అతని లానే మరొకడు…!    

 

స్లీమన్ కథ-33

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

స్లీమన్, దార్ఫెల్త్ ఇద్దరూ నాప్లియోలో మకాం పెట్టారు. సూర్యోదయానికి ముందే లేచి స్లీమన్ సముద్రస్నానానానికి వెళ్లడం, పదినిమిషాలసేపు ఈత కొట్టడం మామూలే. ఆ తర్వాత ఇద్దరూ కలసి అక్కడికి పాతిక నిమిషాల దూరంలో ఉన్న టిర్యిన్స్ కు గుర్రం మీద వెళ్ళేవారు. ఉదయం ఎనిమిదికి తొలి విరామం. అక్కడి బ్రహ్మాండమైన రాతి వసారాల నీడలో పనివాళ్లు అల్పాహారం తీసుకునేవారు. సూర్యాస్తమయంవరకూ పని జరిగేది. ఆ తర్వాత ఇద్దరూ నాప్లియోకు తిరిగివెళ్ళేవారు.

జూన్ వరకూ తవ్వకాలు కొనసాగాయి.  హోమర్ వర్ణించిన ప్రాసాదం తాలూకు మొత్తం ప్రణాళిక అంతా వేసవి తొలి రోజుల్లోనే బయటపడింది. ఆ భారీ దుర్గం ఒక సున్నపురాతి కొండ మీద నిలబడి ఉంది. కింద చిత్తడి మైదానం. పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించిన పైకప్పుతో వసారాలు అనేక తరాలుగా గొర్రెల దొడ్లుగా ఉపయోగపడుతూ వచ్చాయి. గొర్రెల రాపిడికి కొన్ని చోట్ల రాళ్ళు నునుపుతేలాయి. ఈ రాతి కట్టడాలను దర్శించిన పసన్నియస్, ఎన్ని కంచరగాడిదలతో లాగించినా వీటిలో చిన్న రాయిని కూడా కదిలించలేరని రాశాడు. మైసీనియాలో లానే ఇక్కడా పసన్నియస్ రాతలను స్లీమన్ పరమప్రమాణంగా తీసుకున్నప్పటికీ, ఆయన రాతకు భిన్నంగా అనేక చిన్న చిన్న రాళ్ళను పనివాళ్ళ చేత సునాయాసంగా తీయించగలిగాడు.

మరుసటి వేసవిలో టిర్యిన్స్ ను మరోసారి సందర్శించాడు. ఒక బాలుడు తామ్రవర్ణంలో ఉన్న ఒక ఎద్దు మీదికి గెంతుతున్నట్టు ఉన్న ఒక చక్కని కుడ్యచిత్రం, రేఖాగణితనమూనాలో ఉన్న మరో చిత్రం తాలూకు అవశేషాలు, అసంఖ్యాకమైన నీలిరాతి బొంగరం ఆకృతులు, లావా కత్తులు, బాణపు మొనలు కనిపించాయి. అరంగుళం వెడల్పు మాత్రం ఉన్న ఒక బంగారు గొడ్డలి తప్ప మరెంలాంటి బంగారు వస్తువులూ దొరకలేదు.

టిర్యిన్స్ పేరుతో అతను రాసిన పుస్తకం 1886లో ప్రచురితమైంది. ట్రాయ్ పై అతను రాసిన చివరి పుస్తకంలానే ఇది కూడా నిరాశగొలిపింది. తన రాతను తవ్వకాలలో లభించిన వస్తువుల వర్ణనతో సరిపెట్టి, బయటపడిన భారీ కట్టడాల గురించిన చర్చను దార్ఫెల్త్ కు విడిచిపెట్టాడు. ఇక్కడ దొరికిన అనేక మృణ్మయ కలశాలు, ట్రాయ్, మైసీనియాలలో దొరికిన వాటికంటే అభివృద్ధి చెందిన శైలిని సూచిస్తున్నాయి. మెలి తిరిగిన కొమ్ములతో ఉన్న ఒక భారీ  వృషభచిత్రం ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేసింది. ఇటువంటి వృషభచిత్రాలే ఆ తర్వాత నోసస్ తవ్వకాలలోనూ బయటపడ్డాయి. టిర్యిన్స్ వృషభాన్ని కూడా క్రీటు కళాకారుడే చిత్రించి ఉండడానికీ అవకాశం ఉంది. అయితే, స్లీమన్ కాలానికి గ్రీసు ప్రధానభూభాగంపై క్రీటు సంస్కృతి ప్రభావాన్ని ఎవరూ గమనించలేదు. మైసీనియా, టిర్యిన్స్ గిరిదుర్గాలను ఫినీషియన్లు1 నిర్మించి ఉంటారని స్లీమన్ భావిస్తూ వచ్చాడు. సుదూర పురాచరిత్రకాలంలో గ్రీసు, ఏజియన్ దీవుల్లోకి, అయోనియన్ సముద్రంలోకి ఫినీషియన్లు పెద్ద ఎత్తున చొచ్చుకువచ్చారనీ;  క్రీ.పూ. 1100 ప్రాంతంలో డోరియన్ 2 ఆక్రమణదారులు తరిమికొట్టేవరకూ ఈ ప్రాంతాలలో వారి ఆధిపత్యం కొనసాగిందనీ పురాచరిత్రనిపుణులు భావించారు.

220px-Charles_George_Gordon_by_Freres

గోర్డాన్

స్లీమన్ గట్టిగా విశ్వసిస్తూ వచ్చిన సిద్ధాంతాలలో వీరయుగం అంతరించిందన్నది ఒకటి. పురాతన గ్రీసు వీరులలోనే వీరత్వం అసాధారణస్థాయిలో నిండి ఉండేదనీ, ఆ తర్వాత అంత ప్రగాఢంగా మరెక్కడా, మరెప్పుడూ అది పరిమళించలేదనీ అతను నమ్మేవాడు. ట్రాయ్, మైసీనియాలు మహితాత్ములు నడయాడిన భూములనీ, అనంతరకాలంలో  ప్రపంచం అల్పజీవులు, అంగుష్టమాత్రుల పాలబడిందని అనుకునేవాడు.3 అయితే అతని దృష్టిలో ఈ కాలంలోనూ కొన్ని మినహాయింపులు లేకపోలేదు. 1881 మార్చిలో నిహిలిస్టుల 4 చేతిలో హతుడైన జార్ చక్రవర్తి అలెగ్జాండర్ –II ను 5 వెనకటి ప్రామాణిక వీరుల తెగకు చెందినవాడిగా భావించేవాడు. అంతకంటే ఉజ్వలోదాహరణగా జనరల్ గోర్డన్ 6 ను స్మరించుకునేవాడు. సూడాన్ లో అతను గడించిన అదృష్టాలను స్లీమన్ ఎంతో ఆసక్తితో గమనిస్తూవచ్చాడు.

స్లీమన్, గోర్డన్ ల మధ్య ఎన్నో పోలికలున్నాయి. ఇద్దరూ మొండి ధైర్యమూ, తమపట్ల తమకు అచంచల విశ్వాసమూ ఉన్నవారే. భూమిలో నిక్షిప్తమైన వస్తువుల పట్ల, విచిత్రంగా ఇద్దరిలోనూ ఒకేవిధమైన ఆసక్తి. హోమర్, పసన్నియస్ లపట్ల తిరుగులేని నమ్మకం ఉన్న స్లీమన్ భూమిలో కప్పడిన ట్రాయ్, మైసీనియా, టిర్యిన్స్ నగరాలను వెలికితీశాడు.  బైబిల్ లోని ఉత్తేజిత వచనాలను ప్రగాఢంగా విశ్వసిస్తూ పవిత్రభూమి(Holy Land) అంతటా సంచరించిన గోర్దన్;  తను గల్గత(Golgota), గిబియన్(Gibeon), గార్డెన్ ఆఫ్ ఈడెన్ ల వాస్తవిక ఉనికిని కనుగొన్నానని నమ్మాడు. ఇద్దరూ తమవైన ఏకాంతదుర్గంలో,  తమను నేరుగా ప్రభావితం చేసిన రచనలను మాత్రమే చదువుతూ గడిపినవారే. ఇద్దరూ ఒకేలా సమకాలీన నాగరికతతో ఇబ్బంది పడుతూ; తమను పురాతనజీవులుగా, తిరిగిరాని గతానికి చెందినవారిగా భావించుకుంటూ తమ తమ స్వాప్నికప్రపంచాలలో జీవించినవారే. భవిష్యత్తు గురించిన ప్రశ్న తలెత్తినప్పుడల్లా గోర్డన్ బైబిల్ అందుకుని ఏదో ఒక పుటను తెరిచి చూసేవాడు. అందులో భవిష్యచిత్రం అతని కళ్ళకు స్పష్టంగా కనిపించేది. సరిగ్గా అలాంటి సందర్భాలలో  స్లీమన్ కూడా హోమర్ ను తెరచి చూసేవాడు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలిగిన వ్యక్తులు వాళ్ళిద్దరూ.

స్లీమన్ దృష్టిలో గోర్డన్ తన కాలపు నిజమైన వీరుడు. ఇంకా చెప్పాలంటే, తన కాలపు హెక్టర్. సూడాన్ రాజధాని ఖార్టూమ్ లో గోర్డన్ విడిసి ఉన్నప్పుడు మాదీ(Mahdi) 7గా తనను ప్రకటించుకున్న మహమ్మద్ అహ్మద్ అబ్ద్ అల్లాహ్ (1884-1885) సేనలు అతన్ని ముట్టడించాయి. గోర్డన్ బలగానికి ఆహారం, ఇతర నిత్యావసరాలు అందకుండా చూశాయి. మరోవైపు తుపాకీ మందు తరిగిపోతుంది. తామున్న భవంతి కిటికీలకు ఇసుకబస్తాలతో రక్షణ కల్పించమని గోర్డన్ కు సహచరులు విజ్ఞప్తి చేశారు. గోర్డన్ తిరస్కరించాడు. అందుకుబదులు ఒక కిటికీ వద్ద ఇరవైనాలుగు కొవ్వొత్తులు వెలిగించిన ఒక లాంతరును ఉంచమని ఆదేశించాడు. అప్పుడు అతను అన్నాడు: ”భగవంతుడు భయాన్ని ఒక్కొక్కరికే పంచుతూ వెళ్ళాడు. నా వంతు వచ్చింది. తీరాచూస్తే, నాకు పంచడానికి భయం కాస్త కూడా మిగలలేదు. కనుక గోర్డన్ దేనికీ భయపడడని వెళ్ళి ఖార్టూమ్ ప్రజలకు చెప్పండి.”

మహమ్మద్ అహ్మద్

మహమ్మద్ అహ్మద్

1885 ఫిబ్రవరి 3న మాదీ, అతని సహచరులు గోర్డన్ ఉన్న భవంతిని సమీపించారు. సూర్యోదయానికల్లా అతని సేనలు నగరం మొత్తాన్ని కమ్మేసాయి. గోర్డన్ కరవాలం చేతబూని భవంతి మెట్ల దగ్గర శత్రువుల రాకకు నిరీక్షిస్తూ నిలబడ్డాడు. శత్రువుపై విరుచుకుపడి అద్భుతంగా పోరాడాడు. చివరికి ఆ మెట్ల దగ్గరే, పీనుగుల కుప్ప మధ్య ప్రాణాలు వదిలాడు. అతని తల నరికి ఒక వస్త్రంలో చుట్టి మాదీకి కానుకగా ఇచ్చారు. దానిని ఒక చెట్టు కొమ్మకు వేలాడదీయమని మాదీ ఆదేశించాడు. ఆ రక్తపంకిలమైన శిరసు చుట్టూ కొన్ని రోజులపాటు రాబందులు తిరిగాయి.

తను ఎథెన్స్ లో ఉంటూనే మధ్యధరాసముద్రానికి ఆవల, ఖార్టూమ్ లో జరుగుతున్న పరిణామాలను స్లీమన్ ఆందోళనతో గమనిస్తూ వచ్చాడు. గోర్డన్ మరణం అతన్ని తీవ్రంగా కుంగదీసింది. జీవించి ఉన్నవారిలో తను అమితంగా అభిమానించి ఆరాధించినది గోర్డన్ నే. అప్పటి ప్రధానమంత్రి గ్లాడ్ స్టన్ చేసిన ఒక అనూహ్యమైన పొరపాటే గోర్డన్ విషాదమరణానికి దారి తీయించిందని రాణి విక్టోరియా సహా యావత్ బ్రిటిష్ ప్రజలూ నమ్మారు. గోర్డన్ కు అండగా సకాలంలో అదనపు బలగాలను పంపడంలో గ్లాడ్ స్టన్ విఫలమయ్యాడని ఆరోపణ.  స్లీమన్ కు గ్లాడ్ స్టన్ బాగా తెలిసినవాడే. తన మైసీనియా కు సుదీర్ఘమైన ఉపోద్ఘాతం రాసింది ఆయనే. తనను 10 డౌనింగ్ స్ట్రీట్ లోని తన నివాసానికి ఆహ్వానించి విందు ఇచ్చింది ఆయనే. కానీ తన ఆరాధ్యవీరుడు గోర్డన్ మరణానికి కారణమైన గ్లాడ్ స్టన్ పొరపాటును స్లీమన్ క్షమించలేకపోయాడు. అతనిపట్ల ఆగ్రహంతో వణికిపోయాడు. తన అధ్యయన కక్ష్యలో ఉంచిన అతని సంతకంతో ఉన్న ఫోటోను నేలమీదికి విసిరికొడదామా, లేక చించి పారేద్దామా అనుకున్నాడు. చివరికి తీసుకెళ్లి పాయిఖానాలో ఉంచాడు.

నోసస్ స్థల యజమానితో బేరం కుదరక ఎథెన్స్ కు తిరిగివచ్చినా క్రీటు తవ్వకాలపై దీర్ఘకాలికప్రణాళికను రచించుకుంటూ, మధ్యలో తిరిగి ట్రాయ్ దారి పడితే ఎలా ఉంటుందని అనుకుంటూ, ఇంకోసారి ఇథకా వెడితే మంచిదా అని భావిస్తూ గడిపాడు. ఇవేవీ కాక, ఓసారి పారిస్ వెళ్ళి తన ఇళ్ల పరిస్థితిని చూసొస్తే బాగుంటుందా అని కూడా అనుకున్నాడు. కానీ ఇవేవీ చేయకుండానే రోజులు దొర్లించాడు. వృద్ధాప్యం, అలసిపోయిన భావన  కమ్ముకుంటున్న కొద్దీ అతను తనలోకి తాను అదృశ్యమైపోతూ వచ్చాడు. రోజంతా, అర్థరాత్రివరకూ హోమర్ పఠనమే. అదొక మత్తుమందుగా మారింది. అదొక్కటే అతన్ని బుద్ధిమాంద్యంలోకి నెట్టకుండా మానసికస్వస్థత కల్పిస్తూవచ్చింది. ఇప్పుడూ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు కానీ, దస్తూరీలో వణకు కనిపిస్తోంది. రాను రాను అతని రాతల్లో అఖియన్లను శాపనార్థాలు పెట్టే  ట్రోజన్ వీరుల గొంతు ధ్వనిస్తోంది. కాకపోతే, హోమర్ వీరుల నోట ప్రవహించిన ఆ అద్భుత శాపనార్థాలు ఒక పిరికి ప్రొఫెసర్ ను తలపించే ఈ వ్యక్తి నోట వినిపించడమే ఆసక్తికరం.

అయితే, వృద్ధాప్యం మీదపడుతున్నా స్లీమన్ లో వెరపు మచ్చుకైనా లేదు. తన మహత్తర పరిశోధనలకు ఇవ్వవలసిన గుర్తింపు ఇవ్వకపోయినా, లేదా అరకొరగా గుర్తించినా ఇప్పటికీ ఆగ్రహాన్ని కుమ్మరిస్తూనే ఉన్నాడు. కెప్టెన్ బాటిషర్(Bottischer) అనే అతను హిస్సాలిక్ పై ఒక వ్యాసం రాస్తూ, అది ఒక పెద్ద దహనవాటిక అనీ, బహుశా పర్షియన్లకు చెందిందనీ అన్నాడు. దానిని హాస్యాస్పద సిద్ధాంతంగా పేర్కొని తుత్తునియలు చేయడానికి స్లీమన్ రీముల కొద్దీ కాగితాలు వెచ్చించాడు. చిన్నపాటి విమర్శకు కూడా గాయపడిన సింహంలా గర్జించే అలవాటు అతనికి ఇప్పటికీ పోలేదు. స్లీమన్ ఏదో అంకితం ఇవ్వజూపినప్పుడు మెక్లెమ్బర్గ్ పాలకుడు(Grand Duke) అందుకు స్పందించకపోవడంతో అతను తీవ్రనిరసన రంగరిస్తూ ఒక తంతి పంపించాడు. మంచి పేలుడుమందు దట్టించినట్టు ఉండే తంతులు పంపించడం అతనికి ముందునుంచీ అలవాటే. దాంతో స్లీమన్ గౌరవార్థం మెక్లెంబర్గ్ పాలకుడు ఒక స్వర్ణపతకాన్ని జారీచేసి అతనితో సంధి చేసుకున్నాడు.

మధ్యలో కొన్ని మాసాలపాటు స్లీమన్ పురావస్తుపరిశోధనలను పక్కన పెట్టేసి తిరిగి వ్యాపారవేత్తగా అవతారమెత్తాడు. తన ఆస్తులు, పెట్టుబడులు భద్రంగా ఉన్నాయో లేదో చూసుకోడానికి ప్రపంచపర్యటన ప్రారంభించాడు. క్యూబాలో తనకు భారీ ఎస్టేట్లు ఉండడంతో హవానా సందర్శించాడు. అలాగే, మాడ్రిడ్, బెర్లిన్ లలో ఉన్న తన ఆస్తుల్ని చూసుకోడానికి ఆ దేశాలకు వెళ్ళాడు. పనిలోపనిగా వెళ్ళిన ప్రతిచోటా  ట్రాయ్ పై తన సిద్ధాంతాలను బలపరచుకుంటూ ఉపన్యాసాలు చేశాడు. తనకున్న ధనబలంతో అనుకున్నదే తడవుగా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లగలిగే అవకాశాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాడు.

శారీరకంగా అతనిలో మార్పు వస్తోంది. చెవిపోటు రాను రాను దుర్భరంగా మారుతోంది. ఒక్కోసారి పెదవులు బాధతో మెలితిరుగుతున్నాయి. మాట నట్టుతోంది. ఆహారనియమాలను మరింత కచ్చితంగా పాటించవలసివస్తోంది. చీకటితోనే నిద్రలేవడం, సముద్రస్నానం చేయడం, మూడు గుడ్లు, ఒక కప్పు టీ తో ఉదయపు అల్పాహారం, ఆ తర్వాత వార్తాపత్రికలు, స్టాక్ ఎక్స్ఛేంజ్ నివేదికలు చదవడం,  ఉత్తరాలు రాయడం; హోమర్ తోపాటు సోఫొక్లీస్ లేదా యురిపిడీస్ ల నుంచి మూడేసి వందల పంక్తులు వల్లించడం(ప్లేటోను చాలా అరుదుగా చదివేవాడు, అరిస్టాటిల్ ను అసలు చదివేవాడు కాదు), ఆతర్వాత మధ్యాహ్నభోజనం, కాసేపు నడక, సాయంత్రంవరకూ పూర్తిగా అధ్యయనం, సాధారణంగా సాయంత్రాలు సందర్శకులతో గడపడం, రాత్రి పదిగంటలకు పడక. ఇదీ అతని నిత్యకృత్యం. రాత్రిళ్ళు తరచు నిద్రపట్టేదికాదు. దాంతో రాత్రంతా చదువుతూనే గడిపేవాడు.

వృద్ధుడవుతున్న కొద్దీ నిద్రలో వచ్చే కలలను పట్టించుకునే చాదస్తం పెరిగింది. వాటిని జాగ్రత్తగా విశ్లేషించేవాడు. సోఫియాకు కలలో కాకులు, చిక్కుడు కాండం, విదేశీ సందర్శకులు కనిపించినట్టు తెలిస్తే విపరీతంగా ఆందోళన చెందేవాడు. 8 పురాతన దేవతల ఆధికారిక వాణిని, స్వప్నవిశేషాలను హోమర్ పదే పదే ఉగ్గడించాడు. స్లీమన్ పై వాటి ప్రభావం ఉంది. వయసు మీరుతున్న ఈ దశలో అతను క్రమంగా బాహ్యప్రపంచం నుంచి ఆంతరికప్రపంచంలోకి జారుకుంటూవచ్చాడు.

శరీరం దుర్బలమవుతోంది. చెవిపోటు నానాటికీ తీవ్రమవుతోంది. యూరప్ శీతగాలులు దుస్సహం అవుతున్నాయి. దాంతో మిగిలిన శీతాకాలాలు దక్షిణాదిన గడపడానికి నిర్ణయించుకున్నాడు. ఈజిప్టు అతన్ని ఆకర్షించింది. మూడు తరాలుగా ఈజిప్టులో తవ్వకాలు జరుపుతున్న ఫ్రెంచి, ఇంగ్లీష్ పురావస్తుశాస్త్రజ్ఞుల నివేదికలను అప్పటికే అతను విస్తారంగా చదివి ఉన్నాడు. అయితే, తనకున్న బుద్ధికుశలత వాళ్ళకు లేదనీ, వాళ్ళ పురావస్తుశాస్త్రపరిజ్ఞానం కూడా అంతంత మాత్రమే ననీ, తనలా వాళ్ళెవరూ స్వర్ణనిక్షేపాలు కనిపెట్టలేదనీ అనుకున్నాడు.  తనే ఈజిప్టులో కొద్దిపాటి తవ్వకాలను చేపడితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేశాడు.

 గ్లాడ్ స్టన్

గ్లాడ్ స్టన్

1886 ముగింపునకు వస్తోంది. ఒక్క సహాయకునీ; గ్రీకు, అరబ్బీ పుస్తకాల దొంతరనూ వెంటబెట్టుకుని మూడు మాసాలపాటు నైలు నదిలో తీరుబడిగా ప్రయాణిస్తూ గడపాలని నిర్ణయించుకున్నాడు. అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ఆ కాలానికి అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలతో, అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దిన ఒక చక్కని దహబియా 9 ను1500 పౌండ్లకు అద్దెకు తీసుకున్నాడు. తీబన్(Theban) 10 శిథిలాలు, టోలెమీ ఆలయాల మీదుగా వెడుతున్నప్పుడు పడవను ఆపించి తీరగ్రామంలోకి వెళ్ళి సంతలో తిరిగేవాడు. గ్రామస్తులతో అరబ్బీలో ముచ్చటించడం అతనికి సంతోషం కలిగించేది. వాళ్ళ ఒంటి మీద ఉన్న పుళ్ళకు చిన్న చిన్న చిట్కా వైద్యాలు సూచించేవాడు. ఒక ఈజిప్టు బాలిక భుజానికి పక్షవాతంతోనూ, వాపుతోనూ బాధపడుతుండడం చూసి; రోజూ రెండుసార్లు నైలు నదిలో స్నానం చేయమనీ, అవిసె గింజలను, కొన్ని రకాల మూలికలను ముద్ద చేసి వేడి వేడిగా భుజానికి పిండికట్టు వేసుకోమని సూచించాడు. ఫలితం ఏమైందో తెలియదు. నల్లని దేహాకాంతితో, శిల్పించినట్టు ఉండే ముఖాలతో కనిపించే న్యూబియన్ల 11 ను ఎంతో ఇష్టపడేవాడు. తనకు ఇంతవరకు తారసపడిన జనాలలో వీరొక్కరే వీరజాతిగా కనిపిస్తున్నారనుకున్నాడు.

వాడీ హల్ఫా(Wadi Halfa)12 వరకూ ప్రయాణించాలన్నది అతని సంకల్పం. మధ్యలో క్లియోపాట్రా గురించిన ఆలోచనలు చేశాడు. నైలు నది లోతును, మేఘాల కూర్పును అధ్యయనం చేశాడు. బాగా ఎత్తున ఏర్పడిన మేఘాలను బట్టి మరుసటి రోజు వాతావరణాన్ని అంచనా వేసేవాడు. ప్రయాణాల్లో ప్రతిసారీ చేస్తున్నట్టే, రోజువారీ ఉష్ణోగ్రతలను నమోదు చేశాడు. అక్కడక్కడ కనిపించిన శాసనాల నకలు రాసుకున్నాడు. పడవ కప్పు మీద అస్థిమితంగా పచార్లు చేసేవాడు కానీ అతనిలో ఒక విచిత్రమైన నెమ్మది ఏర్పడింది. హోమర్ ను చదువుతున్నప్పుడు మాత్రం ఎందులోనూ పొందనంత ఆనందం అతనిలో పురివిప్పి నర్తించేది.

(సశేషం)

***

అథోజ్ఞాపికలు

 1. ఫినీషియన్లు: ఋగ్వేదంలో పేర్కొన్న ‘పణు’లే ఫినీషియన్లు అని కోశాంబీ అంటారు. ఫినీషియన్లు సముద్రయానంలో నిపుణులైన ప్రాచీనకాలపు వర్తకులు. వీరికి సంబంధించిన మరికొన్ని విశేషాలను నేను ‘పురా’గమనం శీర్షిక కింద రాసిన ఈ వ్యాసాలలో చూడవచ్చు. 1. దేవతల కుక్క(18-09-2014) 2. ప్రపంచచరిత్రలో మనం(24-09-20140 3. పర్షియన్ రాముడు-గ్రీకు హనుమంతుడు (02-10-2014) 4. చరిత్రలో ఒక అద్భుతం (13-11-2014)
 2. డోరియన్లు: నాలుగు పురాతన గ్రీకు తెగలలో ఒకరు. మిగిలిన మూడూ: అయోలియన్లు, అఖియన్లు, అయోనియన్లు.
 3. విచిత్రంగా మహాభారతం కూడా గొప్ప వీరులైన క్షత్రియజాతి అంతరించిపోవడం గురించీ, ‘అల్ప’జీవులు ప్రాబల్యంలోకి రావడం గురించీ చెబుతుంది. ఒకానొక కాలంలో ప్రపంచంలో పలుచోట్ల జరిగిన పరిణామాల సాదృశ్యాన్ని పరిశీలించిన పురాచరిత్రకారులు, వాటిని ‘వీరయుగం’ కింద వర్గీకరించారు. నేను గమనించినంతవరకు మహాభారతాన్ని ఈ వీరయుగ కోణం నుంచి ఎవరూ పరిశీలించినట్టులేదు. నా ‘పురా’గమన వ్యాసాలు కొన్నింటిలో ఈ కోణాన్ని కొంతవరకు స్పృశించాను.
 4. నిహిలిస్టులు: నిహిలిజాన్ని బోధించేవారు నిహిలిస్టులు. అన్ని రకాల విలువలను, నైతికతను వీరు వ్యతిరేకిస్తారు. Nihil అనే లాటిన్ మాటనుంచి nihilism పుట్టింది. ఫ్రెడరిక్ హెన్రీ జాకొబీ(1743-1819)అనే జర్మన్ తాత్వికుడు ఈ మాటను కల్పించాడు. జోసెఫ్ వాన్ గారెస్ (1776-1848) అనే జర్మన్ పాత్రికేయుడు ఈ మాటను మొదటిసారి రాజకీయార్థంలో వాడాడు. రష్యన్ రచయిత తుర్గేనివ్  (1818-1883) తన ‘ఫాదర్స్ అండ్ చిల్రన్’ అనే నవలలో nigilizm అనే రష్యన్ రూపాన్ని వాడి ఆ మాటను తనే రూపొందించానన్నాడు. 1860-1917 మధ్యకాలంలో రష్యాలో సాగిన విప్లవ అరాచకత్వాన్ని ఈ మాటతో సంకేతించారు. Online Etymology Dictionary, © 2010 Douglas Harper
 5. అలెగ్జాండర్ –II(1818-1881): రష్యా చక్రవర్తి(జార్). 1855లో పట్టాభిషిక్తుడయ్యాడు. పోలండ్ కు రాజుగానూ, ఫిన్ లాండ్ కు గ్రాండ్ డ్యూక్ గానూ కూడా ఉన్నాడు. 1881లో నిహిలిస్టుల చేతిలో హతుడయ్యాడు.

 

 1. చార్లెస్ జార్జి గోర్డన్(1833-1885): బ్రిటిష్ సైనికాధికారి. చైనా, సూడాన్ లలో విధులు నిర్వహించాడు.
 2. మాదీ(Mahdi): ఇస్లాం పరిరక్షణకు, స్థాపనకు కత్తి పట్టి ఉద్యమించిన వీరుని సూచించే పేరు. చరిత్రలో పలువురు తమను ‘మాదీ’గా ప్రకటించుకున్నారు.
 3. స్వప్నాలవల్ల మంచి గానీ, చెడుగానీ జరుగుతుందన్న విశ్వాసం మనలోనూ ఉంది. రామాయణంలో ‘త్రిజటా స్వప్నం’ లాంటి ఉదాహరణలు ఉన్నాయి.
 4. దహబియా: నైలు నదిలో తిరిగే పడవలను ఈ పేరుతో పిలుస్తారు.
 5. తీబన్(Theban): ఈజిప్టులోని పురాతన నగరం తీబ్స్(Thebes) కు చెందిన పౌరుడు తీబన్.
 6. న్యూబియన్లు: ఈజిప్టుకు దక్షిణంగానూ, నేటి సూడాన్ ఉత్తరప్రాంతంలోనూ ఉన్న న్యుబియా అనే ప్రాంతానికి చెందినవారు.
 7. వాడీ హల్ఫా(Wadi Halfa): సూడాన్ ఉత్తరప్రాంతంలో ఉన్న ఒక నగరం.

  

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

*