అతని మరణం…

 

స్లీమన్ కథ-35

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు అన్నా, నొప్పి తిరగబెట్టింది. ఇంతకుముందు కన్నా దుర్భరంగా మారింది. చెవిలోని అస్థి కవచం దెబ్బతిన్నట్టు, మంట లోపలిచెవిలోకి వ్యాపించినట్టు అర్థమైంది. వైద్యులు వారిస్తున్నా వినకుండా ఆసుపత్రినుంచి వెళ్లిపోవాలని స్లీమన్ నిర్ణయించుకున్నాడు. చెవుల్లోంచి తీసిన ఎముకలను రెండు చిన్న పెట్టెలలో ఉంచి అతని చేతికి ఇచ్చారు. అతను  లైప్జిగ్ (Leipzig) 1 వెళ్ళి తన ప్రచురణకర్తలను కలసుకున్నాడు. అక్కడినుంచి బెర్లిన్ వెళ్ళి విర్కోను కలిశాడు. వినుకలిశక్తి పూర్తిగా పోయింది. అయినా విర్కోకు ఉల్లాసంగా ఉన్నట్టు కనిపించాడు. కెనారీ సందర్శనకు తోడు వస్తానన్న అతని వాగ్దానాన్ని గుర్తుచేసి రైల్లో పారిస్ వెళ్ళాడు.

డిసెంబర్ 15న పారిస్ చేరుకున్నాడు. ఆ శీతాకాలంలో అతిశీతల దినం అదే. సోఫియా రాసిన ఆరు ఉత్తరాలు అతనికోసం ఎదురుచేస్తున్నాయి. అవి చదువుతుంటే, తన గురించి ఆందోళన చెందుతూ ఆమె తన పక్కనే ఉన్నట్టు  అనుభూతి చెందాడు. క్రిస్టమస్ నాటికి గానీ తను తిరిగి ఎథెన్స్ కు వెళ్ళలేననుకున్నాడు. ఈ మధ్యలో తను నేపుల్స్ 2 మ్యూజియంను సందర్శించేందుకు వ్యవధి ఉంటుంది. తను పాంపే 3లో తవ్వి తీసిన పురావస్తుసంపదను అందులో ప్రదర్శిస్తున్నారు. చెవిపోటు తిరగబెట్టడానికి తను చేసిన పొరపాటే కారణమనీ, రైల్లో వెళ్ళేటప్పుడు అరేబియన్ నైట్స్ అరబ్బీ మూలాన్ని చదవడంలో మునిగిపోయి చెవులలో దూది పెట్టుకోవడం మరచిపోయాననీ భార్యకు రాశాడు. విర్కోకు చివరి ఉత్తరం రాస్తూ, పల్లాస్ ఎథెనా (Pallas Athene-గ్రీకు ఉచ్చారణ: పలావా ఫినా) 4 చిరకాలం వర్ధిల్లుగాక! ఇప్పుడు కనీసం కుడిచెవితోనైనా వినగలుగుతున్నాను. ఎడమ చెవి కూడా బాగుపడుతుందని అనుకుంటున్నాను” అన్నాడు.

తనను జీవితాంతం కాపాడుతూ వచ్చిన పల్లాస్ ఎథెనా, ఇతర గ్రీకు దేవతలు ఇప్పుడు ఒలింపస్ 5 మబ్బుల మాటున ఉండిపోయారు. తను కనుగొన్న నిక్షేపాలను కడసారి చూసేందుకు మాత్రం అనుమతించారు, అది కూడా లిప్తకాలమే! ఓ శీతాకాలపు మధ్యాహ్నాన విపరీతమైన జ్వరంతోనూ, నిస్త్రాణతోనూ బాధపడుతూ పక్కన వైద్యుని ఉంచుకుని నేపుల్స్ మ్యూజియంను సందర్శించాడు.

అక్కడికి చేరే సమయానికే తుదిఘడియలకు చేరువలో ఉన్నాడు. చెవిపోటుతో గిలగిలలాడుతున్నాడు. పారిస్ నుంచి రెండు రోజుల ప్రయాణం అతని ఓపికను పూర్తిగా హరించింది. పోటు క్షణక్షణానికి దుస్సహమవుతున్న స్థితిలో వెంటవెంటనే ఇద్దరు వైద్యులను సంప్రదించాడు. ఇంకో వైపు అతని ఎథెన్స్ ప్రయాణానికి ఓడ సిద్ధంగా ఉంది. కానీ అతను సముద్రప్రయాణం చేసే స్థితిలో లేడు. క్రిస్టమస్ సంబరాలను కొద్ది రోజులు వాయిదా వేయమని సోఫియాకు తంతి పంపించి, మూడో వైద్యుని సంప్రదించడానికి వెళ్ళాడు. అతన్ని గుర్తుపట్టిన ఆ వైద్యుడు పురావస్తుశాస్త్రంపై ఎంతో ఆసక్తిని చూపిస్తూ, ఓసారి పాంపే వెళ్ళి వస్తే ఎలా ఉంటుందని సూచించాడు.

ఓ పెద్ద కోటును చుట్టబెట్టుకున్న స్లీమన్, ఓ బండిలో కూర్చుని వెసూవియస్(Vesuvius)6 కొండ నీడనే, ఓ  అఖాతాన్ని చుట్టుకున్న దారిలో సుదీర్ఘప్రయాణం చేసి పాంపేను సందర్శించాడు. వసారా ఇళ్ళు, పురాతన రోమన్ శకటాల కింద నలిగిన రహదారులు, రెండువేల ఏళ్ల క్రితం మద్యవిక్రేతలు నిలబడిన తబెర్నా(tabernae-మద్యవిక్రయ కుటీరాలు)లు-అతను ఎలా ఊహించుకున్నాడో అలాగే ఉన్నాయి. ఆ తర్వాత హోటల్ గదికి తిరిగొచ్చాడు. తను త్వరలోనే ఎథెన్స్ చేరుకుంటాననీ, అక్కడికొచ్చాక ఈ చెవినొప్పి సంగతి చూస్తాననీ చెబుతూ మరికొన్ని తంతులు పంపించాడు.

స్లీమన్ ఎథెన్స్ నివాసంలో ఉన్న నాణేల మ్యూజియం

స్లీమన్ ఎథెన్స్ నివాసంలో ఉన్న నాణేల మ్యూజియం

క్రిస్టమస్ రోజున, పోస్టాఫీస్ కు వెడుతూ కాబోలు, ప్యాజ్జా డెల్లా శాంటా క్లరీటాను దాటుతున్నాడు. అంతలో  రోడ్డు మీద కుప్పకూలిపోయాడు. అయినా కళ్ళు తెరచుకుని స్పృహలోనే ఉన్నాడు. జనం చుట్టూ మూగి ఎవరు, ఏమిటని ప్రశ్నించారు. తల ఊపడం తప్ప మాట్లాడలేకపోయాడు. మాట పడి పోయిందని అర్థమైంది.

పోలీసులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాస్త కళ్ళు తిరిగి ఉంటాయి తప్ప, పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని భావించిన ఆసుపత్రి సిబ్బంది అతన్ని చేర్చుకోడానికి నిరాకరించారు. దాంతో అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అతని ఆనవాలు పత్రాల కోసం, డబ్బు కోసం జేబులు వెతికారు. అవి కనిపించలేదు కానీ, వైద్యుడి చిరునామా దొరికింది. అతన్ని పిలిపించారు. స్లీమన్ గురించి అతను చెప్పిన వివరాలకు  విస్తుపోయారు. అతని దుస్తులు చూసి పేదవాడు అనుకున్నారు. అతను పెద్ద సంపన్నుడనీ, అతని పర్సు నిండా బంగారు నాణేలు ఉంటాయనీ వైద్యుడు చెప్పాడు. తనే అతని చొక్కా లోపలి జేబులోంచి బంగారు నాణేలతో ఉన్న ఒక పెద్ద పర్సును బయటికి తీశాడు.

స్లీమన్ ను అతని హోటల్ గదికి తీసుకెళ్లారు. అప్పటికీ అతను పూర్తి స్పృహలోనే ఉన్నాడు. ఒక్క మాట పోవడం తప్ప మిగిలిన అవయవాలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయి. వైద్యుడు అతని చెవిని తెరచి చూశాడు. అప్పటికే రుగ్మత మెదడుకు వ్యాపించినట్టు అర్థమైంది. ఈ దశలో చేయగలిగింది ఏమీ లేదని తోచింది. ఆ రాత్రి గడిచింది. మరునాడు అతని శరీరంలో కుడిభాగం చచ్చుబడిపోయింది. కపాలానికి రంధ్రం చేసి లోపల పరీక్షిస్తే మంచిదన్న సలహా వినిపించింది. ఎనిమిదిమంది నిపుణులను పిలిపించారు. వాళ్ళు ఇంకో గదిలో సమావేశమై ఏం చేయాలో చర్చించుకుంటూ ఉండగానే, చివరివరకు స్పృహలోనే ఉన్న స్లీమన్ తన పడక మీద నిశ్శబ్దంగా కన్నుమూశాడు.

***

ఎథెన్స్, బెర్లిన్ లకు తంతి వెళ్లింది. దార్ఫెల్త్, సోఫియా అన్న వెంటనే బయలుదేరి వచ్చారు. మృతదేహాన్ని ఎథెన్స్ కు తీసుకెళ్లారు. పదో రోజున, 1891 జనవరి 4న శవపేటికను, ఆకాశపు కప్పు కింద ఇరవైనలుగురు పాలరాతి దేవీదేవుళ్ళు కొలువుతీరిన అతని భవంతిలోని విశాలమైన హాలులో ఉంచారు. కింగ్ జార్జి, యువరాజు కాన్ స్టాన్ టైన్ స్వయంగా వచ్చి శవపేటిక వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. ప్రపంచం నలుమూలల నుంచీ సానుభూతి సందేశాలు వెల్లువెత్తాయి.

తన సమాధి స్థలాన్ని అతను ముందే ఎంచుకున్నాడు. ఇలిసస్ కు దక్షిణంగా ఉన్న ఒక శ్మశానంలో, తను ఎంతగానో ప్రేమించిన గ్రీకుల మధ్య, ఒక వీరుడికి తగిన గోపురం కింద అతని మృతదేహాన్ని సమాధి చేశారు.  అక్కడినుంచి ఎథెన్స్ పురాతనదుర్గమూ, శరోనిక్ 7 నీలిజలాలు, సుదూర ఆర్గోలిస్ పర్వతాలు– స్థిమిత పడని అతని ఆత్మకు దర్శనమిస్తూ ఉంటాయి. ఆ పర్వతాలకు అవతలే మైసీనియా, టిర్యిన్స్ రాజుల సమాధులు ఉన్నాయి. జీవితం చాలించిన తర్వాత కూడా తన ఆరాధ్య వీరులకు, దేవతలకు దగ్గరగానే ఉన్నాడు. శిఖరాగ్రాన ఉన్న శిథిల పార్థినోన్ (Parthenon) 8 నుంచి తెలి చూపుల తల్లి ఎథెనా అతన్ని చల్లగా చూస్తూనే ఉంటుంది.

మరణానంతరం అతనికి కొత్త జీవితం ప్రారంభమైంది. భూమిని మంత్రించి బంగారాన్ని వెలికి తీసిన ఈ వ్యక్తి తన జీవితకాలంలోనే ఒక చరిత్రగా మారిపోయాడు. మరణాంతరం అంతకంటే పెద్ద చరిత్రగా పరిణమించాడు. అతని దురాగ్రహాన్ని, తలబిరుసును, ఇబ్బందికరమైన అతని విపరీత ధోరణులను జనం మరచిపోయారు. హోమర్ పట్ల అతని అచంచల విశ్వాసాన్నీ,  భూమిలో సమాధైన రహస్యాల వెల్లడిలో అతని మడమ తిప్పని సంకల్పబలాన్నీ గుర్తుపెట్టుకున్నారు. అతని అవగుణాలే సుగుణాలుగా మారిపోయాయి. విచక్షణ ఎరగని అతని అహంభావాన్ని సహజమైన ఆత్మగౌరవమన్నారు. అతని అతిశయోక్తులూ, డాబుసరి మాటలూ,  గొప్ప చారిత్రకసంపదను బయటపెట్టాలన్న అతని తహతహ నుంచి పుట్టినవనీ; వాటిని క్షమించచ్చనీ అనుకున్నారు.  తనను ఒక మంచి బ్యాంక్ గుమస్తాగా మలచిన అలవాట్లే అతనికి జీవితాంతం ఉండిపోయాయన్న సంగతిని జనం మరచిపోయారు. మేథ్యూ ఆర్నాల్డ్(Matthew Arnold)9 అంటాడు: హోమర్ మహావేగంతో దూకే జలపాతం, నిష్కపటి, ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు, గొప్ప ఉదాత్తత నిండినవాడు 10;  స్లీమన్ ది పూర్తి విరుద్ధ స్వభావం, నిదానంగా, గడుసుగా వ్యవహరించేవాడు, సంక్లిష్టస్వభావి, జిత్తులమారి, డాంబికుడు, కోపిష్టి. సహజమైన ఉదాత్తత మచ్చుకైనా లేనివాడు.

museum

స్లీమన్ మ్యూజియం

అయినాసరే,  ట్రాయ్ బురుజులమీద నిలబడి తన శత్రువులతో  అసామాన్య విజిగీషతో పోరాడిన వీరుడిగా; మొక్కవోని సంకల్పశక్తి ఉన్నవాడిగా చరిత్ర అతన్ని అభివర్ణించింది. తన విశ్వసనీయతను పెంచుకోడానికి తగినంత సత్యసంధతను పాటించినవాడిగా చిత్రించింది.  వాస్తవంగా హోమర్ కాలానికి చెందిన వస్తువులను వేటినీ అతను వెలికితీయకపోయినా, అతని శవపేటిక శిరోభాగం వద్ద హోమర్ శిలాప్రతిమను ఉంచడం ఎంతైనా సముచితంగా కనిపించింది.

చివరికి, పురావస్తురంగంలోకి దారులు తెరచి చూపించిన గొప్ప వేగుచుక్కలలో ఒకడిగా, తొలితరం పురావస్తు నిపుణులలో ప్రముఖుడిగా గుర్తింపు పొందాడు. నిజానికి అతను శాస్త్రీయ పురావస్తు పరిజ్ఞానానికి వ్యతిరేకి. పూర్తిగా కాల్పనికభావన నిండినవాడు. యథేచ్ఛగా కిటికీలు తెరిచేసి రకరకాల గాలులు లోపలికి ప్రసరించడానికి అవకాశమిచ్చినవాడు. కేవలం విశ్వాసమూ, స్వాప్నికతే ఈ రంగంలో అతన్ని ముందుకు నడిపించాయి. తను బాల్యం నుంచీ ఆరాధిస్తూ వచ్చిన హోమర్ వీరుల స్వభావాన్నే ఈ రంగంలోనూ అతను పుణికిపుచ్చుకున్నాడు.

స్లీమన్ మరణించిన కొన్ని రోజుల తర్వాత, ఎనభయ్యొక్కేళ్ళ గ్లాడ్ స్టన్ వణికే చేతితో స్వయంగా సంతాపసందేశం రాసి సోఫియాకు పంపించాడు. స్లీమన్ లోని విలక్షణ మేధాశక్తి తనను ఎంత గాఢంగా ప్రభావితం చేసిందో అందులో రాశాడు. స్లీమన్ విజయస్వభావాన్ని ఒకే ఒక్క పేరాలో ఇలా వర్ణించాడు:

అతనిలోని ఉత్సాహశక్తి;  పురాకాలపు శౌర్యసాహసస్ఫూర్తిని పరిశుద్ధ, రక్తరహిత రూపంలో సంపూర్ణంగా గుర్తుచేసింది. తన పరిశోధనల తొలి దశలలో అతను తీవ్రవిమర్శనూ ఉపేక్షనూ రెండింటినీ ఎదుర్కొన్నాడు. కానీ మంచుపొగనుంచి సూర్యుడు బయటపడినట్టుగా అతని పరిశోధనల శక్తీ, విలువా స్పష్టమౌవుతున్న కొద్దీ వ్యతిరేకులు తోక ముడిచారు.  అతని బాల్యమూ, యవ్వనకాలమూ, అతని అనంతరజీవితం కంటే ఏమంత తక్కువ ప్రాముఖ్యం ఉన్నవి కావు. నిజానికి ఆ మూడు దశలనూ ఎవరూ విడదీయలేరు. ఎందుకంటే, తొలినుంచి తుదివరకూ ఒక లక్ష్యశుద్ధి, ఒక ప్రయోజనదృష్టి ఒకేలా అతని జీవితాన్ని ముందుకు నడిపించాయి. అతన్ని ప్రముఖుడిగా నిలబెట్టడానికి అతనిలోని ఉత్సాహశక్తి, ఔదార్యాలలో ఏ ఒక్కటైనా సరిపోతాయి. ఇక ఆ రెండూ కలిసినప్పుడు అదొక అద్భుతానికి ఏమాత్రం తక్కువ కాదు.

“అతనిలోని ఉత్సాహశక్తి; పురాకాలపు శౌర్యసాహసస్ఫూర్తిని పరిశుద్ధ, రక్తరహిత రూపంలో సంపూర్ణంగా గుర్తుచేసింది…” అన్న గ్లాడ్ స్టన్ వాక్యంతో స్లీమన్ విభేదించి ఉండేవాడు. పురాతన వీరులకు తను రక్తమాంసాలు కల్పించాననీ, సమాధులనుంచి వారిని పునరుత్థానం చెందించాననీ చెప్పి ఉండేవాడు. భూమిలో కప్పడిన పురానగరాలపై ఒక మాంత్రికుడిలా అతను మంత్రదండం తిప్పి, వాటిని సజీవం చేశాడు. ఈ పురాతన జీవుల గురించి మనకిప్పుడు తెలుస్తోందంటే, అతను తన శక్తియుక్తులన్నీ గుప్పించి వారి అవశేషాలను వెలికి తీశాడు కనుకనే. ఒకప్పుడు గొప్ప వైశాల్యమూ, అద్భుతత్వమూ, నిగూఢతా మూర్తీభవించిన మహావీరులు ఈ భూమిమీద నడయాడారు. ఇప్పటికీ వారిలో ఆ వైశాల్యమూ, అద్భుతత్వమూ అలాగే ఉన్నాయి కానీ; వెనకటంత నిగూఢులు కారు. అఖిలెస్, నక్కజిత్తుల ఒడీసీయస్, శిరస్త్రాణంపై నర్తించే తురాయితో హెక్టర్—వీళ్ళందరి మధ్యా స్లీమన్ నిరంతరం జీవించాడు, వీరిపట్ల అతను నమ్మకాన్ని కోల్పోయిన క్షణమంటూ లేదు.

***

ఒక్కోసారి స్లీమన్ ఆలోచనా సరళి ఎలా ఉండేదంటే,  హోమర్ చిత్రించిన వీరులు మాత్రమే నిజం, మిగతా యావత్ప్రపంచం అబద్ధమన్న భావన అతనిలో జీర్ణించుకుందా అనిపించేది. తన జీవితంలో చివరి అయిదేళ్లూ అతను ప్రాచీన గ్రీకుభాషలోనే మాట్లాడాడు, రాశాడు. హోమర్ మంత్రదండం స్పర్శించని ప్రతిదానిపైనా అతను నిరాసక్తుడయ్యాడు. “ఒక్క హోమర్ మాత్రమే నాలో ఆసక్తిని నింపుతున్నాడు. మిగతా అన్నిటిపట్లా నాలో నిరాసక్తత నానాటికీ పెరుగుతోంది” అని ఒక మిత్రుడితో అన్నాడు. పురాతనపు మట్టిపిడకల(tablets)మీద లిఖించిన ధర్మశాస్త్రాలకు ఉన్నంత శక్తిమంతతతో హోమర్ అతనితో సంభాషించాడు. అంతేకాదు, హోమర్ అతనికి ఒక దిగ్దర్శి, ఒక శిలాశాసనం, ఒక జీవనవిధానం, ఈ భూగోళపు ఒకానొక చరిత్ర. రేపటి మానవజీవనసరళిని ప్రస్ఫుటించే ఒక భవిష్యవాణి. స్లీమన్ ఉన్మాది కాడు, కానీ ఉన్మాదానికి దగ్గరగా ఉంటాడు.  ఉజ్వలమైన, అత్యద్భుతమైన విశుద్ధనాగరికత ఒకప్పుడు ఈ భూమిమీద వర్ధిల్లిందన్న విశ్వాసాన్ని విరాడ్రూపానికి పెంచిన ఉన్మాదం అతనిది. అతని దృష్టిలో, ఉన్మాది కావడానికి సైతం సిద్ధమై అడుగుపెట్టదగిన మహత్తర నాగరికత అది.

స్లీమన్ తో పాటు అలాంటి ఉన్మత్తతను పంచుకున్నవారు మరెందరో!  ఆంగ్లకవి కీట్స్ ఒక గ్రీకు కలశాన్ని చూడగానే, తనను ఏదో అద్భుతమైన ఉజ్వలత కమ్మేసిన అపురూప క్షణాలను అనుభూతి చెందాడు. పురాకాలపు బలులు, ఇతర తంతులు తన కళ్లముందు జరుగుతున్నట్టు భావించుకున్నాడు. భూమి మీద ఏనాడో అదృశ్యమైన ఆ నాగరికతకు జర్మన్ రచయిత గథా(Goethe)11, జర్మన్ కవి షిలర్(Schiller)12  విధేయత ప్రకటించుకున్నారు. గ్రీకు దేవతలను తలచుకుని మత్తెక్కి మైమరచిన మరో జర్మన్ కవి  ఫ్రీడ్రిచ్ హోల్డర్లీన్(Friedrich Holderlin)13, ఇప్పటికీ వారి ఆలయాలు ఉన్నట్టూ, వాటిలో ఇప్పటికీ వారి కొలుపులు జరుగుతున్నట్టూ, ఈ ఆలయాలలో తనొక పూజారి నైనట్టూ ఊహించుకున్నాడు. ఊహల్లో తప్ప ఎన్నడూ చూసి ఎరగని గ్రీకు దీవుల్లో తనొక సంచారి ననుకున్నాడు. అతని భావనలో క్రీస్తే సర్వోన్నత దైవం, గ్రీకు వీరులు క్రీస్తు పుత్రులు. క్రీస్తు, గ్రీకు దేవతల పట్ల అతనిలో ఒకేవిధమైన భక్తితత్పరత.  ప్రాచీన గ్రీకు సంగీతయుక్తంగా కవిత్వం విరచిస్తూనే అతను క్రైస్తవకవులలో అగ్రగణ్యుడిగా గుర్తింపు పొందాడు.  క్రీస్తు ఆరాధన, గ్రీసు విధేయత జమిలిగా అతన్ని ఎంత వివశుణ్ణి చేశాయంటే, చివరికి అతనొక ఉన్మాది అయ్యాడు.

స్లీమన్ విషయానికి వస్తే, అతను చర్చి వాతావరణంలో పెరిగినా, తన క్రైస్తవ వారసత్వాన్ని నిరాకరించాడు. ఏనాడూ చర్చికి వెళ్లలేదు. బైబిల్ ను కల్పితరచనగా భావించాడు. కొత్త నిబంధన(New Testament) చూసి విస్తుపోయాడు. హోమర్ లో కనిపించని అనేక గ్రీకు పదాలు అందులో కనిపించాయి. సోఫియా తల్లి మరణించినప్పుడు, శ్మశానవాటికకు వెళ్ళిన అతను, అక్కడ క్రైస్తవ పూజారుల చేస్తున్న ప్రార్థనలు విని, “ఇదంతా అర్థరహితం. పునరుత్థానం అంటూ ఏదీ లేదు- ఉన్నదల్లా ఒక్క అమరత్వం మాత్రమే!” నని గొణుక్కున్నాడు. హోమర్ అనంతరకాలానికి చెందిన యూరోపియన్ సంప్రదాయం మొత్తాన్నిఅతను తృణీకరించాడు. మోజెస్ సినాయి ఏడారులను దాటాడు; క్రీస్తు పరమపదించాడు; రోమన్ సామ్రాజ్యం ఉత్థాన పతనాలను చూసింది. ఆ తర్వాత సాంస్కృతిక పునరుజ్జీవనం అడుగుపెట్టింది. ఆ తర్వాత ఒక్కొక్క రేకే కాండం నుంచి జారిపోయింది; అతని దృష్టిలో ఇవన్నీ కేవలం అర్థరహితాలు–

చివరివరకూ నిలిచి వెలిగేది ఒకే ఒక జ్వాల… ఆ జ్వాల పేరు, హోమర్!!!

***

స్లీమన్ తర్వాత…

 • స్లీమన్ ప్రారంభించిన పని, అతని మరణం తర్వాత కూడా విజయవంతంగా కొనసాగింది. యూరప్ కు చెందిన ఎందరో పురావస్తునిపుణులు గ్రీస్, మధ్యప్రాచ్యం మొదలైన చోట్ల తవ్వకాలు జరిపించి పురాకాలానికి చెందిన ఎన్నో విశేషాలను బయటపెట్టారు.
 • ట్రాయ్ లో తవ్వకాలు కొనసాగించడానికి దార్ఫెల్త్ కు సోఫియా ఆర్థికసాయం చేసింది. ఆ తర్వాత జర్మన్ చక్రవర్తి నుంచి కూడా ఆర్థికసాయం అందింది. హోమర్ చిత్రించిన ట్రాయ్ ను గుర్తించడంలో స్లీమన్ పొరబడినట్టు దార్ఫెల్త్ కు అర్థమైంది. అతని తవ్వకాలలోనే హోమర్ ట్రాయ్ బయటపడింది.
 • సర్ ఆర్థర్ ఎవాన్స్ 1900-05 మధ్య క్రీటులో తవ్వకాలు జరిపించి క్రీ.పూ. ఆరవ సహస్రాబ్దికి చెందిన నాగరికతను వెలికితీశాడు. క్రీటుకు చెందిన మూడు లిపులను బయటపెట్టాడు.
 • అమెరికాకు చెందిన కార్ల్ బ్లెగన్ 14అనే పురావస్తునిపుణుడు 1932-38 మధ్యకాలంలో హిస్సాలిక్ లో తవ్వకాలు జరిపించి స్లీమన్, దార్ఫెల్త్ ల పొరపాట్లను సరిదిద్దాడు. మైసీనియాలో క్రీటు లిపిలో ఉన్న మట్టిపిడకలను కనుగొన్నాడు. అయితే ఆ లిపిని ఛేదించలేకపోయాడు. ఇంతలో రెండో ప్రపంచయుద్ధం రావడంతో పురావస్తు తవ్వకాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి.
 • 1952లో క్రీటు లిపితో ఉన్న మరికొన్ని మట్టిపిడకలు బయటపడ్డాయి. మైకేల్ వెంట్రిస్(Michael Ventris) 15అనే ఆంగ్లేయభాషాశాస్త్రవేత్త, జాన్ చాద్విక్(John Chadwick) 16, ఆలిస్ కాబర్(Alice Kober) 17 అనే మరో ఇద్దరు భాషావేత్తలతో కలసి ఎట్టకేలకు విజయవంతంగా క్రీటు లిపిని ఛేదించి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేశాడు. వెంట్రిస్, చాద్విక్ లు Documents in Mycenaean Greek అనే తమ రచనను స్లీమన్ కు అంకితమిచ్చారు.

(అయిపోయింది)

అథోజ్ఞాపికలు

 1. లైప్జిగ్: జర్మనీలోని ఒక నగరం.
 2. నేపుల్స్: ఇటలీలో రోమ్, మిలాన్ తర్వాత పెద్ద నగరం.
 3. పాంపే: ఇటలీలో నేపుల్స్ కు దగ్గరలో ఉన్న పురావస్తు ప్రాధాన్యం కలిగిన ప్రాచీన నగరం.
 4. పల్లాస్ ఎథెనా: విజ్ఞానాన్ని, ధైర్యసాహసాలను, స్ఫూర్తిని, న్యాయ, ధర్మాలను, నాగరికతను, గణిత శాస్త్రాన్ని, యుద్ధవ్యూహాన్ని, లలితకళలను, చేతివృత్తులను సంకేతించే గ్రీకు దేవత. మన సరస్వతీదేవితో పోల్చదగిన దేవత అన్నమాట.
 5. ఒలింపస్: గ్రీకు దేవతలు నివసించే పర్వతం. రాక్షసులపై దేవతలు విజయం సాధించిన తావు.
 6. వెసూవియస్(Vesuvius): ఇటలీలో నేపుల్స్ కు దగ్గరలో ఉన్న ఒక అగ్నిపర్వతం.
 7. శరోనిక్: గ్రీస్ లో ఉన్న ద్వీపసముదాయాన్ని చుట్టి ఉన్న జలసంధి. ఈ పేరే ఈ ద్వీపసముదాయానికి కూడా వచ్చింది.
 8. పార్థినోన్ (Parthenon): గ్రీస్ లో ఎథెన్స్ లో ఉన్న పురాతన దుర్గంపై ఉన్న ఎథెనా ఆలయం.
 9. మేథ్యూ ఆర్నాల్డ్(1822-1888): ప్రముఖ ఇంగ్లీష్ కవి, విమర్శకుడు.
 10. విచిత్రంగా వాల్మీకి గురించి రాంభట్ల కృష్ణమూర్తిగారు కూడా ఇలాగే అంటారు: “వాల్మీకి నిజాన్ని దాచడు. అబద్ధం చెప్పడు”(జనకథ). వ్యాసుడికీ ఇదే వర్తిస్తుందనుకుంటాను.
 11. జొహాన్ వాల్ఫ్ గంగ్ గథా(1749-1832): జర్మన్ రచయిత, రాజనీతిజ్ఞుడు.
 12. జొహాన్ క్రిస్తోఫ్ ఫ్రీడ్రిచ్ వాన్ షిలర్(1759-1805): జర్మన్ కవి, తత్వవేత్త, చరిత్రకారుడు.
 13. జొహాన్ క్రిస్టియన్ ఫ్రీడ్రిచ్ హోల్డర్లీన్(1770-1843): ప్రముఖ జర్మన్ గేయకవి.
 14. కార్ల్ విలియం బ్లెగన్ (1887-1971): అమెరికాకు చెందిన పురావస్తునిపుణుడు.
 15. మైకేల్ జార్జి ఫ్రాన్సిస్ వెంట్రిస్(1922-1956): ఆంగ్లేయ భాషాశాస్త్రవేత్త.
 16. జాన్ చాద్విక్ (1920-1998): ఆంగ్లేయ భాషాశాస్త్రవేత్త.
 17. ఆలిస్ ఎలిజబెత్ కాబర్(1906-1950): అమెరికాకు చెందిన భాషానిపుణురాలు.

 

 

 

 

 

 

మీ మాటలు

*