చూడదగ్గ వి’చిత్రం’ 24

 

 భవాని ఫణి
~

కనీస అవసరాలన్నీ అలవోకగా తీరిపోతుంటే అప్పుడు మనిషికి కలిగే తరవాతి ఆశ ఏమిటి? ఆరోగ్యంగా ఎక్కువకాలం, కుదిరితే కలకాలం జీవించి ఉండాలనేగా. ఈ ఆశని తీర్చగల అతి సులువైన ఊహల్లో  కాలంలోకి ప్రయాణించడం కూడా ఒకటి. అంతేకాక కాలంలో ప్రయాణించగలిగితే పొందగల మిగతా లాభాలు అంకెలతో లెక్కించలేనన్ని. అటువంటప్పుడు అలా కాలం గుండా మనల్ని విహరింపచేయగల యంత్రమేదైనా మనకే, మనకి మాత్రమే దొరికితే ఎంత బాగుంటుందో కదా. ఎన్ని అద్భుతాలు చెయ్యచ్చు! ఎంత గొప్పవాళ్ళం అయిపోవచ్చు! ఒక వేళ అదే యంత్రం ఒక దురాశాపరుడి లేదా దుర్మార్గుడి చేతిలో పడినట్లయితే జరిగే అనర్థాల్ని కూడా మనం సులభంగానే ఊహించగలం. ఇటువంటి ఆలోచనకే దృశ్యరూపం “24” చలన చిత్రం.

మన దక్షిణాదిన నిర్మితమయ్యే  చలన చిత్ర కళా ప్రక్రియ( జెనెరె)ల్లో సైన్స్ ఫిక్షన్ చాలా అరుదు. విచిత్రంగా మన తెలుగులో అయితే ఆదిత్య 369 ఒక్కటి మాత్రమే అటువంటి చలనచిత్రంగా కనిపిస్తోంది. ( డబ్బింగ్ చిత్రాలని మినహాయిస్తే). నిజానికి ఈ అంశంపై హాలీవుడ్ లో లెక్కలేనన్ని కథలూ, సినిమాలూ సృష్టించబడ్డాయి. మన దేశంలో కూడా హిందీ, బెంగాలీ,తమిళ భాషల్లో ఇటువంటి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆలోచనలు పాతవే అయినా వాటి వ్యక్తీకరణ జరిగిన విధానాన్ని బట్టి చలన చిత్రపు విజయం ఆధారపడి ఉంటుంది . అటువంటి చెప్పుకోదగ్గ సై. ఫి. చిత్రంగా 24 మిగిలిపోతుందని చెప్పచ్చు.
సైన్స్ పరంగా పెద్దగా తర్కానికి అందని కథైనప్పటికీ ఈ సినిమాలో మనం గమనించాల్సింది దర్శకుడు కథని ప్రజెంట్ చేసిన విధానాన్ని . జరిగిన ప్రతి సన్నివేశానికీ, సంభాషణకీ ఒక అంతరార్థాన్ని కల్పిస్తూ అల్లబడిన బిగువైన దృశ్య ప్రదర్శనగా ’24’ని పేర్కొనవచ్చు. మధ్యలో కమర్షియల్ అంశాలనీ, హాస్యాన్నీ, ప్రాంతీయతనీ చొప్పించినప్పటికీ అవి ఎబ్బెట్టుగా అనిపించని విధంగా జాగ్రత్తపడ్డాడు దర్శకుడు విక్రం కుమార్.
కథ టూకీగా చెప్పాలంటే సైంటిస్ట్ అయిన డాక్టర్ సీతారాం, కాలం గుండా ప్రయాణించగలిగే ఒక చేతి గడియారాన్ని తయారుచేస్తాడు. ఇక్కడ కాలం గుండా ప్రయాణం అంటే భౌతికంగా కాదు. కేవలం మానసికంగా మాత్రమే. అంటే ఈ వాచ్ ని ఉపయోగించి మన ఆలోచనల్నీ అనుభవాల్నీ వెనక్కి గానీ ముందుకు గానీ పంపవచ్చు. ఉదాహరణకి మనం ఈ వాచ్ సహాయంతో పది సంవత్సరాలు కాలంలో  వెనక్కి ప్రయాణం చేసామనుకోండి. గతంలో  ఉన్న మనకి, తర్వాతి పది సంవత్సరాల కాలానికి చెందిన జ్ఞాపకాలూ, అనుభూతులూ కలుగుతాయి. అక్కడినించి ఆ జ్ఞానాన్నిఉపయోగించి మనం చేసే చర్యల ఫలితంగా మరో కొత్త భవిష్యత్తు సృష్టింపబడుతుంది. అలాగే కాలాన్ని కొంతసేపు నిలిపి వేయవచ్చు కూడా .
సీతారాం, ఇటువంటి ఒక గొప్ప కాల గడియారాన్ని సృష్టించిన ఆనందంలో ఉండగానే దుర్మార్గుడైన అతని కవల సోదరుడు ఆత్రేయ,  ఆ వాచ్ ని చేజిక్కుంచుకుని, కాలాన్ని జయించాలన్న కోరికతో చేసిన కొన్ని దుష్ట కార్యాల కారణంగా ఆ అన్నదమ్ముల జీవితాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి.
అటుపైన ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత సీతారాం కుమారుడైన మణి, ఆత్రేయ ఆట కట్టించి పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దాడనేది కథాంశం. కథ గురించి ఇంతకుమించిన వివరాలూ, సినిమాకి 24 అనే పేరు ఎందుకు పెట్టారన్న విషయానికి చెందిన సమాచారమూ సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది. మొత్తం కథలో, ఏడాది లోపు వయసున్న పసి పిల్లవాడు, ఇరవై ఆరేళ్ళ మానసికమైన వయసుతో,  అనుభవాలతో, ఆలోచనలతో ఉండిపోవడమనే ఊహ చాలా కొత్తగా అనిపించింది.
ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది స్క్రీన్ ప్లే గురించి. దాన్ని ఎంతో ఆసక్తికరంగా తీర్చిదిద్దడంతో పాటుగా, అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో తయారుచేసేందుకు
దర్శకుడు చాలా కృషి చేసాడు. ముందు కనిపించే ఒక దృశ్యాన్ని లేదా సన్నివేశాన్ని తర్వాతెప్పుడో జస్టిఫై చేసి జతకూర్చిన తీరు చాలా బావుంది. లాజిక్ చెడకుండా ఉండేందుకు దర్శకుడు తీసుకున్న శ్రద్ధ సినిమా ఆద్యంతమూ కనిపిస్తుంది.
సాధారణంగా సై.ఫి చిత్రాలలో మానవ సంబంధిత భావోద్వేగాలకి చెందిన అంశాల లోపం స్పష్టంగా కనిపిస్తుంటుంది. కొన్ని కథల్లో అయితే కనీసం స్త్రీ పాత్ర ఉండను కూడా ఉండదు. కానీ 24 లో ఉన్న మెచ్చుకోదగ్గ అంశం ఏమిటంటే, మనుషుల మధ్య ఉండే అనుబంధ బాంధవ్యాలని, ప్రేమాభిమానాల్ని ఈ సినిమా చాలా సహజంగా ఆవిష్కరిస్తుంది. మణికీ, అతన్ని పెంచిన తల్లి సత్య భామకీ మధ్య నడిచిన కథ, సినిమాని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది.  సినిమాలో అరవై శాతం వరకు ఉపయోగించిన విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా సహజంగా ఇమిడిపోయాయి. సూర్య నటన గురించి ఇక్కడ తప్పనిసరిగా చెప్పుకోవాలి. అతను ధరించిన మూడు పాత్రల్లో నటనకి అవకాశం ఉన్న మణి, ఆత్రేయ పాత్రలకి అతను పూర్తి న్యాయం చేకూర్చాడు. హీరోయిన్స్ నిత్యా మీనన్, సమంతాలు  సాంప్రదాయబద్ధమైన తీరులో అందంగా కనిపించారు. విభిన్నమైన కోణాల్లో కెమెరాని ఉపయోగించి సినిమాటోగ్రాఫర్ “తిరు” సినిమాకి తన వంతు సహాయాన్ని అందించారు  రెహమాన్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం మాత్రం తీసికట్టుగా ఉన్నా వాటి మీద పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపించదు.
మామూలు వాచ్ మేకర్ అయిన మణి, అతని సైంటిస్ట్ తండ్రి సీతారామ్ తయారుచేసిన కాల గడియారంలో సులభంగా మార్పులు చెయ్యగలగడం వంటి చిన్న చిన్న లోపాలూ, వాన చినుకుల్ని ఫ్రీజ్ చేసి చెదరగొట్టడం వంటి  అసంభవమైన అతిశయోక్తులూ కొన్ని కొన్ని ఉన్నప్పటికీ  24 ని ఒక  తెలివైన ప్రయోగంగా పేర్కొనవచ్చు.
*

మీ మాటలు

  1. Suparna mahi says:

    ఆసక్తి కరంగా, చాలా చక్కగా వుందమ్మా మీ రివ్యూ… ధన్యవాదాలు…

  2. Buchireddy gangula says:

    పాలల్లో నీళ్ళు. కలిపినట్లు —సినిమా రివ్యూ లు సారంగ లో—??
    ==============================================
    Buchi రెడ్డి గంగుల

  3. ప్రయోగాత్మకమైన సినిమా గురించి ఉపయోగకరమైన సమీక్ష. సినిమాని ఒక సాంస్కృతిక అంశంగా భావించి, ఈ సమీక్షని ప్రచురించడం సందర్భోచితంగా వుంది.

    • Bhavani Phani says:

      మీ స్పందనకి సంతోషంగా అనిపించింది . ధన్యవాదాలు శ్యాం గారు

  4. Thilak Bommaraju says:

    చాలా మంచి సినిమాను అంతకంటే గొప్పగా విశ్లేషణ చేసారు భవాని ఫణి గారు.మీరు రాసే ఆర్టికల్స్ చాలా బాగుంటాయి.రెగ్యులర్గా చదువుతుంటాను.యింకా ఇలాంటివి రావాలి.

    • Bhavani Phani says:

      తిలక్ బొమ్మరాజు గారు , నిజానికి బాగా నచ్చితే గానీ నేను సినిమా గురించి రాయను . ఒక మంచి ప్రయోగం అనిపించి ఈ రివ్యూ రాసాను . ప్రచురించిన సారంగకి ధన్యవాదాలు . మీ స్పందనకు ఆనందం కలిగింది . thank You

Leave a Reply to Suparna mahi Cancel reply

*