ఎట్లా ఉన్నది అక్కడ?

 

అనగనగా ఒక నగరం.

నగరం అంటే నగరం కాదు.

బ్రహ్మాండమైన నగరం.

అలాటిలాటి నగరం కాదది.

సాక్షాత్తూ విశ్వనాథుడి నివాసం.

జటాజూటవాసిని, గంగానమ్మవారి తీరం.

ఆ తీరంలో ఆ పురం.

ముల్లోక పూజ్యం.

సకల సద్గుణం.

సకల విద్యాపురం.

పేరు కాశీపురం.

ఆ పురానికి ఒక రాజు.

చాలా గొప్ప రాజుగారు.

సద్గుణ విరాజమానుడు.

ధర్మనిరతుడు.

పేరు విక్రమసింహుడు.

పేరొక్కటే విక్రమం కాదు.

అన్నిట్లోనూ త్రివిక్రముడే.

అందులోనూ సింహంలాటి వాడయ్యె.

ప్రజలకు లోటేమి ?

అసలైనా శాస్త్రాలెం జెపుతయ్?

**************************

రాజాదైవతరూపేణ

కామధేనుశ్చ మంత్రిణః

పరివారం కల్పవృక్షంచ

యథారాజాతథాప్రజాః

 

రాజారాక్షసరూపేణ

వ్యాఘ్రరూపేణ మంత్రిణః

పరివారం శ్వానరూపేణ

యథారాజాతథాప్రజాః

**************************

అని కదా!

మరి మనవాడేమో దైవతరూపేణ గా ఉన్నాడయ్యె.

ఇహ ప్రజలెట్లా ఉంటారు ?

తథాస్తుగా ఉంటారు.

అంతేగా మరి ?

అంతే అంతే.

 

అలాటి రాజుకు కష్టమొచ్చిందయ్యా?

ఏవిటి కష్టం?

పిల్లల్లేకపోటం.

ఆ రోజుల్లో పిల్లల్లేకపోటం అంటే చాలా నామోషి.

ఇప్పటి చైనా వాళ్ళలా ఇబ్బడి ముబ్బడిగా ఉండాలన్నది అప్పటివారి కోరిక.

అంతకు కాదంటే మనవాళ్ళల్లా ఇబ్బు మబ్బుగానన్నా ఉండాలని కోరిక.

అందువల్ల ఏం జేసాడాయన ?

పిలిచాడు!

ఎవరిని ?

జ్యోతిష్యులని, శస్త్రాధికారుల్ని.

అడిగాడు.

ఏవిటీ సంగతి అని.

చార్మినారు రేకులు అప్పటికి లేవు కాబట్టి జ్యోతిష్యులేమి చెప్పలేకపొయ్యారు.

శస్త్రాధికారుల్ని అడిగితే శాస్త్రం మాకు తెలీదు సార్, మీలో లోపం మటుకు ఏమీ లేదు అన్నారు.

శస్త్రాధికారులంటే, శాస్త్రాధికారులనుకొని పొరబడేరు, కాదు కాదు వారు ఇప్పటి డాక్టర్లండోయ్

అప్పుడయన ఇలాక్కాదు సంగతి అని, సరాసరి విశ్వనాథుడి దగ్గరకెళ్ళిపోయాడు.

దగ్గరికెళ్ళిపోయి స్తోత్రం చేశాడు.

శివయ్య రాలా.

అరే, ఇదేమిట్రా నాగతి. ఈయన రాపోతే ఇక్కడే తలపగలగొట్టుకుని చచ్చిపోతానని ఆయన్ని కావలిచ్చుకుని కూర్చున్నాడు.

అలా ఆయన్ను పట్టుకుని విడవలా.

ఎంత విగ్రహమైనా భక్తితో పట్టుకుంటే అసలాయన్ని పట్టుకున్నట్టే.

పైగా పట్టుకుని విడవకపోతే ఇంకోళ్ళెలా పట్టుకుంటారు ?

అమ్మవారేమో అయ్యవారి పక్కనే ఉంటుందాయె.

ఇలా ఈయన ఆయన్ని పట్టేసుకుని కూర్చుంటే ఆవిడకు పట్టు దొరకట్లా.

అమ్మవారికి ఇక విసుగొచ్చింది.

ఇదేవిటండీ ఇలా మిమ్మల్ని కావిలిచ్చుక్కూర్చుంటే ఎట్లానని.

శివయ్య తత్తర బిత్తర పడ్డాడు.

అమ్మకు కోపం వస్తే ఇంకేవన్నా ఉందీ ?

గగ్గోలు గందరగోళం అయిపోదూ ?

అదంతా ఎందుకని నీకేవిటి కావాలి అని అడిగాడు విక్రమసింహుణ్ణి.

ఆయనన్నాడు, అయ్యా! దేవరా! నాకు సంతానం కావాలి అన్నాడు.

సరే ఇంక కొన్ని రోజులాగు, నీకు సంతానం కలుగుతుంది. ఇంక నన్నొదిలెయ్ అన్నాడాయన.

పట్టు వదలని విక్రముడు పట్టు వదిలాడు.

శివయ్య హాపీసు.

అమ్మవారు హాపీసు.

ఆ తర్వాత కొన్ని రోజులకు విక్రముడు హాపీసు.

ఎందుకు ?

ఒకరు కాదు, ఏకంగా ముగ్గురొచ్చారు.

కూతుళ్ళ రూపంలో.

అంబ, అంబిక, అంబాలిక పుట్టారయ్యా..

పుట్టారు, పెద్దవాళ్ళయ్యారు.

అందరూ కూతుళ్ళే కావటంతో వాళ్ళనే కొడుకులనుకుని కత్తి యుద్ధాలు, అస్త్ర విద్యలు అన్నీ దగ్గరుండి నేర్పించాడు విక్రముడు.

అందులో అంబ చలాకీదవ్వటం వల్ల, చటుక్కున మెలకువలన్నీ పట్టుకుని ఆరితేరిపోయింది.

సరే ఆటలు, పాటలు పక్కనబెడితే – కూతుళ్ళు గెడకర్రల్లా పెరిగిపోవటంతో పెళ్ళీడుకొచ్చారు అన్న సంగతి తెలిసిపోయింది.

పెళ్ళంటే మటాలా?

అందులోనూ యువరాణులు.

పైగా కాశీరాజు కూతుళ్ళు.

సరితూగేవాడు కావొద్దూ ?

సరితూగేవాడు రావొద్దూ ?

అలా వచ్చేవారకూ కొంతమంది ఎదురు చూస్తారు.

అలా కుదిరేవరకూ కొంతమంది ఎదురు చూడరు.

అలా ఎదురు చూడకూడదని డిసైడు అయిపోయినవారి లిష్టులో అంబ చేరింది.

అలా చేరటానికి ఒక కారణం వున్నది.

ఆ కారణానికి కారణం యవ్వనం.

అవును యవ్వనమే.

యవ్వనమంటే కలకలం, కిలకిలం.

కిలకిలలతో కళకళలాడుతున్న కాలంలో ఒకరోజు అంబ ఒక ఉద్యానవనానికి వెళ్ళింది.

ఉద్యానవనానికి యువరాణులు మామూలుగా వెళతారూ ?

బోల్డంతమంది చెలికత్తెలు వగైర వగైరా.

అలా అక్కడికెళ్లినప్పుడు సౌంభపురానికి రాజైన సాళ్వుణ్ణి అక్కడ చూసింది.

సౌంభపురం అంటే ఇప్పటి పంజాబులో ఒక ప్రాంతం.

కాశీకి కాస్త దగ్గరే.

సాళ్వుడు కూడా యవ్వనంలో వున్నాడు.

నాన్న ఆజ్ఞప్రకారం దేశాటనలో పడ్డాడు.

రాజు కాబోయేముందు అలా దేశాటన చేసిరావటం ఒక ఆచారం.

అలా అలా తిరుగుతూ కాశిపురానికి వచ్చాడు.

యువరాజు, అందునా అందగాడు.

విక్రమసింహుడు సాళ్వుడొచ్చిన విషయం తెలుసుకుని ఆతిథ్యం స్వీకరించబ్బాయ్ అని ఒక భవంతిలో కూర్చొబెట్టాడు.

రోజంతా భవంతిలో కూర్చుని విసుగొచ్చి సాళ్వుడు అమ్మాయిగారొచ్చేసమయానికే వ్యాహ్యాళికి వెళ్ళాడు.

అటో ద్వారం.

ఇటో ద్వారం.

అటు పక్క అంబ.

ఇటు పక్క సాళ్వుడు.

అటుపక్కన ఉన్న అంబ ఎలా ఉందిట?

ఎలా ఉంది ఆ సౌందర్యవతి ?

ధగధగ మెరిసిపోయే తెల్లని చీర

చేతులకు గాజులు

కాలికి అందెలు

జబ్బలకు కడియాలు

మధ్య పాపట

దమ్మిడీ అంత బొట్టు

మెళ్ళో ఆభరణాలు

కోరకొప్పు

కొప్పుగొలుసులు

ఈ కొప్పుల గురించి కుమార సంభవంలో “పలుచని పూతలున్ మెరుగుబండ్లును నున్నని కోరకొప్పులున్ బొలకువ తీపు జెన్ను బొరపొచ్చెము బొచ్చము కాగ మాయలన్ లలనల దేర్పజూచు” అంటూ ఒక మాంచి మాట ఉన్నది

మరి ఇటుపక్కన ఉన్న సాళ్వుడు ఎలా ఉన్నాడట?

ప్రచండంగా ఉన్నాడు

విక్రమం ఉట్టిపడుతున్నాడు

మార్తాండమండల తేజంతో వెలిగిపోతున్నాడు

తీరైన తల

ఆ తల మీద పాగా

ఆ పాగలో నెమలీకలు

కోటేరులాటి ముక్కు

కోర మీసాలు

చిరు గడ్డం

అసలు అబ్బబ్బా లాగ ఉన్నాడు

ఆడపిల్ల చూసిందంటే గుండెలో తంత్రులు తెగిపోవాల్సిందే

అంత అందగాడు

అందాల సంగతి పక్కనబెట్టేస్తే వీళ్ళు నిలుచుకొని ఉన్నచోట పూలు, సువాసనలు, మకరందాలు, తేనెటీగలు.

ఎలా ఉంది అక్కడ?

అదీ కాక అప్పుడు వసంత కాలం

వసంత కాలం గురించి కుప్పలు తెప్పలుగా వర్ణనలు

***********************

ఎందును బుష్పసౌరభము * లెందు నమందమదాలిఝంకృతం

బెందును సాంద్రపల్లవము * లెందును గోకిలకంఠకూజితం

బెందును విస్ఫురత్ఫలము * లెందును గోమలకీరభాషితం

బందము లయ్యె మందమరు * దంచితచారువనాంతరంబులన్

***********************

అని నృసింహపురాణంలో ఒక వర్ణన మచ్చుకి

సరే, అదలా పక్కన పెడితే – కేతకీ పుష్పాలు వికసించిపోయి వున్నాయి

నువ్వేనేమిటే వికసించేదని వకుళ, చంపక, నాగ, పున్నాగ, సన్నజాజి అన్నీ పోటీలు పడ్డాయి

ఇక కలువలు, పద్మాలు వాటితో పాటు చకోరాలు, హంసలు, చిలుకలు సంగతి చెప్పనే అక్కరలా

ఆ మధ్యలోనే యవ్వనం.

ఇహ సీను ఊహించుకోవచ్చును.

వీటన్నిటికి తోడు ఆ సమయంలోనే మన్మథుడు కూడా లోకసంచారం చేస్తూ అక్కడికొచ్చాడు.

అంతే, వీళ్ళిద్దరిని చూసి, వాళ్ల అందాలు చూసి ఆయనకు మతిపోయింది.

ఆయనకు మతి పోయిందంటే ఏం చేస్తాడో ఆయనకే తెలీదు.

అహా అని పొగుడుదామని చేతులెత్తాడు.

ఆయన చేతులు ఎంత పొడుగో ఆయన బాణాల సంచీ అంత పొడుగు.

అందులో బాణాలు ఇంకా పొడుగు.

పైగా వాటికి పూలు గట్రా, ఆ హంగామా అంతా ఉంటుందాయె.

ఈయన చేతులెత్తినప్పుడు ఆ పూల వొత్తిడి మెత్తగా తగిలింది.

ఆడవారి చిటికెనవేలి కొసలు, పూలు ఒకటే.

ఆయనకు రతీదేవి వేళ్ళు గుర్తుకొచ్చినై.

దక్షుడి కూతురైన రతి, అందరికీ మనఃవికారాలు కలిగించే తన మనస్సునే అల్లకల్లోలం చేసిన సంగతి గుర్తుకువచ్చింది.

రతీదేవిని పెళ్ళి చేసుకున్నప్పుడు ఆవిడ చిటికెనవేలు ఈయన చిటికెనవేలిని పట్టుకుని నడిచిన సంగతి గ్యాపకం వచ్చింది.

చిటికెనవేలు తగలటమేమిటి, రసవాహిని ఒళ్ళంతా ఝల్లుమనిపించటమేమిటి – అలా అన్నీ గుర్తుకొచ్చినాయి.

వీళ్ళ సంగతి కూడా అట్లా చెయ్యాలన్న చిలిపి కోరిక అలా వచ్చి చేరింది మన్మథుడి మనస్సులోకి.

అంతే, ఆ పొడుగు చేతుల్తో ఇంత పొడుగు పూల బాణాలు, పంచబాణాలు ఒకసారి సవరించుకొన్నాడు

ఆ బాణాలు ఏవిటయ్యా అని ఎవరైనా అడిగితే “అరవిందాశోకచూత: నీలోత్పలే నవమల్లికా” అని ఒక లైను వదలండి

తామర, అశోక, మావిడి, మల్లె, కలువ పువ్వుల బాణాలు అవి

ఒక్కొక్కదానికి ఒక్కో మోహం, ఒక్కో సువాసన, ఒక్కొక్క వశీకరణం

మరి ఐదూ కలిస్తే ఇంకేమన్నా ఉన్నదీ ?

సరేనని ఎడమ భుజమ్మీదున్న విల్లందుకున్నాడు.

ఆ విల్లు చెరుకు గడలతో చేసి ఇంత పొడుగ్గా ఉన్నది.

చెరుకు గడల కణుపుల మీద చెయ్యి పెట్టాడు.

ఓ సారి నారిని టక్ టక్ మని సవరించాడు.

బాగా చప్పుడు చేసిందది.

అంటే బిగువుగా సిద్ధంగా ఉన్నానని ధరించినవాడికి చెప్పటమన్నమాట.

అయితే ఆయన దేవుడు కావటం వల్ల, ఆ విల్లు కూడా దేవుడి చేతిలో ఇమడటం వల్ల, అది చేసిన చప్పుడు తేనెటీగల ఝంకారంలా వినపడింది ఆ ఉద్యానవనంలో.

సవుండు ఆగింది. నిశ్శబ్దం రాజ్యమేలింది.

అప్పుడు చూశాడు.

ఎవరి వంక?

అంబ వంక చూశాడు, సాళ్వుడి వంక చూశాడు.

మధ్యలో ఉన్న ఖాళీ స్థలం వంక చూశాడు.

పరుగు పరుగున ఆ మధ్యలోకొచ్చి నిలబడి అటు ఐదు బాణాలు, ఇటు ఐదు బాణాలు వదిలేసాడు

ఫాస్టుగా, తేరుకునేందుకు అవకాశమే ఇవ్వకుండా.

ఆయన బాణాలెయ్యటం, ఈ ఇద్దరికీ గుచ్చుకోవటం ఒక వరసలో ఇరికింది.

వెయ్యగానే అటు అంబకు, ఇటు సాళ్వుడికి మనసు ఝల్లుమనటం. గుండె ఘల్లుమనటం జరిగిపోయినై.

ఝల్లు, ఘల్లుల మధ్య ఒక ఆవేశం కలిగింది.

అదే మోహావేశం.

అది పట్టుకుంటే ఎవరు నిలబడతారు ?

మోహం అనేది ఒక వలయాగ్ని.

కొంతమందికి విషవలయాగ్ని.

యవ్వనమనే నెయ్యి ఆ అగ్గిలో పోస్తే పెచ్చరిల్లటమే కానీ, తగ్గేదుండదు.

బాలానాం న భయం న మోహం అన్నారు కానీ, యవ్వనానాం న భయం న మోహం అనలేదందుకనే!

అయితే సత్ పురుష, సత్ స్త్రీల మోహం ఇంకో మెట్టు ఎక్కుతుంది.

ఆ మోహానికి పైనున్న మెట్టు పేరు ప్రేమ.

వీరిద్దరూ సత్ కోవకు చెందినవారు కాబట్టి మోహం వదిలి ప్రేమ మెట్టు ఎక్కేశారు.

సాళ్వుడు, కళ్ళు మనసు గిరగిరా తిరుగుతున్నా, స్టెబిలైజు అయిపోతూ, నేన్నిన్ను పెళ్ళి చేసుకుంటా అన్నాడు.

ప్రేమ దోమ ఎంత ఉన్నా అమ్మాయీమణి అమ్మాయీమణేగా! ఆవిడ భయం ఆవిడది. పైగా నాన్న మాట జవదాటనిది.

అందువల్ల ఆవిడన్నదీ – సామీ, ఇలా అడిగితే గెష్టు లేదు, లిష్టు లేదు అని మా అయ్య నిన్ను తుక్కు చేస్తాడు. నువ్వెళ్ళి మీ పెద్దాళ్ళనేసేసుకుని రా! – అని

సాళ్వుడు, సరే ఇదేదో బాగుంది, నేనెళ్ళొస్తా – అందాకా ఇక్కడే ఉద్యానవనంలో తిరుగుతూ ఉండమాక, చల్లగా ఉంది జలుబు చేస్తుంది అంత:పురానికి వెళ్ళు అని ఒక జోకు జోకి ఇంటికి పరుగులెత్తాడు.

ఇంతలో కాశీరాజుగారు ఒక మంత్రుల సమావేశం ఏర్పాటు చేసారు.

ఆ సమావేశంలో రాజుగారన్నారు – బాబూ! లోకధర్మం ప్రకారం పెళ్ళి చెయ్యాలి, రాజ్యధర్మం ప్రకారం స్వయంవరం ఏర్పాటు చెయ్యాలి. కానీ…”

కానీ అని ఆగిపోయాడు.

ఆలోచనలో పడ్డాడు.

ఇక మాట పొడిగించలా.

ఎందుకా ?

ఆయన ఒక సాత్త్విక భావానికి గురైనాడు.

సాత్త్విక భావమంటే సత్వానికి సంబంధించిన భావమనే అనుకోకూడదు.

సాత్త్విక స్వభావాలు ఎనిమిదని లోకోత్తరం.

సాత్త్వికం అంటే ఒక భావం.

భావాలు మనుషులకు కాక ఎవరికుంటయ్యి ?

ఆ భావం ఏదైనా కావొచ్చు.

అయితే ఆ ఏదైనా ఈ ఎనిమిదిట్లో ఇరకాల్సిందేనని లోకధర్మం, శాస్త్రసమ్మతం.

ఆ ఎనిమిదినిట్లా నిర్వచించారు.

“స్తంభః స్వేదః రోమాంచః స్వరభంగః వేపథుః వైవర్ణ్యం అశ్రుః ప్రళయమ్ ఇతి అష్టౌ సాత్త్వికా స్మృతాః ”

స్తంభః అంటే నిశ్చేష్టత

స్వేదః అంటే చెమటలు పట్టటం

రోమాంచః అంటే గగుర్పాటు కలగటం

స్వర భంగః అంటే గొంతు గద్గదం కావడం

వేపథుః అంటే ఒంట్లో వణుకు పుట్టటం

వైవర్ణ్యం అంటే కళ తప్పిపోవటం

అశ్రుః అంటే కళ్ళలో నీళ్ళురావటం

ప్రళయమ్ అంటే పూర్తిగా వివశుడైపోవటం

ఇవీ ఎనిమిది సాత్త్విక భావాలు

ఈ ఎనిమిదిట్లో స్వరభంగః భావానికి గురైనాడు.

మాట పెగలట్లా.

పైగా రాజుగారు.

మంది ఉన్న సభ.

మంది ఉన్న సమావేశం.

మంత్రులున్న సమావేశం.

మంత్రులకేం తోచలా.

ఎందుకు ఏడుస్తున్నాడన్నది ముందు అర్థం కాలా.

ఇంతలో తెలివికల ఒక మంత్రి లేచి – అయ్యా, మీ బాధ నాకర్థమయ్యింది, మీ ఏడుపు నాకర్థమయ్యింది అన్నాడు.

మిగిలిన మంత్రులంతా ఈ తెలివిడి మంత్రి వంక చూసారు.

అబ్బో మాకు తెలీంది వీడికి తెలిసింది ఏమిటానని!

ఆయన స్పీచు మొదలుపెట్టాడు.

“అయ్యా ఆడపిల్లలున్న తండ్రికి ఇదే చిక్కు, పెళ్ళి చేసి పంపించాలంటే గుండె అంతా మెలిపెట్టేసినట్టు ఉంటుంది. మాటలు రావు. మనసు కదలదు. అయినా ఒక తండ్రిగా మీరు మీ బాధ్యత నెరవేర్చాలి. పిల్లలను గుదిబండగా చేసుకోకుండా ఒక మొగుడుబండని చూసి వాడికిచ్చేసి మన బాధ వాడికి ట్రాన్స్ఫరు చేసేస్తే అయిపోతుంది, కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా స్వయంవరం ప్రకటించండి. పైగా ముగ్గురూ ఈడుకొచ్చారు కాబట్టి, ముగ్గురికీ ఒకటే సారి ప్రకటించెయ్యండి పనైపోతుంది” అని స్పీచు ముగించి కూర్చున్నాడు.

అప్పుడు మిగిలిన వారందరికీ అర్థమయ్యింది, రాజుగారి బాధ.

సందు దొరికింది కదాని ప్రతివాడు సలహాలివ్వటం మొదలుపెట్టాడు.

అవతలివాడు బాధ పడుతున్నాడంటే ఆనందించటం లోకస్వభావం.

ఆ స్వభావం ఆ కాలంలో తక్కువే అయినా ఉచిత సలహాలకు మటుకు తక్కువ లేదు.

అంతా తలో సలహా పడేసి కూర్చున్నారు.

అప్పుడు రాజు గారిని రెండో సాత్త్విక స్వభావం ఆక్రమించుకుంది.

అశ్రు: అని ఆ స్వభావం.

అది వచ్చినప్పుడు ఆపుకోవటం పరమాత్మకైనా కష్టమే.

రాజుగారి స్థితిని గమనిస్తున్న ముఖ్యమంత్రి అందరిని బయటికి తరిమేశి – సార్, మీరట్లా మంది ముందు ఏడిస్తే కష్టం సార్ అన్నాడు

మరి ఏం చెయ్యమంటావయ్యా? ఏడుపొచ్చినప్పుడు ఏడవక కుక్కుకోమంటావా అని కసిరాడు రాజుగారు

సంభాళించుకోవాలి సార్, మీరు రాజుగారు కాబట్టి చెప్పటం, మామూలు వాళ్ళైతే గంగాళాలు కార్చినా నే పట్టించుకోను అన్నాడు ఆ మంత్రి

దాంతో తెలివి తెచ్చుకుని, సరే ఆలోచన చేసి స్వయంవరం ఎప్పుడు ప్రకటిద్దామో చెప్పండి అని అంత:పురంలోకి వెళ్లిపోయాడాయన

దీనికి ఆలోచన ఎందుకండీ, మీరు ఊ అనండి స్వయంవరం ఏర్పాటు చేసే బాధ్యత అంతా మాది అని, ఆయనతో పాటు అందాకా వెళ్ళి ఆయనతో ఊ అనిపించుకుని దండోరాలు, ఆహ్వానపత్రాలు వేసేసి ప్రపంచం నలుమూలలకి పంపించేసాడు ఆ ముఖ్యమంత్రి

స్వయంవరం వార్త అమ్మాయీమణికి చేరింది

సంతోషకరమైన వార్త వింటే ఒళ్ళు పులకించదూ

అలా పులకింతల్లో ఈ ప్రపంచమే మర్చిపోతుంటే చెల్లెళ్ళిద్దరూ వచ్చారు

అంబాలిక అన్నదీ, ఈ స్వయంవరం ఒక్కొక్కళ్ళకు ఒక్కో సంవత్సరం పెడితే బాగుండునేమో అని

అయ్యో, ఈ స్వయంవరంవల్ల మనం ముగ్గురూ మూడు రాజ్యాలకు వెళ్ళిపోతే ఎట్లానే అక్కా అని అంబిక అన్నది

అంబాలిక పోనీ ముగ్గురం కలిసి ఒకణ్ణే పెళ్ళి చేసుకుంటే పోలానని వేళాకోలమాడింది

ఊరుకో పైన తథాస్తు దేవతలు ఉంటారు, నిజమయ్యేను అని కోపగించింది అంబ

ఆవిడ బాధ ఆవిడది, ఎక్కడ సాళ్వుణ్ణి పంచుకోవాల్సి వస్తుందోనని

ఎందుకే అంత కోపం, స్వయంవరానికొచ్చే యువరాజుల్ని పెళ్ళి చేసుకోవటం నీకిష్టం లేనట్టున్నది అన్నది అంబాలిక

రాజు లేదు, పేద లేదు, కులం లేదు, మతం లేదు, ఎవరైనా సరే నేను మెచ్చినవాణ్ణే పెళ్ళాట్టం అని గట్టిగా తెగేసిందీవిడ

మరి స్వయంవరం అంటే అంతేగా అన్నది అంబిక

స్వయంవరంలో వచ్చిన పదిమందిలో ఒకరిని మెచ్చటం కూడా ఒక మెచ్చటమేనని వెళ్ళిపోయింది అంబ

రాత్రయ్యింది, రేయి గడిచిందంటే పొద్దున్నే స్వయంవరం

యువరాజులందరూ వచ్చేసారు

పట్టణం అంతా కోలాహలంగా ఉన్నది

ఆ కోలాహలమంతా చూట్టానికి కళ్ళు చాలట్లేదు

పట్టణమంతా దేదీప్యమానంగా వెలిగిపోతోంది

ప్రాకారాలన్నీ మేరు పర్వతమంత ఎత్తున బోర విరుచుకొని ఉన్నవి

ఎందుకట ?

బంగారంతో తాపడం చేసేశారని

స్థంభాలన్నీ నిటారుగా తలేత్తుకొని నిలబడినవి

ఎందుకట?

స్ఫటికాలతో చుట్టివేసి అలంకరించేశారని

కుడ్యాలన్నీ మీసాలు మెలివేస్తున్నవి

ఎందుకుట?

మరకతమాణిక్యాలతో సింగారించేసారని

లతలన్నీ, చెట్లు తాండవమాడుతున్నవి

ఎందుకుట?

గాలిదేవుడు ఒక పుప్పొడిని ఇంకో పుప్పొడితో కలిపేసి హోలీ రంగులు చల్లేశాడని

ఇలా ఒక రకమైన కోలాహలం కాదు, వెయ్యి పండగల కోలాహం అంతా అక్కడ కుప్పపోసినట్టు ఉన్నది

ఆ కోలాహలంలో ఒక ఆజానుబాహుడు ఆరు అశ్వాలు పూంచిన రథమ్మీద నెమ్మదిగా ఆ పట్టణంలోకి అడుగుపెట్టాడు

వీర స్వభావమే ఆయన కాళ్ళ ముందు పడిగాపులు కాస్తున్నంత ఇదిగా ఉన్నాడు

అంత వీరంతో ఉన్న వీరుడెవరయ్యా?

ఇంకెవరు? గాంగేయుడు

సాక్షాత్ ఆ గంగమ్మ పుత్రుడు

పేరు దేవవ్రతుడే అయినా గాంగేయా అని పిలిస్తేనే ఇష్టమట ఆయనకు

అమ్మంటే అంత ప్రేమ

అమ్మ పేరంటే అంత ప్రేమ

కొంతమంది వెంటనే గుర్తుపట్టారు

కొంతమందికి ఆయనెవరో తెలియదు

కొంతమంది ఆ అందగాణ్ణి విభ్రమంగా చూస్తూ నిలబడిపోయినారు

కొంతమంది చెవులు కొరుక్కోవటం మొదలు పెట్టారు

గాంగేయుడు వచ్చాడేమి?

ఆయన పెళ్ళి చేసుకోనని కదా శపథం పట్టాడు!

శపథం వదిలేశాడా?

ఇలా నానారకాలుగా మాటాడుకుంటున్నారు

దేవవ్రతుడు వచ్చాడన్న వార్త అంత:పురానికి చేరిపోయింది

అంబాలిక అంబిక కూడా చెవులు కొరుక్కున్నారు

అంబకు ఆ చెవుల కొరుకుడు శబ్దం నచ్చలేదు

వచ్చి అడిగింది సంగతేమిటని

వారిద్దరూ చెప్పినారు వింతగా ఉన్నదే, పెళ్ళి చేసుకోనని శపథం పట్టిన శంతనమహారాజు కొడుకు దేవవ్రతుడు కూడా స్వయంవరానికి వచ్చాడని

దేవతల వ్రతం కలవారంతా దేవవ్రతులే కానీ, పెళ్ళి చేసుకోకపోతే ఎందుకు వచ్చాడట అని దీర్ఘాలు తీసింది అంబ

నీ దీర్ఘాల వల్ల అక్కడ ఏమీ కాదు కానీ, రేపు స్వయంవరంలో ఏమవుతుందో ఏమిటోననుకుంటూ వెళ్ళిపోయినారు అంబిక అంబాలిక

అంబ దీర్ఘాలోచనలో పడిపోయినది

సాళ్వుడే మది నిండా

ఆ అందగాడి తలపులే

ఆ అందగాడి పాణిగ్రహణమే

రేపటి స్వయంవరంలో ఆ అందగాడి మెడలో తన చేతినుంచి పడబోయే వరమాల ఊసులే

అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూనే మాగన్నుగా మగత నిద్రలోకి జారిపోయింది

ఇంతలో ఒక ధవళవస్త్రధారి, ఒక దేవదూత వచ్చాడు

అంబా, అంబా అని పిలుస్తూ వచ్చేశాడు

ఎవరది అంటూ దిగ్గున లేచింది అంబ

నీవు చేయవలసిన కార్యం జరిగించే సమయం వచ్చేసింది అంటూ ఆ దేవదూత వచనం మొదలుపెట్టినాడు

అంబ తికమక పడిపోయింది

నేను చేయవలసిన కార్యమేమిటి, అసలు నువ్వెవరు అన్నది

నేనొక దేవదూతను, నీవు చేయవలసిన కార్యం ఆ మహానుభావుడు దేవవ్రతుణ్ణి కడతేర్చడమే

నేనా, ఆ గాంగేయుణ్ణా హతమార్చేది అంటూ మ్రాన్పడిపోయినది అంబ

దేవదూత నెమ్మదిగా దగ్గరకు వచ్చి, అంబా నీవు దేవాంశ సంభూతురాలవు, అతణ్ణి నిర్జించటానికే పుట్టించబడ్డావు అంటున్నాడు

అయ్యో నాకా సంకల్పం ఈషణ్మాత్రమైనా లేదేనని అన్నది తేరుకున్న అంబ

నీకు తెలియని సంకల్పాన్ని చిగురించి, దానిని దృఢ సంకల్పం చేయటానికే దేవతలు నన్ను పంపించారు అన్నాడీయన

దేవతలకు ఆయన మీద అంత కోపమేమి అని ప్రశ్న వేసింది అంబ

దేవతలూ తప్పులు చేస్తారు. సాధారణంగా ఆ తప్పులు దేవతలకార్య నిమిత్తం ఆ పరమాత్ముడు చేయిస్తూ ఉంటాడు. అలాటి తప్పు ఒకటి చేసి శాపవశాన ఈ భూమ్మీదకు వచ్చినవాడు ఆ శాంతనవుడు, ఆ గాంగేయుడు. అతని శాపం నీవల్ల తీరవలసిందే. ఇది దైవ నిర్ణయం అని చెప్పాడు ఆ దేవదూత

మరి అతను చేయవల్సిన కార్యం ముగిసిపోయిందా అని మారుప్రశ్న వేసింది అంబ

లేదు, కొద్దికాలంలో పూర్తిచేస్తాడు, అప్పుడే నీ అవసరం, ఆ అవసరానికి తగ్గ సంకల్పం, దృఢసంకల్పం నీకు కలిగించడానికే నేను వచ్చింది, తయారుగా ఉండు అంటూ మాయమైపోయినాడు దేవదూత

దిగ్గున కల నుంచి లేచింది అంబ

ఒక జాము గడిచింది

రెండో జాముకి వచ్చింది ఒక ఆలోచన

లేచి వడివడిగా బయటకు నడిచింది

ఎక్కడికి ?

విడిది ప్రదేశానికి

రాకుమారుల విడిది ప్రదేశానికి

ఎట్లా ఉన్నది అక్కడ?

కోలాహలం అప్పుడే సద్దుమణిగినట్లు కనపడుతున్నది

కొబ్బరి ఆకుల పందిళ్ళు తలలు నిటారుగా నిలబెట్టి నిద్రపోతున్నాయి

కాశీరాజు గారి తరఫున వచ్చిన రాకుమారులందరికీ “ఎదురు కోలు” కార్యక్రమం పూర్తైపోయింది

మేళతాళాలు భూనభోంతరాలుగా వాయించినవారు అలసిపోయి నిద్రపోతున్నారు

అంతమంది రాకుమారుల కాళ్ళు కడిగటంతో ఒక చిన్న సరస్సు ఉద్భవించిందా అన్నట్లు ఉన్నది అటు పక్కన

అమ్మాయీమణులు నన్నే వరించటం ఖాయమని కొంతమంది ఆత్రంగా పారాణి కూడా రాసుకుని రాగా, కాళ్ళు కడుగుడు కార్యక్రమంలో ఆ పారాణి అంతా పోయి, ఆ చిన్న మడుగు ఎర్రగా రక్తపుటేరులా ఉన్నది

దివిటీలు ధగధగా మెరిసిపోతున్నాయి

చటుక్కున మేలిముసుగులాటి వస్త్రమొకటి తలమీదకు కప్పుకొంది, ఎవరికీ తెలియకూడదని

నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఒక శిబిరంలోకి ప్రవేశించింది

అక్కడ………

 

(ఇంకా ఉంది….)

మీ మాటలు

 1. Sailaja says:

  బాగా ఉంది. తర్వాత ఎమాయ్యిన్దొ

  • శైలజ గారు – తరువాత ఏం అయ్యిందో త్వరలోనే తెలుస్తుంది

   వంశీ

 2. ఆద్యంతం మోహనం…

  వెయిటింగ్ ఫర్ ది నెక్స్ట్ పార్ట్ :-)

 3. Choppa veerabhadrappa says:

  Very good స్టొరీ ఇన్ కంప్లేట్

  • వీరభద్రప్ప గారు – అవును ఇప్పటికి ఇంకంప్లీట్, తర్వాతి భాగం కోసం వేచి ఉండటమే… :)

   భవదీయ
   వంశీ

మీ మాటలు

*