ఈ వాననిలా కురవనీ..

 

              – రవి బడుగు

                                            ~

టప్…..

టప్..  టప్..

రాత్రంతా కురిసిన వాన వెలిసింది. దాని జ్ఞాపకాలింకా ఇంటి పైనుంచి రాలుతున్నాయి. టప్..

బాల్కనీ నిండా నీళ్లు. తలుపు తెరిచే ఉండడంతో గదిలోపల సగందాకా తడిచి ఉంది. తడిచిన చాపమీదే మునగదీసుకుని పడుకుని ఉన్నాడు భాను. ఒకటే వాన వాసన.

తలుపు చప్పుడైంది. ఒకట్రెండు సార్లు చప్పుడయ్యాక ఆగిపోయింది. భాను పక్కనున్న ఫోన్ మోగడంతో.. వెంటనే లేచి ముందుగదిలోకెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా విహారి. మళ్లీ వచ్చి పడుకున్నాడు.

‘లంజా కొడుకు.. రాత్రి ఆరు ప్యాక్లు కొట్టించాడు డార్లింగ్. అరగంట కూడా పడుకోలేదు.’

విహారి మాట్లాడుతుంటే పడుకునే వింటున్నాడు. చేతిలో ఉన్న క్యారీబ్యాగ్ షెల్ఫ్లో పెట్టాడు విహారి.

అవునూ రాత్రి అడగడం మర్చిపోయా.. ఢిల్లీవాలాకి హైదరాబాద్లో పనేంటబ్బా.?

కొద్ది సేపు గదిలో మౌనం.

ఓ ‘ఫ్రెండ్’ ని కలవాలి.. భాను లేచి బాత్ రూమ్లో దూరాడు.

అటువైపే ఓ క్షణం చూసి.. షెల్ఫ్లో పెట్టిన క్యారీబ్యాగ్ లోంచి ఓ ప్యాకెట్ తీసుకున్నాడు. రెండు నిమిషాల్లో ఇడ్లీ తినడం పూర్తిచేసి.. తడిచిన చాపని చుట్టి ఓ మూలకి ఆనించాడు. ముందు గదిలో బెడ్షీట్ పరుచుకుంటుంటే.. బాత్రూమ్ నుంచి భాను బైటకొచ్చాడు.

‘క్యారీబ్యాగ్ లో టిఫిన్ ఉంది. బైటకెళ్లే పనయితే బండి కీస్ అక్కడే ఉన్నాయి. నన్ను డిస్ట్రబ్ చెయ్యకే..’ విహారి ముసుగు తన్నేశాడు.

అద్దం ముందు నిల్చున్నాడు భాను. రఫ్ గా పెరిగిన గడ్డం తడుముతూ.. తన కళ్లలోకి తనే ఒకసారి చూసుకున్నాడు. వెంటనే తల దువ్వుకుని అద్దంలోంచి బైటపడ్డాడు. టవల్ తీసేసి హ్యాంగర్ పై ఉన్న జీన్స్ పాంట్ తగిలించుకున్నాడు. టీ షర్ట్ మార్చాల్సిన అవసరం లేదనిపించింది. క్యారీ బ్యాగ్ పక్కనే బండి తాళాలు.. తీసుకుందామా.. వద్దా..? ఆఖరిక్షణంలో వాటిని తీసుకుని తలుపు దగ్గరగా వేసి బైటకొచ్చేశాడు. మెట్లు దిగి మొబైల్లో టైమ్ చూసుకుంటే ఏడు దాటింది. గోడ పక్కనున్న బైక్ స్టార్ట్ చేసి రెండు సందులు తిరిగి నేరెడ్మెట్ బస్టాప్ చేరుకున్నాడు.

 

గాల్లో వాన వాసన ఇంకా పోలేదు. గుండెల్నిండా గాలి పీల్చుకుని బస్టాప్ బెంచ్ మీద కూర్చున్నాడు.

కాసేపటికి సిక్స్ టీన్-ఏ వచ్చింది. పదిమంది దిగారు. పాతికమంది ఎక్కారు.

అవతల వైపున్న బస్టాప్ లో థర్టీ సెవెన్-డి ఆగినట్టే ఆగి వెళ్లిపోయింది. కొంతమంది ఎక్కారు. ఇంకొందరు సగమే ఎక్కారు. మెట్లమీద నిలబడలేని కొన్ని కాళ్లు దిగిపోయాయి.

సమ్ ఏంజిల్స్.. సమ్ హార్సెస్..

అటు థర్టీఫోర్.. ఇటు ట్వంటీ ఫోర్-ఈ..

సెకన్లు.. నిమిషాలు.. గంటలు..

వచ్చీపోయే ప్రతి బస్సునీ చూస్తున్నాడు.

“మధు జాడ లేదు.”  తనని ఇక్కడే కలిశానని పావని చెప్పింది.

పన్నెండు దాటింది. బస్సుల రష్ తగ్గిపోయింది. పక్కనున్న కేఫ్లోకి వెళ్లినా బస్టాప్ వైపే చూపు ఉంచాడు. రెండు టీలు తాగి వచ్చి పాత బెంచీపైనే చేరాడు. మళ్లీ సెకన్లు.. నిమిషాలు.. గంటలు.. ‘అనుకుంటాంగానీ కాలం కొన్నిసార్లు మరీ మొండికేస్తుంది. ఆ క్షణాలు నరకం.’ ఏడాదిన్నరగా ఇలాంటి క్షణాలతోనే గడుపుతున్నాడు తను.

 

*       *       *

 

“మూడేళ్ల కిందట ఓ న్యూస్‌చానెల్‌లో జర్నలిస్టుగా చేరాడు భాను. తర్వాత ఏడాదికి మధు గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్లోకి వచ్చింది. తనని చూశాక భాను జీవితంలో ఓ కొత్త జోష్.  మధు మౌనం అతన్ని కట్టిపడేసింది. ఆమె చూపుల్లో లోతులు తెలియని లోకాలేవో కనిపించేవి. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. అసలెవర్నీ దగ్గరికి రానిచ్చేది కాదు. ఎవరితో అయినా పనివరకే మాట్లాడేది. పావని ఒక్కదానితో అప్పుడప్పుడూ కనిపించేది. చేరిన ఆర్నెళ్లలోనే బెస్ట్ గ్రాఫిక్ డిజైనర్ గా పేరు తెచ్చుకుంది.

మధుని మాటల్లోకి దించేందుకు చాలా కష్టపడ్డాడు. ఆర్నెళ్ల కష్టం తర్వాత… భాను ఓయ్ అంటే, తను ఊ అనేది. క్రమంగా మధులో ఉన్న ఆడపిల్ల బైటపడింది. భానుతో కల్సి ఉన్నంతసేపు తను చిన్నపిల్లలా మారిపోయేది. పావనికి పెళ్లి అయి ఆఫీస్ నుంచి వెళ్లిపోయాక.. ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. మధుతో ఉంటే గంటలు క్షణాల్లా గడిచిపోయేవి. చివరికి తన ప్రేమ విషయం చెప్పెయ్యాలనుకున్నాడు. ఓ రోజు ఈవెనింగ్ పార్క్కు రమ్మని ఫోన్ చేశాడు. గిఫ్ట్ షాప్‌కెళ్లి గంటసేపు వెదికి ఓ బహుమతి తీసుకున్నాడు. ప్యాక్ మీద తనే స్వయంగా.. ‘విత్ లవ్.. నీ భాను’. అని రాసుకున్నాడు.

దేవతలా వచ్చింది మధు. పార్కులో ముసురుకుంటున్న చీకట్లలోనూ మెరిసిపోతూ కనిపించింది. తనని చూసి మాటలు మర్చిపోయాడు. గిఫ్ట్ ప్యాక్ ని ఎడంచేత్తో వెనుక దాచాడు. పార్కులో ఓ బెంచ్‌పై కూర్చున్నాక.. ఎందుకు పిలిచావో చెప్పమంది. తెలిసిన విషయాన్ని తన నోటి నుంచి వినాలన్న ఆతృత ఆమె మాటల్లో ఉంది. కానీ ఏదో తెలియని భావం కూడా అందులో దాగుంది. భాను వెనకాడుతుంటే తనే అందుకుంది. ఆ స్వరంలో అంతకుముందున్నఅల్లరి స్థానాన్ని ఇప్పుడు ఒకరకమైన గాంభీర్యం ఆక్రమించుకుంది. చల్లటి గాలి చీకటిని కోస్తుంటే… ” నువ్వెప్పుడూ అంటూ ఉంటావే… నా మౌనం నీకు నచ్చుతుందని, ఆ మౌనం వెనుక కారణాలు నీకు తెలియవురా..!” చీకట్లో మధు ముఖం అస్పష్టంగా కనిపించినా… గొంతులో విషాదం స్పష్టంగా తెలుస్తోంది. ఏదో భయం భానులో చేరుతుంటే.. మధు మాట్లాడుతూ పోతోంది. నమ్మిన స్నేహితుడు, మరో ఇద్దరితో కల్సి తనపై చేసిన అత్యాచారాన్ని చెప్తుంటే.. భాను కాళ్లకింద భూమి బద్దలవలేదు కానీ, ఎడమచేతిలో ఉన్న గిఫ్ట్ ప్యాక్ జారి పడిపోయింది. చీకటి దాన్ని దాచేసింది. చెప్పాల్సినదంతా చెప్పాక కిందికి చూస్తూ ఉండిపోయింది మధు. భాను తలదించుకుని ఆలోచిస్తున్నాడు. చేతిలోంచి జారిపడిన గిఫ్ట్ ప్యాక్ మళ్లీ తీసుకోవాలనుకోలేదు. కాసేపటి తర్వాత వెళ్దాం అన్నట్టు లేచి నిలుచున్నాడు. మధు ఇంకా గతం తాలూకు విషాదంలోనే ఉంది. కొన్ని క్షణాలు అలాగే కూర్చున్నాక లేచింది. మౌనంగా మధు ముందు నడుస్తుంటే.. కొన్ని అడుగులు వెనగ్గా నడుస్తున్నాడు భాను”

 

*       *       *

 

హారన్ మోతతో ఈ లోకంలోకి వచ్చాడు భాను. బస్టాప్ కి కాస్త దూరంలో యాక్సిడెంట్. దెబ్బలు తగిలినా తగలనట్టే నటిస్తున్నారు. కానిస్టేబుల్ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాడు. పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపించింది భానుకి. చూస్తే విహారి. టీ తాగడానికి వచ్చినట్టున్నాడు.

ఫ్రెండ్ ని కలిశావా..?

‘————–‘  సమాధానం చెప్పకుండా నవ్వుతూ చూశాడు తనవైపు.

రూమ్ కి వెళ్దామా?..  భాను నుంచి సమాధానం లేదు.

‘ఎవరి కోసమో వెదుకుతున్నట్టున్నావ్.?’

‘వెదకడం లేదు.. ఎదురుచూస్తున్నా..’ విహారి కళ్లలోకి చూస్తూ చెప్పాడు భాను.

సరే చావు.. నే వెళ్తున్నా.

వెళ్లిపోయాడు విహారి.

రాత్రి పదయింది. రూమ్ కి చేరుకున్నాడు భాను. తనకోసమే ఎదురు చూస్తున్నట్టున్నాడు విహారి. ఎదురుగా టీచర్స్ ని పెట్టుకుని.. అప్పటికే ఒకరౌండ్ వేసినట్టున్నాడు. తను వెళ్లి పక్కనే కూర్చున్నాడు. గ్లాసులోకి బాటిల్ ఒంపి భానుకివ్వబోయాడు. కళ్లతోనే వద్దన్నాడు.

‘నీ కోసమే ఇవాళ వీక్ ఆఫ్ తీసుకున్నా.. ఫాలో ది టీచర్స్ డార్లింగ్. పాత ప్రపంచాలన్నీ బద్దలుకొట్టి.. సరికొత్త జీవితంలోకి దారి చూపిస్తారు’.

‘ఐ హేట్ టీచర్స్’ సూటిగా చూస్తూ చెప్పాడు భాను. నవ్వుతూ ఒక్క గుక్కలో గ్లాసు ఖాళీచేశాడు విహారి.

‘ప్రేమించుకున్నంత మాత్రాన.. ఇద్దరు ఎప్పటికీ కలిసి ఉండలేకపోవచ్చు. అదే జీవితం.’ మూతికంటిన విస్కీని నాలికతో  తుడుచుకున్నాడు.

‘అఫ్ కోర్స్.. కానీ నేను తనతోనే ఉన్నా… అందుకే ఎదురుచూస్తున్నా..’

అసలు వదిలేయడం ఎందుకు.. ఎదురుచూడటం ఎందుకు..?

‘తనతో కల్సి బతకడం భయమేసింది అప్పుడు.. ఇప్పుడు తను లేకుండా బతకడం భయమేస్తోంది. నేను ఎదురుచూస్తోంది, వెదుకుతోంది నా కోసమే. తనకోసం కాదు’.

ఈ మాటలు చెప్పేటప్పుడు భాను కళ్లలో సన్నటి నీటిపొర. కొంచెం ఆగి అన్నాడు.. అయామ్ ఏ ‘మిడిల్ క్లాస్ లవర్’ విహారీ.

కాసేపటి తర్వాత విహారి నిద్రలోకి జారుకున్నాడు. బాల్కనీలోంచి శూన్యంలోకి చూస్తూ నిల్చున్నాడు భాను..

 

*       *       *

 

“మధు గతం విన్నాక, ఇద్దరూ పార్క్ నుంచి బైటకొచ్చి బైక్ ఎక్కారు. హాస్టల్ దగ్గర మధు దిగాక.. బై చెప్పాడు. తను మాట్లాడలేదు.

రేపు ఆఫీస్ కి వస్తున్నావా అంటే.. ‘తను నవ్వింది. ఏదో చెప్తున్నట్టు’. భానుకి అర్ధం కాలేదు.

వెంటనే హాస్టల్ లోపలికి వెళ్లిపోయింది మధు. రాత్రి పడుకునే ముందు గుడ్‌నైట్ మెసేజ్ పెట్టాడు.  రిప్లయి లేదు. ఆఫీసుకి వెళ్లాక మాట్లాడొచ్చు అనుకున్నాడు. మరుసటిరోజు మధు ఆఫీసుకి రాలేదు. వాళ్ల ఇంచార్జ్‌ని అడిగితే తెలియదన్నాడు. తనూ ఫోన్లో ట్రై చేస్తున్నానని చెప్పాడు. మెయిల్ ఓపెన్ చేసి చూశాడు భాను.. నో మెసేజ్. తన ఆఖరి మెసేజ్.. తనకర్ధం కాని ఆ నవ్వేనని భానుకి తెలిసేసరికి ఆలస్యమయింది.

“ఆ తర్వాత అతనిలో చాలా మార్పొచ్చింది. అప్పుడప్పుడూ నిద్రలో ఉలిక్కిపడి లేచేవాడు. ఎప్పుడూ పరధ్యానంగా.. ఏ పనీ కరెక్టుగా చేయలేకపోయేవాడు. కారణం.. ఓటమి అలాంటిది. మనిషిని కృంగదీస్తుంది. మానసికంగా చంపుతుంటుంది. ఓటమి గురించి భానుకి స్పష్టంగా తెలుసు. కానీ ఎందులో, ఎలా ఓడిపోయానన్నదే అర్ధం కాలేదతనికి. తనని తాను ఎన్నోసార్లు ఈ ప్రశ్న వేసుకున్నాడు. అర్ధరాత్రుల్లో ఉలిక్కిపడి లేచినప్పుడూ, నిద్రపోకుండా గడిపిన సమయాల్లో ఈ ప్రశ్న మరీ బాధించేది. ఒక నిద్రలేని వేకువలో తన ప్రశ్నకు సమాధానం దొరికింది. ‘తను మనిషిగా ఓడిపోయాడు’. ఆ క్షణం స్వచ్ఛంగా ఏడ్చాడు భాను.”

తర్వాత రోజే హెచ్ఆర్ దగ్గరకెళ్లి మధు వాళ్ల ఊరి అడ్రస్ సంపాదించాడు. ఊరిచివర పాడుబడ్డ బడిలో మధు వాళ్ల నాన్నని కలిశాడు. తనపై అఘాయిత్యం చేసిన రాక్షసుల్ని మధు ఎలా ధైర్యంగా జైల్లో వేయించిందో చెప్పాడు. కానీ ఇంట్లో వదినల వేధింపులు, చుట్టుపక్కలవాళ్ల మాటలు తట్టుకోలేక ఇంట్లోంచి బైటకు వెళ్లిపోతుంటే నిస్సహాయంగా ఉండిపోయానన్నాడు.

తర్వాత ఆయనకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా వైజాగ్ వెళ్లి వెతికాడు భాను. కానీ మధుని కలుసుకోలేకపోయాడు. తన పరిస్థితి గమనించే ఆరునెలల క్రితం ఢిల్లీ పంపించారు ఆఫీస్ వాళ్లు. అక్కడే అనుకోకుండా పావని కలిసింది. మూడు నెలల క్రితం మధుని.. హైదరాబాద్, నేరెడ్ మెట్ లో కలిశానని పావనే చెప్పింది. అంతకుమించి వివరాలేమీ తెలియదంది.”

*       *       *

 

రోజు మారింది. అదే బస్టాప్. నిన్న ఉన్నంత హుషారు ఇవాళ లేదు భానులో. రేపు ఢిల్లీ వెళ్లిపోవాలి. ఉదయం నుంచీ బస్సులు వస్తున్నాయి పోతున్నాయి. మధు జాడ లేదు. సాయంత్రమైంది. కేఫ్ లోకి వెళ్లాడు. దో ఛాయ్.. ఆర్డరిచ్చాడు. ఎదురుగా ఉన్న పెద్దాయన నవ్వుతూ చూశాడు. రెండు టీలు తాగినా ఎందుకో నీరసంగా ఉంది. మళ్లీ బెంచీపైకి చేరాడు. మరో గంట గడిచింది. చీకటి పడుతోంది. నిన్నటినుంచి చూసిన వందలకొద్దీ ముఖాలు తనని చూసి నవ్వుతున్నట్టు ఫీలయ్యాడు భాను. ఇందాక నవ్విన పెద్దాయన కూడా గుర్తొచ్చాడు.

ఒక్కసారిగా అలర్టయ్యాడు. ఆయన్ని ఎక్కడో చూసినట్టుంది. ‘ఎక్కడ చూశాను..?’  పరిగెత్తుకుంటూ కేఫ్ లోకి వెళ్లాడు. అప్పటికే వెళ్లిపోయినట్టున్నాడు. ఎక్కడ చూశాను తనని.. మెదడు పగిలిపోయేలా ఆలోచించాడు. చాలా సేపటి తర్వాత స్ట్రయిక్ అయింది. ఓ సోషల్ అవేర్ నెస్ ప్రోగ్రామ్ కోసం.. మధుతో కల్సి అతనోసారి ఆఫీస్కి వచ్చినట్టు గుర్తొచ్చింది. నేరెడ్మెట్లోనే ఓ అనాధాశ్రమం నడుపుతున్నాడు. వెంటనే బైక్ స్టార్ట్ చేసి నిమిషాల్లో ఆశ్రమం చేరాడు. ఇందాకటి పెద్దాయన్ని కలిశాడు. మధు గురించి విన్నాక.. తమకు విరాళాలిచ్చే వాళ్ల రిజిస్టర్‌లు తీసి ఇద్దరూ పరిశీలించారు. పావని చెప్పిన తేదీన మాధవి పేరుతో పదివేలు రాసి ఉంది. అడ్రస్ కాలమ్ మాత్రం వదిలేసి కనిపించింది. తనకీ ఆ అమ్మాయి వివరాలు తెలియదన్న పెద్దాయన… అంతకుముందు కూడా తన పేరుతో ఏవైనా విరాళాలు వచ్చాయేమో చూసే పనిలో పడ్డాడు.

నిలువునా నిరాశ కమ్ముకుంటుండగా బైటకొచ్చి బెంచ్‌పై కూర్చున్నాడు భాను. అప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నాయి. లేచివస్తుంటే వెనక నుంచి ఎవరో పిలిచారు. బండి కీస్ మర్చిపోలేదు కదా అని జేబులు తడుముకుంటుంటే ఆయనే దగ్గరకొచ్చాడు. ‘ఆ అమ్మాయి గురించి పార్వతమ్మ గారికి తెలిసుండొచ్చేమో.. ఈ విరాళాల వ్యవహారాలు  ఆవిడే చూసుకుంటుంది. హెల్త్ సరిగాలేక నెలరోజుల్నించీ రావడం లేదు’. అంటూ ఆమె అడ్రస్ ఇచ్చాడు. అరగంటలో ఆ అడ్రస్ కు చేరుకున్నాడు భాను. పెద్దగా కష్టపడకుండానే పార్వతమ్మ ఇళ్లు కనుక్కున్నాడు. ఆవిడే తలుపుతెరిచింది. వయస్సు అరవై పైనే ఉండొచ్చు. మధు గురించి చెప్పగానే… ఎవరు, ఏమిటీ అని అడక్కుండానే భానుని లోపలికి రమ్మంటూ తీసుకెళ్లింది. సోఫాలో కూర్చున్నాక మధు గురించి చెప్తూ వెళ్లింది. ‘చాలా మంచి పిల్లయ్యా. తను సంపాదిస్తున్నదాంట్లో ఎంతోకొంత సాయం చేయాలనుకుంటుంది. ఎందుకో మనుషుల మీద పెద్దగా ఆసక్తి చూపించదు. నాలో ఏంచూసిందో కానీ ఆప్యాయంగా మాట్లాడేది. తన గురించిన వివరాలు చెప్పేది కాదు గానీ, చాలా విషయాల గురించి మాట్లాడేది. ఆశ్రమానికి అప్పుడప్పుడూ వచ్చేది. ఇంతకు ముందోసారి నా కార్లోనే దించా తనని’ అని ఆగింది. అప్పటివరకూ శూన్యంలో మధుని ఊహించుకుంటున్న భాను… ఒక్కసారిగా ముందుకు ఒంగాడు. పార్వతమ్మ ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని మళ్లీ మాట్లాడ్డం మొదలుపెట్టింది. ‘ఇక్కడే మధురానగర్‌, వోరా టవర్స్ పక్క సందులో ఐదో ఇళ్లో, ఆరో ఇళ్లో..  తను అక్కడే అద్దెకుంటున్నానని చెప్పింది.’ లేచి పార్వతమ్మ పాదాల్ని చేత్తో తాకి వస్తానని చెప్పి బయలుదేరాడు భాను. క్షణాల్లో ఆమె చెప్పిన అడ్రస్ పట్టుకున్నాడు. మధు రూమ్ కి తాళం వేసి ఉంది.

‘ఆ అమ్మాయి పదింటికి కానీ రాదు..’ ఇంటి ఓనర్ మాటతో, టైమ్ చూశాడు. రాత్రి తొమ్మిదవుతోంది. ఇంకా గంట..

వర్షం వచ్చేలా ఉంది. మెయిన్ రోడ్ పైకొచ్చి దగ్గర్లో ఉన్న హోటల్ కెళ్లాడు. మూడు రోజుల తర్వాత ప్రశాంతంగా భోజనం చేశాడు. వెయిటర్ ని అడిగి ఓ పేపర్ తీసుకున్నాడు. ఏవేవో రాస్తూ కొట్టేస్తూ పోయాడు. చివరకు నలిపి పడేయబోయి.. ఎందుకో దాన్ని మడిచి జేబులో పెట్టుకున్నాడు.

రాత్రి 10:10

బైట సన్నటి జల్లు మొదలైంది. ఆ గది తలుపు దగ్గర ఒక్క క్షణం ఆగాడు భాను. ఏదో తెలియని అనుభూతి. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది. తలుపు కొడదామని చెయ్యి వేశాడు. లోపల గడియ పెట్టకపోవడంతో దానంతటదే వెళ్లిపోయింది. ఎదురుగా మధు. నేలమీద కూర్చుని  ఏవో పేపర్స్ చూస్తూ ఉంది. తలుపు చప్పడుకి తలెత్తిచూసింది. ఒక్కక్షణం ఆమె కళ్లలో ఏదో వెలుగు కనిపించినట్టే కనిపించి మాయమైంది. మౌనంగా  లోపలికి వచ్చి కింద కూర్చున్నాడు తను. వర్షం పెద్దదవుతోంది.

కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత… “ఎలా ఉన్నావు” ప్రశ్నలో ఎలాంటి భావం కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నించింది మధు. వానకి తోడు గాలి పెరిగింది. తలుపు కొట్టుకుంటుంటే.. కొక్కేన్ని కిందకు దించి కదలకుండా చేసింది. గాలితో పాటు చినుకులూ గది లోపలకు కొడ్తున్నాయి.

సమాధానం చెప్పకుండా చేత్తో నుదురునీ, ముఖాన్నీ రుద్దుకున్నాడు.

ఇంతలో తనే “ఎందుకొచ్చావు భానూ..?

దూరంగా ఎక్కడో పిడుగు పడ్డట్టుంది. భయంకరంగా ఉరిమింది ఆకాశం.

“నేనిక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాను” లేని కర్కశత్వాన్ని బలవంతంగా గొంతులోకి తెచ్చుకుని పలికింది.

“వెళ్లిపో భాను” అంటూ తనవైపు చూసింది. భాను ముఖంలో ఎలాంటి భావమూ లేదు. గాలివాన హోరు పెరిగింది. ఒకటిన్నర సంవత్సరం నుంచి తనకు చెప్పాలనుకున్న వేలవేల మాటలు మౌనంగా మారిపోయాయి. మధు కళ్లలోకి చూస్తూ మౌనంగా అయినా సంభాషించాలనుకున్నాడు. కానీ చూపుల్ని పక్కకి తప్పించి.. కిటీకీలోంచి వర్షాన్ని చూస్తోంది తను. జేబులో మడిచిపెట్టిన పేపర్ తీసి తన ముందుంచాడు.  తనలో ఏ మార్పూ లేదు. కొన్ని క్షణాల తర్వాత భాను లేచాడు. మరోసారి మధుని చూశాడు. తను నిశ్చలంగా వర్షాన్ని చూస్తోంది. కదల్లేక కదులుతూ గదిలోంచి బైటకు వెళ్లిపోయాడు.

తను వెళ్లిన కొద్ది సేపటి తర్వాత.. పేపరు మడత విప్పింది. దాన్నిండా కొట్టివేతలు.

ఆఖరి వాక్యం మాత్రం అలాగే ఉంచాడు.

‘ఐ లవ్యూ మధు’.

కాగితంపై మధు కన్నీళ్లు పరుచుకుంటున్నాయి.

కంటి నరం తెగినట్టుంది. కన్నీరు కాలువ కట్టింది. ఏళ్లుగా గుండెళ్లో గూడుకట్టుకుపోయిన బాధంతా కళ్లలోంచి బైటకొస్తోంది. భాను గుర్తొచ్చి వెంటనే లేచింది. వెనుక గదిలోకి వెళ్లి వెంటనే బైటకొచ్చింది. చెప్పులు వేసుకోవడం కూడా మర్చిపోయింది. ఒక్క ఉదుటున బిల్డింగ్ పైనుంచి దిగి వీధిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి చూసింది. వీధి చివరెక్కడో మలుపు తిరుగుతున్నాడు భాను. వర్షంలో మసగ్గా కనిపించాడు. భానూ… వెర్రిగా అరిచింది. వాన హోరులో ఆమె అరుపు కలిసిపోయింది. పరిగెత్తుకుంటూ రోడ్డుపైకొచ్చింది. భాను కనిపించలేదు.

కుంభవృష్టి దెబ్బకు రోడ్డుపై ఎవరూ లేరు. ఒకటీ అరా వాహనాలు తిరుగుతున్నాయి. వీధి లైట్లు ఎప్పుడు ఆరిపోతాయో అన్నట్టు వెలుగుతున్నాయి. కాస్త దూరంలో ఉన్న బస్టాప్ కు పిచ్చిదానిలా పరిగెత్తింది. అక్కడా అతను లేడు. వర్షంలో కన్నీళ్లు కనిపించకున్నా ఎగసిపడుతున్న గుండెలు.. ఆమె దుఃఖాన్ని దాచలేకపోతున్నాయి. హోరున కురుస్తున్న వర్షంలో కొద్దిసేపు అలాగే నిలుచుంది. ఇక తనని కలుసుకోలేనన్న బాధతో వెనక్కి తిరిగింది. కాస్త దూరంలో రోడ్డు పక్కన ఉన్నఓ షెడ్ కింద భాను. వణుకుతూ నిలుచుని ఉన్నాడు. రోడ్డుకీ తనకీ మధ్య గోడ ఉండడంతో.. అంతకుముందు కనిపించలేదు తను.   ఎదురుగా నడిచివస్తున్న మధుని భాను చూశాడు. ఆమె కళ్లలోంచి కన్నీళ్లింకా కారుతున్నాయి. దగ్గర కొచ్చాక నవ్వుతూ కుడిచేయి ముందుకు చాచింది తను. మధు చేతిలో గిఫ్ట్ ప్యాక్. పార్క్ లో భాను చేతినుంచి జారిపడ్డ గిఫ్ట్ ప్యాక్. దానిపై రేపర్ పాతబడినట్టుంది కానీ అక్షరాలు అలాగే ఉన్నాయి. ‘విత్ లవ్.. నీ భాను’.

ఫ్యాక్ తీసుకుని కొద్దిసేపు అలాగే చూశాడు. కళ్లలో నీళ్లు తిరుగుతుంటే.. మధుని దగ్గరకు తీసుకున్నాడు. ఇంకెప్పటికీ విడిచిపెట్టనన్నంత దగ్గరగా..!

వాన ఇంకా కురుస్తోంది.

కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ తేరుకున్నారు.

పద.. అంటూ కదిలాడు భాను.

వర్షం తగ్గనీ.. గడ్డం మీదుగా కారుతున్న నీటిచుక్కని తుడుచుకుంటూ అంది మధు.

తగ్గేదాకా ఉండాలంటే, ఇక్కడే ఆగిపోతామేమో.. చేయందించాడు భాను.

ఇద్దరూ నడుస్తూ.. హోరున కురుస్తున్న వర్షంలో కలిసిపోయారు.

 

– రవి బడుగు

మీ మాటలు

  1. kiran bandla says:

    కథ బాగుంది .శైలి ,భావ వ్యక్తీకరణ చాలా బాగున్నాయి.

  2. Dr. Challa Bhagyalakshmi says:

    క‌థ బావుందండీ. సుల‌భ‌మైన శైలిలో పొందిగ్గా, చ‌క్క‌గా రాశారు. అభినంద‌న‌లు

  3. mounika says:

    కథ చాలా బాగుంది..

  4. మ‌ధు says:

    క‌థ‌లో ప్రేమ ఉంది. ప్రేమ‌తో చేసిన ర‌చ‌న బాగుంది.

  5. మ‌న‌సు పెట్టి రాశావో ఏమో కానీ..ఆ మ‌న‌సును ఉలిక్కిప‌డేలా చేసింది. ఈ క‌థ చ‌దువుతున్నంత సేపు కళ్ల‌ముందు క్యారెక్ట‌ర్‌లు క‌దులుతూనే ఉన్నాయి. క‌థ‌-వ్య‌క్తీక‌ర‌ణ‌-శైలి..అన్నీ చాలా బాగున్నాయి-

  6. thomala venu says:

    ర‌వ‌న్నా..క‌థా సూరీడు అన్పించుకున్నావ్‌.ప్రేమంటే ఇదేరా..అని అక్ష‌రాల్లో చూపించావ్‌. సింప్లీ సూప‌ర్బ్ అందామంటే నీ శైలిని పోల్చ‌డానికి అది మ‌రీ చిన్న‌మాట‌యింద‌నే ఫీలింగ్. రేగ‌ళ్ల చెప్పిన‌ట్టు క్యారెక్ట‌ర్లు క‌న్పించాయి. నీ హీరో భాను ఎవ‌రో కానీ అత‌ని వ్య‌క్తిత‌త్వం మ‌న భాను మంచిత‌నానికి ద‌గ్గ‌ర‌గా అన్పించింది నాకు. క‌థ‌..క‌థ‌నం..సారం..సందేశం..ప‌దం..ప‌థం భాను -మ‌ధు క‌లుస్తారా లేదా సందేహం.. క్లైమాక్స్‌. అన్నీ సూప‌ర్ సే ఊప‌రన్న‌య్యా. ఎంత బాగా రాశావ్‌. ఎండాకాలంలో నీ వాన‌క‌థ చ‌దివిన వాళ్ల‌కు గుండెలోతుల్లో దాక్కున్న ప్రేమ మ‌ళ్లీ ప‌రిమ‌ళించ‌డం ఖాయం. క‌న‌ప‌డ‌వు కానీ నువ్వు ముదురాతి ముదురు ప్రేమికుడివ‌ని నీ అక్షారాలు గుట్టు విప్పేశాయి. స‌గం మ‌నిషి క‌థ‌తో అవార్డు గెలిచివ్‌..ఇప్పుడు వాన‌చాటున కురిపించిన ప్రేమ‌తో ఎంద‌రో మ‌నుసుల్ని త‌ప్ప‌క గెలుస్తావ్‌.పిడుగులేని వాన‌లా సాగే బ‌డుగు ర‌వి క‌థ‌లనందిస్తోన్న సారంగ‌కు సెల్యూట్‌.- వేణు తోమాల‌.

  7. alahari Srinivasa Charyulu says:

    కాళిదాసు వ్రాయకుంటే వాల్మీకి లేడని తెలుసు
    మంచుకొండ కరగకుంటే మందాకినీ లేదనీ తెలుసు
    నీ కలం బలం తెలుసు .. బడుగు కధలోని పదాల పదును తెలుసు
    శబ్ద చాతుర్యం .. కధాసౌందర్యం.. కధనంలో నవ్యత్వం ..
    అందుకే ఈ వాననిలా కురవనీ ..నీ పయనమిలా సాగనీ ..

    – అళహరి

మీ మాటలు

*