తల్లికడుపులోకి తోవ యివ్వండి!

 

 

-బమ్మిడి జగదీశ్వరరావు

~

 

ఓ నా నగర జీవులారా..!

మీరు మల మలా కాకుల్లా మాడిపోతున్నారు కదూ? పెనం మీద వేసిన నీటి బొట్టులా మీ వొంట్లోని ప్రతి నీటిబొట్టూ చెమటై ఆవిరై యింకిపోతోంది కదూ? గొంతు యెండిపోతోంది కదూ? నాలుక పిడచ కట్టుకు పోతోంది కదూ? దాహం.. దాహం.. అని అల్లల్లాడిపోతున్నారు కదూ? పిల్లలూ పెద్దలూ తేడా లేదు కదూ? వయసుకూ వల్లకాడుకూ సంబంధం లేదు కదూ? అమ్మ చేతి దెబ్బ తిననివారున్నారేమో గాని వడదెబ్బ తిననివారు లేరు కదూ?

ఎండ ఫెళ్ళున ‘పేల్చేస్తోంది’ అంటే.. అదేమన్నా తుపాకీనా- పేల్చేయడానికీ కాల్చేయడానికీ.. అని హాస్యానికి అన్నా.. అంతకన్నా యెక్కువేనని యిప్పుడిప్పుడే అర్థమవడం లేదూ? ఎండలకు కొండలు పగలడం అంటే.. అర్థమవడం లేదూ? రోహిణీ కార్తె యెండలంటే రోళ్ళు పగులుతాయి అంటే.. అర్థమవడం లేదూ? రథసప్తమి రోజున సూర్యుడు రథం మారింది మొదలు.. యెండలు మండిపోవడానికి అదే మొదలు అంటే.. అర్థం అవడం లేదూ?

ఎండాకాలం వచ్చిందంటే.. మామిడిపళ్ళూ మల్లె పూలూ వొస్తాయని మీలో యెదురు చూసిన సంబరం చచ్చిపోయిందని నాకు తెలుసు! మీరు చచ్చిన శవాలైపోయారనీ తెలుసు! పిల్లలు మునిపటిలా వేసవి సెలవులని సరదాగా గడపడమే మర్చిపోయారనీ తెలుసు! అమ్మమ్మా తాతయ్యల యిళ్ళకు వూర్లు పోవడమే మానుకున్నారనీ తెలుసు! ఇంట్లోంచి అడుగు తీసి బయట పెట్టలేని బందీలయిపోయారనీ తెలుసు! మీకు ఆకలి మందగించిందనీ తెలుసు! మీరు నిద్రకు దూరమయ్యారనీ తెలుసు!

అరే.. మెత్తని స్పర్శకీ మొత్తబుద్ది అవుతోందే..! మీ దాంపత్యానికి కూడా వేసవి సెలవులు యిచ్చేసినట్టున్నారే..! పిల్లల్నో పెళ్లాన్నో పట్టుకుంటే కాని నిద్రరాని మీకు.. పట్టుకుంటే చాలు నిద్ర వొదిలిపోతోందే..! చిన్న విషయాలకు కూడా చిరాకులూ పరాకులూ పెరుగుతున్నాయే..! అన్ని పనులూ వాయిదా పడుతున్నాయే! అయ్యో పని చెయ్యకుండానే అలసి సొలసిపోతున్నారే..! వేసవి కాలపు నాలుగు నెలల్ని చిన్న పిల్లల్లా కేలండర్లోనుంచి చింపేస్తున్నారే..!?

మా చిన్నప్పుడు శివరాత్రికి ‘శివ.. శివ’ అనుకోనేంత చలి వుండేదని అంటే.. మా చిన్నప్పుడు యెండలు వుండీవి కాని యిలాంటి యెండలు కావు బాబోయ్.. అని ఠారెత్తి పోతున్నారా? బీర్లతో కూల్ డ్రింకులతో వేసవిని చల్లార్చలేక పోతున్నారా? కరెంటుపొతే చాలు ప్రాణం పోతోందా? అప్పు చేసన్నా ఎయిర్ కండిషనరో.. కనీసం ఎయిర్ కూలరో కొనుక్కుంటున్నారా? కరెంటుబిల్లు బెంబేలు యెత్తిస్తోందా?

నీళ్ళు లేవు! నగరం నిప్పులగుండం! ఇల్లు అగ్నిగుండం! బతుకు మృత్యుగండం! అకాలమరణం కాదది హననం! పాప హరణం! వడగాల్పులు కావవి యముని పాశాలు! నరక ద్వారాలు!

నిప్పుల కొలిమిలా భగ భగల భుగ భుగల సూర్యుడు! భూతాపం! ప్రకృతి ప్రకోపం! తార్రోడ్డులు కావవి నిలిచి కాలుతున్న తాటాకు మంట! రాక్షసబొగ్గుతో రాజేసిన చితి! చితీ కాదిది.. చింతా కాదిది.. నిప్పుల పుంత!

గుక్కపెట్టి యేడుస్తున్న పిల్లల్ని చూసి.. దేవుడా తీసుకుపోరా తండ్రీ అన్న పెద్దల్ని చూసి.. బతుకు కాలి బొబ్బలెక్కిన మిమ్మల్ని చూసి.. గడ్డకట్టిన నేను కదిలి కరిగి నీరయ్యాను! తొలకరి చినుకయ్యాను! ఎండాకాలంలో వానయ్యాను! వడగాల్పుల మీద వడగళ్ళ వానయ్యాను! ఎండాకాలంలో వానలు.. వానాకాలంలో యెండలు.. కలికాలం అని వెక్కిరించినా.. కాలం తప్పినా.. కర్మం తప్పకూడదని కురిసాను! మురిసాను!

గాలితో గంతులేసాను! అది చూసి చెలిమి చేయ రమ్మని మెరుపు మేళమయ్యింది! ఉరుము తాళమయ్యింది! చెట్టూ చేమతో చెలిమి చేద్దామనుకున్నాను! కొమ్మ కొమ్మన చేరి ఆకు ఆకున జారి ఆడుదామనుకున్నాను! పిందెలతో పోటీపడి రెమ్మ రెమ్మనా ఆకు ఆకునా వేళ్ళాడదామనుకున్నాను!

నిజమే! కాంక్రీట్ జంగిల్! ఈ జంగిల్లో వొక్క చెట్టూ లేదు! పుట్టా లేదు! పిట్టాలేదు! అరుపూ లేదు! ఆనవాలూ లేదు! చిరునామా లేదు! మీ డ్రాయింగ్ రూముల్లో పచ్చని పెయింటింగ్ గా తప్ప, యే జాడా లేదు! లేదే లేదు.. లేనే లేదు!

మీరు నన్ను వెలేశారు! నేలలో యింక కుండా విడదీసారు! అసలు నేలేది? మట్టేది? మట్టి వాసనేది? తొలకరి పరిమళమేది? మట్టి పరిమళాల మధుర వాసనలు యేవి?

సిమెంట్.. సిమెంట్.. సిమెంట్.. వున్నదంతా సిమెంటే! పచ్చదనం లేని పేవ్ మెంటే! ఇళ్ళు కావివి యినుప గూళ్ళు! రాతి నగరం! రాగం లేని నగరం! అనురాగం లేని నగరం! ఆదరము లేని నగరం! శిలా నగరం! శ్మశాన నగరం! క్షుద్ర నగరం!

ఒరే.. నేను మీకోసమే వచ్చాన్రా.. నాకు తోవ యివ్వండ్రా.. దారివ్వండ్రా.. నన్ను పోనివ్వండ్రా.. నన్ను యిమ్మనివ్వండ్రా.. యింకనివ్వండ్రా.. నేల వొడిని చేరనివ్వండ్రా.. అమ్మనిరా.. చెమ్మనిరా..  నేను జలాన్నిరా.. జీవాన్నిరా.. మీ జీవాన్నిరా.. మీ జీవనాధారాన్నిరా.. యేదీ అమ్మ గర్భంలోకి నన్ను చేరనివ్వండ్రా.. చేరుకోనివ్వండ్రా.. చేదుకుందుర్రా.. దప్పికలు తీర్చుకుందుర్రా.. నాలుకలు తడుపుకుందుర్రా.. వొరే దెష్టల్లారా.. దరిద్రుల్లారా.. భ్రష్టుల్లారా.. ద్రష్టల్లారా.. నాకు దారి వొదలండ్రా.. వదలండి!

అరే.. యెదవల్లారా.. మొదవల్లారా.. పాలు కొనుక్కుంటారు సరే, నీళ్ళు కూడా యెన్నాళ్ళు కొనుక్కుంటారురా? లీటరు బాటిలు యిరవై.. యిరవై లీటర్ల నీళ్ళ కేను యాభై రూపాయలు.. వున్న ఖర్చులకు తోడు నెల నేలా నీళ్ళ ఖర్చు.. డబ్బుల్లేకపోతే మంచి నీళ్ళు కూడా తాగడానికి లేదన్నమాట..! గుక్కెడు నీళ్ళ కోసం రొండు వందలు కాదు.. రెండు వేలు.. రెండు వేల అడుగులు తవ్వుతున్నారే.. డ్రిల్లింగ్ మిషన్లు దించుతున్నారే.. తోడేస్తున్నారే.. అమ్మ దగ్గర పాలుంటే చిమ్ముతూ వుంటే తాగొచ్చు.. తాగే పెరగాలి! కానొరే.. స్తన్యంలో పాలు లేవని రావని నెత్తురు పీలిస్తే యెలారా..? రేపు మీ పిల్లలు యేమి తాగి బతుకుతార్రా..? బతికి చస్తార్రా..?!

నీళ్ళురా.. నీ ముంగిటకి వచ్చాయిరా..! తలుపు మూయకురా..! నేను తీర్థాన్ని రా..! దేవుడు పంపిన తీర్థాన్ని రా..! తీర్థ ప్రసాదాల్ని పారబోయకురా..! మూడొంతుల నీళ్ళు యీ భూమ్మీద వున్నట్టు.. మీ దేహంలో కూడా మూడొంతుల నీళ్ళు వుండాలిరా..!

నీరు పల్లమెరుగు.. పల్లానికిపోదామంటే దారీలేదు.. నిజం దేవుడెరుగు.. అడుగుదామంటే దేవుడి జాడా లేదు! మట్టి జాడా లేదు! నేలని యిలా సిమెంటు పోసి కప్పేస్తే.. తల్లికి వూపిరెలా ఆడుతుందిరా? తల్లి పేగు తెగాక మీకు వూపిరెలా ఆడుతుందిరా? సమాధులు కట్టినట్టు కట్టారు కదరా? బతికుండగానే కప్పెట్టారు కదరా? ఇంచీ వదలకుండా సిమెంటు తాపడం పెట్టారే..! యిళ్ళూ వాకిళ్ళూ సరే..! అరుగులూ మెరుగులేనా..? వీధులూ.. వాడలూ.. దారులూ.. రహదారులూ.. వాటి పక్క ఆ వార యీ వార .. దేన్నీ యెక్కడా వదలర్రా? మట్టి అంత అంటరానిది అయ్యిందా? మీరు వేసిన వేషాలు చాలవని యింకుడు గుంతల కంటి తుడుపుతో కవరు చేస్తున్నార్రా?

చిన్న చినుకుకే చిత్తడి అయ్యే మీ నగరం వొక నగరమా? జల జలమని జల్లు కురిస్తే జడిసిపోయే మీ నగరం వొక నగరమా? వానొస్తే రోడ్లమీద మీ బళ్ళూ మీరూ తేలుతారే.. పడవలేసుకు పరుగులు తీస్తారే.. గట్టిగా గంట వాన కురిస్తే మునిగిపోయి.. నీట్లో తేలే మీ నగరం వొక నగరమా? మురుగు కాల్వలు ముడ్డికింద దాచుకొని ముక్కు మూసుకు బతికేస్తారే నాకేమో కడిగి పారేయ్యాలని వుంటుంది.. కాని దెబ్బ యెప్పుడూ ముందు తగిలేది చిన్నవాళ్ళకే! నిజమే, వాన కూడా అందరికీ వొకటి కాదు.. ప్చ్..!

ఏసీలు మీరు పెడతారు.. మీకు చల్లందనము.. మీ చుట్టూ వున్నవాళ్ళకి వెచ్చందనము.. మొక్కలొద్దు.. చెట్లద్దు.. దొడ్లద్దు.. తోటలొద్దు.. పచ్చదనం మీద యింత పగ పట్టారేమిరా? సిమెంటు రంగుకి సాటిరాదురా?

ఇంకా నాకు వోపిక లేదు! అదంతా నాకు తెలీదు.. నాకు దారి యిస్తారా? చస్తారా? యింకుడు గుంతలకన్నా ముందు.. సిమెంటు కనపడితే తవ్వండిరా.. పలుగూ పారా అందుకోండిరా.. గునపాలు తియ్యండిరా.. యీ సిమెంటుని తవ్వి పారేయండిరా.. గచ్చులు చప్టాలు ప్లాస్టింగులు పగలగొట్టండిరా.. మీ సమాధులు మీరు తవ్వుకొని బయటకు రండిరా.. బయటపడండిరా.. నేలతల్లికి గాలాడితేనే మీకు గాలాడుతుంది! నాకు దారి యిస్తేనే మీకు దారి! వీధులన్నీ తిరిగి కాలనీలన్నీ తిరిగి జనావాసాలలో తిరిగి యింకుడు గుంతలలోనే యిమిడలేక అలసిపోయి మట్టిలో యింకే మార్గం లేక రోడ్డెక్కానురా..! మీరూ మీ బతుకులూ రోడ్డెక్కుతాయిరా..!

నాకు తోవ యివ్వండిరా.. తల్లి గర్భంలోకి తోవ యివ్వండిరా.. తల్లి గర్భంలో చేరి స్తన్యమవుతాను.. మీ దప్పిక తీరుస్తాను.. మీకు ప్రాణం పోస్తాను..

నాకు తోవ యివ్వండిరా.. తల్లి గర్భంలోకి తోవ యివ్వండిరా..

మీ

వాన చినుకులు

 

 

మీ మాటలు

 1. డిల్లీ సుబ్రహ్మణ్యం says:

  బగరాశారు బజారా గారూ.అభినందనలు

 2. శ్రీనివాసుడు says:

  **మీ సమాధులు మీరు తవ్వుకొని బయటకు రండిరా.. **
  బ్రహ్మాండం బజరా గారూ!

 3. S.Radhakrishnamoorthy says:

  కాలం వెనక్కు నడవదు. మనసు వెనక్కు చూసుకొంటూ కాళ్ళు ముందుకునడుస్తాయి. బొక్కాబోర్ల పడి లేచి మోకాళ్ళు తడుముకొంటూ సాగిపోతుంది.మీ నగరారణ్యరోదనం బాగుంది. ఏడవడానికి కూడా నీళ్ళమిగలలేదు.

మీ మాటలు

*