ఆమె – మనము –  గుర్తుండని కాలం!

 

lakshmi

– సి.ఉమాదేవి

~

 

ఏదైనా కథ చదువుతున్నారా?ఆ సమయంలో ఎవరైనా మిమ్మల్ని పలకరిస్తున్నారా? ఆ…ఊ… మాత్రమే మీ సమాధానమా? అయితే అతను-ఆమె-కాలం చదువుతున్నారన్నమాటే! చదవడంలేదంటారా? అయితే ఈ విభిన్న కథారాగవిపంచిని మీటాల్సిందే! తప్పక చదవాల్సిన బహుమతి కథల మణిహారమే జి.యస్.లక్ష్మిగారి ‘ అతను-ఆమె-కాలం’ కథాసంపుటి. ఆమె రచించిన కథలు మనము చదవడం ప్రారంభించామా మరిక కాలం గుర్తుండదంటే అతిశయోక్తికాదు. చదివేకొలది మన మనసు పొత్తళ్లలో నిక్షిప్తమయేలా రచించిన కథలు ఓ వంక హాస్యలాలనగా,మరోవంక మానవతారాగాలాపనగా వెరసి సమకాలీన సమాజ గీతాలాపనగా మన ప్రక్కనే కూర్చుని మనిషి మనవలసిన విధమిదీ అని అనునయంగా చెప్తున్నట్లు కథనల్లడం లక్ష్మిగారికి వెన్నతోకాదు మనసుతో పెట్టిన విద్య.

ఉదాహరణకు వీరు రచించిన దాంపత్యం కథే తీసుకుందాం. ఎన్నో కుటుంబాలలో సాధారణంగా తారసపడే అంశం. అయితేనేం కథ నడిపిన తీరు మాత్రం అసాధారణం. అడుగడుగునా ఉత్సుకతలేపే సంభాషణా చాతుర్యం కథను పూర్తిగా చదివేదాకా కట్టిపడేస్తుంది. తరువాతయినా వదలిపెడుతుందా? ఊహూ! మనమెక్కడికెళ్తున్నా మనలోనే తిష్టవేసి మన మనసును చిలుకుతూనే ఉంటుంది. కథ వెంటాడటమంటే ఇదేమరి! భార్యంటే కేవలం అలంకరణతో నిండిన ఆహార్యానికే పరిమితమైన ఉత్సవవిగ్రహంలా భావించే భర్త రామేశం. భర్తలోని ఎంతటి కోపాన్నయినా,మాటల తూటాలనయినా భరించిన భార్య రాజేశ్వరి కాలక్రమేణా సహనం అసహనమై భర్తను విడిచి వెళ్లిపోతుంది. ఓదార్పు అందకపోతే శక్తికి మించిన ఓర్పు కూడా మున్ముందు  ప్రజ్వరిల్లే బడబాగ్నికి బీజమే! అయితే దాంపత్యబంధంలో గాలివాన కలకాలం నిలవకూడదు.పిల్లల పలకరింపు, సమర్థింపు ఇచ్చిన స్థైర్యంతో తన ఇంట మళ్లీ మహరాణిలా అడుగు పెడుతుంది రాజేశ్వరి.  భర్త మౌనంలో రాజీ ధోరణి ఆహ్వానించదగ్గ పరిణామమే. బంధంలోని అనుబంధానికి అద్దం పట్టిన కథ.

ఇక ‘చందమామ రావె’ కథ. ఒకనాటి బాల్యానికి చందమామ రావె అని అమ్మపాడే పాట నిత్యశ్రవణమే. కాని నేటి చిన్నారులకు అందివచ్చిన సాంకేతికత అనేక వరాలు కురిపిస్తూనే తెలియని శాపంగా కూడా పరిణమించడం బాధాకరం. అమ్మనాన్నలు ఆఫీసు పనులలో నిమగ్నమై బున్నీకి ఆశ అనే కేర్ టేకర్ ను నియమిస్తారు. బుర్రకే కాదు నోటికీ స్పూను ఫీడింగ్ చేసే ఆశ బున్నీలోని అసంతృప్తికి మరో భాష్యం చెప్తుంటుంది. బున్నీ చందమామ కావాలంటున్నడని ఆశ చెప్తే తమ బిడ్డ చంద్రుడిపై నడవాలనుకుంటున్నాడని సంబరపడతారు సాఫ్ట్ వేర్ తల్లిదండ్రులు. అయితే తమ బిడ్డకు చందమామ రావె అంటూ అమ్మ అందించే నోటిముద్దలు కావాలన్న నిజం తెలిసినపుడు వారికేకాదు మనకు మనసు చివుక్కుమంటుంది.

‘పాపం మాలతి’ అనే కథ అమెరికా జీవనవిధానంలో అగ్రభాగాన్ని ఆక్రమించుకున్న పెట్ పోషణకు సంబంధించినదే. పెట్స్ తో అనుబంధానికి అక్కడ పెద్దపీటే! నిజానికి పక్షులనుకాని పెంపుడు జంతువులను కాని పెంచుకోవడం సర్వసామాన్యమేయైనా అవసరార్థం వేరే ఎక్కడికైనా వెళ్లాల్సివస్తే పెంచుకున్నవాటి పోషణ కష్టమే. ఈ సన్నివేశంతో మాలతి పడ్డ అవస్థలను హాస్యస్ఫోరకంగా చిత్రీకరించిన కథ. తనకిష్టంలేకపోయినా ఇంటికి తెచ్చిన కుక్కపిల్లకు తోడు అనుకోకుండా హామ్ స్టర్స్ బాధ్యత మీదపడిన మాలతి వీటితోపడ్డ కష్టం ఆయాచితంగా వచ్చిన తకధిమే! బోనులోనే తలలు వేలాడేసిన హామ్ స్టర్స్ స్థానంలో వేరేవి వచ్చి చేరేవరకు మనకు గుబులే!

మనిషి ఆలోచనా సరళిలో ఎన్నో కోణాలుంటాయి.విభిన్నకోణాలలో జరిగే ఆలోచనా మథనం ఒకొక్కసారి అర్థవంతమైనా మరొక్కసారి అర్థరహితం కూడా అవుతుంటుంది. వృద్ధదంపతుల వ్యాహ్యాళికి వచ్చి పార్కులోనే గంటకు పైగా కూర్చుండిపోవడానికి  కారణం  కొడుకు కోడలి నిరాదరణే కారణమన్న నిర్ణయానికి వచ్చిన యువతి వారికి తాను అండగా నిలబడతానని, చేయూతనందిస్తానని తన వెనుకనున్న బలాన్ని వివరిస్తుంది. ఉద్యోగాలలో అలసి ఇంటికి వచ్చిన కొడుకు కోడలికి కాస్తయినా ఏకాంతం లేకపోతే పరస్పరం ఏదైనా ఎలా చర్చించుకుంటారన్న సహజమైన కారణాన్ని వివరించిన వృద్ధస్త్రీ మాటలు తానాలోచించిన కోణం ఎంత తప్పయిందో తెలుసుకుని ఆ వృద్ధులకు నమస్సులర్పిస్తుంది. ఇదే ‘నాణానికి మరోవైపు’ కథలో చెప్పినది.

కాస్త ఆలోచిస్తే కథ నిజంగా కాస్తకాదు, చాలా ఆలోచించాల్సిన కథ. అర్ధరాత్రయినా ఇంటికిరాక స్నేహితులతో బలాదూర్ తిరిగే కొడుకు చందును ఆవేశంతో చెంపపై కొట్టడమే కాదు ఇంట్లోకి రానివ్వనంటాడు తండ్రి . తండ్రి మాటలకు రోషం ఉవ్వెత్తున ఎగిసిన చందు ఇల్లు వదిలి వెళ్లిపోతాడు.ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.స్నేహితుడు రాజారాం ఇంట్లో రెండు రోజులున్నా రాజారాం తల్లిదండ్రులు తననెలాగైనా ఇంటికి పంపించే ఆలోచనలో ఉన్నారని గ్రహించి చిన్నగా ఆ ఇంటినుండి కూడా తప్పుకుంటాడు. తదుపరి చదువెలా అన్న మీమాంస, బ్రతకడమెలా అనే బ్రతుకు భయం పొటమరించినా ఇంటికి మాత్రం వెళ్లకూడదనుకుంటాడు.  బ్రతుకు రహదారిలో తన బాటనెలా నిర్మించుకోవాలో తెలియని చందు అనుకోకుండా మామయ్య దృష్టిలో పడతాడు. నడిరోడ్డుపై దొంగసొత్తు తనకు వదలి దొంగలు పారిపోతే దెబ్బలు తింటున్న చందును మేనమామ కాపాడి చందు ఆకలి తీర్చి తానేమి ఆరా తీయకుండానే చందు ద్వారానే విషయం తెలుసుకుంటాడు. చందులో రగిలే ఆకలి తీర్చడమే కాదు ఆలోచనలను రగిలిస్తాడు అతడి మామయ్య. కొడుకు ఆచూకీ తెలియని తల్లిదండ్రులకు చందు మేనమామ చందు వివరాలనందిస్తాడు. తనకోసం వచ్చిన తల్లిని ఆప్యాయంగా చుట్టుకుపోతాడు చందు. ఆ దృశ్యాన్ని చూసిన సూర్యం ముఖం కాంతివంతమవుతుంది. పనిలో పనిగా సూర్యానికి ఆవేశం తగ్గించుకోవాలని సున్నితంగా చెప్తాడుచందు మేనమామ. ఈ కథకు బహుమతి రావడం ముదావహం.నిజానికి పాఠకులకే ఈ కథ ఓ చక్కని బహుమతి.

ఇంకా జయహో వదినా ,వెఱ్ఱిబాగుల వదిన వ్రతకథ,ఇస్తినమ్మ వాయనం,డిజైనర్ ఫుడ్ వంటి చక్కటి హాస్యకథలు అలరిస్తాయి. తప్పక చదివి తీరవలసిన పుస్తకం అనడంలో సందేహం లేదు.

“అతను – ఆమె – కాలం” అనే ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలలోనూ  లభిస్తుంది. కినిగె.కామ్ లో ప్రింట్ బుక్, ఈ బుక్ కూడా లభిస్తాయి.

*

మీ మాటలు

 1. నిడదవోలు మాలతి says:

  బాగుందండి సమీక్ష మీకూ సుబ్బలక్ష్మిగారికీ అభినందనలు

  • ధన్యవాదాలు మాలతిగారు.మీకు నచ్చినందుకు సంతోషంగా ఉందండి.

 2. G.S.Lakshmi says:

  మీ సమీక్ష చదువుతుంటే నా కథలు మరీ బాగున్నట్టు అనిపించాయి ఉమాదేవిగారూ.. ఇంత చక్కని సమీక్షకు ధన్యవాదాలు..

 3. Choppa veerabhadrapp says:

  Manchi సలహా chavvalanivundi

 4. కె.కె. రామయ్య says:

  తప్పక చదివి తీరవలసిన పుస్తకం “అతను–ఆమె–కాలం” ను పరిచయం చేసి కినిగె.కామ్ నుండి పొందటానికి కారకులైన సి.ఉమాదేవి గారికి కృతజ్ఞతలు.

 5. ధన్యవాదాలు రామయ్యగారు.చక్కని పుస్తకాన్నిపొందినందుకు అభినందనలండీ.

 6. satyanarayana says:

  కొంత కాలంగా ,సారంగా పాఠకుడిని,
  ఎడిటోరియల్ బోర్డు కి కొన్ని సలహాలిద్దామని ,నా అభిప్రాయాలు తెలియ చేద్దామని ,సంపాదకుల ఇ-మెయిల్ అడ్రస్ కోసం వెదికాను ,ఎక్కడా కనిపించలేదు .
  కల్పనా రెంటాల గారికి ,అలాగే ఇతర సంపాదకులకి మెయిల్ చేయడమెలా ?
  చివరికి ,ఏమి చేయాలో తోచక, పాఠ కచేరి కాలమ్ లో వెదికి,
  ఇలా సంప్రదిస్తున్నాను ,
  సారంగా సారధుల,మెయిల్ అడ్రస్ ,ఎక్కడ ?
  నాకే కనిపించట్లేదా ?
  అసలు magazine కి ,అభిప్రాయాలు ఎలా పంపించాలి ?రచనలు ఏ అడ్రస్ కి పంపాలి ?

మీ మాటలు

*