ఇష్టమైన నరకం…

 

 

-మధు  పెమ్మరాజు 

~

 

 ఉన్నట్టుండి ఓ రోజు తెలుగు సాహిత్యానికి నా అవసరం ఉందనిపించింది.  ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా అమెరికాలో తెలుగు మగవాళ్ళ పై (అంటే బేబీ షవర్ రోజు తలుపు చాటున దాక్కుని, తలుపు తెరుచుకోగానే  “సర్ప్రైస్” అని భయపెట్టే మగవాళ్లపై) బ్లాగు రాసి స్నేహితులకి పంపి అభిప్రాయం  అడిగాను, వారం దాకా ఏ సమాధానం రాలేదు, మనోభావాలు దెబ్బ తిన్నాయేమోనని ఫోన్ చేసి అడిగితే “అద్భుతం! నువ్వు మామూలు మనిషివి కాదు!” అని ఉత్తేజపరిచారు (తర్వాత చదవకుండా పొగిడారని తెలిసింది)

కానీ రైలు స్టేషన్ దాటేసింది. వారానికో బ్లాగు రాయడం, జనాలపై ఎక్కుపెట్టడం మొదలుపెట్టాను. నెట్లో నారద సంచారం చేస్తుంటే ఎందరో మంచి బ్లాగర్లు, రచయితలు తారసపడ్డారు. వారి పదునైన రచనలు చదివాకా నేను రాసింది ఏదైనా కావచ్చు కానీ సాహిత్యం మాత్రం కాదని, సాహిత్యానికి నా అవసరం లేదని తేలిపోయింది. అప్పటికే కొన్ని ప్రమాదాలు జరిగిపోయాయి – ”ఇంట్లో రచయితగా గౌరవిస్తున్నారు, యధేచ్ఛగా కంప్యూటర్ ముందు కూర్చోనిస్తున్నారు, పార్టీలకి వెళితే నా వీరు బ్లాగులు అవి రాస్తారని ప్రత్యేకంగా పరిచయం చేస్తున్నారు” ఇక ఇన్ని సదుపాయాలు, మర్యాదలు జరుగుతుంటే వదలాలని అనిపించలేదు.

అంతర్జాల పత్రికలలో కథలు, కవితలు చూసుకుని, లెక్కపెట్టుకుని మురిసిపోయేవాడిని. ఆ ముచ్చట వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది పోటీలలో బహుమతి రావడంతో ముగిసింది, ఏ బాదరబందీ లేకుండా హాయిగా బ్లాగులు రాసేవాడిని కాస్తా రాయడం సీరియస్ గా తీసుకోవడం అక్కడ మొదలయ్యింది. బ్లాగులు బాచిలర్ జీవితం లాంటిది (ఏ బాదరబందీ ఉండదు), కథలు కాపురం లాంటివి (బరువు, బాధ్యత, ఇష్టమైన నరకం).

మొదట్లో ఏది రాసినా చప్పగా అనిపించేది, కథలు పూర్తయినా నా లాప్టాప్ దాటేవి కావు, అంతా అస్పష్టత..అంతు పట్టని దారులు. అయినా నిరుత్సాహపడకుండా కథని అవగాహన చేసుకునే ప్రయత్నం చేసాను, ఆ క్రమంలో…

ఒక సగటు పాఠకుడు కథని ఎందుకు ఇష్టపడతారు? – పత్రిక చేతిలో పడగానే సగటు పాఠకుడు చూసే మొదటి శీర్షిక కథ. ఆ ఆకర్షణకి ముఖ్య కారణం పాఠకుడు పెట్టే అతి తక్కువ సమయానికి మానసిక ఉల్లాసం, తృప్తిని ఇవ్వగలిగే అవకాశమున్న ప్రక్రియ కాబట్టి (నా ఉద్దేశ్యం అన్ని కథలని కాదు, వేరే శీర్షికలు తక్కువ చెయ్యడం కాదు..ఎక్కువ అవకాశం ఉన్న శీర్షిక అని మాత్రమే).

పాఠకులు ఎలాంటి కథలు ఇష్టపడతారు? – తమ మనసుని తాకి, కదిలించే ఇతివృత్తాలకి పాఠకుడు స్పందిస్తాడు. నిజానికి కథలో తమని తాము వెతుక్కుంటాడని  అనిపిస్తుంది. ఒక పాఠకుడిగా నాకు నచ్చే అంశాలు ఏమిటంటే- .

కథ సంపూర్ణ యాత్రలా (psychological journey) అనిపించాలి. మనని మనం పోగొట్టుకుంటూ, మళ్ళీ కలుసుంటూ వచన కవిత్వంలా సాగాలి.

నిదానంగా సాఫీగా, సాగినా ఆలోచింపజేయాలి, వెక్కిరించాలి, చుట్టూ ఉన్న పొరలని విప్పాలి.

పదాల గారడీలా కాకుండా వచనంలో నికరమైన యోగ్యత  ఉండాలి.    

చూసిందే, చదివిందే అనేలా చప్పగా అనిపించకూడదు

అంటే నేను ఆస్వాదించే స్థాయి (నా బేస్లైన్) వేరు, రాస్తున్న తీరు వేరు..ఈ రెంటి మధ్య దూరాన్ని  ఎలా తగ్గించాలి? నింగి అందనంత ఎత్తులో ఉందని చూస్తూ కూర్చుంటామా? ఇటుకలు పేరుస్తూ ఉంటాము, మెట్లు కడుతూనే ఉంటాము.

రాయడం ఏకాంత ప్రయత్నమయినా పెన్ను, పేపర్ ని తాకే లోపు ఎన్నో సందర్భాలు, వ్యక్తులు, పుస్తకాలు, సంభాషణలు మనలో జేరి అదృశ్య హస్తాలుగా రాయిస్తూ ఉంటాయి, కాబట్టి రాయడం ఒక సమావేశం.

అవకాశం వచ్చింది కాబట్టి నాకనిపించిన అదృశ్య హస్తాలు- సాహిత్య వాతావరణం, సంపాదకులు,  సాహితీవేత్తలు, పాఠకులు.

సాహిత్యం ఒక అవసరంలా అనిపించాలి, ఆదరించే వాతావరణం కావాలి. ఆ వేదిక చిట్టెన్ రాజు గారు అనే వ్యవస్థ ద్వారా లభించింది. కొన్ని దశాబ్దాలుగా బాషకి, సాహిత్యానికి ఎనలేని సేవ చేసారు. సాహితీ సదస్సులు, వెన్నెల వేడుకలు నిర్వహించడమే కాకుండా కొత్తవారిని ఆత్మీయంగా ప్రోత్సహిస్తారు. వారి పరిచయం వలన సాహిత్యంతో బలమైన, ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది.

కొత్త కథకులని వెలికి తీసి, వారిని ప్రోత్సహించే సహకార సాంప్రదాయం ఉండాలి. ఆ అంశంలో సంపాదకులు  కీలకమైన పాత్ర పోషిస్తారు. అంతర్జాలలో మనం రకరకాల పత్రికలని చూస్తుంటాము. రచన పంపగానే మాటామంతీ లేకుండా ప్రచురించే ‘పాసివ్’ పత్రికలు, అత్యున్నత ప్రమాణాల “కంచు కోట” పత్రికలు, రెండిటి వల్ల కొత్తవారికి పెద్ద ఉపయోగం లేదు.

కౌముది సంపాదకులు – కిరణ్ ప్రభ గారు, కవిత పంపినా, కథ పంపినా వెంటనే స్పందించి, అభిప్రాయం తెలిపేవారు. రచయిత దగ్గర స్పార్క్ ఉందని అనిపిస్తే విడిచిపెట్టకుండా ప్రోత్సహిస్తాను అని ఫోన్ లో మాట్లాడి, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి, తిరగ రాయించి పత్రికలో వేసేవారు.

తానా-సంపాదకులు-నారాయణస్వామి గారికి కొత్త కథలు పంపి అభిప్రాయం చెప్పమని అడిగేవాడిని, ఓపికగా ఫోన్లో విశ్లేషించే వారు. సవరణలు సూచించేవారు. గంటల, గంటల రైటర్ ల వర్క్ షాపులు కాదు. ఓ ఐదు, పది నిముషాల సంభాషణ, ఒకటి రెండు సూచనలు చాలు అల్లుకుపోవడానికి, నిండా ముంగిన వాడికి చిన్న తాడు చాలు.

సారంగ సంపాదకులు – అఫ్సర్ గారి ఆత్మీయ పలకరింపు, ఏదైనా రచన పంపమనే పిలుపు రచయితకి మంచి ఊతాన్ని ఇస్తాయి.

కథ పూర్తి చేసి, ఏదో ఒక పత్రికకి హడావిడిగా పంపి, అచ్చులో పేరు చూసుకునే తాపత్రయం కాస్తా నాకు నచ్చే వచనం రాయాలనే తపనగా మారింది.  ఓపికగా తిరగ రాయడం, మళ్ళీ రాయడం. – ప్రతీ పదం, వాక్యం, సంభాషణ మళ్ళీ మళ్ళీ చదువుకుని, పాఠకుడు ఎలా చదువుతాడో? స్పష్టత ఉందా? మనం అనుకున్న భావం ఇదేనా? అని లెక్కలేనన్ని సార్లు అనుకుంటూ ముందుకి వెళ్ళడం అక్కడ నుండి  మొదలయ్యింది.

ఇక కథ పూర్తి అయ్యాకా అసలు కథ మొదలవుతుంది (optimization ఫేస్)  కొన్ని బాగా పండిన సంభాషణలు, వాక్యాలు  తొలగిస్తున్నపుడు చెయ్యో కాలో తీస్తున్నట్టు బాధ పడే వాడిని, రాను రాను పేషంట్ నుంచి సర్జెన్ పాత్ర పోషించడం నేర్చుకున్నాను.

నూటికొక ఐదో ఆరో గొప్ప కథలు దొరుకుతాయి. పతంజలి శాస్త్రి గారివి ఆ కోవకి చెందిన అరుదైన, అపురూపమైన కథలు. ‘వడ్ల చిలుకలు’ కథా సంపుటి నుండి ఈ మధ్యనే వచ్చిన ‘గేదె పై పిట్ట’ దాకా  అయిపోతాయేమోనని కొద్దికొద్దిగా చదువుకుంటాను, అయిపోయాకా మళ్ళీ చదువుతాను.

ఏ మాత్రం కష్టపెట్టని పదాలు, వచన కవిత్వం, వ్యంగ్యం, పాఠకుడితో తెలివైన, బరువైన, లోతైన..పొరల పొరల సంభాషణలు జరపడం వారికే సాధ్యం.  ఎప్పుడు కలిసినా చాయ్ తాగుదామా? అంటూ పలకరింపుతో మొదలయి రెండు, మూడు గంటల సరదా సంభాషణ సాగుతుంది. నేను కథల చిట్కాలు అడగను, సాహిత్యం అంటూ విసిగించను. ఆ మహా కథకుడి సమక్షంలో కాసేపు గడిపితే చాలు ప్రభావం మనతో నడిచొస్తుంది, మనలో నిలిచిపోతుంది.

కేవలం సాహిత్యాన్ని ప్రేమిస్తూ, పబ్లిసిటీకి దూరంగా ఉండే సాహితీవేత్తలు నన్ను అమితంగా ఆకర్షిస్తూ ఉంటారు. అటువంటి మిత్రుడు మెహర్.

రచనా శైలి, పద విన్యాసం, ఒకసారి కాదు మళ్ళీ మళ్ళీ చదివించే రిపీట్ వేల్యూ గల వ్యాసాలు, బ్లాగ్ గుళికలు, పుస్తక/రచయిత పరిచయాలు. రాయడం తపస్సులా సాధన చేసే వ్యక్తి. ఏమీ ఆశించకుండా సాహిత్యాన్ని ప్రేమించడడానికి / ఇష్టపడడానికి స్ఫూర్తి!! Inspiration for literary enthusiasm!!

ఈ మధ్యన ఒక పాఠకుడు మూడు పేజీల కథకి  నాలుగు పేజీల విమర్శ పంపాడు. కథని ఇంత సీరియస్ గా తీసుకుంటారని తెలియడం చాలా ఆశ్చర్యం కలిగింది. ఇటువంటి అనుభవాలు రచయిత ఒద్దికైన ఇరుకుని వదుల్చుకునే అవకాశాలు. రచయిత కారైతే విమర్శ బ్రేక్ లాంటిది, ప్రశంస ఆక్సిలరెటార్ లాంటిది….రెండూ అవసరమే..

 

****

మీ మాటలు

  1. చందు తులసి says:

    బ్లాగు రచన బ్యాచ్ లర్ లైఫ్ లాంటిది. కథా రచన కాపురం లాంటిది…..
    సూపర్ మధు గారు.

  2. వంగూరి చిట్టెన్ రాజు says:

    నా పేరు రాసినందుకు కాదు కానీ చాలా చిత్త శుద్ది తో వ్రాసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇలాటి ఆత్మ విమర్శ లేదా ఆత్మావలోకనం పత్రికా ముఖంగా నలుగురితోటీ పంచుకునే వారు ఎందుకైనా మంచిదని ప్రోత్సహించిన వారి పేర్లు, లేదా విమర్శించిన వారి పేర్లు ప్రస్తావించకుండా అంతా తమ గురించో, కొన్ని సంఘటనల గురించో వ్రాస్తారు. దానికి భిన్నంగా వ్రాయడం వలన ఎవరికోసమో వ్రాసినట్టు కాక తను సీరియస్ కథకుడి గా పరిణామం చెందే క్రమంలో ఇప్పటి దాకా ఎక్కిన మెట్లు బాగా వివరించారు. అలాంటి అనుభవాలు చాలా మందికి ఉంటాయి కాబట్టి చాలా మంది కథకులు వాటిని నెమరువేసుకునే అవకాశాన్ని ఈ వ్యాసం ఇస్తుంది. వర్ధమాన రచయితలకి ఇచ్చిన సూచనలు బావున్నాయి.

    బాగా వ్రాశావు, మధూ…

మీ మాటలు

*