-రేఖా జ్యోతి
~
నువ్వొచ్చిన వసంతంలో నుంచి
నువ్వు లేని గ్రీష్మంలోకి జారిపోవడానికి, నాక్కాస్త సమయం పడుతుంది !
నా కుడి భుజం మీద ఇంకా నీ తల ఆన్చినట్టే ఉంది
మెత్తని మల్లెలు ఒత్తు పెట్టుకొని నా మెడ ఒంపులో ఒత్తిగిలినట్టే ఉంది..
ఏమని కదలను ..?
ఈ కాస్త ఇప్పుడు లేదనుకోవడానికి ..
నాక్కాస్త సమయం పడుతుంది !
ఈ సెలయేటి ఒడ్డున నీతో ఆడి ఆడి…
నీ మువ్వల సంగీతానికి అలవాటుపడి
ఇప్పుడిక బోసిపోయిన ఈ ఇసుక తిన్నెల నిశ్శబ్దంలోకి ఒదిగిపోవడానికైనా సరే,
నాక్కాస్త సమయం పడుతుంది,
లోకాన్ని పోనీ ముందుకు
నా కాలాన్ని పోనీ వెనకకు … నీవున్న కాలానికే !
బహుశా నాలాగే , నీకూ తెలీదేమో కదా
వెచ్చని అరచేతులతో వీడ్కోలు తీసుకొనేటప్పుడు
ఈ ఆర్ద్ర క్షణమొకటి మళ్ళీ రాదని,
‘ఎలా వదిలేసుకున్నాను అలా ..!’ అని
దీర్ఘంగా పశ్చాత్తాప పడడానికైనా సరే ,
నాక్కాస్త సమయం పడుతుంది
తిరిగి తిరిగి చూస్తూ బేలకళ్ళతో నువ్వెళ్ళిన
ఆ దారిలో నుంచి, నన్ను నేను వెనక్కి తెచ్చుకోవడానికి,
కనీసం ఈ స్తబ్ధత నుంచి
ఓ దిగులులో మునిగిపోవడానికైనా సరే .. !
వెలుతురునీ, వెన్నెలనీ నువ్వు నీతో తీసుకెళ్ళినపుడు
ఈ చీకటిని కాస్త ఓపికగా వెలిగించుకోవడానికైనా సరే ,
నాక్కాస్త సమయం పడుతుంది .. !
కాచుకొని కాచుకొని
మళ్ళీ నువ్వొస్తావన్న ఒక్క ఊహ చేయడానికైనా సరే
అలసిపోయి ఒక కన్నీటి చుక్కగా ఇక్కడ కురిసిపోవడానికైనా సరే ..
నాక్కాస్త సమయం పడుతుందేమో
ఏమో, మరో జీవితకాలం పడుతుందేమోరా … !!
ఆపూర్వం రేఖా జ్యోతిగారు. మల్లి మళ్లీ చదివించే ఇలాంటి కవితలు మీ కలంలో జాలువారాలని కోరుకుంటూ.అభినందనలు.
ధన్యవాదాలు సర్ , తప్పకుండా ప్రయత్నిస్తాను !
మళ్ళీ నువ్వొస్తావన్న ఒక్క ఊహ చేయడానికైనా సరే; నా కాలాన్ని పోనీ వెనకకు … నీవున్న కాలానికే ! నాక్కాస్త సమయం పడుతుందేమో
ఏమో, మరో జీవితకాలం పడుతుందేమోరా … !! ఇటు వంటి ప్రయోగాలు కేవలం మీరు మాత్రమె చేయగలరు…. అందుకనే మీ కవితల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బ్యూటిఫుల్!!
సురేష్ గారూ థాంక్యూ :)
Good poem
Thank you Sir
సమయం పట్టినా పర్లేదు – ఇంత మంచి కవిత కోసం ఎదురు చూస్తూ ఉంటాము
:) థాంక్యూ అండీ
“వెలుతురునీ, వెన్నెలనీ నువ్వు నీతో తీసుకెళ్ళినపుడు
ఈ చీకటిని కాస్త ఓపికగా వెలిగించుకోవడానికైనా సరే ,
నాక్కాస్త సమయం పడుతుంది .. !”
What a profound idea!
“నువ్వొచ్చిన వసంతంలో నుంచి
నువ్వు లేని గ్రీష్మంలోకి జారిపోవడానికి, నాక్కాస్త సమయం పడుతుంది !”
పొద్దున్న చదివిన ఈ రెండు లైన్లను ఇంకా మననం చేసుకుంటూనే ఉన్నాను.
అద్భుతం రేఖమ్మా!
థాంక్యూ అంకుల్ , మీ అభినందన ఎప్పుడూ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది ! TQ
ప్రతీ వాక్యం ఆసక్తిగానూ, హాయిగాను అనిపించింది. అందమైన కవిత
ధన్యవాదాలు సత్య గారూ !
” ఈ స్తబ్ధత నుంచి ఓ దిగులులో మునిగిపోవడానికైనా సరే .. నాక్కాస్త సమయం పడుతుంది ! ”
అపురూపంగా రాసిన కవయిత్రికి హృదయపూర్వక అభినందనలు
హృదయపూర్వకమైన ధన్యవాదాలండీ _/\_ TQ
చాలా బాగుంది రేఖా అక్క.కాస్త సమయం పట్టినా పర్లేదు ఇలానే రాస్తువుండు.
:) తప్పకుండా యామినీ , Thank you
మంచి కవిత రాశారు. మంచి వ్యక్తీకరణ ఉంది. ఫీల్ ఉంది. ఎంత సమయం తీసుకున్నాఫర్వాలేదు. మంచి అభివ్యక్తితో కవిత్వం రాయండి. గుడ్ పోయెమ్……….
Thank you so much sir , తప్పకుండా మరొకటి ప్రయత్నిస్తాను !!
కవిత చాలా బాగుంందంండీ…..!
ధన్యవాదాలండీ !!
మీ భావుకత చాలా బాగుంది. మరికొన్ని కవితల్ని వినిపించండి
ధన్యవాదాలండీ , తప్పకుండా !
ఒకానొక సున్నితమైన ఫీల్ కవితను ఆసాంతం చదివించింది.. wonderful writeup jyothi gaaru.. loved it 😊
Thank you so much నిర్మల గారూ :)