నాక్కాస్త సమయం పడుతుంది!

 

 

-రేఖా జ్యోతి 

~

నువ్వొచ్చిన వసంతంలో నుంచి
నువ్వు లేని గ్రీష్మంలోకి  జారిపోవడానికి, నాక్కాస్త సమయం పడుతుంది !

నా కుడి భుజం మీద ఇంకా నీ తల ఆన్చినట్టే ఉంది
మెత్తని మల్లెలు ఒత్తు పెట్టుకొని నా మెడ ఒంపులో ఒత్తిగిలినట్టే ఉంది..
ఏమని కదలను ..?

ఈ కాస్త ఇప్పుడు లేదనుకోవడానికి ..
నాక్కాస్త సమయం పడుతుంది !

ఈ సెలయేటి ఒడ్డున నీతో ఆడి ఆడి…
నీ మువ్వల సంగీతానికి అలవాటుపడి
ఇప్పుడిక బోసిపోయిన ఈ ఇసుక తిన్నెల నిశ్శబ్దంలోకి ఒదిగిపోవడానికైనా సరే,
నాక్కాస్త సమయం పడుతుంది,

లోకాన్ని పోనీ ముందుకు
నా కాలాన్ని పోనీ వెనకకు … నీవున్న కాలానికే !

బహుశా నాలాగే , నీకూ తెలీదేమో కదా
వెచ్చని అరచేతులతో వీడ్కోలు తీసుకొనేటప్పుడు
ఈ  ఆర్ద్ర  క్షణమొకటి మళ్ళీ రాదని,

‘ఎలా వదిలేసుకున్నాను అలా ..!’ అని

దీర్ఘంగా పశ్చాత్తాప పడడానికైనా సరే ,
నాక్కాస్త సమయం పడుతుంది

తిరిగి తిరిగి చూస్తూ బేలకళ్ళతో  నువ్వెళ్ళిన
ఆ దారిలో నుంచి, నన్ను నేను వెనక్కి తెచ్చుకోవడానికి,

కనీసం ఈ స్తబ్ధత నుంచి
ఓ దిగులులో మునిగిపోవడానికైనా సరే .. !

వెలుతురునీ, వెన్నెలనీ నువ్వు నీతో  తీసుకెళ్ళినపుడు
ఈ చీకటిని కాస్త ఓపికగా వెలిగించుకోవడానికైనా సరే ,
నాక్కాస్త సమయం పడుతుంది .. !

కాచుకొని కాచుకొని
మళ్ళీ నువ్వొస్తావన్న ఒక్క ఊహ చేయడానికైనా సరే

అలసిపోయి ఒక కన్నీటి చుక్కగా ఇక్కడ కురిసిపోవడానికైనా సరే ..

నాక్కాస్త సమయం పడుతుందేమో
ఏమో, మరో జీవితకాలం పడుతుందేమోరా … !!

peepal-leaves-2013

మీ మాటలు

  1. ఆపూర్వం రేఖా జ్యోతిగారు. మల్లి మళ్లీ చదివించే ఇలాంటి కవితలు మీ కలంలో జాలువారాలని కోరుకుంటూ.అభినందనలు.

  2. Venkat Suresh says:

    మళ్ళీ నువ్వొస్తావన్న ఒక్క ఊహ చేయడానికైనా సరే; నా కాలాన్ని పోనీ వెనకకు … నీవున్న కాలానికే ! నాక్కాస్త సమయం పడుతుందేమో
    ఏమో, మరో జీవితకాలం పడుతుందేమోరా … !! ఇటు వంటి ప్రయోగాలు కేవలం మీరు మాత్రమె చేయగలరు…. అందుకనే మీ కవితల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బ్యూటిఫుల్!!

  3. Venu udugula says:

    Good poem

  4. sasi Kal says:

    సమయం పట్టినా పర్లేదు – ఇంత మంచి కవిత కోసం ఎదురు చూస్తూ ఉంటాము

  5. “వెలుతురునీ, వెన్నెలనీ నువ్వు నీతో తీసుకెళ్ళినపుడు
    ఈ చీకటిని కాస్త ఓపికగా వెలిగించుకోవడానికైనా సరే ,
    నాక్కాస్త సమయం పడుతుంది .. !”
    What a profound idea!
    “నువ్వొచ్చిన వసంతంలో నుంచి
    నువ్వు లేని గ్రీష్మంలోకి జారిపోవడానికి, నాక్కాస్త సమయం పడుతుంది !”
    పొద్దున్న చదివిన ఈ రెండు లైన్లను ఇంకా మననం చేసుకుంటూనే ఉన్నాను.
    అద్భుతం రేఖమ్మా!

    • థాంక్యూ అంకుల్ , మీ అభినందన ఎప్పుడూ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది ! TQ

  6. SatyaGopi says:

    ప్రతీ వాక్యం ఆసక్తిగానూ, హాయిగాను అనిపించింది. అందమైన కవిత

  7. కె.కె. రామయ్య says:

    ” ఈ స్తబ్ధత నుంచి ఓ దిగులులో మునిగిపోవడానికైనా సరే .. నాక్కాస్త సమయం పడుతుంది ! ”
    అపురూపంగా రాసిన కవయిత్రికి హృదయపూర్వక అభినందనలు

  8. చాలా బాగుంది రేఖా అక్క.కాస్త సమయం పట్టినా పర్లేదు ఇలానే రాస్తువుండు.

  9. గోర్ల says:

    మంచి కవిత రాశారు. మంచి వ్యక్తీకరణ ఉంది. ఫీల్ ఉంది. ఎంత సమయం తీసుకున్నాఫర్వాలేదు. మంచి అభివ్యక్తితో కవిత్వం రాయండి. గుడ్ పోయెమ్……….

  10. ashokavari says:

    కవిత చాలా బాగుంందంండీ…..!

  11. Ramanuja Rao says:

    మీ భావుకత చాలా బాగుంది. మరికొన్ని కవితల్ని వినిపించండి

  12. Nirmala says:

    ఒకానొక సున్నితమైన ఫీల్ కవితను ఆసాంతం చదివించింది.. wonderful writeup jyothi gaaru.. loved it 😊

Leave a Reply to Sivaramakrishna Vankayala Cancel reply

*