లడ్డూ కావాలా నాయనా..!?!

A_Tirupathi_laddu

 

 

  -బమ్మిడి జగదీశ్వరరావు

~

 

ప్రియమైన భక్తులకి..

భగవంతుడు పంచుకోవాల్సింది వొకటుంది.. అది లడ్డు.. మహా ప్రసాదం!

నాకు తెలుసు, నాకులాగే మీకూ ‘తిరుపతి’ లడ్దంటే మహా యిష్టం కదూ.. లడ్డూ ప్రసాదం కళ్ళకి అద్దుకోనే లోపలే నోట్లో నీళ్లూరుతాయి.. తప్పు కాదు.. ఆ రుచి అటువంటిది.. మీరే కాదు.. నేనయినా అంతే!

నన్ను చెయ్యెత్తి మొక్కనివాళ్ళు కూడా నాలడ్డూని యిష్టంగా అపురూపంగా తింటారు.. అంత కమ్మగా వుంటుంది. యెంతో జిమ్మగా వుంటుంది. అమృతమంత రుచిగా వుంటుంది. ఆమాటకొస్తే అమృతానిది యేమి రుచి? అమృతాన్ని తలదన్నే రుచి కదూ లడ్దూది..?

అందుకే సుప్రభాతం సమయాన వెన్నతో మొదలుపెట్టి యేకాంతసేవ లోపు లడ్డూ వడా చెక్కెర పొంగలీ బెల్లం పొంగలీ పులిహోరా దద్దోజనమూ వడపప్పూ చిన్నలడ్డూ మిరియాల అన్నమూ కలకండా యింకా నేతి మురుకూ జిలేబీ ఫోళీ సమోసా పాయసమూ పెద్దవడా సిరా బెల్లం దోశా మురుగన్నమూ అప్పమూ.. అన్నీ అర్పించినా సమర్పించినా.. నాకు ఆ లడ్డూయే వేరప్పా.. దాని రుచి దేనికీ రాదు గాక రాదు!

అంతెందుకు?, నాదర్శనం కానప్పుడు కూడా లేని నిరాశ లడ్డూ దొరకనప్పుడు వొస్తుంది.. ఔనా..?

లడ్డూ పదార్థమే కాదు పదం విన్నా నోట్లో నాలుక మునిగిపోతుంది! ఎంత కమ్మటి వాసన. అమ్మ దగ్గర వొచ్చే వాసన. ఆలి దగ్గర వచ్చే వాసనకు పోటీ పడదూ సువాసన..? ఆస్థానం లడ్డూ.. కల్యాణం లడ్డూ.. ప్రోక్తం లడ్డూ.. దేనికదే సాటి గదూ..?

మా యిద్దరు దేవేరులూ కలిసి యింత శనగపిండి తెచ్చి నలుగు పెడతారా? నాకు వొళ్ళు మంటగా వుంటుంది! అర్ధాంగీలే గాని అర్థం చేసుకోరూ?! ‘వొంటికి గట్టిగా గంపలకొద్దీ శనగపిండి పెట్టకపోతే రంగు యేడ నుంచి వచ్చుద్ది’ అంటారేగాని ‘అయ్యో శనగపిండి.. లడ్ల లోకి పనికొస్తాదే..’ అంటే వింటారా.. వినరు! క పోగా ‘యింత లడ్డులపిచ్చి యేమయ్యా నీకు’ అని మురిపెంగా తిట్టిపోసి తినబెడతారు!

లడ్డూలో వుండేది శనగపిండేనా? బూందీతోటి పటికబెల్లముతోటి పచ్చకర్పూరముతోటి.. నెయ్యేసి ముంతమామిడి పువ్వేసి కుంకుమపువ్వేసి.. కలకండా జీడిపప్పూ యాలకులూ యెoడుద్రాక్షా చెక్కెరా.. యెన్నెన్నో యేసి.. అబ్బా యేమి సేస్తిరి యేమి సేస్తిరి..

‘తేనెని మించిన తీయందనము.. మధువును మించిన మధురసము.. ఆహా.. ఆహాహా.. వోహో.. వోహోహో..’ యీ తిరుమల శ్రీవారు లడ్డూ కోసం తపిస్తూ పరితపిస్తూ అమ్మ వెంట పడ్డ పిల్లాడిలా గుమ్మలవెంటపడి పరిగెత్తుతూ రెండు చేతులూ చాస్తే- నాసామిరంగా.. కౌగిలికంటే తీయగుండదూ..?! ఆమాటే అంటే యిక ఆడంగులతో అగ్నిగుండం తొక్కడమే! యెందుకని.. ఆ పెదవులు అందుకొని.. లడ్డూలా వున్నాయి.. అంటే మురిసిపోయారే గాని లడ్డూ ‘అగ్రస్థానం’ అందనేలేదు!

‘లడ్డూ కావాలా నాయనా..’ అని అటు అలమేలు మంగమ్మా యిటు పద్మావతమ్మా యిద్దరూ చెరో లడ్డూ చేత పట్టుకు తెచ్చారు.. ఆవురావురు మన్నాను. ఆబగా అందుకున్నాను. ఆత్రంగా తినబోయి ప్రయత్నించి ఆగి.. నిమిరి ఆఘ్రాణిస్తూ వుండగా ‘యీ పతి.. మన శ్రీపతి.. యేనాడైనా మనల నిమిరి యింత పరవశించినాడా..?’ అలిగినారు భామలు. మూతులు మూడొంకర్లు పెట్టినారు. ‘వశమయ్యాక.. పరవశము యేడ నుండి వస్తుందే..!’ అని గొణిగినాను. అంతకన్న సణిగిన సమరమని నాకు అనుభవపూర్వకముగా తెలుసును! ముందు తిన్నాక ఆపైన అలక తీర్చవచ్చుననుకున్నాను!

‘అబ్బా యేమి సేస్తిరి యేమి సేస్తిరి..’ అనుకొనగా ‘నీ నామమెంతో రుచిరా..’ భక్తుల పాటలు నన్ను తాకాయి. ‘ఈ లడ్డూ యెంతో రుచి యెంతోరుచిరా’ సందర్భోచితంగా నా పలుకులు పల్లవించాయి. గొల్లపిల్లవాడిని అమ్మ నోరు తెరవరా అంటే తెరిచినట్టు ‘ఆ..’ అని తెరిచాను. ఔను మరి.. నోరు పట్టని లడ్డూ ఆయే! లాలాజలము యేడు సముద్రాల తీరున యెగసి పడుతోంది! లడ్డూ కొరకబోతే నా పన్నూడింది. నాది కాదు. భూలోకంలో భక్తుడిది. భక్తుని భక్తిని స్వీకరించినట్టే నొప్పినీ స్వీకరించినాను.

గుమ్మలిద్దరూ గమ్మున అలకని అవతలికి విసిరికొట్టి నన్ను వొక్క వురుకున చేరినారు. అర్ధ భాగాలు కదా? రెండు అర్ధ భాగాలు.. సగమూ సగమూ కలిపి నా జగము మొత్తం వాళ్ళే! ఏదీ నాకేదీ చోటు? నేను లేను! మొత్తం వాళ్ళే. వాళ్ళకే నొప్పి. వాళ్ళదే బాధ. వాళ్ళకి నేను బందీ!

నేను నవ్వాను. వాళ్ళు యేడ్చారు. యెద పోసుకున్నారు. నా విరిగిన పన్ను చూసి వొరిగిపోయారు. వలవల కన్నీరుగ కరిగారు. ‘గుమ్మలే కాదు అమ్మలు మీరు’ అనుకున్నాను. కన్నీటి పొరలు కమ్మగ మసక కళ్ళతో ‘యేమయింది..?’ అడిగారు. ‘శనగ గింజ’ అన్నాను. కమ్మిన మసక కరిగింది. ‘కాదు’ అన్నారు. ‘పచ్చ కర్పూరం.. పంటికి తగిలింది’ అన్నాను. ‘పటిక బెల్లం..’ అన్నాను. ‘కుంకుమ పువ్వు కొమ్మ’ అన్నాను. యేదన్నా నమ్మలేదు. యెనక్కి పెట్టిన చెయ్యిని ముందుకు లాగారు. మూసిన గుప్పిట దాచాను. గుమ్మలిద్దరూ వొక్కటైనా సుమబాలల సుకుమారిలు కదా.. పిడికిటిని తెరవలేకపోయారు. చెరో పక్క చేరి చక్కిలిగిలి పెట్టారు. నా పిడికిలి దానికదే తెరచుకుంది!

బోల్టు.. యినుప బోల్టు..!

‘మునుపు దొరికిన నట్టు తీసుకురా’ అన్నాను. ‘యెందుకు యెంకటేశా?’ అన్నట్టు చూసారు. ‘దీందో కాదో..?’ అన్నాను. తెచ్చిస్తే అమిర్చి చూసి ‘దీందే’ అన్నాను. ‘సిగ్గులేదూ..?’ అన్నారు. నా సిగ్గుకు సమతూకంగా.. లడ్డూల్లో రోజూ దొరికిన యినుప మేకులూ బొందులూ తాళాలూ నాణేలూ చాలక రాళ్ళూ రప్పలూ పిన్నులూ పెన్నులూ గుండు సూదులూ గుండీలూ.. వొకటి కాదు..!

‘యిందు దొరకనిదేదీ లేదు దేవీ..’ అన్నాను. ‘అవన్నీ యెందుకు..?’ దేవేరులు యేరులెత్తారు. ‘నా భక్తుల గాయాల గురుతులు’గా దాచుకున్నాను. కొట్టుగది నిండిపోయింది. ‘అవేమన్నా తులసీదళాలు అనుకున్నారా..?’ మంగమ్మ మండిపడింది. పద్మావతమ్మ కోపం పట్టనట్టే వుంది!

పంటి నొప్పికి నాకంట తిరిగిన నీరు సతులకంట జారింది!

కళ్ళు వొత్తుకొని మా ఆవిళ్ళిద్దరూ మళ్ళీ చెరో లడ్డూ తెచ్చి నా చేతిలో పెట్టారు. ఆబగా ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకొని యెప్పటిలా లడ్డూ కొరకలేకపోయాను. ‘భగవంతుణ్ణి కూడా భయపెట్టేసారు కదరా’ అనుకుంటూ వొక లడ్డూ విప్పాను. అందులో నల్లజెర్రి. మరో లడ్డూ రెండు భాగాలు చేసాను. మధ్యలో తెల్ల తేలు. నా చూపు ప్రాణవాయువుగా సోకిందేమో.. యెండిన నల్లజెర్రీ.. వెల్లకిలా తిరగబడింది.. తెల్లతేలూ.. బొమ్మాల్లా పడింది.. ప్రాణం పోసుకున్నందుకు సాక్ష్యంగా! అవి రెండూ అరచేతుల్లోంచి నేలమీదపడి.. పోయిన ప్రాణం వొచ్చిందని తెలీక ప్రాణభయంతో లడ్డూల్లో దొరికిన యినుప సామాన్ల కొట్టుగదిలోకి దూరిపోయినాయి!

అలమేలు మేలు కోలేదు. పద్మావతి కోలుకోలేదు. బుంగమూతి బుజ్జాయిల్ని చెరో చెంక కిందికి తీసుకొని ఆలనగా పాలనగా అక్కున చేర్చుకున్నాను. నా చూపులయితే నేలమీద వాలాయి. నా సహచరులవి కూడా!

అదే లడ్డూలు.. యిద్దరు భక్తుల చేతుల్లో.. వొక లడ్డూలో నల్లజెర్రి దేహం.. మరో లడ్డూలో తెల్లతేలు దేహం.. భక్తులు కొయ్యబారి చూస్తున్నారు. వాళ్ళ పిల్లలు విస్తుపోయి వింతగా చూస్తూ ‘లాడ్దూల్లో తేలూ జెర్రీ వున్నాయి కదా.. పాములు కూడా వుంటాయా..?’ అమాయకంగా అడుగుతున్నారు. ‘వుండవమ్మా.. పాములు వుండవు..’ తల్లులు నచ్చజెప్పుతున్నారు. ‘యెందుకు..?’ పిల్లలు అడగడం ఆపలేదు. ‘యెందుకంటే.. పాములు పెద్దగా పొడావుగా వుంటాయి కదా.. లడ్డూలో పట్టవు కదా..?!’ తర్కం బోధపడేలా తత్వం బోధపడేలా చెప్పాడో పెద్ద మనిషి! అంతా నవ్వారు!

నేను కూడా నవ్వుకున్నాను. గుమ్మలు నవ్వలేదు. ‘అపకీర్తి కాదా మీకు..?’ అన్నారు వుమ్మడిగా. ‘పాపభీతి లేదా..?’ నేనేదో చేసినట్టు నన్ను నిలదీశారు. ‘ఫలమూ పుష్పమూ తోయమూ మాత్రమేనా? యినుమూ ఘనమూ స్టిక్కూ ప్లాస్టిక్కూ జీవీ నిర్జీవీ.. అన్నిటినీ సమంగా చూడాలి కదా..?’ అన్నాను. యెంతయినా చేసినవారి చేతి రుచిని నిదించ నా తిన్న నోటికి మాట రాలేదు!

‘మీరు మాత్రం యేమి చేస్తారు.. బాగానే సరిపెట్టుకుంటున్నారు.. భక్తిని యుక్తిగా..’ అర్ధాంగులిద్దరూ నిందిస్తూనే నిట్టూర్చారు!

‘నాకు భక్తుల పోటు కన్నా- అధికారులకూ సిబ్బందికీ వీఐపీల పోటు యెక్కువైంది.. వారి సేవలు అటు మళ్ళించారు.. వారు నిమిత్తమాత్రులు..’ అన్నాను. ‘లడ్డూ..’ అని చెయ్యి చాపాను. లడ్డూ అందుకొని చేతిలో పెట్టింది మా పద్దూ అదే పద్మ. నోటికి అందించింది మా మంగ. తిన్నాను. కాని నా ముఖంలో మునుపటి అనుభూతిలేకపోవడం యిద్దరూ కనిపెట్టారు. అర్థమయ్యింది. నవ్వాను. ‘నకిలీ లడ్డు..’ అన్నాను. ‘భక్తుడు యిచ్చిందల్లా స్వీకరించాలిగా.. నోరు చూసుకుంటే అవుతుందా?, భగవంతుడి పాట్లు భగవంతుడివి..!’ అన్నాను. సతులు నకిలీ లడ్డూ లాక్కోబోతే వారికి అవకాశం యివ్వకుండా బాధ్యతగా మింగేసాను! నైవేద్యం వద్దనరాదు కదా..?

‘దళారుల్ని పెంచి పోషిస్తున్నారు కదా..?’ మంగమ్మ గంగవెర్రులెత్తి చూసింది!

‘వాళ్ళు అడుపు లేదు, వీళ్ళు తుడుపు లేదు, అందరి పోషణ భారము నాదే కదా..?’ అన్నాను.

‘మరి.. లడ్డూ.. ప్రత్యేక లడ్డూ.. విశిష్ట లడ్డూ.. యిన్ని తేడా లెందుకు..?’ పద్మమ్మ పరాకున అడగలేదు, పట్టించే అడిగింది!

‘భక్తీ వ్యాపారమయ్యే కొద్దే.. భగవంతుడికి విలువ!’ అని నవ్వాను. నవ్వడం మరచినట్టు నా సతులు. ‘నన్ను ధనిక దేవుణ్ణి చేసారు’ దీర్ఘంగా ఆలోచిస్తూ అన్నాను!

‘మనకొచ్చే ఆదాయం వల్లే మిగాతా దేవుళ్ళ గుడుల్లో గూట్లో దీపాలు వెలుగుతున్నాయి!’ అన్నారు మంగావతీ పద్మావతీ!

నా మౌనం చూసి యేమనుకున్నారో సతులిద్దరూ లడ్డూ నా చేతిలో పెడదామని చూస్తే వొక్క లడ్డూ కూడా లేదు! బిడ్డికిలు, అట్టికలు, దాకలు, దోకిలు, కడవలు, గూనలు, అండీలు సరి.. అండాలూ డేక్సాలూ బోనుపెట్టే కాదు, గదులన్నీ గాలించారు! వుట్టిమీది సట్టిలన్నీ వెతికారు! పళ్ళేలన్నీ బోర్లించారు! రుచి మరిగిన పెద్దలు వెనక ద్వారం ద్వారా లడ్డూలు సంచులకి సంచులు మోసుకు వెళ్తుంటే ముగ్గురం మూగవాళ్ళలా చూసాం! చూస్తే అనామక భక్తులకి లడ్డూలు లేవు! అదీసంగతి.. అందుకే నాకూ లడ్డూలు లేవు! భక్తుడికి లేనిదేదీ భగవంతుడికీ వుండదని భాగస్వామినులు యిద్దరూ అర్థం చేసుకున్నట్టే వున్నారు!

‘రోజుకు లక్షన్నర లడ్లు చేసినా దొరక్కపోవడమేమిటి?’ భక్తులు మనసులో అనుకున్నమాటలు మా చెవుల్లో పడ్డాయి! మా చూపులు భక్త జనంలోకి వారి యిల్లలోకి చొరబడ్డాయి!

సంచులకొద్దీ లడ్డూలు పట్టుకుపోయిన వాళ్ళు నాలుగేసి లడ్డూలు పంచుతున్నారు. వొక్క లడ్డూ దొరికిన వాళ్ళు అదే చిదిపి ముక్కలు చేసి పంచుతున్నారు. కొద్దిమంది నాలుగేసి లడ్డూలు వొక్కడే తింటూ వుంటే.. మరికొద్దిమంది నాలుగు రవ్వలూ పిసర్లూ నలుగురూ పంచుకు తింటూ వున్నారు!

మర్మమేమిటి అన్నట్టు చూసారు మా మగువలు!

అడక్క పోయినా అర్థం చేసుకున్న వాణ్ని! అందుకే అడగకనే చెప్పాను!

‘లడ్డూ మహా ప్రసాదం! ప్రసాదమేదయినా మహా ప్రసాదమే! ప్రసాదం ప్రజలందరికీ సమానమే! అందుకే అందరూ సమంగా పంచుకు తినేది! వొకరికి యెక్కువ మరొకరికి తక్కువ లేకుండా వుండేది! పెద్దవాళ్ళకి యెక్కువ చిన్నవాళ్ళకి తక్కువ అనేదే లేదు! లింగ భేదం లేదు! జాతి భేదమూ లేదు! అలా చేస్తే.. అది గుడి కాదు! ఆ గుడిలో దేవుడు వుండడు!’

మగువలిద్దరూ మౌనం వీడ లేదు!

‘నేనప్పుడూ యిప్పుడూ యెప్పుడూ రాయినే!’

నా మాటకు నా అమ్మలిద్దరూ కళ్ళలో కడివెడేసి నీళ్ళు నింపుకున్నారు.. నన్ను గట్టిగా పట్టుకున్నారు..!

‘ప్రసాదం అందరిదీ. ప్రసాదం అంటే లడ్డూ కాదు. ప్రసాదం అంటే గాలీ నీరూ నేలా. గింజా గంజీ. అన్నమూ వస్త్రమూ. పండూ కాయా. వసతీ వనరూ. సంపదా సకలమూ. సమస్తమూ. అన్నీ అంతా. సమంగా సమ సమంగా పంచుకోవాలి. అప్పుడే ప్రసాదం రుచి! ప్రసాదం తిన్న బతుకూ మెతుకూ రుచి! లేదంటే కాదంటే అదెప్పటికైనా అరుచే!’

‘మరి లడ్డూ అందరిదీ అవుతుందా..?’ పద్మావతి అంటే, ‘లడ్డూ అందరూ అందుకుంటారా..?’ మంగావతి అంది.

‘లడ్డూ మీద హక్కు అందరిదీ. దక్కని వాళ్ళు మొదట బతిమాలుతారు. దక్కకపోతే కొన్నాళ్ళకి తిరగబడి బలవంతంగా లాక్కుంటారు. లడ్డూ లేకుండా అయితే వుండనే వుండరు..!’

నా మాటలకు మా ముద్దుగుమ్మలిద్దరూ ముచ్చట పడ్డారు! అందరికీ లడ్డూలు దొరకాలని ఆశ పడ్డారు! అలాగని దీవించేసారు కూడా! యిక మీదే ఆలశ్యం! చేరుకోండి మీ లక్ష్యం!

మా యింట్లో జరిగిన యీ లడ్డూల కథ మీకు చెపితే – మీరు మీ యింటింటా కథలు కథలుగా చెప్పుకుంటే – చెయ్యాల్సిందేదో చేస్తే – మీ కథ మారుతుందని చెప్పాను! అయ్యో లేదుకదా అని దయతో జాలితో యెవరూ లడ్డూ యివ్వరు. ఎవరి లడ్డూ వాళ్ళే సంపాదించుకోవాలి!

భక్తులారా.. మీకు లడ్డూలు పంచలేకపోతున్నందుకు ఈ భగవంతుణ్ణి క్షమించండి!

యిట్లు

మీ

ఏడుకొండల వెంకటేశ్వరస్వామి

మీ మాటలు

  1. Buchi reddy says:

    కొన్ని లక్షలకు లడ్డు విరాళం???
    అది తింటే. ఎన్నో. లాబాలు ://పుణ్యాలు???
    జగమే. మాయ. ???
    బాగా. రాశారు. సర్
    //:::::::::::::::::;;;;;;;;::
    Buchi రెడ్డి గంగుల

  2. కె.కె. రామయ్య says:

    ” గాలీ నీరూ నేలా. గింజా గంజీ. అన్నమూ వస్త్రమూ. పండూ కాయా. వసతీ వనరూ. సంపదా సకలమూ. సమస్తమూ. అన్నీ అంతా. సమంగా సమ సమంగా పంచుకోవాలి ” అన్న బజరా సామికి దండాలు.

  3. D Subrahmanyam says:

    బాగా రాసారు భజరా గారు అభినందనలు

మీ మాటలు

*