అలా ఎలా వెళ్లిపోతావ్?

 

డా. నారాయణ గరిమెళ్ళ

~

 

అలా ఎలా వెళ్లిపోతావ్?

దూడనొదలిన ఆవు సంతలో అమ్ముడై పోయినట్టు

జంట బాసిన పావురం బోయకు ఆహారమైనట్టు

కుందేలునొదలిన నిండు చందమామ శాస్వతంగా మాయమైనట్టు

అలా ఎలా వెళ్ళి పోతావ్?

 

అనుభవాలన్నింటినీ జ్ఞాపకాలుగా మార్చి

నువ్వున్న ఫొటోలను వీడియోలనూ

నీ సమక్షానికి సాక్ష్యాలుగా మార్చి

కళ్ళల్లో దీపాలతో నీ రాకను తలపోసే భార్యను విడిచి

నీ మీదెక్కి ‘చల్ చల్ గుర్రం’ ఆటకు తెరతీసే

పసి పిల్లలను నడిమధ్యనొదిలి

అలా ఎలా వెళ్ళి పోతావ్?

 

ఒక్క సారైనా

మాతో కరకుగా మాట్లాడి ఉండాల్సింది కదరా?

ఆ కాఠిన్యాన్నే గుర్తు పెట్టుకుని

నిన్ను మరచిపోడానికి ప్రయతించే వాళ్లం.

 

హైదరాబాద్ వరకూ వచ్చి

నిన్ను కలవలేక పోవడం నా తప్పే

చిన్న శిక్ష వేసి క్షమిస్తావనుకుంటే

క్షమించకుండా తిరిగి ఇంతలా శిక్షిస్తావా?

 

అమ్మా అన్నలు అక్కలు అందరూ

నీ భార్యా బిడ్డల తోడుగా

గుండెలవిసేలా  సామూహిక శోకగీతమాలపిస్తున్నాం

ఒక్కసారి రాలేవా!

 

పెద్దలందరినీ వదలి చిన్న వాళ్ళు అలా పోకూడదురా

నిన్ను కళ్ళల్లో పెట్టుకున్న వాళ్లం

ఎలా చెరిపేయగలం?

నిన్ను చూసుకోవడానికి

అందరం సిద్ధంగా ఉన్నాం

ఒక్కసారి రారా..ప్లీజ్

 

రేడియో లో ఇళయరాజా పాటలొస్తున్నాయి

మునిగి తేలడానికి నువ్వు లేవురా

జువ్వలు ఎగరేసుకున్న హాస్యాల గురించీ

నెమరేసుకోడానికీ నవ్వుకోడానికీ నువ్వు లేవురా

వాదాలకు ప్రతివాదాల సరిజోడు  లేక

అంశాలన్నీ ఏకపక్షమైపోతున్నాయి.

 

క్యారంస్ బోర్డ్ ని ఏకబిగిన

క్లియర్ చెయ్యడానికి ఎవరూ లేక

ఆటంతా చిన్నబోయింది

 

సగం షో అయినా పూర్తికాలేదు

ఇంటర్వెల్ కావడానికి సైతం

ఇంకా పదేళ్ళు బాకీ ఉన్నాయి కదరా

అంత తొందర పడిపోయావేమిరా!

 

దశాబ్దాలుగా నీ చెప్పు చేతల్లో వున్న బైకే కదా!

ఎలా నిన్ను పడేసి నీ మీద పడి పోయింది?

నిత్యం నీకు కరతలామలకమైన రోడ్డు మీద

అర్ధాంతరంగా అలా ఎలా పొట్టన పెట్టుకుంది?

 

అందరినీ వదిలేసి ఎలా వెళ్ళి పోతావ్?

ఇల్లు వదిలి పెట్టి వెళ్లిపోయినంత సులభమా

లోకాన్ని వదిలిపోవడం

 

ప్రతి ఒక్కరినీ త్రాసులలో తూచి తప్ప

బతకలేని మనుషుల మధ్య

సాటి మనిషులని ఎర(లు) గా భావించే వారి మధ్య

జుట్టూ జుట్టూ ముడేసి వినోదించే తగాదా గాళ్ళ మధ్య

నిలువెత్తు మానవతా సాక్ష్యంగా

మిగిలున్నావని నిను చూపేందుకైనా

నువ్వుండాలి కదా?

 

గాద్గదికమౌతున్న

గొంతు మూసేందుకు

చెబితే తప్ప వీడ్కోలు

తీసుకోనని మాట ఇచ్చేందుకు

రావాలిరా రవీ.

 

(అకాలముగా ప్రమాదములో మృతి చెందిన నా కజిన్ సోదరుడు ‘ఆకెళ్ళ రవికుమార్’ కి, కన్నీటి తో, ప్రేమతో…)

 

 

మీ మాటలు

  1. Kcube Varma says:

    Marachipoleni mitruniki premaga mee nivaali..

  2. balasudhakarmouli says:

    kavitha chadavadam modhalu petti.. konni line lu velleka – kavitha thana vaathaavaranam loki theesukuni vellipoyindi.

  3. రెడ్డి రామకృష్ణ says:

    నారాయణగారూ!మీ కవిత బాగుంది.కవి ఏ అనుభూతి అందించాలనుకున్నాడో,ఆ అనుభూతి పాఠకునికి అందాలి.మీ ఆవేదన కనిపించింది.మంచి పోయంకు వుండవలసిన లక్షణం యిదే అని నేననుకుంటాను. అభినందనలు.

  4. THIRUPALU says:

    పుట్ నోట్ అవసరం లేదనుకుంటా! అంతా కవితలోనే వుంది. ఆర్ద్రంగా బాగుంది.

  5. దశాబ్దాలుగా నీ చెప్పు చేతల్లో వున్న బైకే కదా!

    ఎలా నిన్ను పడేసి నీ మీద పడి పోయింది?

    –సారాంశమంతా ఒక్క వాక్యంలో ఇమిడ్చి చెప్పారు … మీ వ్యథంతా కవితై పాఠకుల కళ్లు తడుపుతూ ప్రవహించింది.

    • ధన్యవాదాలు నాగలక్ష్మి గారు. అంగీకరిస్తున్నాను.

  6. a. syamasundar rao says:

    “అలా ఎలా వెళ్లి పోతావ్” కవిత బాగుంది మీ మిత్రునికి మంచి కవిత ద్వారా నివాళులు అర్పించారు మీ మిత్రునికి కవిత చేరి అతనిఆత్మకు శాంతి చేకూరాలని ఆశిద్దాము .

  7. Mythili Abbaraju says:

    అయ్యయ్యో….ఇదెక్కడి కర్మండీ

    • vidyasagar says:

      కవిత గురించా లేక అకాల మరణం గురించా ఈ karma

    • కర్మ/విధి/నుదుటి-వ్రాత ఏదైనా ఆఖరి మాట లేకుండా మనిషి చనిపోవడం ఘోరం అనిపిస్తుnది.

  8. Aranya Krishna says:

    ఆర్ద్రమైన ఎలిజీ!

  9. శ్రీనివాసరావు says:

    సార్ మంచి పోయెమ్. ధన్యవాదాలు ‘కుందేలునొదలిన నిండు చందమామ శాస్వతంగా మాయమైనట్టు’ ఈ వాక్యాన్ని కాస్త వివరించగలరు.

    • ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు.
      వెలిగే చంద్రుడు పేరెంట్ అనుకుంటే కుందేలు బిడ్డ (పసి పిల్లలకి కొంత మంది చంద్రుడి గురించి చెప్పే పరిభాషలో). చంద్రుడు కనిపించినంతసేపూ కుందేలు భవిత కు బెంగ లేదు.

  10. “సగం షో అయినా పూర్తికాలేదు
    ఇంటర్వెల్ కావడానికి సైతం…
    అంత తొందర పడిపోయావేమిరా!”
    —– కన్నీళ్ళు తెప్పించేలా ఉంది.

    బసవరాజు అప్పారావు గారి “ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు” అన్న మాటలు గుర్తొచ్చాయి.

  11. పాయల says:

    కవిత్వం లో ఆర్తి పాఠకుడ్ని కట్టి పడేసే నిర్మాణం ..

    ఆరి్

  12. ఆర్.దమయంతి says:

    వార్త వినంగానే రాయైన గుండె…
    కదిలి కదిలి.. ఒక్కో కన్నీటి రవ్వను రాల్చుతున్నట్టుంది..

  13. attada appalnaidu says:

    నారాయణగారూ మీ అన్ని కవితల లాగే ఇది కూడా తేలికైన పదాలతో గుండెను తాకింది…బాగుంది..అభినందనలు

Leave a Reply to balasudhakarmouli Cancel reply

*