విరించి వెతుక్కున్న కొత్త దారి!

 

 padam.1575x580 (2)

 

సాహిత్యం ప్రస్తుతం అస్తిత్వ ప్రశ్నలదిశలో ఉంది.వేరువేరు కేంద్రాలు లక్ష్యాలతో ప్రవహిస్తున్నా వీటన్నిటి వాహకశక్తి ప్రశ్నలే. స్థూల లక్ష్యం సమసమాజ నిర్మాణం. కాని ప్రాతి పదికలక్ష్యాల వైపు ప్రాథమికంగా వెళ్లడం వలన సంఘర్షణలు కనిపిస్తాయి. నిజానికి ఈ సంఘర్షణలకు మూలమైన అస్తిత్వ ప్రశ్నలకు సమాధానాలు దొరకకుండా స్థూల లక్ష్యం గురించి ఊహ చేయటం కూడా కష్టమే.

ఇన్నాళ్ల కవిత్వగమనంలో ప్రశ్నలు వేస్తున్న వర్గాలకు సంఘీభావంగా రాసిన కవిత్వం ఇతరేతర వర్గాలనుంచి వచ్చింది గాని, ఒక ప్రాతిపదిక సమాధానం కనిపించదు.స్థూల లక్ష్యానికిసంబంధించిన ప్రేరణ వినిపించదు.అలాంటి లక్ష్యాన్ని ఒకదాన్ని సూచిస్తూ “రెండవ అధ్యాయానికి ముందుమాట”ను విరించి విరివింటి ఆవిష్కరిస్తున్నారు.సాధారణంగా కొత్తగారాస్తున్నవాళ్లు ప్రధానస్రవంతి మార్గాల్లో పడి నడుస్తారు.పూర్వలక్ష్యాలు గమనం ఈ కవిత్వంలో కనిపిస్తాయి.విరించి కవిత్వం దీనికి భిన్నం ఈ కవిత్వంలో కనిపించే ప్రతిపాదన,లక్ష్యం కొత్తవి. గమనం అంతే నిర్దిష్టమైంది.

ఒక రెండు మూడు సంవత్సరాల కాలం మధ్య కవిత్వం కాబట్టి ఇందులో భిన్నమైన వస్తువులున్నాయి.ప్రధానంగా స్త్రీలు మొదలైన వస్తువులపై రాసిన కవితలు ఎక్కువ.కాని పైన చెప్పిన అస్తిత్వమూలాలపై సమాధానంగా వచ్చిన కవితలు సుమారు పది కనిపిస్తాయి.  కంకర రాళ్ళు(31పే)మేలుకొలుపు(43(పే)పిడికిలి(47పే)చీకటి గుహ(49పే)పది అక్షరాలు(64పే)మూగ జంతువు(70పే.)మేలి మలుపు(73పే)రెండో అధ్యాయానికి ముందు మాట(143 పే)మొదలైన కవితలు ఇలాంటివి.

1.” ఇన్షా అల్లాహ్ అనుకుంటూ నీవు నేను బాగుం డాలని /రాముడిగుడిలో చేతులుజోడించి నేను నీవుబాగుం డాలని /కొరుకోవటమొకటే మనకు దేవుడిచ్చి ఉండకూడదనీ మనం కోరుకుందాం/మనరోజొకటి మనకోసం మనముందు వేచిఉంటుందని ఆశపడదాం“-(33 పే)

 virinci1

2.”నీ వసుధైక జీవనానికీ/విశ్వ ప్రళయానికీ నీ చైతన్యమే తేడా“-(పే.430

3.భయంకర స్వప్నాల మధ్య ఊగిసలాడే/నడిరాతిరి నిదురను ప్రేమించేమనం/మనుషులందరూ కలిసిమెలిసి జీవించే/ఒక సుందర స్వప్నాన్నెందుకో ప్రేమించనేలేదు“-(47.పే)

4.మనమానవాత్మని మేల్కొల్పే/కొత్త చూపొకటి అక్కడ ఇరుక్కుని ఉంది/పలుగూ పారల్లాగా మనమిద్దరమూ ఇక పనిచెయ్యాలి“-(73.పే)

మొదటి వాక్యాంశం మనుషులమధ్య ఐక్యతను గూర్చి మాట్లాడుతుంది.రెండవది మనిషిలోని ఆవేశానికి,చైతన్యానికి మధ్య వైరుధ్యాన్ని చర్చిస్తుంది.స్వప్నం, ఉనికి అనే భావనలు ప్రయాణంలోని నిర్దిష్టతను చెబుతాయి.వీటన్నిటిలో సంఘర్షణ నుంచి బయటికి వచ్చి ఒక వైపుకు నడవాలనే ఆశంస కనిపిస్తుంది.

virinchi

వసుధైక జీవనమనే విశ్వభావన ప్రాచీనకాలం నాటిది.నారాయణ పండితుడు” ఉదార చరితాణాం తు వసుధైక కుటుంబకం”అన్నాడు.దిగంబర కవులు కూడా “జాతి మత దురహంకారాలను త్యజించి,నగర విసర్జనం చేసి,గంగా సింధూ నదీతీరాల్లో,వోల్గా నైలూనదుల సమీపాల్లో మానవులంతా కుటుంబాలుగా ఏర్పడాలని”ప్రకటించారు.ఈ భావనే అంచెలంచెలుగా ఈ కవిత్వం మోస్తుంది.విరించి కవిత్వం లో కొన్ని లక్షణాలున్నాయి.ఒక ఆకస్మిక ప్రారంభం ఉంటుంది.సాధారణంగా కవిత్వంలో వస్తువును, దృష్టిని ప్రతిపాదించే ప్రతిపాదక వాక్యాలతో కవిత మొదలవుతుది.ఈ కవిత్వంలో ప్రారంభవాక్యం నుంచే కవిత్వాంశాన్ని చర్చించడం కనిపిస్తుంది.విషయాన్ని,దాన్నానుకున్న వస్తువుగా గాకుండా అది మనసు మీద పడే ప్రభావాన్ని విరించి కవిత్వం చేస్తారు.వాక్యాన్ని గమనిస్తే తనలో తాను సంభాషించుకున్నట్టుగా ఉంటుంది.

నిర్మాణ దృష్ట్యా గమనిస్తే విరించి సాధన వాక్యాల్లో కనిపిస్తుంది.సమకాలీనత ఎక్కువగా కనిపిస్తుంది.ప్రతికవికి ప్రధానంగా కొత్తగా రాసేవాళ్లకు సమకాలీన వాక్యనిర్మాణాన్ని ,వ్యక్తీకరణలను గమనించడం అవసరం కూడా.ఇది కూడా సాధనలో ఒక భాగమే.వాక్యాల్లో సాధారనంగా కనిపించే సమవృత్తి సూత్రం విరించి కవిత్వంలో ఒక భావాంశం (Unit)రూపంలో కనిపిస్తుంది.కిటికీ(పే.50)కవిత అందుకు ఒక నిదర్శనం. కాదు,చేయాల్సింది,ఎగరాల్సింది,తేలాల్సింది లాంటి క్రియల్ని తీసుకుని ఈ కవితను నిర్మించడం కనిపిస్తుంది.కవిత్వపుటద్దం(పే.52)Equality condemned(పే.54)వంటి మరిన్ని కవితలు ఇలాంటి నిర్మాణంలో కనిపిస్తాయి.కవిత్వ రూపాన్ని సాధించడంలో ఉండే అవగాహన,శ్రద్ధ ఇందులో కనిపిస్తాయి.ఎక్కువగా వాక్య విన్యాసం మీద విరించి కవిత ఆధారపడుతుంది.సఫిర్ భాషను రూప సంబంధి,విన్యాస సంబంధి గా చెప్పారు.విరించిలో రెండవ పార్శ్వమే ఎక్కువ.నిజానికి కథానాత్మక కవితలో ఈ మార్గం ఎక్కువ.

చీకటివరం(పే.86)లాంటి కవితలు కొన్ని విరించి ప్రతీకలను,రూపాలను వాడుకునే విధానాన్ని చూపుతాయి.

పగలంతా ఎండలో దాగుడుమూతలాడి/అలసిపోయిన నక్షత్రాలపుడు/ముఖం కడుక్కుని/అలంకరించుకోవడం మొదలెడతాయి.”

విడిపోతున్న ప్రియురాలు వెనక్కితిరిగి చూస్తున్నట్లు/సూర్యుడొకదిగులుచూపు చూస్తుంటాడు

నా గదినంతా పరికించి చూసే/సాయంత్రపు నీరెండచూపులకు/గోడల చెక్కిళ్లమీద ఎర్రటి సిగ్గువాలి ఉంటుంది

ఈవాక్యాల్లోవాడుకున్న అంశం మానవ గుణారోపణ. సాయంకాలమవడాన్ని మొదటిరెండు భావాంశాలు చిత్రిస్తే,చివరిభాగం సమాగమంలో జరిగే మానసిక వికారాలను చిత్రిస్తుంది.”గోడలచెక్కిళ్ల మీద ఎర్రటి సిగ్గువాలి ఉంటుంది”అలసిన నక్షత్రాలపుడు ముఖం కడుక్కుని అలంకరించుకుంటాయి.”అనే వాక్యాలు ధ్వని మాత్రంగా కొన్ని సన్నాహాలను వ్యక్తం చేస్తాయి.రెండవభావాంశం మంచి భావ చిత్రం కూడా.

కెంపులు జారే పెదవులు/సీతాకోక చిలుకలు ఎగిరే నవ్వులు

ఈ వాక్యాల్లో దృశ్యాన్ని చిత్రించడం ఉంది.-ఈ కవితలో నిజానికి రెండు వస్తువులున్నాయి.ఒకటి జీవిత సంబంధమైన సౌందర్య స్పృహ,రెండవది సామాజికం.కవి సామాజికుడవ్వాలన్న ఆలోచన చివరివాక్యాలను రాయించి ఉంటుంది.

యాసిడ్ దాడిలో కాలిపోయిన ముఖంలోకి/బంగారు తల్లీ చిట్టితల్లి వరాల తల్లీ అని/అమ్మ పిలిచే ముద్దు పేర్లు/అమాయకంగా అద్దంలోంచి చీకట్లోకి తొంగి చూస్తాయి

ఈ వాక్యాలు సామాజికమైనవి.కవిత ఒక విషాద భావనతో ముగుస్తుంది.కొత్తగా కవిత్వలోకానికి పరిచయమైనా విరించికి తనదైన దృష్టి ఒకటుంది.సృజనలోనూ గమనించాల్సిన పరిణతిఉంది.మరింతచిక్కగా రెండో అధ్యాయం మనముందుకు వస్తుందన్న వాగ్దానమూ ఈ “ రెండోఅధ్యాయానికి ముందు మాటే” చేస్తుంది.

*

మీ మాటలు

  1. K N RAU says:

    “సాహిత్యం ప్రస్తుతం అస్తిత్వ ప్రశ్నలదిశలో ఉంది.”
    అసలు అస్తిత్వమంటే ఏమిటో తెలపకుండా ఒక ఊత పదంగా “అస్తిత్వ” అని ప్రయోగించడం
    ఏమిటి? అస్తిత్వ సాహిత్య విమర్శ ఒకటంటూ ఉందా? కదిల్తే..అస్తిత్వాలు,ప్రశ్నలు అంటూ సాగదీసి సాగదీసి తెలుగు సాహిత్య విమర్శకో కొత్త నులుపోగు సమర్పించినట్లు భ్రమించి పొంగిపోవడం ఏమిటి?

    “వేరువేరు కేంద్రాలు లక్ష్యాలతో ప్రవహిస్తున్నా వీటన్నిటి వాహకశక్తి ప్రశ్నలే. స్థూల లక్ష్యం సమసమాజ నిర్మాణం. కాని ప్రాతి పదికలక్ష్యాల వైపు ప్రాథమికంగా వెళ్లడం వలన సంఘర్షణలు కనిపిస్తాయి. నిజానికి ఈ సంఘర్షణలకు మూలమైన అస్తిత్వ ప్రశ్నలకు సమాధానాలు దొరకకుండా స్థూల లక్ష్యం గురించి ఊహ చేయటం కూడా కష్టమే.ఇన్నాళ్ల కవిత్వగమనంలో ప్రశ్నలు వేస్తున్న వర్గాలకు సంఘీభావంగా రాసిన కవిత్వం ఇతరేతర వర్గాలనుంచి వచ్చింది గాని, ఒక ప్రాతిపదిక సమాధానం కనిపించదు.స్థూల లక్ష్యానికి సంబంధించిన ప్రేరణ వినిపించదు”–నారాయణ శర్మ
    ఏమిటీ..ఈ అస్తవ్వస్థ వ్యక్తీకరణ? “ప్రాతిపదిక”..”ప్రాధమికం” అంటే ఏమిటీ?

    “ప్రతికవికి ప్రధానంగా కొత్తగా రాసేవాళ్లకు సమకాలీన వాక్యనిర్మాణాన్ని ,వ్యక్తీకరణలను గమనించడం అవసరం కూడా”
    “సమకాలీన వాక్య నిర్మాణం” “వ్యక్తీకరణ ” ఎలా ఉన్నాయో కొత్తదనం ఏమిటో తెలిపింది ఎక్కడ?

    “ఈ వాక్యాలు సామాజికమైనవి.”
    వాక్యాలు సామాజికమైనవీ అసామాజికమైనవీ అని ఉంటాయా? కవిత్వం మొత్తంగా సామాజికం కాదా?
    నారాయణ శర్మ గారిది నవ్య విమర్శ అనుకోవాలో న విమర్శ అనుకోవాలో వివరిస్తే బాగుంటుంది గదా.!

    సంఘీభావ కవిత్వం నిజానికి ఒక హిపోక్రాటిక్ కవిత్వం …పచ్చాత్తాప కవిత్వమనో మరొకటనో దాన్ని పిలవడం అసంబద్ధం. సాలిడారిటీ కవిత్వలో సారం కంటితుడుపుగా ఉండటం వరకే పరిమతం.

    • narayana sharma says:

      కే.ఎన్.రాజుగార్కి..
      నేను చేసిన ఈ పరిచయాన్ని చదివి,అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.నా వాక్యాన్ని నేను తరచి చూసుకునే అవకాశం కూడా మళ్ళీ మీ వల్ల కలిగింది.

      1.అస్తిత్వం అంటే ఎమిటి ?
      అస్తిత్వం-ఉనికి..తెలుగు కవిత్వంలో ఉనికి సంబంధమైన పోరాటాలు దళిత,మైనారిటీ,బహుజన,ప్రాంతీయ,స్త్రీవాదాల రూపాల్లో ఉన్నాయి.ఇవన్నీ సాంఘిక,సంప్రదాయాల రూపాల్లో ఉండే కట్టుబాట్లను,అణచివేతలను ప్రశ్నిస్తున్నాయి.వాటినే అస్తిత్వ ప్రశ్నలన్నాను.
      అస్తిత్వ వాదం అనేది నేను పరిచయం చేసిన పదం కూడా కాదు.పాశ్చాత్యులలో అనేకమంది అస్తిత్వ వాద సాహిత్యవేత్తలు,తాత్వికులు కనిపిస్తారు.తెలుగులో అన్నపరెడ్డి గారు “అస్తిత్వ వాదం” అనేపేరుతో ఒక పుస్తకం కూడా తెచ్చారు.(ఇవి మీకు తెలియని విషయాలనుకోను)
      2.ప్రాతిపదిక,ప్రాథమికం అంటే ఏమిటి ?
      ప్రాతిపదిక -ప్రతిపాదింపబడినది- సమసమాజ నిర్మాణం అనే లక్ష్యాన్ని వర్ణ,వర్గ వ్యవస్థలు లేకుండా చేసేందుకు నిర్దేశించుకున్నది..ఇది నిర్దిష్ట మైంది గనుక ప్రాతిపదిక అన్నాను.అంబేడ్కర్,పూలే ఒక పార్శ్వంలో గాంధీజీ మొదలైన వాళ్ళు “సమసమాజ నిర్మాణం “జరగాలని ఆకాంక్షించారు.

      ప్రాథమికం- నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకునేందుకు చేసే మొదటి ప్రయత్నం.పై లక్ష్యాలకోసం ఆనాడే వర్ణ వర్గ వ్యవస్థకు వ్యతిరేకంగా దాన్ని పెంచిపోషిస్తున్న”మనువాదం”(మనుస్మృతి నిర్దేశించిన ధర్మ సూత్ర పరంపర)ను తిరస్కరించడం.అంటరాని తనాన్ని వదిలేయటం.అణగారిన వర్గాలకు సమానస్థితులను కల్పించడం.ఇవన్నీ లక్ష్యం వైపుకు వెల్లేందుకు ఏర్పరచుకున్న మార్గాలు-ఇవి ప్రాథమికాలు.
      (ఈ పరి భాష తరుచూ అందరూ ఉపయోగిస్తున్నదే)

      3.సమకాలీన వాక్యనిర్మాణం-వ్యక్తీకరణ -నేను ఉదహరించిన వాక్యాలే చెబుతాయి.
      4.వాక్యాల్లో సామాజికాలు,అసామాజికాలు ఉంటాయా ?

      వాక్యాల స్వభావాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు.అది వ్యక్తం చేస్తున్నపనుల్లో పాఠకుడిపై వేస్తున్న ప్రతిఫలనాలపై ఉంటాయి.కవిత్వం సామాజికం అయినంత మాత్రాన ప్రతీవాక్యం సామాజికం కావాలని లేదు.సమాజంలోని వాతావరణం కళాదృష్టితో చిత్రించినపుడు దాన్ని కళావాక్యంగానే గుర్తిస్తారు.

      “కెంపులు జారే పెదవుల్లో” సౌందర్యం తప్ప.సమాజం ఎక్కడుంది.”యాసిడ్ దాడి గురించి రాసిన వాక్యం,”లో సౌందర్యం ఎక్కడుంది.సమాజంతప్ప.అందుకే వాక్యాల్లో సామాజిక అనుకలనం,సౌందర్య అనుకలనం రెండూ ఉంటాయన్నాను.

      సంఘీభావ కవిత్వం కపటమైందో కాదో చెప్పటం నా ఉద్దేశ్యం కాదు.మంగిపుడి వెంకటేశ్చర శర్మ “మాల వాండ్ర పాట”(1909)నుంచి వచ్చింది సంఘీభావ కవిత్వం గానే గుర్తించారు.సతీష్ చందర్ నిగ్రహ వాక్యం ,దళితవాద వివాదాలు (సం.ఎస్వీ సత్యనారాయణ)మొదలైన పుస్తకాల్లో ఈ విషయాలపై కొంత చర్చ ఉంది.

      5.నవ విమర్శ ,న విమర్శ విషయంలో నేను మాట్లడటం సరైందికాదేమో.. ఎందుకంటే నేను దీన్ని పరిచయం అనిమాత్రమే అనుకుంటాను

      • K N RAU says:

        నారాయణ శర్మ గారూ ..
        ఉనికి పోరాటాలు అస్తిత్వ పోరాటాలే నంటారు మీరు. ప్రపంచంలో చాలామంది తత్వవేత్తలున్నారు.అందులో అస్తిత్వ తాత్విక వేత్తలు కూడా ఉన్నారు నిజమే . కాని మీరు చెప్పిన ఈ అస్తిత్వవాదం.. అంటే స్త్రీ మైనారిటీ దళిత ప్రాంత ఆదివాసి LGBT వెనుకబడిన కులాల వాళ్ళ వాదమూ అన్నపురెడ్డి వేంకటేశ్వర రెడ్డి “అస్తిత్వ వాదం” ఒకటి కాదు. “existence proceeds essence ” ఇదీ దాని తాత్విక భాష. మరి ఆ అస్తిత్వ వాదానికీ మీరు చెప్పిన అస్తిత్వ వాదానికి ఎక్కడ పొంతన కుదిరింది ఎక్కడ బంధం కలిసింది? ఐడెంటిటీ పాలిటిక్స్ నే అస్తిత్వ వాద రాజకీయాలు అని అంటున్నారు ..కాదా? అసలు ఈ అస్తిత్వ వాద ప్రశ్నలు పోరాటాలు..ఐమీన్ పైన చెప్పినవి.. తమ తమ అస్తిత్వాల్ని పటిష్ట పరచుకోవ డానికా లేక అసంబద్ధ అసమంజస సోకాల్డ్ అస్తిత్వాల్ని రూపుమాపి సమ సమాజాన్ని నిర్మించ డానికా? లేక వైరుధ్యాల లోనే చిక్కుబడి ఉడిగిన చైతన్యంతో మురిసి తరించనా ?

        ప్రాతిపదిక ..ప్రాధమిక లకు మీరిచ్చిన వివరణ సంస్కరణ వాదానికి దగ్గరగా ఉంది..ఇక అస్తిత్వ వాదమని దానికో తాత్విక నామమెందుకో మరి?

        “కెంపులు జారే పెదవుల్లో” సౌందర్యం తప్ప.సమాజం ఎక్కడుంది.”యాసిడ్ దాడి గురించి రాసిన వాక్యం,”లో సౌందర్యం ఎక్కడుంది.సమాజంతప్ప.అందుకే వాక్యాల్లో సామాజిక అనుకలనం,సౌందర్య అనుకలనం రెండూ ఉంటాయన్నాను.” అంటారు మీరు .

        సౌందర్యం సామాజికం కాదా? సామాజికం కాని సౌందర్యం ఉంటుందా? ఉంటుందని మీ పై వాక్యాలే చెబుతున్నాయి. ఈ తరహా విమర్శని ఏ సౌందర్య సిద్ధాంతం ప్రతిపాదించింది? “కెంపులు జారే పెదవులు” ..కెంపుల పెదవులు .. కెంపు పెదవులూ కాదు .. కెంపులు జారుతున్న పెదవులు..అంటే అర్థం ఏమిటి? రుధిర బిందువులు జారుతున్న పెదవులు అనుకోవాలా? ఈ తరహా ప్రయోగం సారూప్యం చూపించుతారా? బహుశా ఇది మీరు చెప్పిన “సమకాలీన వ్యక్తీకరణ”కి నిదర్శనం కావొచ్చు.

        సంఘీభావ కవిత్వానికి ఓం ప్రధముడిగా మంగిపూడి వేంకటేశ్వర శర్మ నే చూపాలా? అంతకు ముందు లేరా? సంఘీభావ కవిత్వమనే ఒక కవితా ప్రక్రియా రూపం ఏమైనా ఉందా? దీనిపై చాలానే చర్చ జరిగి ఉండొచ్చు కాదనడం లేదు..కానీ సంఘీ భావ కవిత్వానికో ప్రామాణికత అంటూ ఏమైనా ఉందా?

        ఈ సమీక్షని మీరు కేవలం పరిచయం మాత్రేమే నంటున్నారు ..అవునా? పరిచయంలో విమర్శ ఉండదా సమీక్షల్లో విమర్శ ఉండదా? ఉండక పోతే ఎన్నో సమీక్షలపై వాదోపవాదాలు ఉబుసుపోక జరిగిన ఉదంతాలేనా?

        వసుధైక కుటుంభం అని దిగంబర కవుల్ని చూపుతున్నారు మీరు .. దిగంబర కవిత్వాన్ని మొత్తంగా చదవండి..వారి కవిత్వంలోని సారం ఏమిటో వారి దృష్టీ దృక్పధం ఏమిటో తెలుసుకోవచ్చు.

      • narayana sharma says:

        కే.ఎన్.రాజు గారు !
        మొత్తానికి దళిత,మైనారిరిటీ,స్త్రీవాదాలన్నిటినీ మీరు ఐడెంటిటీ పాలిటిక్స్ అన్నారు.నాకా ఉద్దేశ్యం లేదు.వాటి చైతన్యం ఉడగిపోవటం నేను ఈ పరిచయంలో చర్చించాల్సిందికాదు.. ఈ ఉద్యమాల ఉనికిని గుర్తిస్తూ ఈ సంపుటాన్ని పరిచయం చేయటం మాత్రమే ఇక్కడ నేను చేయదలచుకున్నది.

        ప్రాతిపదిక,ప్రాథమికాలు అన్నీటిలో ఉంటాయనుకొంటాను.అవి ఏ ఒక్కదగ్గరో ఉపయోగాల్సింది కాదు.

        సారూప్యాలుంటేనే ప్రయోగాలు,వ్యక్తీకరణలు చేయాలా?-లక్షసార్లు ఆలోచించినా సమాజంలో సౌందర్యం ఉంటుంది గాని.సౌందర్యమంతా సామాజికం కాదు.
        మంగిపూడి ని ప్రథముడిగా నేను చెప్పలేదు.అలావచ్చిన వాటిని సంఘీభావ కవిత్వంగా గుర్తించారనే అన్నాను.-”
        .మంగిపుడి వెంకటేశ్చర శర్మ “మాల వాండ్ర పాట”(1909)నుంచి వచ్చింది సంఘీభావ కవిత్వం గానే గుర్తించారు”-వెంకటేశ్వర శర్మ దళితేతరులు.కాబట్టి సంఘీభావంగా గుర్తించారన్నది మాత్రమే నా వాక్యం.

        ‘సంఘీభావ కవిత్వమనే ఒక కవితా ప్రక్రియా రూపం ఏమైనా ఉందా?
        అనే ప్రశ్న సరైనది కాదేమో.ప్రక్రియ,రూపం,సంఘీభావం వేరు.

        దిగంబర కవుల గురించి నేను ఎత్తిరాసిన వాక్యం దిగంబర కవుల్లో ఒక రైన “జ్వాలాముఖి”గారు -అభ్యుదయ విప్లవోద్యమాలవారధిగా దిగంబరకవిత్వం అనే వ్యాసంలో రాసినది.(ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రక్రియలు ధోరణులు)వారికి తెలియని వాళ్లదృష్టీ దృక్పథం ఉంటాయనుకోను.

      • K N RAU says:

        బాగుంది నారాయణ శర్మ గారూ ..చూశారా పరిచయం అనేది విమర్శలోకి ఎట్లా దిన్చిందో..అనివార్యంగా!

        “మొత్తానికి దళిత,మైనారిరిటీ,స్త్రీవాదాలన్నిటినీ మీరు ఐడెంటిటీ పాలిటిక్స్ అన్నారు.నాకా ఉద్దేశ్యం లేదు.”
        మీ ఉద్దేశ్యం అన్నపురెడ్డి చెప్పిన “అస్తిత్వ వాదం” (Existential Philosophy) ఈ అస్తిత్వ ఉద్యమాలూ ఒకటే అని పొరపాటు భ్రమల్లో పలవరించటం కావొచ్చు. వీటినే ..అస్తిత్వ ఉద్యమాలు అంటున్నారు ..కాదా? Existential Philosophy కి identitarian philosophy కీ తేడా తెలియకపోతే ఎట్లా ?

        సారూప్యాలుంటేనే ప్రయోగాలు,వ్యక్తీకరణలు చేయాలా?-లక్షసార్లు ఆలోచించినా సమాజంలో సౌందర్యం ఉంటుంది గాని.సౌందర్యమంతా సామాజికం కాదు.”

        ఇష్టమొచ్చినట్లు వ్యక్తీకరణ చెయ్యటం మీరు చెప్పిన “సమకాలీన వ్యక్తీకరణ” అవుతుందా? సామాజికం కాని సౌందర్యం ఏ సౌందర్య శాస్త్రం నుండి మీరు గ్రహించారో సెలవిస్తే ఉత్తమం కదా?
        కెంపుల్ని పెదవులతో పోల్చిన కవి సమయం ఎక్కడుందో చూపితే సంతోషం కదా. కాని ఎదురు ప్రశ్న వేసి తప్పించుకో చూస్తున్నట్లుంది..కదా? సిగ్గు బిడియాలతో కంది ఎరుపెక్కిన బుగ్గల్ని కెంపులతో పోల్చుతారు.పెదాల్ని కాదు..ఇదొక అప ప్రయోగమని విమర్షకుడికే తెలియకపోతే ఎట్లా?

        జ్వాలాముఖి గారి వ్యాసం నుండి మీరు తీసుకున్న వాక్యానికి ముందటి వాక్యాన్నీ, తర్వాతి వాక్యాన్నీ మీరెందుకు విస్మరించినారో మరి. జ్వాలాముఖి ఎక్కడా వసుధైక కుటుంబం ని ప్రస్తావించిన దాఖలాలేక్కడ ఆ వ్యాసంలో మీకు కనిపించినాయో మరి.

        అమోఘం, అత్భుతం , విశ్లేషణ నిత్యనూతనం (కవిత్వం కాదట) మొదలైన ప్రశంసల్ని అందుకోవటం ఆనందమే ..కానీ విమర్శ గుంపులో గోవిందం కాదనీ కప్పదాట్ల బురిడీ గారడీ కాదని తెలుసుకుంటే మంచిది గదా!

      • వంశీ కృష్ణ says:

        KN Rao గారూ
        సరే…మీరు శర్మ గారితో విమర్శకు సంబంధించిన అంశాలు సీరియస్ గా చర్చిస్తున్నారు – అభ్యంతరం లేదు
        మీ ఉద్దేశం అందరికి మెల్లిగా ఎక్కడానికి కారణాలు లేకపోలేదు- అవి మీకు తెలియనివి ఐతే కాదు.
        రివ్యూ మితులు పరిమితులు మీకు ఒకరు చెప్పాల్సిన పని లేదు…నిజానికి మీకు ఈ సమాధానం నేను రాయాల్సిన అవసరం లేదు..ఒక్క పాఠకుడిగా ఈ పుస్తకం చదివిన వాడిగా కొద్దిగా సెన్స్ ఉన్న వాడిగా ఒక మెసేజ్ పెడితే పోయేదేముంది..ఎలాగూ ఇంటర్నెట్ ఒచ్చాక నోటికి అడుపులేని వెర్రి వెంగలప్పలం బాగా తయారయ్యాం కదా అని ఈ మెసేజ్. మీరు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు..మీకెక్కడో కాలితే తప్ప.
        కానీ..- ఆశ్చర్యం ఏమంటే, కెంపులని ఇలాగె పోల్చాలని మీరు ఒక రూళ్ళ కర్ర పట్టుకొచ్చేసరికి అవాక్కాయిన క్లాసు రూమ్ పొరగాడిలా నాకొక సుత్తి క్లాసు వింటున్న అనుభూతి ఎందుకు కలిగిందో.! సిగ్గుతో ఎరుపెక్కి కందిన బుగ్గల్ని మాత్రమె కెంపులతో పోల్చాలని కాక: కాక: పికః పికః అని మీరు ఉద్బోదించారు. ఇదొక అప ప్రయోగం అని తేల్చేశారు. మీరు అన్నమయ్య కు ఒకింత ముందు పుట్టి ఉంటె బాగుండేదని ప్రపంచం అప ప్రయోగాల నుంచి తప్పించుకునే వీలు కలిగేదని ప్రపంచం పట్ల నా సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ” కలికి చకోరాక్షికి కడకన్నులు కెంఫై తోచిన” అని పాపం అయన అన్యాయంగా అమాయకంగా కడకన్నులని కెంపులతో పోల్చాడు- మీ రూళ్ళ కర్ర ఒకసారి దులపాలి ఇక మీరు- అన్నమయ్య అల ఎలా పోల్చాడండీ? పిచితనమే కదా..!

  2. lasya priya says:

    అద్భుతం మాష్టారు ..చక్కటి విశ్లేషణ మీది …కంగ్రాట్స్ విరించి గారు.

  3. సూపర్బ్ విశ్లేషణ సర్..అభినందనలు విరించి గారు

  4. పోతగాని కవి says:

    విశ్లేషణ ప్రతిభావంతంగా ఉంది.విరించి కవిగారి కవిత్వానికి సరైన వివరణ.

    కె.యన్.రాజుగారి సందేహాలే నాకూ అనిపించాయి.విశ్లేషణ మొదట కొంతభాగాన్ని రెండవ సారి చదివితే అర్థమైంది.నారాయణ శర్మగారి వివరణతో మరింత తేటతెల్లమైంది.

    ప్రతిభావంతులు ప్రయోగించే పరిభాష కొంత సంక్లిష్టంగానే ఉండటం సహజమే…ఏదేమైనా విరించి కావ్యం పై విశ్లేషణ ఆశక్తికంగా ఉంది.

    • K N RAU says:

      కవి గారూ

      “ప్రతిభావంతులు ప్రయోగించే పరిభాష కొంత సంక్లిష్టంగానే ఉండటం సహజమే” అంటారు మీరు .

      పరిభాష సంక్లిష్టంగా ఉంటే ప్రతిభావంతులు ఎలా అవుతారు? క్లిష్టతని చేధించి సరళతని సాధించడం ప్రతిభావంతుల పని కాదా ? బహుశ అది అప్రతిభుల నైపుణ్యం కాచ్చునా? విషయాన్ని చిక్కు బడిన దారపు ఉండగా చెయ్యటం ప్రతిభావంతుల పనా?

      అసలు మీరు ఎం చెబ్తున్నారో .. మీ అభిప్రాయ సారాంశం ఏమిటో బోధ పడట్లేదు.

    • Virinchi says:

      అన్నయ్యా మీకు కృతజ్ఞతలు

  5. pusyami says:

    ఎన్ని సార్లు చదివిన కొత్తగా కన్పించే మీ విశేల్షణ అమోఘం శర్మ గారు …రెండో అధ్యనయానికి ముందు మాట పుస్తకానికి వన్నె తెచ్చేది లా వుంది అంటే అది అతిశయోక్తి కాదు …చక్కని చిక్కని కవిత్వాన్ని వెలువరించిన విరించి గారికి అబినందనలు …ఈ నాటి కవిత స్టామిన ని మించి మీ విశ్లేషణలు రావడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం ..ఇలాగె కొనసాగించాలని మనవి .జయహో కవిత్వం

  6. pallerla says:

    బావుంది విశ్లేషణ .కొంచం అకడమిక్ గాఉంది.ఇలాంటి వ్యాసాలను చూసి చాలాకాలం అయింది.

  7. shrutha keerthi says:

    నారాయణ శర్మ గారి ప్రతి విశ్లేషణ ఒక పాఠం లా వుంటుంది.ఎన్నో విషయాలు సంభ్రమంగా చదివిస్తాయి.
    అద్భుతమైన విరించి గారి కవిత్వం పైన మరింత అద్భుతమైన విశ్లేషణ.

  8. pallerla says:

    ఇక్కడ చర్చ ఎదో జరుగుతుంది కాని .అది ఒకదాడిలానే ఉంది.

    పరిభాషను క్లిష్టతనుండి సరళం చేయలన్న రాజుగారి కామెంటులో కూడా”తాత్విక భాష””సారూప్యాలు””ఉడిగిన చైతన్యం””విరుధ్యాలు””అసంబద్ధ,అసమంజస సోకాల్డ్ అస్తిత్వాలు”(నిజానికి రాజుగారుకూడా ఇక్కడ “అస్తిత్వం”అనే పదం వాడేసారు)అప ప్రయోగమని ఇవి సంక్లిష్టాలుకాదా ?
    Existential Philosophy కి identitarian philosophy కీ తేడా తెలియకపోతే ఎట్లా ?

    రచయిత ఉనికి అనే అన్నారుకాని..గుర్తింపు అనే పదాన్ని వాడినట్టు కనిపించలేదు.రెంటికి తేడా రాజుగారే చెబితే పోయేది కదా?

    గతంలో ఉన్న సౌందర్య శాస్త్రాలు ఒప్పుకుంటేనే పోల్చి చెప్పాలా.అలా అయితే కొత్తవెందుకు పాతవే చదివితే పోలా.
    ఇదంతా రచయితను అప్రతిభుడిగా తేల్చలన్నట్టుగానే కనిపిస్తుంది.గాని నిజానికి చర్చించాల్సిన విషయాలేమి లేవు.

    మానవులంతా ఒకేచోట ఉందడమంటే వసుధైక కుటుంబం కాదా.?
    వారి కవిత్వంలోని సారం ఏమిటో వారి దృష్టీ దృక్పధం ఏమిటో తెలుసుకోవచ్చు
    దృష్టీ,దృక్పథం ఒక్కటే కాదా?ఎవరైనా వివరిస్తే బాగుండు.

    కొత్తగా విమర్శనో,కవిత్వమో వస్తున్నప్పుడు అర్థమవటం లేదనటం..అర్థమే లేదనటం ఆనవాయితీగా మారకూడదు.

  9. K N RAU says:

    సంతోషం “pallerla ” గారూ..
    నిజంగానే మీరు పల్లేర్లను తొక్కి విమర్శలోకి వచ్చినట్లుంది మీ వీరంగం చూస్తుంటె.చర్చనీ దాడినీ ఒకే గాటన కట్ట జూసె మీ విమర్శక పాండిత్యానికి బహు పరాక్ అన్నా తక్కువే.
    చర్చించాల్సిన విషయాలేమీ లేకపోతే ఇంత చర్చ ఎందుకు? ఉబుసుపోక చర్చనా ఇది? ఇంకెవరైనా వచ్చి వివరించమని ఎందుకు వాపోతున్నారు? పిల్లి పాలు తాగుతూ నన్నెవరూ పట్టించుకో లేదులే అనుకున్న సామెతగా మీ విమర్శకులు ఏమి రాసినా ఏమి కాదులే ఎవరూ పట్టించుకోరులే అని ఏది ఎట్లా బడితే అట్లా రాసి అదే నూతన సౌందర్య శాస్త్రమని ఊదర కొట్టుకోవ టాన్ని ఎత్తి చూపితే …చిన్నపాటి ప్రశ్నకే మీరు చిందులు తొక్కుతున్నారు.ఇదేనా విమర్శంటే?
    “పదబంధం” అన్న ఈ శీర్షికలో ఒక పదబంధం పై సమీక్షకుడి తప్పుడు అవగాహనని తమ దృష్టికి తెస్తే …వీరతాళ్ల వీరంగామా మీరు చేసేది? ..చూశారా … యాదృచ్చికంగా .. ఇక్కడే .. దృష్టికీ దృక్పథానికీ వ్యత్యాసం మీకు తెలుసుకునే అవకాశం కలిగింది. లేదూ?

    “కొత్తగా విమర్శనో,కవిత్వమో వస్తున్నప్పుడు అర్థమవటం లేదనటం..అర్థమే లేదనటం ఆనవాయితీగా మారకూడదు.”
    కొత్త కవిత్వాన్నీ కొత్త విమర్శనీ అర్థమవటం లేదని నేను అన్నట్లు లేదే? ఓహో..మాబోంట్లకు అర్థం కాదుపో అని చెప్పటమేనా మీ ఉద్దేశ్యం? ఆనవాయితీగా ఏమి మారుతుందీ…మీ విమర్శక పోజులు మారుతున్నాయి..
    మీ శ్రుత పాండిత్యం కొత్త సౌందర్య శాస్త్రంగా డబ్బా కొట్టుకుంటోంది . దీన్నే నేను చర్చకు పెట్టింది.
    అది చదవాలా..ఇది చదవాలా ..పాతదీ కొత్తదీ ..ఒకరు చెప్పినట్లు పుస్తకాన్ని పరిచయం చేసిన వాళ్ళు పాటించాలా …కవులు పాటించాలా అని మీరు భావిస్తూ ఉండొచ్చు …కొన్ని విషయాలు కవికి తెలియక పోయినా విమర్శకుడికి ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నదే నా భావం. కవి చేసే ప్రయోగాల్నీ నూతన పడబందాల్నీ గుర్తిస్తూనే ఎక్కడైనా అప ప్రయోగం ఉంటే సరి చేయవచ్చునుకదా అన్నదే నా అభిమతం.
    పోలా? చాలా? అంటూ దాటేయటం …విమర్శక లక్షణం కాదనుకుంటాను. సమీక్ష అయినా విమర్శ అయినా అడ్డూ ఐపూ లేకుండా రాసి విమర్శకులుగా పోజులు కొద్తూ చెలామణి కావటాన్నే ఈ చర్చలో నేను ప్రశ్నించింది. కాదంటారా?

  10. Virinchi says:

    నారాయణ శర్మ గారికి కృతజ్ఞతా పూర్వక వందనములు
    మీ లోతైన విశ్లేషణలు కవికి ఎంతగానో ఉపయోగపడతాయని మరోసారి నిరూపితం నా విషయం లో..
    మీరు ఈ పుస్తకం లో పట్టుకున్న అంశం మీరన్నట్టు స్థూల లక్షానికి సంబంధించినదే అనుకుంటున్నాను
    ‘అనుకుంటున్నాను’ అని ఎందుకు అంటున్నాను అంటే..- కవి అంతఃకరణలో జరిగే సంఘర్షణ తనకు తెలియకుండానే కవితలోకి ఒంపేస్తాడాని పెద్దలు అంటారు. దర్భశయనం గారు కూడా ఈ పుస్తకానికి ముందు మాట రాశాక కలిసినపుడు ఈ అద్భుతమైన విషయం చెప్పారు. కవికి తెలియకుండా subconscious level నుండి కొంత భాష కవిత్వం లోకి ఒంపబడుతుందని. అది కవికి తెలియకుండా అబ్బే విద్య అని. నేను వారి మాటల్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేక పోతున్నా భావం ఇదే. కనుక కవికి తన కవితలో దాగి ఉన్న కోణాలని మీరు విమర్శకుడిగా పట్టి ఇస్తున్నారు. ఇలా మీరు విమర్శకుడిగా కవి ఆంతరంగిక భాష ను పట్టుకోగలగటం మీలోని నిబద్దత శాస్త్ర పరిజ్ఞానాల్ని మాత్రమే కాకుండా సహృదయతను కూడా చాటేలాగా ఉంది.
    మీకు నమస్సులు. అఫ్సర్ గారు సారంగ లో ఈ ఆర్టికల్ వేయటం చాలా ఆనందాన్ని కలిగించింది. అఫ్సర్ గారికి కృతజ్ఞతలు.

  11. Raju kotapati says:

    అద్భుతమైన విశ్లేషణ, విరించి అన్నయ్యకు నా శుభాకాంక్షలు.

  12. Aranya Krishna says:

    విశ్లేషణ బాగుంది. చాలా లొఎతుగా వుంది. విమర్శను ఒక శాస్త్రంగా చదువుకున్న నారాయణ శర్మ గారు మరొసారి లొతైన విశ్లేషణ చేసారు. విరించి మౌలికంగా మంచి థింకర్. సమాజంలో జరుగుతున్న ప్రతి పరిణామానికి స్పందించే తత్త్వం ఆయనది. ఆయనలోని కవి తన అంతరంగం లోని ఘర్షణ అంటా వ్యక్తపరచటానికే ప్రాముఖ్యత ఇస్తాడు. అందుకే ఆయనలోని కళాకారుడికంటే ఒక భిన్నమైన ఆలోచనాశీలే ఎక్కువగా కనబడుతుంటాడు.

    • Virinchi says:

      అరణ్య కృష్ణ గారు
      మీవంటి కవుల నుండి ఇలా కామెంట్ అందుకోవటం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది
      సదా మీకు కృతజ్ఞుడను

  13. portiadevi says:

    నారాయణ శర్మ గారి సమీక్ష కు కామెంట్ చేసేంత స్థాయి నాకు లేకున్నా,వారి సమీక్ష తో విరించి గారి “రెండో అధ్యయనానికి ముందు మాట “కు సరైన విలువ, గౌరవం తీసుకొచ్చారని చెప్పగలను ,సమీక్ష మాత్రమే కాక విమర్శలకు వారిచ్చిన వివరణ తో వారి కవితా సంపుటి కి సంపూర్ణత్వం తీసుకొచ్చారు ,వాక్య విన్యాసం మీద విరించి గారి కవిత ఆధార పడుతుందన్నది అక్షర సత్యం ,కెంపులు జారే పెదవులు అనే వాక్యం చదవగానే ఎర్రని పెదవుల నుండి కెంపుల కాంతి జాలువరడం కళ్ళముందు కనిపిస్తుంది, ఇలా దృశ్యాన్ని ఆవిష్కరింన్చి నప్పుడే కవి హృదయం పాఠకుడికి అర్ధమవుతుంది కదా , విరించి వెతుక్కున్న కొత్తదారి అనే మాటకు ఒక్క ఈక్వాలిటీ కండెంనెడ్ చాలు, నేను నీతో ఎట్టా సమానం రా అని ప్రశ్నించి స్త్రీ యొక్క స్టానం ఏంటో చూపించారు ,ప్రతి కవిత లోనూ సమాజం లోని అసమానతల మీద తనదైన శైలి తో ప్రశ్నిస్తూనే వున్నారు ,
    ధన్యవాదాలు నారాయణ శర్మ గారు ,మీ సమీక్ష తో విరించి గారి కవిత్వపు సారాన్ని తెలియచేసారు మరో సారి విరించి గారి కవితలని చదవాలన్న కోరిక కలిగించారు ,
    అభినందనలు విరించిగారు

    • Virinchi says:

      పోర్షియా గారూ
      కృతజ్ఞతలు
      మరో సరి మీరు కవితలు చదవాలని నా కోరిక

  14. మంచి విశ్లేషణ సార్ శర్మ గారు…అభినందనలు సార్ విరించిగారు…, కేయన్ రాజు గారు నమస్కారం అండి…., మీ విమర్శ అద్భుతంగా వుంది, కాకపొతే తప్పుల్ని ఎత్తిచూపటంతో పాటుగా సరైన విధానాల్ని, పద్ధతులని కుడా ఇక్కడ ప్రస్తావించినట్టైతే అందరికి ఉపయుక్తంగా వుంటుంది అనేది నా అభిప్రాయం .., అలా కాని పక్షంలో బహుశా ఇలా జరగవచ్చునేమో అదేంటంటే మాకున్న మిడిమిడి జ్ఞానం వలన వివరం సరిగా తరలినపుడు ఒంటిచెతి చప్పుకొట్టవలసిన పరస్తితి వస్తుందేమోనని భయం అంతే సార్…ధన్యవాదాలు 😊

  15. K N RAU says:

    వంశీకృష్ణ గారూ మీ మెసేజ్ కి థ్యాంక్స్.
    రిప్లై ఇవ్వనవసరం లేదని నేనూ అనుకున్నాను సుమండీ. కానీ రిప్లై ఇవ్వనవసరం లేదంటూనే రిప్లై కోసమే మీరు దుడ్డు కర్ర పట్టుకుని దండించడమే కాక ఇక అదేదో రూళ్ళకర్రని (కాకపోయినా) దులపమని కూడా దబాయిస్తున్నారు. తిప్పక తప్పుతుందా మరి. మీరు కూడా దీన్ని రిప్లై అనుకోనవసరం లేదు దీనికి రిప్లై ఇవ్వనవసరం లేదు? మీకు ఎక్కడో ఎక్కడో ఏదో ఏదో ఐతే తప్ప? ఒకింత ఆలకిస్తే చాలు.

    నెత్తికెక్కనిదేదైనా సుత్తిగా అనిపించడంలో కొత్తేముంది . అన్నమయ్యకు ముందో వెనకో లేదా తోడుగానో పుట్టడం మన చేతుల్లో పనేనంటారా . అలాంటి విద్య మీకేమైనా తెలిసుంటే పుణ్యం కట్టుకోరు? సిగ్గుతో కందిన బుగ్గల్ని మాత్రమె కెంపులతో పోల్చాలని నేనన్నాని మీరు ఆరోపిస్తున్నారు. “మాత్రమె” అనే పదాన్ని నేనెక్కడ అన్నాను? మరోసారి నేను రాసింది చూడండి. “కెంజాయ” “కెంజిగురు’ “కెందమ్మి” “కెందామర” ఇంకా “కెంపున మెరసి పచ్చిమాశంగన” వంటివి ఎందుకు లేవూ. కనుక “మాత్రమె” అని నేను అన్నట్లు మీరన్నదాన్ని వెనక్కు తీసుకోండి. అన్నమయ్యని ఒక అపప్రయోగాల సిద్ధాంత కర్తగా.. మీరు ఈ ప్రపంచంపైన మీ ఎనలేని సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. మీ వ్యంగం అర్థం కానిదా? కానీ మీపైన నాకు జాలి కలుగుతోంది ఎందుకో! అన్నమయ్య అపప్రయోగం చేసాడని మీరు పొరబడ్డారు. అన్నమయ్య తెలివి తక్కువ వాడు కాడు గనుకనే సలక్షణమైన ప్రయోగమే చేసాడు.అపప్రయోగం అని అనుకుంటున్న వాళ్లని నివ్వెర పోయేలా చేశాడు. కెంపు కంటి (కెంపు+కన్ను) పదముంది గదండీ..దాన్నే అన్నమయ్య ఇక్కడ ఉపయోగించుకున్నాడు మహాద్భుత కవి సమయంగా . మీరు ప్రస్తావించిన పదమే (శృంగార సంకీర్తన ) ..దయచేసి మరో సారి చదవరూ!

    ఏమొకో చిగురు టధరమున – ఎడనెడ కస్తూ రి నిండెను
    భామిని విభునకు రాసిన – పత్రిక కాదు కదా

    కలికి చకోరాక్షికి కడ – కన్నులు కెంపై తోచిన
    చెలువంబిప్పుడిదేమో – చింతింపరే చెలులు
    నలువున ప్రాణేశ్వరుపై – నాటిన ఆ కొనచూపులు
    నిలువుగపెరుకగనంటిన – నెత్తురు కాదుకదా

    పడతికి చనుగవ మెరుగులు – పైపై పయ్యెద వెలుపల
    కడుమించిన విధమేమో – కనుగొనరే చెలులు
    ఉడుగని వేడుకతో ప్రియు – డొత్తి న నఖ శశి రేఖలు
    వెడలగ వేసవి కాలపు -వెన్నెల కాదు కదా

    ముద్దియ చెక్కుల కెలకుల – ముత్యపు జల్లుల చేర్పుల
    ఒద్దిక లాగు లివేమో – ఊహింపరే చెలులు
    గద్దరి తిరువేంకటపతి – కౌగిటి అధరామృతమున
    అద్దిన సురతపు చెమటల – అందము కాదుకదా

    అన్నమయ్య వాడిన స్త్రీ పర్యాయ పదాలు బోలెడున్నాయి కదా ! అబ్జాక్షి పద్మాక్షి ఏణాక్షి మీనాక్షి ధవళాక్షి నళినాక్షి మత్తాక్షి మదిరాక్షి etc., మరి పై పదంలో(సంకీర్తన) వీటిల్లో ఏదైనా వాడవచ్చు గదా . మరెందుకో అన్నమయ్య వీటి జోలికి పోలేదు. ఇవన్నీ 5 మాత్రల గణాలు కాబట్టి (చకోరాక్షి 6 మాత్రలు) గణభంగం అవుతుందనుకుంటే ..అంబుజాక్షి ఉత్పలాక్షి కువలయాక్షి నీరజాక్షి etc., 6 మాత్రల గణాలు కూడా ఆయన వాడినవేనే. పోనీ.. కలువ కంటి, మచ్చె కంటి, తలిరుబోడి, చిగురుబోడి, నగవులాడి, సొబగులాడి..ఇత్యాదివి ఉన్నా.. మరెందుకో ఆయన వీటి జోలికీ పోలేదు. వాక్యం చెడకుండా యతి గణ ప్రాసలూ మాత్రలుతో సహా
    ఎక్కడా పోల్లుపోయే అవకాశం లేనప్పటికీ ఆయన “చకోరాక్షి” (వెన్నెల పులుగు)నే ఎంచుకున్నాడు. ఇప్పుడు అన్నమయ్య సంకీర్తనని మరొకసారి చూడండి. కడకన్నులు కెంపై ఎట్లా తోచినవో తెలుస్తుంది. సురత క్రీడలో నిద్ర లేమితో కళ్లు ఎరుపెక్కిన అందాన్ని ఎంత అందంగా అన్నమయ్య కవిత్వీకరించాడో.! కెంపు కి కార్యకారణ సంబంధం ఉంటందని గమనించాలి కార్యకారణ సంబంధాన్ని చెలికత్తెలతో చెప్పించి అన్నమయ్య అద్భుతమైన కవిత్వమందించాడు. చకోరానికి రక్తాక్షము అనే పర్యాయ పదం కూడా ఉంది కదండీ.ఆరకంగానూ అన్నమయ్య సఫలుడయ్యాడు. ఎరుపెక్కిన కళ్లు,నెత్తురు అంటిన చూపులు..గొప్పగా వర్ణించాడు కదూ. మరి అన్నమయ్య కి అమాయక చక్రవర్తి బిరుదునిచ్చేద్దామా. అప ప్రయోగాలకి పితామహుడనీ ఆధునిక కవిత్వానికి రాచ బాట వేశాడనీ పొంగి పోదామా? కెందామర, కెంపుల కడియములు etc అన్నమయ్య ప్రయోగాలే గదా! మీకు తెలియనిదేముంది.

    ఇది ఆధునిక కవిత్వం ..మా ఇష్టం ..మా పదప్రయోగమే ప్రయోగం…ముక్కెరని మూతికీ లిప్స్టిక్ ని ముక్కుకీ ముడి పెడతాం .. వవ్హా వవ్హాల విమర్శకులూ సిద్ధం అనంటారా వంశీ కృష్ణ గారూ. ఇంకేమంటాం…
    శిరసి మాలిఖ మాలిఖ మాలిఖ !!
    స్వస్తి.

  16. Balu Reddyboina says:

    K N Raju గారూ!
    ముందుగా, ఇంతటి గొప్ప చర్చకు(నే చూచినంత వరకు నాకు ఇదే గొప్పది) ఊతమిచ్చిన వ్యాఖ్యానం చేసిన మీకు కృతజ్ఞతలు.
    నారాయణ శర్మ గారు వివరణ ఇచ్చిన తర్వాత మీరు అప ప్రయోగమని ఆక్షేపించిన వాక్యం “కెంపులు జారిన పెదవులు” మీరు అంగీకరించినా,జీర్ణించుకోలేకున్నా కవి సమయం పరంగా ఈ ప్రయోగం సరైనదే అని నేనంటాను.అదికూడా ఏ కవితా సంకలనాలూ, రచనలూ రాయని కనీసం చదవని నాఅనుభవంతో(ఓ పదైదు కవితలు తప్ప). కేవలం సందర్బానికి సంబంధించిన స్పృహ(common sence) అనే ఆయుధంతో మీ భావనని దిక్కరిస్తున్నాను.
    ఆది శంకరుడు చెప్పినా,అన్నమయ్య చెప్పినా,అక్షరం ముక్కరాని మా అమ్మ చెప్పినా కవిత్వంలో ఉపమానాలూ,పోలికలూ,అలంకారాలూ అతి సహజం. ఇక్కడా అదే జరిగింది. ఆ పోలికను ఇలాగే చెప్పాలని నిర్దేశించలేం. ఒకరు ఎర్రనీబుగ్గలతో పోలిస్తే, మరొకరు ఎరుతెక్కిన కళ్ళు, ముక్కు పుటాలు, మెడవొంపులు, అక్షరాలు(రుధిరాక్షరాలు) దేంతోఐనా పోల్చొచ్చు. నేనైతే ఎర్రజెండాతో పోల్చుటకిష్టపడతాను.
    ముందు కవి సందర్భ సందులోకి మరోమారు తొంగి చూడండి.
    “కెంపులు జారిన పెదాలు” ఎంత అందమౌన భావనో!
    మెజారిటీ కెంపులు ఎరుపు వర్ణంలో ఉంటాయి.బుగ్గలు ఎరుపెక్కగా లేనిది పెదాలు(కెంఫు వర్ణం గలవి) ఎరుపెక్కలేవా!!
    ఇక వంశీ కృష్ణ గారిని అన్నమయ్య శైలిని ఆక్షేపిస్తున్నాడన్నారు. బుగ్గలు,కన్నులు,పెదాలు ఎరుపెక్కడం(కెంపు వర్ణాన్ని జారవిరచటం అదే పొంగింపజేయటం) ఇద్దరి పోలికా ఒకేరకం కదా! అందుకే ఐతే మీరు అన్నమయ్య పోలికనూ అప ప్రయోగమంటున్నాలా? అని వ్యంగ్యంగా అంటున్నారు. అది అర్థం చేసుకోలేని మీరు నేరాన్ని అతనిపై(వంశీకృష్ణ) మోపి అన్నమయ్యను తప్పుపడుతున్నావంటున్నారు….
    ఇదీ సందర్బ స్పృహ తోనే అంటున్నాను.
    కోంచెం ఘాటుగా ఉన్న నా మాటల్ని క్షమించండి.
    మిమ్మల్ని విమర్శించే ప్రాథమిక జ్ఞానం నాకు లేదనిపిస్తే దుషించండి.

  17. Virinchi says:

    వంశీ కృష్ణ గారు
    మీ మాటల్లో మీరు నా కవితలు బాగా చదివారనే విషయం అర్థం అయింది
    వాదాల విషయం ఎలా ఉన్నా..మీరు కవిత్వం చదివి మాట్లాడుతున్నందుకు చాల సంతోషం
    Thanks for your supportive words

Leave a Reply to Virinchi Cancel reply

*