ఎన్నెలో యెన్నెలా… !

 

 

-అట్టాడ అప్పల్నాయుడు

~

 

 

ఆ ఇంట్లో టీ.వీ అతని మరణాన్ని ప్రసారం చేస్తోంది. మరణం వెనక కారణాలను విశ్లేషిస్తోంది. రోజులో యింకేవీ వార్తలు లేనప్పుడూ, అడ్వర్టయిజ్ మెంట్ల తర్వాతా మూడు రోజులుగా టీ.వీ ఛానళ్లన్నీ అతని గురించి చెపుతూనే వున్నాయి. న్యూస్ ఏంకర్లు వారి రిపోర్టర్లను యెప్పటికప్పుడు అప్ డేట్సుని అడుగుతూ, వాట్ని ప్రసారం చేస్తూ, కొన్ని విజువల్స్ వేస్తూ, యిటువంటి వార్తలను ప్రసారం చేస్తున్నందుకు సంతోషిస్తున్నట్టు కనబడుతున్నారు. అప్పటికి అతను చనిపోయి నాలుగోరోజు.

అతను చనిపోలేదు, హత్యచేసారంటారు అతని మిత్రులూ, సహచరులూ.  అతన్నెవరూ హత్యచేయలేదు, అతనికతనే ఉరి వేసుకుచనిపోయేడు. బతకడం ఇష్టంలేక తనే చనిపోతున్నాని, బతుక్కంటే చావు హాయిగా వుందని ఉత్తరం రాసి చనిపోతే హత్యంటారేమిటీ అసహనంగా ప్రశ్నించేరు కొందరు. ఆ కొందరే అతని మరణానికి కారణమని యింకొందరూ ! ఇన్నోసెంట్ ఛైల్డ్ , టేక్ హిజ్ లైఫ్ ఫర్ నో కాజ్.. అని వాపోయిందొకామె. అంతేకాక- ఆ చావుకి తమను బాధ్యుల్ని చేసి మాటాడిన ప్రతికక్షుల్ని… ఉతికి ఆరేసింది. రాజకీయాలు శవాలతో చేయకండి. ఊపర్ భగవాన్ హై.. పాపోంకో ఓ నహీ ఛోఢేగీ… అని నిప్పుకళ్లతో హుంకరించింది. భగవాన్ కూడా ఆ క్షణాన ఆమెను చూస్తే హడలిఛస్తాడు.

భగవాన్ ఆప్ జైసే మహిళా నహీ… భగవాన్ పురుష్ హో, నహీ ఛోడీగీ నహీ, నహీఛోఢేగా భోలో అని ఇంకొందరు అభ్యంతరం చెప్పేరు. ఆమె ధీమాగా – ఓటర్ తమ పక్కనున్నారన్నట్టు.. భగవాన్ హమారే సాధ్ హై… అనన్నది ! ప్రతికక్షులవేపు నిసాకారంగా చూసి – ఇన్నోసెంట్ ఛైల్డ్ టేక్ హిజ్ లైఫ్.. అని రుద్ద కంఠంతో పలికి… భగవాన్ నహీ ఛోడేగీ అనన్నది మళ్లీ !

” .. చూసేవమ్మా, నువ్వెప్పుడూ అల్లరి పిల్లడివని తిట్టేదానవి. ఆమె నన్నెపుడూ చూడనేలేదు. నా శవాన్నిగూడా చూడలేదు. అయినా ( ఇన్నోసెంట్ ఛైల్డ్ ) తెలివిలేని పిల్లడని బాధపడింది. నువ్వూ వున్నావెందుకూ ? నన్నాడిపోసుకోడానికి ? అని బుంగమూతి పెట్టేడు అతను ! టీ.వీ చూస్తోన్న తల్లి బదులివ్వలేదు. అతని ఒడలంతటినీ స్పర్శించింది. కౌగిలించుకుంది. జుత్తులోకి వేళ్లు జొనిపి, జుత్తు గట్టిగా పీకింది. అతను హాయిగా నవ్వి ఆమె కౌగిలిలో ఇమిడిపోయేడు.

ఇంతలోనర్శిం వచ్చేడు. ఒక క్షణం మౌనంగా కూచున్నాడు. ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి – నక్షత్ర చావుకి ఒకరు గాదమ్మా.. నీచే, నాచే, వరమడిగిన కుంతిచేతన్… అలాగ ఆరుగురేటి బతికున్న మనందరమూ కారకులమే అనన్నాడు. తల్లి గతుక్కుమంది. కొడుకు- సైగ చేసేడు, నాలుకను బయటకు పెట్టి నర్శిం మామ చెప్పేది నిజంకాదన్నట్టు. అతనే నక్షత్ర ! ఆమె నక్షత్రను పొదివి పట్టుకుంది.

నక్షత్ర చనిపోయేడంటే యిప్పటికీ నమ్మలేకపోతున్నాను., కాలిబూడిదయి నాల్రోజులయినా- అనన్నాడు నర్శిం. నక్షత్ర మరణ వార్తను నర్శిమ్మే తెచ్చేడు. పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని చెప్పేడు. చీకటి, చిట్టడవీ, భోరున గాలీవానా  – చిందువ యెత్తుకెళిపోయిన జింక పిల్ల తల్లిలా ఒణికిపోతూ, నిలువెల్లా నీరయి… తల్లి కూలబడిపోయింది. నర్శిం యేడుస్తూ –

నక్షత్రలాంటివాళ్లు తమ వాడలోనే కాదు, భూమ్మీదనే యెక్కువమంది పుట్టరు. చిత్రమయిన పిల్లాడు. బతుకు గురించి అందరమూ యేదో అనుకుంటాంగానీ నక్షత్ర భవిష్యత్ బతుకు గురించి మాటాడేవాడెపుడూ. రేపేంజేద్దామ్మామా అనడిగేవాడు. గడనీయిరా… ఈరోజేనేవాడు నర్శిం. కాదు, మామా ఈరోజు గడవడం రేపటికోసమే అననేవాడు. రేపటికోసమే జీవించేవాడు. ఊరుకి దూరంగానున్న స్కూలుకి నడిచివెళ్లేవాడు. పెద్ద రైతుల, ధనికుల పిల్లలు నక్షత్రను యెందుకో ఒకందుకు అవమానపరిచేవారు. తల్లీదండ్రులు కులభ్రష్టులనో, కులహీనులనో.. ! ములకోల పోట్లతో దుక్కిపశువు నాగేటిచాళ్లు పోసినట్లుగా హైస్కూల్, కాలేజీ చదువుల్ని సాగించేడు రేపటి మీద ఆశతో !

లేదు మామా, నేనింకా బతుకు ఆరంభించకముందరే ముగింపుకొచ్చేసాను. దుక్కిపశువు నాగేటిచాళ్ల మీదే ఆఖరి శ్వాస తీసింది- సూసైడ్ నోట్ లో ఈ వాక్యం లేదుగానీ, నర్శింకి లేఖ సారాంశమంతా యీ వాక్యరూపంలో అర్ధమైంది. అందుకే… బతికున్న అందరమూ  దోషులమంటున్నాడు.

ఇందిరమ్మకోలనీ కోసం, బంజరభూములకోసం, రిజర్వేషన్లకోసం, దేవాలయప్రవేశాల కోసం – నర్శిం ఆందోళనలూ, ఉద్యమాలూ ! మామా, వీటి కోసమేనా మన జన్మలు ? వాళ్లూ, మనం అంతా కూడా మనుషులమే కదా ? వాళ్ల కలలూ, మన కలలూ ఒకటే కాజాలవా అనేవాడు. నక్షత్రకు ఆశయాలున్నవిగానీ, అవెలా తీరతాయో, వాట్నెవరు అడ్డుకుంటున్నారో యెరుక లేదు. నర్శింకి కూడా వివరించే శక్తి లేదు. నక్షత్ర ఓ రోజు నర్శిం భుజమ్మీది ఎర్రతువ్వాలుని తీసేసి, నీలి రంగు తువ్వాలు కప్పేడు. ఏవేవో విషయాలు మాటాడేడు. యూనివర్షిటీలో తోటి విద్యార్ధుల ఆశలు, ఆవేదనలు, రేపటి కోసం కార్యాచరణలు… ! ఏడాదిగా యెపుడు కలిసినా యివే ఊసులు !

అపుడే – ఊరిలో ఏదో బహుళజాతి కంపెనీ ధర్మల్ విద్యుత్ కర్మాగారానికి శ్రీకారం చుట్టింది. డిపట్టా భూమలయిన తమ భూముల్ని అప్పగించమని కలెక్టర్ ఉత్తర్వులు. తాము ఉద్యమం చేయటం. కోర్టు నుంచి స్టే తేవడం ! కలకలంగా ఉంది వాడంతా !

యేమనుకున్నాడో నక్షత్ర – పండీ, యెండని భూములెందుకు మామా, వొదిలేయండి, ఉద్యోగాలిప్పించమనండన్నాడు.

నక్షత్రా – పండీ, యెండనివి కాదు. అలా చేసేరు, రైతు బతుకుని. మట్టిలోన సాముదప్పా మాకేమి తెలుసు నక్షత్రా ? మట్టిని లాక్కున్నోడు మమ్మల్ని ఉద్దరిస్తాడంటే నమ్మమంటావా అని గదా అడిగేడు నర్శిం.

నక్షత్ర చాలాసేపు మాటాడలేదు. ఒక దీర్ఘనిట్టూర్పు విడిచి – యేం చెప్పాలో బోధపడడంలేదుమామా అని ఆకాశంవేపు చూస్తూ వెళిపోయేడు ఇంటికి !

picasso_cubism

మళ్లీ యిదిగో పదిపదిహేను రోజుల కిందట ఓ రాత్రి ఫోను చేసేడు – మామా ఊళ్లల్లో  వెలిని దాటి వచ్చేంగానీ మేమిక్కడ వెలిని దాటలేకపోయేం. వెలివాడలోవున్నామని – తమ పనిష్మెంటూ, దాన్ని యెత్తివేయడానికి చేసిన పోరాటం, సహచరుల నిరాశలూ, నిస్తబ్దతలూ… ఎన్నాళ్లీ చీకట్లు మామా అనడిగేడు ! అపుడు, నర్శిం ఆకాశం వేపు చూసేడు !

నర్శింకి అన్నీ కదలాడి -ఆకాశంలో యేమి బోధపడింది నక్షత్రా ? అని కుమిలిపోసాగేడు.

కూలబడిన తల్లి  స్పృహ కోల్పోయింది. నర్శిం ఆందోళనతో ఇంట్లోకెళ్లి మంచినీళ్లు తెచ్చి, ఆమె మొహమ్మీద చల్లేడు. ఇరుగూ పొరుగూ కోసం కేకలు పెట్టేడు. ఇరుగుపొరుగూ చేరేరు. యేవేవో సపర్యలు చేస్తున్నారు. ఆ రోజే సాయాంత్రానికి యూనివర్సిటీకి చేరేరు. నక్షత్ర శవం చుట్టూ పోలీసులు దడిగట్టేరు. విద్యార్ధులెవర్నీ దరిచేరనీయటంలేదు. నర్శింనీ, తల్లినీ రానిచ్చేరు. వారితో యేమీ మాటాడకుండా నక్షత్ర శవాన్ని వేనెక్కించి స్మశానానికి తీసుకువెళ్లేరు. పోలీసులు కాటికాపరులయ్యేరు. కన్నపేగులు కాలుతున్న బాధతో కూలిపోయింది.. ఆ తల్లి ! నర్శిం తీసుకొచ్చేసాడు. గొడవలూ, ఆందోళనలూ… కన్నీళ్లూ, ఎగజిమ్మిన ఆక్రోశాలూ ! తల్లి ఇంటికొచ్చేసింది.

రెండో రోజు… నక్షత్ర తల్లి దగ్గరకు వచ్చేడు. అమ్మా అని పిలిచేడు. ఇటు చూడన్నాడు. తల్లి చూసింది. నక్షత్రమండలానికీ, భూమండలానికీ మధ్య కన్పించేడు. ఎర్రెర్రగా, నీలినీలిగా వున్నాడు. మొహం కాంతివంతంగా వుంది. ఏ కొత్త బతుకునో అందుకోబోతున్న వాడిలా వున్నాడు. నవ్వేడు. ఆ నవ్వే ఆమెకిష్టం. చిన్నప్పటి నుంచీ యెలా వచ్చిందోగానీ వాడికి ఆ నవ్వు – పున్నమిచంద్రుడిలా ముచ్చటేస్తుంది. ఆమె కూడా నవ్వింది. యేడ్వకన్నాడు. నీ దగ్గర నుంచి అమ్మమ్మ దగ్గరకు వచ్చేనంతే. కాదు, కాదు. అమ్మమ్మ దగ్గరకు యింకా చేరలేదు. పదకొండోరోజు మీరేదో క్రతువు చేస్తేగానీ ఆత్మ బయటపడదని బేమ్మర్లంటారుగదా అన్నాడు.

బ్రాహ్మణ్లను అలా బేమ్మలనీ, బాపన్లనీ పల్లెవాళ్ల పలుకు బడిలో పలుకుతాడు నక్షత్ర ! నక్షత్రకు ఓ బ్రాహ్మణ స్నేహితుడున్నాడు. అతణ్ణి మాత్రం – నువ్వు బ్రాహ్మల్లో తప్ప బుట్టేవయ్యా అంటాడు.

” … అతను కూడా యేడుస్తున్నాడమ్మా. యిపుడే అతనికి యేడ్వద్దని చెప్పొచ్చా. మరోజన్మలో నువ్వు మా కులం లోనా, నేను నీ కులంలోనా పుట్టి ఒకరి రుణం మరొకరం తీర్చేసుకుందాంలే అనన్నానమ్మా ” అని చెప్పేడు.

ఆ తల్లికంతా అయోమయంగా వుంది. నక్షత్ర మళ్లీ తల్లితో –

” … ఈ పదకొండు రోజులూ నీతోనే వుంటానమ్మా. పదకొండు జన్మలకు సరిపోయే ఊసులాడుకుందాం, పదకొండుజన్మల అనుభూతిని మూటగట్టుకుందాం… లే.. ” అన్నాడు. లేచింది తల్లి. నాల్రోజులుగా ఊసులే ఊసులు…

ఇందిరమ్మకోలనీ ట్విన్ను ఒక భాగంలో వుంటుందామె. ఇద్దరు కూతుళ్లు, మరో అబ్బాయీ సంతానం. ఉదయం పదిన్నరవేళ. ట్టిన్ను ముందరి గడపలో శీతకాలపు ఎండ పడే చోట కూచుంది. కూతుళ్లూ, కొడుకూ బయటకు వెళిపోయేరు. సెలవులకు ఇంటికొచ్చిన నక్షత్ర రాత్రి బాగా లేటుగా పడుకున్నాడేమో ఎండవేళకి లేచేడు. కళ్లు పులుముకుంటూ గడపలోకి వచ్చేడు. తల్లి ఎండపట్టున దిగాలుగా కూచోడం చూసేడు. ఆమెకు దగ్గరగా వచ్చి కూచుని –

” రాత్రి మంచి కల వచ్చిందమ్మా. అమ్మమ్మ దేవుడిని బతిమాలుకొని కిందకి వచ్చి నన్ను తీసుకెళ్లింది. దేవుడేమో నన్ను చూసి పలకరించేడు. మీ అమ్మమ్మ యెప్పుడూ నీ గురించే మాటాడుతుంటుంది. నీ ధ్యాసే ఆమెకు. నువ్వు వచ్చేయగూడదూ అమ్మమ్మ దగ్గరకూ అనన్నాడు. నేనాయన అడిగినదానికి బదులివ్వకుండా – ఇక్కడేమేమి వున్నాయీ అనడిగేను. దేవుడికి బోధపడలే. అమ్మమ్మే జవాబిచ్చింది. అన్నీ వున్నాయనీ, నక్షత్ర మండలం చూడచక్కగా వుంటాదనీ చెప్పింది. ఒకో నక్షత్రం ఒక దేశంలా వుంటాదట. మన భూమండలంలో వున్నంత మంది కాదుగానీ మోస్తరుగా వుంటారట మొత్తం నక్షత్ర మండలమంతా కలిపితే ! అందరూ బాగుంటారట. ఎవరికీ యే బాధా వుండదట. పనిచేయడం, తినడం, పాటలు పాడుకోవడం, ఆటలాడుకోవడం, నృత్యాలూ – ఒవ్వో అనంది. అందరూ ఉమ్మడిగా వుంటారట. స్వంతమనేదేదీ ఎవరికీ వుండదట, గానీ అందరికీ అన్నీ స్వంతమట…. ” అనన్నాడు. ఆ మాటలు తల్లికి అర్ధంకాలేదు. ప్రశ్నించబోయింది. కానీ నక్షత్ర తన ధోరణిలో తాను –

” … దేవుడు ఒక్కోరోజు ఒక్కో మండలంలో వుంటాడట. అమ్మమ్మ వాళ్ల మండలానికి దేవుడు  వచ్చిన నాడు పర్మిషన్ అడిగిందట, నన్ను తీసుకురాడానికి ! మళ్లీ నేను వెళ్లే రోజుకి దేవుడు వచ్చేడు. మరి ఇక్కడ చదువుకొనే స్కూల్లూ, కాలేజీలూ, యూనివర్సిటీలూ వుంటాయా అనడిగేను. నక్షత్రమండలమ్మీద పరిశోధనకి నాకు అవకాశమిస్తారా – అనడిగేను. దేవుడు యెందుకో నవ్వేడు. మా వీసీ కూడా అలాగే నవ్వుతాడు. పరిశోధనకు వచ్చేం సార్ అని భక్తిగా నమస్కరించి చెపుతామా, యిలగే నవ్వుతాడు. ఆ నవ్వు మా వెన్నుపూసల ఇల్లు కట్టేసుకొని వుండిపోయిందమ్మా.

ఎస్, ఆ రోజు యిలాగే నవ్వి, ఆ తర్వాత ప్రతీవాడూ పరిశోధకుడే. గోంగూర కంటే చవకయిపోయింది పరిశోధనన్నాడు వీ.సీ. అపుడు, గోంగూర కంటే చవకయితే మాలాంటోళ్లెంతమందో పరిశోధకులయిపోయుండాలి కదా ? అన్పించింది. ఆ మాటే అన్నాను వీసీతో. కళ్లెర్రజేసి, వేలు చూపి అక్కడికి ఫో అనన్నాడు. వెళ్లేను. అక్కడ ఒకాయన వున్నాడు. తెల్లగా వున్నాడు. షర్టూ, ఫ్యేంటూ వేసుకున్నాడు గానీ – అవి పంచే, లాల్చీల్లా వున్నాయి. మనూరి బేమ్మడిలా నుదుటన బొట్టూ, మండకి ఎర్రని దారాల కట్టా… ! నా మీదకి చూపు విసిరి, కొద్దిగా యెడంగా జరిగి చేయి చాపాడు. నా సర్టిఫికేట్ల  ఫైలిచ్చాను. చూసేడు. నోటి నిండా కిల్లీ ! సర్టిఫికేట్ లు చూడగానే ఉమ్మొచ్చిందేమో, అవతలకి నడిచి ఉమ్మేడు. చేత్తో నోరు తుడుచుకొని, ఆచేత్తో నా  ఫైలు పట్టుకున్నాడు. కిల్లీ మరక నా ఫైలుకి అంటుకుంది. అదోలా అన్పించింది.. ఆ మరక నాకే అంటినట్టు. ఫరవాలేదు, మరక పోయిందిగా అడ్వర్టయిజ్ మెంటు అప్పుడే గుర్తొచ్చి, నవ్వొచ్చింది. ఆయనకి కోపమొచ్చింది. ఇది, మీ వాడ కాదు. ఎవడు బడితే వాడు, ఎపుడుబడితే అపుడు, ఎలాబడితే అలా నవ్వీడానికి అనన్నాడు. నవ్వడానికి కూడా సమయాలూ, అర్హతలూ వుంటాయని రూల్స్ చూపించేడాయన తన కోపంతో ! అప్పుడు చుట్టూ చూస్తే  నవ్వడం తెలీని జీవుల్లాగ ఆ ప్రాంతంలో చాలామంది కుర్రాళ్లు కన్పించేరు. వెళ్లూ – అని దీర్ఘం తీసి వేలు చూపించేడా పంచెకట్టు ఫేంటాయన. ఎటు వెళ్లాలో తెలీక నిల్చుంటే  ఫైలు విసరబోయేడు, చేను మీద పడే పిట్టల మీదకి రాళ్లు విసిరేట్టు ! నేను ఎగిరిపోయేను, కాదు యెవరో కుర్రాడొచ్చి హాస్టల్ కి తీసుకుపోయేడు….

తల్లి కళ్లల్లో నీళ్లు తిరిగేయి…. కొడుకు కల చెప్తున్నాడా, తన రోజువారీ అనుభవాలు చెప్తున్నాడా ? కల చెప్పరా, నాయనా అనందామనుకుంది. కల ఆమెకు గూడా బాగుంది. దేవుడు, నక్షత్రమండలం, తన తల్లీ… వినడానికి సంతోషంగా వున్నాయి.

అంతలో ఆమెకిదంతా గతంలో నక్షత్ర చెప్పిన కల అనీ గ్యాపకమొచ్చింది. దుఖం పొంగుకు వచ్చింది.

నర్శిం అప్పటికి తేరుకున్నాడు. కాసేపు ఆమెతో యేమేమో మాటాడేడు. సంస్మరణ సభలూ, ధర్నాకార్యక్రమాలూ యేవేవో జరుగబోతున్నాయనీ… ఆమె వీటిల్లో పాల్గొనాలనీ, కొడుకు కోసమే కాదు, అలాంటి మరికొందరు కొడుకుల్లాంటి వాళ్ల బతుకుల కొరకు దుఖాన్ని దిగమింగుకోవాలనీ చెప్పేడు. ఆమె విన్నది. పక్కనే వున్న నక్షత్ర తల్లి మొహంలోకి చూసేడు – యేమనుకుంటున్నాదోనని. ఆమె మొహంలో యే భావమూ కనబడలేదు. ఇపుడే కాదు, యెపుడూ ఆమె మొహంలో యే భావమూ కనబడదు. గుండ్రటి మొహం, విశాలమయిన నుదురు, ఆవుకళ్లల్లా నల్లకళ్లూ… !

అప్పటికామె తెరిపిన పడినట్టుంది. నర్శిం కూడా వెళ్తానని లేచేడు. ప్రక్క టౌనులో అంబేద్కర్ సంఘం వారు సంస్మరణ సభ పెడతారట, రమ్మన్నారు. తయారయి వుండమనీ, అరగంటలో వస్తానని చెప్పి నర్శిం వెళిపోయేడు. ఆమె కూడా లేచింది.

అప్పుడే టీ.వీ. లో నక్షత్రఫోటో, తనగురించిన వార్తలూ వస్తున్నాయి… ఒక నాయకుడు, యేదో సభలో ఉపన్యసిస్తూ… దేశమాత ఒక బిడ్డను కోల్పోయిందనన్నాడు. నక్షత్రకు నవ్వాగలేదు. చప్పట్లు కొడుతూ, గెంతుతూ నవ్వుతూ -అమ్మా, నువ్వు కాదట, దేశమాత ఒక బిడ్డని కోల్పోయిందట ! నువ్వేమో నీ బిడ్డని కోల్పోయేవని యేడుస్తావు. అదేంటమ్మా. తప్పు, తప్పు అనన్నాడు. ఆమె టీ.వీ. వేపు చూసి, ఒక నిట్టూర్పు విడిచి స్నానానికి వెళిపోయింది.

నక్షత్ర కాసేపు తన ఇంట్లో తిరిగేడు. తండ్రి తమను వదిలేసి వెళిపోయిన తర్వాత బతకడానికి తల్లి కూలీనాలీ పనులకు వెళ్లడం, అలసి, సొలసి యింటికి చేరడం… భూమి కంపించినట్టుగా… రాత్రుళ్లు ఒకోసారి తల్లి కుమిలికుమిలి యేడ్వడం. మెలకువ వచ్చేది. తల్లిని కరచుకొని పడుకొనేవాడు. ఇక్కడే, యీ అరుగు మీదే, యీ తుంగచాప మీదనే ! కాసేపు వాలేడు దానిమీద.

ఆ తర్వాత పక్కింటి వేపు చూసేడు. అది జానేసు ఇల్లు. జానేసెపుడూ రాత్రివేళ మంచిపదాలు పాడేవాడు. అది గెడ్డా, యిది గెడ్డా – నడిమిన పడిందిరా నాయుడోరి పడ్డా అనే పాటా ; రాక రాక వచ్చేనమ్మా గోంగూరకీ… గోంగూరకీ… పాటా, యిలాటివే యేవేవో పాటలు ! జానేసు భార్య – తొంగోరాదా, రాత్రేళ యీ పాటలేటి, అని కేకేసేది. ఆ పాటలెందుకు మానేసాడో మానేసి… ఒత్తన్నాడొత్తన్నాడు, ఆ భూములున్న బుగతోడు, సూడు సూడు పోలీసులతోడు తోడు… పాటలకి మారేడు. ఆ పాటలు  పాడుతున్నాడని పోలీసులొచ్చేరు, పట్టుకుపోయేరు. తర్వాత యేమయ్యేడో తెలీదు. జానేసు భార్య నిద్రరాక యిపుడు… నీ దయలేదా యేసా, పాడతోంది.

నక్షత్రకు మళ్లీ యనివర్సిటీ కేంపస్ గుర్తొచ్చింది. నాలుగురోజులుగా ఆత్మ అక్కడా, యిక్కడా తిరుగుతోంది. విశాల భవంతులు, ఇరుకిరుకు గుండెల ఆచార్యులు. ఆచార్యులన్న పదానికి నవ్వుకున్నాడు. ద్రోణాచార్యులవారి వారసత్వమింకా దిగ్విజయంగా కొనసాగుతోంది. హుం…

బొటనవేళిని వెనక్కి మడచి, ఎర్రని గుడ్డ కట్టి… వెలివాడలో తిరుగుతున్నాడు… ధృవ. అతణ్ణి అనుసరించుతూ… అరుంధతి, భాగ్య మరో యిద్దరూ బొటనవేళికి ఎర్రనిగుడ్డ చుట్టుకున్నారు. నక్షత్రకు వాళ్ల వేళ్లను స్పర్శించాలన్పించింది. తన స్మారకస్తూపం ముందర శోకమూర్తులై… వందలాది సహచరులు… జోహార్ నక్షత్ర…. జోహార్ ; మనువాదం నశించాలి… నినాదాలు ! నక్షత్రకు నినాదమివ్వాలన్పించింది. పిడికిలి బిగించబోతే వేళ్లు మడతబడడం లేదు. నోరు పెగలడం లేదు. సహచర సమూహమంతా రంగభూమిలో వీరుల్లా కన్పిస్తుంటే – కళ్లల్లో నీళ్లు తిరిగేయి నక్షత్రకు. బతికుండాల్సిందన్పించింది… నక్షత్రకప్పుడు !

హుం… బతుకూ, చావూ కేవలం నా చేతిలో లేదు… అననుకున్నాడు నక్షత్ర ! చాలా సేపు దుఖించేడు. బతకడానికి యెన్నెన్ని కష్టాలు అనుభవించేను ? నా కంటే నా తల్లి యింకా కష్టాలు అనుభవించింది. ఇన్ని కష్టాల తర్వాత, యింత శ్రమ తర్వాత గూడా భవిష్యత్ చీకటి, చీకటిగా.. !? అమ్మా, నీ గర్భకుహరంలోకి మళ్లీ వెళ్లే అవకాశం వుంటే యెంతబాగుణ్ను ! కాదు, చనిపోతే నక్షత్రమండలం చూడొచ్చు… నక్షత్రా అని ఇందుకేనా అమ్మా నాకు పేరుపెట్టేవు ? నక్షత్ర మనసులో అనేక విషయాలొక్కసారిగా ఆకాశంలో రెక్కలుగొట్టుకు యెగిరే పిట్టల్లా యెగురుతున్నాయి.

రోజూ యెందుకో ఒకందుకు మేమే దోషులుగా వీసీకి, మిగిలిన ఆచార్యులకూ కనబడతాం. రేషన్ కట్, స్కాలర్ షిప్ కట్, క్లాస్ కట్, డిగ్రీ కట్ ! ఒరేయ్, మీ ఫ్యూచర్ కట్ రా… యూనివర్సిటీ గోడల్లో ప్రతిధ్వనిస్తుంటాయి ! ఏలికలారా, మా బతుకుల పాలకులారా… ఎన్నెన్ని ఆయుధాలున్నాయి మీదగ్గర ? మా దగ్గర పిడికిళ్లు మాత్రమే వున్నాయి. అవే మీ కళ్లకు.. ఫిరంగులో, పిడుగులో !

గురుద్రోహులని పూర్వం శిక్షించేవాళ్లు, యిపుడు రాజద్రోహులని శిక్షిస్తున్నారమ్మా – అనన్నాడు తల్లితో ! అప్పుడే ఆమె చీరకట్టుకొని, బయటకు వెళ్లటానికి సిద్ధమై వచ్చింది.

అమ్మా, కొంచెం విచారంగా వున్నట్టు కన్పించమ్మా.. అన్నాడు నక్షత్ర.. ఆశ్చర్యపోయింది తల్లి. నేనలా కన్పించటంలేదా ? నాయినా, విచారం లేని క్షణమేది నా జీవితంలో ? నీకెలా కన్పించానోగానీ, పాడుబడిన ఇల్లులా వుంటావంటారంతా నన్ను ! అనగూడదుగానీ, అందుకనే నా కోసం మగపురుగేనాడూ రాలేదు అనంది. నక్షత్ర నొచ్చుకున్నాడు. అనవసర వ్యాఖ్యతో తల్లిని బాధపెట్టేననుకున్నాడు. నిజమే, అమ్మ.. దుఖపుమూటలా వుంది.

అప్పుడే నర్శిం తిరిగొచ్చేడు – దళితసంఘాలవారు సభ అన్నారుగానీ, మళ్లీ యెందుకో రద్దు చేసుకున్నారు. ప్రెస్ మీట్ మాత్రమే పెడతన్నారట. దానికి మనమెందుకు ? అని ప్రశ్నించేడు నర్శిం. తల్లికేమి చెప్పాలో బోధపడలేదు. నక్షత్రకు ఆ వార్త యేదో సంశయాన్ని కలిగించింది. అంతలోనే.. ఛఛా అనుకున్నాడు. తానెప్పుడూ అన్నింటినీ సంశయించడం వలననే యిలా… అని ఆత్మవిమర్శ చేసుకున్నాడు.

అప్పుడు నక్షత్ర చెంప ఛెళ్లు మన్పించింది… ఆత్మ ! నేనెన్నడూ విమర్శ చేసుకోలేదు. నువ్వెవడివిరా ఆత్మవిమర్శ అనడానికని అడిగింది. నక్షత్ర చెంప తడుముకున్నాడు. ఓహో… నా కిపుడు స్వవిమర్శ చేసుకునే అవకాశంగూడా లేదన్నమాట ! జీవించినపుడు… పరవిమర్శ చేయగూడదు. మరణించేక ఆత్మవిమర్శ చేయగూడదు అననుకున్నాడు మనసులో. ఆత్మ దానికీ ఒప్పుకోలేదు. ఆత్మ విమర్శ యెపుడూ చేసుకోవచ్చు. ఎవరయినా చేసుకోవచ్చు. గానీ నీకు ఆ అవకాశం లేదు. నువ్వు చనిపోవాలనుకున్నపుడు ఆత్మను అడిగేవా ? అడక్కుండా ఉరిబోసుకు చచ్చేవు. దమ్ముంటే నిన్ను యిబ్బంది పెట్టినోడ్ని చంపవొల్సింది. నన్ను చంపావెందుకురా ? ఎవడ్రా యీ చావుకి ఆత్మహత్య అని పేరుపెట్టింది. ఆత్మను హత్య చేసిన హంతకుడివి నువ్వు… ఆత్మ రెచ్చిపోసాగింది. నక్షత్ర మరణించి కూడా దోషిగా కనబడుతున్నందుకు చింతించసాగేడు… అప్పుడే, వీ.సీ. గారి మాటలు గుర్తొచ్చేయి…

” … చదువుకోసం రాలేదండీ. హాస్టల్ భోజనం, స్కాలర్ షిప్, బేఖాతర్ తిరుగులూ… వీటి కోసం వచ్చేరు. వీళ్లింతేనండీ. ఆ కుర్రాళ్లు చూడండి, చక్కగా భరతమాత భజన చేస్తారు. రామాయణం పారాయణం చేస్తారు. గురుపూజలు చేస్తారు. ద్రోణాచార్యుల పీఠానికి మాలలు వేస్తారు. స్వామీజీలని రప్పించి సభలు పెడతారు. ముద్దొస్తారు… ముండాకొడుకులు.. ” అని మురిపెంగా వీసీ యెవరితోనో చెప్తున్నాడు.

ముద్దొచ్చినా ముండ కొడుకులేనా- నీ నోట్లో మూత్రం పొయ్యా… మనసులో అనుకున్నాడు నక్షత్ర.. కాసేపు గదిద్వారం దగ్గర నిల్చున్నాడు. ఆ మధ్య  -దళిత విద్యార్ధులూ, బహుజన విద్యార్ధులూ కలిసి ‘ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ‘ పెట్టుకున్నారు. అసోసియేషన్ వివరాలను రాసిచ్చి -ఇక నుంచీ విద్యార్ధుల సమస్యలేవేనా అసోసియేషన్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పి వద్దామని వెళ్లేరు. రిప్రజెంటేషన్ తీసుకున్నాక వీ.సీ…. ఎదురుగా వున్నాయనతో అవీ మాటలు.

మళ్లీ నిల్చున్న నక్షత్రావాళ్ల వేపు వేళ్లు చూపి, ఎదుటవ్యక్తితో –

” ..వీళ్లో… రాజకీయాలు మాటాడతారు ? రాజ్యాంగమూ, హక్కులూ అంటారండీ ! ఎందుకండీ అవన్నీ ? అసలీ ప్రశ్నలేమిటండీ ఆచార్యుల మీద శిష్యులు ? ఎక్కడేనా వుందా ? వ్రేళడిగితే వ్రేళూ, శిరసడిగితే శిరసూ యిచ్చేయలేదండీ పురాణకాలం శిష్యులు ? పోయే కాలం, పిదపబుద్ధులూ ! ” కులపతి సెలవిచ్చుతున్నారు. ఎదుటివ్యక్తి – కాదు కాదు, పిదపబుద్ధులు కావు, విదేశీబుద్ధులు ! దేశద్రోహబుద్ధులు అని సవరించేడు. నక్షత్రకు యిపుడు తను సాధారణ నేరస్తుడు కాడనీ, దేశద్రోహి నేరస్తుడనీ అర్ధమవుతోంది…..

తల్లి గడపలో ఒక మూలకు చేరబడి కూచుంది. నర్శిం – ప్రెస్ మీట్ కోసం అంత కష్టపడి వెళ్లొద్దులే ! నాకో పని వుంది, చూసుకొని సాయంత్రం వస్తాను. ఒకటి మాత్రం ఖాయం -నక్షత్ర చావుకి కారణమయిన వారిని శిక్షించాకగానీ, నక్షత్ర అస్తికల నిమజ్జనం చేయొద్దని కరాఖండిగా ఒక ప్రకటనలాగా చెప్పి వెళిపోయేడు.

తల్లి- నక్షత్రను వదిలేది లేదు, నా గర్భంలో దాచేసుకుంటానని మనసులో గట్టిగా అనుకున్నది. సరిగ్గా అప్పుడే నక్షత్ర – అమ్మా, నీ ఒడిలో బజ్జుంతా, వొక జోలపాట పాడవా అనడిగేడు. తల్లి ఒడిలో బజ్జున్నాడు. తల్లి జోకొడుతూ – జోముకుందా, జోజోముకుందా… లాలి పరమానంద… లోగొంతుకతో పాడగా, నక్షత్ర ఒడిలోంచి లేచి – ముకుందుడూ లేడు పరమానందుడూ లేడు. మన పాట పాడే తల్లీ అనన్నాడు ! రావనాసెందునాలో యెన్నెలా, రాజా నీకొందనాలో… యెన్నెలా యెత్తుకుంది తల్లి ! నక్షత్రకు మెల్లగా నిద్ర కమ్ముకుంటోంది.

కొంతసేపటికి… వీధిలో ఒక పెద్ద ఊరేగింపు – నీలిసలాం, లాల్ సలాం… నీలాల్ సలాం నినాదాల్తో వస్తోంది ! నర్శిం గొంతునరాలు బిగించి నినదిస్తున్నాడు. తల్లి గభాల్న లేచి వీధిలోకి నడచింది. తమ ఊరి యువకులూ, పొరుగూరి యువకులూ యెందరో పిడికిల్లు బిగించి నినదిస్తున్నారు… పరికించి చూడగా అందరూ నక్షత్ర లాగే కనిపిస్తున్నారు. కళ్లు పులుముకొని మళ్లీ చూసింది… నక్షత్రలే కన్పించేరు. ఆ తల్లికి వాళ్లంతా తన బిడ్డలే అన్పించి కళ్లు తుడుచుకుంది… భ్రమలోంచీ, కలలోంచీ బయటపడి, వాస్తవంలోకి వచ్చి సమూహంలో కలిసింది !

*

మీ మాటలు

  1. D Subrahmanyam says:

    చాలా హ్రిదంతం గా రాసారు అప్పలనాయుడు గారు . చివరలో బాగా చెప్పారు. కొంతసేపటికి…” వీధిలో ఒక పెద్ద ఊరేగింపు – నీలిసలాం, లాల్ సలాం… నీలాల్ సలాం నినాదాల్తో వస్తోంది ! నర్శిం గొంతునరాలు బిగించి నినదిస్తున్నాడు. తల్లి గభాల్న లేచి వీధిలోకి నడచింది. తమ ఊరి యువకులూ, పొరుగూరి యువకులూ యెందరో పిడికిల్లు బిగించి నినదిస్తున్నారు… పరికించి చూడగా అందరూ నక్షత్ర లాగే కనిపిస్తున్నారు. కళ్లు పులుముకొని మళ్లీ చూసింది… నక్షత్రలే కన్పించేరు. ఆ తల్లికి వాళ్లంతా తన బిడ్డలే అన్పించి కళ్లు తుడుచుకుంది… భ్రమలోంచీ, కలలోంచీ బయటపడి, వాస్తవంలోకి వచ్చి సమూహంలో కలిసింది !”

    ఇవ్వాళ ఫెస్బూక్ లో అరుణ గోగులమండ గారు రాస్తూ బాగా చెప్పారు . ఇంతఘోరానికి బాధ్యుడైన ఒక కొడుకు ఒక తల్లి ప్రశాంతంగా ఇంట్లో సేదదీరుతుంటే.ఇంకో తల్లి కొడుకు చంపబడ్డ ఇన్నినెలలతవాతకూడా రోడ్లపై, యూనివర్సిటీగేట్లముందూ ..ధర్నాలకు అలుపెరగకుండా కూర్చుంటుంది.ఆమెకు గుండెనొప్పి వచ్చే అవకాశాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.ఐతేమాత్రం? కులాల ప్రాతిపదికన మాత్రమే న్యాయం జరిగే ఈ దేశంలో, ధర్మం కొన్ని కులాల కాపలా కుక్కగా పడుండే ఈ దేశంలో.. ఒక చెంబు దొంగతనం చేసాడని ఒకజాతివాడ్ని తగలబెడతారు..వేలకోట్ల ప్రజాధనం భోంచేసిన కొండచిలవ విశృంఖల విలాసాల్లో మునిగితేలతాడు..అడిగేవాడేవ్వడైనా ఉంటే..ఉరివేసుకు చస్తాడు.”

  2. Mahamood says:

    ఒక మరణం ఒక ఉద్యమాన్ని ఎలా లేవదీసిందో ఆ ఉద్యమం వెనుక ఎన్ని వేల సంవత్సరాల అణచివేత తరతరాలకి ఎలా పాకుతుందో చరిత్ర వర్తమానానికి మధ్య సమన్వయం సాధించడానికి ఎన్నుకున్న ఆధివాస్తవిక రచనా శిల్పం మీ కథ గొప్పగా ఉంది ఎప్పట్నానే.

  3. ప్రసాదమూర్తి says:

    కథ గొప్పగా వుంది

  4. jagadeesh mallipuram says:

    సార్! కధ బావుంది . కధనమూ బాగుంది. కుల వ్యవస్థ ఎప్పుడు పోతుందో … ఈ కధల అవసరం ఎప్పటికి రాదో ఆ రోజు కోసం ఎదురు చూడాల్సిన సమయం వచ్చింది. ఉద్యమాలు ఇంకా బలపడాల్సిన ఆవశ్యకతని తెల్పిన కధ ఇది. మంచి కధ అందించినందుకు ధన్యవాదాలు .

  5. ఒక సంఘటన మీద కవిత్వం వస్తున్నంత యెక్కువుగా కథలు రావు. దానికి కారణం : కథకి చాలా అన్వేషణ అవసరం. రోహిత్ వేముల నేపథ్యంలోంచి.. గుండెకి అత్యంత దగ్గరిగా వచ్చి, ఆలోచనని కల్గించే కథ రాసారు. నడుస్తున్న చరిత్రని రికార్డ్ చేసారు. కులవ్యవస్థలో అణచబడుతున్న, బాధితులౌతున్న వ్యక్తుల అంతరంగాన్ని అక్షరబద్దం చేసారు. వాస్తవ , కథా వాతావరణంలోకి తీసుకునివెళ్లారు. మీ గొంతు ప్రతిధ్వనిస్తోంది. ఇది చదవడం – మొత్తం చూసినట్టే వుంది. ధన్యవాదాలు.

  6. shanthamani says:

    కథ చాలా బాగుంది.ఇటీవల జరిగిన దుర్ఘటనను ,దాని నేపధ్యాన్నీ చాలా బాగా రాసారు. సాక్షి లో రిసరేక్షన్ కధ ,ఈ కధ ఒకే వస్తువే గానీ రచయితల ద్రుక్పధం వలన తేడా తెలుస్తోంది.రచయిత అప్పలనాయుడు గారిని అభినన్దిస్తూ…
    శాంతా మణి

  7. maheedhara says:

    కధలో ఒక ప్రక్క వ్యంగ్యం ఇంకో ప్రక్క విషాదం ఎంత బాగా నడిపారు కధను…పేరు కూడ అబ్బ ఎంత బాగుంది…కధ వాతావరణానికి అనుకూలంగ యెన్నెలో..ఎన్నేలా …రచయితకు అభినందనలు..

  8. శ్రీనివాసుడు says:

    అట్టాడ అప్పల్నాయుడు గారూ!
    మీరొక ఫ్రీ థింకర్ అని మీ రచనలు చదివిన తరువాత నాకు కలిగిన అభిప్రాయం. ఈ సంఘటన పూర్వాపరాలు, గత పదేళ్ళుగా అక్కడ జరుగుతున్న వ్యవహారాలు, సంఘటనలోని వివిధ పార్శ్వాలు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన పిదప కూడా ఇది రకరకాల భావజాలాలతో కూడిన రాజకీయపు వికృత క్రీడ యొక్క పరాకాష్ఠగా మీరు గ్రహించక పోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ కథలో మీరు దునుమాడిన వైరిపక్షపు కోణాన్ని కూడా మీదైన తటస్థరీతిలో ప్రతిబింబిస్తే కథకు సమగ్రత చేకూరేదని నా భావన.
    **********************
    ముఠాతత్త్వం కేవలం ఆత్మరక్షణకై లేదా ఆత్మగౌరవాన్ని రక్షించుకోడానికే బయలుదేరి, అలాగే కొనసాగితే, లేదా, ఆ ఉద్దేశానికే పరిమితమయితే చరిత్రలో ఇంత హింస వుండేది కాదు.

  9. attada appalnaidu says:

    sreenivaasudu gaaru … saadharanamgaa nenu naa kadhala meeda jarige charchalo paalgonu. kadha matrame charchaku sambandhinchina vivaranalu ivvagaluguthundi,ivvali. anthe..
    ika meeru naa rachanalu chadivi nannu free thinker anukunnananee raasaaru. alage chivarana vyri pakshapu konaanni tatastamga naadayina reethilo raaste baagunnani,samagratha undiunnani raasaaru. kaanee meeru na rachanalu chadivi nenu tatastudinanee,free thinker deeni ardham yemito,mee antharamgamlo gaanee..ani yela anukunnaro teleedu.
    nenu satyaaniki pakshapaathini. prajapakshapaathini…prajalante…srama chesi jeevinche varani naa bhavana adi saareeraka kaavachu,medho srama kavachu..alage stree,dalita,minority praja pakshapathini…marxist,leninist ni, bahusa,,,na konni kadhalu marxist,leninistulanu vimarsa chesayani meeru ilaa bhavinchaaremo?

    Meeru cheppina vyri pakshapu dhorani…tara taraluga gramaallo,nagarallo,universiteelalo saagutunnadi…inka vaatiki sambandhinchina konam yemundi…bhagavan uper hai…nahee chodegee,,,anannade okame,,,adee vyri paksha konam.
    ika chivaralo charitralo himsa gurinchi chepparu…Himsa adhikara vargalu chestaayi,pratihimsa prajalu chestaaru.prati himsanu chusi kadu matadalsindi,himsanu chusi matadali,

  10. attada applnaidu says:

    శ్రీనివాసుడు గారూ …నా కధ మీద మీ అభిప్రాయం రాసినందుకు ధన్యవాదాలు. అలాగే మిగతా మిత్రులకూ క్రుతగ్యతలు వారి స్పందన తెలిపినందుకు.
    ఇక స్రీనివాసుదుగారూ .. నీను సాధారణంగా నా కధల మీద జరిగే చర్చలో పాల్గొను. కధయే చర్చకు సంబంధించిన విషయాలను చెపుతుంది,చెప్పాలి,అంతే. ఈ కధ కూడా మీ ప్రశ్నలు కాదు సూచనలకు జవాబు చెపుతుంది…కధలో ఉన్నావి.
    నేను ఫ్రీ థింకర్ ననీ,తటస్త వాదిననీ ఎలా భావించారో నాకర్ధం కావడం లేదు.నేను ప్రజా పక్షపాతిని.ప్రజంటే…శ్రమ చేసి జీవించే వారనీ నా భావన అది శారీరక శ్రమ గానీ బౌధిక స్రమగానీ. అంతేగాక మహిళా,దళిత,మైనారిటీ వర్గాల పక్షపాతిని.ఇవి అణచబడ్డ వర్గాలు..
    అలాగే నేను మార్క్షిస్త్ ,లెనినిస్ట్ ని .ఆధిపత్య వర్గాల హింసకు ప్రజలు ప్రతి హింస చేస్తారు…ఇది నా అవగాహనా. చివర్లో మీరు రాసిన హింస గురిచే నా సమాధానమిది.
    ఇంకా కధలో వైరి పక్ష కోణం కూడా రాస్తే బాగున్నని మీరు సూచించారు…రాసాను కదండీ…భగవాన్ నహీ చోదేఘే..అన్న మంత్రిని, ముద్దొస్తారు ముండాకొడుకులు అన్న వీసీ పాత్ర గానీ వైరి పక్షాలే గదండీ…ఆత్మా గౌరవం రక్షించు కోవడానికే పరిమితమయితే చరిత్రలో ఇంత హింస జరిగేది కాదని రాసారు. అసలు రక్షించు కోవాల్సి రావడమనగా … ఆత్మ గౌరవాన్ని ఎవరో దెబ్బ తీస్తున్నట్టు కదా. హింస అది కదా….మీరు ప్రతి హింసని చూసి వ్యతిరేకించా వద్దు,,,

  11. శ్రీనివాసుడు says:

    అప్పల్నాయుడు గారూ!
    ‘‘నీను సాధారణంగా నా కధల మీద జరిగే చర్చలో పాల్గొను. కధయే చర్చకు సంబంధించిన విషయాలను చెపుతుంది,చెప్పాలి,అంతే’’
    ముందుగా, మీకున్న నియమాన్ని ప్రక్కకుబెట్టి స్పందించినందుకు ధన్యవాదాలు!
    ****************
    కార్యకారణ గొలుసులో మీరొక సంఘటన దగ్గర, నేనొక సంఘటన దగ్గర నిలబడి హింస, ప్రతిహింసల గురించి మాట్లాడుతున్నామని నాకు అనిపిస్తోంది. ఇందులో ఏది మొదలు, ఏది చివర అనేది తెగదు. అయితే, ఈ హింస, ప్రతిహింసల నిరంతర శృంఖలలతో సాధించేదానిని సంభాషణల ద్వారా సాధించడం వివేకవంతమయిన పని అని నా భావన. ఈ సంఘటనకి మాత్రమే మనం పరిమితమైతే, దానిని శాశ్వత పరిష్కారించడానికి ఇరు వైరి పక్షాల మధ్య సంభాషణలని ప్రారంభింపజేయడానికి సమాజంలోని మీలాంటి విజ్ఞులంతా ఉద్యుక్తులై ఒక ప్రయత్నాన్ని చేసేందుకు ఫ్రీథింకర్ గా, తటస్థంగా వుంటే బాగుంటుందేమోనన్న ఉద్దేశంతో మిమ్మల్ని నేను అలా సంబోధించడం జరిగింది.
    మీలాంటి విజ్ఞులంతా చొరవదీసుకుని, ఆ విశ్వవిద్యాలయంలోని తాత్త్విక భావజాలాలను, పక్షపాతాలను, రాజకీయ ప్రయోజనాలను కొద్దిసేపయినా ప్రక్కకు బెట్టి సంభాషణలు ప్రారంభింపజేసే వాతావరణాన్ని కల్పిస్తే భవిష్యత్తులో మరిన్ని దుస్సంఘటనలు జరగవేమోనన్న ఆశ.
    నాకయితే అదొక్కటే ఏకైక పరిష్కారంగా అనిపిస్తోంది.

  12. p v vijay kumar says:

    మొదటగా this is not a fight between two equal forces అటో ఇటో తేల్చుకుందాం అనే కొట్లాటలో తటస్థత అనే స్థానం ఉంటుంది.- ప్యూను నుండి వీ సీ నుండి మినిస్టర్ నుండి పీ ఎం వరకు కుమ్మక్కు అయిన గ్రూపుతో కొట్లాదుతున్నప్పుదు తటస్థత ఏది ? సంభాషణ ప్రారంభించాల్సింది ఎవరు ? …వీ సీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా , ఆరోపణలు ఎదుర్కుంటున్న విద్యార్థుల వాదన వినకుండా (this not only against process but against UGC Act ) ప్రవర్తిస్తే అందుకు అందరూ తలూపితే ..సంభాషణ ఎట్లా మొదలుతుంది ? ఇక్కడ ఇద్దరిదీ తప్పుంది సర్ది చెబ్దామనే పంచాయితీ కాదు కావాల్సింది… నిర్భయంగా ఆత్మ వంచన లేకుందా న్యాయం వేపు నిలబడి పోట్లాడ్డం. U need to gather more facts and need to serially organise ur thoughts. Probably , u must read more on what are actual socio -political conditions in a University

  13. attada appalnaidu says:

    sreenivaasudu గారు …సంతోషం .మీ సూచన బాగుంది.కానీ ఇవి అమలు కాని ఆదర్శాలు. సంభాషణల ద్వారానే శాంతి కుదిరితే ప్రపంచం ఎంతో బాగుణ్ణు. ఆధిపత్యం లో ఉన్న వాళ్ళు కుదరనివ్వరు.చరిత్ర చెప్పిన విషయం ఇది.హెసీయూ లో మాత్రమే కాదు ప్రపంచం అంతటా విభిన్న భావాల gharshaNa మాత్రమె కాదు వర్గాలుగా చీలిన సమూహాల మధ్య ఘర్షణలివి …
    నా కదా మిమ్మల్ని శాంతి గురించి ఆలోచింప చేసినందుకు సంతోషం. మీరు కూడ ఆలోచించండి..
    ధన్యవాదాలు…

  14. శ్రీనివాసుడు says:

    అప్పల్నాయుడు గారూ!
    అన్ని రకాల ఇజాలూ ఆదర్శాలేనేమోనని నా అనుమానం. ఇజాలు ఆదర్శాలుగా బయలుదేరి జీవితం యొక్క ప్రవాహతత్త్వాన్ని ఘనీభవింపజేస్తున్నాయేమో?
    మీ కథ నన్ను శాంతి గురించి ఆలోచింపజేయడానికి కారణమేమంటే,
    Hatred + Idealism = Negation అని ఎక్కడో ఒక నకారాత్మకమైన కోణాన్ని గురించి చదివేను.
    కానీ, అభావం ప్రతి కీలక మలుపు దగ్గరా అభావం చెందుతుందని గతి తర్కం. కానీ, అలా అభావం చెందేటప్పుడు తనలోని సకారాత్మక అంశాలను నిలబెట్టుకునే అభావం చెందుతుంది. అది లేకుండా కేవలం ద్వేషాన్ని ద్వేషంతోనే జయించాలి అని మీ కథ చెబుతుందేమోనని, దానికి విరుద్ధమయిన శాంతిని గురించి మెదిలింది.

  15. భాస్కరం కల్లూరి says:

    అప్పల్నాయుడిగారి కథ మీద జరుగుతున్న ఈ చర్చపై మీ అభిప్రాయం ఏమిటని శ్రీనివాసుడుగారు నా బ్లాగుద్వారా అడిగారు. ఇందులో చర్చకు వచ్చిన అంశాలపై సారంగలోనే నేను రాసిన వ్యాసాలలో, వ్యాఖ్యలలో నా అభిప్రాయాలు రాశాను కనుక కొత్తగా రాయవలసిన అవసరం లేదని మొదట అనుకున్నాను. కానీ శ్రీనివాసుడుగారు అడిగిన మీదట, ఈ చర్చ జరుగుతున్న సరళిని గమనించిన మీదట నా అభిప్రాయాలపై మరికొంత స్పష్టత ఇవ్వాలేమో అనిపించింది.
    1. అప్పల్నాయుడుగారు ఒక సృజనాత్మక రచయితగా తన ప్రాపంచికదృక్పథాన్ని అనుసరించి పీడితులు, బాధితుల పక్షాన ఈ కథ రాశారు. ఆవిధంగా ఆయనతో నాకు సంపూర్ణ ఏకీభావం ఉంది. అయితే, జరుగుతున్న సరళిని బట్టి, ఈ చర్చకు ఈ కథ సరైన వేదిక కాదని నాకు మొదటగా కలిగిన అభిప్రాయం. ఎలాగంటే…
    2. శ్రీనివాసుడుగారు ముందునుంచీ సంభాషణ/శాంతి అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. దానినే మరోసారి నొక్కి చెప్పడానికి ఈ కథను వేదిక చేసుకున్నారు. అప్పల్నాయుడిగారిని ఫ్రీ థింకర్ గానూ, తటస్థంగా ఉండి హెచ్ సీ యూ లో నేడు నెలకొన్న అశాంతియుత వాతావరణాన్ని చక్కదిద్దవలసిన బాధ్యత కలిగిన విజ్ఞునిగానూ భావించారు. నన్నూ అలాగే కోరారు. ఆయన ఉద్దేశాన్ని, ఆవేదనను నేను తప్పు పట్టను. కానీ ఆయన భావించినట్టు అప్పల్నాయుడుగారు ఫ్రీ థింకర్(శ్రీనివాసుడు గారు ఊహించిన అర్థంలో)కానీ, తటస్థులు కానీ కాదు. నిర్దిష్టమైన ప్రాపంచికదృక్పథం, నిర్దిష్టమైన పాక్షికత ఉన్న కథకుడు. శ్రీనివాసుడుగారు ఆ తేడాను గమనించుకోకపోవడం వల్లనే చర్చ గాడి తప్పిందనీ, ఈ కథ ఈ చర్చకు తగని వేదికగా మారిందనీ నా ఉద్దేశం.
    3. శ్రీనివాసుడిగారి స్పందనను పురస్కరించుకుని అప్పల్నాయుడుగారు తన ప్రాపంచిక దృక్పథం గురించి సముచితమైన వివరణ ఇచ్చారు. అయితే, చివరిలో “మీ సూచన బాగుంది.కానీ ఇవి అమలు కాని ఆదర్శాలు. సంభాషణల ద్వారానే శాంతి కుదిరితే ప్రపంచం ఎంతో బాగుణ్ణు. ఆధిపత్యం లో ఉన్న వాళ్ళు కుదరనివ్వరు.చరిత్ర చెప్పిన విషయం ఇది” అన్నారు. పి.వి.విజయకుమార్ గారు స్పందిస్తూ, “మొదటగా this is not a fight between two equal forces . అటో ఇటో తేల్చుకుందాం అనే కొట్లాటలో తటస్థత అనే స్థానం ఉంటుంది. ప్యూను నుండి వీ సీ నుండి మినిస్టర్ నుండి పీ ఎం వరకు కుమ్మక్కు అయిన గ్రూపుతో కొట్లాదుతున్నప్పుదు తటస్థత ఏది ? సంభాషణ ప్రారంభించాల్సింది ఎవరు ? …వీ సీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా , ఆరోపణలు ఎదుర్కుంటున్న విద్యార్థుల వాదన వినకుండా (this not only against process but against UGC Act ) ప్రవర్తిస్తే అందుకు అందరూ తలూపితే ..సంభాషణ ఎట్లా మొదలవుతుంది ? ఇక్కడ ఇద్దరిదీ తప్పుంది సర్ది చెబ్దామనే పంచాయితీ కాదు కావాల్సింది… నిర్భయంగా ఆత్మ వంచన లేకుందా న్యాయం వేపు నిలబడి పోట్లాడ్డం.” అన్నారు. అంటే, శ్రీనివాసుడుగారు సంభాషణ/శాంతిని నొక్కి చెబుతుంటే, అప్పల్నాయుడుగారు, విజయకుమార్ గారు యుద్ధం/ఘర్షణలను నొక్కి చెబుతున్నారు.
    4. నేను యుద్ధాన్ని, సంభాషణనూ విడివిడిగా కాక, కలిపే చూస్తాను. అందుకే సారంగలోనే రాసిన రెండు వ్యాసాలలో(1. రోహిత్ ఆత్మహత్య: ఒక పాత /కొత్త సందర్భం 2. ఈ ఆర్ట్ ఆఫ్ డయింగ్) జరుగుతున్నది యుద్ధమని స్పష్టంగా చెప్పాను. ఒక వ్యాసంలో (సంభాషణ అవసరాన్ని గుర్తిద్దామా?) సంభాషణ అవసరాన్ని చెప్పాను. నా ఉద్దేశంలో యుద్ధమూ, సంభాషణా అన్నవి ఒక నిరంతర క్రమం. పరస్పర ఆధారితాలు. యుద్ధానికి ముందు, మధ్యలో, తర్వాతా సంభాషణ ఉంటూనే ఉంటుంది. ఏ ప్రసిద్ధ యుద్ధాన్ని తీసుకున్నా అలాగే జరిగింది. మహాభారతాన్నే తీసుకుంటే, సంభాషణ వల్ల ఉపయోగం లేదని అంటూనే, “అయినను పోయి రావలె హస్తినకు” అని కృష్ణుడు అంటాడు. యుద్ధ మధ్యంలోనూ సంభాషణ అవసరాన్ని పలువురు నొక్కి చెబుతారు. రామరావణ యుద్ధానికి ముందూ, మధ్యలోనూ సంభాషణ ఉంది. ట్రోజన్ యుద్ధంలోనూ ఉంది. యుద్ధంలో, సంభాషణలో సమానులు, అసమానులు అన్న తేడా రాదు. బలాబలాలలో కురుపాండవులు సమానులు కారు. యుద్ధాలు, సంభాషణలు అన్నీ సమానుల మధ్యే జరగలేదు. సమానత్వాన్ని నిర్ధారించే కొలమానాలలోనూ తేడా ఉంటుంది. ఒక పక్షంలో ధనబలం, కండ బలం ఎక్కువ ఉండచ్చు. ఇంకో పక్షంలో ధర్మబలం, నైతికబలం ఎక్కువ ఉండచ్చు. ఒక్కోసారి ధర్మబలం, నైతికబలమే విజయం సాధించవచ్చు. కనుక ‘అసమానుల మధ్య యుద్ధం’ అన్న కారణంతో సంభాషణ అవసరాన్ని నిరాకరించలేము. యుద్ధ, సంభాషణల అన్యోన్య సంబంధాన్ని గుర్తించినప్పుడు పూర్తిగా యుద్ధాన్ని వ్యతిరేకించడమూ, లేదా పూర్తిగా సంభాషణను వ్యతిరేకించడమూ రెండూ సరికావు.
    5. వర్తమానంలో చూసినా వైరిపక్షాల మధ్య యుద్ధం/ సంభాషణ రెండూ జరుగుతూనే ఉన్నాయి. సంభాషణకు వేదికను, వెసులుబాటును కల్పిస్తున్న ప్రజాస్వామ్యాన్ని(అది ఎంత అసమగ్రమూ, ఎంత బలహీనమూ అయినాసరే) మనం మరచిపోకూడదు. రోహిత్ విషాదఘటనలో కేంద్రప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టింది ప్రజాస్వామికవాదులు గొంతెత్తి సంభాషించడమే. ఈ విషయాన్ని పైన పేర్కొన్న నా మొదటి వ్యాసంలో చర్చించాను. అయితే, అధికారబలం, అంగబలం, కండబలం ఉన్న శక్తులు ప్రజాస్వామ్య రీతిరివాజుల లక్ష్మణ రేఖను ఎప్పుడైతే దాటతాయో అప్పుడు ఇక జరిగేది యుద్ధమే. ఆ విషయాన్ని కూడా నా వ్యాసంలో స్పష్టం చేశాను. హెచ్.సీ యూలో జరిగింది అదే. కంచే చేను మేసినట్టుగా ప్రజాస్వామ్య, రాజ్యాంగ విధివిధానాలను అధికారశక్తులే ఉల్లంఘించినప్పుడు, అధికారబలం లేని ప్రజలకు మిగిలేది ఇక పోరాటమే. ఆ శక్తులను ఎదురొడ్డి నిర్వీర్యం చేసి దేశంలో శాంతి సామరస్యాల పరిరక్షణ ద్వారా సొంత అస్తిత్వాన్ని కాపాడుకోవడం అనే ఉమ్మడి ప్రయోజనం కలిగిన ప్రజల మధ్య జరగవలసింది –సంభాషణ.
    6. హెచ్ సీ యూ విషయానికి మళ్ళీ వస్తే, అక్కడ విభిన్న భావజాలాలకు ప్రాతినిథ్యం వహించే విద్యార్థి సంఘాలు ముందునుంచీ ఉన్నాయి. అది ప్రజాస్వామ్య ఇచ్చిన అవకాశం. వాటి మధ్య ఘర్షణలూ, అవి ఒక్కోసారి భౌతిక ఘర్షణలుగా మారడమూ ముందు నుంచీ ఉంది. వాటికి యూనివర్సిటీ నాలుగు గోడల మధ్య కళ్ళెం వేసి, పరిష్కరించే అంతర్గత వ్యవస్థా, వెసులుబాటూ ఉంటూనే ఉన్నాయి. కానీ రోహిత్ విషాద మరణానికి దారితీయించిన నేపథ్యం దానికి పూర్తి భిన్నం. ప్రభుత్వం నేరుగా విద్యార్థి సంఘాలలో, పాలకవర్గవ్యవహారాలలో జోక్యం చేసుకుని ఒక పక్షం వహించిన ఫలితం అది. ఆ యూనివర్సిటీలో శాంతి నెలకొనాలంటే, ప్రభుత్వం వెనక్కి తగ్గి వెనకటి తటస్థ పాత్రకు మళ్లడమే మార్గం. ఆ దిశగా ఒత్తిడి తేవడమే ప్రజాస్వామ్యవాదుల కర్తవ్యం.

  16. శ్రీనివాసుడు says:

    చర్చగాడి తప్పడానికి నేనే కారణమని నా పొరపాటును ఎత్తిచూపినందుకు నెనర్లు భాస్కర్ గారూ!
    అత్యుత్సాహం వలన ఆ తప్పు జరిగినందుకు నా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ చర్చకు ఈ కథను పొరపాటు వేదికగా మార్చినందుకు మన్నించండి.
    నేను సంభాషణ/శాంతిని నేను ఎత్తి చూపింది యుద్ధం/ఘర్షణలను పూర్తిగా వ్యతిరేకిస్తూ కాదు.
    సంభాషణలు జరిపించే ప్రయత్నాన్ని విజ్ఞులైన పౌరసమాజం ద్వారా ముందుకు తీసుకువెళితే ఈ ప్రకరణంలో సందర్భోచితంగా వుంటుందని భావించడంవల్లనే అలా మాట్లాడేను.
    కారణాలేవైనా, అందరూ పూర్తిగా ‘‘ఘర్షణ’’ వైపునుండే మాట్లాడడం మూలాన నేను ‘‘సంభాషణ’’ వైపునుండి మాట్లాడవలసివచ్చింది.
    అంతే తప్ప, ‘‘సహనం నా కవచం, శాంతం నా శస్త్రం’’ అనే వల్లమాలిన సౌజన్యమేమీ నాకు లేదు.
    యుద్ధం/ ఘర్షణలు చేయాల్సిన చోట దానికీ వెనుకాడేదీ లేదు.

    • భాస్కరం కల్లూరి says:

      మన్నించండి అనడం చాలా పెద్ద మాట శ్రీనివాసుడుగారూ…ఆ అవసరం లేదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇందులోనూ నేను గుర్తించని పొరపాట్లు ఉండచ్చు. ఈరోజున అవసరమైన ఒక ముఖ్యమైన చర్చకు దోహదం చేస్తున్నందుకు, నా అభిప్రాయాలపై మరోసారి స్పష్టత నిచ్చే అవకాశం ఇచ్చినందుకు మీకే నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి.

  17. attada appalnaidu says:

    bhaskaram గారికి ,శ్రీనివాసుడు గారికి నమస్తే…నేను ఆలస్యంగా మీ చర్చ చూసాను.భాస్కరం గారి అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. శ్రీనివాసుడు గారికి రాసిన నా జవాబు లో అసలే సంభాషణ వద్దు అని నా అభిప్రాయం కాదు…ఫలితం ఉండదనే . బహుశా హెచ్ సీ యూ లో కూడా సంభాషణ జరిగే ఉంటుంది.భాస్కరం గారు ఆ విషయం కూడా తెలిపారు. ఆధిపత్యం లో ఉన్నవారు సంభాషణ తో దారికి రారు…శ్రీకృష్ణ రాయభారం ఎరుక జేసేది అదే కదా…
    శాంతి కోరుకునే వాళ్ళల్లో నేనూ ఒకన్ని…కానీ అది ఎలా అన్న దగ్గరే నా విభేదం..
    మంచి చర్చ…అన్దులోనా భాస్కరం గారు వివరణ ఇవ్వడమూ నాకెంతో సంతోషం గా ఉంది…

  18. ఎ కె ప్రభాకర్ says:

    చర్చని ఆలస్యంగా చూసా. సాధారణంగా రణానికి ముందు గానీ మధ్య గానీ బలహీనులే సంభాషణకు పూనుకొంటారు. కానీ బలవంతులు బల గర్వంతో ఆధిపత్య అహంకారంతో ఎదిరిని అణచి వేయగలనే మదంతో తిరస్కరిస్తారు. ( ” ఏలికలారా, మా బతుకుల పాలకులారా… ఎన్నెన్ని ఆయుధాలున్నాయి మీదగ్గర ? మా దగ్గర పిడికిళ్లు మాత్రమే వున్నాయి. అవే మీ కళ్లకు.. ఫిరంగులో, పిడుగులో ! ” )చరిత్ర పొడవునా దీనికి సాక్ష్యాలనేకం. UoH లోనే కాదు దేశమంతటా అదే జరుగుతోంది. వెతలూ అణచివేతలూ ఆదిపత్యాలూ లేని అంతిమ శాంతి కోసం ఇక యుద్ధం అనివార్యమైనప్పుడు యుద్ధమే చేద్దాం. శాశ్వత శాంతి లభించిక పోయినా కనీసం మరో యుద్ధం వరకైనా హింసకి విరామం దొరుకుతుంది.

  19. maheedhara says:

    “పూర్వమ్ గురుద్రోహులని శిక్షించే వారమ్మా,ఇపుడు రాజద్రోహులని శిక్షిస్తున్నారమ్మా..” ఎంత గుండెల్లో ఆవేదనో …! శాంతి ఈ గుండెలకు కావాలి…
    “వీళ్ళు ..చదువు కోసం రాలేదండీ ,హాస్టల్ తిళ్ళు,బే ఖాతర్ తిరుగులు..వీటికోసం వచ్చారు .ఆ కుర్రాళ్ళు చూడన్ది…చక్కగా భారతమాత భజన చేస్తారు,స్వామీజీలను పిలిచి ఉపన్యాసాలిప్పిస్తారు…ముద్దొస్తారు ముండాకొడుకులు..”.
    ఇలాంటి వీసీలలో మార్పు రావాలి…స్రీనివాసుడుగారూ..ఏమంటారు?

    • శ్రీనివాసుడు says:

      పేదవాళ్ళందరూ నీతిమంతులు, ధనికులందరూ క్రూరులు. వి.సి.లు మెచ్చుకున్నవాళ్ళు మినహా మిగతావారందరూ పరిశుద్ధాత్మలు.
      అగ్రకులాల విద్యార్థులందరూ సైతానులు. అల్పసంఖ్యాకవర్గాలు, వెనుకబడిన విద్యార్థులందరూ దేవదూతలు.
      చరిత్రలో పాలకవర్గాలెప్పుడూ పీడకులే. పీడితులే పాలకులైనప్పుడు వారందరూ దేవతలే.
      దీనికి మీరేమంటారు మహీధర గారూ!

  20. //శ్రీ వాసుడుగారూ..ఏమంటారు?// ఏమంటారు? ఇలాగే కొనసాగాలని అంటారు

    • శ్రీనివాసుడు says:

      ఫి = P H I = Poison Highdose Injector
      ఇంకా ఎన్ని పడగలు, ఎంత విషం మిగిలేయి ఫి గారూ!
      విషయం లేకపోయినా విషం మాత్రం తట్టెడు.

  21. maheedhara says:

    శ్రీనివాసుడుగారూ … నేను ఎవరికి శాంతి కావాలి,ఎవరు మారాలి అన్నదానినే మిమ్మల్ని యేమంటారన్నాను.ఆమాత్రానికే మీరు అసహనానికి గురయి…పేదవాళ్ళమ్దరూ నీతిమన్థులూ,ధనికులు క్రూరులు అన్నట్టు ఫ్హీల్ అయి ,ఏమేమో రాసేరు…మీకు అగ్రకులం పట్ల ప్రేమ,దళితుల పట్ల ఆగ్రహం ఉన్నట్టుంది . ఈ కధను రచయిత అగ్రవర్ణాన్ని తప్పు పట్టకుండా,దలితులదే తప్పన్నట్టు రాయాల్సింది అని మీకుంది…అప్పలనాయుడు గారికి మీ సూచన దీనినే తెలుపుతుంది. ఆయనేమో పాపం సున్నితంగా తన పక్ష పాతాన్ని చెప్పినా … మీకు చాల లేదు. వాస్తవాన్ని ఎవరెంత మసిబూసినా మారేడు కాయ చేయలేరు…

    • శ్రీనివాసుడు says:

      మహీధర గారూ!
      ఈ వాదనలోకి అనవసరంగా అప్పల్నాయుడు గారిని లాగకండి. ఆయన ఎలా వ్రాయాలో, ఏమి వ్రాయాలో నిర్దేశించడానికి మీరూ, నేనూ అర్హులం కాము, మనకి ఆ హక్కు లేదు. ఆయనకి నేను నా అభిప్రాయం చెప్పినప్పుడు చాలా స్పష్టంగా చెప్పేను, ’’కార్యాకారణాల గొలుసులో మీరొక చోట నేనొక చోట నిలబడినప్పుడు ఎవరికి శాంతికావాలి, ఎవరు మారాలి? అన్నది తేలే విషయం కాదు‘‘, అని.
      నేను వ్రాసిన వ్యాఖ్యలలో అందరికీ శాంతి కావాలి అన్నానుగానీ ఒక వర్గానికే శాంతి కావాలి అనలేదు.
      శాంతికోసం ప్రయత్నం చేయడానికి పౌరసమాజం కూడా చొరవ దీసుకుని ప్రతిష్ఠంభనని తొలగించి, సంభాషణలను ప్రారంభిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని వ్రాస్తే, ‘‘వి.సి. గొప్పవాడు, అతడిని మీరు సమర్థిస్తున్నారా?’’ అని అడగడంలో కుట్ర లేదా?
      ‘‘సంభాషణలు జరపాలి’’ అని చెబితే వి.సి.ని సమర్ధిస్తున్నట్లా? ఈ క్షణాన వి.సి.ని పీకిపారేస్తే హెచ్ సి యూ నందనవనం, శాంతిధామం అవుతుందా?
      సంభాషణలు అనేవి సమస్య మూలాల్లోకి వెళ్ళడానికి దోహదం చేస్తాయి. అప్పుడే పరిష్కారం దొరుకుతుంది. సంభాషణలు అంటే పంచాయితీ కాదు, నిరర్థక చర్చా కాదు.
      ’’మీరు అసహనానికి గురయి…పేదవాళ్ళమ్దరూ నీతిమన్థులూ,ధనికులు క్రూరులు అన్నట్టు ఫ్హీల్ అయి ,ఏమేమో రాసేరు…మీకు అగ్రకులం పట్ల ప్రేమ,దళితుల పట్ల ఆగ్రహం ఉన్నట్టుంది .’’
      కులాన్నిబట్టి, లేకపోతే వర్గాన్ని బట్టి మంచి, చెడ్డా వుంటాయనే సంకుచిత రాగద్వేషాలు వున్నవారే తమ స్థాయిలో ఆలోచిస్తారు. అదే నేను వ్రాసింది.
      ‘‘సంభాషణలు’’ అనగానే అంత అసహనానికి లోనయి, ‘‘వి.సి.ని గురించి నీ అభిప్రాయమేమిటి? అసలు నీవు ఎటువైపు వున్నావు? ఉంటే మా వైపు వుండు, లేకపోతే నువ్వు నా శత్రుసమూహంలో వున్నట్లే‘‘, అంటే అర్థమేమిటి?
      అంటే, సమాజంలో మేమిద్దరమే వుండాలి, ఇంకో ఆలోచన వుండకూడదనే అసహనమా?
      నేను చెప్పిన సంభాషణలు పరిష్కారం కాదనుకుంటే అదెలాగ కాదో మిగతావారిలాగా తార్కికంగా చెప్పడానికి ప్రయత్నించండి.
      నన్ను అడిగేముందు, ‘‘అసలు ఆ సమస్యకి శాశ్వతపరిష్కారం ఏమిటి?’’ అనేది మీరు చెప్పాలి. నేను చెప్పిన ’’సంభాషణలు‘‘ అనే భావన తప్పు అయితే అదెలాగో చెప్పాలి. విషయాన్ని ప్రక్కదారిపట్టించడం తప్పు.
      ఇకనైనా విషయానికి రండి.
      మనలోవున్న అసహనమే ఎదుటివారిలో ప్రతిఫలిస్తుంది. మిగతావారు మీలా మాట్లాడలేదే.

  22. maheedhara says:

    shreenivaasuDugaaru meeru నా పోస్టులో లేని మాటలు రాసి ఆగ్రహిస్తున్నారు…మీ ప్రశ్నలకు కల్లూరి భాస్కరం గారు సమాధానాలు చెప్పారనే నా భావన…సారీ మీకు కోపం తెప్పించితే..

    • శ్రీనివాసుడు says:

      మహీధర గారూ!
      మీరు కూడా నా పోస్టులో లేని భావాలను నాకు అంటగడుతున్నారు. నా పోస్టులు మళ్ళీ ఒకసారి చదువుకోండి. అప్పల్నాయుడుగారికీ, లేక, కల్లూరి భాస్కరం గారికీ కనబడని పక్షపాతవైఖరి మీకు కనపడితేనే చిత్రంగా వుంది.
      పోనీ, ‘‘ఎంతో హుందాగా నా తప్పులు వారు ఎత్తి చూపలేదు, నా అజ్ఞానాన్ని క్షమించారు’’, అని మీరు భావిస్తే నా పోస్టుల చదివి ఆ తప్పులేవో మీరు చెప్పవచ్చు. నన్ను నేను దిద్దుకోడానికి ప్రయత్నిస్తాను.
      కల్లూరి భాస్కరంగారు ఇది కూడా అన్నారు, ’’ఇందులోనూ నేను గుర్తించని పొరపాట్లు ఉండచ్చు. ఈరోజున అవసరమైన ఒక ముఖ్యమైన చర్చకు దోహదం చేస్తున్నందుకు, నా అభిప్రాయాలపై మరోసారి స్పష్టత నిచ్చే అవకాశం ఇచ్చినందుకు మీకే నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి.‘‘ అని వారు సమాధానం చెప్పిన తరువాత నేనేమీ మాట్లాడలేదే.
      నా ప్రశ్నలు, సంభాషణ జరిగితే పరిష్కారం లభిస్తుందన్న నా వ్యాఖ్యలు ఒక మంచి చర్చకు అవకాశమిచ్చాయని వారిద్దరూ భావించడం కూడా మీ దృష్టిలో పొరపాటా?
      పొరపాటయితే చెప్పండి, సారంగ అడ్మిన్ వారిని నా వ్యాఖ్యలను తొలగించమని వేడుకుంటాను.
      ఎదుటివారికి ముద్రలు వేస్తే సంభాషణలు కొనసాగవు.
      మనం నిండా మునిగిన, మనలో జీర్ణించుకుపోయిన భావజాలాలను కొద్దిసేపయినా ప్రక్కనబెట్టి ఎదుటివారు చెప్పేది వినడానికి ప్రయత్నిస్తేనే సంభాషణలు సాగేది.

  23. కె.కె. రామయ్య says:

    “రోహిత్ విషాదఘటనలో కేంద్రప్రభుత్వాన్నిఆత్మరక్షణలోకి నెట్టింది ప్రజాస్వామికవాదులు గొంతెత్తి సంభాషించడమే … విధివిధానాలను అధికారశక్తులే ఉల్లంఘించినప్పుడు, అధికారబలం లేని ప్రజలకు మిగిలేది పోరాటమే.” అని వివరణ ఇచ్చిన కల్లూరి భాస్కరం గారికి నెనర్లు.

Leave a Reply to D Subrahmanyam Cancel reply

*