చెరువు – చింతచెట్టు

 

 

-స్వాతి కుమారి బండ్లమూడి

~

 

మరి- బాగా ఎండల్లో, నడి వేసవిలో ఎండిపోయిన చెరువులో సాయంత్రాలు పిల్లలంతా చేరి ఈలేస్తే అంటుకునే ఆట, చప్పట్లు కొట్టి పరిగెత్తే ఆట ఆడుకుంటారు కదా, ఇంట్లో తిడతారనే భయమున్న పిల్లొకత్తి పీచుపీచుగా మసక రాగానే తొందరగా ఇంటికి బయల్దేరుతుంది కదా, దాదాపు ఆ వేళప్పుడే వచ్చాడు వాడు. దుబ్బు గడ్దం, ఒత్తు జుట్టు, మురికి బట్టలూ, ఆ అవతారమూ; ఏ దిక్కునుండి, ఏ వూరి నుంచి వచ్చాడో ఎవరూ చూడలేదు. పాతగుడ్దతో కట్టిన మూటొకటి చంకన పెట్టుకుని ఆడుకునే పిల్లల మధ్యకి ఈలలేసుకుంటూ చప్పట్లు కొడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. మట్టిదిబ్బ మీద మూట విసిరేసి “రండ్రా! నన్నంటుకోండి చూద్దాం” అని వాళ్ల మధ్య వడగాలిలా అటూ ఇటూ గెంతాడు. “అమ్మో! పిచ్చోడు” అని గట్టుమీదకి పారిపోయారు వాళ్ళు. “పోరా పిచ్చెదవా” అనరిచాడు ఒక పెద్ద పిల్లాడు కాస్త ధైర్యంగా. “ఓయ్, ఉరేయ్… నా పేరెవడు చెప్పాడ్రా నీకు? బలే, బలే” అని పెద్దగా నవ్వాడు పిచ్చాడు, బయమేసేలా కాదు నవ్వొచ్చేలా నవ్వుతాడు వాడు, కితకితలు పెడితే మెలికలు తిరిగినట్టు వంకర్లు పోతూ ఇహ్హిహ్హి అని. నవ్వితే వాడి కళ్ళ పక్కన వదులుగా ఉన్న చర్మం గీతలుగా ముడతలు  పడుతుంది. “మళ్లీ రేపు రండి. రారూ? హిహి” అనుకుంటూ తలకింద మూట వొత్తుగా పెట్టుకుని కాలిమీద వేసుకున్న కాలు ఊపుతూ ఆ ఎండిన చెరువులో పైకి చూస్తూ పడుకున్నాడు. పిల్లలు బెదిరిపోయి ఎటు వాళ్లటు ఇళ్లకెళ్ళిపోయారు.

అది మొదలు వాడా చెరువుని వదల్లేదు. మిట్టమధ్యాహ్నం రాళ్ళు రాజుకునే ఎండప్పుడు మాత్రం చెరువొడ్డున చింతచెట్టు కిందకి చేరేవాడు. ఎవర్నీ ఏమీ అనడు, పొమ్మంటే పోడు, తిడితే నవ్వుతాడు, గట్టిగా బెదిరించి పొమ్మని కర్ర చూపిస్తే ఇంకా పెద్దగా నవ్వుతాడు. మెల్లగా పిల్లలు అలవాటు పడిపోయారు, నాల్రోజులకి వాళ్ల ఆటల్లో చేర్చుకున్నారు కూడా. పిచ్చోడిది చువ్వలాంటి ఒళ్ళు, చురుకైన నడక, తూనిగలాగా ఎటైనా దూరిపోయి పరిగెడతాడు కానీ చచ్చినా అంటుకోడానికి చిక్కడు. జట్టులుగా ఆడేటప్పుడు వాణ్ణి తమలో చేర్చుకోడానికి రెండు జట్ల పిల్లలూ పోటీ పడేవాళ్ళు. పిల్లలకిష్టంగా ఉన్నాడు కదాని పెద్దాళ్ళు కూడా వాణ్ణేం అనలేదు. ఆ చెట్టుకింద వాడే పడుంటాడులెమ్మని వదిలేశారు.

పిల్లలు లేనంతసేపూ వాడేం చెయ్యడు, అట్లా ఖాళీగా చెరువులోనో చెట్టు కిందో తిరుగుతూనో పడుకునో ఉంటాడు. చింతచెట్టు పక్కన పసుపురాయికి ఎవరైనా బొట్టుపెట్టి ఒక కొబ్బరిముక్కో, అరటి పండో అక్కడ పెట్టెళ్తే తింటాడు. పిల్లలు  ఆటలకొచ్చినప్పుడు అటుకులో, మరమరాలో తెచ్చిస్తే ఆకుల్లో పొట్లాం కట్టుకుని రాత్రికి దాచుకుంటాడు. “పిచ్చోడా! ఏం తిని బతుకుతావురా? పనిస్తా చేస్తావా” అని ఎవరైనా జాలిగా అడిగితే “పోరా! పనికిమాలినోడా, పని చెప్తే తంతా, తంతే నవ్వుతా” అని మళ్లీ కితకితలుగా నవ్వుతాడు.  రాత్రైతే మాత్రం హుషారుగా గొంతెత్తి పాడుకుంటాడు చాలాసేపు. ఏమాటకామాట, వాడిగొంతు భలే సన్నగా, కాస్త ఆడగొంతులా మెత్తగా ఉంటుంది. వినసొంపుగా ఉంటుంది కానీ ఆ పదాలకి అర్థం పాడూ ఏముండదు. ఏ మాట గుర్తొస్తే, ఎదురుగా ఏది కనిపిస్తే ఆ పేర్లన్నీ కలిపేసి, ఒక్కోసారి మధ్యలో ఆపి “ఊహుహు,  రాళ్ళురప్పలు కాదు, మొద్దురాచిప్పలు, బాగుంది.”అని కళ్ళు మూసుకుని మళ్ళీ పాడతాడు. అప్పటికి ఊరు సద్దుమణిగి సగంనిద్రలో ఉంటుంది. ఐనా పాటలెవరిక్కావాలి. దొంగలొస్తే కాపలాకుక్క అరుపులాగా, రావిచెట్లూ, వేపచెట్లూ ఊగినప్పుడు అర్దరాత్రి వాడి పాటలు కూడా.

***

Art: Rafi Haque

Art: Rafi Haque

ఆ ఏడాది మొదటి వానొచ్చింది. చెరువునొదిలి పిచ్చోడు అచ్చంగా చింతచెట్టు కిందే ఉంటున్నాడు. మళ్ళీ వానొచ్చింది. చెరువు నిండింది. బిందెలతో, కావిళ్లతో చెరువు నీళ్లకి వచ్చే జనంతో బాగా పొద్దుపోతుంది. వాన వెలిసిన ఒక రాత్రి వాడు ఎప్పటికన్నా ఎక్కువ సరదాగా రాత్రంతా పాడుకుని ఆగి ఆగి నవ్వుకుని ఎప్పటికో నిద్రపోయాడు.

అప్పటికింకా తెల్లారలేదు. ఎక్కడా ఏ చప్పుడూ లేదు. ఆ పొద్దుటి చీకటిలో పిచ్చోడెందుకో చప్పున లేచి చూశాడు. అనుకోకుండానే వాడి పాతబట్టల మూటని గట్టిగా గుండెకి అదుముకున్నాడు. ఎవరదీ అని కర్రపుల్ల తీసీ అటూ ఇటూ గాల్లో ఆడించాడు. కర్రకి మెత్తగా ఏదో తగిలింది. “బ్బా…” అనొక ఆడ గొంతుతో పాటు గజ్జెల చప్పుడూ గబగబా దూరమయ్యింది. అట్లా పోయేటప్పుడు వెళ్తున్న మనిషి బిందెలోంచి నీళ్ళు ఒలికిపోయి వాడు తడిసిపోయాడు. పిచ్చోడు నవ్వాడు. “బిందె వాన, గజ్జెల వాన” అని మళ్లీ మళ్ళీ అనుకుని మూట తలకింద సర్దుకుని మళ్ళీ పడుకున్నాడు.

రోజూ తెల్లారకముందే ఇదే వరస. ఎట్లానో నిద్రాపుకుని ఒకరోజు పట్టుకున్నాడు. “ఎవరే నువ్వు? నీ పేరేంటే?” అన్నాడు. ఆ పిల్ల భయంగా చూసింది. ఎంతడిగినా ఏం చెప్పదు. అది మూగదని తెలిసింది వాడికి. దానికో పేరు కూడా ఏం లేదు. ఐనా మూగదానికి పేరెందుకని ఎవరూ దానికి పేరు పెట్టలేదు. బిందెలో నీళ్ళు వాడి మొహం మీద చల్లి నవ్వేసి పోయింది. ఎవరూ లేవకముందే నీళ్లకోసమో, నీళ్లవంకనో కానీ వచ్చేదా పిల్ల. కాసేపు అక్కడ కూర్చునేది. వాడూ సరిగ్గా ఆ వేళకి ముందే లేచేవాడు. చాలా మాటలు చెప్పేవాడు. కొన్నిసార్లు ఏదైనా పాడేవాడు. ఆ పిల్ల చద్దన్నం తెచ్చి పెడితే పొద్దెక్కాక తినడానికి దాచుకునేవాడు. ఒక్కోసారెందుకో ఇద్దరూ కలిసి బాగా నవ్వుకునేవాళ్ళు, ఒకళ్ల మీదొకళ్ళు నీళ్లు చల్లుకునే వాళ్ళు. రాత్రి పూట చెట్లకింద రాలిన పూలేరి ఆమె రాగానే నీళ్ల బిందెలో వేసేవాడు. మిగతా వాళ్లలా మూగదానా అని పిలవటానికి వాడికి మనసు రాలేదు. “నువ్వు మంజులవి కదూ? “ అనేవాడు. దానికి నోరుంటే మిగతా వాళ్లలా వాడిని పిచ్చోడా అని పిలవదని వాడికి ఎట్లా తెలుసో కానీ తెలుసు.

ఒక్కోసారి మంజుల వాడి మూటని చూపించి అదేంటని సైగ చేసేది. వాడిక్కోపమొచ్చి కర్రపుల్ల తీసుకు విసిరేసేవాడు. నొప్పుట్టి ఏడ్చి వెళ్ళిపోయేది. అలా అలిగితే ఓ రెండ్రోజులు వాడికి కనపడకుండా ఎటునుంచో చెరువుకి వచ్చి వెళ్ళిపోయేది. కానీ ఉండబట్టలేక మళ్ళీ వచ్చేది. అట్లా అలిగి మళ్ళీ వచ్చినప్పుడల్లా పసుపురాయి దగ్గర పళ్ళు, పొట్లాల్లో అటుకులు చీమలు పట్టి ఉండేవి. కళ్లనీళ్ళు పెట్టుకునేది, వాడి భుజం మీద తట్టి నిద్రలేపేది. వాడు “కొట్టన్లే, రాకుండా ఉండకే మంజులా, ఆకలెయ్యట్లేదు” అని నవ్వేవాడు.

తెల్లారుతుంటే బిందెత్తుకుని బయల్దేరేది. ఒక్కోసారి చెయ్యి పట్టుకు ఆపేసేవాడు. “ఇంటికెందుకూ? ఉండిక్కడే” అనడుగుతాడు. ఇంట్లో తాత ఉన్నాడని, తాతకెవరూ లేరని , లేచి నడవలేడని సైగ చేసి చెప్తుంది. “సరే! ఫో, ఛీ, పనికిమాలినదానా, ఫో, మళ్లీ ఇటొచ్చావా కొడతా” అని చెయ్యొదిలేవాడు. అటూఇటూ తిరిగే జనాల్ని చూసి అది గబగబా వెనక్కి తిరక్కుండా వెళ్లిపోయేది. అలా వెళ్ళేప్పుడు కాలిపట్టీలు భలే గలగలమనేవి.

ఎన్నిసార్లో అట్లా. ఇంకెప్పుడూ రావద్దనడం, రాకపోతే కడుపు మాడ్చుకు పడుకోవడం, మళ్ళీ అదొచ్చాకా “ఏమనను, కొట్టను. తాత దగ్గరికే పో, నాతో ఉండొద్దులే, ఏడవకు. చద్దన్నం తినేదాకా ఉండిపో” అని బతిమాలడమూ. వాళ్లకదంతా ఒక ఆటలాగా, అలవాటులాగా అయింది.

ఒకరోజు పిచ్చోడికి హుషారెక్కువైంది. పెంకితనం ముదిరింది. ఎప్పట్లాగే వెళ్లొద్దని చెయ్యి పట్టుకు ఆపాడు. మంజుల ఆగలేదు, చెయ్యి విదిల్చుకుంది. వాడికి పంతం వచ్చింది. బిందె లాక్కుని నీళ్లన్ని దాని మీద కుమ్మరించాడు. దానికెందుకో చాలా ఎడుపొచ్చింది. కోపమొచ్చింది. వాడేమో ఏం చేసినా నవ్వుతాడాయె, వీణ్ణెట్లా ఎడిపించాలా అని అటూ ఇటూ చూసింది. వాడి మూట కనపడింది. గబుక్కున ఆ మూట తీసుకు అటూ ఇటూ పరిగెత్తింది. వాడసలే పరుగులో చురుకుకదా వెంటపడ్దాడు, మీదపడి కలబడ్డాడు. మూట ఊడిపోయింది. అందులోని వస్తువులన్నీ కింద పడిపోయాయి; కొన్ని రంగుల మట్టి గాజులు, ఒక పాత చీర, ఒక పూసల దండా, ఇంకా అట్లాంటివే ఏవో. మంజుల ఏం మాట్లాడలేదు. ఏమడగలేదు. నిదానంగా మళ్లీ    చెరువుకెళ్ళి నీళ్ళు ముంచుకుని వెళ్ళిపోయింది. పిచ్చోడూ ఏం మాట్లాడలేదు. ఏం తెలీనట్టు అలా చింతచెట్టుకింద అటు పక్కకి తిరిగి పడుకున్నాడు. చెదిరిపోయిన సామానంతా అలాగే వదిలేశాడు.

గొడవైతే కొన్నిరోజులు రాదుగా ఆ పిల్ల, కానీ ఈసారి వచ్చింది. తెల్లారేదాకా నీళ్లకోసం ఆగలేదు. ఆ రాత్రే, చీకట్లో తడుముకుంటూ చెట్టు వెతుక్కుంటూ వచ్చింది. వాడెప్పట్లాగే నవ్వుకుంటూ, పదాలు మార్చి మార్చి పాడుకుంటూ, చెట్టు మాను మీద దరువేసుకుంటూ ఉన్నాడు. “ఓ మంజులోయ్! దా దా, ఈ పూట బాగా తిన్నా, చుశావా? చీమలకి పస్తే” అని పెద్దగా నవ్వాడు. మళ్ళీ కాస్త ఆగాడు. “ఇదిగో చెప్తున్నా! ఎందుకొచ్చావో వచ్చావు. ఈ పూట వెళ్లావా, ఇక అంతే” అని అరిచాడు. అది కాసేపేం అనలేదు. తర్వాత సైగ చేసింది మణికట్టు చూపించి మెడ చూపించీ, చిరిగిన మూట చూపించీ.. అవన్నీ ఎవరివని అడిగింది. “ఎవరేంటే? పనికిమాలినదానా? ఈ ఊరికి రాకముందు ఎన్ని ఊర్లు తిరాగాను. నీకెందుకే మూగదానా?” అని మళ్ళీ జోరుగా పాటందుకున్నాడు. ఆ పిల్ల వెళ్ళిపోడానికి లేచింది. “ఇదిగో! చెప్పాను. ఈపూట వెళ్లావా! ఇక..” వాడి మాట పూర్తికాలేదు, వాడి రెండు చెంపలమీదా బలం కొద్దీ చాచికొట్టింది. చీకట్లో తడుముకోకుండానే పరిగెత్తి ఇంటికెళ్ళిపోయింది.

ఆ రాత్రి తెల్లారాక నీళ్ళకెళ్ళిన వాళ్ళెవరికీ చింతచెట్టు కింద పిచ్చోడు కనపడలేదు. మూగది నిద్రలేచి చూసుకుంటే దాని  కాలిపట్టీలు కూడా కనపడలేదు. అసలు సంగతేంటంటే- కొట్టినా తిట్టినా ఎప్పుడూ నవ్వే పిచ్చోడు ఆ రాత్రంతా ఎక్కెక్కి ఏడ్చాడనీ, ఆ తర్వాతెప్పుడు నీళ్లకెళ్ళినా మూగది ఒక బిందెడు నీళ్ళు పసుపురాయి మీద కుమ్మరించి పోతుందనీ చింతచెట్టుకీ చెరువుకీ తప్ప ఇంకెవరికీ తెలీదు.

-*-

మీ మాటలు

  1. Intha gubulettinchelaa ela raastaavu swathi? Boldanni abhinandanalu neeku.

  2. satyanarayana says:

    ఎంత విషాదం .
    ఇన్ని వేల సంవత్సరాలుగా ,ఈ నేల మీద మానవులు సంచరించడం ప్రారంభించినప్పటి నుండి ,చెట్టు చెట్టుకి ,ఎన్ని విషాద సంఘటనలు తెలుసునో !
    ప్రతి పురాతన వృక్షం ఎన్ని గాధలు కడుపులో పెట్టుకుంటుందో ! పక్కన ఉన్న చెరువు ఎన్ని విషాదాలు దిగమింగుకుంటూ ఉంటుందో !
    స్వాతి కుమారి గారి, ” చెరువు చింత చెట్టు ” అందులో ఒకటి .
    వేళ్ళు బయటికొచ్చి ,శాఖ శాఖలుగా విస్తరించి ,గాలి తుఫాను కి ఒరిగి పోయి ,ఒంటరిగా రాత్రింబగళ్ళు వేచి ఉండే వృక్షా లన్నిటినీ చూసినపుడల్లా , ఎంతో బెంగ కలుగుతుంది . ఒక సారి వాటిని తడిమి ,తల పైకెత్తి మొత్తం పరికించి చూసి కదిలిపోయాను చాలా సందర్భాల్లో మళ్లీ ఇటుగా వస్తానో రాలేనో ! అన్నట్లు .
    పాపం ఆ పిచ్చివాడు ,ఏ చెరువు గట్టున చేరాడో కొత్త మూట పట్టిలతో పాటు కట్టుకుని ,. మగ బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు !
    పాపం ఆ పిల్ల , మూగ వేదన ఎవరితో పంచుకుంటుంది !
    ఒక స్నేహం ,ఒక జీవి ,ఒక కారణం ఒక్క సారి వెక్కిరించింది . పాపం లేత హృదయం తట్టుకోలేక పోయింది . అయినా అంత కోపం రావాలా ?
    ఏమో ఎపుడయినా తిరిగి వస్తాడేమో !

  3. కె.కె. రామయ్య says:

    నువ్వెళ్లిపోయాకా రక్తకన్నీరు కార్చుకొన్నాను నేను. నా విషాదం పెరిగిపోయింది. నీ నిష్క్రమణ మాత్రమే కారణం కాదు. నీతో పాటు నా నేత్రాలు కూడా నన్ను విడిచిపోయాయి. ఇపుడు నేనెలా ఏడ్చేదీ? —- రూమీ

    “మనం మరణించిన తరువాత మన సమాధిని భూమిలో కాక జనుల గుండెలలో చూసుకోవాలి ” అన్న 13వ శతాబ్దానికి చెందిన పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త మరియు సూఫీ మౌలానా జలాలుద్దీన్ ముహమ్మద్ రూమీ వాక్యాలను జ్ఞప్తికి తెచ్చాయి స్వాతి కుమారి గారి ”చెరువు చింత చెట్టు” కధలోని జీవన విషాదం. రచయిత్రికి నెనర్లు.

    కధను చక్కగా వివరించిచెప్పిన సత్యనారాయణ గారు, కొప్పర్తి గారి కవితను ఇక్కడ చదవరూ :

    http://saarangabooks.com/retired/2015/02/05/%E0%B0%95%E0%B1%86%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80-%E0%B0%86%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D/

  4. కె.కె. రామయ్య says:

    ఇంత గుబులెత్తించేలా ఎలా రాస్తావు స్వాతీ? బోల్డన్ని అభినందనలు నీకు ~ అరుణ పప్పు

    ( ప్రసిద్దులైన తెలుగు రచయిత, జర్నలిస్తూ అయిన అరుణ గారు వ్యాఖ్యలను తెలుగులో రాస్తే చదువరులకు సౌకర్యముగా ఉంటుందని విన్నపం )

  5. satyanarayana says:

    కె . కె . రామయ్య గారికి కృతజ్ఞతలు ,చక్కని కవితని చదివించారు . ( కొప్పర్తి కవిత )
    ఎన్ని లోతయిన భావాలున్నాయో ,ఎన్ని విధాలుగా మనిషి తనం కన్నీళ్ళ ద్వారా ప్రకటితమవుతుందో .

  6. amarendra says:

    swati gaaroo..krutagnatalu, అభినందనలు.

  7. కె.కె. రామయ్య says:

    “చెరువు–చింతచెట్టు” కధా రచయిత్రి బండ్లమూడి స్వాతి కుమారి గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్న ప్రియమైన శ్రీ దాసరి అమరేంద్ర గారూ! ఈ కధను ఏ పర్స్పెక్టివ్ లో చూసి, ఎలా అర్ధం చేసుకుని, ఎంతలా ఆస్వాదించాలో మరికాసిన మధుర వాక్కులలో దయచేసి వివరించరూ ( తీరిక చూసుకుని ); సత్యనారాయణ గారు కధను ఒకింత చక్కగా వివరించిచెప్పినా.

  8. satyanarayana says:

    కె కె రామయ్య గారూ ,
    నిజమే అమరేంద్ర గారు ,ఇంకా బ్రాడ్ పర్స్పెక్టివ్ లో వివరిస్తే “దృశ్యాన్ని “, కొత్త రంగులు కనిపిస్తాయి . సత్యవతి గారి ” దమయంతి కూతురు ” లో విషాదం, చర్చ వచ్చినప్పుడు ,నేను వ్యక్త పరిచిన అభిప్రాయాలకి కోపం తెచ్చుకుని ,నాకు దూరమయ్యాడు ఒక మిత్రుడు .
    చివరికి స్వాతి కుమారి గారు ఏమంటారో చూడాలి .

  9. కె.కె. రామయ్య says:

    మిత్రమా సత్యనారాయణ గారూ! పి. సత్యవతి అక్కయ్య గారి “దమయంతి కూతురు” కధలోని విషాదం ( అమ్మా నువ్వు లేకుండా మేం ఉండలేం. ఈ సముద్ర తరంగాలు మమ్మల్ని భయపెడుతున్నాయి ) కలత పెట్టినంతగా, కన్నీరు పెట్టించినంతగా ప్రతిభావంతురాలైన స్వాతి కుమారి గారి “చెరువు–చింతచెట్టు” కధలోని విషాదం చెయ్యక పోవటం నాలోని లోపమేనేమో.

    “ఆమె నా తల్లి, నన్ను తల్లిలేని పిల్లను చేసిన తల్లి. నా బాల్యాన్ని కన్నీటి సముద్రం చేసిన తల్లి ” అని రోదించిన దమయంతి కూతురు పాత్ర చిత్రణ లా కాకుండా “చెరువు–చింతచెట్టు” లో ఓ మార్మిక విషాద మేఘావృత్త మాటునున్న పాత్రలను సరిగా చూడలేని అశక్తత నాది. అందుకే శ్రీ దాసరి అమరేంద్ర గారి సాయం కోరాను.

    “దమయంతి కూతురు” కధ ఈ లింకు లో చూడవచ్చు ( సెప్టంబర్, 2012న ఆంద్రజ్యోతి, ఆదివారం అనుబంధంలో వచ్చిన)

    https://teluguanuvaadaalu.files.wordpress.com/2013/04/e0b0a6e0b0aee0b0afe0b082e0b0a4e0b0bf-e0b095e0b182e0b0a4e0b181e0b0b0e0b1811.pdf

  10. కె.కె. రామయ్య says:

    కధ చాలా బాగుంది స్వాతీ ~ రాధ మండువ

  11. satyanarayana. says:

    కె కె రామయ్య గారూ ,
    దమయంతి కూతురు లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు .

    మీరు అన్నట్లు చెరువు -చింత చెట్టు ,విషాదం కేవలం ఇద్దరు వ్యక్తులకే సంబంధినది .
    కాక పోతే అనాదిగా ,ఎన్ని చిన్న చిన్న సంఘటనలు ,సంబంధాలు, ముడి పడి నట్లే కనిపించి ,జారి పోయినవి ,మూగ వేదన అనుభవిస్తూ ,సమయానికి సరిగా స్పందించక , సంశయాలతో ,అనుమానాలతో దూరమయినవి,గతాన్ని తలుచుకున్నపుడల్లా ,మనసు చివిక్కుమనిచపించేవి ,అనేక గ్రామాల్లో ప్రపంచమంతటా , జరిగినవి , వాటన్నిటి భారం తలపుకొస్తుంది .

    “దమయంతి కూతురు ” కనీసం రెండు జెనరేష న్స్ కి సంబంధించి , కొన్ని కుటుంబాల్లో ,కొందరి జీవితాల్లో పెను మార్పులకు దోహదమయినది . సమాజ ఆమోదం ,వ్యక్తిగత పరిణితి వీటన్నికి సంబంధించిన వివాదాత్మక అంశం . భూకంపం తో సమానమయినది . భయానకమయినది . జీవితాలు చెల్లా చెదురు అవుతాయి . విషాదం భరించలేనిదే .

    అందుకే మీకు అలా తోచింది . అందరికీ అలానే అనిపిస్తుంది .

  12. కె.కె. రామయ్య says:

    ” స్వాతి కుమారి గారి “చెరువు–చింతచెట్టు” కధ కొత్తది కాకపోవచ్చు, కానీ కధ చెప్పడంలోని కొత్తదనం, మిస్టిజం చాలా బాగుంది. కధలో వాడిన సిమ్బాలిజమ్స్ చాలా బాగా నచ్చాయి. సమాజం ద్రష్టిలో మూగదిగా ( Dumb by Societal Perception ) మౌనమ్ గా ఉండే మూగపిల్ల మంజుల, ఓ ఆర్టిస్టిక్ పర్సన్ కి సింబల్ గా ఉన్న పిచ్చివాడి పాత్రల చిత్రీకరణ మార్మికతల మాటున అద్భుతంగా చేసారు రచయిత్రి. మూగ పిల్ల, పిచ్చివాడి మధ్యన అనివార్య విఫల, విషాద ప్రేమ బంధాన్ని ప్రకృతి సాక్షీభూతాలైన చింతచెట్టు, చెరువుకి తప్ప సామాన్య మానవులకు తెలియదు, తెలిసిరాదు అంటూ ముగించటం గొప్పగా ఉంది ” ~ ఆవినేని భాస్కర్

    ( ఎయిర్ పోర్ట్ నుండి హడావిడిగా ఫోనులో చెప్పిన ఈ కధా విశ్లేషణ వివరాలను అర్ధం చేసుకుని తిరిగి రాయడంలో ఏవైనా లోట్లు లోపాలు జరిగుంటే అందుకు బాద్యుడిని నేనే ~ కె.కె. రామయ్య )

  13. Nagaraju Pappu says:

    నాకో పెద్ద అనుమానం – రచయిత/రచయిత్రి పేరు ఎంతవరకూ మనల్ని ప్రభావితం చేస్తుంది? స్వాతికుమారి మారుపేరుతో ఈ కథ ప్రచురించి ఉంటే, మనకి అప్పుడు కూడా ఇందులో మార్మికత, విషాదం కనిపించేవా? (నాకైతే ఇందులో మార్మికత, విషాదం, సింబాలిజం లాంటివేవి కనిపించలేదు. It seems to be a simple story, narrated in a child’s voice – ofcourse brilliantly done by the author. నాకు కథలు చదవటం రాదని ఎవరైనా అంటే, వెంటనే ఒప్పేసుకుంటాను :)

    ఇలా ఎందుకనిపించిందంటే, ఇవాళే డోరిస్ లెస్సింగ్, కలంపేరుతో రాసిన నవల ఒకటి తగిలింది:
    The story of Doris Lessing sending a novel under a pen name (Jane Sommers) to her publisher, and its rejection by a young critical reader is an “infamous” story – the publishers Jonathan Cape getting a lot of egg on their face for not being able to ‘recognise’ their famous author. For those interested, here is an account by the one who rejected her novel..

    http://www.newyorker.com/books/page-turner/doris-lessing-and-the-perils-of-the-pseudonymous-novel

  14. కె.కె. రామయ్య says:

    శ్రీ పప్పు నాగరాజు గారు తప్పట్టుకోనంటే నాదో సిన్న తుంటరి అనుమానం. రచయిత/రచయిత్రి పేరు ఎంతవరకూ మనల్ని ప్రభావితం చేస్తుంది లానే రచయిత/రచయిత్రి వ్యక్తిగత పరిచయం కానీ, కేవలం వారి ఇతర రచనలు చదివిన పరిచయం కానీ మనల్నిఎంతవరకూ ప్రభావితం చేస్తాయి?

    మార్మితక, సిమ్బాలిజమ్స్ ల సిగ్గోసిరి; దాందుంప తెగా పిచ్చోడు రేయ్యంతా ఎక్కెక్కి ఏడ్చి మూగ పిల్ల మంజులని, ఊరుని వదిలి వెళ్ళిపోవడం; ఆ పిల్ల వాడి జ్ఞాపకాలతో రోజూ ఒక బిందెడు నీళ్ళు పసుపురాయి మీద కుమ్మరించి పోవడం తలుచుకుంటే ప్రాణం ఉసూరుమనదటండి. ఈ కధను ఓ బాలచందర్, ఓ బాగ్యరాజా చేతికిస్తే దీన్నో గొప్ప ట్రాజిడీ పిచ్చర్ గా తియ్యగలరు సుమండి ( ఇంత గుబులెత్తించేలా ఎలా రాస్తావు స్వాతీ? అని అరుణ గారూ అన్నారండి మరి. )

  15. Sashanka says:

    రచయిత/రచయిత్రి పేరు ఎంతవరకూ మనల్ని ప్రభావితం చేస్తుంది? అని పప్పు నాగరాజు గారి ప్రశ్న.

    అమానత్ కథా రచయితగా పప్పు నాగరాజు గారి పేరు పాఠకులకు గుర్తుండి పోయింది. కనుక వారు ఆ తర్వాత ఏకథ రాసినా అమానత్ తో పోలిక తప్పదు. ఇదే రచయిత/రచయిత్రి పేరు ప్రభావితం చేయటమంటే.

    -శశాంక

  16. కె.కె. రామయ్య says:

    థాంక్యూ శశాంక్! ఖ్యాతి వహించిన, ఓ శైలికి సంబందినచినట్లుగా పేరుపడ్డ రచయిత/రచయిత్రి కొత్త రచనలు చదివేటప్పుడు వారి పేరుప్రఖ్యాతలు, వారి శైలీ ముద్ర పాఠకుడిని undue గా ప్రభావితం చెయ్య వచ్చు అన్న పప్పు నాగరాజు గారి మాటకు ఉదాహరణగా సారంగలోనే వచ్చిన నాగరాజు గారి “అమానత్” కథనే ప్రస్తావించినందుకు.

    ఇది గులాబి పువ్వు, ఇది మామిడి పండు అని వాటి పేరుప్రఖ్యాతలు తెలియని (నాలాంటి) పామరుడు కూడా వాటి రసాస్వాదన చెయ్యగలరు అని శ్రీశ్రీ నో, రావిశాస్త్రి గారో అన్నట్లు గుర్తు.

    అలాగే ప్రఖ్యాత రచయితల ప్రసిద్ద రచనల్ని మొదట్లో తిప్పికొట్టిన ప్రచురణ కర్తలూ ఉన్నారు కదండి. ( గూగులమ్మ చెప్పిన వాటి ప్రకారం : Irving Stone’s Lust for Life was rejected by 16 different editors. Vladmir Nabokov’s Lolita was rejected by 5 publishers in fear of prosecution for obscenity before being published in Paris. James Joyce’s Ulysses was judged obscene and rejected by several publishers ).

    స్వాతి కుమారి గారి “చెరువు–చింతచెట్టు” కధలోని బ్రిలియన్స్ ని నాగరాజు గారి మరికొన్ని మాటల్లో వినాలని నా కుతూహలం.

    అమానత్ కథకు లింకు :
    http://saarangabooks.com/retired/2016/03/31/%E0%B0%85%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%A4%E0%B1%8D/

  17. satyanarayana says:

    పప్పు నాగరాజు గారు కొంతవరకు నిజం చెప్పారు .
    “గుండె పగిలిపోతోందిరా చిన్నోడా ” అన్న వాక్యంతో కట్టిపడేసిన
    “వాంగ్మూలం” కథ , జ్యోతిలో ,చదవడం ప్రారంభించి ,అరే ఎవరూ! ఇంతబాగా రాశారు అనుకుంటూ ,రచయిత పేరు తెలుసుకున్నాను .
    ఆ రచయిత కథ కాబట్టే ,కుతూహలంతో చదవడం జరిగింది .
    Abstract Art లాగా చిత్రణ జరిగింది , పూర్తిగా చదివాక వెలుగు కొన్ని కోణాలలో మెరిసిపోయింది ,చిన్న వజ్రం లాగా .

    “పోరా పిచ్చెదవా” అనరిచాడు ఒక పెద్ద పిల్లాడు కాస్త ధైర్యంగా. “ఓయ్, ఉరేయ్… నా పేరెవడు చెప్పాడ్రా నీకు? బలే, బలే” అని పెద్దగా నవ్వాడు పిచ్చాడు,
    తరవాత ,ఎండిన చెరువులో పడుకోవడం ,
    తిడితే నవ్వుతాడు, గట్టిగా బెదిరించి పొమ్మని కర్ర చూపిస్తే ఇంకా పెద్దగా నవ్వుతాడు. ,
    “పిచ్చోడా! ఏం తిని బతుకుతావురా? పనిస్తా చేస్తావా” అని ఎవరైనా జాలిగా అడిగితే “పోరా! పనికిమాలినోడా, పని చెప్తే తంతా, తంతే నవ్వుతా” అని మళ్లీ కితకితలుగా నవ్వుతాడు.
    ఊహుహు, రాళ్ళురప్పలు కాదు, మొద్దురాచిప్పలు, బాగుంది.”అని కళ్ళు మూసుకుని మళ్ళీ పాడతాడు.
    “బిందె వాన, గజ్జెల వాన” ,
    ఒక్కోసారెందుకో ఇద్దరూ కలిసి బాగా నవ్వుకునేవాళ్ళు, ఒకళ్ల మీదొకళ్ళు నీళ్లు చల్లుకునే వాళ్ళు. రాత్రి పూట చెట్లకింద రాలిన పూలేరి ఆమె రాగానే నీళ్ల బిందెలో వేసేవాడు.

    ఈ మాటలూ ,ఇలాటి చేష్టలూ ,కథ చివరిదాకా ఉన్నాయి ..
    వీటిలో మార్మికత ,సిమ్బాలిసమ్ లేదంటారా .
    ఇక ,విషాదం ,
    పాపం ఆ మూగ పిల్ల జీవితం ,ఏమిటో ,ఆ తాత ఏమిటో ,ఊళ్ళో ఎవరయినా ఆదుకుంటారా వాళ్ళని ,తాత లేకపోతే ,ఆ పిల్ల ……?
    ఆసరా లేని మూగపిల్ల జీవితం ,ఆ చిన్న పల్లెలో ఊహించగలమా !
    James Lasdun లాగా మీకూ కొంత కాలం తరవాత మా ద్రుష్టి కోణం కనిపిస్తుందేమో !

  18. కె.కె. రామయ్య says:

    “చెరువు–చింతచెట్టు” కధ రాసిన స్వాతి కుమారి గారి ‘వాంగ్మూలం’ కధపై ఆంద్రజ్యోతి పత్రిక తిర్పతి ఆర్.ఎం. ఉమామహేశ్వర రావు గారి అద్భుత విశ్లేషణ ( కవితాత్విక కథ. రాసింది చిన్న పిల్లే. గట్టి గడుగ్గాయి. వాక్యంలో, కథనంలో, కథలో ఎంత ఆరిందాతనం! గాఢమైన కవితాత్మక వాక్యాలు, తాత్విక మాటల పోగులు ) సారంగ లోని ఈ లింకు వద్ద :

    http://saarangabooks.com/retired/2013/07/10/%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95-%E0%B0%95%E0%B0%A5-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%AE%E0%B1%82%E0%B0%B2%E0%B0%82/

    కానీ సత్యనారాయణ గారూ! ప్రతిభావంతురాలైన రచయిత్రి / కవయిత్రి స్వాతి కుమారి గారు సామాజిక స్పృహ, సాంఘిక సంక్షేమం, సామాజిక న్యాయం, సమసమాజ స్థాపన వంటి అవగాహనల వైపు ఎప్పుడు మొగ్గుచూపుతారో, ఆ దృక్కోణములో తమ తదుపరి రచనలు ఎప్పుడు చేస్తారో తెలియకున్నాది.

  19. satyanarayana says:

    కె కె రామయ్య గారూ ,
    “సామాజిక స్పృహ, సాంఘిక సంక్షేమం, సామాజిక న్యాయం, సమసమాజ స్థాపన వంటి అవగాహన” నూరు పాళ్ళు ప్రస్తుత సమాజ అవసరం .
    24 గంటలూ ,ప్రచార సాధనాల్లో ఊదర కొడుతున్న భక్తి,పూజలూ ,చాదస్తాలూ … ఆలశ్యం కాకముందే జ్ఞానోదయం కావాలని తపన .
    రామయ్య గారూ ,నేనూ అదే వెతుకుతూ ఉంటాను ,తెలుగులో అలాటి స్పృహ తో రచనలు చేసే రచయితల కోసం .
    చాలా తక్కువ గా కనిపిస్తారు .
    ప్రముఖుల్లో ,రంగనాయకమ్మ గారు ఒకరే కనిపిస్తారు . నాకూ అలాటి రచనలు చదవాలని , విస్తృతంగా అలాటి రచనలు రావాలని ఆశ .
    “చినపిలకాయల కతలు ” అనుకుంటాను ,నామిని గారు చిన్నపిల్లలకి పొద్దున లేచింది మొదలు వేపపుల్లలతో పళ్ళు తోముకోవడం ,తర్వాత బాగా నీళ్ళు తాగి గంతులేయడం (కాలకృత్యాలు) మొదలుకొని చెప్పాలని తాపత్రయ పడటం , వి .బ్రహ్మారె రెడ్డి గారి ” ఓ మనిషీ చరిత్రలో నీ స్థానం ఏమిటి ” అని క్లుప్తంగా కామన్ సెన్స్ బోధించడం , ఇలా కొన్ని రచనలు , అప్పుడప్పుడూ చదివాను .
    స్వాతి కుమారి గారి అభిప్రాయం ఏమిటో !

  20. శ్రీనివాసుడు says:

    **కొట్టినా తిట్టినా ఎప్పుడూ నవ్వే పిచ్చోడు ఆ రాత్రంతా ఎక్కెక్కి ఏడ్చాడనీ, ఆ తర్వాతెప్పుడు నీళ్లకెళ్ళినా మూగది ఒక బిందెడు నీళ్ళు పసుపురాయి మీద కుమ్మరించి పోతుందనీ చింతచెట్టుకీ చెరువుకీ తప్ప ఇంకెవరికీ తెలీదు.**
    ****************
    దునియా బనానే వాలే క్యా తేరే మన్ మే సమాయీ
    కాహే కో దునియా బనాయీ, తూనే కాహే కో దునియా బనాయీ
    ప్రీత్ బనాకే తూనే హసన్ జీనా సిఖాయా
    హస్‌ఁనా సిఖాయా రోనా సిఖాయా
    జీవన్ కే పథ్ పర్ మీత్ మిలాయే
    మీత్ మిలాకే తూ నే సపనే జగాయే
    సపనే జగాకే తూనే కాహేకో దేదీ జుదాయీ
    కాహే కో దునియా బనాయీ
    తూనే కాహే కో దునియా బనాయీ…….
    *************************************************************************
    చిత్రం : తీస్రీ కసమ్ ……..వ్యథ : హస్రత్ జైపురీ
    ఆత్మ : ముఖేష్ ………….రూపం : శంకర్ జైకిషన్
    తెర మీద బొమ్మ : రాజ్ కపూర్
    మీత్ : వహీదా రెహమాన్
    ************************************************************************
    ఈ అమృతాన్ని ఇక్కడ ఆస్వాదించండి.
    http://musicmylifelyrics.blogspot.in/2015/10/duniya-banane-waale-teesri-kasam-1966.html

  21. కె.కె. రామయ్య says:

    సపనే జగాకే తూనే కాహేకో దేదీ జుదాయీ ( స్వప్నాలను మేలుకొలిపి, వియోగాన్ని ఎందుకు ప్రసాదించావు ప్రభూ? ) అని గుర్తుచేసిన శ్రీనివాసుడు గారూ, జనాబే ఆలం ఆప్ పర్ యహీ ఉమ్మీద్ థీ.

  22. శ్రీనివాసుడు says:

    నెనర్లు రామయ్యా గారూ!
    మీ హృదయోల్లాస వ్యాఖ్య ఈ మధ్యలో ఒక రచనలో మేం చూడలేక పోయాం.
    అది కొన్ని వారాల క్రితం సారంగలో ప్రచురితమయిన ‘‘ ఓ మై గాడ్ ’’ అనే బజరా రచన.
    మీరు ఇప్పటికయినా అది చదివి, చదివించి మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు.
    నా ఉద్దేశంలో అది చాలామంది పట్టించుకోని ( కనీసం వచ్చిన వ్యాఖ్యలను బట్టి) లోతైన తాత్త్విక రచన.
    (పైకి వ్యంగ్యంగానే తోచినా, అసలు ఆ సంఘటనే ఒక బూటకమని తేలినా)

Leave a Reply to satyanarayana Cancel reply

*