నీళ్ళూ నిప్పులే!

 

-బమ్మిడి జగదీశ్వరరావు

~

ఒరేయ్ రాజుగా..!

యెలాగున్నావురా? వూరొదిలీసావు కదా యెలాగుంటావ్? బాగనే వుండుంటావులే! బాగుపడక పోయినా చెడిపోకుండా మాత్రం వుండుటావ్!

వదిలేసినోడి పెళ్ళాం యెవడితో పోతే యెందుకన్నట్టు.. వూరు వొగ్గేసాక యెలాపోతే అలాపోనీ అని అనుకోక వూర్లోని కబుర్లు రాయమని వుత్తరం రాసావ్! ఫోన్లో మాట్లాడితే చాలదా.. చేదస్తం కాకపోతే అని అనుకున్నాన్రా.. కానోరే- యివి ఫోన్లో మాట్లాడేవి కావురా, వుత్తరం రాయాల్సిందే..! వూరూసులు నీకు చెప్పాల్సిందే..!

వూరికి కరువొచ్చింది! అలాటి యిలాటి కరువు కాదు! కాటకము లాటి కాటకము కాదు! గింజకు కరువైతే పంటకు వుంచిన యిత్తనాలు తిన్నాము! గడ్డికీ గాదాముకీ కరువొస్తే పసులను కబేలాలకి పంపించీసినాము! వూరికి మరిడొస్తే మహంకాలమ్మకు దిష్టితీసి దండవెట్టి ముడుపులుగట్టి మొక్కులుదీర్సి సంబరాలుసేసి సచ్చినోల్లని సాపల్ల జుట్టి వల్లకాడుకు యీడ్సినాము! పూడ్సినాము!

ఏ తల్లి దయ చూపినా గంగమ్మ తల్లి దయ చూపడం లేదురా.. శివయ్య నెత్తిమీద నుండి గంగమ్మని దించడు గావాల.. అతగాడికి సల్లదనం సాలదు గావాల.. అనీసి నలుగురం అనుకోని, ఆడుకోని.. యింటికి పది బిందిలు.. వంద గడప.. వంద యిళ్ళు.. మొత్తానికి యెక్కడెక్కడ్నుంచో నీళ్ళు తోడుకొచ్చినాం.. సేతులు బొబ్బలు కాలు బొబ్బలు.. ‘దేవుడు దిబ్బయిపోయిన దేవుడు’ అని తిట్టకోకుండా వోపిక పట్టినాం.. సుమ్మగుడ్డ నెత్తి మీన  యెట్టుకోని బిందిలికి బిందిలు మోసినాం.. కావిళ్ళు యేసినాం.. బళ్ళు పూసినాం.. పులిసిపోనాం.. పులకించిపోనాం.. పంతుళ్ళ మంత్రాలొకపక్క.. జంగమోడి శంఖమొకపక్క.. దీపాలు దూపాలు.. ఆరతులు ఆబిసేకాలు.. అది కళ్ళు తోటి చూడాల్సిందేరా.. చెప్పనలవయితే గాదు.. వూరందరం గలిసి మనూరి శివాలయంలో శివుడి నెత్తిమీద వెయ్యిన్నొక్క కుండల నీళ్ళు కుమ్మరించినాం.. గర్బగుడిలోంచి నీళ్ళు పోకండా స్నాన మట్టం ముందలే మూసీసినాం.. ద్వార ప్రవేశకాల దగ్గర కన్నాలు కలిపి వొగ్గకుండా బిరడాలు సుట్టి పెట్టి మూసీసినాం.. నీళ్ళు యెట్నుంచి పోకండా చేసీసినాం.. యేటవుద్ది? శివలింగం ములిగిపోయింది..! దేవుడికి వూపిరాడక వుక్కిరి బిక్కిరి అయిపోయి.. ‘ఓళ్తల్లో.. గంగమ్మ తల్లో.. వూపిరి సలపడం లేదు, దిగి బేగి అవతలికి యెల్లే..’ అనీసి శివుడు అంటాడు గావల.. గంగమ్మతల్లి గంగ వెర్రులెత్తుకోని మేగాలంట పరుగులెట్టుకోని బూమ్మీదకి అడ్డగ దిగిపోద్ది గావాల.. వర్షాలు కుండపోతగా కుమ్మరించేస్తాయి గావాల.. దబ దబమని దబాయించి అంచెట్టకుండా బాదికెలిపోద్ది గావాల.. వానలు వరదలై యెత్తి ముంచేస్తాది గావాల.. కరువుదీరా కసిదీరా కురుసేస్తాది గావాల.. కరువు తీరిపోద్ది గావాల..

వానల్లు కురవాలి వానదేవుడా!

వరిసేలు పండాలి వానదేవుడా!

సెర్లన్నీ నిండాలి వానదేవుడా!

మడ్లన్నీ పండాలి వానదేవుడా!

కప్పలకు పెళ్ళిళ్ళు వానదేవుడా!

గొప్పగా జరగాలి వానదేవుడా!

అనీసి పాడీసి.. ఆడీసి.. గెంతీసి.. కప్పలకి పెళ్ళిళ్ళు చేసీసి.. ముత్తైదువులు పేరంటాళ్ళు మండోదరికి పూజలూ పునస్కారాలూ చేసీసి.. యిలాగ బూమ్మీద యెన్నున్నాయో అన్నీ చేసిసి.. వూరు వూరంతా కిందా మీదా పడిపోయినా గంగమ్మ తల్లి దిగలే! మొగుడు నెత్తినెక్కించుకుంటే దిగుతాది? యే యాడదాయన్నా దిగుతాది? నువ్వయినా సెప్మీ?

యారళ్ళ పోరు పడలేనని పార్వతమ్మ యెదురుతిరిగినా బాగుణ్ను! మొగుడా.. శివుడా.. గంగని యిడిసిపెట్టురా అనీసి అలనాడు సేసినట్టు గోల గోల గొల్లు గొల్లు సేసినా బాగుణ్ను! శివుడికి సిగ్గయినా వచ్చును! యిడిసీ పెట్టును! మనూర్ల ఆడోలు నాలికలు అరిగిపోయినట్టు మాట్లాడుకున్నారు గాని సుక్క పడ్లే! సినుకు కుర్లే! యెప్పటిలాగ యదావిది.. సిద్దిరస్తు..!

కప్పలు అరిస్తే వానలు కురుస్తాయంటారు.. సెర్ల నీళ్ళే లేవు! కప్పలు యెక్కడి నుండొస్తాయి? అప్పుడికీ మనోలు యెక్కడికో యెల్లి కప్పల్ని పట్టుకొచ్చినారు! కొండమీది కోతే మందంటే తేవాల గదా? తెచ్చిన కప్పల్ని అరండే అంటే అరుస్తాయీ? సెప్పితే నీకు అబద్దము, నాకు నిజిము.. ఈలు మనోలు బెక బెక మనడమే గాని కప్పలు అరేలేదు.. అరుపులు నేర్పించినా అరలేదు! మూగి కప్పల్లాగ కియ్ అనలేదు.. కయ్ అనలేదు! ‘యేమే కప్పా అరవూ.. అంటే నానోటి నిండా నీళ్ళున్నాయని..’ సామెత! నీళ్ళూ లేవు! అరుపూ లేదు!

పుర్రాకులు యెన్ని పడినా గుక్కెడు నీళ్ళకి గుటుక్కుమన్నట్టుగుంది బతుకు!

మన వూరి పెద చెరువు యెండిపోయింది! చిన్న చెరువూ యెప్పుడో యెండిపోయింది! తూరుపున వున్న గుండం యింకేపోయింది! పడమరన వున్న బట్టి యెండిపోయి యిటికల బట్టీ అయిపోయింది!

మనూరి బోర్లు యెండిపోయినాయి! బావిలు యెండిపోయినాయి! మంచినీలకు కష్టమంటే కష్టం కాదు! కనా కష్టంగుంది! యమ యాతనగుంది! యిప్పుడు యెలక్షన్లు వున్నా బాగుణ్ను! సర్కారు పట్టించుకున్ను! మనం దిక్కులేని పక్షుల్లా చచ్చినా యిప్పుడు యెవుడుకీ పట్టదు! మీ చావు మీరు చావండి అని వదిలేసినారు! మనూర్లదాక మజ్జిక పేకట్లు రాలే! అయినా మజ్జికతో కడుపు నిండుతాదా? మంచినీళ్ళతో దినమెళ్తాదా? యేమంటే ‘చెట్టూ – నీరు’ పోగ్రాముకి రమ్మంటారు.. మనుషులకే నీళ్ళు లేవు.. మోడులకి నీళ్ళు యెక్కడి నుండి తెచ్చి పోసీది?

ఊళ్ళో ట్యాంకులతో నీళ్ళ అమ్మకం లేదు! మనూరోలికి కొనే తాహత్తు లేదనేమో ట్యాంకులోల్లు పట్నం  పోయినారు! ఎక్కడైనా గిరాకీయే గాని అక్కడైతే వొక రూపాయి యెక్కువకి అమ్ముకోవచ్చు! నాల్డబ్బులు సీజన్ల సంపాదించుకోవచ్చు! ఆల యాపారాలు ఆలవి! కాదని అనగలమా? ఆపగలమా?

గోర్జిల నంద నుయ్యి వుందికదా.. మనం స్నానాలు చేసీవోళ్ళం.. ఆడా మగా పిల్లా పిచ్చుకా అందరం అక్కడే కదూ! కళకళలాడే నుయ్యి! నుయ్యికాడ నీళ్ళుతోటి యెన్నెన్ని కతలు తెండీ వోరని?! నీళ్ళు పట్టుకొని యెల్లగానే యెల్లినమ్మ మీద అమ్మలక్కల వూసులు! వయిసిన గుంటల సూపులు గునపాల్లాగా వుండీవి కావూ?! ఓలి మరదలా బీపి రుద్దిమీ.. బాగా రుద్దినావంతే మీ యప్పకి సెప్పి పెళ్ళాడేస్తాన్లే.. యిద్దరు సక్కన వుందురు.. యికటాలు! ఓరే గండా.. మనవడా.. నన్ను పెళ్ళాడుతావేట్రా అని ముసిలమ్మల ముసిముసి నవ్వులు! వోరి గొల్లిగా నూతిలోని నీలన్నీ తోడేస్తావేటి?, ఆపిల్ల వూరెల్లింది, యిప్పుడప్పిడే రాదు.. సిగ్గుపడి సేద వొదిలీసి పరుగులు.. పరాసికాలు! నుయ్యి నూర్రకాలుగా వుండీది.. నవ నవ లాడీది!

యెలాటి నుయ్యిరా అది.. రెండు బారలకే నీళ్ళందీవి! పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు ఫంక్షన్లు గింక్షన్లు అన్నీ ఆపీది! అది కూడా వెలవెలబోయింది! తొంగి చూస్తే అడుగు కనిపిస్తోంది! అడుగంటీసింది! మట్టి తీతుమన్నా కళ్ళు తిరిగిన లోతు! ముంత వొలకబోసినట్టు నీళ్ళు! చిన్న పిల్లాడు వుచ్చపోసినట్టు వూట! జల యింకి పోలేదు! తగ్గిపోయింది! పొయ్యి పొక్కల్లలా మూడు పక్కలనుండి మూడు వూటలు! వూరిని.. వందగడపని.. కొంత కాకపోతే కొంతయినా కాపాడుకొస్తోంది ఆ నుయ్యమ్మ తల్లి!

‘పెపంచకంల వున్ని నుయ్యిలన్నీ యెండిపోయినా మన గోర్జి నుయ్యి యెండదురా..’ అనీసి కంచరాన అచ్చమ్మ అనీది.. ఆ ముసిల్ది వంద నిండినదాక వుండి కొండెక్కిపే! పిచ్చికలాటి మనిషి! ముంతడు అంటే ముంతడు నీలు తోటి తాన్నం జేసీసి బట్ట కూడా తడిపీసీది.. ఆ మారాజు కూతుర్ని తలవనోలు లేరనుకో! యెందుకని అడుగు? నీల కరువుకి.. దేవుడికి నీలదార తియ్యడమే మరిసిపోయిన కాలంలో అచ్చేమ్మే ఆదర్శము గదూ? ‘ముంతడు నీలల్ల ములిగి సచ్చిపోడమేటో’ సాస్త్రం యిప్పుడు బోదపడింది!

తడిగుడ్డతోటి వొళ్ళు తుడుసుకోడం తప్ప తాన్నాలు లేవు! ‘పులులూ సింహాలూ రోజూ తానమాడుతాయేట్రా?’ అనీసి నీల్లున్నప్పుడే నెలకీ పదికీ తాన్నం జేసే మన సావాసగోడు కామేసు లేడూ.. ఆడ్ని అందరం యెక్కిరించీవోలిమి గదా..? ఆడిప్పుడు ‘సెయ్యండిరా.. తలారా తాన్నాలు సెయ్యండిడ్రా!” అని యెక్కిరించి నవ్వుతున్నాడు. ‘మనిషి అంటే జంతువే, జంతువుల్లాగా బతకండి..’ ఆడు యెకసెక్కానికి అన్నా గాని.. నీళ్ళు కాదు గాని మనషులు మనషులుగా మిగిలినట్టు లేరు.. ఆ కత కూడా చెపుతాను విను..

ఊరంతటికీ వంద కుటుంబాలకి గోర్జి నుయ్యే దిక్కు! పూటకి యిన్నీ యిన్నీ నీల్లవుతున్నాయి.. లేదనడానికి లేదు! అయితే అవి అందరికీ చాలవు! కొట్టుకు చచ్చినా చాలవు! కత్తులు నూరినా చాలవు! కేసులు పెట్టుకున్నా చాలవు! నాను ముందొచ్చినాను అనంటే నాను ముందొచ్చినాను అని కయ్యాలు! కళ్ళు అగుపడవా.. పిల్లడ్ని పెట్టి యెల్లినానని వొకమ్మ, మీ నయనాలు తీసి గైనాన దోపుకున్నారా.. బింది పెట్టి యెల్లినానని వొకమ్మ! రాత్రి తెల్లవార్లూ నుయ్యి దగ్గరే జాగారం జేసి సచ్చినానని మరకమ్మ, నీకు మొగుడు లేడు.. నువ్వు నుయ్యిదగ్గిరే పడుకుంటే అవుతాది, నాకు మొగుడున్నాడు.. ఆడి పక్కన పడుకోపోతే అవుతాదా.. అని యింకొకమ్మ! నీకంతే సంసారం లేదు, సన్నాసిలాగున్నావు వొంటిగ.. మమ్మల్నీ సన్నాసరకం సెయ్యమంటావా.. సంసారరకం వొద్దంటావా.. చెప్పు మానేస్తాను.. అనంటే- అయితే మానియ్యే, నా మాట మీద యేటి రోటి పోస్తావు.. అని అలగన్నాదోలేదో- మరి నువ్వొచ్చి నామొగుడు పక్కన పడుకోయే.. అనంటే- ఆ గుడిసేటోడు దగ్గిర నీనేల పడుకుంటాను అని.. నా మొగుడు గుడిసేటోడా?.. వొవ్వో గొడవ! ఓసి నువ్వెవులెవులకాడ పడుకున్నావో నాకు తెల్దా? అంతకంటే నా మొగుడు యేటి తక్కువ అనంటే- నువ్వే గాల మా పక్కలు యెత్తినావు అని- నీనేనికి యెత్తుతాను?, లంజలవల్ల.. అనంటే- లంజా లమ్మిడీ.. రామాయణ భారత భాగవతాలెల్ల చదివేసింది చాలక.. జుట్టులు పట్టుకున్నది చాలక.. యేడు తరాలు యెక్కబీక్కున్నది చాలక.. కాంతలందరూ మొగుళ్ళ మీద పడ్డారు. నువ్వు సేత్తక్కువోడివి కాబట్టి ఆ నంజ అన్ని పేలతంది.. నీ నోట్ల యేటున్నాది.. దనిమీద నీకు యేటి లేకపోతే యెందుకడగవు? అని వొక పెళ్ళాం పేచి. నాకు దానిమీద యేటుంది? అని మొగుడు. రోకు అని పెళ్ళాం. మొగుడూ పెళ్ళాల గొడవలు. పిల్లలు మద్దిలో యేడిస్తే పిత్త సిరగ బాదీడిం.. కాదంటే దుడ్డుగర్రలు పుచ్చుకొని యెప్పుడువో పాత పగలు పెట్టుకోని బాగారుల్లాగా యిప్పడు తలలు బద్దలు చేసుకోవడం.. యికనేటుంది? కట్టులూ.. బెండేజీలూ.. ఆస్పెటిల్లూ! పోలీసులూ.. కేసులూ.. కోర్టులూ! సాచ్చికాలు యిస్తే వొక తప్పు! యివ్వకపోతే యింకొక తప్పు! యెటెల్లినా తప్పే! యెల్లక పోయినా తప్పే! నీళ్ళు కాదుగాని వూరు నిప్పుల గుండమయిపే!

యికన యిలగ లాభం లేదని వూరి పెద్దలందరూ కలిసి వుమ్మడిగ యేటి సేద్దాము అనంటే యేటి సేద్దాము అనుకోని వొక తీరుమానం చేసినారు! వూర్ల వున్నవి వంద యిళ్ళు.. వంద కుటమాములు.. కాబట్టి వంద అంకెలు చిట్టీలు రాసి.. చీటీ పాట లాగ యేసి.. వొకటోకటి చిట్టీలు తీసి.. యే నెంబరికి ముందొస్తే ఆలకి ముందు నీలకి అవకాశమిచ్చి.. చీటీల వారీగా వొకరి తరువాత వొకరికి అందరికీ వూరందరికీ వందమందికీ అవకాశము యిచ్చినారు! యింటికి రొండు బిందిలు నీలు! వొక ట్రిప్పు అవడాకి రొండొందలు బిందిలు కావాల! పూటకి నుయ్యిల పది బిందిలు నీల్లూరినా రొండుపూటలా కలిపి యిరవై బిందిలు.. మరీ పెద్ద బిందిలు తెస్తే కాదు, వొక్కలు యెత్తికెల్లగలిగిన బిందే.. పది రోజుల్లల్ల అందరికీ అవకాసమొస్తాది.. రొండో ట్రిప్పు మళ్ళా పదిరోజులకే! వొకేల ముందు ట్రిప్పుల ముందే వొచ్చి యెనక ట్రిప్పుల యెనకే వొస్తే నడుమ దూరానికి నట్టేట్లో మునిగినట్టే! యేటో బతుకు పీనుగుల పెంటయిపోయిందనుకో!

అందరూ వైష్ట్నమయ్యిలే.. గాని దాకలో రెయ్యిలు మాయమయిపోయినాయట.. అలగుంది యవ్వారం! అందరూ మంచోల్లే.. మంచోడి బుద్ది మత్స మాంసాల కాడని సామెత. మంచినీళ్ళ కాడా అంతే! యే రేతిరప్పుడు యెవలు తోడికేలిపోతే? దొంగల్ల దోపల్ల ఆపని చేస్తే? చేస్తే కాదు.. చేసినారు! వూరిల నీటి దొంగలు బయలెల్లినారు! కన్ను సేరేస్తే సేన! సత్య పెమానకాలు చేసేస్తన్నారు, మేం కాదంటే మేం కాదని! తెల్లారితే నుయ్యిల నీలు మాయం! యిలాక్కాదనీసి కొత్త చెప్పులు నాలు జతలు తెచ్చి నూతి మీద యేలాడేనాగ కట్నాం! ‘నీళ్ళు దొంగతనం చేస్తే చెప్పు దెబ్బలు తింటారు’ అని నంద మీద నల్లటి మసిబొగ్గుతో తాటికాయంత అచ్చరాలతో రాయించినాం! అయినా గాని నీళ్ళ దొంగతనం ఆగలే! అరే రేతిరి పూట కాలు మడుద్దుమని లేస్తే తప్పు! వుచ్చకో దొడ్డికో పొతే కూడా నిజంగానే పోతన్నాడా లేదా అని పోసినదాక ఆగి, యెల్లినదాక ఆగి అప్పుడు చూసి గాని వొదిలేది లేదు! నీడలాగ పెతీ వోడికీ యింకోడు కాపలా! నిద్దర్ల నడిసే అలవాటున్న అప్పడినయితే కొట్టేన్రు కూడా! రేతిర్లు కక్కుర్తి పడ్డ ఆడా మగా కయితే అడ్డుకట్ట పడిపే! లాభం లేదని మళ్ళీ ఆలోచన జేసి.. యింటికి యిద్దర్ని నుయ్యికాడ రేతిరిపూట కాపలా వుండీలాగా డూటీలు యేసుకున్నాం! యెవులుకి యే రోజు కావాలో ఆరోజే డూటీ చేసినట్టు సర్దుబాటు చేసుకున్నాం! అందరూ మేముంటాం అంటే మేముంటాం అంటే.. మళ్ళీ అనుమానం.. కాపలా వున్నోలుగాని రేతిరిపూట కుమ్మకైపోయి గాని నీలు మోసికెలిపోతే? అమ్మో.. యింకెవులికి పడతాయి నిద్దర్లు? రోజూ శివరాత్రే! రోజూ జాగారమే!

నీలు లేవు! నిద్దర్లు లేవు! నీలకి కాపు! నూతికి కాపు! మనిసికి కాపు! కాపు వున్నోడికి కాపు! చీమ చిటుక్కుమంటే చాలు.. అబరా గుబరా లేసి నుయ్యికాడికి పరుగే పరుగు! నీలు కాదుగాని యెవులూ యెవల్నీనమ్మడం లేదు! వూర్ల నీల్లారిపోయినట్టు నమ్మకం ఆరిపే! నీలు లేపోతే యెంత ప్రమాదమో.. నమ్మకం లేపోతే అంతే ప్రమాదం గదూ? మనూర్ల అప్పయినా తనకాకయినా ప్ర్రాముసరీ నోట్లు రాసుకొని యెరగం! అంతనమ్మకం! అలాటిది గాచ్చారం కాపోతే నీటి తిత్తవ వూరి తిత్తవని పూరా మార్సీసింది! నిప్పుని ఆర్పడాకి కదా నీలు! నీలే నిప్పయితే? అయితే కాదు, అయ్యింది! వూరంటుకుంది! తగలబడిపోతోంది! నీలు కావాలి! నీలు కురవాలి! నిప్పు ఆరాలి! నీలు తాగాలి! దప్పిక తీరేలా నీలు తాగాలి! మలినం అయిపొయినాము గదూ? ఆ కుళ్ళూ కుతంత్రం కడగడానికి నీలు కావాలి! కన్నీలు కడగడానికి నీలు కావాలి! నీలు కావాలి! స్వచ్చంగా మనిసి మెరవడానికి నీలు కావాలి! నీలు కావాలి! నీలు కురవాలి!

తుఫానట! తీవ్ర వాయుగుండమట! బతుకు గండమట! మూడో నెంబరు ప్రమాద సూచిక యెగరేసారట! వూరికి తుఫాను యెన్నడో వొచ్చింది! అతలాకుతలం చేసింది! యీ తుఫాను వొక లెక్కా? లెక్కే! తుఫానొస్తే వానలు వస్తాయి! అదే తెలిసిన లెక్క! గాలోనయినా అది నీలోనే! నీల వానే! యీదురు గాలులు గంటకి నూటిరవై కిలోమీటర్ల వేగంతో వీస్తాయట! వియ్యనీ! యెలాగోలా వాన కురిస్తే చాలు! ఆకశాన హరివిల్లు మెరిస్తే సేన!

ఉరుము వురికి వస్తే బాగున్ను! మెరుపు మేగాలను చీల్చితే బాగున్ను! దాక్కున్న నీలు దబదబ కింద పడిపోను! పిడుగు పడింది! పడనీ! అర్జునా ఫలుగునా అంటే ఆగుతుందా? పిడుగులతో పాటు యింత వర్షం కురిస్తే బాగున్ను! అల్పపీడనం అటెటో తిరక్కుండా వున్నా బాగున్ను! తిరిగి వొస్తే బాగున్ను! తడిసి ముద్దయితే బాగున్ను!

అరే.. గాలి తేలిపోయింది! మబ్బూ తేలిపోయింది! మసాబు తేలిపోయింది! వానా తేలిపోయింది! ప్రాణం పోయింది! చినుకు కురవాలి! చిగురు తొడగాలి! మొక్కలే కాదు, మోడులైన మనుషులు తిరిగి మొలవడానికి! మొలకెత్తడానికి!

వానోస్తేనే.. తిరిగి నీకు వుత్తరం రాస్తాను!

అంతవరకూ సెలవు!

యిట్లు

నీ

నేస్తం!

మీ మాటలు

 1. D Subrahmanyam says:

  ఇప్పుడున్న నీళ్ళ ఎద్దడి గురించి మీదయిన శైలి లో రాసారు బజర గారు. అభినందనలు .

 2. కె.కె. రామయ్య says:

  తెల్ల దొరల చల్లని పాలన కాలంలోని కరువు కాటకాల లాగే, నల్ల దొరల పాలనలోనూ నీళ్ళకి ఎద్దడి, నీటి సుక్క పంచుకోవటానికి ఇరుగు పొరుగు రాష్ట్రాల సిగపట్లు. కుళ్ళూ కుతంత్రం కడగడానికి నీలు కావాలి అన్న’బజరా’ గారికి అభినందన అభిషేకాలు.

 3. Veerabhadrappa choppa says:

  Chaka baagundi

 4. రామకృష్ణ says:

  చాలా బాగా వ్రాశారు,అభినందనలు.

మీ మాటలు

*