చంద్రవంకల ఆత్మఘోష గురించి…. 

 

cover page of mudava manishi
-అరణ్య కృష్ణ
~
మనుషులెన్ని రకాలంటే రెండు రకాలని, అది ఆడా మగా అని చెప్పే దురహంకారం మనది.  సంసారం ఈతి బాధలు మోస్తూ మగాడు, పురుషాహంకారానికి బలైపోయే స్త్రీల వెతలే మనకు తెలుసు. వాటికే సాహిత్య గౌరవాన్ని ఇచ్చే సంకుచిత్వం మనది.  ఈ రెండు రకాల మనుషుల బాధలకి స్పందించే మనం, కళ్ళనీళ్ళు పెట్టుకునే మనం, కారాలు మిరియాలు నూరే మనం, తిరుగుబాట్లు ప్రబోధించే మనం, సమానత్వం గురించి ఘోషించే మనం మనుషుల్లో మనలాగే పుట్టిన మూడోరకం మనుషుల పట్ల మాత్రం అమానుషంగా వ్యవహరిస్తాం. విలన్లుగా ప్రవర్తిస్తాం.  అజ్ఞానమూ, దురహంకారమూ, అశాస్త్రీయమూ కలగలిసిన విచిత్ర వికృత ప్రవృత్తితో వారిని చూసి ఫక్కున నవ్వుతాము, హేళన చేస్తాము, అనుమానిస్తాము, అవమానిస్తాము కూడా. కడుపున పుట్టినా, తోడపుట్టినా కూడా కనికరించము. నిజంగానే పలుకాకుల్లా పొడుచుకు తింటాం.  తరిమేస్తాం.  వాళ్ళను చూడగానే నవ్వటానికి ఏం వాళ్ళు మన వినోదం కోసం పుట్టారా?  వాళ్ళను అనుమానంగా చూడటానికి, అవమానించటానికీ  వాళ్ళేమన్నా మన కట్టు బానిసలా? జాత్యహంకార చరిత్రలో కూడా ఏ తెల్లవాడూ మరో నల్లవాడ్ని చూడనంత ఘోరంగా మనమెందుకు చూస్తాం?  జననాంగాల చలనశీలతే కదా తేడా వాళ్ళకీ మనకు?  మనం పేద్ద పోటుగాళ్ళం, పోటుగత్తెలమై పునరుత్పత్తి కార్యక్రమానికి దోహదం చేస్తున్నామనేగా మన మిడిసిపాటు.  మిగతా అంతా వాళ్ళూ, మనమూ ఒకటే కదా! మనసు, హృదయం, స్పందన ఒక్కటే కదా! మనకైనా, వారికైనా చర్మాన్ని గాటు పెడితే వచ్చేది నెత్తుటి బొట్లే కదా. కడుపుకి వేసే ఆకలొక్కటే కదా! గాయపడ్డ గుండె కార్చే ఉప్పటి కన్నీరు ఒక్కటే కదా!  ఎందుకు సాటి మనుషుల్ని గౌరవించలేక పోతున్నాం? సాటి మనుషుల్ని చూసి ఏమిటా కుసంస్కారపు గగుర్పాటు? నిజానికి ఒక గొప్ప విషయం ఏమిటంటే థర్డ్ జెండర్ వారు ప్రధానంగా తమని తాము స్త్రీలుగా ప్రకటించుకుంటారు.  బహుశ కష్టాల్ని, కన్నీటిని, ప్రేమరాహిత్యాన్ని, ఎడబాటుని తాము స్త్రీలైతేనే భరించగలమేమొ అన్న అసంకల్పిత ఆలోచనే అందుకు కారణమేమో! వారో ప్రత్యేక సమూహంగా కదులుతారు. తమదైన లోకాన్ని, బంధాల్ని, బంధనాల్ని సృష్ఠించుకుంటారు.
రేవతి అనే హిజ్రా ఈ సమాజానికి పెద్ద ఝలక్ ఇచ్చారు.  ఆమె తన జీవిత చరిత్రని “ఒక హిజ్రా ఆత్మ కథ”గా మన ముందుకు తెచ్చారు.     ప్రకృతి పరంగానే ఒక మనిషిలో రెండు అస్తిత్వాల మనుగడ, రెండు లింగాల వైవిధ్య సమ్మేళనం వలన కలిగిన ఇబ్బందుల్ని ఆమె మనతో పంచుకున్నారు.  అతడుగా మొదలైన ప్రయాణం మధ్యలో ఆమె గా మారి, ఇంక ఎప్పటికీ ఆమెగానే కొనసాగే సాహసిక ప్రయాణంలో తన అనుభవాల్ని ఆమె మనతో పంచుకున్నారు.  ఆ ప్రయాణాన్ని చదివి, స్పందించి రేణుక అయోల “మూడవ మనిషి” అనే ఒక దీర్ఘకవిత రాసారు.  తెలుగులో అనే కాదు, ఏ భాషలో అయినా థర్డ్ జెండర్ మీద వచ్చిన సాహిత్యం అతి తక్కువ. అందుకుగాను రేణుక అయోల గార్ని ముందుగా అభినందించాలి.  నిజానికి దీర్ఘ కవిత ఒక క్లిష్టతరమైన కవ్విత్వ ప్రక్రియ.  పాఠకుడి ఆసక్తి ఎంతమాత్రం దెబ్బతినకుండా కవ్వితని నిర్వహించాలి.  వాక్యనిర్మాణం, నడకలతో కూడిన శిల్పంలో పరిపక్వత కనిపించాలి.  ఎక్కడా ఫీల్ చెడకూడదు.  భావోద్వేగ ప్రవాహం నిరంతరాయంగా కొనసాగాలి. దాన్లో చిన్న తేడా వచ్చినా యాంత్రిక వ్యక్తీకరణ ప్రస్ఫుటంగా కనిపించి, ఆసక్తి నీరసించి కవిత పఠనం కుంటుపడుతుంది.  అందుకే ఇదో చాలెంజ్.  అందుకే శివారెడ్డి గారు దీర్ఘ కవిత ఒక సవాలని, మంచి కవులు ఆ సవాలుని స్వీకరించాలని చెబుతుంటారు.  ఈ సవాలుని రేణుక స్వ్వీకరించారు.  స్వీకరించి పరకాయ ప్రవేశం చేసారు.  మొత్తం పదిహేను భాగాలుగా సాగిన ఈ 53 పేజీల కవిత మొత్తాన్ని ప్రధమ పురుషలోనే  నడిపించారు.  ఇదేం చిన్న విషయమేం కాదు.  ఇక్కడ సవాలు రెండు రకాలు. ఒకటి దీర్ఘ కవితే ఒక సవాలు కాగా, రెండోది ఎంచుకున్న వస్తువు.  అందరూ ముఖం తిప్పేసుకునే వస్తువు. ఇదేం చోద్యం అని బుగ్గలు నొక్కుకునే వస్తువు.  ఈ రెండూ కష్టమైన సవాళ్ళే.    ఇటువంటి కవిత రాయటానికి కేవలం సానుభూతి మాత్రమే కాక చాలా అవగాహన కావాలి.  ఒక మామూలు మనిషి ఒక వయసు వచ్చాక హిజ్రాగా మారే పరిస్తితుల పట్ల అవగాహన వుండాలి.  సాంఘీక పరిస్తితుల మీద, జెండర్ అంశాల మీద, దైహిక ప్రక్రియల మీద పూర్తి అవగాహన కావాలి.  ఇది వైద్యపరమైన సబ్జెక్ట్. సాంకేతికమైన సబ్జెక్ట్.  మనో వైజ్ఞానిక సబ్జెక్ట్.  అందుకనే ఇది కత్తిమీద సాము.  ఈ విషయంలో రేణుక గారు చాలావరకు సఫలమయ్యారు.
“రూపాన్ని వ్యక్త పరచలేని
ఒక దేహ చరిత్ర రాసుకోవాలనుకున్నప్పుడు
అక్షరాల గాయాలు రహిదారిలో నిలబడి
దిక్కులు చూస్తున్నాయి”
నిజమే సందిగ్దతే హిజ్రా అస్థిత్వం.  ఎందుకంటే “ఒక శరీరం రెండు రూపాలతో కొట్టుమిట్టాడు”తుంది కనుక.  ఆ కొట్టుమిట్టాడినతనాన్ని ఎలా చెప్పారంటే:
“కొన్నిసార్లు మరణించి
కొన్నిసార్లు జీవించి
ఆ రెంటి పొలిమేరల్లో బతుకుని ఒడొసిపట్టుకుని
ఈ కాగితం మధ్యలో నిలబడి
బతుకు గోడు చెప్పుకోవాలనుకున్నప్పుడు
ఒక నిశ్శబ్దపు నీలివర్ణం
నా చుట్టూ పేరుకుంది”
ఎదిగాకే మూడవ మనిషి. కానీ పుట్టినప్పుడు అందరూ మొగ పిల్లాడనే అనుకున్నారు.  సంబరపడ్డారు. అమ్మకి మాత్రం సందేహమే.
“చీరబొంతలో తమలపాకు కట్టలా నన్ను దాచి
సందేహంలో  పడిపోయిన అమ్మ
ఎన్నిసార్లో నా పసి దేహన్ని పట్టి చూసుకుందో”
మగపిల్లాడిగా పుట్టి ఆడతనపు ప్రవర్తనతో ఎన్నో ఇబ్బందులు పడ్డ ఆ జీవన ప్రస్థానాన్ని వివిధ దశల్లోని క్రూర ఘోర అనుభవాల్ని కళ్ళకు కట్టినట్లు చెబుతారు కవి.   ఆమె జీవితంలోని ప్రతి భావోద్వేగ సందర్భాన్ని  రేణుకగారి సహానుభూతి కవితాత్మకం చేసింది.  ప్రకృతిపరంగా తన ఆత్మ బంధువుల్ని కలిసినప్పుడు, చీర కట్టుకున్నప్పుడు, స్త్రీగా మారిపోవటానికి పురుషాంగం తీయించేసుకున్న ఆపరేషన్ చేయించుకున్నప్పుడు, ఇంటికి తిరిగివస్తే వెలివేయబడ్డప్పుడు, ఆకలి తీర్చటం కోసం వ్యభిచారం చేసినప్పుడు…ఇలా ప్రతిసందర్భంలోనూ మంచి వాక్యాలు రాసారు.  మచ్చుకి కొన్ని పంక్తుల్ని కింద ఇస్తున్నాను. చూడండి.
“ఒంటిని విడవని చీరకట్టు
కవచంలో కాపాడే చీరకట్టు
కలలో మెలకువలో వెంటపడ్డ ఆనందం
మెత్తని పక్షి ఈక ఒంటిని నిమురుతూ
జీవించటానికి తాగుతున్న అమృతం
మెడచుట్టూ గిల్టు నగలు
అద్దం కాంతికి మెరిసే తెల్లటి రాళ్ళు”
“నా చేతినిండా ఆకలి చుట్టూతా ఆకలి
ఆకలి చల్లార్చడానికి బజారున పడ్డ శరీరాలు
చప్పట్లు చరుస్తూ మీద మీద పడుతూ
దండుకునే రూపాయల నిండా దుఖం”
“గాయపడ్డ నరం చిట్లినప్పుడు
లోలోపల ప్రవహించే నెత్తురు చప్పుడు
కళ్ళ కొసలలో ఆగిపోయేది”
“శరీరం చెట్టు నుండి
కొమ్మలు నరకాలి అనుకున్నప్పుడు
కూకటివేళ్ళతో సహా పెకిలించబడింది
శరీరం నుండి చిన్న అంగం తెగిపడింది
చుట్టూతా నిశ్శబ్దం
జీర్ణం కాని జడత్వం
చల్లారిన అగ్నిపర్వతం”
“ఇప్పుడు నేను స్త్రీని
అదమైన జీవితంతో
నీలినదిలో పడవలో తేలుతున్న చంద్రవంకని
రేపటి వెలుగులోకి తొంగి చూస్తున్న
ఒంటరి నక్షత్రాన్ని”
“రోడ్డు మీద గోడవారగా
రేకు తలుపులు ఆనుకొని
దేహాన్ని అమ్మకానికి పరిచిన ప్రతిసారి
ఒక నొప్పి పేగులు తెంచుకొని
రక్తాన్ని బైటకి తెస్తుంది”
“ఈ శరీరాలకి వెల వుంది
ప్రేమకి వెల లేదు
దాహానికి నోటు వుంది
ఆప్యాయతకి ఆసరా లేదు
చేతినిండా దాహపు పాత్రలే”
ఇలా గుర్తించదగ్గ, గుర్తుపెట్టుకోదగ్గ పంక్తులు ఈ దీర్ఘ కవితలో కనిపిస్తాయి.  ఈ భూమ్మీదకి మనందరిలాగానే వచ్చి ఒక తీవ్ర అంతర్ అన్వేషణతో తన అస్తిత్వాన్ని నిర్ధారించుకునే “మూడవ మనుషులు” గురించి వేదనాత్మకంగా రాసిన అర్ధవంతమైన కవిత ఇది.  మొదటి నుండి చివరి వరకు చదివించగల సరళవంతమైన నడక, నిర్వహణ కనబడుతుంది.  అక్కడక్కడా కొంత వాచ్యంగా అనిపించొచ్చు.  కొంత ఎడిట్ చేసుకోతగ్గ పంక్తులూ లేకపోలేదు. అయినా మొత్తం మీద వస్తువు, రూపం, నిర్వహించిన తీరుతో ఒక విలువైన కవితగా రూపొందించారు. అభినందనలు రేణుక గారూ!
(“మూడవ మనిషి” దీర్ఘ కవిత. రచన రేణుక అయోల, 8-3-677/ఎ/2, యూకో ఆర్కేడ్, ఫ్లాట్ నం.2, నవోదయ కాలని, యెల్లారెడ్డిగూడ, హైదరబాద్-500037. వెల రూ.50. ప్రచురణ జె.వి.పబ్లికేషన్స్.)

మీ మాటలు

  1. ప్రసాద్ చరసాల says:

    గత కొద్దిరోజులుగా transgenders ఏ రెస్ట్ రూము వుపయోగించాలి అన్నదాని మీద అమెరికాలో పెద్ద చర్చ జరుగుతోంది.
    మనమెందుకు ఈ విశయాన్ని చర్చించటం లేదు. మనకు లేరా transgenders! వాళ్ళ వునికే లేనట్లు ఎలా తోటి మనుషుల మీద దౌష్ట్యము చేస్తున్నాము అనుకుంటే గుండెలోపలెక్కడినుండో బాధ తన్నుకొస్తుంది.

    • Aranya Krishna says:

      మనం ఇంకా వారి వాష్ రూంల గురించి ఆలోచించేదాకా రాలేదు సార! బాగా వెనుకబడిపోయి వున్నాం.

  2. రెడ్డి రామకృష్ణ says:

    అరణ్య కృష్ణ గారూ ! మీ సమీక్ష బాగుంది.ఈ దీర్ఘ కవిత ‘మూడవ మనిషి’ నేను చదివాను.రచయిత్రి ధైర్యాన్ని,రచనావిదానాన్ని మొచ్చుకోవాలి. రచనకు తగ్గట్టుగానే మీ సమీక్ష కూడా వుంది.అభినందనలు.మీకు రచయిత్రికి కుడా.

    • Aranya Krishna says:

      ధన్యవాదాలు రెడ్డి రామకృష్ణ గారూ!

  3. Kudupudi rajanni prashant rao says:

    A them chosen by Renuka ayola was innovative and out of the way to normal people thought . In our day to day life we are always worried about our own ప్రొబ్లెమ్స్, mam Renuka had bought into glimpse another dimension of our society how they suffer with inferior in this society and their problems.sir Aranyya krishna gave an excellent review and critic on the topic .I congratulate Renuka mam .and request her to update us with her new views to society and lot of thanks to krishna gaaru for his excellent review..

  4. Krishna Veni Chari says:

    కవిత్వం అంటే దూరంగా ఉండే నాకూ ఈ కవిత నచ్చింది. మీ విశ్లేషణ కూడా.
    మూడు నెల్ల కిందట ఇంచుమించు ఇటువంటి టాపిక్‍ మీదే నేనొక వ్యాసం రాశాను. అది వ్యాసం కాబట్టి భావోద్వేగాలు లేవు. మీ రైట్‍అప్‍ చదివి, గుర్తొచ్చి, సందర్భం కదా అనిపించి, ఇక్కడ లింక్‍ పంచుకుంటున్నాను అరణ్య క్రిష్ణగారూ. అభ్యంతరం ఉండదని ఆశిస్తాను.
    http://vihanga.com/?p=16590#sthash.C5TuItpU.dpbs

    • Aranya Krishna says:

      అభ్యంతరం దేనికి కృష్ణ గారూ? తప్పక చూస్తాను.

  5. D Subrahmanyam says:

    ఇంత మంచి కవితను రాసిన రేణుక అయోల గారికీ , పరిచయం చేసిన అరణ్యకృష్ణ గారికీ హార్దిక అభినందనలు. అరణ్యకృష్ణ గారు రాసినట్టు ఇంతకు ముందు “రేవతి అనే హిజ్రా ఈ సమాజానికి పెద్ద ఝలక్ ఇచ్చారు. ఆమె తన జీవిత చరిత్రని “ఒక హిజ్రా ఆత్మ కథ”గా మన ముందుకు తెచ్చారు. ప్రకృతి పరంగానే ఒక మనిషిలో రెండు అస్తిత్వాల మనుగడ, రెండు లింగాల వైవిధ్య సమ్మేళనం వలన కలిగిన ఇబ్బందుల్ని ఆమె మనతో పంచుకున్నారు. అతడుగా మొదలైన ప్రయాణం మధ్యలో ఆమె గా మారి, ఇంక ఎప్పటికీ ఆమెగానే కొనసాగే సాహసిక ప్రయాణంలో తన అనుభవాల్ని ఆమె మనతో పంచుకున్నారు. ” . రేణుక అయోల గారు ఇది చదివి స్పందిస్తూ ““మూడవ మనిషి” అనే ఒక దీర్ఘకవిత రాసారు. తెలుగులో అనే కాదు, ఏ భాషలో అయినా థర్డ్ జెండర్ మీద వచ్చిన సాహిత్యం అతి తక్కువ”

    రేవతి గారి “ఒక హిజ్ర ఆత్మకధ ” కు స్పందిస్తూ రేణుక అయోల గారు మంచి కవిత రాస్తే, ప్రఖ్యాత మార్క్సిస్ట్ రచయిత్రి రంగనాయకమ్మ గారు, వీక్షణం లో నలుగు భాగాలూ గా , హిజ్రాల ను అసహ్యించుకుంటూ రాసారు.

    అంటే మానవత దృక్పదంతో మనుషుల మధ్య ఉంటూ రాస్తే రేణుక గారు హృదయాన్ని కదిలించేలా ఆలోచించేలా రాయవచ్చు అని నిర్ధారణ చేశారు. ఇంకొకసారి అభినందనలు.

    వారు చెప్పినట్టు , హిజ్రల బతుకు –

    “నా చేతినిండా ఆకలి చుట్టూతా ఆకలి
    ఆకలి చల్లార్చడానికి బజారున పడ్డ శరీరాలు
    చప్పట్లు చరుస్తూ మీద మీద పడుతూ
    దండుకునే రూపాయల నిండా దుఖం”
    “గాయపడ్డ నరం చిట్లినప్పుడు
    లోలోపల ప్రవహించే నెత్తురు చప్పుడు
    కళ్ళ కొసలలో ఆగిపోయేది”
    “శరీరం చెట్టు నుండి
    కొమ్మలు నరకాలి అనుకున్నప్పుడు
    కూకటివేళ్ళతో సహా పెకిలించబడింది
    శరీరం నుండి చిన్న అంగం తెగిపడింది
    చుట్టూతా నిశ్శబ్దం
    జీర్ణం కాని జడత్వం

  6. Narayana sharma says:

    చాలా బాగుంది అరణ్య కృష్ణ గారు
    అయోల గారు ఇది రాస్తున్నప్పుడే చదివాను నేను. ఒక కొత్త అంశాన్ని కవిత్వం చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులుంటాయి
    మీ రివ్యూ చదివాక కవిత్వం విజయం సాధించింది అనిపించింది

  7. renuka ayola says:

    అరణ్య కృష్ణ గారు నిశ్శబ్ధంగా పుస్తకం అందిన వెంటనే ఇంత అద్భుతమైన సమీక్ష అందించినందుకు
    మీకు నా హృదయ పూర్వక ధన్య వాదాలు….

  8. renuka ayola says:

    రెడ్డి రామ కృష్ణ గారు , డా ‘ సుభ్ర మణ్యం గారు, ప్రసాద్ చరసాల గారు ,నారాయణ శర్మ గారు ,సమీక్ష చదివి
    మీ స్పందన తెలియ చేసినందుకు ధన్య వాదాలు ….

Leave a Reply to Aranya Krishna Cancel reply

*