చావు వెల

 

-బాలసుధాకర్ మౌళి

~

 

వానకి
వొరిగిన చేలు లెక్కనే
తలవాల్చి
ప్రశాంతంగా నిద్రిస్తున్న
దేహమెవరిదో..
చావుని
పిలిచి మరీ
కౌగిలించుకున్న ఆ ధీశాలెవరో..
తల్లీ- బిడ్డలను
ఎవరి మానాన వాళ్లనొదిలేసి
వుత్తచేతులతో కదిలిపోడానికి
నమ్మకమెక్కడినుంచొచ్చిందో..
ఎవరో
ఏ ప్రాంతమో
ఏ కన్నీళ్ల కథానాయకుడో –

నెత్తురు
గంగవెర్రులెత్తుతుంది
రైతు
ఆత్మహత్య చేసుకున్నాడంటున్నావా
నిజమేనా
నమ్ముతావా
– రైతు కాదురా
తరాల శోకాన్నీ దిగుళ్లనీ కన్నీళ్లనీ
మోసి మోసి
బరువెక్కి – తేలికయి
ఆనందనేత్రాలతో
పారవశ్యం చెంది
అలసి అలసి – తిరిగి శక్తివంతమయి
నిలబడిన
నేలరా –
బువ్వపెట్టిన నేలరా
నేలరా
ఆత్మహత్య చేసుకుంది
కోటానుకోట్ల
కాంతిపుంజాల చేతులతో
నోటి ముందు ఇంత అన్నం ముద్దనుంచిన
తల్లినేలరా
నేలరా- ఆత్మహత్య చేసుకుంది

పాట పాడే నేల
ఆత్మహత్య చేసుకుంది
పాదం కదిపే నేల
ఆత్మహత్య చేసుకుంది
మనిషి మనిషంతా నేలగా మారి
నేలే మనిషై ఆత్మహత్య చేసుకుంది

నేల చుట్టూ
చేరి
పిచ్చిచూపులు చూస్తున్న
ఆ పసివాళ్ల సంగతో
పసివాళ్ల జీవితాలను ప్రాణంపెట్టి సాకాల్సిన
ఆ తల్లి సంగతో
పోనీ
డేగలా
నెత్తిన కూర్చున్న అప్పుసంగతైనా
చెప్పగలవా –
పోనీ
వాడు కట్టిన
‘చావు వెల’ సంగతి ?

*

మీ మాటలు

 1. చాల బాగుంది మౌళి గారు. “తల్లినేలరా
  నేలరా- ఆత్మహత్య చేసుకుంది” అనేది చాల ఆలోచనల్ని రేకెత్తించే భావం- ప్రభు

 2. D Subrahmanyam says:

  నెలా దాని మిద ఆధారపడి బతుకుతున్న పేద రైతు గురించి ఎంత ఆర్ద్రం గా రాసారండీ .

  • ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారూ.
   రైతుల ఆత్మహత్యలన్నీ రాజ్యం హత్యలే. ఈ రెండేళ్లలో కొన్ని వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే… ఐదుశాతం మందికి కూడా పరిహారం అందియ్యలేదు. రకరకాల కార్డ్ లు తేవాలని.. అడ్డదిడ్డమైన నిబంధనలు. అసలు చావుకి వెల కట్టడమేటి ? అనిపిస్తుంది.

 3. తోటపల్లి సన్యాశినాయుడు says:

  బాల సుధాకర మౌళి గారు,మీకు రైతులపట్ల ఆవేదనవున్ది,గానీ దానిని ఎలా చెప్పలో,ఏవిషయాన్ని చెప్పలో సరిగా అర్ధం గాలేదనిపిస్తోన్ది.చనిపోయిన వారిని నాయకులుగా కీర్తిస్తే మరింత నష్టమే తప్ప ప్రయోజనమేముండదు .

 4. Buchireddy gangula says:

  ఏ కన్నీళ్ళ కథ నాయ కుడో ? అర్థం చాలా చక్కగా. ఉంది–
  ఏ నష్టం. కలుగ లేదు
  బాగుంది బాల. Garu
  గుళ్ళకు– దేవుళ్ళకు— యాగాలకు. కోట్లు ?//రాజుల పాలనా లో
  =========================================[=
  Buchi రెడ్డి గంగుల

 5. చావుకు వెలకట్టి చేతులు దులుపుకునే పాలకులకు, చావును ఎగతాలిచేసే లెక్కల మాస్టారులకు చావును కీర్తిస్తున్నట్లనిపిస్తుంది. అప్పిచ్చిన వాడి అవమానకర మాటల ప్రభావమే వారిని చావువైపు లాగుతుంది. మొఖం మీద గుద్దేసుకుని బతికేసే తీరు తెలీక ఇలా చస్తున్నారు. మీ ఆవేదన కొత్త రూపంలో సాగింది.

 6. తోటపల్లి సన్యాశినాయుడు says:

  కేక్యూబ్ వర్మ గారూ !మీ అభిప్రాయాలు మీకుండవచ్చు.వేరే అభిప్రాయాలపట్ల మీకు వ్యతిరేకత వుంటే వుండవచ్చు.అది తప్పు అనిపించినప్పుడు ఖచ్చితంగా చర్చించి ఖండించవచ్చు.అంతేగానీ వెటకారాలు,విసుర్లు ఎందుకు సార్!?.మానవజీవితంలో లెఖ్ఖల కతీతంగా ఏమీ లేదని నానమ్మకం.మీరు నమ్మే మార్క్స్ మహాశయుడు కూడా అంతా ఆర్ధికమే అన్నాడు. ఆర్ధికమంటేనే లెఖ్ఖ .
  కవిత్వంలో మీలెఖ్ఖలగొడవ ఏమిటి అని మీరడగవచ్చు.ఒక ఇంగ్లీషు కవి గుడా కవిత్వమూ ఒక లేఖ్ఖే అని చెప్పేడు.అది “పొయట్రీ ఈజ్ ఆల్జీబ్రా నాట్ అర్ధమేటిక్” అని (ఎక్కడో చదివాను).ఆల్జీబ్రా అయినా అర్ధమేటిక్ అయినా లెఖ్ఖే అని నేను మీకు సెప్పక్కరలేదనుకుంటాను.

 7. కవిత బాగుంది. శిల్పం, శైలి నవ్యంగా ఉన్నాయి.

  ఈ కవితలో చనిపోయిన రైతుని కీర్తించినట్లు తోటపల్లి గారికి అనిపించటానికి — చావుని పిలిచిమరీ కౌగిలించుకొన్న ఆ ధీశాలెవరో” అన్న వాక్యం కారణం కావొచ్చు.

  కానీ కవిత చెప్పదలచుకొన్న ప్రధాన అంశమైన – “ఆత్మహత్య చేసుకొన్నది రైతు కాదు నేల” అనే భావం పలకటానికి పై వాక్యాలు నిర్మాణపరంగా అవసరం అనిపిస్తుంది. ఆ వాక్యం బదులు “చనిపోయిన ఆ నిర్భాగ్యుడు/విధివంచితుడు” అంటే, “”ఆత్మహత్య చేసుకొన్నది రైతు కాదు నేల” అన్న బలమైన అంశం చదువరి మనసులో నాటుకోదు లోతుగా. కవిత పేలవంగా ఉంటుంది.

  “ఆత్మహత్యచేసుకొన్న రైతు నీళ్ళగురించి మాట్లాడుతున్నాడు” అన్న కవితలో కె. సచ్చిదానందన్ రైతు చావును – వ్యవసాయం చావుగా, వ్యవసాయ సంస్కృతి చావుగా వర్ణిస్తాడు.

  ఒక సంఘటను ఉత్త వర్ణణగా కాక, దాన్ని పరివ్యాపితం చేసి ఒక విభ్రమను కలిగించటం ద్వారా కవి చదువరిలో ఆలోచనల్ని కలిగిస్తాడు. సాహిత్యానికి ప్రయోజనం అంతకు మించి ఏమి కావాలి?

  సుధాకర్ మౌళి చేసింది కూడా అదే. రైతుచావును ఉత్త చావు గావర్ణించకుండా దాన్ని నేల చావుగా విస్తరింపచేసాడు. అది ఉత్తమ కవుల లక్షణం.

  అభినందనలతో
  బొల్లోజు బాబా

 8. తోటపల్లి సన్యాశినాయుడు says:

  బొల్లొజు బాబా గారూ, మీ విశ్లేషణ బాగుంది.మీరు చెప్పిన అంశం అభినదించ దగ్గ విషయమే,కానీ మొదటి పేరా చూసారా!ఒక భీభత్సకర దృశ్యాన్ని ప్రశాంతంగా నిద్రిస్తున్నట్టు చెప్పటం
  “వానకి
  వొరిగిన చేలు లెక్కనే
  తలవాల్చి
  ప్రశాంతంగా నిద్రిస్తున్న
  దేహమెవరిదో….” నిజానికి వానకు చేలు వొరగవు,దానికి గాలి తోడైతే తప్ప. సరే, పండి వొరిగినచేల ను చూస్తే ఆ దృశ్యం చాలా భీభత్సకరంగా వుంటుంది.నిజానికి చనిపోయిన రైతుని, కాదు కాదు ఆత్మహత్య చేసుకున్న రైతుని ఆదృశ్యంతో పోల్చటం మంచి విషయమే,పోలిక సరైనదే కానీ చూసే దృష్టి లో లోపముంది,అన్నది ప్రధానంగా నా అభ్యంతరం. “ప్రశాంతంగా నిద్రిస్తున్న” అనటం.ప్రశాంతంగా నిద్రించటం సహజ లక్షణం.అంతా ప్రశ్సాంతంగవుంటే సమస్యేముంది.
  కవి చెప్పదలచుకున్న అంశానికి లేదా ఆభావానికి అతనుపయోగించిన మొత్తం సరంజామా అనుకూలంగావుండాలి.అనగా ఆవాతావరణంలోనికి పాఠకున్ని తీసుకు పోవాలి,రెండవపేరాలో వున్న ఆగ్రహానికి ,ఆవేశానికి యిది దోహదకారిగావుండాలి.కానీఇది అలాలేదు సరికదా
  ప్రశాంతతను బలపరుస్తూనే మొత్తం పేరా సాగుతున్నది.
  “చావుని
  పిలిచి మరీ
  కౌగిలించుకున్న ఆ ధీశాలెవరో…”.అని కీర్తించటం
  “తల్లీ- బిడ్డలను
  ఎవరి మానాన వాళ్లనొదిలేసి
  వుత్తచేతులతో కదిలిపోడానికి
  నమ్మకమెక్కడినుంచొచ్చిందో..”అంటే ఎక్కడో ఎదో నమ్మకం కలిగినట్టుగా ద్వనింపచేయటం.
  “ఏ కన్నీళ్ల కథానాయకుడో” – అనటం,….వెరసి యివన్నీ పోయంలో చెప్పదలచుకున్న భావానికి వ్యతిరేక దిశలో వున్నాయి.
  రెండవ పేరాలో పోయం అంతా కవి ఆలోచనని పట్టి యిస్తోంది.ఆవేదనని చూపుతోంది.అందులో ఏవిధమైన అభ్యంతరానికి చోటులేదు.
  మళ్లీ మూడవ పేరా కొచ్చేసరికి పాఠకుడి మూడ్ ని తప్పించేసాడు కవి.అక్కడ ఒక వ్యగ్రత,అసహనం చోటుచేసుకుంది.
  ఎవరో వ్యతిరేకిస్తున్నట్టు చెప్పడం,
  “పసివాళ్ల జీవితాలను ప్రాణంపెట్టి సాకాల్సిన
  ఆ తల్లి సంగతో…” పిల్లల భవిష్యత్ పట్ల ఆలోచిస్తూ ..
  “డేగలా
  నెత్తిన కూర్చున్న అప్పుసంగతైనా
  చెప్పగలవా “– అని ప్రశ్నిస్తున్నాడు.పోనీ ఏక్స్ గ్రేషియా
  కోసమ డిమాండు చేస్తున్నాడా అంటే అదీ కనపడదు.చావుకు వెలకట్టడమంటున్నాడు
  వాడు కట్టిన
  ‘చావు వెల’ సంగతి ?

  వెరసి కవికి ఆవేదనైతే వుందితప్ప దానిని ఏ ఏంగిల్లో ప్రజెంట్ చేయాలో అన్నది కవికి స్పష్టతలేదని నాకనిపించింది.ధన్యవాదాలు.

 9. తోటపల్లి గారు

  మీ దృక్కోణం నాకు అర్ధమైంది. మీరు కవితను విశ్లేషించిన తీరు బాగుంది.
  ఇక్కడ వ్యక్తుల్ని పక్కన పెట్టి పద్యం గురించే మాట్లాడుకొంటున్నామనే భావిస్తాను….

  మీరు చేసిన
  “ఒక భీభత్సకర దృశ్యాన్ని ప్రశాంతంగా నిద్రిస్తున్నట్టు చెప్పటం”…. అన్న ఆక్షేపణకు రెండు ఉదాహరణలు
  ఆనందభైరవి చిత్రంలో “కొలువైతివా రంగశాయి, హాయి కొలువైతివా రంగశాయి.. అన్న గీతం దేవునిపాట కావొచ్చు కానీ చిత్రీకరణ శవంపై చేసి దర్శకుడు మెప్పించగలిగాడన్నది గమనార్హం. ఆ పాటలో హాయి అన్న పదం కూడా ఉంది గమనించండి

  పార్ధివ దేహాలెప్పుడూ
  ప్రశాంతంగా పవళిస్తూనే ఉంటాయిరా అబ్బాయ్.
  నడిచే దేహాలు మాత్రం- ఆ అకస్మిక వియోగ
  విషాదంలో ప్రయాణిస్తూనే ఉండాలి. (పక్కింటబ్బాయి ఆత్మహత్యాయత్నం) అనే కవితలో ‘దేహం ప్రశాంతంగా పవళిస్తూ ఉంది” అన్న వాక్యం పునరుక్తిగా వస్తుంటుంది.

  అకస్మాత్తుగా, చిన్నవయసులో చనిపోయిన వ్యక్తి శవాన్ని చూసి “ప్రశాంతంగా, నిద్రపోతున్నట్టే ఉన్నాడు” అన్న ప్రయోగం సాధారణంగా వాడుతూంటాం. అదొక దృష్టి, అదొక ఫీల్ అంతే. అలా ఉండకనూ పోవచ్చు కొన్ని సార్లు.

  ఏ కన్నీళ్ల కథానాయకుడో
  ఆ తల్లి సంగతో
  అప్పుసంగతైనా చెప్పగలవా –——– అంటూ ప్రశ్నల రూపంలో జరిగిన వ్యక్తీకరణ ద్వారా వాటిపై మీరుచేసిన ఆక్షేపణలనుంచి ఈ కవిత escaped almost ….. I believe. Because they are open ended and can be interpreted anyway.
  థాంక్యూ
  బొల్లోజు బాబా

 10. Chenchu says:

  బల్లోజు బాబా గారు మీ కామెంట్లలో కవిత్వం పై అమితాభిమానం కనబడుతోంది మంచిదే. ఆత్మహత్య చేసుకోవడం ఓ ధిరోదాత్త అంశమంటారా? మీరు చెప్పిన సినిమా ఉదాహరణలు సాధారణ చావుకు సంబందించినదా లేదా ఆత్మ్యహత్య చేసుకున్నవారి గురించా? మౌళి రాసిన కవిత ఓ సామాజిక దృక్కోణం గురించినిది కాకుండా ఓ సినిమాపాటతో సరిపోలికగా ఉంటే మరేమీ అభ్యంతరంలేదు.

మీ మాటలు

*