ఇప్పుడొచ్చింది మెలుకువ!

 

 

 

కవిత్వ అనువాదం గురించి మహాకవి  షెల్లీ అన్నాడేమో – గుర్తు లేదు- కాని, వాక్యం వరకూ గుర్తుంది: The plant must spring again from its seed.

గొప్ప కవిత్వం అనువాదానికి లొంగదు అని చాలా సార్లు విన్నాం. అది ఎంత కష్టమో ఈ షెల్లీ వాక్యం చెప్తుంది. అదే విత్తనం నించి అదే మొలక సాధ్యం కాకపోవచ్చు కాని, రెండు భాషల రహస్యం తెలిసినప్పుడు కవిత్వం మక్కీ కి మక్కి కాకపోయినా భావానువాదం సాధ్యమే కావచ్చు. అయితే, ఆ రెండు భాషలూ వొక దానికి ఇంకోటి సాంస్కృతికంగా ఎంత దగ్గిరగా మసలుకుంటాయన్న విషయం మీద అది ఆధారపడుతుంది.

తెలుగు-ఒరియా భాషల మధ్య చుట్టరికం ఇప్పటిది కాదు. కాని, ఏ కారణం వల్లనో వచనం అనువాదం అయినంత ఎక్కువగా ఈ రెండు భాషల మధ్య కవిత్వం తర్జుమా కాలేదు. వెనిగళ్ళ బాలకృష్ణ రావు సహకారంతో ఇప్పటికైనా ఈ వెలితి కొంత భర్తీ చేస్తున్నందుకు వేలూరి వెంకటేశ్వర రావు గారిని అభినందించాలి.

సౌభాగ్య కుమార మిశ్ర పేరు ఒరియాలో సుపరిచితం. దాదాపు అయిదు దశాబ్దాలుగా ఒరియాలో ఆయన కవిత్వం రాస్తున్నారు. యిప్పటికి పదకొండు కవిత్వ సంపుటాలు తీసుకువచ్చారు. ఆధునికమైన భావన ఎలా వుంటుందో, దానికి ఎన్ని కోణాలు వుంటాయో వాటన్నిటినీ ఆయన ఒరియా వర్తమాన కవిత్వంలో పరిచయం చేశారు.

సునిశితమైన సాంస్కృతిక అంశాలని చుట్టుకుని వుండే ఆయన వాక్యాల సొగసుని తెలుగులోకి తీసుకురావడం ఎంత శ్రమ వుందో, ఆ శ్రమ సౌందర్యమంతా ప్రతిఫలించే అనువాదాలు ఇవి- ఈ ఎండాకాలం కొన్ని అనువాదాల్నివొక పుస్తకంగా తీసుకురావాలని వేలూరి- వెనిగళ్ళ  ప్రయత్నం! ఈ రెండు అనువాదాలు మీ కోసం ఇదిగో..

-అఫ్సర్ 

 

ఆహ్వానం:

 

ఒరియా మూలం: సౌభాగ్య కుమార మిశ్ర

తెలుగు అనుసృజన: వేలూరి వేంకటేశ్వర రావు (వెనిగళ్ళ బాలకృష్ణ రావు సహకారంతో)

 

 

ఈ అరణ్యజనుల  ఉచ్చులు  తప్పించుకొని రా, మృగుణీ (1)

సిమెంట్‌ వరండా ఎర్రగా  కాల్చేసే సహజమైన ఈ  మండుటెండ

అగ్నివలయం లోపలినుండి తప్పించుకొని రా మృగుణీ

సందిగ్ధ సమయంలో ప్రార్థన కేవలం పునః స్మృతి; నిన్నటి ఎంగిలి కూడులా!

రాక్షసుడి ఆకలికి  ఈ వడ్డు, ఆ వడ్డు అనే భేదం లేదు.

 

నీలిమేఘాల ద్వీపంలో కూడా చావు లేదు మృగుణీ

టెలిఫోన్‌ లో పెద్ద గర్జన తప్ప. ఏనుగ లేదు, మొసలి లేదు,

ఏ దొంగదో, సన్యాసిదో, మెత్తని అవ్యక్తధ్వనిలో కలిసి పోయి రా, మృగుణీ.

 

కొండంత మా అపనమ్మకపు శిఖరం ఎక్కి రా మృగుణీ,

క్రిందకి దిగిరా మా దుర్మార్గపు గడ్డిపరకల కోసం.  మెలకువతో చేకొంటావు కదా,

దిగువనుండి  దిగ్మండలాంతానికి వ్యాపించిన ఈ నేలపై

లెక్కలేనన్ని దేవుళ్ళ అంగాలలో ఆలింగనాలలోవినిపించే రతికూజితాలు ఎన్నెన్నో!

*

మృగుణి  అంటే, కురంగి,  ఆడు జింక అని అర్థం.  మనం తెలుగులో లేడి అని కూడా అంటాం.   సప్తఋషులలోఒక ఋషి పులహుడు. అతనికి అనేకమంది భార్యలున్నారు. వారిలో ఒక భార్య మృగి.  పులహుడు, పిశాచాలని, క్రూరమృగాలు పులులని, సింహాలనీ, మొసళ్ళనీ పుట్టించిన ఋషి అని చెపుతారు.  పులహుడు సృష్టించిన జంతువులలో లేడి కూడా ఒక జంతువు. అది సాధు జంతువు. క్రూరజంతువుల బారినుండి తప్పించుకొని రమ్మని ఆడుజింకకి ఆహ్వానం అని అన్వయం చేసుకోవటానికి అవకాశం లేకపోలేదు.  కవితలో ఆఖరివాక్యం చదివిన తరువాత ఈ వ్యాఖ్య అసమంజసం అనిపించదు. ఈ అన్వయం గురించి  సౌభాగ్య కుమార మిశ్ర తో మాట్లాడినప్పుడు, అతను చెప్పాడు:  పులహుడి కథ తనకి తెలుసు.  అయితే, సుమారు యాభై ఏళ్ళక్రితం  ఈ కవిత రాసినప్పుడు తనకి పులహుడి సృహ లేదని! ఒకే పద్యానికి పాఠకులు/విమర్శకులు  వేరువేరు వ్యాఖ్యానాలు  చెయ్యటానికి అవకాశం ఉన్నది  సుమా అని అతనూ గుర్తించాడు.  పోతే, అనాగరిక  రాక్షసజనులబారినుండి తప్పించుకొని ఈ దుర్మార్గపు ప్రాంతానికి  రమ్మని కురంగికి “ఆహ్వానం” అని సాధారణ అన్వయం.  –  వేవేరా

 

కొండ:

ఒరియా మూలం: సౌభాగ్య కుమార మిశ్ర

తెలుగు అనుసృజన: వేలూరి వేంకటేశ్వర రావు (వెనిగళ్ళ బాలకృష్ణ రావు సహకారంతో)

 

నేను మహమ్మద్ లాగా కొండ దగ్గిరకి పోలేదు

నేను కొండని రమ్మని పిలవనూ లేదు. నా గది తలుపు

తెరిచి వుందని తానే దూసుకొని వచ్చింది; సాయంత్రం

ఆకాశంమీదుగ దిగివచ్చి, నందివర్ధనం చెట్టు పక్కనుంచి

మా ఇంటి గుమ్మంకేసి తిరిగింది.

నమ్మశక్యంకాని ఈదృశ్యం చూసి నేను అవాక్కయ్యాను,

కొండకి కుర్చీ వేసాను, టీ కెటిల్‌ పొయ్యి మీద పెట్టాను.

 

జాగ్రఫీ పాఠం నేర్చుకోవటం గ్యారంటీగా చాలా కష్టం.

అట్లాసులో ఎర్రచుక్క, నీలం గీత, నల్ల గుర్తూ,

ఏవి ఎక్కడ ఉన్నాయా అని వెతికి వెతికి కళ్ళు వాచిపోయేవి,

క్లాసులో వెనకబెంచీలో కూచొని కునుకుతీస్తూ కలవరపడేవాణ్ణి.

 

ఎక్కడిదీ కొండ?

ఏదో పిక్‌నిక్‌ సందడి. కాళ్ళు అటూఇటూకొట్టుకొని, చెప్పులుచిరిగిపోయాయి,

నా ప్యాంటు చొక్కాకి  ఏదో ముళ్ళకంప తగులుకుంది.

గ్లాసులోకరిగిపోయింది కొండ, పంచదార క్యూబ్‌లా!

నాకు ఎంతోఏడుపొచ్చింది; జాగ్రఫీ పుస్తకంలో,

యాభైఐదో పేజీలో ఇద్దరు భారీ మనుషులు ఎవరెస్ట్ ఎక్కుతున్నారు.

 

ఇప్పుడు మెలుకువ వచ్చింది, నన్ను ఎవరో మోసగించారు.

నేను చిన్నప్పుడు పనస తోటలో చెట్లు ఎక్కటం

ఎందుకు నేర్చుకున్నాను? నిండు యవ్వనంలో

ఎందుకు కోరుకున్నాను, ఇంత భారం?

మీ మాటలు

 1. Bhavani Phani says:

  చాలా మంచి ప్రయత్నం సర్ , సౌభాగ్య కుమార మిశ్ర గారి మూల కవితా , వేలూరి వేంకటేశ్వర రావు గారి అనువాదమూ కూడా చాలా బావున్నాయి

 2. కె.కె. రామయ్య says:

  ఈ అరణ్యజనుల ఉచ్చులు తప్పించుకొని రా, మృగుణీ! … కవిత డా. సౌభాగ్య కుమార మిశ్ర ( కవితలకు కేంద్ర, ఒరిస్సా రాష్ట్ర సాహిత్య అకాడెమి అవార్డ్ లు అందుకున్న బెర్హంపూర్ యూనివర్సిటి రిటైర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ ) గారి పరిచయం, కవితల అనువాదాలు సంతోషం కలిగించాయి.

  సౌభాగ్య కుమార మిశ్ర గారి అయిదు దశాబ్దాలుగా ఒరియా కవితలలో కొన్నింటి అనువాదాల్ని పుస్తకంగా తీసుకురావాలని వేలూరి వేంకటేశ్వర రావు, వెనిగళ్ళ బాలకృష్ణ రావు గార్లు చేస్తున్న గొప్ప ప్రయత్నం కడు ప్రసంశనీయం.

 3. వేలూరి వేంకటేశ్వర రావు says:

  కొండ, ఆహ్వానం — ఈ రెండు తెలుగు అనుసృజనలకు ఒరియా మూల కవితలు, తెలుగు లిపిలో !

  — వేలూరి వేంకటేశ్వర రావు

  పాహాడ

  ముఁ త మహమ్మద్ పరి యాఇనాహిఁ పాహాడ పాఖకు
  ముఁ బి తాకు డాకినాహిఁ | రుమ్ మోర ఖోలాథిలా బోలి
  సే పశి ఆసిలా | యేబే అపరాహ్న ఆకాశు ఓహ్లాఇ
  టగర గఛఠు’ ఆమ ఘరయాకే బులాబులి కలా |
  ముఁ అసమ్భబ దృశ్యరే హతభమ్వ హోఇ పాహాడకు
  చౌకి దేలి ఓ చులిరే బసాఇలి చాహార కేటలి |

  భుగోళ పాఠ నిశ్చయ కష్ట భారి | ఆటలాస్ బహిరే కేఉఁఠి
  లాల్ దాగ , నేళి గార , కళా చిహ్న ఖోజి ఖోజి ఆఖి
  ఫులియాఏ ఓ క్ళాసర పఛబేఞ్చ నిద్రారే బిభోర |
  కేఉఁఠి పాహాడ఼ కేఉఁ పికనిక్ గహళి భితరే
  ఏపాఖసేపాఖ హోఇ ఛిణ్డియాఏ జోతార గోఇఠి ,
  కేఉఁ కణ్టాలటారే మో ప్యాణ్ట జామా యాఉచి అటకి |

  పాహాడ఼ మిళాఇగలా చినిదానా పరి గిలాసరే ,
  మో కాన్ధ లాగిలా భారి ఓ భుగోళ బహిర ఛపన
  పృష్ఠారే ది’ జణ లోక చఢుఛన్తి ఏభేరేష్ట్ | ఏబే
  జాణిలి ముఁ కిఏ మతే ధోకా దేలా | ఆహా ముఁ కాహిఁకి
  గఛచఢా శిఖిగలి పిలాదిను పణసతోటారే ,
  కాహిఁకి లోడిలి భరా యౌబనరే ఏతికి ఓజన |
  ఆమన్త్రణ

  లోకారణ్యర జాల ఫాశరు ముకుళి ఆసే మృగుణీ
  ఏ పార్థిబ ఖరాబేళటారే
  సిమేణ్ట్ బారణ్డా తాతి లాల్ ,
  అగ్నిర బళయ భితరు ఖసి ఆసి మృగుణీ
  ప్రార్థనార అనిశ్చయతారే ,
  పునరాయ స్మృతి , ఉఛిష్ట భక్షణే
  ఏ కుళ నాహిఁ సే కుళ నాహిఁ – క్షుధా దానబఙ్కర |

  నీళ మేఘర ద్వీపరే బి మృత్యు నాహిఁ మృగుణీ
  టేలిఫోన్ ర గురు గరజనే
  హాతీ నాహిఁ కి కుమ్భీర నాహిఁ మిళాఇ యాఅ మృగుణీ
  సన్న్యాసీ బా తస్కరర మృదు గుఞ్జనే |

  ఆమ అబిశ్వాసర పరిశిష్ట పాహాడచుళకు
  చఢి ఆసి మృగుణీ
  ఓహ్లాఇ ఆస ఆమ ఘాసర దౌరాత్మ్యకు
  అన్తతః దేఖి నేబ త
  పాదరు దిగన్త యాఏ బ్యాప్త సికతారే
  అసంఖ్య మైథునరత దేబదేబీ
  అఙ్గరే ఓ ఆలిఙ్గనరే

 4. కె.కె. రామయ్య says:

  సౌభాగ్య కుమార మిశ్ర గారి ఒరియా కవితల తెలుగు అనువాద పుస్తకం ఎప్పుడు వస్తుందండీ ?

 5. వేలూరి వేంకటేశ్వర రావు. says:

  జూలై మొదటి వారంలో అని అంచనా. మీ అబిమానానికి కృతజ్ఞతలు. — వేలూరి వేంకటేశ్వర రావు.

 6. కె.కె. రామయ్య says:

  శ్రీ వేలూరి వేంకటేశ్వర రావు గారూ, మీ గురించిన కొన్ని తలపోతలు, మీ ఇంటర్వ్యూ నుండి :
  ఆంధ్రా యూనివర్శిటీలో మీరు పి.జి చేసిన రోజుల్లో (1960 లో) చేకూరి రామారావు, జ్యేష్ట, బం.గో.రె. లతో స్నేహం; అబ్బూరి రామకృషారావు, రావిశాస్త్రి గారితో మీ సాహితీ సానిత్యం … ఆంధ్రా యూనివర్శిటీలో ఎం.ఎస్సీ అయ్యాక కొంతకాలం కటక్ కాలేజీ లో ఫిజిక్స్ పాఠం చెప్పటం …. అక్కడ కొంతమంది ఒరియా, బెంగాలీ సాహితీ మిత్రుల పరిచయం, అక్కడున్నప్పుడే కొంతకాలం ఇంగ్లీషు పొయిట్రీ రాయటం; 1968లో పై చదువులకై మీరు అమెరికా రావడం, … శ్రీ కె.వి.యస్. రామారావు గారు స్థాపించిన “ఈమాట” ఇంటెర్నెట్ పత్రికతో మీ అనుబంధం …. విశ్వనాథ, శ్రీశ్రీ, తిలక్, చాసో, శ్రీపాద, రావిశాస్త్రి మీ అభిమాన రచయతలు అని చెప్పటం …

  అమెరికాలో ఉన్న రచయితల్లో, నిడదవోలు మాలతి, పూడిపెద్ది శేషుశర్మ, కె.వి.ఎస్.రామారావు, మాచిరాజు సావిత్రి, ఆరి సీతారామయ్య, జె.యు.బి.వి ప్రసాదు, కె.గిరిధర రావు, వేమూరి వేంకటేశ్వర రావు, ఎస్. నారాయణ స్వామీ, చంద్రశేఖర్ కన్నెగంటి, చిట్టెన్ రాజు, అఫ్సర్, కల్పన రెంటాల, సత్యం మందపాటి, ఫణి డొక్కా, కలశపూడి శ్రీనివాసరావు, తాడికొండ శివకుమార శర్మ, ఇలా ఒక పెద్ద జాబితానే ఇవ్వగలను అనడం ..

  మీరు గాని, మీ మిత్రులు శ్రీ వెల్చేరు నారాయణరావు గారు గాని విలక్షణ కధకుడు విశాఖ త్రిపుర గారి గురించి ఏవన్నారో తెలుసుకోవాలనే ఓ కుతూహలం నాకు.

  వేలూరి వేంకటేశ్వర రావు గారితో ఇంటర్వ్యూ : http://pustakam.net/?p=13861

మీ మాటలు

*