ప్రశ్నల లాంతరు

 

 

-చల్లపల్లి స్వరూప రాణి

~

 

అవును రోహిత్!
నువ్వన్నది నిజమే!
పుట్టుకతో నేరస్తులమౌతున్న చోట
మన పుట్టుక ఎంత వేదనా భరితం!
అవును!
ఇది ఒంటరి అలగా బాల్యం
పచ్చితనాలను
నులివెచ్చదనలాను
నరికి పాతరేసుకున్న బాల్యం
ఒనుకులదాకా తరుముకొచ్చే
వెలివేతల బాల్యం
ఎంత గెల్చినా
ఏ మన్ననకి నోచుకోని బతుకులు
ఇక్కడ ప్రేమ నిషిద్ధం!
ప్రశ్న నిషిద్ధం!
మననమ్మకాలకు రంగులద్దుతారు
నలుగురు నడిచే దారినే నడవలేక పోవడం
ఎంత నేరం!
రాజు గారికి బట్టలు లేవనడం
ఎంత పాతకం!
ఇక్కడ బతకడం అంటే
కుయ్యో మొర్రోమని
కాళ్ళీడ్చుకుంటూ నెట్టుకు రావడమని
తెలుసుకోలేక పోవడం
ఎంత తప్పు!
రాముడు మంచి బాలుడెందుకయ్యాడని,
ఈ దేశంలో ఎక్కడ చూసినా
సీతమ్మోరు స్నానమాడిన
గుంటలే ఎందుకున్నాయని
అడగడం ఎంత ఘోరం!
ఇక్కడ కలలు కనమంటారు
కానీ నిద్ర పట్టనివ్వరు
ఇక్కడ బడులుంటాయి, గుడులుంటాయి
కానీ జ్ఞానార్జన నిషిద్ధం
రోహిత్!
చదువంటే ప్రశ్న కదా!
మనుషులని వస్తువులుగా
డబ్బులుగా, ఓట్లుగా
కాదంటే బంగారంగా చూసే కళ్ళకి
మనిషంటే మెదడని
మనిషంటే చలనమని
మనిషంటే ప్రేమని చెప్పడానికే
నువ్వొచ్చి వెళ్ళావా రోహిత్!

మీ మాటలు

 1. కె.కె. రామయ్య says:

  “మనిషంటే మెదడని, మనిషంటే చలనమని, మనిషంటే ప్రేమని చెప్పడానికే, నువ్వొచ్చి వెళ్ళావా రోహిత్!” ధన్యవాదాలు స్వరూపరాణి గారు

 2. THIRUPALU says:

  //పుట్టుకతో నేరస్తులమౌతున్న చోట//
  పుట్టుకతో నేరస్తులను చేస్తున్న చోట , పుట్టుకతో నేరస్తుల జాబితాలో చేర్చ బడే చోట. అంటే బాగుండేది.
  ” పుట్టుకతో దేశ ద్రోహుల లిస్టులో చేర్చ బడుతున్న వాడిని” అన్న ట్లు.
  కవిత బాగుంది.

 3. mani kumari says:

  ఇక్కడ కలలు కనమంటారు
  కానీ నిద్ర పట్టనివ్వరు
  ఇక్కడ బడులుంటాయి, గుడులుంటాయి
  కానీ జ్ఞానార్జన నిషిద్ధం

  ఎంత నిజం. ఈ నడుస్తున్న చరిత్ర ఎప్పటికి మారుతుంది ?

 4. Ajit Kumar says:

  అక్కా
  రోహిత్ వెళ్ళిన సంగతి చరిత్రలో రికార్డు చేయబడింది. ఇది క్రొత్త మార్పే గదా… ఇంతకు మునుపు ఎందరో పంపబడ్డారు. కానీ..కానీ… ఎవరూ పట్టించుకోలేదు.
  రోహిత్ ను పంపినవారికి వీరతాళ్ళు పంపారు ఎప్పటిలాగే… నల్లకోట్లు చీకటిలో చూడగలవా…
  బడులలో గుడులలో నూరిపోస్తుంది జ్ఞానం కాదేమో…
  బడికీ గుడికీ సరీగా పోతే … రాజుగారికి గుడ్డల్లేవనగలవా…
  ఇంతకీ రోహిత్ కి ముందటి వెలికాలం (Before రోహిత్ / B R ) (A .R ) లో మారుతుందంటావా…

 5. Buchireddy says:

  Excellent .one . రాణి గారు
  ========================
  బుచ్చి రెడ్డి గంగుల

 6. శిఖామణి says:

  చదువంటే ప్రశ్న అని అంబేడ్కర్ నుండి రోహిత్ వరకూ నిరూపించారు ! అంబేడ్కర్ తల యేత్తుకు పోరాడాడు ! రోహిత్ శ్రీ శ్రీ మాటల్లో తలవంచుకు వెళ్ళిపోయాడు ! మంచి పద్యం స్వరూప గారూ !

 7. D Subrahmanyam says:

  అద్భుతమయిన కవిత రాసినందుకు అభినందనలు స్వరూపరాణి గారు.

 8. Y Pradeep says:

  చదువంటే ప్రశ్న మాత్రమేనా జవాబులు దొరకవా శిఖామణి గారు . ఈ పోయెమ్ ఎక్కడ మొదలై ఎక్కడ ఎలా ఎండ్ అయిందో మరో సారి చదవండి. ఆవేద్ననీ ఆర్ద్రతనీ అర్థం చేసుకుని కవికి అభినందనలు తెలుపుతూనే పోయెమ్ లోని అంతర్గత వైరుధ్యాన్ని మున్ముందు పరిస్కరించుకుంటారని ఆశిస్తాను.

 9. chandolu chandrasekhar says:

  చాల బావుంది .స్వరూప గారు , కాని జ్ఞానం మిద కొవ్వు పట్టిన తోడేళ్ళు దాడి చేస్తాయి ,అజ్ఞానం తో .రాజు గారు రధం పైన నుండి పడతాడేమో అని ఉహ కలిగిన రాజద్రోహమే , 121 సెక్షన్ కింద నేరస్తుడే .

  • శ్రీనివాసుడు says:

   కానీ, చంద్రశేఖర్ గారూ, నాదొక చిన్న సందేహం. స్వాతంత్రం వచ్చిన తరువాత, లేదా అంతకు ముందూ కూడా రాజుగార్లు దేవతావస్త్రధారులని తెలిసి తెలిసీ ఎన్నుకున్నది మనమే కదా. మరి, ఇంత ప్రజాస్వామ్యంలో ‘‘నిశ్చయమైన తరువాత కునిసేం లాభం?’’
   ఇకనైనా ప్రజలంతా ముక్తకంఠంతో గొంతులు విప్పకపోతే ‘‘తాంబూలాలిచ్చేసేం తన్నుకు చావండి’’, అని ప్రజలందరినీ కూడా దేవతావస్త్రధారులుగా చేసే ప్రమాదం లేదంటారా?

 10. sudheer says:

  నాకు అసలు అర్థం కాలేదు …..

 11. chandolu chandrasekhar says:

  శ్రీను గారు , మనం ప్రజలు అనే మాటని సామాన్యికరణ చేస్తాం .కాని అది వాస్తవం కాదు .ప్రజలంటే చలనం .einstein స్పేస్ అండ్ టైం కీలకమైనది .ప్రక్రుతి పై గర్జించిన పర్జన్యం ఆదిమ ప్రజ నుండి liberty ,eguality and fraternity ,సాధించిన ప్రజ.ప్రపంచ ప్రజల నుదుటి మిద ఎర్రగిత గీసి పిడికిలి బిగించిన ప్రజ .వీళ్ళు ప్రజలంటే .కాల ప్రవాహం లో కొట్టుకు పోయ్ నురగని ప్రజని ప్రజలని అనరు .అది చైత్యన సముద్రం .అసలు ప్రజలు అంటే ఎవరు అనే దానిమీద చర్చ జరగాలి .

  • శ్రీనివాసుడు says:

   చంద్రశేఖర్‌గారూ!
   ప్రజాస్వామ్యంలో సామాన్యీకరణ చేయక తప్పదు కదండీ. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానమే కదా.
   అలాగాక, some are more equal than others కాదు కదా?
   మనం బ్రతికేది ప్రజాస్వామ్యంలోనే అయినప్పుడు మోసేవారు, జల్సాగా గడిపేవారు, రెండు వర్గాలను కూడా సమానంగానే పరిగణించాల్సి వస్తుంది కదా? లేకపోతే, వారి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను దెబ్బతీసినట్లే కదా?
   మీరు చెప్పినట్లుగా అసలు ప్రజలంటే ఎవరు? రైతులంటే ఎవరు? రైతు కూలీలంటే ఎవరు? విద్యార్థులంటే ఎవరు? అనేది స్పష్టంగా నిర్ధారించి, ప్రమాణాలను స్థిరీకరించాల్సిన అవసరం కనబడుతోంది.
   అలాగాక, వేరే వ్యవస్థను, వేరే విధానాన్ని కోరుకుంటే ఆ మార్గంలోనే పయనించాల్సివుంటుంది. దానికి పీడితులందరి మద్దతునూ కూడగట్టుకోవాల్సి వుంటుంది.

   • “ప్రజాస్వామ్యంలో సామాన్యీకరణ చేయక తప్పదు ” అనటం లోనే మోసముంది. సాధారణ అర్ధంలో అందరు మనుషులు కాబట్టీ అలా అంటాం. కాని వ్యవస్తలో పాలింప బడే వారు మాత్రమే ప్రజలు. ఎందుకంటే వారికి మాత్రమే హక్కులు కావాలి. పాలకులకు లేక పాలక వర్గానికి హక్కులు వారి చేతుల్లో నే ఉంటాయి లేక అమలు పరిచేది వారే కాబట్టీ వారికి ప్రత్యేకంగా ఇచ్చే వారు లేరు కాబట్టి వాళ్ళను ప్రజల్లో చేర్చనవసరమ్ లేదు.
    కాని సాధరణ పరిస్తితి అది కాదు. వారు పాలకులను ఎనుకొనే వారైనప్పటికీ ప్రతి దానికి ( హక్కులకు) ప్రజలు పాలకులపై ఆధార పాడుతారు. అందకే వారిని మాత్రమే ప్రజలు అనాలి.

   • నోటిలొ బంగారు స్పూనుతొ పుట్టిన ప్రభు వర్గాలకు యధాతధంగా ఉంటే నే బాగుంటుంది. ఎటొచ్చీ ప్రజలు వారికే ప్రభుత్వం ఎలా ఉండాలో కావాలి.

   • యూ....సూ.. says:

    యథాతథస్థితిని కోరుకునేది ప్రభువర్గాలు మాత్రమే కాదు, సమాజంలో స్థిమితపడిన సంపన్న సామాజికవర్గాలుకూడా ఆ స్థితినే కోరుకుంటాయి. ‘‘మళ్ళీ వెనక్కి వెళదాం, ఇంకా మా స్థితి నిబ్బరంగా తయారవుతుంది’’, అనే కోరుకుంటుంటారు. వారి నుండే మనకి అసలైన ప్రమాదం పొంచివుంది.

   • సంపన్న సానాజిక వర్గాలు, ప్రభువర్గాలు వేరుకాదు. సంపన్న వర్గాలే పాలకులు.పాలకులే సంపన్న వర్గాలు.

  • యూ... సూ... says:

   ప్రతిదానికీ పాలకుల మీద ఆధారపడేవారిని ‘ప్రజలు’ అని అనరు, ‘బానిసలు’ అని అంటారు. ఆ బానిసలని పెంచి పోషించేది ఏ వ్యవస్థ అయినా దాన్ని సంపూర్ణంగా కూలద్రోయడమో, తరువాత పునర్వ్యవస్థీకరించడమో తప్పనిసరిగా చేయాలి. అలా ప్రజలందరూ బానిసలుగా మాత్రమే మారిన సమాజంలో బ్రతుకుతున్నామా మనం?

   • ”ప్రతిదానికీ పాలకుల మీద ఆధారపడేవారిని ‘ప్రజలు’ అని అనరు” అలా ఆధార పడేటట్టు చేయడమే పాలకుల నీతి. కాదు పాలక వర్గాల నీతి. ఆధారపడక పోతే ప్రభుత్వం అవసరం లేదు. ఎవరికీ వారు బ్రతకొచ్చు. అప్పుడు ప్రభు వర్గాలకు రక్షణ కల్పించే వారు ఉండరు. ప్రభు వర్గాలకేమిటి, ఎవరికీ ఉండదు. దాన్నే అనార్క్సిజం అంటారు. ఇరవయ్యో శతాబ్ది మొదటి భాగం లో పెట్టుబడి దారి వర్గం ఇలానే వాదించింది. తాము చేసే వ్యాపారం మీద ప్రభుత్వ అజమాయిషీ ఉండకూడదని. దాన్నే లైసేజ్ పేర్ అని పిలిచే వారు. కాని అది ఆచరణకు సాధ్య పడలేదు.

   • శ్రీనివాసుడు says:

    ప్రతిదానికీ ప్రభుత్వం మీద ఆధారపడివున్నాం అనుకోడమే మానసిక బానిసత్వం. మనలో అనార్కిజం లేకపోవడానికి కారణం ప్రభుత్వం, పాలకవర్గాలు మాత్రమే, ఆ వ్యవస్థ మాత్రమే అని చెప్పడం అత్యంత విడ్డూరం,
    అసలు ప్రభుత్వం అంటే ఎలావుండాలో నిర్వచించవలసిన అవసరం కూడా వుంది. మన దైనందిన వ్యవహారంలో సక్రమంగా నడవడానికి ఉపయోగపడే కార్యనిర్వాహక వ్యవస్థా? లేక, అధికారంతో అణచివేసేందుకు ప్రయత్నించే వ్యవస్థా? అన్నది తేలాలి.

   • యూ.... సూ... says:

    ఇదో పెద్ద వైరుధ్యం. సంపన్న సామాజిక వర్గాలు మాత్రమే ప్రభువర్గాలని నిర్ధారించడం మరీ విడ్డూరం. పాలకులు అయిన తరువాత సంపన్న సామాజిక వర్గాలుగా మారతారా? లేక సంపన్న సామాజిక వర్గాలే పాలకులుగా మారతారా?
    అయినా, వారిని ఎన్నుకునేది ప్రజాస్వామ్యంలో సామాన్యప్రజలే కదా?

   • ఉదాహరణకు జగన్ బాబు చంద్రబాబు ఇద్దరూ ఒక వర్గానికి చెందిన వారే! వారి మధ్య వైరుధ్యం ఏమి లేదు అదికారం కోసం పోటి తప్ప. వాల్లను అంటిపెట్టుకొని ఉండే వారంతా పాలక వర్గాలే! వారి కేడరు తప్ప.

   • యూ...సూ... says:

    వారి కేడరు కూడా పాలక వర్గాలే. ఎప్పుడయినా ఆ ముఠా గుంపులోకి వెళ్ళిచూడండి తెలుస్తుంది.

   • ”వారి కేడరు కూడా పాలక వర్గాలే” ఎంత మాత్రం కాదు. అలా అనిపిస్తుంది అంతే! వాళ్ళలో ఎవరో ఒకరిద్దరు వారి అంతస్తు అందు కుంటారు గాని, అందరు కాదు. దురదృస్టమ్ ఏమిటంటే ఎవరినైతే మోసం చేస్తున్నారో వారే వారి రక్షకలు వారి సేవకులు.

   • యూ...సూ.... says:

    కేడర్లో మోసపోయేవాళ్ళెవరూ వుండరు. వారి స్వప్రయోజనానికే కేడర్లో చేరినవాళ్ళని తెలివితక్కువవాళ్ళుగా అంచనావేయడం ఒక అజ్ఞానం. ఇకపోతే, కేడర్లో చేరినవాళ్ళందరూ కచ్చితంగా ఆ స్థాయికే చేరదామన్న ఉద్దేశ్యంతో చేరరు. తాత్కాలిక, తక్షణ ప్రయోజనాలే ప్రాతిపదిక. పరస్పర ప్రయోజనాలనిబట్టి కలసి నడక సాగుతూవుంటుంది. ప్రయోజనాలు నెరవేరని పక్షంలో ఎదుగి పక్షంలోకి నిస్సందేహంగా కప్పదాట్లు వేసేవాళ్ళే ఇప్పటి కేడర్లోని సింహభాగం.

 12. Sivalakshmi says:

  వెలివేతల బాల్యం
  ఎంత గెల్చినా
  ఏ మన్ననకి నోచుకోని బతుకులు
  ఇక్కడ ప్రేమ నిషిద్ధం!
  ప్రశ్న నిషిద్ధం!

  స్వరూపా , ఆలోచింపజేసే మంచి కవిత రాశావురా ! అభినందనలు !!

 13. srinivas sathiraju says:

  ఎవరి పుట్టుకా ఎప్పుడూ కూడా తల్లికి వేదనా భరితమె. అంత వేదన భరించి కన్న బిడ్డ కాటికి ముందుగా వెడితే అది నిజమైన వేదన. అంటే కాని రోహిత్ అనబడే ఒక పిరికివాడు పలయాన వాది శుష్క వాద ప్రియుడు అనవసర వివాదాలు వ్యవహారాలు జరుపుతూ సమాజాన్ని తప్పుదోవ పట్టించు వాడు. తను చదువుకుని పదిమందికి ఉపయోగామవ్వకుండా ఒక కూరలమ్ముకునే పాలు పోసి బ్రతికే వారి కన్నా ఇంకా చెప్పాలంటే ఒక భిక్ష గాదికున్న ఆత్మా విశ్వాసం బ్రతుకు పట్ల నమ్మకం లేని మూర్కుడు. అంటే కాదు తనది కాని కులాన్ని మతాన్ని ఆపాదించుకుంటూ సిగ్గు లేకుండా వీలయినంత వరకు సమాజాన్ని ద్వేషించి ఒక విద్వేషపు పోరాటాన్ని తలకెత్తుకుని మూర్ఖంగా ప్రవర్తిస్తూ మూర్ఖంగా అంతమయిన మూర్ఖుడు. జాతికి సందేశం కానే కాదు. అసలు మిడి జ్ఞానంతో రాసే ఇలాంటి రాతలు నిజం చెప్పాలంటే ఎవరికీ ఉపయోగం లేవు. రోహిత్ వంటి వారినుంచి కాని స్వరూప రాణి గారినుంచి ఎవరూ కూడా నేర్చుకునేది ఉండదు. కేవలం కాసేపు కాలాహరణమ్ పనీ పాటు లేని వారికి. జాలి కూడా చూపించదానికి వీలు లేని ఒక మరణం మీద ఇంత చర్చ జరగడం మూలంగా నిజమైన సమస్యలు పక్కకి నెట్ట బడి సమాజం లోని నిజమైన దోపిడీ ఎప్పటిలానే కింద నుంచి పై దాకా సిగ్గులేకుండా జరగడానికి కారణం సమాజ దర్పణం కావలసిన పత్రికా విలువలు అతి ఘోరంగా పడి పోవడం అని ఎవరికీ తెలియకపోవడం ఏమీ కాదు. పట్టించుకునే తీరుబాటు తమ భాద్యత ఇంకా ఎవరికీ రాక పోవడం. స్వార్ధం నిలువెల్లా నిండి నేనూ నాది అనే వ్యవహారానికి ఉన్న సమయం సమాజంతో మనకున్న బంధాలు కేవలం మన సుఖ జీవనానికి సంబందించినఅంత వరకే ఉండడం తో ప్రేమ అనే భావన కుటుంబ సంభందాలలో లోపించడం ఈ నాటి సమాజపు దౌర్భాగ్యం. క్షీణ దశలో ఉన్న నవ సమాజపు బంధాలు ఆందోళన కలిగించిన ఒక కొత్త కర్తవ్యాన్ని భాద్యతని అందరికి అందిస్తున్నాయి. ఆ భాద్యత కర్తవ్యమ్ నెరవేర్చాలంటే ఇది మార్గం కాదు ముమ్మాటికి కాదు.

  • తోటపల్లి సన్యాశినాయుడు says:

   సార్ SRINIVAS SATTIRAJU గారూ ,మీ ప్రవచనాలు బాగున్నాయి. కాలహరణం గురించిమీరుచెప్పే సూక్తులు అద్భుతం.ఒచ్చినచిక్కల్ల చెప్పేవాడికి వినేవాడు లోకువన్న భావం వుండడమే సార్ ,మనకి నచ్చిందే శాస్త్రం.మనం మెచ్చిందే వేదాంతం.ఎవడెలాపోతే మనకేలసార్..పోనివ్వండి.

 14. Ajit Kumar says:

  SRINIVAS SATHIRAJU గారూ… మీరు రోహిత్ ను క్రూరంగా విమర్శించారు. కానీ రోహిత్ ది మీరు ఊహించలేని బాధ. ఇతర కులాల వారికి అది అనుభవం లోకి రాదు. అతని మాటలు మీకు వినిపించవు. అతని రోదన మీకు వినిపించదు. కానీ అతని చర్యలు మీకు మరోలా కనిపిస్తాయి. అది అతని దౌర్భాగ్యము. మీరు అతణ్ణి శిక్షించడం మొదలు పెట్టాక, శిక్షాకాలం ముగియకముందే అతడు చేసిన పని మీకు అపరిమితమైన అసంతృప్తిని మిగిల్చినట్లుంది. అతని తల క్రింద ఉన్న దీపం ఇంకా వెలుగుతూనేవుంది. ఎంతకూ ఆరిపోవడంలేదేమని బాధపడకండి… మీరు మరెంతో చేయాల్సిఉంది. మీరు దోపిడీ నీడ మీద పోరాడుతూవుండండి. అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటేనే తెలంగాణాకిరీటాలు కొందరికి దక్కాయి. అది మార్గకాదంటేఎలా…అది ఆ కిరీటాలు పెట్టుకున్నవాళ్ళకి కూడా నచ్చలేదు. లేటెష్టు ప్యాషన్ అందరికీ నచ్చుతుందా…

 15. Challapalli Swaroopa Rani says:

  ‘ప్రశ్నల లాంతరు’ కవిత పై స్పందించిన వారందరికీ ధన్యవాదాలు. సత్తిరాజు గారికి కూడా!

మీ మాటలు

*