“అమ్మా పిన్ని” ఇక లేదు!

 

-వంగూరి చిట్టెన్ రాజు

~

 

మే నెల 17, 2016…పొద్దున్నే ఫోన్. అంత పొద్దున్నే ఎవరా అని ఫోన్ అందుకోగానే “అమ్మా పిన్ని” పోయింది అనే వార్త. విని నిర్ఘాంత పోయాను. ఆవిడకి 92 ఏళ్ళు అనీ తెలుసు. గత ఐదారేళ్ళ గా డిమెంషాయా అనే అనారోగ్యంతో ఉన్నారనీ తెలుసును. కొన్ని రోజులగా డాకర్లు నిరాశ వ్యక్తంచేస్త్తున్నారు అనీ తెలుసును. అన్నీ తెలిసినా, ఎంత తెలిసినా, అప్పుడే తెలిసిన ఆ నిర్యాణ వార్తకి కళ్ళు చెమర్చాయి.

తెలుగు జానపదానికి, ఎంకి పాటలకి, లలిత సంగీతానికి “నేను సైతం గొప్ప గొంతుక”  అరువు ఇచ్చిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. కావడానికి ఆవిడ అవివాహిత. కానీ మా అందరికీ ఆవిడ “అమ్మా పిన్ని”. అక్కయ్య అనసూయా దేవి గారి పెద్ద కుమార్తె రత్న పాపని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటూ పాప ఇల్లే తన ఇల్లుగా గత పదేళ్ళకి పైగా హ్యూస్టన్ లో నివసిస్తున్నారు. విశేషం ఏమిటంటే సరిగ్గా అంతకు మూడు రోజుల ముందే పెద్దావిడ అనసూయ గారి 97 వ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. తెలుగు తిథుల ప్రకారం అనసూయ గారికి 100 ఏళ్ళు వస్తే సీత గారికి 97.

 

 

ఓ విధంగా చూస్తే సీత గారి జీవితంలో రెండు అధ్యాయాలు ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. మొదటిది సీత – అనసూయ …లేదా వింజమూరి సిస్టర్స్ …అనగానే తెలుగు జానపదమే మనసులో మెదులుతుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మేనగోడళ్ళు అయిన వారిద్దరూ 1930 దశకంలో ఆయన కవితలకీ, ఇతర భావకవుల గేయాలకీ బాణీలు కట్టి, సభారంజకంగా పాడుతూ దేశమంతటా తిరుగుతూ ఐదు దశాబ్దాల పాటు అఖండమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూనే మారుమూల పల్లెలలో దాగి ఉన్న జానపదాలని వేల సంఖ్యలో సేకరించి వాటికి సభా గౌరవాన్ని కలిగించిన జంట స్వరాలు.

 

ఎక్కడా స్వయం ప్రకటిత ఆర్భాటాలకి పోకుండా తన స్వరాన్నీ, సర్వస్వాన్నీ అక్క అనసూయా దేవికే అంకితం చేసిన ఆదర్శ సోదరి గా సీత గారికి గుర్తింపు కూడా వచ్చింది.  అతి చిన్నతనం లోనే వారి ప్రతిభకి ఇందుతో జత పరిచిన ఫోటో అద్దం పడుతుంది. ఈ ఫోటో 1934 నాటిది. అప్పుడు సీత గారి వయసు పదేళ్ళు.

220px-V_Seetha_Devi

ఆ నాటి “తెలుగు స్వతంత్ర” అనే పత్రికలో “మన మధుర గాయకులు” అనే శీర్షికలో ఈ అప్పచెల్లెళ్ళ గురించి ప్రచురించబడిన ఒక సమగ్ర వ్యాసంలో “ఆ నాటికి పన్నెండేళ్ళకి మించని ముక్కు పచ్చలారని వయస్సు, సభాసదులకి వెరవని ధైర్య స్థైర్యాలతో పెద్దమ్మాయి అనసూయ, తగిన మెళకువలతో చాకచక్యంగా వాయించుకునే హార్మొనీ, అక్క వేపే క్రీగంటి దృక్కులు నిముడ్చుకుని కీచుమనే సన్న గొంతుతో చిన్నమ్మాయి సీతాంబ వంత పాట – ఆ గానానికి ముగ్ధులు కాని వారు ఆ నాడు సాధారణంగా కంటిలో కలికానికైనా ఉండే వారు కాదు” అని మెచ్చుకున్నారు. కాలక్రమేణా సీత గారి గొంతు అసమానమైన శ్రావ్యత, వెల్వెట్ లాంటి మృదుత్వం సంతరించుకుని, దానికి అనువైన అయిన బాణీలు సమకూర్చుని తనదే అయిన గుర్తింపు తెచ్చుకున్నారు.

 

ఆ విధంగా 1930 వ దశకం నుండి అనేక దేశాలలో వేల కొద్దీ కచేరీలతో సాగిన సీత –అనసూయ ప్రస్థానం మూడు దశాబ్దాలు అద్వితీయంగా జరిగింది. తరువాత ఇప్పటి దాకా కొనసాగుతూనే ఉన్నా 1960 దశకంలో సీత గారు సమిష్టి కుటుంబ నివాసం అయిన మద్రాసు నుంచి చదువుల కోసం హైదరాబాద్ తరలి వెళ్ళడంతో ఆమె “సొంత గొంతుక” ఎక్కువగా వినపడడం ఆమె జీవితంలో రెండో అధ్యాయం అని చెప్పుకో వచ్చును.  తెలుగునాట సంగీతంలో మాస్టర్స్ డిగ్రీ అందుకున్న తొలి మహిళ గా వింజమూరి సీతా దేవి చరిత్ర సృష్టించారు. వెనువెంటనే 1963 లో ఆలిండియా రేడియో లో జానపద సంగీత విభాగానికి మొట్ట మొదటి మహిళా ప్రొడ్యూసర్ గా మరో చరిత్ర సృష్టించి 1984 లో పదవీ విరమణ చేశారు.

# 6

సీత గారి ఆధ్వర్యం లో రూపొందించబడిన కొన్ని వేల సంగీత కార్యక్రమాలు, రేడియో నాటికలు ఎంతో ప్రాచుర్యం పొంది ఆమెకి ఒక అగ్రశ్రేణి రేడియో ప్రయోక్త గా గుర్తింపు తెచ్చిపెట్టాయి. అంతే కాక వందల కొద్దీ ఔత్సాహిక గాయనీ గాయకులకి తన శిక్షణ ద్వారా స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఇవన్నే ఒక ఎత్తు అయితే 1980 లో విడుదల అయిన “మా భూమి” సినిమాకి సంగీత దర్శకురాలిగా సీతా దేవి ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.

యావత్ దేశంలోనే భారత దేశం సినిమాలకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన సత్యజిత్ రాయ్, మృణాల్ సేన్ ల తరువాత అటువంటి ఖ్యాతి తెచ్చుకున్న తొలి తెలుగు సినిమా “మా భూమి”. తెలంగాణా సాయుధ పోరాటం (1940-48) నేపధ్యంలో బి. నరసింగ రావు నిర్మించిన ఆ చిత్రంలో సీతా దేవి గారు ఐదు పాటలకీ స్మగీతం సమకూర్చారు. అందులో బండెనక బండి కట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లె వస్తవు కొడకో.. అనే పాట వినని, పాడుకోని తెలుగు వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. గద్దర్, సంధ్య, మోహన్ రాజు చేత ఆయా పాటలు పాడించడమే కాక మహా కవి శ్రీ శ్రీ గారి గేయాలకి బాణీలు కట్టి ఆ సినిమాలో ఎంతో సముచితంగా వాడుకున్నారు సీతా దేవి గారు. బెర్లిన్, కైరో, సిడ్నీ మొదలైన అనేక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టి వల్స్ లో ఈ చిత్రం ప్రదర్శించబడింది. ఆ తరువాత “మా ఊరి కథ” అనే సినిమాకి కూడా సీత గారు సంగీత దర్శకురాలు. ఆమె సేవలకి గుర్తింపు గా గృహ లక్ష్మి స్వర్ణ కంకణం మొదలైన వందలాది పురస్కారాలు అందుకున్న విదుషీ మణి మన వింజమూరి సీతా దేవి గారు.

anasooya - sitha - gruhalakshmi 1934

సీత గారితో నా మొదటి పరిచయం 1977 లో ఆమె మొదటి సారి అమెరికా వచ్చినప్పుడు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా ఆమెకి నేనూ, మా ఆవిడ, మా పిల్లలూ అంటే ఎంతో ఆప్యాయత. నేనే కాదు. ఎవరైనా సరే అందరినీ అదే ఆప్యాయత తో పలకరించి కబుర్లు చెప్పే వారు. ముఖ్యంగా ఆవిడ హ్యూస్టన్ లో ఉన్నప్పుడు ఎప్పుడు మా తెలుగు సాంస్కృతిక సమితి కార్యక్రమాలు జరిగినా సంగీతం కార్యక్రమాలని సొంతం చేసుకుని తన అసమాన అనుభవంతో అందరికీ మంచి పాటలు నేర్పి ఆయా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించే వారు. ఆవిడ నిస్వార్థ సేవలకి మేము అందరం ఎంతో ఋణపడి ఉన్నాం.

 

సీత గారు మంచి రచయిత్రి. జాన పదాలు, ఎంకి పాటలు, స్త్రీల పాటలు మొదలైన పుస్తకాలు తెలుగులోనూ, అందరూ నేర్చుకుని పాడుకోడానికి వీలుగా ఇంగ్లీషు లోనూ సంగీతం నోటేషన్ తో సహా ప్రచురించారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప గాయని, రేడియో ప్రయోక్త, సంగీతం టీచర్ గా తన సుదీర్ఘ జీవితంలో వేలకొద్దీ కళాకారుల, సంగీత ప్రేమికుల గౌరవాభిమానాలని పొందిన అమర గాయని మా అందరి “అమ్మా పిన్ని”, డా. వింజమూరి సీతా దేవి గారికి వ్యక్తిగతంగానూ, అశేష అభిమానుల తరఫునా నివాళి అర్పిస్తున్నాను.

*

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

 1. Uma Kosuri says:

  Very beautiful heart touching article – Raju garu… memories of the famous Lady Amma-Pinni…
  We can never forget her.. a very affectionate person, a famous personality …
  We all love her dearly…
  May her soul rest in peace..
  Thank you for sharing such a beautiful biography of a beautiful Lady… Our beloved Seetha Aunty…

  ఉమా భారతి కోసూరి…

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   ధన్యవాదాలు, ఉమా గారూ

 2. sudhama says:

  సముచిత అక్షర నివాళి

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   ధన్యవాదాలు, మహాశయా

 3. గంటి లక్ష్మీనారాయణ మూర్తి. says:

  చాలా బాగుంది మీ నివాళి.

 4. Lalitha P says:

  మీ నివాళి, అందించిన ఫోటోలు బాగున్నాయండీ.. ధన్యవాదాలు. జానపద సంగీతానికి ఎంతో సేవ చేసిన సీతా అనసూయల మొత్తం వర్క్స్ పుస్తకాల రూపంలో దొరుకుతున్నాయా?

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   వారి పాటలు పుస్తకాలు, ఆడియోలు వగైరా చాలా చోట్లే ఉన్నాయి. ఉదాహరణకి మధురవాణి.కామ్ అనే పత్రిక తాజా సంచికలో సీత -అనసూయ పాటలు వినవచ్చును.

 5. Sai Rachakonda says:

  రాజుగారూ, వింజమూరి సీత గారు తెలుగు జానపద సాహిత్య చరిత్రని స్రుష్టించిన ఇద్దరు అసాధారణ మహిళలో ఒకరు. మా అమ్మ నా చిన్నతనంలో ఆవిడ గురించి చెబుతూంటే విన్న అద్రుష్టం నాది. చాలా చక్కని నివాళి. ధన్యవాదాలు.

  శాయి

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   ఆ విధంగా మీరూ, నేనూ చాలా అదృష్టవంతులం. మీ స్పందనకి ధన్యవాదాలు.

 6. Buchireddy gangula says:

  Excellent ..నివాళి రాజు గారు
  =====================
  బుచ్చిరెడ్డి గంగుల

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   ధన్యవాదాలు, మిత్రమా…

 7. కె.కె. రామయ్య says:

  బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప గాయని, రేడియో ప్రయోక్త, “మా భూమి” సినిమా సంగీత దర్శకురాలు డా. వింజమూరి సీత గారికి మీ నివాళి గొప్పగా ఉంది చిట్టెన్ రాజు గారూ. ధన్యవాదాలు.

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   ధన్యవాదాలు, రామయ్య గారూ

 8. నిరుపమానం
  నివాళి .
  ధన్యవాదాలు .

 9. Mana మధుర గాయకులు శీర్షిక లో telugu స్వతంత్ర లో anasuyadevi , సీతాదేవి ల గురించి 4 సెప్టెంబర్ 1953 నాటి సంచికలో సారంగదేవ పేరుతో రాసినవారు బాలాంత్రపు రజనీకాంతరావు గారు. ఆయన ఇప్పుడు తన 101 వ ఏట బెజవాడ లో కొడుకు దగ్గర వుంటున్నారు,
  సీత అనసూయల గార్లను ఈతరం వారికి పరిచయం చేసిన చిట్టెన్రాజు కు ధన్యవాదాలు

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   ధన్యవాదాలు, సార్

   రజని గారు నాకు కూడా బాగా తెలుసు. 1994 లో అమెరికా తెలుగు వారి తరఫున ఆయనకి విజయవాడలో సత్కారం చేసే అదృష్టం నాకు దక్కింది. ఆ తరువాత నా “అమెరికామెడీ కథలు” పుస్తకావిష్కరణ కి ఆయన వచ్చి మాట్లాడారు.

 10. ‘మా భూమి’, ‘మా వూరికథ’ చిత్రాల సంగీత దర్శకురాలి గురించిన మీ నివాళి హృదయాన్ని స్పృశించింది. సీతాదేవి గురించి వినడమే కానీ, ఆమె గురించి ఏమీ తెలీని నాలాంటివాళ్లకు మీ వ్యాసం ఆ లోటు కొంతవరకైనా తీర్చింది. అభినందనలు.

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   మీ స్పందనకి ధన్యవాదాలు.

 11. శ్రీనివాసుడు says:

  ఆర్యా,
  **ఆ తరువాత “మా ఊరి కథ” అనే సినిమాకి కూడా సీత గారు సంగీత దర్శకురాలు**
  ఈ పేరుతో తెలుగు సినిమా ఏదైనా వున్నదా? పేరు సరి కాదేమోనని నా భావన.

 12. శ్రీనివాసుడు గారూ, మీ సందేహం నిజమైందే. ఇప్పుడే నేనూ పరిశీలించాను. ఆ పేరుతో సినిమా లేదు. మృణాల్‌సేన్ ‘ఒక ఊరికథ’ (1978)ను తీశారు. దానికి విజయ రాఘవరావు సంగీతం అందించారు. ‘మా ఊరికథ’ అనే సినిమా గురించి చిట్టెన్‌రాజుగారే చెప్పాలి.

 13. శ్రీనివాసుడు says:

  యజ్ఞమూర్తిగారూ!
  vbsowmya.వర్డుప్రెస్సు డాట్ కామ్ అనే జాలగూటిలో ఒక ఊరి కథకు జానపద బాణీలు కట్టింది ఈవిడేనని వున్నది.
  *********************
  వింజమూరి సీతాదేవి (1924 – ) : జానపద సాహిత్యం గురించి విశేష కృషి చేశారు. దక్షిణ భారతదేశాంలో జానపద సంగీతానికి సంబంధించిన తొలి మహిళా ప్రొడ్యూసర్ వింజమూరి సీతాదేవి. ఆంధ్రదేశమంతా తిరిగి జానపద పాటలని సేకరించి, యాస చెడకుండా పాడేవారట. “మాభూమి” చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. “ఒక ఊరి కథ” చిత్రానికి కూడా జానపద బాణీలు సమకూర్చారు. ఎన్నో అవార్డులు, బిరుదులు అందుకున్నారు. పుస్తకాలు రాసారు. ఈవిడ ముందు టపాల్లో ప్రస్తావించిన వింజమూరి వెంకటరత్నమ్మ గారి పుత్రిక, మరొక టపాలో ప్రస్తావించిన వింజమూరి అనసూయ గారి సోదరి.
  *********************
  మన మధుర గాయకులు – వింజమూరి అనసూయాదేవి, సీతాదేవి
  “తెలుగు స్వతంత్ర” వారపత్రికలో “మన మధురగాయకులు” శీర్షికన (ప్రెస్ అకాడమీ సౌజన్యం) vinjamuri anasuya devi వింజమూరి అనసూయాదేవి, sitadevi సీతాదేవి గార్ల గురించి ప్రచురించిన ఒక వ్యాసం చూడండి. చివరగా వ్యాసంలో ఉదహరించిన “పల్లకీ పాట” అనసూయాదేవి గారి గళంలో వినండి. devulapalli krishna శాస్త్రి
  http://sobhanaachala.blogspot.in/2013/09/blog-post.html

  • శ్రీనివాసుడు గారూ, ‘ఒక ఊరికథ’లో జానపద బాణీలు సీతాదేవిగారు కట్టింది నిజమేమో తెలీదు. అయితే ఆ సినిమా పోస్టర్‌లో ఆమె పేరు లేదు. విజయ రాఘవరరావు పేరు మాత్రమే ఉంది. చూడండి.
   http://telugucineblitz.blogspot.in/2011/08/oka-oori-katha-1978.html

   • శ్రీనివాసుడు says:

    యజ్ఞమూర్తి గారూ!
    ఆలస్యంగా స్పందించడానికి కారణమేమంటే ‘‘ఒక ఊరి కథ’’ ముచ్చట తెలుసుకోవాలని ప్రయత్నించాను. నాకున్న పరిమితమయిన వనరులతో అది సాధ్యంకాలేదు.
    అయితే, ఒకటి మాత్రం సత్యం. ఆ సినిమా సంగీతానికీ, వింజమూరి సీతమ్మగారికీ ఏదో సంబంధం వుంది. అందుకే, నేను వెతికిన రెండు మూడుచోట్లా ఆవిడ ప్రస్తావన వున్నది. ఇంతమందీ కూడా చెబుతున్నారు కదా.
    ఈ ముచ్చటని మనకు చెప్పాలంటే ఆ సినిమాకు పనిచేసిన యండమూరిగానీ, లేదా ఇతర కళాకారులు, సాంకేతిక నిపుణులుగానీ అర్హులు.
    ఆ సినిమా అంతర్జాలంలో వెతికేనుగానీ దొరకలేదు.
    ఒక లంకెలో లభ్యమవుతున్నదిగానీ నా అంతర్జాల అనుసంధానం అంత వేగవంతమయినది కాకపోవడం మూలాన దానిలో చూడ్డం సాధ్యపడలేదు.
    ఇక చలనచిత్ర విజ్ఞాన పండితులు, లేదా సీతమ్మగారి సహచరులు చెప్పవలసిందే.

 14. రాజు గారు, జనపదాలకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సీతాదేవి గారికి చక్కటి నివాళి!!

 15. మీ జ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు, సీతమ్మ పిన్ని గారికి నివాళులిస్తూ ..
  ధన్యవాదాలు
  ఉమా పోచంపల్లి గోపరాజు

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   మీ స్పందనకి ధన్యవాదాలు, ఉమ గారూ

 16. Aranya Krishna says:

  ధన్యవాదాలు చిట్టెన్ రాజు గారూ! మీ రైటప్ ఎంతో ఆర్తిని కలిగించాయి.

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   ధన్యవాదాలు అరణ్య కృష్ణ గారూ

మీ మాటలు

*