కొత్త బాటలో నాటా సాహిత్య సభలు!

 

-సుజాత 

~

nata1

సంస్కృతి, సాహిత్యం అవిభాజ్యాలు! నివాసం విదేశాల్లోనే అయినా సంస్కృతి వేళ్ళు ఎక్కడ పాదుకున్నాయో, అక్కడికి హృదయాలు తరచూ ప్రయాణించడం, ఆ సువాసనల్ని ఇక్కడ ప్రోది చేసుకోవాలని ప్రయత్నించడం , మొగ్గ వేసినంత సహజం, పువ్వు పూసినంత సహజం! అందుకే ప్రవాస సాంస్కృతిక సంఘాలు ఎప్పుడు, ఎక్కడ సభలు నిర్వహించుకుని అంతా ఒక చోట చేరినా, సాహిత్యానికి తొలినాటి నుంచీ పెద్ద పీట వేస్తూనే ఉన్నాయి. మెమోరియల్ వీకెండ్ -మే 27,28 న జరగబోయే నాటా సభల్లో కూడా సాహిత్య వేదిక ప్రధాన భూమిక పోషించబోతోంది.

ప్రవాస తెలుగు సాహిత్యాభిమానులు, రచయితలు కవులు అంతా కల్సి సాహితీ సౌరభాలు పంచుకోడానికి రంగం సిద్ధం అయింది. కథ, కవిత, నవల, అవధానం వంటి ప్రక్రియల్లో నిష్ణాతులైన వారి ప్రసంగాలు, సభికులు కూడా పాలు పంచుకోనున్న చర్చలు ఈ సాహిత్య వేదికలో ప్రథానాంశాలు గా రూపు దిద్దుకున్నాయి. అన్ని విభాగాల్లోనూ నూతనత్వాన్ని స్పృశిస్తూ ఎంచుకున్న అంశాల మీద కవులు రచయితల ప్రసంగాలు సాగనున్నాయి.

నాటా సాహిత్య కమిటీలో కొందరు...

నాటా సాహిత్య కమిటీలో కొందరు…

శనాదివారాలు మొత్తం నాలుగు విభాగాలుగా జరగనున్న ఈ కార్యక్రమాల్లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడున్నర వరకూ జరగనున్న కథా వేదికలో “తెలుగు కథ-ఒక సమాలోచన” కార్యక్రమానికి ప్రముఖ రచయిత చంద్ర కన్నెగంటి సంచాలకులుగా వ్యవహరిస్తారు. “సరైన దారుల కోసం – కొత్త కథకుడి రచనా స్ఫూర్తి” అనే అంశం మీద  మధు పెమ్మరాజు, “ఇండియన్ డయాస్ఫోరా లో తెలుగు డయాస్ఫోరా స్థానం” గురించి గొర్తి సాయి బ్రహ్మానందం, “అమెరికా కథా వస్తువులు, లోపించిన వైవిధ్యత” అనే అంశం మీద వంగూరి చిట్టెన్ రాజు, “సమకాలీన కథ పై ఇంటర్నెట్ ప్రభావం” అనే అంశం మీద రచయిత్రి కల్పనా రెంటాల, ఇంకా , “కథలెందుకు చదవాలి?” అనే అంశం మీద మెడికో శ్యాం ప్రసంగిస్తారు. ఆ తర్వాత “తెలుగు కథ-దశ, దిశ” అనే అంశం పై చర్చా కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ సాహిత్య వేదికలపై ఇంతకు ముందు పెద్దగా చర్చంచని వినూత్నతను ఆపాదించే, కొత్త ఆలోచనల వైపు అడుగులు వేయించే అంశాలే!

మధ్యాహ్నం  3-30 నుంచి 5 గంటల వరకూ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం లో భాగంగా “తెలుగు నవల- చారిత్రక నవల ” అంశం మీద  మంథా భానుమతి ప్రసంగం, “తెలుగు నవలా పరిణామ క్రమం (బుచ్చిబాబు)” అనే అంశం మీద  దాసరి అమరేంద్ర, ఆ తర్వాత “తెలుగు నవల-సినిమా” అనే అంశం మీద బలభద్ర పాత్రుని రమణి ప్రసంగం ఉంటాయి .

 

ఆదివారం ఉదయం సాహితీ ప్రియులంతా ఎంతో ఆసక్తి తో ఎదురు చూసే ప్రధాన కార్యక్రమం అష్టావధానం! అవధాన కంఠీరవ నరాల రామారెడ్డి గారి అష్టావధానానికి సంచాలకులుగా వద్దిపర్తి పద్మాకర్ గారు వ్యవహరిస్తారు. పృచ్చకులుగా జువ్వాడి రమణ, పూదూరి జగదీశ్వరన్ మరికొంత మంది సాహితీ ప్రియులు పృచ్చకులుగా పాల్గొంటారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ మూడు గంటల పాటు ఉత్సాహభరితంగా సాగే ఈ కార్యక్రమం ఆదివారం నాటి ప్రధానాకర్షణ గా నిలవబోతోంది.

మధ్యాహ్నం జరిగే కవిత్వ విభాగ కార్యక్రమం మరింత ఆసక్తి గా ఉండబోతోంది. “తెలుగు కవిత-ఓ నూతన దృక్కోణం” శీర్షికన జరిగే ఈ కార్యక్రమానికి అఫ్సర్ సంచాలకులుగా వ్యవహరించనున్నారు . ఈ కార్యక్రమంలో కవులు కవయిత్రులు ఎంచుకున్న అంశాలన్నీ ఇంతకు ముందు ప్రవాస తెలుగు సాహితీ సభలో చర్చకు రాని సమకాలీన నూతనాంశాలే!

“కవిత్వానికి ప్రేరణ”  అనే అంశం మీద పాలపర్తి ఇంద్రాణి,”కవిత్వంలో ప్రయోగాలు” అన్న అంశాల మీద విన్నకోట రవిశంకర్ ప్రసంగించనుండగా, “కవిత్వంలో ప్రాంతీయత” అనే సరికొత్త అంశం మీద వెంకటయోగి నారాయణ స్వామి, “భిన్న అస్తిత్వాలు-వస్తురూపాలు” అనే వినూత్నాంశం గురించి కొండేపూడి నిర్మల ప్రసంగిస్తారు.

హుషారుగా సాగబోయే ఆ తర్వాత చర్చా కార్యక్రమం “తెలుగు సినిమా పాటల్లో సాహితీ విలువలు”! ఈ కార్యక్రమం లో సినీ గీత రచయితలు చంద్రబోస్, వడ్డెపల్లి కృష్ణ, సంగీత దర్శకులు కోటి, దర్శకులు వి.ఎన్ ఆదిత్య పాల్గొంటారు. మాడ దయాకర్ సంచాలకులుగా వ్యవహరిస్తారు

nata

చివరగా నాలుగున్నర నుంచి ఐదున్నర వరకూ మనబడిలో తెలుగు నేరుస్తున్న చిన్నారుల  “ఒనిమా”- ఒక్క నిముషం మాత్రమే పోటీ ల ఫైనల్స్ సాహిత్య వేదిక మీద జరుగుతాయి. తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా వీక్షించబోయే ఈ కార్యక్రమం  ఆదివారం నాటి సాహిత్య కార్యక్రమాలలో చివరిగా తెలుగు భాషా ప్రేమికులకు అందనున్న బోనస్

సాహిత్యాభిమానులను సరికొత్త అంశాలతో, వినూత్న చర్చలతో అలరించనున్న  సాహిత్య వేదిక సభికులతో కళ కళలాడుతుందని నాటా ఆశిస్తోంది.

కొత్త ఆలోచనల సరికొత్త వేదిక: ఇస్మాయిల్ పెనుకొండ (సాహిత్య విభాగం చైర్)

ismail

 

“సమకాలీన సాహిత్యానికి సంబంధించి అన్ని కోణాలు ఒక కొత్త దృక్పథం నుంచి వీక్షించే వీలు కలిగించేట్టుగా నాటా సాహిత్య సభల్ని తీర్చిదిద్దుతున్నాం. ప్రసిద్దులంతా ఒక వేదిక మీద కనిపించడం ఒక ఎత్తు అయితే, వారు భిన్నమైన అంశాల మీద – ముఖ్యంగా ఇప్పటి కాలానికి అవసరమైన వాటి మీద మాట్లాడబోవడం, ఇది ఒక ప్రయోజనకరమైన చర్చకి దారి తీస్తుందన్న నమ్మకాన్నిస్తుంది. కథ, కవిత్వం, అవధాన, సినిమా సాహిత్యం- వీటన్నిటితో పాటు బుచ్చిబాబు శతజయంతి సందర్భంగా కేవలం నవల మీద ప్రత్యేకించి ఒక సభ నిర్వహించడం కూడా విశేషమే!”

*

 

 

 

మీ మాటలు

  1. buchi reddy gangula says:

    కొత్త ఆలోచనలతో సరి కొత్త వేదిక ????
    తెలుగు సంగాల ఒక్క రోజు medical..camp.. లా —
    యీ తెలుగు జాతర లో —-తెలుగు సమావేశాలతో — తెలుగు సంస్కృతి –తెలుగు భాష –తెలుగు
    కళలు —-సునామి లేప దు — మార్పు లు రావు —
    30..ఏళ్ళ నుండి — చూస్తున్న నిజాలు — సత్యాలు —
    చిట్టెన్ రాజు గారి కి తెలుసు
    ఇంటర్నెట్ ప్రభావం //కవిత్వాని కి ప్రేరణ — ప్రయోగాలు — వస్తు రూపాలు — ప్రాంతీయత —
    అన్ని సొల్లు కబుర్లే — రాసే రచయితల కు — అమెరికా అయినా –అమలాపురం అయినా
    బేధం ఏమిటో ???తెలుగు రాష్ట్రాల లో లేనిదీ ఏమిటి ??
    డాలర్ విలువ తప్ప ??
    అయినా ఎన్ని రాసుకున్నా — మాట్లాడినా —- చ ధీ వె సంక్యా ఎంత ???
    శాలువలు కప్పడం — కప్పించుకోవడం తప్ప ??
    గుర్తింపుల కోసం ఆరాటం తప్ప ???
    —————————– జవాబు యివ్వగలను
    బుచ్చి రెడ్డి గంగుల

Leave a Reply to buchi reddy gangula Cancel reply

*