“ప్రియా సోఫియా…ఇంక సెలవా!”

 

స్లీమన్ కథ-34

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

కైరోలోని బ్రిటిష్ సైనికాధికారులు తన రాకపై ప్రత్యేకమైన ఆసక్తి చూపకపోవడం స్లీమన్ ను బాధించింది. బ్రిటిష్ ఆధిపత్యంలో ఉన్న ఈజిప్షియన్లపై అతనిలో సానుభూతి అంకురించింది. ఆస్వాన్ 1 చేరగానే, తన రాక గురించి స్థానిక అధికారులకు తెలియజేయమని కార్యదర్శిని ఒడ్డుకు పంపించాడు. తిరిగొచ్చిన కార్యదర్శి, అధికారులు మీ పేరెప్పుడూ వినలేదన్నారనీ, మీకు స్వాగతం చెప్పే ఉద్దేశంలో లేరనీ చెప్పాడు. తన పేరు ప్రతిష్టలు ఆస్వాన్ లోని ఈజిప్షియన్ కార్యాలయాలవరకూ పాకలేదని తెలిసి స్లీమన్ దిగ్భ్రాంతి చెందాడు. కోపంతో గింజుకున్నాడు. అధికారులు వచ్చి తనకు స్వాగతం చెబితే తప్ప ఒడ్డు ఎక్కేదిలేదని భీష్మించాడు.

ఆ శీతాకాలంలో ఆస్వాన్ పర్యాటకులతో కిక్కిరిసి ఉంది. వాళ్ళలో చాలామంది ఔత్శాహిక పురావస్తునిపుణులున్నారు. వాళ్లలోనూ కొందరు మంచి అంకితభావం ఉన్న యువకులు. అలాంటి వారిలో ఈ.ఏ. వ్యాలిస్ బాడ్జ్ 2 ఒకడు.  అప్పటికతను అంతగా ప్రసిద్ధుడు కాదు. బ్రిటిష్ మ్యూజియం తరపున మొదటిసారి ఈజిప్టులో పని చేయడానికి వచ్చాడు. కుఫిక్ లిపి 3 రాతలతో ఉన్న తొలినాటి మహమ్మదీయుల గోపుర సమాధులను గుర్తించడం అతనికి అప్పగించిన బాధ్యత. ఎందుకంటే, హిజిరా 4 సమీపకాలం నుంచీ ఆస్వాన్ యాత్రాస్థలిగా ఉంటూ వచ్చింది.

వ్యాలిస్ బాడ్జ్ పనిపట్ల మంచి శ్రద్ద, ఆసక్తి ఉన్నవాడే కాక, సరళస్వభావి. స్లీమన్ చిన్నబుచ్చుకున్న సంగతి అతనికి తెలిసింది. వెంటనే ఇద్దరు మిత్రులను వెంటబెట్టుకుని స్లీమన్ ఉన్న దహబియా వద్దకు ఒక బోటులో వెళ్ళాడు. బట్లర్ వాళ్ళకు ఎదురేగి పడవ వెనుక భాగంలో ఉన్న ఒక విశాలమైన గదిలోకి తీసుకెళ్ళాడు. అతను తెచ్చి ఇచ్చిన కాఫీ తాగి సిగరెట్లు వెలిగించిన తర్వాత అసలు విషయానికి వస్తూ, కొత్తగా తవ్వితీసిన మహమ్మదీయ సమాధుల పరిశీలనకు మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చామని స్లీమన్ తో చెప్పారు. ఆ మాట వినగానే స్లీమన్ బిర్ర బిగుసుకున్నాడు. తనకు అలాంటి ఆసక్తేమీ లేనట్టు తన కవళికలతోనే సూచించాడు. “మీరు వచ్చి అడిగినందుకు సంతోషం. నా పురావస్తు పరిజ్ఞానం అంతా ఉపయోగించి ఆ సమాధులగురించి మీకు క్షుణ్ణంగా బోధించి ఉండేవాణ్ణే కానీ, ఇప్పుడు నాకంత తీరిక లేదు. వాడీ హల్ఫా వెడుతున్నాను” అన్నాడు.

ఆ తర్వాత కాసేపు నిశ్శబ్దం. స్లీమన్ ఇంకో మాట మాట్లాకుండా, ‘ఇక మీరు దయచేయచ్చు’ అని సూచిస్తున్నట్టుగా, అంతవరకూ తను చదువుతూ ఉన్న ఇలియడ్ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ ముగ్గురూ విస్తుపోయారు. “ఇక మమ్మల్ని సెలవు తీసుకోమంటారా” అని వారిలో ఒకడైన మేజర్ ప్లంకెట్ ఎంతో మృదువుగా, మర్యాదగా అడిగాడు. స్లీమన్ తల ఊపాడు. తిరిగి వెడుతూ వారు ఒక విచిత్రమైన అనుభూతికి లోనయ్యారు. ఒకవైపు, ఒక ప్రపంచప్రసిద్ధ పురావస్తునిపుణుని కలసుకున్నామన్న సంతృప్తి, ఇంకోవైపు ఆయన ప్రవర్తన కలిగించిన మనస్తాపం!

schliemann and sophia

ఒకవిధంగా అతని ప్రవర్తన అసాధారణమే. తన శేషజీవితాన్ని బాధాగ్రస్తం చేస్తూవచ్చిన తలనొప్పి కూడా అందుకు ఒక కారణం కావచ్చు. మరోసారి ఇలాగే అతను నైలు నదిలో ప్రయాణించాడు. అప్పుడు రుడాల్ఫ్ విర్కో అతని వెంట ఉన్నాడు. తలనొప్పి, చెవినొప్పి కొంత ఉపశమించిన ఆ దశలో స్లీమన్ చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నాడు. కార్నక్ 5 స్తంభాల మధ్య తిరుగుతూ, అక్కడి అంతుచిక్కని గజిబిజి దారులపై యువ పురావస్తునిపుణుడు ఫ్లిండర్స్ పేట్రీ 6 రూపొందించిన రేఖాపటాలను పరిశీలిస్తూ నాలుగు గంటలపాటు గడిపాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద భవంతి ఉన్న ప్రదేశం అది. ఆ భవంతిలో మూడు వేల గదులు, బ్రహ్మాండమైన 12 దేవీడీలు ఉండేవి. గదుల్లో సగం భూగర్భంలో ఉన్నాయి. గజిబిజి దారులతో ఉన్న ఆ సువిశాల ప్రదేశంలో ఫ్లిండర్స్ ఎంతో ఓపికగా జరిపించిన తవ్వకాలు స్లీమన్ ను ముగ్ధుణ్ణి చేశాయి. ఆ తర్వాత స్లీమన్, విర్కోలను కలసుకున్న ఫ్లిండర్స్ , పిడివాది అంటూనే వాస్తవాలను అంగీకరించే నిజాయతీ స్లీమన్ లో ఉందని కితాబు ఇచ్చాడు.

స్లీమన్ 1888లో సితేరా దీవిలో కొద్దిపాటి తవ్వకాలు జరిపి అఫ్రోడైట్ ఆలయాన్ని వెలికితీశాడు. హిస్సాలిక్, మైసీనియాలలో తను కనుగొన్న వాటితో మాత్రమే పోల్చదగిన ఓ బ్రహ్మాండమైన నిర్మాణాన్ని తను బయటపెట్టానంటూ లండన్ టైమ్స్ కు పొడవైన తంతి పంపించాడు. అదే ఏడాది పీలోస్ లోనూ, స్ఫేక్టీరియా 7దీవిలోనూ తవ్వకాలు జరిపాడు. క్రీ.పూ. 425లో స్పార్టాన్లు కనిపెట్టి ఉపయోగించుకున్నట్టు తూసడడీస్ రాసిన దుర్గాలను స్పేక్టీరియాలో వెలికితీశాడు. ఇవి ముఖ్యమైన పరిశోధనలే కానీ; హిస్సాలిక్, మైసీనియాలకు సాటి వచ్చేవి మాత్రం కావు.

నోసస్ అదే పనిగా అతన్ని గుంజి లాగుతూనే ఉంది. “నోసస్ (క్రీటు రాజధాని) రాజులు నివసించిన ప్రాసాదాలను బయటపెట్టడడమన్న ఒకే ఒక మహత్కార్యంతో ఈ జీవితాన్ని చాలిద్దామని ఉంది” అని 1889 జనవరి 1న రాసుకున్నాడు. అదే ఏడాది వసంతంలో అక్కడి భూమి కొనుగోలుకు మరో ప్రయత్నం చేద్దామనుకున్నాడు. దార్ఫెల్త్ ను వెంటబెట్టుకుని వెళ్ళి మళ్ళీ బేరసారాలు మొదలుపెట్టాడు. భూమి యజమాని అక్కడున్న 2500 ఆలివ్ చెట్ల ధరను కూడా కలుపుకుని లక్ష ఫ్రాంకులు అడిగాడు. స్లీమన్ 40వేల ఫ్రాంకులు ఇవ్వజూపాడు. చివరికి 50వేల ఫ్రాంకులకు బేరం కుదిరింది. తీరా ఆలివ్ చెట్లను లెక్కబెడితే 888 మాత్రమే ఉన్నాయి. దాంతో మండిపడిన స్లీమన్ ఇలాంటి అబద్ధాలకోరుతో తను లావాదేవీలు జరిపేదిలేదని మొండికేసాడు.

వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలేయడానికి దార్ఫెల్త్ కు మనస్కరించలేదు. ఆ భూమి గురించి మరింత కూపీ తీశాడు. తమకు అమ్మజూపిన వ్యక్తి కింద మూడో వంతు భూమి మాత్రమే ఉందనీ, మిగతా భూమి మరొకరి యాజమాన్యంలో ఉందనీ తేలింది. ఆ కొత్త వ్యక్తితో సునాయాసంగా బేరం కుదిరి ఒప్పందం సిద్ధమైంది. అక్కడి తవ్వకాలలో లభించే నిధినిక్షేపాలలో మూడో వంతు స్థలయజమానులకు స్లీమన్ ఇవ్వజూపాడు. కానీ ఈసారి సంతకం చేయడానికి మొదటి స్థలయజమాని తిరస్కరించాడు. ఇది తెగే వ్యవహారం కాదని స్లీమన్ నిర్ణయానికి వచ్చి దార్ఫెల్త్ తో కలసి తిరుగుముఖం పట్టాడు. అతని క్రీటు గురించిన కల పూర్తిగా కరిగిపోయింది.

ఆ సంవత్సరంలోనే అతను ట్రాయ్ లో ట్రోజన్ పురావస్తు సంపద మీద మొదటి అంతర్జాతీయ సమ్మేళనం ఏర్పాటు చేసి దేశ దేశాల పండితులనూ ఆహ్వానించాడు. వారితోపాటు ట్రాయ్ శిథిలాల వెంట తిరుగుతూ తను కనుగొన్న విశేషాలను వారికి చూపించాడు. తన అనుభవాలను కథలు కథలుగా వారికి వినిపించాడు. ఇప్పటికీ అతనిలోని తొలినాటి ఉత్తేజం అలాగే ఉంది. మరుసటేడు అక్కడే రెండవ అంతర్జాతీయ సమ్మేళనం నిర్వహించాడు. పండితులను ఉద్దేశించి ఎంతో హుందాగా ప్రసంగాలు చేశాడు. విచిత్రంగా అతని మాటల్లో కొంత మార్పు వచ్చింది. వెనకటిలా సాటి పండితుల అల్పవిద్వత్తునో, మరుగుజ్జుపోకడలనో ఎత్తిచూపి తీసిపారేసే ధోరణి తగ్గింది. ఆ రోజుల్లోనే రుడాల్ఫ్ విర్కోను వెంటబెట్టుకుని మరోసారి ఈదా పర్వతం మీదికి విహారయాత్రకు బయలుదేరాడు. సాయంత్రానికి ఆ పర్వత పాదాల దగ్గర ఉన్న ఒక గ్రామానికి చేరేసరికి అతనికి దుర్భరమైన చెవిపోటు వచ్చి వినుకలిశక్తి పోయింది. విర్కో చెవిని పరీక్షించి లోపల బాగా వాచి ఉన్నట్టు గమనించాడు. వెంటనే ట్రాయ్ కి వెళ్ళడం మంచిదన్నాడు. ఇద్దరూ ఈదా పర్వతం ఎక్కకుండానే వెనక్కి వెళ్ళిపోయారు.

Atlantis-1882

Atlantis-1882

సమ్మేళనం ముగిసిన తర్వాత మళ్ళీ విర్కోతో కలసి గుర్రాల మీద ఈదా పర్వతయాత్రకు వెళ్లాడు. కొండ ఎక్కిన తర్వాత జియస్ కూర్చున్నదిగా చెప్పిన సింహాసనం మీద కూర్చుని, ఆ ఎత్తునుంచి కింది మైదానాన్ని చూస్తూ కాసేపు గడిపాడు. ఆ తర్వాత శిఖరానికి చేరుకుంటుండగా తుపాను విరుచుకుపడింది. చూస్తుండగానే అది పెను తుపానుగా మారిపోయింది. పెద్ద పెద్ద ఉరుములతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. అద్భుతమైన మెరుపులతో నలుదిక్కులూ వెలిగిపోయాయి. ఇద్దరూ రాతి గుట్టల కింద తల దాచుకున్నారు. అయినా వర్షంలో నిలువునా తడిసిపోయారు. కాసేపటికి తుపాను వెలిసింది. వర్షపు నీటితో శుభ్రపడిన కాంతిలో స్లీమన్ మరోసారి కింది ట్రాయ్ మైదానాన్ని, అదే చివరిసారా అన్నట్టుగా తన్మయంగా చూస్తూ ఉండిపోయాడు. నిజంగా అదే చివరిసారి అయింది.

సమ్మేళనం ముగిసినా పని కొనసాగింది. పనుల సారథ్యాన్ని దార్ఫెల్త్ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. శిథిలాల చెత్తను తొలగించే ముందు, పట్టుబట్టి ప్రతి వివరాన్నీ సునిశితంగా పరిశీలించాడు. ఫోటో తీయించాడు. చీటీలు అతికించాడు. సమయం వృథా అవుతోందని స్లీమన్ పోరు పెడుతున్నా వినిపించుకోలేదు. అతని శ్రమ వృథా పోలేదు. కొత్తగా కొన్ని అపురూపమైన మైసీనియా కుండ పెంకులు వెలుగు చూశాయి. మరికొన్ని కోటగోడలు బయటపడ్డాయి. చివరికి ఒక పెద్ద భవంతి బయటపడింది. దాంతో స్లీమన్ లో కొత్త ఆశలు చిగురించాయి. హోమర్ చిత్రించిన ట్రాయ్ తాలూకు మొత్తం ప్రణాళిక అంతా తన జీవితకాలంలోనే బయటపడుతున్నట్టు ఊహించుకుని ఉత్సాహం చెందాడు. అంతలో వేడి గాలులు మైదానాన్ని ఊపేయడం ప్రారంభించాయి. పనివాళ్లు కొందరు జ్వరపడ్డారు. తవ్వకాలను మరుసటేడుకు వాయిదా వేస్తూ జులై చివరిలో తిరిగి ఎథెన్స్ కు వెళ్లిపోయాడు.

పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. స్లీమన్ రాతబల్ల మీద ఆ ఏడాది పని తాలూకు వివరణ పత్రాల దొంతర పేరుకుపోతోంది. ఎప్పటిలా సోఫియా సాహచర్యం అతనికి ఉపశమనం కలిగిస్తూ పనిభారాన్ని తేలిక చేస్తూనే ఉంది.  మరోవైపు, ఎప్పటిలా అస్థిమితంగానూ, ఏవేవో కలలు కంటూనూ గడుపుతూనే ఉన్నాడు. అయితే, తను మరోసారి ట్రాయ్ ను సందర్శించే అవకాశం లేదన్న సంగతి అప్పటి కతనికి తెలియదు. అట్లాంటిస్ 8 దీవులను సందర్శించాలనీ, మెక్సికోకు వెళ్ళి రావాలనీ అనుకుంటున్నట్టు విర్కోకు రాశాడు. ఈ ప్రదేశాలలో ఎక్కడో ఒడీసియస్ యాత్రకు సంబంధించిన ఆనవాళ్ళు దొరుకుతాయని అతని ఊహ. కెనారీ దీవుల్లోనే తను అట్లాంటిస్ ను కనుక్కోగలనని తలపోసాడు. ఈ దీవులు నిత్యవసంతశోభతో అలరారుతూ ఉంటాయన్న హోమర్ అభివర్ణనే అతని ఊహకు మూలం. అయితే, ఈ లోపల ఇటీవలి ట్రాయ్ తవ్వకాలపై  పుస్తకాన్ని పూర్తి చేయాలనీ, మరో అంతర్జాతీయ సమ్మేళనం నిర్వహించాలనీ, వచ్చే వసంతాన్నీ, వేసవినీ పూర్తిగా ట్రాయ్ లోనే గడపాలనీ అనుకున్నాడు.

చెవిపోటు ఇప్పుడు అంతగా బాధించడంలేదు. వాపు కూడా తగ్గింది. బహుశా శస్త్రచికిత్స అవసరం కాకపోవచ్చు. దానిని వీలైనంత కాలం వాయిదా వేస్తే మంచిదని విర్కో సలహా ఇచ్చాడు. స్లీమన్ ఆ సలహాను పాటించాడు. సోఫియా వియెన్నా సందర్శనకు వెళ్లింది. ఆమె తోడులేని గృహజీవితం అతనిలో ఎప్పుడూ శూన్యాన్ని నింపుతూనే ఉంటుంది. ఇంట్లో దెయ్యం పట్టినట్టు తిరిగేవాడు. తాము ఇద్దరూ కలసి ఎథెన్స్ లో ఎప్పుడూ పెళ్లిరోజు జరుపుకోని సంగతి అతనికి సెప్టెంబర్ చివరిలో గుర్తొచ్చింది. ఆమెకు ప్రాచీన గ్రీకులో ఒక సుదీర్ఘమైన ఉత్తరం రాశాడు:

మన పెళ్లిరోజును తలచుకుని ఎంతో గర్విస్తున్నాను. వచ్చే ఏడాది మనిద్దరం కలసి పెళ్లిరోజు జరుపుకునేలా చూడమని దేవతలను ప్రార్థిస్తున్నాను. నీ బంధువులందరినీ ఆహ్వానిస్తున్నాను. మనిద్దరం కలసి ఇరవయ్యొక్క ఏళ్లపాటు సుఖసంతోషాలతో జీవించాం. ఇన్నేళ్ల కాలాన్నీ ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే విధి మన జీవితాల్లో తీపినీ, చేదునూ సమానంగా నింపిందనిపిస్తుంది. మన పెళ్లిని పరిపూర్ణంగా ఎప్పుడూ పండుగ చేసుకోలేనేమో కూడా. ఎందుకంటే, నువ్వు నా ప్రియాతిప్రియమైన అర్థాంగివి మాత్రమే కాదు; నాకు నెచ్చెలివి. కష్టాలలో దారి చూపించిన సారథివి. నా చేతిలో చేయి వేసి నడిచిన విశ్వసనీయ సహచరివి. ఒక అద్వితీయ మాతృమూర్తివిగా కూడా. నీ సుగుణ సంపదను తలచుకుని నిరంతరం మురిసిపోతూనే ఉంటాను. జియస్ కరుణిస్తే మరుజన్మలో కూడా నిన్నే పెళ్లి చేసుకుంటాను.

ఇవే రోజుల్లో చెవిపోటుకు శస్త్రచికిత్స తప్పని పరిస్థితి వచ్చింది. విర్కో సిఫార్సు మీద హాలీ 9 లోని ఒక క్లినిక్ కు వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. కబురు అందుకున్న సోఫియా భర్త ప్రయాణం ఏర్పాట్లు చూసి సాగనంపడానికి వెంటనే ఎథెన్స్ కు వచ్చింది. బయలుదేరేముందు తన స్వభావవిరుద్ధంగా స్లీమన్ గంభీరంగానూ, నిర్లిప్తంగానూ ఉండిపోయాడు. బ్యాంక్ డైరక్టర్లతో తన వీలునామా గురించి మాట్లాడాడు. తన దుస్తులు మడత పెట్టి ట్రంకులో పెట్టుకుంటున్నప్పుడు, “ఈ దుస్తులు ఎవరు వేసుకుంటారో?!” అన్న మాటలు అతని నోట అప్రయత్నంగా వెలువడ్డాయి. సోఫియా తను కూడా వస్తానంది. “ఆరువారాల్లో వచ్చేస్తాను, పిల్లల్ని చూసుకుంటూ ఉండు” అని స్లీమన్ అన్నాడు. రైల్వే స్టేషన్ కు బయలుదేరేముందు, చివరిక్షణంలో భర్త రిస్టువాచీ ఛైను పట్టుకుని ఆపి ముఖంలోకి చూసింది. అదే చివరిచూపా అన్న స్ఫురణ ఆమె చూపుల్లో కదలాడింది.

నవంబర్ లో అతను హాలీ చేరుకున్నాడు. చలికాలం. క్లినిక్ కిటికీలకు అవతల మంచు కురుస్తోంది. వైద్యులు అతని రెండు చెవులనూ పరీక్షించారు. రెండింటికీ శస్త్రచికిత్స అవసరమని తేల్చారు. మరునాడు శస్త్రచికిత్స జరిపారు. ఆ సమయంలో తెల్లని నూనెబట్ట పరచిన ఒక బల్ల మీద పడుకోబెట్టారు. “అంతకుముందు ఒక శవపరీక్ష జరపడానికి ఉపయోగించిన బల్లలానే అది కనిపించింది” అని ఆ తర్వాత స్లీమన్ ఒక మిత్రుడితో అన్నాడు. శస్త్రచికిత్సకు ఒకటిమ్ముప్పావు గంట పట్టింది.

వైద్యుల ప్రకారం శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. కానీ స్లీమన్ కు అలా అనిపించలేదు. దానికితోడు ఆసుపత్రిలో గడపడం దుర్భరంగా తోచింది. సందర్శకులను అనుమతించలేదు. తలకు పెద్ద కట్టు కట్టారు. ఆ పరిస్థితిలో కూడా చుట్టూ పుస్తకాలు పేర్చుకుని, ఉత్తరాలు రాస్తూ గడిపాడు. దార్ఫెల్త్ కూ ఉత్తరం రాస్తూ, తను చేసిన తప్పులన్నింటినీ క్షమించమనీ, తమ ఇద్దరి మధ్యా ఛాయామాత్రంగానైనా ఎప్పుడైనా మనస్పర్థ కలిగిందని భావిస్తే, దానిని నిర్మొహమాటంగా వెల్లడించమనీ కోరాడు. భార్యనుంచి అందుకున్న ఉత్తరానికి జవాబు రాస్తూ, “మహిళలందరిలోనూ మణిపూసవు నువ్వు, నీ ఉత్తరాన్ని చెమ్మగిల్లిన కళ్ళతో చదువుకున్నాను” అన్నాడు.

(సశేషం)

***

అథోజ్ఞాపికలు

  1. ఆస్వాన్: ఈజిప్టులో నైలు నది ఒడ్డున ఉన్న ఒక నగరం. ఆస్వాన్ డ్యామ్ సుప్రసిద్ధం.
  2. ఈ. ఏ. వ్యాలిస్ బాడ్జ్(1857-1934): ఈజిప్టు పురాచరిత్ర, సంస్కృతి, సాహిత్యాలలో నిపుణుడైన ఆంగ్లేయుడు, భాషాశాస్త్రవేత్త. ప్రాచీన మధ్యప్రాచ్యం పై అనేక గ్రంథాలు రచించాడు.
  3. కుఫిక్ లిపి: వివిధ అరబ్బీ లిపులకు చెందిన ప్రాచీన రాతలిపి. ఇరాక్ లోని కుఫా అనే చోట క్రీ.శ. 7వ శతాబ్ది చివరిలో అభివృద్ధి చెందింది.
  4. హిజిరా: మహమ్మద్ ప్రవక్త క్రీ.శ. 622లో మక్కా నుంచి మదీనాకు వెళ్ళిన సందర్భాన్ని సంకేతించే ముస్లిం శకం.
  5. కార్నక్: ఈజిప్టులోని తీబ్స్ నగరంలో భాగంగా ఉన్న విశాలమైన ప్రాచీన, మధ్యయుగ ఆలయ సముదాయం. వీటిలో అనేకం శిథిల ఆలయాలు.
  6. ఫ్లిండర్స్ పేట్రీ (1853-1942): ఈజిప్టు విషయాలలో నిపుణుడైన ఆంగ్లేయుడు. పురావస్తుశాస్త్రానికీ, ప్రాచీన కళాఖండాల పరిరక్షణకూ సంబంధించిన శాస్త్రీయ పద్ధతులను అభివృద్ధి చేసిన ప్రముఖులలో ఒకడు.
  7. స్ఫేక్టీరియా: గ్రీస్ లోని పెలొపనీస్ ద్వీపకల్పంలో పీలోస్ అఖాతం వద్ద ఉన్న ఒక చిన్న దీవి. క్రీ.పూ. 431-404 మధ్య పెలొపనీసస్ యుద్ధంగా ప్రసిద్ధమైన యుద్ధం ఇక్కడే జరిగింది.
  8. అట్లాంటిస్-కెనారీ దీవులు: అతి పురాతనకాలంలో, ఒక అంచనా ప్రకారం 9వేల సంవత్సరాల క్రితం, అట్లాంటిక్ సముద్రంలో ఉండేదిగా భావిస్తూ వచ్చిన ఒక దీవి/దీవులు ఇవి. ప్రాచీన గ్రీకు తత్వవేత్త ప్లేటో(క్రీ.పూ. 428-348) తన ‘తీమేయస్’ (Timaeus), ‘క్రీషియస్’ (Critias) అనే డైలాగులలో అట్లాంటిస్ గురించి రాశాడు. పెద్ద ఉత్పాతం ఏదో సంభవించి ఈ భూఖండం సముద్రంలో లోతుగా మునిగిపోయిందనీ, ఇందులోని పెద్ద పెద్ద పర్వతాల శిఖరాలు మాత్రమే నీటిపై కనిపిస్తాయనీ రాశాడు. ఆయన నిజమైన ఆధారాలతోనే రాశాడా, లేక ఊహించాడా అన్నది తెలియదు. కాకపోతే, అప్పటినుంచీ అట్లాంటిస్ అనే భూఖండం నిజంగానే ఉండేదని నమ్ముతూ వచ్చినవాళ్ళు నేటి కెనారీ(Canary) దీవులు, అజోర్స్(Azores)దీవులు, కేప్ వర్ద్(Verde),మదీరా(Madeira)లు భాగంగా ఉన్న మైక్రోనేసియా యే ఆ మునిగిపోయిన ప్రాచీన భూఖండం తాలూకు అవశేషమని భావిస్తారు.

గ్రీకు పురాణాల ప్రకారం చూస్తే, ప్రముఖ గ్రీకువీరుడు హెరాక్లీస్ చేపట్టిన 12 సాధనలలో ఒకటి, ప్రపంచం అంతం వరకూ వెళ్ళి సంధ్యా దేవతలలో ఒకరైన హెస్పరడీస్ కాపలా కాస్తున్న తోటలోని బంగారు యాపిల్ పండ్లను తీసుకురావడం! హెస్పరీస్, అట్లాస్ ల కుమార్తే హెస్పరడీస్. గ్రీకు, రోమన్ పురాణాలు ఒక రాక్షసునిగా పేర్కొన్న అట్లాస్ పేరే అట్లాంటిక్ సముద్రానికీ, మొరోకోలోని అట్లాస్ పర్వతశ్రేణికీ వచ్చింది. హెరాక్లీస్ స్తంభాల(Pillars of Heracules) ఉనికిని చెబుతున్న నేటి జిబ్రాల్టర్ జలసంధిని కూడా దాటి సంధ్యాదేవతలు నివసించే స్వర్గధామానికి హెరాక్లీస్ వెళ్లాడనీ;  ఆ స్వర్గధామమే నేటి కెనారీ దీవులనీ, పౌరాణిక వర్ణనకు అవే సరిపోతున్నాయనీ భావించారు.

హోమర్ కూడా ఈ దీవులను ఎలిజియం(Elysium)దీవుల పేరిట గుర్తించాడు. పుణ్యకార్యాలు చేస్తూ, ధర్మబద్ధంగా జీవించినవారు చనిపోయి ఈ దీవులకు వెడతారని రాశాడు. అయితే అతి ప్రాచీన నావికులైన ఫినీషియన్లు కానీ, గ్రీకులు కానీ ఈ దీవులకు వెళ్ళినట్టు ఆధారాలు లేవు. అయితే ఉత్తర ఆఫ్రికాలోని అట్లాంటిక్ తీరాన్ని సందర్శించిన తొలి ఫినీషియన్లు, వారి వారసులైన పురాతన కార్తేజ్ నగరవాసులు కెనారీ దీవులను కనీసం చూసి ఉండడానికి ఎంతైనా అవకాశముంది. క్రీ.పూ. 12వ శతాబ్దిలో ఫినీషియన్లు కెనారీ దీవులకు వెళ్ళి వచ్చారని కొందరు చరిత్రకారులు భావించారు. క్రీ.పూ. 470లో కార్తేజ్ కు చెందిన నావికుడు హన్నో ఈ దీవులను సందర్శించాడంటారు. క్రీ.పూ. 146లో జరిగిన మూడవ ప్యూనిక్ యుద్ధంలో కార్తేజ్ ను జయించిన రోమన్లు పురాణ ప్రసిద్ధమైన ఈ దీవులపై పెద్ద ఆసక్తి చూపించలేదు. ఉత్తర ఆఫ్రికాలోని ప్రాచీన లిబియా రాకుమారుడు, మంచి విద్యావేత్త అయిన జుబా-2 క్రీ.పూ. 40లో కెనారీ దీవులకు ఒక పరిశోధక బృందాన్ని పంపించాడు. ఆ వివరాలను ప్లినీ ద ఎల్డర్ (క్రీ.శ. 23-79) నమోదు చేశాడు. టోలెమీ(క్రీ.శ. 150) భౌగోళిక ఊహారేఖలను ఆధారం చేసుకుని ఈ దీవుల ఉనికిని తగుమేరకు కచ్చితంగా గుర్తించి వాటిని ప్రపంచపు అంతిమ సరిహద్దు అన్నాడు. (పైన ఇచ్చిన రేఖాపటాన్ని చూడగలరు)

Read more: http://www.lonelyplanet.com/canary-islands/history#ixzz49dtzEVAE

ఖండాల చలన సిద్ధాంతం (continental drift) ఇటీవలి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన సంగతి తెలిసినదే. ఆ కోణంలో చూసినప్పుడు అట్లాంటిస్ ఉనికి గురించి ప్లేటో క్రీస్తు పూర్వకాలంలోనే ఊహించడం విశేషంగానే కనిపిస్తుంది. మన విషయానికి వస్తే, రామాయణంలో సీతాన్వేషణకు వానరవీరులను అన్ని దిక్కులకూ  పంపుతూ సుగ్రీవుడు అనేక ద్వీపాలు, సముద్రాలు, పర్వతాలు, ప్రాంతాల గురించి చెబుతాడు. వాటిని నేటి భౌగోళిక పరిజ్ఞానంతో ఎంతవరకు గుర్తించగలమో చెప్పలేం. హోమర్ ఆధారంగా అట్లాంటిస్ ను గుర్తించాలని స్లీమన్ అనుకున్నట్టే, రామాయణం, పురాణాలు వగైరాలలో పేర్కొన్న భౌగోళిక ప్రాంతాలను గుర్తించడానికి ప్రయత్నించిన పండితులు మన దగ్గరా ఉన్నారు. మహాభారతంలోనూ ఇటువంటి అజ్ఞాత భౌగోళిక వివరాలు కనిపిస్తాయి. సముద్రంలో మునిగిపోయినట్టు పౌరాణికంగా విశ్వసించే  శ్రీకృష్ణుని ద్వారకా నగరాన్ని యు. ఆర్. రావు అనే పురావస్తునిపుణుని సారథ్యంలో గుర్తించినట్టు చెప్పడం ఇటీవలి చరిత్ర.

కొలంబస్ కనిపెట్టడానికి చాలాముందే 11, 12 శతాబ్దులలోనే గ్రీస్ లాండ్ కు చెందిన నావికులు అమెరికాను కనిపెట్టారనీ, అంతకంటే అతి ప్రాచీనకాలంలోనే భూగోళపు అమరికను బట్టి అమెరికా ఖండాన్ని ఊహించగలిగారనీ ఆ మధ్య ఒక పుస్తకంలో చదివాను.

  1. హాలీ: జర్మనీలోని ఒక నగరం.

 

మీ మాటలు

*