చిగురంత ఆశ ..ఈ చిన్ని సినిమా!

 

siva

 

శివలక్ష్మి 

~

గర్ల్ రైజింగ్ (Girl Rising)  అనే ఈ స్పెషల్ ఇంట్రస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ న్యూయార్క్ లో చిత్రీకరించబడింది.

ఈ చిత్ర దర్శకుడు రిచర్డ్ రాబిన్స్ .

ఈ సినిమా నిడివి గంటా 41 నిమిషాలు.

 

ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆడపిల్లలు పుట్టిన దగ్గరనుంచి పెరుగుతున్న క్రమంలో పడుతున్న దారుణ మైన హింసల్ని రికార్డ్ చేసిన చిత్రమిది. బాల్య వివాహాలు,  పిల్లల బానిసత్వం, నిరక్షరాస్యత, పేదరికం, మానవ రవాణా మొదలైన సమస్యల గురించి హృదయ విదారకమైన కథలు చెబుతుంది. 9 దేశాల ప్రతినిధులుగా 9 మంది బాలికలు ఈ అడ్డంకులన్నిటినీ అధిగమిస్తామని గొప్ప ఆశావాదాన్ని వినిపిస్తారు.

కంబోడియా మురికి వాడ నుంచి వచ్చిన అనాధ “సోఖా” చురుకైన విద్యార్ధిగా, ‘నర్తకి’ గా మారిన విధానాన్ని మనసులో నిల్చిపోయేటట్లు చిత్రించారు.

నేపాల్ నుంచి “సుమ బలవంతపు దాస్యం నుంచి తాను తప్పించుకుని మిగిలిన తనలాంటివారిని తన సంగీత విద్య ద్వారా బాధ్యతగా తప్పించే పనిలో నిమగ్న మవడం చూస్తాం.

ఇండియా నుంచి కలకత్తాలో రోడ్డు పక్కన నివసించే ఒక తండ్రి తన చిన్నారి పాప  “రుక్సానా లోని ఆర్టిస్ట్ ని గుర్తించి ఆమె కోసం కుటుంబమంతా తమ  ప్రాధమికావసరాల్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతారు. రోడ్డు మీద నివశించే వారి కుటుంబం ఒకసారి కురిసిన తుఫాన్ లాంటి వర్షంలో అల్లాడిపోతుంది.”వెయ్యి నదులు కక్షతో ప్రవహిస్తున్నట్లు వర్షిస్తుంటే,నిలువ నీడలేని మా అందరితో పాటు నా చిత్రలేఖనాలు కూడా రోదిస్తున్నట్లనిపిస్తుంది. నానిపోయిన నా డ్రాయింగ్స్ ని ఏమూల ఆరబెట్టాలి?” అంటుంది రుక్సానా ఏడుపు గొంతుతో.

అలాగే పెరూ దేశం నుంచి “ సెన్నా” అనే పాప పేరుని క్లాస్ రిజిస్టర్ నుంచి స్కూలు ఫీజ్ కట్టనందు వల్ల    తీసేస్తారు.తల్లిని చదువుకుంటానని అడుగుతుంది. తల్లి “మన దగ్గర డబ్బుల్లేవమ్మా” అని చెప్తుంది. తల్లికి సహాయం చేస్తూనే మళ్ళీ క్లాస్ కెళ్తుంది. బహుశా అది పేద దేశమైనందు వల్లనో ఏమో స్కూలు బిల్డింగ్  లాంటి వేమీ ఉండవు.ఒక ఖాళీ జాగాలో టీచర్ పాఠాలు చెప్తూ ఉంటుంది.నిశ్శబ్దంగా మన పాప వెనక బెంచీలో కూర్చుని పాఠాలు వింటూ ఉంటుంది. టిచర్ చూసి “మీ అమ్మ స్కూలు ఫీజ్ ఇచ్చిందా”? అనడుగుతుంది.పాప ధైర్యంగా “లేదు. మా దగ్గర డబ్బు లేదం”టుంది.ఐతే క్లాస్ నుంచి  వెళ్ళిపొమ్మంటుంది టిచర్. మొదటిసారి నిరాశగా వెళ్ళిపోతుంది సెన్నా. చదువుకోవాలనే కోరిక ఆ పాపని నిలవనీయదు. ఎన్నిసార్లు వెళ్ళమన్నా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది.ఇక చివరికి టీచర్ కి ఆ పాప పట్ల ఇష్టం పెరిగిపోయి చిరునవ్వుతో చూస్తూ ఉండిపోతుంది.చిత్రం ముగుస్తుంది.

“నేను చదువుతాను. నేను చదువుకుంటాను. నేను నేర్చుకుంటాను. మీరు నన్ను ఆపడానికి ప్రయత్నిస్తే నేనింకా బలంగా పోరాడతాను” – అని కధకురాలు తన గొంతుతో చెప్తుంది గానీ ఆ పాప తాను చదువుకోవాలనే విపరీతమైన తన కాంక్షను తన నటన ద్వారా అద్భుతంగా వ్యక్తీకరించింది. “ఒకవేళ మీరు గనక నన్ను దూరంగా పంపిస్తే మీరు ఉండమనేవరకూ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను” అని చెప్తూ నటించడం కాకుండా ఆ చిన్ని పాత్రలో జీవించి చూపించింది.కాకరాల గారంటారు “పాత్రలలో చిన్నా, పెద్దా అని తేడాలుండవు. ప్రతిదీ ప్రత్యేకమైనదే”అని.

అమ్మాయిలందరూ ఎవరికి వారే సాటి అని అనిపించినప్ఫటికీ ఈ సెన్నాపాప కథ చాలా ఆశాజనకంగా ఉండి నాకు విపరీతంగా నచ్చేసింది. అసలు సినిమాలో ఈ పాప కథని నడిపించే సంగతేమిటంటే  “వారియర్ ప్రిన్సెస్ సెన్నా”లా పెరగాలని తండ్రి ఆమెకు ఆ పేరు పెడతాడు. అతను సెన్నాకి పాఠశాలకి వెళ్ళి బాగా చదవాలని చెప్తుండేవాడు. తర్వాత తండ్రి ఒక బంగారు గని మైనింగ్ ప్రమాదంలో మరణిస్తాడు. ఆమె తండ్రి ఆదేశం ప్రకారం స్కూలుకి వెళ్ళడానికి తన శక్తికి మించి ప్రయత్నించి తన కోరికే కాక తండ్రి ఆశయాన్ని నెరవేర్చే దిశగా దృఢ నిశ్చయంతో అడుగులు వేస్తుంది. పౌరహక్కుల సంఘం నాయకుడు పురుషోత్తం గారిని హైదరాబాద్ లోని దిల్ శుక్ నగర్ లో నడిరోడ్డుమీద గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపేస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్ళు పెడితుంటే వాళ్ళ పాప మాత్రం (పదేళ్ళుంటాయేమో) నిబ్బరంగా ఉంది. అస్సలేడవలేదు.”ఏంట్రా, నీకేడుపు రావట్లేదా?” అనడిగితే “బాపు నాకు ఏడవద్దని చెప్ఫాడు” అని చెప్పింది. తండ్రి చెప్పిన మాటను తు.చ. తప్పకుండా పాటించాలనుకునే సెన్నాని చూసినప్పుడు నాకది గుర్తొచ్చింది!

అసలెందుకిలా జరుగుతుంది? ఈ అమ్మాయిలేమీ అసాధ్యమైన, గొంతెమ్మ కోరికలు కోరడం లేదు కదా? ఈ పిల్లలు భావి ప్రపంచపౌరుల కిందికి రారా? వీళ్ళు విద్యావంతులవ నవసరంలేదా? అనే భావాలతో హృదయం తల్లడిల్లిపోయింది.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి “అమీనా” “నా తండ్రి నాకు పెళ్లి ఏర్పాట్లు చేసినప్పుడు నాకు 11 సంవత్సరాలు” అని అంటుంది.

అలాగే తొమ్మిది మంది  బాలికల కథలు తొమ్మిది రకాలైన ప్రత్యేక కథనాలైనప్పటికీ ఇవి ప్రపంచంలోని అన్ని దేశాల్లో సర్వ వ్యాపితమైనవే. ఎక్కడో జరుగుతున్నట్లనిపించవు.మన చుట్టూ మనం చూస్తున్న సంఘటనలే అనిపిస్తాయి!

“ఇంత  అందమైన ప్రపంచంలో అందం,ఆనందాలతో పాటు ఇంత కౄరమైన నీచత్వం ఒకే చోట  ఎలా కలగలిసి ఉంటున్నాయి?” అని అంటుందొక పాప.

“బాలికలు ఎప్పటికీ సమస్య కాదు. వారు అన్నిటికీ పరిష్కారాలు సూచించగలరు. మీరు ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టాలన్నా, ప్రపంచ ఆర్థికపరిస్థితిని మెరుగు పరచాలన్నా అమ్మాయిల్ని చదివించండి” అని అంటుందింకొక అమ్మాయి.

“నేను మా ప్రాంతాల్లో అమ్మాయిల వేలం  పాట విన్నాను.పురుషులను కూడా అలాగే వేలం  వెయ్యండి” – అని ఒక పాప అంటే,

“నావిషయంలో ఏంజరిగిందో ప్రతిదీ నేను మీకు చెప్పలేను. కానీ ఆ హింసను నేను నాజన్మలో మర్చిపోలేను” – అని మరొక అమ్మాయి అంటుంది.

సామాజిక కార్యకర్త మరియాసియర్రా ఒక ఇంట్లో బానిస చాకిరీ చేస్తున్న ఒక అమ్మాయికి స్వేచ్చ నివ్వమని అడుగుతుంది. ఆ యజమాని నిరాకరించినప్పుడు ఆమె వివిధ చట్టాల గురించి వివరించి చెప్పి ఆయన నొప్పించి అమ్మాయికి విముక్తి కలిగిస్తుంది.

“మీరు గనక నన్ను ఆపివేస్తే, నా వెనక లక్షలమంది అమ్మాయిలు ఈ కారణం కోసం పని చేస్తారు”.

“చదువుతో ఏదైనా చేయగలనని భావిస్తున్నాను.ఆడపిల్లల ప్రపంచాన్ని మార్చే శక్తి వస్తుంది”.

“చదువుకుని ఆర్ధికంగా నా కాళ్ళమిద నేను నిలబడగలిగితే నాకు నేనే స్వంత మాస్టర్ నవుతాను”

“నేను మేకల పర్యవేక్షణలో ఉన్నప్పుడు అమ్మాయిల కంటే మేకలే మంచి స్థితిలో ఉన్నట్లనిపించింది”.

ఈ విధంగా అమ్మాయిలు వాళ్ళ వాళ్ళ కోరికల్ని, అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. తమ వ్యక్తిగత బాధామయ ప్రయాణాలను ప్రపంచంతో పంచుకోవడం ద్వారా ఒక్కొక్కరూ ఒక్కో ఉపాధ్యాయురాలి లాగా మారినట్లు ప్రేక్షకులకు కనిపిస్తారు. సినిమా చూచిన వారందరికీ మెరుపు తీగల్లాంటి తొమ్మిదిమంది అమ్మాయిలు మన మనో ఫలకంపై ముద్ర పడిపోతారు. ఆడపిల్ల  చదువుకుని విద్యావంతురాలైతే ఆమె జీవితం లోనే కాక ప్రపంచాన్నే మార్చగలిగిన శక్తి వస్తుందనే ఆశాభావాన్ని కలిగిస్తారు.

ఈ కథ సాధారణమైనదే! ఇది మొదలూ కాదు, అంతమూ కాదు. కానీ ఈ పిల్లల్లో కనిపించే గొప్ప ఉత్తేజం ఆనందం కలిగిస్తుంది. ఒక్కొక్కరినీ చూస్తుంటే శతాబ్దాలుగా చెత్త పోగులో పడి ఉన్న “ఆమె” ఇప్పుడు కటిక చీకటిలో అందమైన మిణుగురుల పంట పండిస్తుందనిపించింది!

ఇది వినూత్నమైన పద్ధతిలో నిర్మించిన ఒక కథా చిత్రం. ప్రపంచ మంతటా ఎదుర్కొనే ప్రమాదకరమైన అసమానతలను విశ్లేషించారు. తీవ్రంగా కలతపెట్టే సమస్యల చర్చలున్నాయి. ఆడపిల్లల సాధికారత, విద్య, సమానత్వాల గురించి చర్చించినప్పటికీ, ఈ అమ్మాయిలు ఎలా దోపిడీ అణచివేతకు గురౌతున్నారో చిత్రించడానికి భయానక శబ్దచిత్రం గా రూపొందించారు. ఎదుగుతున్న తరం కూడా తమ స్త్రీజాతి ఇక్కట్ల గురించి తెలుసుకోవాలని, అవగాహన కలిగించాలని ఒకవేళ వారి తల్లిదండ్రులు ఎవరైనా అనుకుంటే ఈ సినిమా చూపించడానికి  ప్రయత్నించే వీలే లేదు. తమ టీనేజ్ ఆడపిల్లలతో కూర్చుని ఈ చిత్రాన్ని చూడడం గానీ, వాళ్ళకు ఈ కల్లోల పరిస్థితుల్ని వివరించి చెప్పడం గానీ, ఆలోచనలు పంచుకోవడం గానీ కుదరదు. వారి పెద్దలకు చాలా ఇబ్బందిగా అసౌకర్యంగా ఉంటుంది!

ఒక్కో అమ్మాయి కథను కు చెందిన ఆయా దేశాలకు చెందిన ఒక్కో ప్రఖ్యాత రచయిత రాశారు. సామాజిక కార్యకర్త మరియా-సియర్రా గొంతుతో పాటు, ఆయా దేశాల ప్రముఖ నటీమణుల స్వరాలతో కధనాన్ని హృద్యంగా దృశ్యీకరించారు దర్శకులు రిచర్డ్ రాబిన్స్. ఆయన ఆస్కార్ నామినేటెడ్ డాక్యుమెంటేరియన్.

మొత్తానికి పాఠశాలకు వెళ్ళాలని  కలలు కంటున్న  అద్భుతమైన అమ్మాయిలు వీళ్లంతా! ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి బాలికలు 66 మిలియన్ల మంది ఉన్నారని తెలుస్తుంది. ఒక్కోఅమ్మాయి ధైర్యంగా చదువుకోవాలని ఆరాటపడడం చూస్తే ఎవరికి వారు వారి వారి దేశాల్లో విప్లవాలు చేసేటట్లున్నారు !

ఇంత గొప్ప దర్శకులు రిచర్డ్ రాబిన్స్ పిల్లల్ని విప్లవాలనుంచి తప్పించే ప్రయత్నంలో ఉన్నారా అనే విషయం నిరాశ పరిచింది. నిజంగా స్పష్టమైన మూల కారణాలను అన్వేషించే ప్రయత్నమైతే కనిపించలేదు.  రిచర్డ్ రాబిన్స్ బాలికలకు విద్యా, సమానత్వం కోరుతూ పని చేసే  “10” అనే ఒక సామాజిక సంస్థ డైరెక్టర్. ప్రపంచమంతా దీని శాఖలున్నాయి.

“అదిగో చూడండి,అక్కడ పీడితులున్నారు.బాధితులున్నారు” అని చెప్పడానికి అసలు విషయం చెప్పకుండా నిజమైన స్ట్రగుల్స్ నిర్మించకుండా వారిని దిష్టి బొమ్మలుగా చూపిస్తూ తమ భవిష్యత్తుని దేదీప్యమానంగా వెలిగించుకుంటారు కొందరు ఎన్ జీ వో  సంస్థల నాయకులు. పీడితుల వెతల్ని హృదయ విదారకంగా వర్ణిస్తూ మన రచయితల్లాగే అవార్డులూ, రివార్డులూ ఆస్కార్ నామినేషన్లూ సాధించుకుంటారు. కానీ పీడితుల, బాధితుల పరిస్థితులు ఎప్పటికీ మారవు. ప్రభుత్వాలు కోరుకుంటున్నట్లే వీళ్లకు కూడా  యధా తధ పరిస్థితులు  కొనసాగాలి. చిత్ర నిర్మాణాలకు దర్శకులకు,రాయడానికి రచయితలకు మాత్రం వాళ్ళ బాధలు కావాలి,ఆ తర్వాత బాధితులు ఎలా చస్తే మనకెందుకు మన బహుమతులు మనం గెల్చుకోవాలి అని కోరుకుంటారు!

“పిల్లలు స్త్రీలు బలహీనులు.నిరుపేదలు.సమానత్వాన్ని కోరుకుంటారు.బలవంతులకి ఆ ఆలోచనే ఉండదు”- అని అరిస్టాటిల్ 348 B.C.లోనే చెప్పాడు. అప్పటినుంచి ఇప్పటివరకూ హింసను కొనసాగిస్తున్న ప్రపంచ పాలకుల, వారి మద్దతు దార్ల ఘనతను ఏమని కొనియాడాలి?

మానవత్వం అనేది ఏమిటో మచ్చుకైనా తెలియని పెట్టుబడి చేస్తున్న విధ్వంసమిది!మార్కెట్ కి వినియోగదారులుగా పనికిరాని, కొనుగోలు శక్తి లేని పేద ప్రజలను ఏకంగా  మట్టుబెట్టాలని చూస్తుంది. ఈ సినిమాలో కనిపించే అసలు రహస్యం ఇదే! దీనంతటికీ మూల కారణాలైన కేపిటల్ గురించీ, మార్కెట్ గురించీ చెప్పకుండా చేసిన ఈ దృశ్యీకరణ ఎంత బాగున్నప్పటికీ, పేదలపట్ల జరుగుతున్న ఈ ఘోరకలిని మెచ్చుకోలేం!

“సాధారణ ప్రజలు మనకంటే చాలా తెలివైనవాళ్ళు. ఈ కష్టాల వ్యవస్థలో ఎలా బతకాలో వాళ్ళకి తెలుసు.ఎవరూ ఏమీ చెయ్యకపోయినా ఫరవాలేదు. మీరందరూ హాయిగా బతకండి.  కానీ వారి ఉద్యమాలకు వెనకుండి మద్దతు నివ్వండి” అని అంటారు  మహాశ్వేతా దేవి. మన వంతుగా కనీసం అది చేసినా చాలు!

నేనీ సినిమా గోతెజెంత్రం (జర్మన్ ఫిల్మ్ క్లబ్) లో చూశాను.

 

~

మీ మాటలు

  1. చాలా మంచి సిన్మా ..అంటే డాక్యుమెంటరీ అనుకోండి , పరిచయం చేసారు ..మనకెందుకు ? అని దులిపేసుకుని వెళ్ళిపోయే భద్ర లోక ప్రతినిధులం మనం ..మన చుట్టూ ఎందుకు ఇలా జరుగుతోంది ? అని ఒక్క ఆలోచన ఒక్కరిలో రేకెత్తినా ఈయన చేసిన ఈ ప్రయోగం ఫలించినట్టే .ఆలోచన అంటూ విత్తం పడితే అది ఎప్పుడో అప్పుడు ఫలదీకరిస్తుంది అని అత్యాశ ..పడుతూ ..
    మీ సిన్మా పరిచయాలన్నీ చదువుతున్నాను …చూడక పోయినా మీ ప్రయాణంలో పరిశీలుకురాలిగా నిలుస్తూ చాలా సంతోషిస్తున్నాను .
    ధన్యవాదాలు మీకు శివ లక్ష్మి గారూ !!

    వసంత లక్ష్మి

  2. syed sabir hussain says:

    గర్ల్ రైసింగ్ గురించి చదువుతుంటే మనసు ఏదో తెలియని పయిన్ కు గురైంది.ఇలాంటి ఆలోచన మనవాళ్ళు ఎందుకు చేయరు అనిపించింది.మన దేశంలో ఎందరో సేన్నాలు , అమీనలు ఉన్నారు. వారు ఎంతో వేదనకు గురౌతున్నారు.హింసల పలొఉథున్నరు. వారిని ఆ దుస్థితి నుంచి బయట పడేసే పరిస్థితులు కానరావడంలేదు. కనీసం వారిగురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఎంత సేపు బాహుబలి లాంటి రంగుల ప్రపంచం చుట్టూ తిరగడం తప్పిస్తే మన సొచల్లెద్ కళాకారులకు కూడా గుండె తడారి పోయింది.ఈ పఎఇస్థిథి మారాలని కరుకుండం.

  3. Sivalakshmi says:

    వసంత లక్ష్మి గారూ కృతజ్ఞతలు !
    హుస్సేన్ గారూ, మీ ఆవేదన అర్ధమైంది . వాస్తవ పరిస్థితుల్ని గాక వాటిని తలక్రిందులు చేసి హీనమైన విలువల్ని ప్రేరేపించేలా చిత్రీకరిస్తారు మన దేశంలో .అలాగని మనకు ప్రతిభావంతులైన దర్శకులు లేరని చెప్పలేము.వారు తీసినవి చాలా తక్కువగా తళుక్కుమంటాయి.ఈ లోపల మురుగు నిర్విరామంగా ప్రవహిస్తూ ఉంటుంది!
    “పరదేశి” అనే ఒక మంచి సినిమాకి నలుగురం మిత్రులం కలిసి వెళ్ళాము.ఒక్కొక్క గ్రామం నుంచి మొత్తం మనుషుల్ని కూలీలుగా తీసికెళ్తూ, దారి మొత్తం తిండీ,తిప్పలూ లేకుండా నడిపించి తీసికెళ్ళే యజమాని చాలా కౄరంగా ప్రవర్తిస్తాడు. శీతోష్ణ పరిస్థితుల్ని,ఆకలి బాధల్ని తట్టుకోలేనివాళ్ళు చాలామంది దారిలోనే చనిపోతారు.గమ్యం చేరాక నెలంతా గొడ్డు చాకిరీ చేసిన వారికి జీతం ఇచ్చే ముందు,”ఒక కప్పు టీ ఇచ్చాననీ,ఒక గోలి మందు ఇచ్చాననీ- ఇలాంటివే ఏవో కారణాలు చెప్తూ మొత్తం జీతంలో కోత పెట్టి, రూపాయో,అర్ధ రూపాయో చేతులో పెడతాడు దుర్మార్గపు యజమాని .కూలీల కడగండ్లనూ,యజమానుల వికృత మనస్తత్వాన్నీ ఎన్నో నరక యాతనలను ఓర్చుకుని నిజాయితీగా చిత్రీకరించారు డైరెక్టర్.ఈ సినిమాకి ప్రేక్షకులే లేరు!థియేటర్ మొత్తంలో మేము నలుగురమే ప్రేక్షకులం!
    సమాజ హితం కోరి సినిమాలు తీసే దర్శకుల్నీ, మంచి సినిమాలు చూడడానికి సంసిద్ధత ఉన్న ప్రేక్షకుల్నీ వెతుక్కోవలసిన పరిస్థితుల్లో ఉన్నాం!

Leave a Reply to వసంత లక్ష్మి .పి . Cancel reply

*