఇద్దరు మెటర్నిటి లీవ్‌లో వెళ్ళారు.  మావాళ్ళేమో రిప్లేస్‌మెంట్ ఇవ్వరు.  చచ్చిపోతున్నాము చాకిరీతో.  ఈ ఆడవాళ్ళు ఎందుకొస్తారో ఉద్యోగాలు చేయడానికి…” అని తన అన్నయ్య ఒకసారి విసుక్కోవడం గుర్తొచ్చింది ఉషకి.

“అసలు ఆడవాళ్ళందరూ ‘పిల్లలని కనం, పెంచం’ అంటే ఏం చేస్తారో ఈ మగవాళ్లు!” కోపంగా అంది సూజన్.   “పిల్లలు లేకుండానా…! అమ్మో…!  అనన్య లేకుండా ఒక్క క్షణమైనా తను ఉండగలదా…” అనుకుంది సౌమ్య

“అయినా హెచ్. ఆర్. లో కొంచెం సెన్సిటివ్ వాళ్ళని తీసుకోవాలి, ఇలాంటివాళ్ళని కాదు.” అంది ఉష.

“అసలు మనుషులని మనుషులలా కాకుండా ఒక్ రిసోర్స్ లాగా చూడడమే ఇన్సెన్సిటివిటి.  మళ్ళీ అందులో సెన్సిటివిటి ఏమిటి”  అంది భార్గవి.   అందరూ నవ్వారు.

కానీ భార్గవి ఈ విషయంలో చాలా సీరియస్.  ఈ ఒక్క విషయంలోనే కాదు భార్గవికి ప్రతి విషయంలో ఒక ఖచ్చితమైన, ధృఢమైన అభిప్రాయం ఉంటుంది.  స్త్రీల పట్ల వివక్ష; ఇంట్లో, ఆఫీసులో వాళ్ళకి జరిగే అన్యాయాలు – ఇలాంటివే కాకుండా పర్యావరణ రక్షణ, రైతు ఆత్మహత్యలు, ప్రభుత్వం రైతులనుండి సారవంతమైన భూమిని వ్యవసాయేతర అవసరాలకోసం సేకరించడం – ఇలాంటివాటి పైన కూడా  ఒక స్పష్టమైన అవగాహనతో ఉంటుంది.

సౌమ్య రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి అప్రూవల్ కోసం మేనేజర్ కాబిన్‌లోకి వెళ్ళేసరికి ఆయన ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. “బ్రాంచ్‌లో అడిషనల్ స్టాఫ్ కావాలి నిజమే, కానీ ఆడవాళ్ళు వద్దు.  ఇప్పటికే మా బ్రాంచ్‌లో ఆడ స్టాఫ్ ఎక్కువైపోయారు.  ఎప్పుడూ సెలవలు, పర్మిషన్లు!  వాటికితోడు గొడవలు!  చచ్చిపోతున్నాననుకో…” అంటూ సౌమ్యని చూసి ఫోన్ కట్ చేసాడు.

‘ప్రతి ఒక్కడూ ఆడవాళ్ళమీద కామెంట్లు చేసేవాడే!  సుత్తిమొహం…’ అనుకుంటూ అప్రూవల్ తీసుకుని “ఈ రిపోర్ట్స్ మెయిల్ చేసేసి నేను వెళ్తాను, పాపని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి” అంది. “ఓ.కె. నో ప్రాబ్లం. మరి లీవ్ అప్లై చేసారా?” అన్నాడు.  “లేదు, హాఫ్‌డే చేస్తాను” అని బయటకొచ్చింది, అంతకంటే ఏమీ అనలేక.

“ఏమంటున్నాడు మన బాసాసురుడు?” సౌమ్య విసురుగా రావడం చూసి అడిగింది ఉష.

“అసలు సెలవు తీసుకుందామనుకుంటే పనైపోగానే వెళ్ళిపోవచ్చని బతిమాలి ఆఫీసుకు రమ్మన్నాడు.  ఇప్పుడేమో తీరా పని పూర్తిచేసి వెళ్తానంటే హాఫ్‌డే లీవ్ పెట్టమంటున్నాడు.“  సౌమ్యకి ఒళ్లు మండిపోతోంది.

“A boss is a boss is a boss is a boss.” నవ్వింది సూజన్.

“ఇప్పుడు లీవెందుకు?  అప్పుడే నాలుగున్నర అయింది కదా!” ఆశ్చర్యపోయింది ఉష.  “నువ్వు అడగకపోయావా?” అంది

“ఉపయోగం లేదు.  నిన్నటి గొడవ తర్వాత ఆడవాళ్ళంటేనే మండిపోతున్నాడు.”  అంది సూజన్

“ఏమీ వద్దు.  లీవ్ అప్లై చేసి దర్జాగా వెళ్లిపో.  లేకపోతే వీళ్ళందరూ ఆడవాళ్ళు ఎప్పుడూ పర్మిషన్లు అడుగుతారని ఏడుస్తారు” అంది భార్గవి.

“నిజమే” అంది సూజన్.

లీవ్ అప్లై చేసి ఆఫీస్‌లోంచి బయటపడింది సౌమ్య.  అనన్యని డాక్టర్‌కి చూపించి ఇంటికి వెళ్ళింది.  అనన్యకి మందు వేసి, బ్రెడ్, పాలు ఇచ్చి పడుకోపెట్టింది.  మందు పనిచేసినట్టుంది, అనన్య ఏడవకుండా నిద్రపోతోంది.   సౌమ్య కూడా పక్కనే పడుకుంది.  ఈ రోజు చాలా అలసటగా ఉంది.  అందులోనూ మధు ఊళ్ళో లేకపోవడంతో మరీ ఒంటరిగా అనిపిస్తోంది.  ఇంతవరకు అనన్య గురించిన దిగులుతో ఆఫీసులో జరిగిన విషయాలు పట్టించుకోలేదు.  ఇప్పుడు అనన్య ప్రశాంతంగా నిద్రపోతూడడంతో పొద్దుననుండి జరిగిన విషయాలు గుర్తుకొస్తున్నాయి.

ఈ మేనేజర్ ఒకడు, మొత్తం పని చేయించుకుని హాఫ్‌డే లీవ్ పెట్టమన్నాడు.  దానికన్నా వాళ్ళు ఆడవాళ్ళ గురించి చేసిన కామెంట్లు మరీ బాధిస్తున్నాయి.  మెటర్నిటి లీవ్ గురించి రాకేష్ అసభ్యంగా మాట్లాడాడుట!  ఏమన్నాడో?  అసలు ఏమైనా అనే అధికారం అతనికేముంది?  మేనేజర్ అయితే ఏకంగా బ్రాంచ్‌లో ఆడస్టాఫునే వద్దంటున్నాడు.  ఏం?  ఆడవాళ్ళు జీనియస్సులు కారా?  వాళ్ళకి ఎఫిషియెన్సి లేదా?

తను చదువుకునే రోజుల్లో ఆడపిల్లలకి మార్కులు ఎక్కువ వస్తాయని మగపిల్లలు గొడవ చేసేవారు.  “మీరేమన్నా క్రికెట్ ఆడుతారా?  ఫ్రెండ్స్‌ తో బయట తిరుగుతారా?  ఊరికే ఇంట్లో కూర్చుని ఏమీ తోచక చదివితే మాకూ వస్తాయి మార్కులు” అని వెక్కిరించేవారు.  ఆడపిల్లలు కూడా స్పోర్టివ్‌గా తీసుకుని “మిమ్మల్ని మేమేమన్నా బయట తిరగమన్నామా?  మీరూ ఇంట్లో కూర్చుని చదవండి” అనేవారు నవ్వుతూ.  అప్పుడు ఏమీ అనిపించేది కాదు, సరదాగా ఉండేది.  కానీ ఇది వేరు!

బయట వాళ్ళననుకుని ఏం లాభం?  “ఆడవాళ్ళు ఎంత చదివినా పొయ్యిలోకే!  బి.యే. చదివినా బియ్యం ఏరాల్సిందే!” – అమ్మ టెంత్ తర్వాత ఇంకా చదువుకుంటానని గొడవ చేస్తే వాళ్ళ తాతయ్య అనేవాడట.  “స్త్రీ స్వాతంత్ర్యం అంటే ఇదే!  ఇంట్లోనూ, బయటా కష్టపడడమే!  కావాలని సాధించుకున్నారుగా! అనుభవించండి…” – అమ్మ ఇంట్లోనూ బయటా చేసుకోలేక సతమతమవుతుంటే తాతయ్య వెక్కిరింతగా అనేవాడు.  “నిన్ను ఉద్యోగం చేయమని ఎవడేడ్చారు?  ఆ వెధవుద్యోగం లేకపోతే గడవదా?  మానిపారెయ్…” – తనకేదైనా ఇబ్బందయితే అమ్మ మీద అరిచేవాడు నాన్న కూడా!  ఆ మాట అనిపించుకోకూడదని అమ్మ నానా హైరానా పడేది.  “నా ఉద్యోగం చిన్నదనీ, మీ నాన్నతో సమానంగా చదువుకోలేదనీ, సంపాదించటంలేదనీ చులకన నేనంటే.  మీరు మాత్రం బాగా చదువుకుని మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేయాలి.  అప్పుడే మీకు గౌరవం” అనేది అమ్మ ఎప్పుడూ.  అమ్మ అభిప్రాయం ఎంత తప్పో ఇప్పుడు తెలుస్తోంది.  వాళ్ళతో సమానంగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నా ఇంకా ఎందుకో అంత చులకన?

“ఈ మగవాళ్ళు ఇలా ఎందుకు ఉంటారో…” అంటే, “ఆడపిల్లలు పుట్టరు, తయారు చేయపడతారు అంటారు.  కానీ మగపిల్లలు కూడా పుట్టరు, తయారు చేయపడతారు.  మనం వారితో పాటు సమానంగా చదువుకుని ఉద్యోగాలు చేయటం వారిలో తరతరాలుగా జీర్ణించుకున్న అహంకారం భరించలేదు.  ఆ అసహనంవల్లే ఈ కామెంట్లూ అవీ…  వీళ్ళసలు ఇళ్ళల్లో కూడా ఇలాగే ఉంటారు, కాని అవన్నీ ప్రేమ, ఆప్యాయతల ముసుగులో ఎవరికీ కనపడవు” అంటుంది భార్గవి.

ఇలాంటివెవరైనా తనని అంటే కాళ్ళూ, చేతులూ బిగిసిపోయి, గుడ్లప్పగించి చూస్తుంది కానీ తిరిగి సమాధానం చెప్పలేదు.  లాభం లేదు.  అలాంటివాళ్ళకి స్ట్రాంగ్‌గా సమాధానం చెప్పడం నేర్చుకోవాలి.  రకరకాల అలోచనలతో సౌమ్య నిద్రలోకి జారుకుంది.

 

***

క్రీ.శ. 2040

 

“పెళ్ళి పెళ్ళి అని నన్ను ఊరికే సతాయించకమ్మా.  మీకెన్నిసార్లు చెప్పాలి?  నేను పెళ్ళి చేసుకోను.” సౌమ్యని విసుక్కుంది అనన్య.

అనన్య బయోటెక్నాలజిలో రీసెర్చ్ చేస్తోంది.  కూతురికి ముప్పయ్యేళ్ళు వచ్చేస్తున్నాయి, ఇంకా పెళ్ళి కాలేదని సౌమ్య దిగులు.  ఎప్పుడైనా అనన్య ఇంట్లో ఖాళీగా దొరికితే ఇద్దరికీ ఇదే చర్చ.

“అదికాదమ్మా, నీకిష్టమైనవాడినే చేసుకో,   మేమేమీ కాదనం కదా!” అంటున్న సౌమ్యకేసి జాలిగా చూసింది అనన్య.

“అబ్బా!  నీకెలా చెప్తే అర్థమవుతుంది?  పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు కదా ఇష్టమైనవాడో, ఇష్టంలేనివాడో!  పెళ్ళి చేసుకుని నా కెరీర్ పాడుచేసుకోలేను.”  అంది అనన్య

“పిన్నీ…!  అనన్యా…!” అంటూ వచ్చింది నవ్య, సౌమ్య అక్క కూతురు.  నవ్యని చూడగానే సౌమ్యకి సంతోషం వేసింది.  కాసేపు కబుర్లు చెప్పిన తర్వాత “చూడవే… నవ్యా!  అనన్య అసలు పెళ్ళేచేసుకోనంటొంది.  నువ్వయినా చెప్పవే…” అంది సౌమ్య ఆశగా.

నవ్య అనన్యకి షేక్‌హాండ్ ఇచ్చి, “కంగ్రాచ్యులేషన్స్!  నేను చేయలేని పని నువ్వు చేస్తున్నావు.  ఈ మాట మీదే నిలబడు” అంది .
“అదేమిటే, నువ్వు కూడా అలా అంటావు!  పెళ్ళి చేసుకుని నువ్వు ఏం ఇబ్బంది పడుతున్నావు?  ఒకటి రెండేళ్ళల్లో పిల్లలకి కూడా ప్లాన్ చేస్తారనుకుంటుంటే…” ఆశ్చర్యంగా అంది సౌమ్య.

“ఓ, పిన్నీ!  పిల్లలా…! నో వే…!  అసలు పెళ్ళే ఒక బర్డెన్ అనుకుంటుంటే ఇక పిల్లలు కూడానా!”  నవ్య చాలా ధృఢంగా చెప్పింది.  అర్థం కానట్టు చూస్తున్న సౌమ్యతో “మా అమ్మ న్యూరాలజీ చెయాలని ఉన్నా రేడియాలజి ఎందుకు చేసింది, నేను ఉన్నాననే కదా!  నువ్వు ప్రమోషన్లు ఎందుకు వదులుకున్నావు, అనన్య కోసమే కదా!  అంటే మీ కెరీర్‌ని, కోరికలని మాకోసం చంపుకున్నారు.  నేను అలా ఉండాలనుకోవటం లేదు. అందుకే…” అంది నవ్య.

సౌమ్య అయోమయంగా చూసింది.  ఏమైంది వీళ్ళందరికీ!  తన స్నేహితులందరికీ వాళ్ళ పిల్లలతో ఇదే సమస్య.  సగానికి సగం మంది పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు.  ఒకవేళ చేసుకున్నా పిల్లలని కనడమే లేదు, కెరీర్ పాడవుతుందని!

“అనన్య అసలు పెళ్ళే చేసుకోనంటోంది.  నవ్యేమో పిల్లలు వద్దంటోంది.  ఏం చెయాలి వీళ్ళని?” అంటూ మధు దగ్గర బాధపడింది.

“చూడూ!  మా అమ్మమ్మ వాళ్ళు ఏడుగురుట.  మా అమ్మ వాళ్ళు నలుగురు.  మేము ఇద్దరం.  మనకి ఒక్కరే.  మనని ఇంకొకరిని కనమని ఎంత బలవంతం చేసారో మర్చిపోయావా?” అన్నాడు.  “మరీ ఒక్క పిల్లేమిటే!  ఇంకొక్కరు ఉంటే బావుంటుంది.  ఒకరికొకరు తోడుగా ఉంటారు” అని అమ్మ ఎన్నోసార్లు తనతోనూ, అక్కతోనూ అనడం గుర్తొచ్చింది సౌమ్యకి.

“కానీ, ఇద్దర్ని మనం మేనేజ్ చేయలేమని కదా ఒక్కరే చాలనుకున్నాము”

“అదే నేను చెప్పేది.  మనం ఒక్కరు చాలనుకున్నాము.  ఈ తరం ఆ ఒక్కరు కూడా వద్దనుకుంటోంది.”

“పిల్లలు సరే, అనన్య అసలు పెళ్ళే చేసుకోనంటోంది కదా!  ఇప్పుడు బాగానే ఉంటుంది.  కొంతకాలం పోయిన తర్వాత ఒంటరితనంతో ఎంత బాధపడతారు!”  సౌమ్యకి ఈ పరిస్థితి మింగుడుపడడంలేదు.

“బహుశా బాధపడరేమో!  ఇప్పటికే సింగిల్‌గా ఉండే ఆడపిల్లలూ, మగపిల్లలూ ఎక్కువవుతున్నారు.  అనన్య స్నేహితుల్లో కూడా అలాంటివాళ్ళు చాలామందే ఉన్నారు కదా!  ఇంక ఒంటరితనం అన్న ప్రశ్నే రాదు.”

మధు తీసుకున్నంత తేలికగా సౌమ్య తీసుకోలేకపోతోంది.  “మనమేమీ చేయలేము.  ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్.”  అన్నాడు అనునయంగా మధు.

 

***

 

క్రీ.శ. 2300

 

వెంకట్ బిక్కుబిక్కుమంటూ రోడ్డుమీద నడుస్తున్నాడు.   కనుచూపుమేరలో ఇంకెవరూ లేరు.  దాదాపు రెండొందల సంవత్సరాల క్రితం మనుషులు ఇలా రోడ్డు మీద నడిచేవారట.  ఇల్లు ఇంకో వందగజాలు ఉండగా వెహికల్ ఆగిపోయింది.  దగ్గరే కదా అని నడవడం మొదలుపెట్టాడు.  కానీ మనసులో చాలా భయంగా ఉంది.   ఉన్నట్టుండి అయిదారుగురు ముసలివాళ్ళు చుట్టుముట్టారు.  వెంకట్‌కి ఏమి చేయాలో తెలియలేదు.  వెంకట్ దగ్గరున్న వస్తువులు లాక్కుని వాళ్ళు పారిపోయారు.  ఈమధ్య ఇది మామూలైపోయింది.  పోలీసులకి పట్టుబడతామని భయం కూడా లేదు.  నిజానికి పట్టుబడితే ఇంకా మంచిది.  ఏ రెండు మూడు నెలలో జైల్లో హాయిగా ఉంటారు.  పాపం వాళ్ళననేమీ లాభంలేదు!  స్ట్రగుల్ ఫర్ ఎగ్సిస్టెన్స్, అంతే!  

 

***

బాబి కంప్యూటర్ ముందునుంచి లేచాడు విసుగ్గా.  కంప్యూటర్ గేమ్స్ ఆడీ ఆడీ విసుగొచ్చేసింది.  రోజంతా కంప్యూటర్‌తోనే కాలక్షేపం.  ఆడుకోవడానికి కాదు కదా కనీసం మాట్లాడడానికి కూడా ఎవరూ లేరు.  చదువు కూడా కంప్యూటర్ సహాయంతోనే.  అంతా ఆటోమేటెడ్!  రెండొందల ఏళ్ళ క్రితం వరకూ పిల్లలందరూ ‘బడి’లో చదువుకునేవారనీ, అక్కడ పాఠాలు చెప్పడానికి ‘టీచర్’ అనేవాళ్లు ఉండేవారనీ, సాయంకాలాలు పిల్లలందరూ కలిసి ఆడుకునేవారనీ చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాడు.  వీడియోల్లో చూసాడు.  ఎంత బావుందో!  తనెప్పుడూ అలా ఆడుకోలేదు.  అసలు తన ఈడు పిల్లలని చూసి ఎన్నాళ్ళయిందో!

***

 

ప్రపంచ నేతల సదస్సు జరుగుతోంది.  అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు.

“మన టెక్నాలజి చాలా అభివృద్ధి చెందింది.  మనిషి తన మేధస్సునీ, తెలివి తేటలనీ ఒక్క రీసెర్చ్ కే ఉపయోగిస్తున్నాడు.  మిగిలిన రొటీన్ పనులన్నీ ఆటోమేట్ చేసాము.  అఫీసుల్లో, పొలాల్లో, ఫాక్టరీల్లో  పని అంతా రోబోలే చేస్తున్నాయి. ఈ రోబోలని కంట్రోల్ చేయడానికే మనిషి!

దీనికి ఇంకొక పార్శ్వం గమనిస్తే, ఇరవైయ్యొకటవ శతాబ్దంతో పోలిస్తే ప్రపంచ జనాభా సగానికి పైగా తగ్గిపోయింది.  దానిలో యాభై శాతం పైగా వృద్ధులే!  పిల్లలు పది శాతం కూడా లేరు!

కుటుంబ వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమవడంతో వృద్ధుల, పిల్లల భారం ప్రభుత్వాల మీద పడింది.  వారి పోషణ, రక్షణ ప్రభుత్వాలకి పెద్ద సవాలైంది.   వృద్ధులలో క్రైం రేటు బాగా పెరిగిపోయింది.  చిన్న చిన్న దొంగతనాలు, వృద్ధులు గుంపులు గుంపులుగా కలిసి ఒంటరివారిపై చేసే దాడులు పెరిగిపోయాయి.  జైళ్ళన్నీ వృద్ధులతో నిండిపోయాయి.  తోటిపిల్లలు లేకపోవడంతో పిల్లలు కూడా స్థబ్దుగా తయారయ్యారు.  అన్ని వర్గాల, వయస్సుల ప్రజలలో రకరకాల సామాజిక, మానసిక సమస్యలు తలెత్తాయి.  ఆత్మహత్యల రేటు విపరీతంగా పెరిగిపోయింది.  ఇదే పరిస్థితి కొనసాగితే తొందరలోనే మానవజాతి అంతరించి పోతుంది.  ఈ సమస్యని అధ్యయనం చేయడానికి సోషియాలజీ ప్రొఫెసర్ పండిట్ అధ్యక్షతలో ఒక కమిటీని నియమిస్తున్నాము.  ఈ కమిటీలో ఆర్థికశాస్త్రం, జీవశాస్త్రం మొదలైన రంగాలలో నిపుణులు మెంబర్లుగా ఉంటారు.” అని ముగించాడు.

ఆ కమిటీ ఒక సంవత్సరం పాటు రకరకాల అంశాలను అధ్యయనం చేసి జనాభా తగ్గడానికి గల కారణాలు, ఇది ఇలాగే ఉంటే ఇక ముందు మానవజాతి ఎదుర్కోబోయే సమస్యలు, అలాగే జనభా పెరుగుదలకు తీసుకోవలసిన చర్యలు సిఫార్సు చేసింది.   ప్రపంచ నేతల సదస్సులో ప్రొఫెసర్ పండిట్ ఆ రిపోర్ట్‌ లోని అంశాలని చెప్పడం మొదలుపెట్టాడు.

“ఇరవయ్యొకటవ శతాబ్దం తర్వాత జనాభా తగ్గడానికి గల ముఖ్యమైన కారణాలు:

  1. పర్యావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి వల్ల స్త్రీ, పురుషులిద్దరిలో సంతానలేమి పెరిగింది.
  2. ఇరవయ్యొకటవ శతాబ్దం నుంచీ స్త్రీలు పురుషులకి తామేమీ తీసిపోమని వారితో సమానంగా చదువూ, ఉద్యోగాలలో రాణించారు. ఆ క్రమంలో తమ చదువుకి, కెరీర్‌కి ఇచ్చిన ప్రాముఖ్యం వివాహానికీ, సంతనానికీ ఇవ్వలేదు.   వివాహము, సంతానము తమ చదువుకూ, కెరీర్‌కూ ప్రతిబంధకంగా వారు భావించారు.

 

జనాభా తరుగుదలకి ఈ రెండో కారణమే ప్రధానం.  దీనిని అరికట్టాలంటే యువతకు, ముఖ్యంగా స్త్రీలకు వివాహము, సంతానము కారణంగా వారి కెరీర్‌కి ఎలాంటి ఆపద ఉండదని హామీ ఇవ్వాలి.  అంతే కాకుండా ఎక్కువమంది సంతానం ఉన్నవారికి తగిన ప్రోత్సాహకాలు కూడా ఇవ్వవలసి ఉంటుంది.  కుటుంబవ్యవస్థని తిరిగి పునరుద్ధరించటానికి తగిన చర్యలు తీసుకోవాలి.  ఇంకా…”

***

ఫోన్ మోగుతున్న శబ్దానికి సౌమ్యకి మెలకువ వచ్చింది.  కాసేపు తను ఎక్కడ ఉన్నదో అర్థం కాలేదు. తల తిప్పి చూస్తే పక్కన అనన్య నిద్రపోతోంది.   ఎంతసేపటినించీ ఆ ఫోన్ మోగుతోందో!  మోగీ మోగీ ఆగిపోయింది.   టైము చూస్తే తొమ్మిదే అయింది.  అంటే తను గంటే నిద్రపోయిందన్నమాట.  ఈ గంటలోనే కలా!  లేచి ఎవరు ఫోన్ చేసారా అని చూసింది.  భార్గవి.  ఎందుకు చేసిందా అని అనుకుంటుండగానే మళ్ళీ చేసింది,  అనన్యకి ఎలా ఉందంటూ.

“ఫరవాలేదు.  నిద్రపోతోంది.  అది సరే కానీ, నాకిప్పుడే ఒక చిత్రమైన కల వచ్చింది తెలుసా…”  అంటూ భార్గవికి తనకొచ్చిన కల చెప్పింది సౌమ్య నవ్వుతూ.

“ఇది నవ్వుకునే విషయం కాదు సౌమ్యా! ముందుముందు మానవజాతి ఎదుర్కునే స్థితి.  దీని సూచనలు ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని దేశాలలో కనిపిస్తున్నాయి.  ఉదాహరణకి జపానులో జనాభా వృద్ధిలో తగ్గుదల ఇప్పటికే మొదలైంది.  దీనికి కారణం, అక్కడ స్త్రీలు కెరీర్‌కి ఇచ్చిన ప్రాముఖ్యత సంతానానికి ఇవ్వకపోవడమే!  దీనివల్ల జపాను ప్రభుత్వం రకరకాల సమస్యలని ఎదుర్కొంటోంది.  ఈ సమాజానికి ఉత్పత్తి ఎంత ముఖ్యమో, పునరుత్పత్తి కూడా అంతే ముఖ్యం.  ఉత్పత్తి చేసే వాళ్ళల్లో ముఖ్యమైన రైతుకి అన్నదాత, రైతే రాజు అనీ, అలాగే కుటుంబవ్యవస్థలో, పునరుత్పత్తిలో ముఖ్యపాత్ర వహించే స్త్రీకి గృహలక్ష్మి, మాతృదేవత అని బిరుదులిస్తున్నామే కానీ, వారి శ్రమకు తగిన విలువ, గుర్తింపు, గౌరవం ఇవ్వడంలేదు.  కుటుంబమా – కెరీరా?  పిల్లలా – ప్రమోషన్లా?  ఇలా ఏదో ఒకటి మాత్రమే ఎంచుకునే పరిస్థితి నేటి స్త్రీది.  కానీ ఈ రెండూ జంటపదాల్లాగా, జుగల్బందీలాగా విడదీయలేనివి.  ఇది అర్థం చేసుకోనంతకాలం ఈ పరిస్థితిలో మార్పు రాదు.  ఈ పరిస్థితి ఇలాగే ఉంటే నీకొచ్చిన కల నిజమవడానికి ఎంతో కాలం పట్టదు.” ఆవేశంగా అని, “మా మహిళా సంస్థలో వీటిగురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి.  ఇంకా ఎంతో చర్చ జరగాల్సి ఉంది.  ఎంతో అర్థం చేసుకోవాల్సి ఉంది.  రేపు తీరిగ్గా మాట్లాడుకుందాం.” అంటూ ఫోన్ పెట్టేసింది భార్గవి.

భార్గవి మాటలకు బిత్తరపోయి అలాగే కూర్చుండిపోయింది సౌమ్య.                                                                                                               *

 

[ఉత్పత్తి సమాజ మనుగడకు ఎంత ముఖ్యమో పునరుత్పత్తి అంత ముఖ్యం.  దానిలో కీలక పాత్ర స్త్రీది.  అక్కడ వారి శ్రమకు విలువగుర్తింపు, గౌరవం దొరకాలి.  ప్రస్తుతం అవి లేవు.  మాతృమూర్తి, దేవత అని కితాబునిచ్చి ఊరుకుంటారు.  –  ఓల్గా]

మీ మాటలు

  1. Katha ba agundandee mundutaraala jaragaboye vishayaala oohaatmaka chitram bagundi.

  2. Venulaxmi Yanala says:

    రాజ్య లక్ష్మి గారు,

    చాలా సందర్భోచిత కథ. చక్కటి కథనం… అభినందనలు.

  3. lenin babu says:

    కథ బాగుంది రాజ్యలక్ష్మి గారు…the future is here.but just not evenly distributed…అన్న విలియం గిబ్సన్ …….మాటల్ని పట్టించుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

  4. C ANURADHA says:

    కథ చాల బాగుంది రాజ్యలక్ష్మి గారు , ఇంకా ఎన్నె వైవిధ్య భరితమైన కథలు మీ నుంచి ఆసిస్తునాము. అభినందనలు.

  5. సూరపరాజు రాధాకృష్ణమూర్తి says:

    ‘మాతృమూర్తి దేవత అన్న కితాబు ఇచ్చి ఊరుకున్నారు.’ నిజమే. స్త్రీకి ధర్మపత్నిగా మన సంప్రదాయం ఇచ్చిన విలువను మగవాడు గుర్తించి ప్రవర్తించలేదు కనుకనే సమాజం ఈ నాడు ఈ దుస్స్థితిలో ఉన్నది.సందేహం లేదు. కాని ఇప్పుడు ఆ ఆదర్శమే ప్రశ్నించబడుతున్నది కదా? ఆచరణలో దోషం ఆదర్శానికే ఆరోపిస్తున్నాము. ఆ ఆదర్శానికి జీవం కలిగించే ప్రయత్నం కూడా ఈనాడు ఆమోదం పొందదు. ఆచరణ మారవలె అని ఎవరూ అనడం లేదు ఈ నాడు. ఆదర్శం పనికిరాదు అంటున్నాం. దేనిని ఎవరిని తప్పుపట్టడం ?

  6. ari.sitaramayya says:

    “జపానులో జనాభా వృద్ధిలో తగ్గుదల ఇప్పటికే మొదలైంది. దీనికి కారణం, అక్కడ స్త్రీలు కెరీర్‌కి ఇచ్చిన ప్రాముఖ్యత సంతానానికి ఇవ్వకపోవడమే!”

    ఆఫీసుకి వెళ్ళేటప్పుడు బిడ్డలను మంచి డే కేర్ లో ఉంచడం వీలయితే, ఇంటిపనుల్లో మగవాడు కొంత సహకరిస్తే సంతానం పట్ల ఇంత విముఖత ఉండకపోవచ్చు. జపాన్ లో కూడా మగవాళ్ళు ఇండియాలోలాగా ……… ఇది మారనంత కాలం బయటా ఇంట్లో కష్టపడటం అంత సులభం కాదు. పైగా, శిస్తులు కట్టడానికీ, యుద్ధాల్లో చావడానికీ బిడ్డల్ని కనమనే దేశం డే కేర్ సౌకర్యం కలిపించడం లో అంత శ్రద్ధ తీసుకోవడం లేదు. ఇంటా బయటా కష్టపడుతూ సరైన డేకేర్ సౌకర్యం లేక ఉద్యోగం వదిలెయ్యడం తప్ప మరోమార్గం లేక సతమతమవుతున్నారు జపాన్ లో స్త్రీలు. కాని వాళ్ళు కెరీర్ కి ఇచ్చినంత ప్రాముఖ్యత సంతానానికి ఇవ్వడం లేదని చెప్పడం ఇది స్త్రీల నిర్ణయం లాగా వినిపిస్తుంది. ఇది వాళ్ళమీద రుద్దబడిన నిర్ణయం.

  7. సూరపరాజు రాధాకృష్ణమూర్తి says:

    ‘స్త్రీ పిల్లల్ని కనే యంత్రం కాదు, వంటమనిషి పనిమనిషి కాదు.మగవాడిలాగా స్త్రీ అన్ని పనులు చేయగలదు’,అని నిరూపించింది స్త్రీ. ఇది స్త్రీ నిర్ణయమే మొదట్లో. ఏ బానిసత్వం నుండి బయటపడవలెనని స్త్రీ ఉద్యమించి విజయం సాధించిందో ఆ బానిసత్వం ఇప్పుడు రెండింతలైంది.ఇప్పుడు స్త్రీ ‘నేను ఉద్యోగం చేయను.నీవు సంపాదించి తీసుకురా’ అంటే ఆమెకు పెళ్ళే కాదు. ఇంతకు ముందు ఒక సంకెల అనుకున్నది,ఇప్పడు రెండు చేతులకూ సంకెళ్ళుగా మారింది. ఎప్పుడైనా ఆదర్శాన్ని ఆమోదించి ఆచరణను సంస్కరించే ప్రయత్నం మేలు చేస్తుంది.మన రాజ్యాంగం constitution సరిగా అమలు కావడంలేదు,ప్రజాస్వామ్యం పనిచేయడం లేదు అని,రాజ్యాంగాన్నే ప్రజాస్వామ్యాన్నే కాదనడం వంటిదే. ఏ వ్యవస్థనైనా సంస్కరించుకోవలె. ఏలోపమూ లేని వ్యవస్థ ఉండదు. మాతృమూర్తి ధర్మపత్ని అయిన స్త్రీని కాదనుకున్న ఫలం ఇది.

    • Y RAJYALAKSHMI says:

      ధన్యవాదాలు.సూరపరాజు రాధాకృష్ణమూర్తి గారు

  8. దేవరకొండ says:

    రాధాకృష్ణమూర్తి గారి పై వ్యాఖ్యలు రెండూ ఎంతో లోతైన అవగాహనతో చేసినవిగా తెలుస్తున్నా మనం గమనించవలసినది చుట్టూ ఉన్న భౌతిక వాస్తవాలను. ఆదర్శాన్ని ప్రశ్నించడం అతి సులువు. ఆచరణను సంస్కరించుకోవడం (సంస్కరించడం కాదు) దాదాపు అసాధ్యం! అహంకారమే మొదటి విఘ్నం! ఆ తర్వాత జాబితా అనంతం. కనుకనే ఎక్కడికక్కడ సమాధానపడుతూ ఏ కాస్త మంచి కనిపించినా ఈ దిశగా ఏ కాస్త ప్రగతి అగుపించినా బోలెడు సంతోషించి ఆశాజీవులమై బ్రతికేది. వ్యక్తీ, విలువలు, సమాజం, పర్యావరణం…అన్నిటికీ ఇదే చిక్కుముడి. చిన్ని చిన్ని ప్రయత్నాలు, చిన్ని చిన్ని విజయాలు…ఇలాగే వుంటుంది ఒకసారి పగిలిన శిల్పాన్ని మళ్లీ నిలబెట్టుకోవడం. ఆలోచన వుండడం, దాన్ని ఆవిరైపోకుండా కాపాడుకోవడం కూడా ముందడుగే! ఇలాంటి రచనలు అలా ఎంతో మేలు చేస్తాయి! రచయిత్రికి అభినందనలు!!

    • Y RAJYALAKSHMI says:

      “చిన్ని చిన్ని ప్రయత్నాలు, చిన్ని చిన్ని విజయాలు…ఇలాగే వుంటుంది ఒకసారి పగిలిన శిల్పాన్ని మళ్లీ నిలబెట్టుకోవడం. ఆలోచన వుండడం, దాన్ని ఆవిరైపోకుండా కాపాడుకోవడం కూడా ముందడుగే!”

      ధన్యవాదాలు.

Leave a Reply to Y RAJYALAKSHMI Cancel reply

*