దైవాన్ని దర్శించే కారుణ్యం!

 

 

-ఫణీంద్ర 

~

 

దేవుడే మనిషిగా అవతరించి మానవులని దగ్గరగా చూస్తే ఏమనుకుంటాడు? ఆశ్చర్యపోతాడా? జాలి పడతాడా? బాధ పడతాడా? బహుశా ఈ భావాలన్నీ కలగలిపిన ఒక మౌనస్థితికి చేరుకుంటాడేమో! అప్పుడు దేవుడి అంతరంగం మనిషికి ఏమని చెప్పాలనుకుంటుంది? “గోపాలా గోపాలా” చిత్రంలో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు గేయ రచయిత సిరివెన్నెల తానే గీతాచార్యుడై మనందరికీ ఓ అద్భుతమైన గీతాన్ని అందించారు. మే 20 సిరివెన్నెల పుట్టినరోజు సందర్భంగా ఈ పాటని చర్చించుకుని, ఆకళింపు చేసుకుని, అంతో ఇంతో ఆచరణలో పెట్టడమే ఆయనకి అభిమానులు ఇవ్వగలిగే కానుక.

చిత్ర కథాపరంగా దేవుడైన కృష్ణుడు ఓ మామూలు మనిషై మూఢనమ్మకాలనీ, దేవుడి పేరు మీద లోకంలో చలామణీ అవుతున్న కొన్ని ఆచారాలనీ ప్రశ్నించిన ఓ వ్యాపారికి తోడ్పాటునందిస్తాడు. నిజానికి ఆ వ్యాపారి తన “భక్తుడు” కాకపోయినా, తన “భక్తులుగా” చెప్పుకుంటున్న వాళ్ళని వ్యతిరేకిస్తున్నా కృషుడు అతని పక్షమే వహిస్తాడు! అతనికీ, అతనితో పాటూ మనుషులందరికీ దైవత్వపు అసలు లక్షణాలని వివరిస్తున్నట్టుగా సాగుతుంది ఈ పాట.

బ్రహ్మలా నేనే నిన్ను సృష్టించాననుకోనా?

బొమ్మలా నువ్వే నన్ను పుట్టించావనుకోనా?

నమ్ముకుంటుందో నవ్వుకుంటుందో

ఏమి అంటుందో నీ భావన!

 

నీదే నీదే ప్రశ్నా నీదే!

నీదే నీదే బదులూ నీదే!!

 

మనిషి సాక్షాత్తూ భూలోక బ్రహ్మే! మనసులో మెదిలిన ఊహలని తన మేధస్సుతో శక్తి సామర్ధ్యాలతో సాకారం చేసుకుంటాడు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడు. భూమండలాన్ని ఏలుతున్నాడు, మిగతా గ్రహాలపైనా కన్నేశాడు! ఇంత గొప్ప మనిషి దేవుడి గురించి చేసిన భావన ఏమిటి? దేవుడు కేవలం కోరిన వరాలిచ్చే గుడిలో ప్రతిమా? “నమ్ముకుంటే” చాలు అన్నీ ఆయనే చూసుకుంటాడు అని కొందరు, రాతిబొమ్మనో, రూపం లేని శక్తిస్వరూపాన్నో నమ్ముకోవడం ఎంత అజ్ఞానం అని నవ్వుకునే వాళ్ళు ఇంకొందరు! మరి దేవుడెవరనే నిజాన్ని ఎలా తెలుసుకోవడం? ప్రశ్నించడం వల్ల. ఇక్కడ “ప్రశ్న” అంటే కేవలం కుతూహలం కాదు, తెలివితేటల ప్రదర్శన కాదు, ఏర్పరుచున్న అభిప్రాయాల వ్యక్తీకరణ కాదు, ఎవరినో/దేనినో వ్యతిరేకిస్తూ అడిగేది కాదు. ఎంతో నిజాయితీగా చేసే ఒక తీవ్రమైన అన్వేషణ, అంతఃశోధన. అలాంటి “ప్రశ్న” నీదైనప్పుడు, బదులూ నీలోంచే వస్తుంది. బయటనుంచి కాదు. దేవుడంటే ఎవరన్నది ఎవరో చెప్పేది కాదు, మతగ్రంధాలు చదివితే తెలిసేది కాదు, నీకు నువ్వు అనుభవించాల్సింది.

 

నీ దేహంలో ప్రాణంలా వెలిగే కాంతి నా నవ్వే అని

నీ గుండెల్లో పలికే నాదం నా పెదవిపై మురళిదని

తెలుసుకోగలిగే తెలివి నీకుందే

తెరలు తొలగిస్తే వెలుగు వస్తుందే!

 

నీదే నీదే స్వప్నం నీదే!

నీదే నీదే సత్యం నీదే!

 

దేవుడు కేవలం ఒక భావనే అయితే ఆ భావన ఎంత గొప్పదైనా దాని వల్ల పెద్ద ప్రయోజనం లేదు. పైగా ఆ భావజాలాల్లో ఫిలాసఫీల్లో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కూడా. దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉంటూ మనని పర్యవేక్షిస్తున్నాడంటే ఆయన మననుంచీ మన జీవితాలనుండీ విడివడి ఉన్నాడని అనుకోవాల్సి వస్తుంది. దేవుడంటే ఇంతేనా? వివేకానందుడు రామకృష్ణ పరమహంసని మొదటిసారి కలిసినప్పుడు, “మీరు దేవుణ్ణి చూశారా?” అని అడిగితే, ఆయన “అవును! నేను ఉపనిషత్తులు క్షుణ్ణంగా చదివి దేవుణ్ణి దర్శించాను. దేవుడంటే ఎవరో తెలుసా?” అంటూ గొప్పగా ధ్వనించే విశేషణాలతో దేవుణ్ణి వర్ణించలేదు. “అవును! నేను చూశాను. నా ఎదురుగా ఉన్న నిన్ను చూసినట్టే, కానీ ఇంకా స్పష్టంగా! దేవుణ్ణి చూడొచ్చు, దేవుడితో మాట్లాడొచ్చు. కానీ ఆయన ఎవరికి కావాలి? భార్యపిల్లల కోసం, ఆస్తిపాస్తుల కోసం వెంపర్లాడే వాళ్ళు ఉన్నారు కానీ దేవుడు కోసం కనీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఎక్కడున్నారు? ఆర్తిగా వేడుకుంటే ఆయన తప్పక దర్శనమిస్తాడు!” అని చెప్పారు. ఇదీ నిజమైన భక్తంటే, ఇదీ దేవుణ్ణి దర్శించే తీరంటే!

“నీలో నిజాయితీ ఉంటే, ప్రశ్నించే తపనుంటే, నీ ప్రాణజ్యోతి ఆ దేవుడి నవ్వుగా గ్రహిస్తావు. నీ గుండెల్లో నాదం సాక్షాత్తూ ఆ కృష్ణుడి మురళీగానం అవుతుంది. నీకు దేవుడి నిజస్వరూపాన్ని తెలుసుకునే తెలివుంది. నీకు నువ్వే ఏర్పరుచుకున్న స్వప్నాల తెరలను తొలగించు, సత్యం సూర్యప్రకాశంతో కనిపిస్తుంది” అని సిరివెన్నెల మనకి  ప్రబోధిస్తున్నది ఇదే!

 

ఎక్కడెక్కడని  దిక్కులన్ని తిరిగితే  నిన్ను నువ్వు  చూడగలవా?

కరుణతో కరిగిన మది మందిరమున  కొలువై  నువ్వు  లేవా?

అక్కడక్కడని  నీలి నింగి తడిమితే నిన్ను నువ్వు తాకగలవా?

చెలిమిని పంచగా చాచిన చేయివైతే  దైవం నువ్వు కావా?

 

నీదే నీదే ధర్మం  నీదే!

నీదే నీదే మర్మం నీదే!

 

లోకంలో భౌతికవాదులు (materialists), ఆధ్యాత్మికవాదులు (spiritualists) అనే తేడా కనిపిస్తూ ఉంటుంది. స్థూలంగా చూస్తే ఈ ఇద్దరూ వేర్వేరుగా కనిపిస్తున్నా సూక్ష్మంగా చూస్తే ఇద్దరూ ఒకే “ఆనందాన్ని” వెతుకుతున్నారని జ్ఞానులు చెబుతూ ఉంటారు. మన ప్రస్తుతపు ఉనికిలో ఉన్న ఒక లోటుని అధిగమించడానికే కదా మన తపనంతా! ఆ లోటు సామజికమైనది అనిపిస్తే సమాజసేవో, సమాజోద్ధరణో, లేదో సామజికవిప్లవమో మన లక్ష్యమౌతుంది. వ్యక్తిగతమైనదైతే జీవితాన్ని గెలవడమో, డబ్బు సంపాదించడమో, సంఘంలో గౌరవమో మన లక్ష్యమౌతుంది. ఆత్మికమైనదైతే భక్తో, యోగమో, వేదాంతమో సాధనామార్గమౌతుంది. అంతే తేడా! కానీ లోటున్నది నీలో, నీ వెతుకులాటంతా బయట! ఎంత సాధించినా సంతృప్తిలేక తిరిగితిరిగి అలసిసొలసి చివరికి నీలోకి నువ్వే చూసుకున్నప్పుడు, నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నాన్ని చేసినప్పుడు, నువ్వు దైవానికి చేరువవుతావు!

ఎందరో మహాగురువులు పదే పదే చెప్పిన ఈ విషయాన్నే సిరివెన్నెల ఎంతో సులభంగా వివరిస్తూ కొన్ని “ప్రాక్టికల్ టిప్స్” కూడా చెప్పారు. “నిన్ను నువ్వు వెతుకుతూ అలజడితో దిక్కులన్నీ తిరగకు, నీ మనసు కరుణకి కొలువైతే నీలోనే నిన్ను కనుగొనలేవా?” అన్నారు. “కరుణ” ప్రేమకి పరాకాష్ట. ప్రేమలో ఇంకా కొంత కోరుకోవడం ఉంటుంది, కరుణ సంపూర్ణమైన నిండుదనమై ఏమీ కోరుకోక ఇవ్వడంలోనే ఆనందపడుతుంది. కరుణతో నిండిన హృదయం దైవనిలయం కాదూ? “నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఆకాశానికి నిచ్చెన వెయ్యకు, ప్రేమతో సాటి మనిషి హృదయానికి వంతెన వెయ్యి” అన్నారు. ఆధ్యాత్మికత అంటే సాటి మనిషినీ, సమాజాన్ని విస్మరించే స్వార్థం కాకూడదు. సమస్తాన్ని తనలో ఇముడ్చుకునే ఔదార్యం కావాలి. అప్పుడు దైవభక్తి లోకకళ్యాణ కారకమౌతుంది. “ధర్మ”మంటే ఇలాంటి ప్రవర్తనమే. ఇదే దేవుణ్ణి చేరుకోవడానికి సులభమైన రహస్యం! ఈ మర్మాన్ని తెలుసుకున్న వారు ధన్యులు!

సిరివెన్నెల గారికి ముమ్మారు మొక్కుతూ, జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను!

 

(ఈ పాటని యూట్యూబులో ఇక్కడ వీక్షించొచ్చు)

 

 

 

 

 

మీ మాటలు

  1. Bhavani Phani says:

    ఒక మంచి పాటని ఎంతో చక్కగా విశ్లేషించారు ఫణీంద్ర గారూ, ఎన్నో అద్భుతమైన భావాత్మక ప్రయోగాలతో తెలుగు పాటని రగిలించి, మనసు నిండుగా తృప్తినీ, సంతోషాన్నీ, మాటలకందని భావోద్వేగాలనీ వెలిగించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు

మీ మాటలు

*