రాక్షస గీతం

 

 

-అనిల్ ఎస్. రాయల్

~

 

“Reality is merely an illusion, albeit a very persistent one.” – Albert Einstein

 

—-

చెవులు చిల్లులు పడే శబ్దం. దాన్ననుసరిస్తూ, కాలం నివ్వెరపోయినట్లు క్షణమాత్రపు నిశ్శబ్దం. మరుక్షణం మిన్నంటిన రోదనలు.

దట్టంగా పొగ. చెదురుమదురుగా మంటలు. చిందరవందరైన పరిసరాలు. ఛిద్రమైన శరీరాలు. వాటినుండి రక్తపు చుక్కలు పైకెగరసాగాయి. ఒకటి, రెండు, పది, వంద. చూస్తూండగానే చిక్కబడ్డాయవి. నేలమీంచి నింగిలోకి కుండపోతగా రుధిరవర్షం కురవసాగింది. ఆకాశాన్ని చీలుస్తూ నల్లటి మెరుపొకటి మెరిసింది. సమీపంలో పిడుగు పడింది. దిక్కులు పిక్కటిల్లిన చప్పుడుతో –

దిగ్గున మెలకువొచ్చింది.

ఎప్పుడూ వచ్చేదే. అయినా అలవాటవని కల. పదే పదే అదే దృశ్యం. మానవత్వం మాయమైన మారణహోమం. రక్తంతో రాసిన రాక్షసగీతం.

అది నా ఉనికి దేనికో విప్పి చెప్పిన విస్ఫోటనం.

నిశ్చలంగా పైకప్పుని చూస్తూ పడుకుండిపోయాను – అది కలో, మెలకువో తెలీని అయోమయంలో.

మేలుకోవటమంటే – వాస్తవంలోకి వళ్లు విరుచుకోవటమా, లేక ఒక కలలోంచి మరో కలలోకి కళ్లు తెరుచుకోవటమా?

ఇదీ కలే ఐతే మరి ఏది నిజం?

“నువ్వేది నమ్మితే నీకదే నిజం,” అన్నాడెవరో మేధావి.

నిజమేనేమో. సత్యం సైతం సాపేక్షం! అందుకే లోకమంతా ఈ అరాచకత్వం. ఎవడికి నచ్చింది వాడు నిజంగా నమ్మేసి ఎదుటోడి నెత్తిన రుద్దేసే నైజం. అందులోంచి పుట్టేది ముందుగా పిడివాదం. ఆ తర్వాత అతివాదం. అది ముదిరితే ఉన్మాదం. అదీ ముదిరితే –

ఉగ్రవాదం.

ఆలోచనల్ని బలవంతంగా అవతలకి నెడుతూ మెల్లిగా లేచాను.

 

మరో రోజు మొదలయింది.

 

* * * * * * * *

 

“అవకాశం దొరకాలే కానీ … వాణ్ని అడ్డంగా నరికేసి ఆమెని సొంతం చేసుకుంటా,” అనుకున్నాడు వాడు పెదాలు చప్పరిస్తూ.

ఇరవైలోపే వాడి వయసు. ఇంజనీరింగ్ విద్యార్ధి వాలకం. చిరిగిన జీన్స్, చింపిరి జుత్తు, ఓ చేతిలో సిగరెట్, ఇంకో చేతిలో కాఫీ కప్, వీపున బ్యాక్‌పాక్. నిర్లక్షానికి నిలువెత్తు రూపం. యమహా మీద ఠీవిగా తిష్ఠవేసి నల్ల కళ్లద్దాల మాటునుండి నిష్ఠగా అటే చూస్తున్నాడు.

నేనూ అటు చూశాను. నాలుగు టేబుల్స్ అవతలొక పడుచు జంట. భార్యాభర్తల్లా ఉన్నారు. ఎదురెదురుగా మౌనంగా కూర్చుని ఒకే కప్పులో కాఫీ పంచుకు తాగుతున్నారు. ఆ యువతి సౌందర్యానికి నిర్వచనం. ఆమె భర్త పోతురాజు ప్రతిరూపం.

చింపిరిజుత్తు వైపు చూపు తిప్పాను. వాడింకా పెదాలు చప్పరిస్తూనే మర్డర్ ఎలా చెయ్యాలో, ఆ తర్వాత ఆమెతో ఏం చెయ్యాలో ఆలోచిస్తూన్నాడు. ఆమె వాడికన్నా ఆరేడేళ్లు పెద్దదయ్యుంటుంది. కానీ అది వాడి ఆలోచనలకి అడ్డురాని వివరం. ఈ రకం తరచూ తారసపడేదే. ఊహల్లో చెలరేగటమే తప్ప వాటి అమలుకి తెగించే రకం కాదు. ప్రమాదరహితం.

వాడినొదిలేసి ఆ పక్కనే ఉన్న టేబుల్‌వైపు చూశాను. అక్కడో ముగ్గురు అమ్మాయిలు. ఇవీ కాలేజ్ స్టూడెంట్స్ వాలకాలే. కాఫీకోసం‌ నిరీక్షీస్తూ మొబైల్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. అలవాటుగా వాళ్ల బుర్రల్లోకి చూశాను. నిమిషంలోపే అర్ధమైపోయింది. పోసుకోలు కబుర్లు. ఎదురు బొదురుగా కూర్చుని ఒకరితో ఒకరు వాట్సాప్‌లో చాట్ చేస్తున్న నవతరం ప్రతినిధులు. హార్మ్‌లెస్ క్రీచర్స్.

వాళ్లమీంచి దృష్టి అటుగా వెళుతున్న యువకుడి మీదకి మళ్లింది. ముప్పయ్యేళ్లుంటాయేమో. వడివడిగా నడుస్తూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. అతడి కవళికలు అనుమానాస్పదంగా తోచాయి. ఏమన్నా విశేషమా? వెంటనే అతడిని స్కాన్ చేశాను. ఫ్యామిలీ మాటర్. పట్టించుకోనవసరం లేదు. మరొకరి మీదకి దృష్టి మరల్చబోతూండగా అతను చటుక్కున ఆగిపోయాడు. నేనూ ఆగిపోయాను. ఆ పక్కనే దట్టంగా విరిసిన పూల మొక్క. అందులో ఒక పువ్వునుండి తేనె గ్రోలుతూ నీలిరంగు బుల్లిపిట్ట. నగరాల్లో అరుదైన దృశ్యం. అంత హడావిడిలోనూ అది చూసి ఆగిపోయాడంటే వీడెవడో భావుకుడిలా ఉన్నాడు. ఆటవిడుపుగా అతడిని గమనించాను. నాకూ కాసేపు కాలక్షేపం కావాలిగా.

అతను ఫోన్ మాట్లాడటం ఆపేసి, అదే ఫోన్‌తో ఆ పిట్టని ఫోటో తీసుకుని, తిరిగి ఫోన్‌లో మాట్లాడుతూ వడి నడక ప్రారంభించాడు. ప్రస్తుతాన్ని చిత్రాల్లో చెరపట్టి ఆస్వాదన భావికి వాయిదావేసే ఆధునిక భావుకుడు!

కాలక్షేపం కట్టిపెట్టి, అతన్నొదిలేసి చుట్టూ పరికించాను – ఆ పరిసరాల్లో అలల్లా తేలుతున్న ఆలోచనల్ని అలవాటుగా పరిశీలిస్తూ, ప్రమాదకరమైనవేమన్నా ఉన్నాయేమోనని అలవోకగా పరీక్షిస్తూ. నగరంలో నలుగురూ చేరే ప్రముఖ ప్రదేశాల్లో స్కానింగ్ చెయ్యటం నా బాధ్యత. సిటీ నడిబొడ్డునున్న పార్కులో, సదా రద్దీగా ఉండే కాఫీ షాపు ముందు అదే పనిలో ఉన్నానిప్పుడు. షాపు ముందు పచ్చటి పచ్చిక బయలు. దాని మీద పాతిక దాకా టేబుళ్లు. వాటి చుట్టూ ముసిరిన జనం. వాళ్ల నీడలు సాయంత్రపు నీరెండలో సాగిపోయి నాట్యమాడుతున్నాయి. వాతావరణం వందలాది ఆలోచనల్తో, వాటినుండి విడుదలైన భావాలతో కంగాళీగా ఉంది. ఆవేశం, ఆక్రోశం, అవమానం, అనుమానం, అసూయ, అపనమ్మకం మొదలైన ప్రతికూల భావనలదే మెజారిటీ. అదేంటోగానీ, మనుషులకి ఆనందం పొందటానికంటే ఆవేదన చెందటానికి, అసంతృప్తిగా ఉండటానికే ఎక్కువ కారణాలు దొరుకుతాయి! అదిగదిగో, అక్కడో అమాయకత్వం, ఇక్కడో అల్పానందం కూడా బిక్కుబిక్కుమంటున్నాయి. ఇవి కాదు నాక్కావలసింది, ఇంతకన్నా ముఖ్యమైనవి – అమానుషమైనవి. అదేంటక్కడ … ఆత్మహత్య తలపు? పట్టించుకోనవసరం లేదు. ఆ మధ్య టేబుల్ దగ్గరున్నోడి తలని అపరాధపుటాలోచనేదో తొలిచేస్తోంది. అదేంటో చూద్దాం. ఇంకాసేపట్లో భార్యని హత్య చెయ్యటానికి కిరాయి హంతకుడిని పురమాయించి ఎలిబీ కోసం ఇక్కడొచ్చి కూర్చున్న అనుమానపు మొగుడి తలపు. అది వాడి వ్యక్తిగత వ్యవహారం. నాకు సంబంధించింది కాదు. ఇలాంటివాటిలో కలగజేసుకుని జరగబోయే నేరాన్ని ఆపాలనే ఉంటుంది. కానీ ఏజెన్సీ ఒప్పుకోదు.

పావుగంట పైగా స్కాన్ చేసినా కలవరపెట్టే ఆలోచనలేవీ కనబడలేదు. అక్కడ రకరకాల మనుషులున్నారు. దాదాపు అందరూ మొబైల్ ఫోన్లలోనూ, టాబ్లెట్లలోనూ ముఖాలు దూర్చేసి ఉన్నారు. పొరుగింటి మనుషుల్ని పలకరించే ఆసక్తి లేకున్నా ముఖపరిచయం లేని మిత్రుల రోజువారీ ముచ్చట్లు మాత్రం క్రమం తప్పక తెలుసుకునేవాళ్లు. అన్ని సమయాల్లోనూ అన్ని విషయాలతోనూ కనెక్టెడ్‌గా ఉండే తహతహతో చుట్టూ ఉన్న ప్రపంచం నుండి డిస్కనెక్ట్ అయిపోయినోళ్లు. ఇ-మెయిళ్లు, ఎస్సెమ్మెస్‌లు, పోస్ట్‌లు, లైక్‌లు, పోక్‌లు, ఫోటోలు, వీడియోలు, ట్వీట్‌లు, ట్యాగ్‌లు, డౌన్‌లోడ్‌లు, అప్‌లోడ్‌లు, యాప్స్, గేమ్స్, ఫీడ్స్ … కిందటి తరం వినైనా ఎరగని విశేషాల్లో, విషాల్లో నిండా మునిగిన జనం. వాస్తవలోకాన్నొదిలేసి ‌సైబర్ వాస్తవంలో ముసుగులు కప్పుకు సంచరించే వెర్రితనం.

 

ముసుగులు. లేనిదెక్కడ?

ఇంటర్నెట్‌లోనే కాదు, ఈ లోకం నిండా ఉందీ ముసుగు మనుషులే. అందరు మనుషులకీ అవతలి వ్యక్తి ముసుగు తొలగించి, వాడి మదిలో మెదిలే వికృతాలోచనల్ని చదివే శక్తి ఉంటే? అప్పుడిక ప్రపంచంలో రహస్యాలుండవు. మోసాలుండవు. ఇన్ని నేరాలుండవు. కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండవు. మాటతో పనుండదు. పిల్లల మనసెరగని తల్లిదండ్రులుండరు. తలలో పుట్టే తలపులకి మరుగన్నది లేనినాడు భయంతోనో, సిగ్గుతోనో వాటిని నియంత్రించటం మనుషులు నేర్చుకుంటారు. మెరుగుపడతారు. ప్రపంచానికిక నాలాంటివారితో పనుండదు. నా శక్తికేం ప్రత్యేకతుండదు.

శక్తి.

ఈ శక్తి నాకెందుకొచ్చిందో తెలీదు. ఎప్పుడొచ్చిందో మాత్రం లీలగా గుర్తుంది.

 

మొట్టమొదటిసారి నేను చదివింది అమ్మ ఆలోచనల్ని. అప్పుడు నాకు ఐదేళ్లుంటాయి. ఆలోచనల్ని చదవటం అనేదొక అద్భుతమైన విషయమని తెలీని వయసు. యథాలాపంగా అమ్మ మనసులో ఏముందో చదివేసి బయటకు చెప్పేయటం, దానికామె ఆశ్చర్యపడిపోవటం, మళ్లీ చదవమనటం, నేను మరోమారామెని ఆశ్చర్యపరచటం, ఆ సాయంత్రం అంతా ఇద్దరం అదే పనిలో ఉండటం … ఇంతే గుర్తుంది. ఆ వయసులో నాకదొక ఆటలా మాత్రమే తోచింది. తర్వాత మరి కొన్నిసార్లూ అమ్మ ఆలోచనలు చదివి చెప్పాను. అయితే, ఆమె మొదట్లో చూపించిన ఆసక్తి తర్వాత చూపకపోగా చిరాకుపడింది. నేను చిన్నబుచ్చుకున్నాను. ఎందుకో బోధపడకపోయినా, ఆమె ఆలోచనలు నేనలా చదివేయటం అమ్మకి ఇష్టంలేదని అర్థమయింది. దాంతో ఆమె దగ్గర నా శక్తి ప్రదర్శించటం మానేశాను. మొదట్లో అనుమానించినా, మెల్లమెల్లగా ఆమె కూడా నాకా శక్తి ఎంత చిత్రంగా వచ్చిందో అంత చిత్రంగానూ మాయమైపోయిందనుకుని కాలక్రమంలో ఆ విషయం మర్చిపోయింది.

అమ్మకి తెలీని సంగతేంటంటే – నా శక్తి రోజు రోజుకీ పెరిగిపోసాగింది. మొదట్లో ఆమెని మాత్రమే చదవగలిగిన నేను, కాలం గడిచే కొద్దీ ఇతరులనీ చదివేయసాగాను. అతి సమీపంలో ఉన్నవారి నుండి రెండు వందల మీటర్ల రేడియస్‌లో ఉన్న ప్రతి మనిషినీ చదవగలిగేవరకూ నా పరిధి విస్తరించింది. అందరిని చదవటం వల్లనో ఏమో, నాకు వయసుకి మించిన పరిపక్వత అబ్బింది. ఏడేళ్లొచ్చేటప్పటికే ఓ విషయం అర్థమైపోయింది: పరాయి వ్యక్తి తన మస్తిష్కంలోకి చొరబడి అందులో ఏముందో కనిపెట్టేయటం ఏ మనిషీ ఇష్టపడడు. మరి నాకీ శక్తున్న విషయం అందరికీ తెలిసిపోతే? ఇక నన్నెవరూ మనిషిలా చూడరు. నేనంటే భయమే తప్ప ఇష్టం, ప్రేమ ఎవరికీ ఉండవు. ఆ ఆలోచన భరించలేకపోయేవాడిని. అందువల్ల నా వింత శక్తి సంగతి ఎవరికీ తెలియకుండా దాచాలని నిర్ణయించుకున్నాను. దానికోసం చాలా కష్టపడాల్సొచ్చింది. నలుగురిలోకీ వెళ్లటం ఆలస్యం – అన్ని దిక్కులనుండీ ఆలోచనలు కమ్ముకునేవి. కళ్లు మూసుకుంటే లోకాన్ని చూడకుండా ఉండొచ్చుగానీ దాన్ని వినకుండా ఉండలేం. నా వరకూ పరుల ఆలోచనలూ అంతే. వద్దన్నా వచ్చేసి మనోఫలకంపై వాలతాయి. వాటిని ఆపటం నా చేతిలో లేదు. వేలాది జోరీగలు చుట్టుముట్టినట్లు ఒకటే రొద. తల దిమ్మెక్కిపోయేది. తప్పించుకోటానికి ఒకే దారి కనపడింది. ఆ జోరీగల్లో ఒకదాన్నెంచుకుని దాని మీదనే ఫోకస్ చేసేవాడిని. తక్కినవి నేపథ్యంలోకెళ్లి రొదపెట్టేవి. గుడ్డిలో మెల్లగా ఉండేది.

అలా, టీనేజ్‌కొచ్చేసరికి వేల మనసులు చదివేశాను. ఆ క్రమంలో‌ నాకో గొప్ప సత్యం బోధపడింది. కనిపించేదంతా మిథ్య. కనిపించనిదే నిజం. అది ఎవరికీ నచ్చదు. అందుకే ఈ నాటకాలు, బూటకాలు. కని పెంచిన ప్రేమలో ఉండేదీ ‘నా’ అనే స్వార్థమే. స్వచ్ఛమైన ప్రేమ లేనే లేదు. అదుంటే కవిత్వంతో పనుండేది కాదు. పైకి మామూలుగా కనపడే ప్రతి వ్యక్తి లోపలా పూర్తి భిన్నమైన మరో వ్యక్తి దాగుంటాడు. వాడి ఆలోచనలు అనంతం. చేతలు అనూహ్యం. ఆ పుర్రెలో ఎప్పుడు ఏ బుద్ధి ఎందుకు పుడుతుందో వివరించటం అసాధ్యం. మనిషి కళ్లకి కనిపించే విశ్వం – పొడవు, వెడల్పు, లోతు, కాలాలనే పరిధుల మధ్య గిరిగీసి బంధించబడ్డ మరుగుజ్జు లోకమైతే, ఆ పరిధులకవతలుంది మరోప్రపంచం. అది మంచికీ చెడుకీ మధ్య, నలుపుకీ తెలుపుకీ నడుమ, మానవ మస్తిష్కంలో కొలువైన అవధుల్లేని ఊహాలోకం. దాని లోతు కొలవటానికి కాంతి సంవత్సరాలు చాలవు. ఆ చీకటి లోకాల్లోకి నేను తొంగి చూశాను. పువ్వుల్లా విచ్చుకు నవ్వే వదనాల వెనక నక్కిన గాజు ముళ్లు. ఎంత తరచి చూస్తే అంత లోతుగా చీరేసేవి. ఆ బాధ పైకి కనపడకుండా తొక్కిపట్టటమో నరకం. అదో నిరంతర సంఘర్షణ. దాని ధాటికి స్థితిభ్రాంతికి లోనయ్యేవాడిని. చిన్న చిన్న విషయాలు మర్చిపోయేవాడిని. వేర్వేరు సంఘటనల్ని కలగలిపేసి గందరగోళపడిపోయేవాడిని.

అయితే వాటిని మించిన సమస్య వేరే ఉంది. తండ్రి లేకుండా పెరగటాన, అమ్మకి నేనొక్కడినే కావటాన, ఒంటరి నడకలో అలుపెంతో నాకు తెలుసు. ‘నా వాళ్లు’ అనే మాట విలువెంతో మరింత బాగా తెలుసు. కానీ నా శక్తి పుణ్యాన, నా వాళ్లనుకునేవాళ్లంతా లోలోపల నన్నేమనుకుంటున్నారో గ్రహించాక వాళ్లతో అంతకు ముందులా ఉండలేకపోయేవాడిని. ఈ లోకంలో నేనో ఏకాకిగా మిగిలిపోతానేమోననే భయం వెంటాడేది. దానికి విరుగుడుగా – నా వాళ్ల ఆలోచనలు పొరపాటున కూడా చదవకూడదనే నిర్ణయం పుట్టింది. వద్దనుకున్నవారి ఆలోచనల్ని వదిలేయగలిగే నిగ్రహం సాధించటానికి కిందామీదా పడ్డాను. కానీ చివరికి సాధించాను. నా వైట్ లిస్ట్‌లో అతి కొద్ది పేర్లే ఉండేవి.

 

వాటిలో ఒకటి షాహిదా.

తను ఇంజనీరింగ్‌లో నా సహచరి. చూపులు కలిసిన తొలిసారే మా మధ్య ఆకర్షణేదో మొగ్గతొడిగింది. ఆమె ఆలోచనలు చదవకూడదన్న స్థిర నిశ్చయానికి ఆ క్షణమే వచ్చేశాను. పరిచయం ప్రేమగా మారటానికి ఎక్కువరోజులు పట్టలేదు. చదువు పూర్తయ్యాక అమ్మని ఒప్పించి షాహిదాని పెళ్లాడటానికి కాస్త కష్టపడాల్సొచ్చింది. మొదట్లో ఇద్దరి మతాలూ వేరని అమ్మ బెట్టుచేసినా, తర్వాత తనే మెట్టు దిగింది. పెళ్లయ్యాక, అప్పుడప్పుడూ షాహిదా మనసులో ఏముందో చదివి తెలుసుకోవాలన్న కోరిక తలెత్తినా, దాన్ని తొక్కిపట్టేసేవాడిని.

అదెంత పెద్ద తప్పో తర్వాతెప్పటికో తెలిసింది. అప్పటికే ఆలస్యమయింది.

తల విదిలిస్తూ, స్కానింగ్ కొనసాగించాను. చుట్టూ జనాలు ఎవరి ఆలోచనల్లో వాళ్లు మునిగున్నారు. ఆశలు, అసూయలు, కోరికలు, కోపాలు, వల్గారిటీస్, పెర్వర్షన్స్ అన్నీ వాళ్ల తలపుల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. అవన్నీ నేను వింటున్నానని తెలిస్తే? అప్పుడా ఆలోచనలకి కళ్లాలేస్తారా? నో. నా మీద దాడికొస్తారు. తమ ప్రైవసీ హక్కుకి భంగం కలిగించానంటూ రాద్ధాంతం చేస్తారు. ఈ కారణంగానే ఏజెన్సీ అజ్ఞాతంలో ఉండిపోయింది.

anil

ఇందాకెప్పుడో తెచ్చుకున్న కాఫీ చల్లారిపోయింది. మరో కాఫీ కోసం లేచెళ్లి కౌంటర్లో ఆర్డరిచ్చి, అదొచ్చేలోపు ఎదురుగా గోడకున్న టీవీలో స్క్రోలింగ్ న్యూస్ చదవసాగాను. “ప్రత్యేక హోదా సాధించి తీరతాం – చంద్రబాబు”. “విదేశాల నుండి నల్ల ధనం వెనక్కి రప్పిస్తాం – నరేంద్రమోదీ”. “త్వరలోనే మెగాస్టార్ నూట యాభయ్యో సినిమా ప్రకటన – రామ్ చరణ్”. “ఈ దేశంలో పుట్టినోళ్లందరూ జై శ్రీరామ్ అనాల్సిందే – సాధు మహరాజ్”. రెండేళ్ల నుండీ రోజు మార్చి రోజు ఇదే బ్రేకింగ్ న్యూస్! కానీ సామూహిక అత్యాచారాలు, సంఘవిద్రోహ చర్యల వార్తల కన్నా ఇవే మెరుగు.

కాఫీ వచ్చింది. తీసుకుని వెనక్కొచ్చి ఇందాకటి టేబుల్ వద్దే కూర్చుని తాగబోతోండగా … తలలో చిన్న మెరుపు మెరిసింది. లిప్తపాటు మెదడు మొద్దుబారింది.

 

సందేశాలు రాబోతున్న సూచన. ఏజెన్సీ నుండి.

కాఫీ కప్పు కిందపెట్టి కళ్లు మూసుకున్నాను, అంతఃచక్షువులకి అల్ల్లంత దూరంలో కనబడుతున్న సూక్ష్మబిందువు మీదకి ఫోకస్ లాక్ చేయటానికి ప్రయత్నిస్తూ. కొత్తలో ఈ పని చేయటానికి రెండు నిమిషాల పైగా పట్టేది. ఇప్పుడు రెండే సెకన్లు.

ఫోకస్ లాక్ అవగానే సందేశాలు డౌన్‌లోడ్ కావటం మొదలయింది. మొదటగా ఎవరిదో ఫోటో వచ్చింది. అంత స్పష్టంగా లేదు. పురుషాకారం అని మాత్రం తెలుస్తోంది. నాతో సహా ఎవడైనా కావచ్చు. టెలీపతీ ద్వారా శబ్ద సంకేతాలొచ్చినంత స్పష్టంగా చిత్రాలు రావు. ఇంత అస్పష్టమైన ఫోటోలతో ఉపయోగం ఉండదు, కానీ టార్గెట్ ఎలా ఉంటుందో అసలుకే తెలీకపోవటం కన్నా ఇది మెరుగని ఏజెన్సీ వాదన.

ఫోటోని పక్కకి నెట్టేసి, తక్కిన సందేశాలని జాగ్రత్తగా విన్నాను. ఏదో రామదండు అట. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను సిద్ధాంతంతో కొత్తగా పుట్టుకొచ్చిన మతోన్మాద మూక! మక్కా మసీదులో పేలుళ్ల పథకం. ముహూర్తం రేపే. దాని సూత్రధారుల పని మిగిలిన ఏజెంట్స్ చూసుకుంటారు. ప్రధాన పాత్రధారి పని మాత్రం నేను పట్టాలి. అందుకు అనువైన స్థలం కూడా సూచించబడింది. ‌ఆ ప్రాంతం నాకు చిరపరిచితమైనదే. అయినా కూడా ఓ సారి ఫోన్‌లో ఆ ప్రాంతానికి సంబంధించిన తాజా మాప్ తెరిచి పరిశీలించాను. నేను చివరిసారిగా అటువైపు వెళ్లి చాన్నాళ్లయింది. ఈ మధ్యకాలంలో అక్కడ ఏమేం మార్పులొచ్చాయో తెలుసుకోవటం అత్యావశ్యకం.

 

మాప్ పని పూర్తయ్యాక మళ్లీ కళ్లు మూసుకుని మిగిలిన వివరాలు విన్నాను. ఆఖర్లో వినపడింది వాడి పేరు.

చిరంజీవి.

 

* * * * * * * *

అరగంటగా అక్కడ కాపుకాస్తున్నాను. తమ అమానుష పథకాన్ని అమలుచేసే క్రమంలో- అర్ధరాత్రి దాటాక చిరంజీవి నగరంలో అడుగుపెడతాడని, ఇదే దారిగుండా తన షెల్టర్‌కి వెళతాడని ఏజెన్సీ పంపిన సందేశం. కచ్చితంగా ఏ వేళకొస్తాడో తెలీదు. ఎంతసేపు నిరీక్షించాలో?

అది నగరానికి దూరంగా విసిరేసినట్లున్న పారిశ్రామికవాడ. పగలు హడావిడిగా ఉండే ఆ ప్రాంతం అర్ధరాత్రయ్యేసరికి నిర్మానుష్యంగా మారిపోతుంది. అక్కడక్కడా భవనాలు. వాటి మధ్యగా ఓ డొంకదారి. దాని పక్కనున్న తుప్పలూ పొదలే తప్ప చెట్లూ చేమలూ పెద్దగా లేవు. కొన్ని భవనాల్లో విద్యుద్దీపాలు వెలుగుతున్నాయి. నేనున్న ప్రాంతం మాత్రం చీకట్లో మునిగుంది – మతం చీకటి కమ్మేసిన మనుషుల్ని గుర్తుచేస్తూ.

ఏదో ద్విచక్ర వాహనం ఇటుగా వస్తోంది. డుగుడుగు శబ్దం. ఎన్‌ఫీల్డ్. దాని మీద ఒక్కడే ఉన్నాడు. చిరంజీవి?

డొంకదారి పక్కనున్న పొదల వెనక నక్కి కూర్చుని స్కానింగ్ మొదలు పెట్టాను. ఊఁహు. చిరంజీవి కాదు. శృంగారతార సినిమా సెకండ్ షోకెళ్లి వస్తున్న రసిక ప్రేక్షకుడు. వాడి ఆలోచనలు అమానుషంగా లేవు. అసహ్యంగా ఉన్నాయి. వాటితో ఎవరికీ ప్రమాదం లేదు. ఉంటేగింటే వాడికే. అది కూడా, వాడి బుర్రలో ప్రస్తుతం ఏముందో చదవగలిగే శక్తి వాడి పెళ్లానికుంటేనే.

 

నన్నెప్పుడూ ఓ సందేహం తొలిచేది. ఈ శక్తి నాకొక్కడికే ఉందా, లేక నా వంటివాళ్లు ఇంకా ఉన్నారా?ఉంటే, వాళ్ల మనసులతో సంభాషించటం సాధ్యమవుతుందా? ఆ ప్రశ్న నన్ను ఎన్నో రోజులు వెంటాడింది. చివరికో రోజు సమాధానం దొరికింది. దానికి నెలముందో దారుణం జరిగింది.

ఆ రోజు – అన్నిరోజుల్లాగే నగరమంతటా – నాన్నలు ఆఫీసులకెళ్లారు. అమ్మలు షాపింగ్‌కెళ్లారు. ‌భార్యాభర్తలు సినిమాలకెళ్లారు. పిల్లలు ప్లేగ్రౌండ్స్‌కెళ్లారు. ప్రేమికులు పార్కులకెళ్లారు.

వాళ్లలో చాలామంది తిరిగి ఇంటికి రాలేదు.

అమ్మ కూడా.

 

ఆ సాయంత్రం ఆమె మందులకోసం మెడికల్ షాపుకెళ్లింది, నాకు కుదరకపోవటంతో.

దారిలోనే నకుల్ చాట్ హౌస్. దాన్ని దాటుతూ ఉండగా ఆమె పక్కనే మొదటి బాంబు పేలింది. ఆ తర్వాత పది నిమిషాల వ్యవధిలో నగరంలో వరుసగా మరిన్ని పేలుళ్లు. వందల్లో మృతులు.

ఏం పాపం చేశారు వాళ్లు? లోపాలపుట్టలే కావచ్చు. కానీ మనుషులు వాళ్లు. నాలాంటి మనుషులు. బతకటం వాళ్ల హక్కు. దాన్ని లాక్కునేవాళ్లు మనుషులు కారు. నరరూప రాక్షసులు. నరికేయాలి వాళ్లని.

ఆవేదనలోంచి ఆవేశం. అందులోంచి ఆలోచన. నా శక్తితో ఏదన్నా చెయ్యలేనా? ఇలాంటివి జరగకుండా ఆపలేనా? బహుశా, నేనిలా ఉండటానికో కారణముందేమో. అది, ఇదేనేమో!

ఆ రాత్రి పిచ్చివాడిలా నగరమంతా తిరిగాను. బాంబు పేలిన ప్రతిచోటికీ వెళ్లాను. అన్ని చోట్లా రాక్షస గీతాలాపన. ఏదో చెయ్యాలి. ఈ ఘోరం మళ్లీ జరక్కుండా నా శక్తిని అడ్డేయాలి. కానీ ఎలా?

సమాధానం నెల తర్వాత వెదుక్కుంటూ వచ్చింది – ఏజెన్సీ నుండి.

ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉండే టెలీపతిక్స్ సభ్యులుగా, ప్రభుత్వాల ప్రమేయం లేకుండా నడిచే అజ్ఞాత సంస్థ – ఏజెన్సీ. మైండ్ రీడింగ్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాల ఆచూకీ పట్టేసి వాటిని నిరోధించటం దాని పని. చాలా రోజులుగా నా మనసుపై నిఘా ఉంచి, నా శక్తిని మంచికోసం వాడాలన్న తపన చూసి, తమలో ఒకరు కమ్మనే ఆహ్వానం పంపింది ఏజెన్సీ. అంగీకరించటానికి అరక్షణం కన్నా ఆలోచించలేదు.

 

ఆనందం.

నేను ఒంటరిని కాను. ఉత్పరివర్తనాన్నో, ప్రకృతి వైపరీత్యాన్నో కాను. నాలాంటి వారు మరిందరూ ఉన్నారన్న ఆనందం.

అది నాలుగు నిమిషాలే.

సభ్యత్వానికి సమ్మతం తెలిపిన వెంటనే ఏజెన్సీ నుండొచ్చిన రెండో సందేశం నన్ను కలవరపరచింది: “నీ భార్య మనసు చదువు”.

ఎందుకో అర్ధం కాలేదు. అన్యమనస్కంగా, అయిష్టంగా ఆ పని చేశాను.

 

దిగ్భ్రమ!

షాహిదాని వైట్ లిస్ట్ చేసి ఎంత తప్పు చేశానో వెంటనే అర్ధమయింది.

ఆలస్యం చెయ్యకుండా ఆ తప్పుకి పరిహారం చెల్లించాను.

నాటి నుండీ, ఎదురైన ప్రతి వ్యక్తి ఆలోచనలూ చదవసాగాను. ఉగ్రవాద కుట్రల్ని పసిగట్టటం, వాటిని ఏజెన్సీతో పంచుకోవటం, కుదిరితే కుట్రదారుల్ని మట్టుపెట్టటం – ఇదే నా పని. ఆ జాబితాలో ఇప్పటికే ఐదురుగున్నారు.

చిరంజీవి ఆరోవాడు.

వచ్చేది వాడేనా?

రోడ్డు మీద దూరంగా ఏదో ఆకారం, వేగంగా ఇటే నడిచొస్తూ.

పొదలమాటున సర్దుక్కూర్చుని స్కానింగ్ మొదలు పెట్టాను. పదే క్షణాల్లో తెలిసిపోయింది.

వాడే.

వాడి మనసులో – రేపు సాయంత్రం – మక్కా మసీదు – సూసైడ్ బాంబింగ్.

నేనుండగా ఆ పథకం అమలయ్యే ప్రసక్తే లేదు.

 

పొదల వెనక పొజిషన్ తీసుకుని సిద్ధంగా ఉన్నాను. వాడు నన్ను దాటి రెండడుగులు వెయ్యగానే వెనకనుండి లంఘించి మీదకి దూకాను. వాడు నేలమీద బోర్లాపడ్డాడు. ఊహించని దాడికి విస్తుపోతూ వెనక్కితిరిగాడు. అంత దగ్గరనుండి మసక వెలుగులోనూ వాడి ముఖం స్పష్టంగా కనబడింది. గెడ్డం పెంచి, మీసాలు తీసేసి, మహమ్మదీయుడిలా అగుపిస్తున్నాడు.

మసీదు ముంగిట ఎవరికీ అనుమానం రాకుండా బాగానే వేశావురా మారువేషం!

అంతలోనే వాడు నోరు తెరిచాడు. అయోమయం నటిస్తూ అడిగాడు. “కోన్ హే తూ? ఏం కావాలి?”.

హైదరబాదీ యాస కూడా బాగానే పలికిస్తున్నావురా. కానీ నన్ను ఏమార్చలేవు.

“నీ ప్రాణం,” అంటూ ఒకచేత్తో వాడిని నేలకేసి తొక్కిపడుతూ రెండో చేత్తో ఆయుధం బయటకి లాగాను. వాడి కళ్లలో అయోమయం స్థానంలో భయం చోటుచేసుకుంది. కీచుగొంతుతో అరుస్తూ నన్ను నెట్టేయబోయాడు. కానీ నా బలం ముందు వాడి శక్తి చాల్లేదు.

“దొరికిపోయావు చిరంజీవీ. నీ పథకం పారదిక,” అంటూ ఆయుధం పైకెత్తాను.

“యే చిరంజీవీ కోన్? నేను రియాజ్ అహ్మద్. ఛోడ్ దే ముజే,” అని దీనంగా చూశాడు గింజుకుంటూ. ఒక్క క్షణం ఆగిపోయి వాడి మనసులోకి చూశాను.

“నా అబద్ధం నమ్మాడో లేదో. ఇప్పుడేమన్నా తేడావస్తే ప్లానంతా అప్‌సెట్ అవుద్ది,” అనుకుంటున్నాడు. ముఖంలో మాత్రం కొట్టొచ్చిన దైన్యం.

మృత్యుముఖంలోనూ ఏం నటిస్తున్నావురా! నీ ముందు ఐదుగురిదీ ఇదే తీరు.

షాహిదాతో సహా.

 

ఏడాది తర్వాత కూడా ఆమె మాటలు నా జ్ఞాపకాల్లో తాజాగానే ఉన్నాయి.

“పోయిన్నెల నకుల్ చాట్ పేలుడులో మీ అమ్మ పోవటమేంటి? ఆ కుట్రలో నా హస్తం ఉండటమేంటి? మన పెళ్లయ్యేనాటికే అత్తయ్య కదల్లేని స్థితిలో మంచాన పడుందని, అదే మంచంలో ఏడాది కిందట పోయిందని  … కైసే భూల్ గయే ఆప్? ఆమె పోయినప్పట్నించీ అదోలా ఉంటే దిగులు పెట్టుకున్నావేమోలే, మెల్లిగా నువ్వే బయట పడతావనుకుని సరిపెట్టుకున్నా. చూడబోతే నీకేదో పిచ్చెక్కినట్టుంది. ఏదేదో ఊహించేసుకుంటున్నావు. నేను జిహాదీనేంటి నాన్సెన్స్! ఐదేళ్లు కలిసి కాపురం చేసినదాన్ని …  మైగాడ్. ఆ కత్తెక్కడిది? ఏం చేస్తున్నావ్ … స్టాపిట్ … యా అల్లా… ”

 

అదే తన ఆఖరి సంభాషణ. మహానటి. చచ్చేముందూ నిజం ఒప్పుకు చావదే! పైగా నేను పిచ్చివాడినని నన్నే నమ్మించబోయింది.

ఈ ఉగ్రవాదులందరికీ ఇదో ఉమ్మడి రోగం. తమ పిచ్చి తామే ఎరగని ఉన్మాదం. బ్లడీ సైకోపాత్స్. వీళ్ల పిచ్చికి ఒకటే మందు.

ఎత్తి పట్టుకున్న కత్తి కసిగా కిందకి దిగింది. సూటిగా, లోతుగా చిరంజీవి గుండెలోకి.

 

వాడి కళ్లలో కొడిగడుతున్న వెలుగుని తృప్తిగా చూస్తూండగా ఎందుకో మేధావి మాటలు గుర్తొచ్చాయి.

“నువ్వేది నమ్మితే నీకదే నిజం”.

 

*

గమనిక: ఈ కథ ముగింపులోని అస్పష్టతపై వ్యాఖ్యలకి, విమర్శలకి ఆహ్వానం. అదే సమయంలో, ముగింపు బయట పెట్టేయకుండా సంయమనం వహించమని మనవి.

——–

 

మీ మాటలు

 1. శ్రీనివాసుడు says:

  ‘‘Reality is merely an illusion, albeit a very persistent one.” – Albert Einstein
  ఈ వ్యాఖ్యని గురించి ఇద్దరు ఫిజిక్స్ ఫ్రొఫెసర్ల వివరణ విన్న తరువాత ఐన్ స్టీన్ ఇలా అన్నాడని నాకు అర్థమయింది.
  ‘‘In a certain sense, therefore, I hold that pure thought can grasp reality, as the ancients dreamed’’
  ‘‘ఏ భావజాలానికో రాగద్వేషాలతో కొమ్ముగాయకుండా నిర్నిబద్ధంగా ఆలోచన చేస్తే సత్యాన్ని చేరుకోవచ్చు’’
  ************************************************************
  ఇక ఆ ఇద్దరు ప్రొఫెసర్ల వివరణ:
  Paul Mainwood, Doctorate in the philosophy of physics
  Einstein did not say that. No matter how many times that quote appears on the internet, Einstein did not say it, write it, or believe it.
  There are a variety of passages where he wrote something that has some similar words in it, and it might be possible to twist this into the quote above it you translate it badly, ignore the context, and pass it through a few brains that desperately want Einstein to be a fount of mysticism.
  The closest of these passages (and probably the source) appears in a letter written in March 1955 after the death of Michele Besso, and addressed to his family. Besso was his lifelong closest friend, the man who introduced him to the works of Ernst Mach and helped him with his struggles in coming up with General Relativity.
  What he wrote was this:
  Now he has departed from this strange world a little ahead of me. That means nothing. People like us, who believe in physics, know that the distinction between past, present and future is only a stubbornly persistent illusion.
  (Einstein: 1955 – letter to the family of Michele Besso)
  This is much easier to understand. Einstein is here referring about the non-appearance of a “now” in the best theories of physics (especially his own special and general relativity). Instead, you get a “block universe” view, where there is no distinction between the events in the past, present and future, with all considered on an equal footing.
  By the way, Einstein was right in his macabre prediction. He died one month after writing the letter.

  దీనికి మరొక ప్రొఫెసర్ సవరణ
  Tom McFarlane, degree in physics from Stanford:
  Einstein did say that, however, write something similar:
  “For us believing physicists, the distinction between past, present and future is only a stubbornly persistent illusion.” -Einstein, The Expanded Quotable Einstein. Calaprice, Alice, ed. (Princeton: Princeton University Press, 2000). p. 75.
  What he was referring to here is the impossibility, according to his theory of relativity, of any objective determination of “now,” and the lack of a unique objective distinction between past and future, since these depend on the reference frame. In his words,

  “The four-dimensional continuum is now no longer resolvable objectively into sections, which contain all simultaneous events; “now” loses for the spatially extended world its objective meaning. It is because of this that space and time must be regarded as a four-dimensional continuum that is objectively unresolvable.” -Einstein, Ideas and Opinions. (New York: Crown Publishers, 1954). p. 371.

  The erroneous quote in the original question, by the way, is actually inconsistent with what Einstein actually thought. For Einstein, reality is what is true, not what is illusory. Consider this passage:

  “If, then, it is true that the axiomatic basis of theoretical physics cannot be extracted from experience but must be freely invented, can we ever hope to find the right way? Nay, more, has this right way any existence outside illusions? …I answer without hesitation that there is, in my opinion, a right way, and that we are capable of finding it. …
  In a certain sense, therefore, I hold that pure thought can grasp reality, as the ancients dreamed.” -Einstein, Ideas and Opinions. (New York: Crown Publishers, 1954). p. 274.

 2. పొరుగింటి మనుషుల్ని పలకరించే ఆసక్తి లేకున్నా ముఖపరిచయం లేని మిత్రుల రోజువారీ ముచ్చట్లు మాత్రం క్రమం తప్పక తెలుసుకునేవాళ్లు.

 3. aruna gillkum says:

  సూపర్బ్…బట్ ఆ ఎందింగ్ ఇంకా బాగుంది..

 4. Lalitha P says:

  అస్పష్టత అనేదేదైనా ఉందనుకుంటే అది సరైన పాళ్ళలో కూరలో ఉప్పేసినంత… ఒక్క ఊపున చదివించిన థ్రిల్లర్. కంగ్రాట్స్..

 5. S.Radhakrishnamoorthy says:

  పాఠకుణ్ణి నమ్మించడానికి చేసిన మంచిప్రయత్నం, కథముందు కొటేషన్ దగ్గరనుండి. తను నమ్మిందే నిజం అనుకునే భ్రాంతుడికి అంతా అపనమ్మకమే. ముస్లిం భార్య టెర్రరిస్ట్ కాదని ఎలా నమ్మగలడు? కాదని మొత్తుకున్న మాత్రాన అమాయకుణ్ణి టెర్రరిస్టు కాదని నమ్మి ప్రాణాలతో వదిలేస్తాడా?ముష్కరులు ! కాని కథకుడి ముసుగు త్వరగానే తొలగిపోతుంది.ఈ కాషాయభ్రాంతివిషయమైన కథలు చాలానే వచ్చాయి. కథనవిధానం దె బొర్జ్ (లాటిన్ అమెరికన్ రచయిత )’ది షేప్ అఫ్ ది సోర్డ్’ను గుర్తుచేస్తున్నది.

  • శ్రీనివాసుడు says:

   రాధాకృష్ణమూర్తిగారూ!
   మీరు చెప్పిన కథ చదివేను ‘‘ది షేప్ ఆఫ్ ది స్వోర్డ్’’ కథా సంవిధానం మహత్తరంగా వుంది. ధన్యవాదాలు.
   తోటి పాఠకుల సౌకర్యంకోసం ఆ లంకె ఇస్తున్నాను.
   http://www.coldbacon.com/writing/borges-sword.html
   **************************************************************************************************
   ఇక, మీరు చెప్పిన భ్రాంతి, ఇల్యూషన్ విషయానికి వస్తే కథ కాల అవధిలోని సంఘటనలలో, వర్తమానంలోని దేశపరిస్థితిలో దేశంలోని అన్ని రాజకీయ భావజాలాలూ భాగస్వామ్యమే.
   ఆ విధంగా చూస్తే సేఫ్రాన్ ఇల్యూషన్ ఒకటే కాదు, బ్లూ ఇల్యూషన్ , రెడ్ ఇల్యూషన్, హ్యాండ్ ఇల్యూషన్ , ప్రోగ్రెసివ్ ఇల్యూషన్, హేట్రెడ్ ఇల్యూషన్ లాంటివి చాలానే వున్నాయి.
   కథలో చెప్పినదాన్ని మనం సకారాత్మకంగానే తీసుకుని అన్నిరకాల ఇల్యూషన్ల పేరనాయిడ్ స్కిజోఫ్రేనియా ప్రతిపాదించాడని భావిద్దాం. మిగతా ఇల్యూషన్ల గురించి కూడా కథలను ఆశిద్దాం.
   లేదా, ‘‘ఐన్‌స్టీన్ కొటేషన్ సరిగ్గా అర్థంగాక మిగిలిన ఇల్యూషనేమోలే’’ అని సర్దిచెప్పుకుందాం.

  • S.Radhakrishnamoorthy says:

   శ్రీనివాసుడుగారూ,ధన్యవాదాలు. నేను సుమారు ఏభై ఏళ్ళ క్రితం అప్పటి ‘ఇ ల్లస్త్రేటెడ్ వీక్లీ’ లో చదివాను. కరెక్టు గా గుర్తుందో లేదో అనుకున్నాను. నిజమే, మీరన్నట్లు తక్కిన ఇల్యూజన్స్ వస్తువుగా కూడా కథలు ఆసిద్దాం.
   ఫుల్ క్రెడిట్ టు అనిల్ రాయల్.

   • శ్రీనివాసుడు says:

    రాధాకృష్ణమూర్తిగారూ,
    ‘‘భ్రాంతి’’ అనే పదం, ‘‘రాక్షసగీతం’’ అనే శీర్షిక చూడగానే నాకు ’’మాయాబజార్‘‘ లో తానా, తందానా, రాక్షస గురువు చిన్నమయ, దండనాయకులు లంబు, జంబుల సన్నివేశం గుర్తుకు వచ్చింది.
    ‘‘శర్మా, భోజనాల తంతు దగ్గర జరిగిందేమిటి? కనికట్టా? గారడీనా’’ – ’మరహ భ్రాంతి‘
    ’’మరి, ఇదో?‘‘ – భ్రాంతి లేదు, గీంతీ లేదు పైత్యప్రకోపంలో ఒక రూపం ఈ భ్రాంతి
    ‘‘శర్మా, ఇదీ భ్రాంతేనా?’’ – ఇదీ ’లో భ్రాంతి‘.
    ’’శర్మా, ఇదేం భ్రాంతయ్యా?‘‘ – ఇది ’సమాధి భ్రాంతి‘.
    షరా: కాస్సేపు ఆ సన్నివేశం గుర్తుతెచ్చుకుని నవ్వుకోడానికి మాత్రమే.

 6. వాక్యాల్లోని మెరుపూ విరుపూ చాలా బావున్నాయి

 7. Madhu Chittarvu says:

  Kathanam baavundi.aspashtatha yemi ledu.. .diagnosis paranoid scihzophrenia.

  • శ్రీనివాసుడు says:

   హా.. హా…హా… బట్ హూ ఈజ్ ది పేషెంట్ డాక్టర్ జీ? ఆర్ దే ఇంక్రీజింగ్ ఇన్ నంబర్ డే బై డే?

 8. డియర్ అనిల్ సర్,

  మీ ‘రాక్షస గీతం’ కథ చదివాను. నేను ఇప్పుడిప్పుడే చదివే అలవాటు పెంచుకుంటున్నాను. కాబట్టి ఒక ఎక్స్పర్ట్ లాగ విశ్లేషణలు చేయలేను.

  తెలుగు కథల్లో నావెల్టీ/ వేరియేషన్ ఉండదు; అన్నీ సీరియస్ గానో, సందేశంతోనే ఉండే కథలు మాత్రమె వస్తాయి అననుకునే నాకు మీ కథ, నా అభిప్రాయాన్ని మార్చుకునేలా చేసింది. తెలుగులో కూడా విభిన్నంగా రాయడానికి ప్రయత్నించే రచయితలు ఉన్నారని చెప్పింది.

  I thoroughly enjoyed reading the story. మీ కథ చదివినంతసేపు ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. I would love to see more and more of such interesting writing styles than just message oriented stories.

  Once again, I loved your story. Keep writing interesting stories. Congrats.

  Vijay

 9. చందు తులసి says:

  అనిల్ గారూ కథ పజిల్ లాగా….వెరైటీగా భలే వుంది సర్. మొదటి కథ నాగరి కథ నుంచీ ప్రతీ కథకూ సబ్జెక్ట్ తో పాటూ….చెప్పడంలోనూ కొత్తదనం చూపిస్తున్నారు. ప్రతీ వాక్యమూ జాగ్రత్తగా చదవాల్సిన కథ.
  కొత్త కథకులు చాలా నేర్చుకోవాల్సిన కథ ఇది.
  మరో సారి అభినందనలు సార్.

 10. అనిల్! భలే బాగుంది కథ. చెప్పదలచింది చాల ఒడుపుగా చెప్పారు. మనసారా అభినందనలు. కుంచెం అసూయతో కూడిన అభినందనలు. :-)
  నాకొక సందేహం వుంది. కేవలం ఈ కథ గురించి కాదు. ఘోరాల వెనుక వున్నది ‘విశ్వాసాల’ సమస్యేనా? అది కూడా… తాము ఏది నమ్ముతున్నారో అదే నిజమనుకునే కొందరి మానసిక రోగమేనా? దీని వెనుక ఉన్నదీ, దీన్ని నడిపించేదీ చాల బలమైన ఆర్ఠిక రాజకీయం కదా? దాన్ని దాని కళ్ళలోకి చూసి మాట్లాడకుండా, నేటి ఘోరాన్ని మానసిక జబ్బు కిందికి నెట్టేస్తున్నామేమో?
  చాల బాగా రాసిన ఓ మంచి కథ మీద ఇలా డీవియేటింగ్ చర్చ చేస్తున్నానేమో, మన్నించాలి.
  శ్రీనివాసుడు గారు, మీకు తెలిసిన వుపయోగకర విషయాలు తరచు పంచుకుంటున్నారు. మీకు వేరుగా థాంక్సు.

  • శ్రీనివాసుడు says:

   హమ్మయ్య, హెచ్చార్కె గారూ!
   మీకు నేనే ధన్యవాదాలు చెప్పాలి. చర్చను ప్రక్కదోవ పట్టించినట్లు అవుతుందేమోనని భయంతోనే ఈ కథ గురించి నా మొదటి అభిప్రాయాన్ని ఇక్కడ వ్రాయలేదు.
   ముందుగా –
   ‘‘ఘోరాల వెనుక వున్నది ‘విశ్వాసాల’ సమస్యేనా? అది కూడా… తాము ఏది నమ్ముతున్నారో అదే నిజమనుకునే కొందరి మానసిక రోగమేనా? దీని వెనుక ఉన్నదీ, దీన్ని నడిపించేదీ చాల బలమైన ఆర్ఠిక రాజకీయం కదా? దాన్ని దాని కళ్ళలోకి చూసి మాట్లాడకుండా, నేటి ఘోరాన్ని మానసిక జబ్బు కిందికి నెట్టేస్తున్నామేమో?‘‘
   అని ఇప్పుడు మీరే అడిగేసేరు కాబట్టి, ఇక నాలాంటి సామాన్యుడు ధైర్యంగా తన అభిప్రాయం చెప్పడంలో తప్పులేదు.
   ***************************************************************
   ముందుగా మీరు లేవనెత్తిన ప్రశ్న. ’ఆర్థికకోణం మానసికరోగం కాదా?‘ అని నాకు అర్థమయింది. దీనికి నాకు తెలిసిన సమాధానమేమంటే కచ్చితంగా మానసికమైన జబ్బే. ఒకరకంగా చెప్పాలంటే చాలా ప్రమాదకరమైన మానసికరోగులు వాళ్ళు. మనం చదువుతూవుంటాం వార్తాప్రతికలలో – అవినీతి నిరోధక శాఖ దాడుల్లో అనేక కట్టలు కట్టల కరెన్సీనోట్లు బీరువాల్లో, మంచాల క్రింద, లాకర్లలో, ఎక్కడ సందు దొరికితే అక్కడ పెట్టిన వైనాలు మనం చదువుతుంటాం. నేను చదివినవాటిల్లో పరాకాష్ఠ ఏమంటే అలాంటి దాడి సందర్భంగా ఒక అధికారికి వున్న వందలాది లాకర్లని తెరిచిన ఎసిబి వాళ్ళు మూర్ఛపోయారు. ఆ లాకర్లు కొన్ని పదుల సంవత్సరాలుగా తెరవలేదు. కొన్ని వందల డబ్బుల కట్టలు ఆ లాకర్లలో క్రుక్కి వున్నాయి. ఆ కట్టలు వీళ్ళు ముట్టుకోగానే నుసి నుసిగా రాలేయి. అంటే, అక్రమ సంపాదన తేవడం, లాకర్లలో వేయడం ఎన్నో ఏళ్ళనుండి సాగుతోంది. చివరికి ఆ కాగితపు కరెన్సీ వాతావరణ మార్పులకి లోనై పొడి పొడి అయిపోయాయి నోెట్లు.
   మనం రోడ్లమీద, మురుగుకాలవల దగ్గర, చెత్త కుండీల దగ్గర విధివంచితులైన కొంతమంది మానసిక రోగులని చూస్తుంటాం. వాళ్ళు ఒక గోతాన్ని తీసుకుని రోడ్డుమీద కనబడిన ప్రతి వస్తువునీ దానిలో వేసుకుని ప్రోగుచేస్తుంటారు. ఆ మూటని చాలా జాగ్రత్తగా ప్రాణంకన్నా మిన్నగా చూసుకుంటారు వాళ్ళు. దాన్ని తాకితే ఊరుకోరు. మనమీద దాడిచేస్తారు. వాళ్ళకు అదే గొప్ప నిధి.
   అలాగే, చిన్నపిల్లలు మట్టితో, ఇసుకతో, వాళ్ళకు దొరికే చిన్న చిన్న వస్తవులతో ఆడుకుంటూ వాటిని ప్రాణప్రదంగా చూసుకుంటారు.
   అంటే, డబ్బుని ప్రోగుచేసేవాళ్ళు పిచ్చివాళ్ళలాగానో, లేదా, పిల్లల ఎదగనితనంతోగానీ చేస్తుంటారని నాకు అర్థమయిన విశ్లేషణ. అందుకే, వాళ్ళు జీవితాన్ని, సమాజాన్ని చూసే వైఖరిలో చిన్నపిల్లలుగా వున్నప్పటినుంచీ దిద్దకపోతే ‘‘ధనచిత్తచాంచల్యం’’ అనే మానసిక జాడ్యానికి బలవుతారు.
   నా దృష్టిలో వాళ్ళంతా మానసిక రోగులే.
   ********************************************************************************************
   ఇక ఈ కథ గురించి…….
   కథకు సారం అని నేననుకున్న, కధకు ముందుగా ఇచ్చిన ఉటంకింపు ‘‘తప్పు’’ అని నాకు ఐన్‌స్టీన్ వ్యాఖ్యని గురించి పరిశోధిస్తే అర్థమయింది. అంటే, కథకు పునాది ఆయన చెప్పిన దాని గురించిన ఒక పొరపాటు అవగాహన.
   The erroneous quote in the original question, by the way, is actually inconsistent with what Einstein actually thought. For Einstein, reality is what is true, not what is illusory.
   ఆయన దృష్టిలో యథార్థ్యము అంటే సత్యమే, అంతేగాని భ్రాంతి కాదు.
   **********************************************
   ఆ ఉటంకింపు అసలు ఇవ్వనేలేదని భావిస్తే,
   కాషాయ భ్రాంతి గురించి – దీనికి నేను పైన వ్యాఖ్యలో చెప్పేను. ఒక్క కాషాయభ్రాంతే కాదు, నీలి భ్రాంతి, ఎఱ్ఱెఱ్ఱని భ్రాంతి, హస్త భ్రాంతి, ఎడమ భ్రాంతి, ఎడమాతి ఎడమ భ్రాంతి, కుడి భ్రాంతి, మహా కుడి భ్రాంతి, ఆకుపచ్చ భ్రాంతి, ప్రగతిశీల భ్రాంతి, విద్వేష భ్రాంతిలాంటి అనేకం వున్నాయి. వాదాలన్నీ ఒక విధంగా చూస్తే భ్రాంతులే. నువ్వు ఏది నమ్మితే అదే నిజం కాదు. వాదాల పరిమితులు, అవి ఎంతవరకూ అవసరమో గ్రహింపు లేకపోతే ప్రతి ఇజమూ, నమ్మకమూ భ్రాంతిగానే మారుతుంది.
   ఇక్కడ ఒక సాంకేతిక అంశం డాక్టర్ చిత్తర్వు మధుగారి వ్యాఖ్య ద్వారా తెలిసింది, ‘‘పేరనాయిడ్ స్కిజోఫ్రేనియా’’. అయితే, పేషెంట్ ‘‘ప్రొటాగనిస్టా లేక అతడిని నియంత్రించే సంస్థా’’ అనేది నాకు అర్థం కాలేదు.
   *************************************************************************************
   అసలు ఇవేవీ కావు. ‘‘జగన్మిథ్య బ్రహ్మ సత్యం’’ అనే అత్యున్నత తాత్త్విక స్థాయిలోనుండి ఆలోచిస్తేనే ఈ కథ అర్థం అవుతుంది అనుకుంటే, కథలో చెప్పిన ‘‘నకుల్ చాట్ ప్రేలుళ్ళు మిథ్య, శవాలు మిథ్య, నేను నమ్మిన భావజాలమే నిరంతర సత్యం’’ అనే స్థాయికి ఎదగవలసి వుంటుంది. నాకయితే ఆ స్థాయి రాలేదు. నాకు జగత్తు సత్యమే, కళ్ళ ఎదురుగా జరిగిన సంఘటనలూ సత్యమే. భావజాలాలే సర్వస్యం కాదు, జీవితమే సత్యం.

 11. >> “కథకు సారం అని నేననుకున్న, కధకు ముందుగా ఇచ్చిన ఉటంకింపు ‘‘తప్పు’’ అని నాకు ఐన్‌స్టీన్ వ్యాఖ్యని గురించి పరిశోధిస్తే అర్థమయింది. అంటే, కథకు పునాది ఆయన చెప్పిన దాని గురించిన ఒక పొరపాటు అవగాహన”

  ——–

  శ్రీనివాసుడు గారు,

  విలువైన సమాచారం సేకరించి అందజేస్తున్నారు. ధన్యవాదాలు.

  కాకపోతే ఒక్క విషయంలో మీరు పొరబడ్డారని చెప్పటానికి చింతిస్తున్నాను. It’s about that Einstein’s quotation. It doesn’t matter whether Einstein said it or not; and it also doesn’t matter what he really meant by it. “Reality for you is whatever you believe it to be” (A slight variation on something Stephen Hawking once said). That’s the whole point of this short story. It applies to the opening quotation as well. It was meant to be a clue to what’s coming at the end, along with half a dozen other subtle clues included within the story. It has no other relevance than that.

  ఈ ప్రపంచంలో అందరికీ సత్యం అనేది ఒకటేనైతే ఎంత బాగుంటుంది? కాకపోబట్టే కదా ఈ గొడవలన్నీ.

  ఇక – హెచ్చార్కే గారికి మీరు బదులిచ్చినట్లు – డబ్బు పిచ్చి కూడా ఒక మానసిక జాడ్యమే. ఈ అంశమ్మీద మీరూ నేనూ నమ్మేది ఒకే నిజం :-)

 12. కె.కె. రామయ్య says:

  మంచికీ చెడుకీ మధ్య, నలుపుకీ తెలుపుకీ నడుమ, మానవ మస్తిష్కంలో కొలువైన అవధుల్లేని ఊహాలోక నిరంతర సంఘర్షణ, దాని ధాటికి గురవుతున్నస్థితిభ్రాంతిని “రాక్షస గీతం” గా అద్భుతంగా ఆవిష్కరించిన అనిల్ గారికి మనసారా అభినందనలు.

  ప్రియమైన శ్రీనివాసుడు గారు, గతకాలం లోని ఎఱ్ఱెఱ్ఱని భ్రాంతి ( రెడ్ ఇల్యూషన్ ) ఎక్కువగా ఆత్మ బలిదానాలు, నిస్వార్ధ త్యాగాలే చేసిందని నా భ్రాంతి.

  • శ్రీనివాసుడు says:

   ఆ విషయంలో మీతో నాకు సంపూర్ణ ఏకీభావం వుంది రామయ్యాగారూ!
   కానీ, మీకు అక్కడ చూపించిన అన్ని భ్రాంతులూ అదే స్థాయిలో ఆత్మబలిదానాలు చేసేయి, తమ ఇజాన్ని కాపాడుకోడానికి ( అంటే, భ్రాంతిలో, భ్రాంతికోసం, భ్రాంతితో)
   అలా చేసినవారూ సమాజంకోసమే చేసేమని చెబుతారు.
   అసలు ఎంత ఎక్కువ భ్రాంతిలో వుంటే అంత ఎక్కువ బలిదానాలు జరుగుతాయి. ( ఆత్మాహుతి దాడులు)
   ఆత్మబలిదానాలు చేసేరు కాబట్టి మూడు కాలాల్లోనూ ఆ ఇజమే సత్యం అనుకోవడమే భ్రాంతి.
   నేను పై సమాధానంలోనే చెప్పేను, దాని పరిమితి, అవి ఎంతవరకూ అవసరమో గ్రహించక, ప్రతి విషయానికీ యాంత్రికంగా అన్వయించుకుంటూ పోతే ప్రతి ఇజమూ భ్రాంతే అవుతుంది.
   మార్క్సిజం పట్ల అత్యంత అంకితభావం, బోలెడంత అవగాహనా వున్న నా మిత్రులొకరు ఈ మధ్యన ఇలా చెప్పేరు,
   ’’మార్క్సిజాన్ని ముందుగా రక్షించవలసింది లెఫ్ట్ పార్టీల బారినుండి. ఎందుకంటే, సమస్త సమస్యలకూ భావజాల యాంత్రిక అన్వయాల ఊబిలో కూరుకుపోతున్నారు.‘‘
   మార్గం, లక్ష్యం వేర్వేరు కావు రామయ్యగారూ!

 13. ramavarapu ganeswara rao says:

  అనిల్ ‘రాక్షస గీతం’ కథాభిమానులు అందరూ చదవ వలసిన కథ. ఇదొక eclectic story చాక్లెట్లా చప్పరించి వదిలేయాల్సింది కాదు. హేమ్లెట్ ‘టు బి ఆర్ నాట్ టుబి’ ని వివరించడానికి ఎందరో ప్రయత్నించారు, కారణం అదొక స్పోర్ట్ ఇన్ క్రిటిసిజం . ఇది అలాటిదే, ఒక తాత్వికతకు రూపం కల్పించడానికి అనిల్ ఎంతో శ్రమపడి అద్భుతమైన శిల్పాన్ని ఇచ్చారు. ఇలియట్ ‘ప్రుఫ్రాక్ ప్రేమ గీతం’ అర్థం చేసుకోవటానికి దాని నేపథ్యాన్ని గ్రహించాలి, ఎంతో శ్రమ పడాలి. రెండు ప్రపంచ యుద్దాల తర్వాత ఆధునిక ప్రేమికుడు ఎలావుంటాడో అనే దానికి ఉదాహరణ ప్రుఫ్రాక్ అయితే ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్న మారణహోమాల సృష్టి – అనిల్ ప్రధాన పాత్ర. సంఘటనలు అతని కళ్ళల్లోంచే చూస్తాం. మనం అయోమయంలో పడటానికి కారణం కథకుడు వాడిన అద్భుత శిల్పం. కథను సూటిగా చెప్పడు. కథలో ఓ మార్మికత వుంది. ఒక సైంటి ఫిక్షన్ కథ లా కూడా దీన్ని ఉదహరించవచ్చు. కుటుంబరావు నాన్ ఫిక్షన్ ‘బుద్ధికొలత వాదం’, ‘ఫోర్త్ డైమన్షన్’ కథ ఈ సందర్భంగా ఉదహరించవచ్చు. అనిల్ కథ ఒక పీడకల – రుధిర వర్షంతో మొదలై, అంత భయంకరంగనూ ముగుస్తుంది. నిజం అన్నది భ్రమ, మనకి మనం వ్యక్తిగతంగా ఏది నమ్మితే అదే నిజం , సత్యం సాపేక్షికం, మానవనైజంలో శాంతివాదమూ ఉగ్రవాదమూ రెండూవున్నాయి లాంటి మేధావులనే మాటలు కథలో సరైన సమయాల్లో చోటుచేసుకుంటాయి. కథలోని ‘నేను’ ఒకటి తర్వాత మరొక దృశ్యం చూపిస్తూ తన మనసులోని మాటలను పంచుకుంటాడు – వయసులో తనకన్నా పెద్దయిన వివాహితను చూస్తూ, ఆమె మొగుడుని చంపి తన సొంతం చేసుకుంటానని అనుకునే కుర్రాడు, సెల్ ఫోన్లో సొల్లు కబుర్లు చెప్పే నవతరం అమ్మాయిలూ, కంటికెదురుగా ఉన్న అందమైన దృశ్యాన్ని ఆస్వాదించటానికి టైములేక సెల్ లో తర్వాత చూడొచ్చులే అనుకునే ఆధునిక భావుకుడు , భార్యను చంపటానికి కిరాయి హంతకుడిని ఏర్పాటుచే అపరాధనా భావంతో బాధపడుతున్న అనుమానపు భర్త.. మన కళ్ళముందు కదిలిపోతారు. సైబర్ వాస్తవంలో ముసుగులు కప్పున్న వాళ్ళకి ఎదుటి వ్యక్తీ ఆలోచనలు తెలుసుకోలేరని, అలా తెలుసుకున్న నాడు చెడు ఆలోచనలను నియంత్రించటం సాధ్యం అవుతుండంటాడు, ప్రపంచానికి తన అవసరం ఉండదు అని అనుకుంటాడు, ఎందుకంటే ఇతరుల మనసులని చదివే శక్తి తనకి ఉందంటాడు. తన మనసులో ఏముందో అవతలివాడు తెలుసుకోడాన్ని ఎవడూ ఇష్టపడడు కనుక తను ప్రేమించి పెళ్ళాడిన భార్య మనసు అతడు చదవడు. అదే తన కొంప ముంచిదని అంటాడు. మరో సారి ఆ తప్పు చేయడు. ఆ రెండు సంఘటనలనూ క్రమం తప్పించి రచయిత మనకు సూచిస్తాడు. అగాథ క్రిస్టీ లా పాఠకులని మభ్య పరచడు. తెలివైన పాఠకుడు రచయిత ఉదహరించిన సంఘటనల ద్వారా కథలోని ప్రధాన పాత్ర ప్రవర్తనని అర్థం చేసుకుంటాడు. సమాజంపై రచయిత విసుర్లు ఉన్నాయి. ఒక తాత్వికత, మార్మికత ఉన్నాయి. ‘బ్రేకింగ్ న్యూస్’ అంటూ సమకాలీన పరిస్ఠితులమీద చెణుకులున్నాయి. ఇటువంటి కథలు ఎప్పుడో గాని రావు. సగటు తెలుగు పాఠకుడి కోసం రాసినది కాదు. రచయిత తన పాఠకులుకూడా తనంత వివేకవంతులని ఊహించి కథను రాసినట్టుంది. ఈ కథను సరిగా చదవని వారికే అస్పష్టత ఉందని అనిపిస్తుంది.

 14. Vijaya Karra says:

  “నువ్వేది నమ్మితే నీకదే నిజం” – చివరి వరకూ (ఎప్పటిలానే) సస్పెన్స్ బాగా మైంటైన్ చేసారు. ఎప్పుడో చూసిన “ఆమె కథ” , “The Others ” మూవీస్ గుర్తుకి వచ్చాయి.

  • గొరుసు says:

   “ఆమె కథ ” లో జయసుధ అంతకుముందు వివాహ జీవితంలో మానసికంగా భర్త వల్ల దెబ్బ తిని ఉంటుంది – కాబట్టి ఏ దంపతులను చూసినా వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉన్నట్టు ఫీలవుతుంది . అందు వలన తను విన్నదే నిజం అనుకుంటుంది.
   (బహుశా, కె. రాఘవేంద్ర రావు తీసిన అతి కొద్ది మంచి సినిమాల్లో ఇదీ ఒకటి అనుకుంటా – మూలం : వాసిరెడ్డి సీతాదేవి గారి “మానిని – మనసు ” నవల )
   – గొరుసు

   • Vijaya Karra says:

    నిజమే గోరుసు గారు! ఆ టైమ్ లో విమెన్ ఓరియెంటెడ్ మంచి సినిమాలు చాలా వచ్చాయి.

 15. మొత్తం మీద యాబ్సొల్యూట్ ట్రూత్ అనేది ఉండదంటారు…
  (బై ద వే.. భ్రాంతులదే మెజారిటీ అంటారు, అవునా)

 16. THIRUPALU says:

  కధా కధనం బాగుంది. కానీ ఒకరని కొకు గారి బుద్ధి కొలత వాదం గుర్తొస్తుంది. ఆయన వాదాన్ని మేధావి వర్గం ఎప్పుడో పూర్వ పక్షం చేసింది. ఇటీవలి కాలం లో టెలిపతి లాంటి వాటి అవసరం చాలా బాగా ఉంది గనక మళ్ళీ మేల్కొంటున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవడు నమ్మకం వాడి వాడి భ్రమ అయితే అసలు సత్యం ఏదో? ఇలాంటి మార్మికతలో ముంచటం మతంకంటే తేలికయినది మరి! మతం లొ మూర్చ పోని వారికి. సైన్స్‌మూర్చలొ ముంచవచ్చు. న్నేపే

 17. రమణ కెవి says:

  కథ కొత్తగా ఉంది. చదివించింది. నువ్వు ఏది నమ్మితే అదే నిజం అన్న థీం చుట్టూ అల్లడం, ‘ఇస్లామిక్ టెర్రర్’, ‘హిందూ టెర్రర్’ context అర్థమవుతున్నాయి. ఆ జంటను చూసిన కుర్రాడు భర్త(?)ను చంపేసి భార్య(?)ను లేవదీసుకుపోవాలనుకుంటాడు. కానీ అలా చేయడు. షహీదా కూడా మనసులో టెర్రర్ ఊహలు చేస్తుంది. కానీ టెర్రర్ లో పాల్గొనదు. చిరంజీవి కూడా మనసులో టెర్రర్ ఊహలు చేస్తాడు. కానీ టెర్రర్ లో పాల్గొనడు. కానీ వాళ్ళ మనసును చదివిన ఈ కథ చెబుతున్నవ్యక్తి ఆ ఊహలనే నిజమని నమ్మి వాళ్ళను చంపేస్తాడు. అంటే వాళ్ళ ఐడెంటిటీని బట్టి టెర్రరిస్టులుగా ముద్ర వేసి చంపేస్తున్నారని రచయిత చెప్పదలచుకున్నారా? అలా నువ్వు ఏది నమ్మితే అదే నిజం అన్న కోట్ ను justify చేస్తున్నారా? ఈ అస్పష్టతను వివరించగలరు.

 18. కొట్టం రామకృష్ణారెడ్డి says:

  “నువ్వేది నమ్మితే ‘నీకదే’ నిజం”
  నిజంగా నిజమే!

 19. శ్రీనివాసుడు says:

  Synopsis for
  Minority Report ……………..

  http://www.imdb.com/title/tt0181689/synopsis?ref_=ttpl_pl_syn

 20. Mayukh Adithya says:

  చాలా ఆసక్తిగా చదివించింది ఈ కథ!!

 21. Chaitanya says:

  The writer explicitly requested to not reveal the ending. How hard is it to do?

 22. THIRUPALU says:

  ‘పచ్చకళ్లాద్దాల మనిషికి లోకం అంతా పచ్చగా తెలిసినట్లు’ అన్న సామెత కు ‘ నివేదిక నమ్మి తే అదే నిజం ‘ అన్నం భావానికి పెద్ద తేడా వుందా? రెండు ఒకటుే! మనషులు సహాజంగానే పుట్టి పెరిగిన వాతవారణం,ప్రభావితం చేసిన మనుషులు భావజాలాలు బట్టి ఆవ్యక్తి ఆలోచనలు ఉంటాయి. వాటికి బేస్ లేకుండా ఉండవు.- అంటే పూర్తిగా స్వతంత్ర ఆలోచనలు కావు, అలాగే పూర్తిగా అస్వతంత్ర ము కావు. తాడును చూసి పాము అను కోడం కూడా జరగదు.పాము అను కోవడం కూడా నీ అనబవక్రమంలోనే వస్తుంది. ఉన్న పళంగా పాము అన్న పదం నీకు తెలియదు. అది అనుభవపూరకంగా నేర్చకొంటేనే వచ్చింది.

 23. JAYAREDDY BODA says:

  మీ కథలో మనుషుల నిజాల గురించి అంతరంగాల గురించి వారిలోని క్రూరత్వం గురించి చాలా ఆర్ద్రంగా చెప్పారు చాలా బాగుంది.

 24. అనిల్ గారు, ఏకబిగిన చదివించారు. కథ, కథనం, మీ మార్కు వచనం, అన్నీ అద్భుతంగా ఏకీకృతం చేసారు. ఇటువంటి కథలు హడావిడిగా రాయడం అసంభవం, అలానే పాఠకుడు చదివి పక్కన పెట్టే కథ కాదు..ఒకటికి రెండు సార్లు దృష్టి పెట్టి చదివాల్సిన కథ. పాఠకుడికి హోదానిచ్చే కథ. హాట్స్ ఆఫ్!! మీరు రెండేళ్ళకో కథ కాదు.. అభిమానుల కోరిక మేరకు కాస్త తరచుగా రాయండి.

 25. వంగూరి చిట్టెన్ రాజు says:

  కథ చదువుతూ ఉండగానే తెలిసిపోయింది…ఓ సారి చదివేసి అభిప్రాయం రాసి పారేసే బాపతు కథ కదూ అని. అనగా…ఈ కథని ఒకటికి రెండు సార్లు చదివితే కొంచెం అర్థం అవుతుంది నా బోటి వాళ్లకి. ఎందుకంటే ప్రతీ పాత్ర కీ ..ప్రతీ వాక్యానికీ, సంఘటనకీ ఉన్న సంబంధాలు…లేదా అసలు చెప్పదలచుకున్న విషయానికి రిలవెన్స్ కోసం వెతుక్కోవాలి.అంటే మళ్ళీ మళ్ళీ చదవాలి. ఆ పని చేశాక అప్పుడు ఏమన్నా నా చిన్న బుర్రకి తడితే అప్పుడు చెప్తాను. ఇలాంటి విభిన్నమైన కథలు అమెరికా నేపధ్యంలో ఉంటే మరీ ఆసక్తికరంగా ఉంటుందేమో అని నా అనుమానం. ఏమో?

 26. S.Radhakrishnamoorthy says:

  నేను సాహిత్యభూభాగంలోకి దారితప్పి వచ్చినవాణ్ణి. ఎవరైనా ఆపి,నీకిక్కడెం పని అని అడిగి ఉండవచ్చు. అడగలేదు కనుక ఆ రోజు ‘రాక్షసగీతం’ చదివాను. కొన్ని దశాబ్దాలలో నేను చదివిన కథలు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. ఏ కథ కూడా మొదటి రెండు మూడు వాక్యాల తరువాత చదివించలేకపోయాయి. నమ్మకం పోయి తెనాలి రామలింగడి పిల్లిలా పారిపోయాను కొన్నిసంవత్సరాలుగా. ‘రాక్షసగీతం’ చివరివరకు చదివించిన కథ. కథచివర కథకుడికి పేరుంది. పేరున్న పేరో కాదో తెలియదు. గూగుల్ లోకి వెళ్లి చూసాను. అక్కడో ఇంటర్ వ్యూ దొరికింది. ఈయన సైన్సు ఫిక్షన్ రచయిత అని తెలిసింది. కథ చదువుతున్నపుడు నాకలా అనిపిమ్చలేదు. కాశాయభ్రాన్టిపై సెటైర్ అనిపించింది. ఇప్పుడొక ప్రశ్న:కథకుడేవరో తెలియకపోవడం గుణమా? కథ ముగించినతరువాత కథకుడు,’ముగింపు రహస్యంగా ఉంచ’మని అన్నాడు. (నేను విన్న ఇంటర్వ్యూలోకూడా ఈ విషయం కథకుడు నిర్ ద్వంద్వం గా చెప్పడు.అది,కథ ముగింపుతెలిస్తే కథకు ప్రాణం లేదా? అన్నది వేరే అంశం ) అలానే రచయిత పేరుకూడా చెప్పక పోవడంలో కూడా గుణమున్దా?
  ఇక కథలోని క్రాఫ్ట్ గురించి:చాలా తక్కువ మంది ఈనాడు తెలుగులో రాయగలుగుతున్నారు ఇలా చదివించగలిగినట్లు. ఇందులో అదొక్కటే గుణం కాదు. విషయంలో కూడా ఇది విశిష్టంగా ఉంది.
  ఇంకో విషయం ఈకథమీద స్పందనలు అంతే ఉన్నతస్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా శ్రీనివాసుడుగారు మూడు ముఖ్యమైన విషయాలు చెప్పారు:
  ‘కథలో చెప్పినదాన్ని మనం సకారాత్మకంగానే తీసుకుని అన్నిరకాల ఇల్యూషన్ల పేరనాయిడ్ స్కిజోఫ్రేనియా ప్రతిపాదించాడని భావిద్దాం.’
  ‘వాదాలపరిమితులు అవసరము గ్రహిమ్చకపోతే ప్రతి ఇజము భ్రాంతిగా మారి పోతుంది.’
  ‘ధనఛి త్తచాంచల్యం మానసిక జాడ్యం’.చెత్త ఏరుకునేవాళ్ళు మానసికరోగులుకారు. ధనమ్ ఏరుకునేవాళ్ళు రోగులు.తెలుగు సాహిత్యం నేను భయపడినంత నిరాశాజనకంగా లేదేమో అనిపిస్తున్నది.

  • శ్రీనివాసుడు says:

   ధన్యవాదాలు రాధాకృష్ణమూర్తిగారూ!
   ధనచిత్తచాంచల్యం గురించి ఇంకా ఎంతోచెప్పవలసింది వుంది. అయితే, అడిగిన హెచ్చార్కెగారు స్పందించకపోవడం వల్ల నేను వ్రాయలేదు.
   అవినీతిమార్గాల్లో కూడబెట్టేవారిని ‘‘డబ్బుపిచ్చి’’ వారిగా లెక్కగట్టడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. వాళ్ళని నరరూప రాక్షసులు, పేదల రక్తం త్రాగే పిశాచులు, బూర్జువాలు, తిమింగలాలు అని తిట్టడంవలన, వాళ్ళ మీద కేసులు పెట్టడం వలన ప్రయోజనం శూన్యం. వాళ్ళ ఖడ్గమృగ చర్మానికి కించిత్ బాధ కూడా తెలియదు.
   అలాగాక, వారిని ‘మెంటల్ —-’ అని సంబోధించామనుకోండి, అంతకంటే అవమానం వారికి ఇంకొకటి వుండదు. మీరు ఈ సమాజంలో వుండడానికి పనికిరారు, అని వారిని పిచ్చి ఆసుపత్రులలో చేర్చి డబ్బుపిచ్చి తగ్గేదాకా విధివంచితులైన పిచ్చివాళ్ళతో బాటుగా గుంపుగా చేర్చేమనుకోండి. అప్పుడు ఆ నిజమైన పిచ్చివాళ్ళు వీళ్ళ రాకతో చాలా ఇబ్బందిపడతారు. ఎందుకంటే వీరి పిచ్చి ఇంకో రకం గాబట్టి వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళూ కొంతకాలం ఆ పిచ్చివాళ్ళని గమనించి, వాళ్ళలాగే తామూ పోగుచేసుకుంటున్నామని తెలుసుకుని, ఎటొచ్చీ వస్తువుల్లోనే భేదం అని గ్రహించే అవకాశం వుంది. తమకీ, వారికీ భేదంలేదని గ్రహించే అవకాశం వుంది. లేదా, రూపంలో తప్పితే సారంలో వ్యత్యాసం లేదు కాబట్టి సామరస్యంగానే జీవించే అవకాశమూ లేకపోలేదు.
   *****************************************************************
   అయితే, రమణ కెవి గారి వ్యాఖ్య లోని సందేహానికి కచ్చితంగా రచయిత సమాధానమీయవలసివుంది.
   ‘‘కానీ వాళ్ళ మనసును చదివిన ఈ కథ చెబుతున్నవ్యక్తి ఆ ఊహలనే నిజమని నమ్మి వాళ్ళను చంపేస్తాడు. అంటే వాళ్ళ ఐడెంటిటీని బట్టి టెర్రరిస్టులుగా ముద్ర వేసి చంపేస్తున్నారని రచయిత చెప్పదలచుకున్నారా? అలా నువ్వు ఏది నమ్మితే అదే నిజం అన్న కోట్ ను justify చేస్తున్నారా? ఈ అస్పష్టతను వివరించగలరు.’’
   ************************************************************
   ఈ అస్పష్టత అనేదానికి కారణం ఏ రకమైన భ్రాంతో నాకు అర్థంకాలేదు. అది కూరలో ఉప్పు వేసినట్లుగా వుంటే ఫర్వాలేదుగానీ ఉప్పులో కూరని వేస్తేనే ప్రమాదం. లేక, మరొక వ్యాఖ్యాత ప్రశ్నించినట్లు అబ్సల్యూట్ ట్రూత్ అనేదే వుండదా? అయితే, మనందరం ఏకగ్రీవంగా అంగీకరించే సంఘటనలు, సైన్సు విషయాలు, ప్రవర్తనా కోణాలు, మానసిక స్పందనలు చాలా వున్నాయే.
   అలాగాక ఏదైనా వాదానికి, ఇజానికి మాత్రమే కథకుని పరిశీలన పరిమితమయితే నేను భ్రాంతి గురించి ఇచ్చిన వివరణ సరిపోతుందేమో. అలాగయినా కథకుడు అన్ని భ్రాంతులగురించీ ప్రస్తావించవలసివుంది.
   రజ్జుసర్పభ్రాంతిలో వున్నవ్యక్తి అక్కడ వున్నదాన్ని ‘‘పాము’’ అని మాత్రమే భావిస్తాడు. ఎందుకంటే ఆ భ్రాంతిలో వున్నప్పడు అతడికి ‘‘త్రాడు’’ అని తెలిసే అవకాశమే లేదు. అక్కడ ద్వైదీభావం వుండదు. ఉన్నది ఒకటే భావన. అది మన దృష్టితో చూస్తే భ్రాంతి. ‘‘తాను నమ్మిన భావజాలం’’ అనే భ్రాంతిలోనుండి చూస్తే మిగతా భావజాలాలన్నీ పాములుగా కనడడం సహజం. దానినుండి తన ప్రయత్నపూర్వకంగా బయటకి వస్తేగానీ అతడికి మిగతావి చూడడం సాధ్యంకాదు.

   ***************************************************************************
   ఈ రచయిత ఇంకో రచన ‘‘ది ఎగ్’’ అనువాద కథకు మీరు ఇచ్చిన వ్యాఖ్య కూడా చూసేను. దానికి నా స్పందన వ్రాయాలంటే చాలా సుదీర్ఘంగా వ్రాయాలి. వీలువెంబడి వ్రాస్తాను. అయితే, కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పాలంటే, మూలకథలో సగం మాత్రమే అనువాదం వచ్చింది. వచ్చినంతవరకూ రూపం బాగుంది. సారం సరిగ్గా రాలేదు. ఎందుకంటే, గ్రుడ్డులో తెల్లసొన మాత్రమే వచ్చింది. జీవభూతమైన పచ్చసొన సరిగ్గా రాలేదు. మీరు మూలకథని చదివితే ఆ విషయం మీకు అర్థమవుతుంది. ( ఇది అనువాదకుడిని విమర్శించడానికి చెప్పడంలేదు. అద్భుతమైన తెలుగు అనువాదం చేయగల ఈ రచయిత ఇలాంటి రచనలను అనువదించేటప్పుడు తాత్త్వికంగా ఇంకా తెలుసుకోవాలని, అది వారి అభ్యున్నతికే దారితీస్తుందని చెబుతున్నాను. )
   మూలకథలో రచయిత చెప్పింది చాలా గహనమైన గూఢమైన అంశం అని నేను అనుకున్నాను. అది నిజానికి నేను చదివిన ఏ తాత్త్వికకోణంతోనూ యథాతథంగా సరిపోలలేదు. అది ద్వైతమూ కాదు, అద్వైతమూకాదు, విశిష్టాద్వైతమూ కాదు – అంటే, మక్కీకి మక్కీగా. అది క్రైస్తవం కూడా కాదు.
   రచయిత యొక్క మనస్సు పాశ్చాత్య హేతుత్వం యొక్క విశ్వరూపంలా అనిపించింది. అదే కథలోనూ ధ్వనించాడని నా భావన.
   *********************************
   ఒక పాఠకుడు రచయిత Andy Weir ని ఇలా ప్రశ్నించాడు.
   ‘‘What are your tips for writing a story that has a message but is still good literature?’’
   *****************************
   దానికి Andy Weir సమాధానం.
   “Interesting question. When I write I don’t try to convey a message. I just want to make an interesting story that will be fun to read. To me, stories are purely for entertainment. I know that sounds odd because “The Egg” seems to have a strong message attached. But really I just wanted a story that would make people go “woah” and be entertained.
   There’s a pretty fine line between conveying a message and coming off as preachy. I guess the trick would be to construct a story around the message such that the message isn’t shown as some moral absolute, but instead as a subjective choice. Then demonstrate that the subjective choice leads to a better life.
   But I’m just brainstorming here. I really never try to have a moral in my stories, so I’m probably not the right guy to ask about how to do it.”

 27. రాజ్యాంగానికి లోబడి దాన్ని అమలు చేసే వారే నడుచుకోవటం లేదు. ఎవరికీ కావలసిన నిర్వచనాలు వారు తీసు కొంటున్నారు.ఎవరికీ కావలసినట్లు వారు అమలు పరుస్తున్నారు. అసలు అదే గదా సమస్య ?

  • శ్రీనివాసుడు says:

   నేనయితే పూర్తిగా నూటికి నూరుపాళ్ళూ ప్రజాస్వామ్యవాదినే శ్రీరామ్ గారూ! రాచరికంగానీ, సైన్యపాలనగానీ ఆయా సందర్భాలలో తాత్కాలికంగా అప్పటి అవసరానికి తగినట్లుగా కొంతకాలం సాగితే ఫర్వాలేదుగానీ అలాగాక దీర్ఘకాలం కొనసాగిన దేశాలు ఏ విధంగా భ్రష్టుపట్టిపోయాయో, అక్కడి ప్రజలు ఎలా బానిసలుగా బ్రతికేరో చరిత్ర చెబుతుంది కదా.
   ప్రజాస్వామ్యంలో, వ్యాసం వ్రాయడానికయినా, వ్యాఖ్య చేయడానికయినా మనకెంత హక్కుందో అంతే హక్కు తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో ప్రశ్నించే వారికీ వుంటుంది, మన అభిప్రాయంతో తార్కికంగా విభేదించే హక్కూ వుంటుంది. వ్యాఖ్య చేసిన మనకి సమాధానం చెప్పవలసిన బాధ్యతా వుంటుంది. ఈ మూడు జమిలిగా సాగినప్పుడే సంభాషణలు సాధ్యమవుతాయి. దీనంతటికీ అంతర్లీనంగా కావలసింది నిజాయితీ.

 28. మామూలు క్రైం స్టోరీని అసాధారణ కథనంతో క్లాసిక్ స్థాయికి తీసుకెళ్లొచ్చని నిరూపిస్తోంది ఈ రాక్షస గీతం కథ. ఎవర్రాశారా అని వెతికి చూస్తే కొన్ని కథలు లభించినాయి ఇతనివి..దేనికదే ప్రత్యేకంగా ఉంది !! నలుగురి దారి నాకెందుకని రాయల్గా సొంత బాట పరచుకుని పోతున్నట్టున్నాడీ రచయిత.

మీ మాటలు

*