మార్కెట్…..ఓ మహాసర్పం

 

 

-మొయిద శ్రీనివాస రావు
~

ఓ కవిమిత్రుడన్నాడు

మడిగట్టు నా సింహాసనమని

అవును నిజమే…మడిగట్టు నా సింహాసనమే

నేను రాజునే

పొలం నా రాజ్యమే

ఆరుగాలం సాగు సాగనప్పుడు

బారెడు భూమిలో

మూరడు పంట పండే కాలంలో

ఊరులోని మిగులు చేతులన్నీ

నాకు వ్యవ ‘సాయం’ చేసాయి

కుండ, బండ

బట్ట, బుట్ట

కత్తి, కత్తెర

తలో చెయ్యి వేసాయి

నా ముంగిట చేతులు చాచి

నన్ను మారాజును చేసాయి

పట్నంకు… పల్లెకు బంధం బలపడినాక

ఊరిలో మార్కెట్ మహాసర్పం బుసలుకొట్టింది

మిగులు చేతులను బయటికి పంపి

వలస చీమలగా మార్చేసింది

నా క్షేత్రంలో ఏమి పండాలో శాసించింది

‘మదుపు ‘ మోటరు పంపులోని నీరై

నిత్యం పొలంలోనికి పారింది

చివరకి….నా బతుకే ‘ఎరువు’ అయినాక

మూరడు నేలలో పండిన

బారెడు పంటను

చిరు ‘ధర ‘హాసంతో మింగేసింది

నన్ను మడిసెక్కకు బానిసను చేసింది

మహాసర్పపు ఆకలి కేకలకి

అరిచేతులను అరగదీసుకున్నాను

కడుపును కుదించుకున్నాను

మిగులు సమయాలలో నేతొడుక్కున్న

అదనపుచేతులను సైతం అర్పించుకున్నాను

మూరడు మడిసెక్క వ్యాపారక్షేత్రమైన చోట

మార్కెట్ మహాసర్పంతో యుద్దమంటే మాటలా!

కడవరకు బానిసగానైన బతకాలి!

లేదా మారాజుగానైనా చావాలి!!

చివరికి మిగిలిన మడిసెక్కను

అది మింగినాక

మహాసర్పాన్ని మట్టుపెట్టగల

పట్నపు శ్రమచీమల సైన్యంలోనైనా చేరాలి! !!

* * *

(karl kautsky పుస్తకం ‘on agraarian question’ చదివిన స్పూర్తితో)

మీ మాటలు

 1. Ajit Kumar says:

  శ్రామిక రాజ్య నిర్మాణం ప్రారంభమయ్యేంతవరకూ వేచి యుండండి. మీ కోరిక తప్పక తీరుతుంది.

  • అజిత్కుమార్ గారు శ్రామికరాజ్య నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదంటారా? ఎప్పుడు ప్రారంభమవుతుందంటారు? అయితే అప్పటివరకు మనం కలలు కంటూ ఖాళీగా కూర్చోవాలంటారా?

 2. Y Pradeep says:

  The Best Poem..congrats..శ్రీనివాసరావు గారు..!

  మీరు పోయెమ్ మొదట్లో వాడిన “మడిగట్టు” స్థానంలో పోయెమ్ మధ్యలో వాడిన “మడిసెక్క” అని ఉంటేనే బాగుండేది. గమనించండి. శ్రామిక రాజ్య నిర్మాణం ఒక కోరిక కాదు అజిత్కుమార్ గారు. అదొక తిరుగులేని వాస్తవం..

  • Srinivasrao says:

   Thank you sir for giving your valuable suggestion. I had to use the word ‘madigattu’ because of this poem is a reply to the poem recently published in andhrajyothi vividha. In that poem the poet used the term ‘madigattu’. So I had to take that term as it ease.

  • Ajit Kumar says:

   సురేష్ గారూ, వై.ప్రదీప్ గారూ… చాలా కాలం నుండి అనేక వెంచర్లుగా… భూస్వాములు నిర్మాణ సారధులుగా నిర్మించబడుతున్న శ్రామిక రాజ్యాన్ని పిచ్చుకలు కూల్చేస్తున్నాయి. శ్రామికవర్గ నాయకత్వం ఏర్పడినప్పుడు, ప్రజలు ఒక్కొక్కరుగా మార్కెట్టు భూతపు కబంధహస్తాలనుండి విముక్తిపొందే శుభదినం ప్రారంభమౌతుంది. ఈరోజుల్లో సమర్ధులైన నిర్మాతలు లేకుండా ఏదీ నిర్మింపడలేదు. అప్పటివరకూ ఎదురుచూడక చేసేదేముంది సార్…

   • Y Pradeep says:

    అజిత్కుమార్ గారు
    శ్రామిక రాజ్య నిర్మాణం అంటే మీకు Real Estate business గా (వెంచర్లు అంటున్నారు) కనిపిస్తోందా? ఇంకా “భూస్వాములు నిర్మాణ సారధులుగా ” అంటున్నారు. మీరు సారధ్యం వహిస్తే కాదనే వాళ్లెవరైనా ఉంటారా? ‘పిచ్చుకలు కూల్చేస్తున్నాయి’ అని కూడా అంటున్నారు. ఎవరో ఆ పిచ్చుకలు వివరిస్తే తెలుసుకుంటాం గదా! శ్రామిక వర్గపు నాయకత్వమే అసలు లేదంటున్నారు. ఇది ఒక పెద్ద రుజువుల్లేని అపనింద. చరిత్ర అవాస్తవం కాదుగదా? ఒకసారి తిరగేస్తే తెల్వదా. ఈ రోజుల్లో సమర్ధులైన నిర్మాతలేవరో , ఏమి నిర్మించారో చెప్పరా దయచేసి. శ్రామిక వర్గ విప్లవం అనేది ముహూర్తమ్ పెట్టుకుని రాదు వేచి చూడడానికి . అదొక ప్రాసెస్ అని మీకు తెలియంది కాదు గదా!

   • ‘వెంచర్లుగా… భూస్వాములు నిర్మాణ సారధులుగా నిర్మించబడుతున్న శ్రామిక రాజ్యాన్ని పిచ్చుకలు కూల్చేస్తున్నాయి’ సార్ అజిత్కుమార్ గారు పై వాక్యాలు అర్ధం కాలేదు కాస్త వివరించగలరు.

   • Ajit Kumar says:

    శ్రామిక రాజ్య నిర్మాణం చేస్తున్నామనే పేరుతో అనేక రాజకీయ పార్టీలు రకరకాల పేర్లతో నిర్మాణం మొదలు పెట్టాయి. కానీ అవన్నీ తామనుకున్నది సాధించలేకపోయాయి. మొదట్లో ఎంతో ఆశాజనకంగా, బలంగా కనిపించినప్పటికీ క్రమేపీ బలహీనపడిపోయాయి. ఎందువల్లనంటే అవి గతితార్కిక చారిత్రక భౌతికవాద సూత్రాలపేరుతో మహాత్మాగాంధీగారి ఎత్తుగడలను అనుసరించి నిర్మాణం చేయబూనుకున్నాయిగనుక. శ్రామికవర్గ నిర్మాణం బలహీన పడడానికి ప్రధాన కారణం ఏమిటంటే… ఆర్యులు, భూస్వాములు శ్రామికవర్గం పేరుతో నిర్మాణానికి నాయకత్వ బాధ్యత తీసుకోవడం. నిజమే. వారు గొప్పవారే, మహా జ్ఞానులే, పలుకుబడిగలవారే, నాయకత్వప్రతిభావంతులే. కానీ వారు శ్రామికవర్గం కాలేరు. పెత్తందార్లు పంచెకట్టుకున్నంమాత్రాన శ్రామికులు కాలేరు. ఇంతకుమునుపు ఎన్నో ప్రజాప్రతినిధి స్థానాలను గెలుచుకున్నవారు నేడు స్వంతంగా ఒక్కసీటైన గెలిచేలాలేరంటేనే వారిని బలహీనులు సైతం ఓడించగలుగుతున్నారని అర్ధమౌతుందిగదా..

 3. Y Pradeep says:

  ఫర్వాలేదు…. అది పెద్ద సమస్యేం కాదు.
  ఎవ్విరి వర్డ్ విల్ హావ్ ఇట్స్ ఓన్ మీనింగ్. అది వాడుకలో ఉన్న నుడికారం కావొచ్చు కూడా కానీ మడిగట్టు ..మడికట్టు పదానికి దగ్గరగా ఉండి అన్యర్థాన్ని ధ్వనింప చేస్తోంది గదా అని మడిసెక్క పదమే బాగుందని భావించాను. అంతే ….

  • srinivasarao says:

   సార్ ‘మడిగట్టు’ అంటే పొలానికి చుట్టూ వుండే గట్టు అని అర్ధం.

   • Y Pradeep says:

    తెలుసునండీ

   • Y Pradeep says:

    ఆ కవితలో “పొలం గట్టు” అని వాడారు..”మడిగట్టు” అని కాదు. గమనించండి.

  • Srinivasrao says:

   ఎస్ యు ఆర్ రైట్ సార్. In my region we frequently used the term ‘madigattu’ instead of ‘polamgattu’

 4. Y Pradeep says:

  మీరు చెప్పిన ఆంధ్ర జ్యోతి పోయెమ్ ని నేను గమనించ లేదు. ప్రయత్నిస్తాను.

 5. దర్భశయనమ్ శ్రీనివాసాచార్య gaari ‘రైతన్నా నువ్వు బతకాలన్నా ‘ పోయెమ్కి samaadaanamlaa vundi srinivas garoo e poem.

 6. శ్రీనివాసుడు says:

  రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు – దర్భశయనం శ్రీనివాసాచార్య
  ********
  ‘ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు’
  వాక్యం సరిగా లేదు
  ‘మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు’
  ఈ వాక్యమూ సరిగా లేదు
  ‘రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు’
  వాక్యమిపుడు సరిగ్గా వుంది
  వాక్యంలో శుచీశుభ్రతాలేదని ఒకరనొచ్చు
  వాక్యంలో పలుకుబడి లేదని మరొకరనొచ్చు
  ఎవరి సందర్భాలు వారివి!
  కానీ వాక్యం సరిగ్గానే వుంది
  ‘రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు’
  ట్రాన్స్‌ఫార్మర్‌ మీద ఆత్మహత్య చేసుకున్న
  రైతు మట్టి దేహమ్మీది నుంచి నేల మీదికి
  రాలిపడ్డ వాక్యమది! సరిగ్గానే వుంది!
  ——-
  బతుకు పండగనాడు తీరుతీరు పూలను పేర్చి
  తలకెత్తుకుంటున్నాం- ట్యాంక్‌బండ్‌ సాక్షిగా సంబరమే!
  కానీ యుగాలుగా రైతు పొలాల్ని
  తలకెత్తుకునే వున్నాడని మనకు తెలుసా
  అతన్ని మనం తలకెత్తుకోవడం లేదు సరికదా
  తన పొలమ్మీద తననే బతకనివ్వడం లేదు
  మనం సంబరాల్లో మునిగిపోయి అతని సాగును
  మరిచాం, ఉనికిని మరిచాం
  నీరందివ్వక వెల్తురునివ్వక నేల బతుకు నుంచి
  అతన్ని వెలేసాం – నేల మిగలక గాల్లోకి లేచి
  అతను ట్రాన్స్‌ఫార్మర్‌ మీద ప్రాణం తీసుకున్నాడు
  చావు నిరసనలోనూ అతను అన్వయాన్నే
  పాటించాడని మన తలకెక్కుతున్నదా
  సంతాపం ప్రకటిస్తున్న ఈ నేలమీద
  వేలాడుతున్న మట్టిమనిషి శవం ముందు
  ఇపుడు ఏ తలల్తో నిలబడతాం మనం?
  ——
  బతుకమ్మంటే బతుకు పండగ అని కదా!
  అన్ని బతుకులకూ అన్నంపెట్టే మట్టిమనిషికి
  బతుకు లేకుండా చేసిన మనకు ఇపుడు
  బతుకు పండగ వుందా? సంతాపదినాలు తప్ప!
  ———
  పూలను తలకెత్తుకునే
  తెలంగాణకు లోహాల తళతళలక్కర్లేదు
  ఇది మట్టి తెలంగాణ! మట్టి బతికితే చాలు!
  మట్టి మనుషులు మనగలిగితే చాలు
  ఇక్కడ ఎవరైనా ఎంతటి వారైనా
  మట్టికీ మట్టి మనిషికీ సలాం చేయాల్సిందే
  లేదంటే
  ఉన్నపళాన వేదిక మీది నుండి దిగిపోవాల్సిందే!
  – దర్భశయనం శ్రీనివాసాచార్య
  9440419039
  *******************************************************************************************
  రైతన్నా! నువ్వు బతకాలి!
  ************
  నీ పొలం గట్టుముందు
  ఏ సింహాసనమైనా ఎంతని!
  సింహాసనాలు గాల్లో తేలుతాయి
  నువ్వు నేలనంటిపెట్టుకుని వుంటావు
  నీకంటే ఇష్టులెవరు భూమికి?
  భూమ్మీద బతకడానికి
  నీకంటే ఎక్కువ హక్కుందెవరికి?

  మరి, నువ్వే అర్థంతరంగా వెళ్ళిపోతే
  భూమి పరాయిదవుతుంది
  పొలం నిరుపేదవుతుంది
  గట్టుమీద మనిషి జాడుండదు

  నిజమే, నీ దగ్గరకు రావాల్సిన దేశం
  విదేశాలకు దగ్గరైంది, నీకు దూరమైంది
  నిజమే, నీ పొలాన్ని బతికించుకోవడానికి
  నువ్వు నగరం కాళ్ళదగ్గరికెళ్ళక తప్పట్లేదు
  విత్తనాన్ని కొనుక్కోవడానికైనా
  గింజల్ని అమ్ముకోవడానికైనా-
  కొత్త కొత్త వేషధారణలు గద్దెకెక్కాక
  నీ ధోవతి పనికిరానిదైంది
  నీ మాట వెనుకబాటైంది

  నగరాల్ని గగనాల ఎత్తుల దాకా
  తీసుకెళ్ళాలనే సింహాసనాలకు
  నీ నేల నడకలెట్లా అర్థమవుతాయి
  నీ కళ్ళు తడవుతే వాటికి పట్టదు
  నీ గింజలు తడిస్తే కూడా-
  అంతేనా! బతుకును విసిరికొడుతూ నిరసనగా
  నువ్వు వెళ్ళిపోయినా వాటికి పట్టదు

  కొత్త సింహాసనం పాత సింహాసనాన్ని
  తప్పుపడుతుంది
  పాత సింహాసనమేమో పవిత్రవేషంలో
  కొత్త కన్నీరు పెడుతుంది
  నీ నిష్క్రమణ చర్చకు పనికొస్తున్నది కానీ
  బతుక్కి పనికి రావట్లేదు
  నీ మరణంతో పొలమూ మరణిస్తున్నదని
  సింహాసనాలకెప్పుడు తెలియాలి
  నీ అస్తమయంతో
  నేల పొరలు పుటుక్కున తెగిపోతున్నాయని
  నేల మీది పెత్తనాలకెప్పుడు అర్థమౌతుంది

  సింహాసనాలకేముంది
  రాజధానులు బతికితే చాలు
  వర్థిల్లితే మరింత పులకింత
  నువ్వు బతికితే ఎంత చస్తే ఎంత
  రాజుల కాలాలు పోయి ప్రజల కాలాలొచ్చినా
  ఓ సింహాసనం పోయి మరో సింహాసనమే వస్తుంది
  పాత పెత్తనాలే కొత్త వేషాల్లో
  పొలాల్ని శాసిస్తున్నాయి
  కత్తుల నడుమ బతుకు చితుకుతున్నా
  సింహాసనాలు మెత్తని మాటల్నే చల్లుతాయి
  మనిషిని గింజ బతికించింది గానీ
  బతుకు తడే లేని మాటెప్పుడైనా బతికించిందా

  భూమికోసం రక్తం ధారపోసేవాడివి
  భూమిలోకి నిరసనగా వెళ్ళిపోతే ఎట్లా
  నేలేమంటున్నదో పొలమేమంటున్నదో
  నువ్వే చెప్పాలిగా, బతికి చెప్పాలిగా
  బతుకుతూ చెప్పాలిగా, బతుకు మాట చెప్పాలిగా

  చడీ చప్పుడూ లేకుండా వెళ్ళిపోవడం కాదు
  ఇక్కడ ఉండి ఆగ్రహించాలి
  నీలోని సకల ధాన్యశక్తుల్ని కూడగట్టుకుని
  ఉరిమి పెత్తనాల్ని నిలదీయాలి
  సింహాసనాన్ని పొలం దగ్గరికి
  గొరగొరా ఈడ్చుకొచ్చి అడగాలి
  రాజధానులూ, నగరాల సంబరాలు కాదు
  ముందు ఊళ్ళు బతకాలని
  చెంపలు వాయించి చెప్పాలి
  అవును, వెళ్ళిపోయి కాదు-
  నువ్వు వుండి అడగాలి, చెప్పాలి
  భూమి తరపున మాట్లాడ్డానికి
  ఇంకెవరికెక్కువ హక్కులున్నాయి
  అడిగినా సింహాసనం కదల్లేదా
  అపుడు దాన్ని నిర్దాక్షిణ్యంగా
  ఉరితాడుకు వేలాడదియ్యి,
  ధాన్యం పండించిన చెమట చేతుల్తో,
  పొలం గట్టు సాక్షిగా! నేల తీర్పుగా!
  -దర్భశయనం శ్రీనివాసాచార్య
  9440419039

 7. Y Pradeep says:

  శ్రీనివాసుడు గారు…పోయెమ్స్ అందించినదుకు థాంక్స్ ..
  దర్భ శయనం శ్రీనివాసాచార్యుల వారి పోయెమ్స్ రైతు తరఫున మాట్లాడుతున్నట్లుంది ..మొయిద శ్రీనివాస రావు పోయెమ్ రైతు స్వయంగా మాట్లాడుతున్నట్లుంది. ఒకవైపు సానుభూతి పోయెమ్స్ మరొకవైపు స్వానుభవ పోయెమ్ . రైతు కాని రైతు పోయెమ్స్ ఒకటైతే రైతు పోయెమ్ మరొకటిగా భావించ వచ్చునా?

 8. తోటపల్లి సన్యాశినాయుడు says:

  శ్రీనివాసరావుగారు మీ పోయమ్ బాగుంది.అభినందనలు .పైన శ్రీనివాసుడుగారిచ్చిన దర్భశయనమ్ గారి పోయమ్స్ చూసాను.రైతు పట్ల సానుభూతితో,అన్నం పెట్టే రైతన్న అనే గౌరవభావంతో,మరీ ముఖ్యంగా ఒకరకమైన సెంటిమెంటుతో ,యింకాచెప్పాలంటే ఆరాధనభావంతో రాసినవి.నమ్మకాలు ,ఆరాధనలు చదవడానికి చెప్పుకోవడానికి బాగనే వుంటాయి .సమస్యను గురించి చర్చించి ఏదైన ఒక సమాధానాని ప్రతిపాదించే విధంగా వుండవు.అవి అయ్యో..అయ్యో అనడానికి బాగుంటాయి తప్ప ప్రయోజనం శూన్యమని నాకనిపిస్తోంది.
  యిక మీ పోయం విషయానికి వస్తే మీరు వాస్తవంగానే రాసారు.కాకపోతే మీ రైతు ఎవరు అన్నది ప్రశ్న?.మనం యాభై ఎకరాలున్న రైతునీ రైతే అంటున్నాం.అరేకరా రైతునీ రైతే అంటున్నాం.రైతుకూలీలను కూడా రైతే అంటున్నాం.,బహుశా మీరు చిన్న సన్నకారు రైతులనుద్దేశించి రాసారనుకుంటాను.ఎందుకంటే పెద్దరైతు లు యిప్పటికే పట్నాలలో వ్యాపారాలు,కాంట్రాక్టుల్లో చేరిపోయారు. వారికి ఆకలి సమస్యాలేదు.ఆత్మహత్యలసమస్య అన్తకన్నలేదనేది నావుద్దేశం.కనుకపేదరైతు ఎక్కడైనా కూలీ చేసుకు బతకాల్సినవాడె.కాకపోతే అలవాటైన పనినుండి వేరే పనిలోకి వెళ్ళాలి.వెళ్తున్నారు కూడా .ఒక్క కవులు రచయితలే రైతులు పల్లెల్లోనే వుండాలని అనుకుంటున్నారు.అది వ్యతిరేక దిశ లో ప్రయాణమే.వాస్తవాన్ని గుర్తించకపోవడ మే.అనుకుంటున్నాను.
  ఏదేమైనా మీ పోయమ్ వాస్తవానికి దగ్గరగావుంది .

 9. చాలా మాంచి కవితా! కవితలో ఒక సైద్దాంతిక అవగాహణ ఉన్నది. మార్కరట్ మహా సర్పాన్ని మట్టు బెట్టడానికి ఏదారి మంచి దో వెతుక్కుతున వారికి చూపిస్తున్న దారి చర్చియనాంశం!

 10. Y Pradeep says:

  దారి చర్చనీయాంశం అంటే సిద్ధాంతం చర్చనీయాంశం అనే కదా అర్థం ? చర్చించండీ

 11. KOTTA PALLI KANNAM NAIDU says:

  అయ్యా ! అందరికి నమస్కారం. నా బొటొడి మాటని కూదా వింటారని ఈ రెండు మాటలు.. . రైతు పండించే అన్నం మెతుకు అందరికి కావలి. కానీ రైతు బాధ మాత్రం ఎవరికీ అక్కర్లేదు. మనం మన సుఖమైన కుర్చీల్లో కూర్చుని రైతు మీద కవిత్వం రాస్తాం , చర్చలూ చేస్తాం. మడి సెక్క కోల్పోయిన రైతు పట్నం లో కార్మికుడై పోవాలని సలహాలిచ్చేస్తాం. కార్మికులంతా ఏకమై పోతారని , మరో ప్రపంచం వచ్చేస్తుందని కలలు కంటాం. నిజానికి మదిసేక్క కోల్పోయిన రైతు పట్నం కి కార్మికుడుగా వెళ్తున్నాడా ? రోజు కూలిగ వెళ్తున్నాడా? వలస పోయిన వాళ్ళందరూ కార్మికులేనా? మడి సెక్క ను కోల్పోయిన రైతు వలస పక్షి గా ఎగిరి పట్నం లో కూలీగ మారే క్రమం లో పడే “హింస” ఎవరికీ అక్కరలేదా? ఆ హింస గురించి ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే సమస్య మనది కాదు గాబట్టి. మన కుర్చీలు మనకు పదిలంగా వుంటాయి గాబట్టి. రైతు ను కార్మికుడుగా మారాలని కోరుకునే మేధావుల్లార! ఆ రైతు మీద అంట ప్రేమ వుంటే పట్నాలకు చేరిన అందరి రైతుల కోసం ఒక సెల్ ఏర్పాటు చెయ్యండి. వారందరినీ కార్మికులుగా మార్చి ఒక దారి చూపండి. అప్పుడు మీ లక్ష్యం నెరవేర వచ్చు.

  • శ్రీనివాసుడు says:

   కన్నమనాయుడుగారూ!
   అది మా పని కాదండీ. రైతు చచ్చిపోయినా, విద్యార్థి చచ్చిపోయినా అది ప్రచార మాధ్యమాల్లో చదివి మాకున్న సాహితీ సృజనతో గొప్ప కవితలు వ్రాస్తాం, వ్యాఖ్యలు చేస్తాం, సామాజిక మాధ్యమాలన్నీ ఊదరగొడతాం, తాత్త్విక విశ్లేషణలను చేస్తాం. ఇలా అందరిలో చైతన్యం తీసుకువచ్చి ఈ దోపిడీ వ్యవస్థను, కులవ్యవస్థను అంతం చేసేందుకు ( అదెప్పుడు జరగాలో?) ప్రయత్నిస్తాం. ఆవేదనతో అశాంతితో అలమటిస్తాం. అంతేగానీ రైతు దగ్గరకు వెళ్ళి, విద్యాలయం దగ్గరకి వెళ్ళి నిజనిర్ధారణ చేసి, రెండు వైపులా వాదనలను విని, ఒక సంభాషణ జరిపి, అందరికీ ఆమోదయోగ్యంగా వుండే పరిష్కారాన్ని, సహాయాన్ని మేధావులమైన మేం చేయం. అలా చేయడానికి సామాజిక స్పృహవున్న ప్రతి ఒక్కరూ ఒక సామూహికశక్తిలాగా ఉద్యమిస్తే కొండంత సమస్య అయినా నలుసంత అయిపోతుంది.
   కానీ, నిర్లక్ష్యం, ఉదాసీనత, సంవేదనా రాహిత్యం ఆచరణకు అవరోధాలయిపోయాయి.
   తలా ఒక రాయి వేయడం సులువుగా, సుఖంగా వుంటుందిగానీ ఆచరణలోకి దిగడం, సామరస్యపూర్వకంగా చర్చించడం అనేది మా తత్త్వం కాదు. మా సిద్ధాంత భావజాలాల ఇనుప సంకెళ్ళతో ఎదుటివారిని మర్ధిస్తాం. అంతేగానీ అతడికి నచ్చజెప్పం.
   మదర్ థెరీసా బ్రతికివున్నప్పుడు ఆమెను ఒక విలేకరి ఒక ప్రశ్న వేసేడట. ‘‘మీరు చేస్తున్నది గొప్పా? లేక చేగువేరా చేస్తున్నది గొప్పా?’’ అని. దానికి ఆమె సమాధానమేమంటే, నిశ్చయంగా చేగువేరానే గొప్ప, ఆయన ఒక గొప్ప భవిష్యత్తుకోసం పోరాడుతున్నాడు. కానీ, నేను వర్తమానంలో నా ఎదురుగావున్న సమస్యను పట్టించుకుంటున్నాను. నా వరకు రెండూ ముఖ్యమే’’, అని. (కచ్చితంగా గుర్తులేదు. కానీ, ఇదే సారాంశం అని జ్ఞాపకం)

   • Srinivasarao says:

    శ్రీనివాసుడు గారు మొత్తానికి ఒకపక్క కవులు రచయతలు టీ.వి కథనాల పై ఆధారపడి సాహిత్య సృజన చేస్తున్నారని. కార్యాచరణలో వుండరని చెబుతూనే సామూహిక శక్తిలాగ ఉధ్యమిస్తే కొండంత సమస్య అయినా నలుసంత అయిపోతుందని చెప్పారు. ఇది ఎలా సాధ్యమో కాస్త వివరించగలరు.

   • శ్రీనివాసుడు says:

    **అలా చేయడానికి సామాజిక స్పృహవున్న ప్రతి ఒక్కరూ ఒక సామూహికశక్తిలాగా ఉద్యమిస్తే కొండంత సమస్య అయినా నలుసంత అయిపోతుంది.**
    సమస్త కవులూ, రచయితలూ కార్యాచరణలో వుండరని నా ఉద్దేశం కాదండీ. స్వల్పాతి స్వల్ప అంశ మాత్రమే వున్నారని నా భావన. కేవల భావోద్వేగాలు మాత్రమే సమస్యకు పరిష్కారం కాదని నా అర్థం.
    లేదూ, వారందరూ కచ్చితంగా కార్యారచణలోనే మమేకమే వున్నారని, లేదా ఏ కొద్దిమంది తప్పితే అందరూ కార్యాచరణశూరులేనని మీరు భావిస్తే ఇక నేను మాట్లాడేందుకేమీలేదు.
    ఆ వాక్యం అంతటితో ముగిసింది. తరువాతి వాక్యంలో నేను చెప్పిన సామాజికస్పృహ వున్న ప్రతి ఒక్కరూ అంటే సమాజంలో ఇంగితజ్ఞానం, సంవేదనాశీలత వున్న ప్రతి ఒక్కరూ ద్వీపాలలాగా కాకుండా సమూహంగా ఉద్యమించాలని నా భావన.

  • తోటపల్లి సన్యాశినాయుడు says:

   అయ్యా!KOTTAPALLI KANNAM NAIDUగారూ,మీ కోపం,ఆవేశం ఎందుకో అర్ధం కావడంలేదు.రైతు పండించే అన్నం మెతుకే కాదు,కార్మికుడు (పోనీ మీరన్నట్టు కూలీ) సృష్టించిన వస్తు సముదాయము కూడా అందరికీ కావలసినవే అని మనం మరువకూడదు.
   రైతు బాధ ఎవరికీ అక్కరలేదు అంటున్నారు.అసలు ఎవరిని మీరు రైతు అంటున్నరో స్పష్టంగా చెప్పండి.నేను ముందు రాసిన నాకమెంట్ లో ఈ విషయాన్ని గురించి స్పష్టంగారాసాను.దయుంచి ఒకసారి చూడండి.మనకి గంపగుత్తగా గ్రామాల్లో ఉన్న వ్యవసాయ కూలీలను,చిన్నరైతులను,పెద్దరైతులను, కలగలిపి రైతు అనే ఒకే మాటతో సూచించటం అలవాటైపోయింది.
   మనం సలహాలిచ్చామని రైతు కార్మికుడు ఐపోవడంలేదు.ఐపోడుకూడా.అతని జీవితం అతన్ని నిర్దేసిస్తుంది.కాకపోతేధైర్యం కోల్పోకూడదని,బ్రతుకు ఎక్కడుంటే అక్కడ బతకాలని కవులు ,మేధావులు,ఆలోచనాపరులు కొందరురాజకీయనాయకులు ఎవరికి తోచిన విధంగా వారు సూచనలు యిస్తారు.వారినెవరినిబలవంతంగా తీసుకెల్లి కూలీలను చేయరు.
   నిజానికి గ్రామములో వుండి శ్రమించే వ్యక్తే గనక అయితే పట్తణంలో నైనా శ్రమిస్తాడు.కేవలం పని విధానంలో మార్పు తప్ప పెద్ద తేడా వుండదు.

   మీరు మానసిక మైన హింసగురించి మాట్లాడుతున్నారనుకుంటాను.అదే గ్రామంలో వుంటూ పనిలేక పంటరాక పడే హింస మీకు కనపడదేమో!?
   బహుశా ఈ కవితరాసిన శ్రీనివాసరావు గారు కూడా, అయ్యో రైతూ.. అయ్యయ్యో రైతా అని బాధపడుతూ కవిత్వం రాసివుండాలని బహుసా మీ కనిపించి వుండవచ్చు.అలారాసివుంటే కవులపై మీకు అభ్యంతరం వుండదనుకుంటాను.
   కానీ గత రెండు దశాబ్దాలుగా తెలుగు కవులందరూ ఏకకంఠంతో చొ..చ్చో..చ్చో కవిత్వం రాస్తూనే వున్నారు.మరి రైతులు బాగుపడి వుండాలిగదా!

  • Srinivasarao says:

   కన్నంనాయుడు గారు ‘నా బోటోడిని’ అని అనడంలోనే మీ పెద్దరికం కనబడుతుంది. మేధావులు కోరుకోవడంతోనే రైతులు కార్మికులుగా మారతారా? లేదా ఓ సామాజిక మార్పులో భాగంగా మారతారా? కాస్త వివరించగలరు!

 12. మూడు కవితలు చదివాను ఇక్కడ.
  చక్కని మూడు వ్యాసాలుగా వ్రాసి ఉంటే మరింత బాగుండేది అనిపించింది

 13. లక్ష్మణరావు says:

  కన్నం నాయుడుగారికి, నమస్సులు. నాకు ఉన్న చిన్న అవగాహనను తమ బోటివారితో పంచుకుంటే బాగుంటుందని ఓ ఆశ. అందుకే ఈ నాలుగు మాటలు. అయ్యా…ఆదివాసీ గూడెం నుంచి పల్లె ఏర్పడే క్రమంలో అందరూ రైతులు కాలేదనుకుంటానండి. భుజబలం, మంది బలం ఉన్నవాడు కనుచూపు మేర నేల నాది అంటే అందరూ ఊ కొట్టారనుకుంటానండి. వాళ్ల వద్ద కూలి చేసిచేసి కష్టం కూటి కుండ వద్దకి రాకపోయే సరికి కసి వచ్చిందండి. ఎవడిదిరా భూమి? ఎవడు పుట్టించాడురా ? అంటూ పిడికిలెత్తాడటండి. ఇది గుర్తించిన హస్తినాపుర పెద్దోళ్లు సామాజిక వర్గాల అధ్యయనం చేసి ల్యాండు సీలింగులు తెచ్చారటండి. అలా మా ప్రాంతంలో ఆదివాసీలతో ప్రారంభమైన సిక్కోలు పోరాటం మూడు, నాలుగు వర్గాలకు భూమి దఖలుపడడానికి దోహడపడిందటండి. ఇక మెజార్టీ వర్గాల చేతిలో మెజార్టీ కుటుంబాలకి నేలతల్లి సొంతం కాగానే దళితులు, ఆదివాసీల, బి.సి.ల్లో మిగిలిన కులాల వారి భూమి కోసం నాటి నుంచి నేటి వరకూ గొంతెత్తి మాట్లాడిన వాళ్లు లేరటండి. పాపం…అన్నం పెట్టిన రైతులు అదిగోండి మైనార్టీలు పిలవబడే వాళ్లందరినీ పశువుల కొట్టం వద్ద పేడ పిసకడానికి, నాట్లు వేయడానికి, భూ యజమాని వీపు కడగడానికి….ఇలా..ఇలా అన్ని పనులకు పరిమితం చేశారటండి. ఎంత గొప్పోళ్లు అండి బాబు రైతులు….కష్టం ఎరిగిన వారు కాదండి. రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఉదయాన్ని పశువుల కాయడానికి వచ్చిన పిల్లవాడికి పెట్టేంత విశాల హృదయులండి బాబు. పండగ నాడు కూడా తమ ఇళ్లల్లో చాకిరి చేయించుకుని అన్నీ పనులు అయిపోయినాక దాఖలో మిగిలిన ఇగురు, రెండు ముక్కలు దానం చేసిన కర్ణులండి బాబు. దయగల బాబులు కదండి… చుట్టూ చుట్టుకోవడానికి కూడా సరిపడినంత చీర ఇచ్చేంత మహానుభావులండి. ఒరే..ఒసే..అనే కాదండి, వాళ్లకు పుట్టిన పాపానికి వాడికి తప్పలేదండి ఆ పేర్లండి బాబు. చెప్పడం మరిచిపోయానండి…వాడి పడక ఎక్కడో తెలిసండి పశువుల కొట్టం వద్దగాని, ఊరికి దూరంగా ఉన్నవాడలో గాని అండి. అందరూ కలిసే భూమి కోసం పోరాడారండి. వ్యవసాయం తెలిసినోడు కదండి రైతు…అందరూ రైతులు అయిపోతే వ్యవసాయం సాగిదేలా అని ఆలోచించి..భూమి మాకు..వ్యవసాయం మీది అని నిర్ధేశించేశారండి. కాలానికి ఇవేమీ తెలియదుకదండి. అంతకముందే ఎక్కడో ఒక దగ్గర అధనపు చేతుల నెత్తురు తాగి తెగబలిసి పోగేసుకున్న డబ్బును పెట్టుబడిగా మార్చకుని కొత్త రూపంలో ముందుకు వచ్చారటండి. ఈ క్రమంలోనే ఉమ్మడి కుటుంబంలో చీలికపీలికలు కావడంతో భూమి కూడా రానురాను గట్లు పక్కకి గట్లు వచ్చి మడిసెక్క సన్నబడిపోయిందట. ఒకప్పుడు పండగనాడు బాబులని తాతల కాలం నుంచి వారి గొప్పతనం గురించి కీర్తిస్తే కుంచం బియ్యం దాని చేసిన మహారాజు…రానురాను బలహీనపడిపోయాడంట. బయట, లోపల ఉక్కపోత ఆరంభమయ్యింది. గ్రామంలో ఉన్న మిగులు చేతులను నగరం రా..రమ్మని ఆహ్వనించింది. వాడికేటండి. ఎక్కడైనా కష్టపడే కదండి జీవిక నడిచేది. వాడు ముందు పరిగెత్తిపోయాడండి. కొందరేమో కసితో చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుని తమ వాడకి వెలుగు రేఖలయ్యారండి. దీంతో ఓరి పాపిగా, ఏమే అసిరమ్మా అని పిలుద్దామనుకున్నా పలికే దిక్కులేకుండా పోయింది. అందరూ పోయారండి. చేసినోడే పోతే..చేయించుకునే వాడు, వారితో పాటు చేసేవాడు కూడా అనివార్యంగా పోవల్సి వచ్చిందటండి. ఎలా? ఆ భూములను, పొలాలను పెట్టుబడిదారుడు తన గుప్పెట్లోకి ఎలా తెచ్చుకోగలిగాడో మా గౌరినాయుడు బావు రాసిన కథలు చదివితే మీ బోటివారికి అర్ధం కాని విషయాలు కావులెండి. అతనే కాదండి..చిత్తా అప్పలనాయుడు…ఇలా రైతు ఇంటి వచ్చిన ప్రతీ కథకుడూ మీరన్న ‘హింస’ గురించి తెగ పోరుపెట్టారండి. చివరికి ఎగిరిపోయే పిట్టల కోసమని కన్నీటిధార ఒలికించారండి. ఒకడకి అన్నం పెట్టేవాళ్లం..మరొకటి దగ్గర చేయి చాచడమేమిటిరా అని కవులు కూడా పొగిలిపొగిలి ఏడ్చారండి. కాని, బక్క రైతు ఒక్కడు కూడా విజయవాడ పాసింజర్ ఎక్కకుండా ఇంటికి తిరిగిరాలేదండి. నాయనలారా అని బతిమిలాడినా నాగావళి ఎక్స్ ప్రెస్ ద్వారా హైదరాబాద్ పయనం మానుకోలేదండి. తమలాంటి పెద్దోళ్ల మాట విని మహారాజులని కీర్తిస్తే నిజమేనని నమ్మిన కొంతమంది బక్కరైతులు, మరికొంత మంది కౌలు రైతులు కడకు ఇంట్లో ఉరితాడుకో, ఊరి శివర పొలం గట్టున నురుగల కక్కుకునో కనిపించారండి. అంటే…ఈ మొత్తం క్రమాన్ని పరిశీలిస్తే…నాబోటి వాడికి తెలిసిందేమిటంటే…కవులు ఏడ్చితేనో, కథకులు కతలుకతలుగా రాసి, గీసి పారేస్తోనో రైతు ఊర్లో ఉండిపోడని మా ప్రాంత అనుభవమండి. కావాలంటే మా కథకుల ఫోన్ నెంబర్లు తమకి పంపగలనండి. తెలుసుకోవడానికి. జీవిక ముఖ్యమండి. మీరన్నట్లే ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవాలని కాంక్షిస్తే…ఇప్పుడు మీలా, నాలా ఫ్యాన్ కింద కూర్చొని ఇలా సారంగ వెబ్ మ్యాగ్ జైన్ లో చర్చించుకునే వాళ్లమంటారా? డైనోసర్లులా ప్రకృతి ప్రధాన జీవితం గడిపేవాళ్లం కదండి? ఇక పోతే వలసపోయిన రైతు కార్మికుడుగా మారాడా? కూలిగా మారాడా? అని ప్రశ్నిస్తున్నారు. అయ్యా… నెల్లిమర్ల జూట్ మిల్లులో నా తండ్రి ఓ కార్మికుడు. మా నాన్న మిల్లులో చేరేటప్పటికి అంతమంది మిల్లులో పని చేయడానికి పనివాళ్లు లేరండి. ఇప్పుడు మా జూట్ మిల్లలో సగం మంది పొడి కూలీలే అండి. తమరి దృష్టిలో కార్మికుడు అంటే సుఖంగా జీవించేవారులా ధ్వనిస్తోంది. మా తరం మా ఇళ్లల్లో చేతికాపుకి వచ్చేంత వరకూ ఆదివారం పూట అర్ధపావు మాంసం కొనుక్కొని అయిదుగురు కలిసి తినేవాళ్లమండి. జీతాలు నాడు నాన్న తెచ్చిన తినబండారాలు తప్పా మిగిలిన రోజు స్వీటు ఎరిగే వాళ్లం కాదండి. మా ఇంట పుట్టిన పాపానికి మాతో పాటు మా ఆడపిల్లలు కూడా బట్టల దుఖాణాలలో, కిరాణా దుఖాణాలలో రాత్రి పది గంటల వరకూ శ్రమిస్తున్నారండి. అంతటి శోభను అనుభవించామండి కార్మిక కుటుంబాలుగా. పండగ నాడు కొత్త బట్టలు వేసుకోవడం కూడా ఓర్వలేని యాజమాన్యాలు అదిగోండి. మీరన్నారో కూలీలను గేటు బయట నిలబెట్టారండి. వాళ్లను చూపిస్తూ లోపల ఉన్నవాళ్లని నానా రకాల హింసలు కొనసాగిస్తున్నారండి. రైతు జీవితం కళ్ల ముందు కనిపిస్తుంది కదండి..అందునా తిండి పెట్టేస్తున్నామన్న ఫీలింగ్ ఒకటి తరతరాలుగా, నరనరాలుగా ఉండిపోయింది కదండి కాబట్టి మీ బోటి వారు స్పందించేందుకు ముందు ఉంటారండి. అసలు కూర్చోవడానికి మడి గట్టు కూడా లేని వాళ్లు, రెండు రెక్కల తప్పా మరొకటి ఆసరాగా కూడా లేనివాళ్లు నాలుగు గోడల మధ్య పడే చిత్రహింసల గురించి ఎవ్వరూ మాట్లాడరండి. ఎందుకంటే వాడు చేసేది ఉత్పత్తి కాదు కదండి. తిండి లేనివాడు తిండి ఎక్కడ పెట్టగలడండి. తిండి పెట్టిన చేయి మరవకూడదన్న మీ బోటి వాళ్ల అందించే చైతన్యంతోనే చాలా మంది కథకులు, కవులు కార్మికుల కష్టాల గురించి రాయడం లేదండి. ఎక్కడైనా తూటా తుళ్లో, లాఠీ పడితే తప్పా. ఇక, సెల్ ఏర్పాటు చేసి కార్మికులుగా తీర్చిదిద్దమని అంటున్నారు. సారూ..మీబోటి వారు చెప్పగా విన్నా మనుగడ కోసం పోరాటమని…మెతుకు కోసం బతుకు పోరాటం చేయమని ఎవరైనా ప్రత్యేక క్లాసులు పెట్టి చెప్పలేదటండి. అంతెందుకు రైతు పుట్టుక కోసం ఆశ్రమాల్లో ప్రత్యేక శిక్షణ వలనే కాలేదటండి. ఎవడి బతుకు కోసం వాడు పడే యాతనే ఈ వలస అటండి. ఆ యాతనే క్రమేణా ఓ సామూహిక శక్తిగా మారతాదటండి. అప్పుడు ఆ శక్తి ముందు ఏ శక్తి ఆగదటండి.
  సరిలెండి. నా వెర్రి గాని ఎంతకాదనుకున్నా…ఆస్తిని వదులుకోవడమంటే ఎవరికి మాత్రం ఇష్టలెండి. అందునా మీలాంటి పెద్ద రైతులకి.
  తమరు వేరేగా భావించకండి. ఆస్తి లేని వాళ్లకదండి..లౌక్యంగా మాట్లాడటం మాకు రాదండి. తప్పోఒప్పో ఉన్నది ఉన్నట్లు, తెలిసింది తెలిసినట్లు చెప్పేయాలనుకునే వర్గం కదండి..అందుకని ..ఉంటాను సార్.

 14. లక్ష్మణరావు says:

  కన్నం నాయుడిగారికి,
  నమస్సులు. నా అభిప్రాయం చిన్నపాటి తప్పు దొర్లింది. ఈ పరిణామ క్రమం గురించి మరోసారి వెంకట్ గారు రాసిన శ్రీకాకుళ గిరిజన రైతాంగ ఉద్యమం పుస్తకాన్ని మిత్రులు సూచన మేరకు మరోసారి చదివానండి. ఆ పుస్తకం ప్రకారం రైతాంగ ఉద్యమాల ద్వారా 1948-49 మధ్య కాలంలో బలమైన సామాజిక వర్గాలకు భూమి దఖలపడిందండి. సిక్కోలు పోరాటం ద్వారా 1/70 యాక్టు తో పాటు సాగునీటి జలాలు అందుబాటులోకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు జరిగాయటండి. తద్వారా భూమి దఖలుపడిన వారు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ఈ రెండు ఉద్యమాలు దోహదపడ్డాయండి. ఉంటానండి.

 15. Srinivasrao says:

  నా కవితపై స్పందించిన మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలుగు సాహిత్య చరిత్రలో రైతుపై సానుభూతితో వచ్చినంత సాహిత్యం మరే అంశంపై రాలేదు అనుకుంటున్నాను (ఇది నా అంచనా మాత్రమే) నేను రైతు కష్టంపై ఏడ్చిన వాడినే(అందరూ ఏడ్చినప్పుడు మనమూ ఏడవడం మామూలే కదా). నా మొదటి కవితా సంపుటిలో (సముద్రమంత చెమట చుక్క) ‘పచ్చనాకు మీద నెత్తుటి సంతకం’ అను కవిత రాసుకున్నాను. మా నాన్న కార్మికునిగానే కాకుండా రైతుగా కూడా కొంత భాద్యతను నిర్వహించాడు కావున. అసలు చిక్కంతా ఎక్కడొచ్చిందంటే నిత్యం కార్మికవర్గ సమస్యలను చర్చించుకొనే మిత్రులు మధ్య మసలాటమే. అసలీ కార్మికులు ఎవరు? ఒకప్పటి చిన్న, సన్నకారు రైతులు మరియు రైతు కూలీలు. మరి వీరు కార్మికులుగా ఎందుకు మారాల్సి వచ్చింది? అంటే ‘వ్యవసాయం’ సంక్షోభంలో వుంది అనే ప్రశ్న నాలో మొదలయింది. సామాజిక పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయాలన్న కుతూహలం నాలో పెరిగింది. ఇలాంటి సందర్భంలో సాగర్ గారి ‘పల్లెను మింగిన పెట్టుబడి’ అన్న సామాజిక అధ్యయన పుస్తకం వచ్చింది. అప్పుడు అర్ధమయ్యింది వ్యవసాయం సంక్షోభంలో లేదు రైతు సంక్షోభంలో వున్నాడని. ఈ పుస్తకం చదివే క్రమంలోనే కార్ల్ కౌట్స్కి ‘the agrarian question’ అనే పుస్తకం నా ఎరుకలోకి వచ్చింది రైతు సంక్షోభంకు గల కారణాలను తెలుసుకోవడానికి సాగర్ గారి సూచనలు మేరకు ‘the agrarian question’ అనే ఈ పుస్తకాన్ని చదివాను. అదే సందర్భంలో దర్భశయణం శ్రీనివాసాచార్య గారి ‘రైతన్న…నువ్వు బతకాలి’ అన్న కవిత చదివాను. దానికి స్పందనగానే నేను ‘the agrarian question’ పుస్తకంలోని అర్ధం చేసుకున్న విషయాలను కవితగా మీముందుంచే ప్రయత్నం చేసాను. (ఫ్యూడల్ కాలంలో వ్యవసాయం ఎలా కొనసాగేది? నగదు అవసరాలు పెరిగినాక, రైతు మార్కెట్ పై ఆదారు పడినాక ఎక్కువ మిగులను సపాదించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? కుటుంభసభ్యుల సంఖ్యను ఎందుకు తగ్గించుకోవాల్సివచ్చింది? ప్రత్యమ్నాయ ఉపాధిని ఎందుకు వెతుకుకోవాల్సి వచ్చింది? సాంకేతికత వ్యవసాయ ఉత్పత్తి అభివృద్ధికి, రైతు సంక్షోభానికి ఎందుకు కార్ణమయ్యింది? తన అవసరాలను కుదించుకొని ఇతర మార్గాలు ద్వారా సంపాదించిన సొమ్మును ఎందుకు మళ్లీ మడిసెక్కకే మదుపు పెట్టాల్సి వచ్చింది? మదుపుకి, రాబడికి సమన్వయము కుదరక ఎందుకు రైతు ప్రాణాలను వదలాల్సి వస్తుంది? చివరగా తను ఎందుకు proletariat గా మారతాడు? అన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ‘ the agrarian question’లో దొరుకుతాయి). అయితే దేహానికి అలంకరణ కవిత్వానికి పదచిత్రం అవసరం కాని నా ఈ కవితకి అలంకరణ తక్కువే అని ఒప్పుకోవాలి. చివరిగా ‘ ఏడుపు పరిష్కారం కాదు… మార్పును గుర్తించి ముందుకు పోవడం అనేది సామాజిక పరిణామక్రమం అనేది the agrarian question చదివితే తప్పక అర్ధమవుతుంది.

మీ మాటలు

*