బతకాలి

 

రెడ్డి రామకృష్ణ

~

 

అన్నా! నువ్వు బతకాలి

వ్యవసాయం వ్యాపారమైపోయి

లాభాల వెన్నెలంతా నగరాల్లో పూస్తున్నప్పుడు

పగలుకుంపటిని గుండెలపై మోస్తూ

ఇంకా

పొలంగట్టే సింహాసనం

గ్రామమే సామ్రాజ్యం

కల్లమే కోట

ఇల్లే స్వర్గం

కడుపే కైలాసమనుకుంటూ… కూర్చుంటావా!

వద్దన్నా వద్దు

కాలం చెల్లిన భావాలు వద్దు

ఆ భ్రమలూ వద్దూ

నువ్వు బతకాలి

 

బతుకు జూదగాడి చేతిలో పేక ముక్కైపోయి

సంపదంతాఓపక్కనే పోగైపోతున్నప్పుడు

నాలుగు మడిగట్ల మధ్య మనసు

నాపరాయై మిగులుతున్నా

మదుపుకి మదుం తీసి

కాసులకొద్దీ కాలువ

కన్నీరు పారిస్తూ

ఇంకా

ఊరు పై ఆశలెందుకు

ప్రభుత్వ పంచాంగాల పై నమ్మకాలెందుకు

 

తెల్లదోమ పచ్చపురుగు

పసుపుముడత,ఎర్రమచ్చలు

ఏవైతేనేం

తెగుళ్లే అధికారంలో వుండి

చేలపైన చేతలపైన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నప్పుడు

కరువులూ ఎరువులై వాటికే సహకరిస్తున్నప్పుడు

నువ్వు కొన్నపురుగుమందు దృష్టిలో

నువ్వే ఒక పురుగైపోతున్నావు

 

అప్పు పురుగు వేరుకు పట్టి కాయాన్ని(కాండాన్ని) తొలిచేస్తుంటే

నువు కూడా పురుగుమందే పెరుగన్నం అనుకునేసరికి

నీ కుటుంబానికి బూడిదతెగులు ఆశ్రయిస్తోంది

వద్దన్నా!వద్దు

ఆవేశాలొద్దు

ఆలోచనా రాహిత్యాలొద్దు

 

అన్నా!

పట్టణం పరాయిదేం కాదు

అలాగే స్వయంభువు కాదు

తండ్రులనాడో తాతల నాడో

చేరుకున్నవాళ్లమే మేమంతా!

శ్రామికులుగా కార్మికులుగా..

 

నగరము నిషేధిత ప్రాంతము కాదు

భయమెందుకు

భయపడితే తాడైనా పామవుతుందని ఎరుగవా!?

శ్రమను నమ్ముకున్న వాళ్లం

అమ్ముకోవాల్సిన వాళ్లం

సంపదకు ఎల్లలు లేనట్టే

శ్రమకూ  సరిహద్దులు లేవుగదా!

చెల్లినచోటే సరుకు ఆమ్ముకోవటం వ్యాపార నీతి

మనము బతుకుతున్నది వ్యాపార ప్రపంచములోనే

మరిచిపోకు

అన్నా! నువ్వు బతకాలి….

నేనూ బతకాలి

సమస్త శ్రామికులూ బతకాలి

గ్రామమా..పట్టణమా..నగరమా

ఆంధ్రానా అమెరికానా ఆఫ్రికానా

ఎక్కడ బతకాలి

ఎక్కడ బతుకుంటే అక్కడ బతకాలి

మనల్నిఈ స్థితికి పడగొట్టిన వాన్ని

పడగొట్టడానికి

తొడగొడుతూ బతకాలి

***

మీ మాటలు

 1. b.narsan says:

  తొడగొడుతూ బతకాలి. బాగా చెప్పారు సార్.. అన్నా అంటూ బతకమనడంలో ఎంతో ప్రేమ ఆర్ధ్రత నిండి ఉంది.

 2. సురేష్ says:

  బాగుంది పోయెమ్.

 3. లక్ష్మణరావు says:

  “ఎక్కడ బతకాలి

  ఎక్కడ బతుకుంటే అక్కడ బతకాలి

  మనల్నిఈ స్థితికి పడగొట్టిన వాన్ని

  పడగొట్టడానికి

  తొడగొడుతూ బతకాలి”

  చాలా బాగున్నాయి. వలస కి కారణాలను, వలసల క్రమాన్ని. వలసల గమ్యాన్ని మీ కవిత ద్వారా అర్ధమయ్యే విధంగా వివరించారు.

 4. ఒక రంగము లో ఉన్న వారిని వేరే రంగము లోకి మారైనా బ్రతకమని చెప్పే వారు తగ్గి పోతున్న కాలమిది. అలాంటిది రైతుకు ఎదురించైనా, ఎదుర్కొనైనా, ఎలాగైనా బతికి తీరమని భరోసా గా చెప్పి మాత్రమే ఊరుకోకుండా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణాత్మకంగా ఆ నిర్ణయాన్ని తీసుకోమని చెప్పిన తీరు గొప్ప అభినందనీయం రామక్రిష్ణ గారు. అభినందనలు మరియు ధన్యవాదాలు.

  నరేన్ (నా).

మీ మాటలు

*