కీర్తి శిఖరాగ్రంపై స్లీమన్

 

స్లీమన్ కథ-32

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ట్రాయ్ నిక్షేపాలను జర్మనీకి అప్పగించడానికి స్లీమన్ ఆమోదం తెలిపిన తర్వాత, విర్కో వెంటనే రంగంలోకి దిగాడు. సంబంధితులు అందరితో మాట్లాడాడు. చివరగా జర్మనీ ఛాన్సలర్ బిస్మార్క్ తో మాట్లాడినప్పుడు ఆయన ఎంతో ఉత్సాహం చూపించాడు. ఆ నిక్షేపాలను బెర్లిన్ లో శాశ్వత ప్రదర్శనకు ఉంచడంకోసం ఏమైనా చేయడానికి సంసిద్ధత చూపిన బిస్మార్క్, ఇంతకీ స్లీమన్ ఎటువంటి గౌరవసత్కారాలను ఆశిస్తున్నారని అడిగాడు. అత్యున్నత వర్గాలనుంచి గుర్తింపును మాత్రమే స్లీమన్ కోరుకుంటున్నారని అప్పటికి సమాధానం చెప్పిన విర్కో, ఆ తర్వాత స్లీమన్ ను సంప్రదించాడు.  కైజర్(జర్మన్ చక్రవర్తి)నుంచి ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని; సైనిక, పౌర ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారా(Pour le merite)న్ని, బెర్లిన్ గౌరవపౌరసత్వాన్ని, ప్రష్యన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ లో సభ్యత్వాన్ని తను కోరుకుంటున్నాననీ; నిక్షేపాలను ఉంచే ప్రదర్శనశాలకు శాశ్వతంగా తన పేరు పెట్టాలనీ చెప్పిన స్లీమన్; బిరుదు కూడా ఇస్తే సంతోషమే కానీ దానికోసం పట్టుబట్టబోనని అన్నాడు. ఒక్క Pour le merite మినహా మిగిలినవన్నీ నెరవేరేలా విర్కో ఒంటిచేత్తో కృషిచేశాడు. సోఫియాకు మాత్రం ఈ ఏర్పాటు నచ్చలేదు. ట్రాయ్ నిక్షేపాలు గ్రీస్ కు చెందాలని ఆమె ఆశిస్తోంది. కానీ అప్పటికే నిర్ణయం తీసేసుకున్న భర్తకు ఎదురుచెప్పలేకపోయింది. కైజర్ స్వహస్తాలతో రాసిన ప్రశంసాపత్రంలో తన పేరు కూడా చేర్చడం చూసి సంతృప్తి చెందింది.

అంతవరకూ లండన్ లో ప్రదర్శనకు ఉంచిన నిక్షేపాలను ఎట్టకేలకు 1880 డిసెంబర్ లో బెర్లిన్ కు తరలించారు. ఆరునెలల తర్వాత, 1881 జులై 7న, ఆ నిక్షేపాలను జర్మనీకి లాంఛనంగా అప్పగించి స్లీమన్ బెర్లిన్ లో రాజసత్కారాన్ని అందుకున్నాడు. వోల్కకుండా మ్యూజియంలోని ఒక విభాగంలో వాటిని ఉంచి ద్వారబంధం పైన స్లీమన్ పేరును స్వర్ణాక్షరాలతో లిఖించారు. అప్పటికి యువరాజుగా ఉండి, ఆ తర్వాత కైజర్ పదవిని అధిష్ఠించిన విల్హెమ్-II  స్వయంగా సోఫియాను విందుకు తోడ్కొనివెళ్ళాడు. అప్పటికామె వయసు 28 ఏళ్ళు, స్లీమన్ మరో ఆరునెలలకు 60వ ఏట అడుగుపెట్టబోతున్నాడు.

ఆ రోజున స్లీమన్ ప్రతిష్ట శిఖరాగ్రానికి చేరింది. చక్రవర్తి, మహారాజ్ఞి, యువరాజులు, యువరాణులు, మొత్తం రాజాస్థానం అతన్ని ఘనంగా ప్రస్తుతించింది. వీటన్నటికన్నా బెర్లిన్ గౌరవపౌరసత్వాన్నే అత్యున్నత సత్కారంగా స్లీమన్ భావించాడు. అంతవరకూ అలాంటి గౌరవం ఇద్దరికే లభించింది: ఒకరు బిస్మార్క్, ఇంకొకరు ఫీల్డ్ మార్షల్ కౌంట్ హెల్మత్ వాన్ మోత్కా. జర్మనీ పునరుజ్జీవనానికి వీరిద్దరూ బాధ్యులు. ఒక అనామక చర్చిలో కిటికీకి అతుక్కుపోయి బాహ్య పౌరాణిక ప్రపంచాన్ని విప్పారిన కళ్ళతో చూసి పరవశించిన  బాలుడు, ఇప్పుడు ఆ పౌరాణిక ప్రపంచం సజీవం కావడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అత్యంత పురాతన రాజులనే కాదు, నేటి సజీవులైన రాజులను కూడా తన వద్దకు రప్పించుకున్నాడు. ఒకసారి తన జీవితాన్ని వెనుదిరిగి చూసుకుంటూ, తను చేసిన వీరోచిత కార్యాలను, ఇతర సాఫల్యాలను తలచుకుని అతను అమితమైన సంతృప్తిని చెందాడు.

ట్రాయ్ నిక్షేపాలు రెండో ప్రపంచయుద్ధం చివరివరకూ బెర్లిన్ లోనే ఉన్నాయి. యుద్ధం మొదలైన తర్వాత బెర్లిన్ జంతుప్రదర్శనశాలలో లోతుగా తవ్విన ఒక రహస్య కందకంలో వాటిని భద్రపరిచారు. 1945 వసంతంలో అవి రష్యన్ సేనల కంటబడ్డాయి. వాటిని వారు రష్యాకు తరలించారు.1

ట్రాయ్ అతన్ని వెంటాడుతూనే ఉంది. తను చనిపోయేలోగా ట్రోజన్ రాజుల సమాధులను బయటపెట్టాలనుకున్నాడు. ట్రాయ్ కి చెందిన అన్ని నగరాల సవివర రేఖాపటాలను తయారుచేసుకున్నాడు. 1882 మార్చి 1న హిస్సాలిక్ దిబ్బ మీద తొమ్మిదో సారి తవ్వకాలు ప్రారంభించాడు. మొదటిసారి తవ్వకాలకూ, ఇప్పటికీ మధ్య పద్నాలుగేళ్ల కాలం దొర్లినా అతనిలో వెనకటి ఉత్సాహం అలాగే ఉంది. తలనొప్పి, చెవినొప్పి తగ్గాయి. అప్పటికీ ఇప్పటికీ ఒక తేడా ఏమిటంటే, అప్పట్లో చాలావరకూ ప్రాథమిక పరికరాల మీద ఆధారపడ్డాడు. ఆహారపదార్థాలు, ఇతర నిత్యావసరాల సరఫరా తగినంత ఉండేదికాదు. కానీ ఈసారి అతనికి మహారాజపోషణ లభించింది. లండన్ కు చెందిన మెస్సర్స్ ష్రోడర్స్ పెద్ద ఎత్తున ఆహారాన్ని కానుకగా పంపించింది. వాటిలో చికాగో గొడ్డుమాంసం, నిలవ పండ్లు, ఇంగ్లీష్ చీజు, ఎద్దు నాలుక మొదలైనవి ఉన్నాయి. ఒకవిధమైన తృణధాన్యంతో చేసిన 240 సీసాల బీరు(pale ale) కూడా పంపించింది. అన్ని సీసాలనూ అయిదుమాసాలలో స్లీమన్ ఒక్కడే ఖాళీ చేసేశాడు. “నేను ముప్పై ఏళ్లుగా మలబద్ధకంతో బాధపడుతున్నాను. ఈ బీరు (pale ale) నాకు ఎంతో ఉపశమనం ఇచ్చింది. ఈ సమస్యకు ఇంతకు మించిన దివ్యౌషధం లేదు” అని ప్రకటించాడు.

ఈసారి యువపురావస్తు శాస్త్రవేత్త, సమర్థుడు విల్హెమ్ దార్ఫెల్త్ సహాయకుడిగా ఉన్నాడు. టర్కీ ప్రభుత్వం నుంచి తలనొప్పులు మాత్రం తప్పలేదు. విద్యామంత్రిత్వశాఖకు చెందిన బేదర్ ఎదీన్ ఎఫెన్డీని పర్యవేక్షకుడిగా పంపింది. షరా మామూలుగా అతని ఆంక్షలు, అభ్యంతరాలు స్లీమన్ సహనాన్ని పరీక్షిస్తూనే వచ్చాయి. అతని నిత్యకృత్యాలకు వస్తే, మొదటిసారికీ, ఇప్పటికీ వాటిలో కూడా ఎలాంటి మార్పూ లేదు.  సూర్యోదయానికి ముందే లేచి గుర్రం మీద సముద్రస్నానానికి హేల్స్ ఫాంట్ కు వెళ్ళేవాడు. ముగ్గురు సాయుధ అంగరక్షకులు అతని వెంట ఉండేవారు. ఎండనుంచి రక్షణకోసం, బాగా పాతబడిన అదే శిరస్త్రాణాన్ని, పెద్ద పెద్ద కళ్ళద్దాలను, భారీ కోటును ధరించి ఇప్పటికీ రోజుకు 150 మందితో పని చేయిస్తున్నాడు. కోటు జేబులోంచి ఎర్రటి సిల్కు రుమాలు వేలాడుతూ ఉండేది.  ఇప్పటికీ నికొలస్ జెఫిరోస్ జానకిస్ అనే ఆ గ్రీకుజాతీయుడే వేతనాల చెల్లింపుతో సహా అతని పనులన్నీ చక్కబెడుతున్నాడు. అతనే స్టోర్ కీపర్ గా కూడా ఉంటూ పనివాళ్ళకు రొట్టె, పొగాకు, బ్రాందీ వగైరాలను అధికధరలకు అమ్మి బాగా సొమ్ము చేసుకునేవాడు.

జూన్ వచ్చేసరికి మిడతల దండు దాడి చేయడం ప్రారంభించింది. దానికితోడు ఎదీన్ ఎఫెన్డీ నసా పెరిగిపోయింది. సహనం పూర్తిగా నశించిన స్లీమన్ టర్కీ ప్రభుత్వంనుంచి తనకు రక్షణ కల్పించవలసిందని కోరుతూ బిస్మార్క్ కు అత్యవసర తంతి పంపించాడు. కానీ ఆవైపునుంచి ఉలుకూపలుకూ లేదు. తవ్వకాలను చూద్దామంటే, ఏవో చిన్నచిన్న కంచు, రాగి సామగ్రి తప్ప విశేషంగా చెప్పదగినవేవీ బయటపడలేదు. దాంతో తవ్వకాలు ఆపేయాలని జులై చివరిలో స్లీమన్ నిర్ణయం తీసుకున్నాడు.

మరుసటి సంవత్సరం Troja అనే పేరుతో ట్రాయ్ తవ్వకాలమీద తన మూడో పుస్తకం తీసుకొచ్చాడు. అతని పుస్తకాలన్నిటిలో అదే పేలవం. పెద్దగా కలసిరాని 1881-82 తవ్వకాల వివరాలు తప్ప అందులో ఏమీలేదు. కాకపోతే అప్పటివరకూ జరిపిన  ట్రాయ్ తవ్వకాల సమాచారం మొత్తాన్నిఅందులో పొందుపరిచాడు. మరికొన్ని పురాతన ప్రదేశాలలో కూడా తవ్వకాలు జరిపించాలన్న ఆలోచన అప్పటికి చాలా కాలంగా చేస్తూనే వచ్చాడు. తను నౌకా ప్రమాదాన్ని ఎదుర్కొన్న తేరా(Thera)2, సముద్రపు నురగనుంచి అఫ్రోడైట్ పైకి వచ్చినట్టు చెప్పే సితేరా(Cythera)3, తూసడడీస్(Thucydides)4 వర్ణించిన గొప్ప యుద్ధస్థలి అయిన పెలపనీసస్(Peloponnesus)కు పశ్చిమతీరంలోని పీలోస్(Pylos) వాటిలో ఉన్నాయి.

the-peloponnesian-war-syracuse-naval-battle

ఒక అదృష్టక్షణంలో అతని దృష్టి క్రీటు(Crete)ద్వీపం వైపు కూడా మళ్ళింది. అది అప్పటికింకా టర్కీ ఆధిపత్యంలోనే ఉంది. 1878లో, మినోస్5 కలొకైరినోస్  అనే పౌరాణికనామం కలిగిన కాండియా6 వర్తకుడు, కెఫలా త్సెలంపే అనే కొండ మీద కొద్దిపాటి తవ్వకాలు జరిపించాడు. ఆ కొండ ఉన్న చోటే క్రీటు పురాతన రాజధాని నోసస్ ఉండేదని చెబుతారు. అయితే, అప్పటికి పురావస్తుశాస్త్రజ్ఞుల దృష్టి గ్రీసు ప్రధానభూభాగం మీద ఉన్నంతగా  క్రీటుమీదలేదు. మినోస్ కలొకైరినోస్ జరిపిన తవ్వకాల వివరాలు తెలుసుకున్న స్లీమన్, అక్కడ గొప్ప పురావస్తుసంపద బయటపడవచ్చన్న నిర్ణయానికి వచ్చాడు. దార్ఫెల్త్ కూడా ఆ అభిప్రాయాన్ని బలపరిచాడు. ఇద్దరూ కలసి 1886లో నోసస్ ను సందర్శించి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ దిబ్బ ఒక టర్కు యాజమాన్యంలో ఉంది. అతని అంగీకారం తీసుకునే షరతు మీద తవ్వకాలు జరపడానికి ఆ దీవి గవర్నర్ నుంచి ఫర్మానా సంపాదించిన స్లీమన్, బేరసారాలు మొదలుపెట్టాడు. అది సుదీర్ఘంగా సాగింది. ఆ యజమాని కూడా వ్యాపారపు మెళకువలలో స్లీమన్ కు సాటివచ్చేవాడే. 5వేల పౌండ్లకు కొంచెమైనా తగ్గేదిలేదని అతను కరాఖండిగా చెప్పాడు. అది చాలా ఎక్కువ అనుకున్న స్లీమన్ మండిపడ్డాడు. ఏదోవిధంగా దారికి వస్తాడులే అనుకున్న స్లీమన్ ఎథెన్స్ కు వెళ్లిపోయాడు. కానీ అది సానుకూలం కాలేదు.

ఆ తర్వాత చాలా ఏళ్ళకు నోసస్ వద్ద తవ్వకాలు జరిపి ఆర్ధర్ ఎవాన్స్7 ఎన్నో గొప్ప విశేషాలను బయటపెట్టాడు. స్లీమన్ అప్పుడే కనుక ఆ పని చేసి ఉంటే ఎవాన్స్ కు దక్కిన ప్రతిష్ట అతనికే దక్కి ఉండేది.

తనకు ఆసక్తి గొలిపే పురాతనప్రదేశాలు అనేకం ఉండడంతో అతను మొదటిసారి తన జీవితచరమాంకంలో  సందిగ్ధాన్ని ఎదుర్కొంటూ వచ్చాడు. చివరికి, తనకు కూతవేటు దూరంలో, ఎథెన్స్ కు దగ్గరలో ఉన్న మారథాన్ 8లో తవ్వకాలు జరపడానికి నిర్ణయించుకున్నాడు. అక్కడ ఉన్న ఒక చిన్నపాటి దిబ్బ పురాతనప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. గ్రీకులకు, పర్షియన్లకు(క్రీ.పూ. 499-449) జరిగిన యుద్ధాలలో మరణించిన 192 మంది ఎథెన్స్ సైనికులను అక్కడ పూడ్చిపెట్టారని సాంప్రదాయిక విశ్వాసం. పసన్నియస్ రాతలు కూడా అందుకు సాక్ష్యామిస్తున్నాయి. 1884 ఫిబ్రవరిలో తవ్వకాలకు అనుమతి సంపాదించుకున్నాడు.  ఆ దిబ్బకు అడ్డంగా ఒక కందకం తవ్వించాడు. అయితే, ఆ తవ్వకాలు కొన్ని రోజుల్లోనే ముగిశాయి. ఎథెన్స్ సైనికుల అవశేషాలేవీ కనిపించలేదు. బల్లేలూ, కత్తులూ, శిరస్త్రాణాలూ, వక్షస్త్రాణాలవంటి యుద్ధసామగ్రి అయినా కనిపిస్తుందని అతను ఆశపడ్డాడు. కానీ అదీ నెరవేరలేదు. పర్షియన్లు గ్రీకు గడ్డ మీద అడుగుపెట్టడానికి ముందే ఆ దిబ్బ మీద జనం నివసించేవారనడానికి సాక్ష్యంగా కొన్ని కుండపెంకులు మాత్రం దొరికాయి.

Voelkerkundemuseum-HA-Hamburg-Berlin

Voelkerkundemuseum-HA-Hamburg-Berlin

ఇక టిర్యిన్స్ (Tiryns) మిగిలింది. ఆర్గోస్ మైదానంలో ఉన్న గొప్ప దుర్గం అది. మొదటిసారి గ్రీసు వెళ్లినప్పుడు స్లీమన్ దానిని సందర్శించాడు.  మైసీనియా తవ్వకాలకు ముందు ఇక్కడ కొద్దిపాటి తవ్వకాలు జరిపించి ఆపేశాడు. మైసీనియా కన్నా టిర్యిన్స్ పురాతనం. గ్రీకు పురాణాల ప్రకారం, హెర్క్యులెస్ అక్కడే జన్మించాడు. కనకవర్షం రూపంలో జియస్ ఈ నగరాన్ని సందర్శించాడు. దానై ద్వారా ఒక కూతురును కని ఆమెనొక బురుజులో బంధించాడు. ఆమె ద్వారా అతనికి పెర్సియస్ అనే కొడుకు పుట్టాడు. ఆర్గోస్ కు చెందిన ఈ వీరుడే మెడూసా తల నరికాడు. ప్రాచీన గ్రీకులు కూడా టిర్యిన్స్ ను భయభక్తులతో చూశారు. “మనకు టిర్యిన్స్ ఉండగా అంతదూరం వెళ్ళి పిరమిడ్ల(ఈజిప్టు)ను సందర్శించే శ్రమ దేనికి?” అని పసన్నియస్ రాశాడు.

స్లీమన్ 1884 మార్చి 14న నాప్లియో చేరుకున్నాడు. విల్హెమ్ దార్ఫెల్త్ అతని వెంట ఉన్నాడు. ఈసారి ఎక్కువ పనిభారాన్ని అతనే మోశాడు. ఇప్పుడు కూడా లండన్ కు చెందిన మెస్సర్స్ ష్రోడర్స్ పెద్ద ఎత్తున ఆహారపదార్థాలను, ఇతర నిత్యావసర సామగ్రిని కానుకగా పంపింది. స్లీమన్ 70 మందిని పనిలోకి తీసుకున్నాడు. 40 ఇంగ్లీష్ తోపుడు బళ్ళను, 20 భారీ గునపాలను, 25 భారీ గొడ్డళ్లను, 50 చిన్నపాటి గొడ్డళ్లను బరిలోకి దింపాడు.  ఈసారి, ఇంతకు ముందెప్పుడూ  లేనంత శాస్త్రీయప్రణాళికతో అతను తవ్వకాలకు సిద్ధమయ్యాడు. అతనూ, దార్ఫెల్త్ బాధ్యతలను పంచుకున్నారు. ఎక్కడ గోడలను కూల్చాలో, ఎక్కడ తవ్వకాలు జరపాలో సూచించడం స్లీమన్ బాధ్యత. పనులను పర్యవేక్షించడం; ఇంజనీర్ ను, రేఖాపటాల నిపుణుని, ప్రధాన కాంట్రాక్టర్ ను సంప్రదించడం దార్ఫెల్త్ బాధ్యత. అంటే,  స్లీమన్ పురావస్తువులకు, నిక్షేపాలకు బాధ్యత వహిస్తే; దార్ఫెల్త్ పురాతన కట్టడాలకు బాధ్యత వహించాడన్నమాట.

                                                      (సశేషం)

 

 

***

అథోజ్ఞాపికలు

  • In fact, the treasure had been secretly removed to theSoviet Union by the Red Army. During the Cold War, the government of the Soviet Union denied any knowledge of the fate of Priam’s Treasure. However, in September 1993 the treasure turned up at the Pushkin Museum in Moscow.[4][5] The return of items taken from museums has been arranged in a treaty with Germany[6] but, as of January 2010, is being blocked by museum directors in Russia.[6] They are keeping the looted art, they say, as compensation for the destruction of Russian cities and looting of Russian museums by Nazi Germany in World War II. A 1998 Russian law, the Federal Law on Cultural Valuables Displaced to the USSR as a Result of the Second World War and Located on the Territory of the Russian Federation, legalizes the looting in Germany as compensation and prevents Russian authorities from proceeding to restitutions.         (వికీపీడియా సమాచారం)
  • తేరా: గ్రీకు పురాతన నగరం. ఏజియన్ సముద్రంలో శాంటొరీన్ అనే దీవిలో ఉంది.
  • సీతేరా: గ్రీసులోని ఒక దీవి. గ్రీకు దేవత అఫ్రోడైట్ సముద్రపు నురగ నుంచి అవతరించిందని గ్రీకు పురాణాలు చెప్పడం ఆసక్తికరం. అఫ్రోడైట్ సుఖసంతోషాలను ప్రసాదించే సౌభాగ్యదేవత. మన పురాణాల ప్రకారం సిరిసంపదలను ఇచ్చే లక్ష్మీదేవి కూడా పాలసముద్రంలో ఉద్భవిస్తుంది.
  • తూసడడీస్(క్రీ.పూ. 460-395): గ్రీకు చరిత్రకారుడు, సైన్యాధికారి. క్రీ.పూ. 5వ శతాబ్దంలో స్పార్టా, ఎథెన్స్ ల మధ్య జరిగిన పెలపనీసస్ యుద్ధసమాచారాన్ని గ్రంథస్థం చేశాడు.
  • మినోస్: పురాతన క్రీటును పాలించిన తొలిరాజు ఇతనేనని గ్రీకు పురాణాలు చెబుతాయి. తూసడడీస్ ప్రకారం, ఇతను ట్రోజన్ యుద్ధానికి మూడు తరాల వెనకటివాడు. ఏజియన్ సముద్రంపై ఆధిపత్యం నెరిపిన మినోస్ నౌకానిర్మాణం ఎరిగినవాడనీ, నౌకాయానం చేశాడనీ, క్రీటు రాజ్యాంగాన్నీ, ధర్మశాస్త్రాన్నీ నిర్దేశించాడనీ అంటారు. విశేషమేమిటంటే మినోస్ కు, మన పురాణాలలోని మనువుకు నామసామ్యమే కాక, నౌకానిర్మాణం, ధర్మశాస్త్రనిర్దేశం వగైరాలలో కూడా పోలికలు ఉన్నాయి. రాంభట్ల కృష్ణమూర్తిగారి పుస్తకాలలో మినోస్-మనువుల పోలికల గురించి మరికొన్ని వివరాలు చూడవచ్చు.
  • కాండియా: క్రీ.శ. 1205-1212 మధ్యకాలంలో క్రీటు ద్వీపం ఇటలీ ఏలుబడిలో ఉన్నప్పుడు దాని అధికారనామం.
  • ఆర్థర్ ఎవాన్స్(1851-1941): ప్రముఖ బ్రిటిష్ పురావస్తునిపుణుడు. కంచుయుగానికి చెందిన ఏజియన్ నాగరికతను బాగా అధ్యయనం చేసినవాడు.
  • మారథాన్: ఒలింపిక్ క్రీడల్లో ఎక్కువదూరం పరుగు పోటీకి ఈ మాట పర్యాయపదంగా మారిన సంగతి తెలిసినదే. దాని పూర్వచరిత్రను నా ‘పురా’గమన వ్యాసాలలో ‘పర్షియన్ రాముడు, గ్రీకు హనుమంతుడు’ అనే వ్యాసం(అక్టోబర్ 2, 2014)లో ఇచ్చాను. చూడగలరు.

 

 

మీ మాటలు

*