అవధరించరయ్యా… !

 

 

-ల.లి.త.

~

 

సినిమాగోల లేని రోజుల్లో వినోద ప్రదర్శనలు తీరుతీరులు. ఒగ్గుకథలూ బుర్రకథలూ భజనలూ తప్పెటగుళ్ళూ యక్షగానాలూ.. ఇంకెన్నో.  భాగవతులు వీర శృంగార కరుణ రసాలురికిస్తూ కథలు చెప్పి అందరినీ కూచోబెట్టేవాళ్ళు. సురభి నాటకకంపెనీ భారీగా సెట్స్ వేసి నాటకాలతో ఊరందరినీ ఏకం చేసేది. చందమామా చుక్కలూ కూడా చూపులిటే వేస్తూంటే, ఊళ్ళో జనమంతా చాపలు పరుచుకుని చెంబుల్లో నీళ్ళు తాగుతూ చల్లగా రాత్రంతా ఆ ప్రదర్శనలొక్కటే చూసేకాలంలో ఎందుకు పుట్టలేదా అని నాక్కొంచెం దిగులేస్తుంటుంది. ఆడీ పాడే మనుషుల్ని కళ్ళారా చూసే కాలం అయిపోయి, వాళ్ళ ఛాయల్ని గ్రహణం చేసి తెరమీద ఆడించే సినిమాలొచ్చాయి. అవే వినోదమైపోయాక స్నేహితుల్తో చుట్టాల్తో సినిమాలకు వెళ్లి, నేలమీదా బెంచీలమీదా కుర్చీల్లోనూ కూర్చుని సినిమా చూసి, ఇంట్రబెల్లుకి ‘గోల్డ్ స్పాట్ : ద జింగ్ తింగ్’ తాగి, సినేమాకతలు చెప్పుకు తిరిగేవాళ్ళు జనం. ఇప్పుడు సినిమాకి వెళ్ళటం ఇంకోరకం అనుభవం. చాలామందికది  స్నేహితుల్తో కలిసి మాల్స్ కి వెళ్లి, మెక్ డోనల్డ్స్ తిండి కోక్ తో లాగించి, విండో షాపింగ్ చేసి, ఓ రెండుగంటలు చల్లగా మల్టీప్లెక్స్ థియేటర్ లో కూచుని రావటం. లేదా ఏకాంతంగా టీవీలో చూడటం లేదా సెల్ ఫోన్లో ప్రతిక్షణం ఎక్కడో ఓచోట ఛాయలతో కనెక్ట్ అయిపోవటం.

సినిమాని థియేటర్ లో చూడకుండా టీవీల్లో చూస్తుంటేనే ‘అది reduced experience’ అని గోల పెట్టాడు అదూర్ గోపాలక్రిష్ణన్. మరి సెల్ ఫోన్లో సినిమాలు చూడటాన్ని ‘bonsai experience’ అనాలేమో. విదేశాల్లో ఇప్పుడు టీవీ చూడటం కూడా తగ్గిపోయి ఇంటర్నెట్ లోనే పాటలూ బొమ్మలూ సినిమాలూ అన్నీ చూస్తున్నారట జనం. కామెరా రికార్డు చేసిన ప్రతిదాన్నీ ఇంటర్నెట్ వేగంగా అందిస్తుండటంలో లాభం కూడా లేకపోలేదు.  అలా దొరికిన ఒక పాత సినిమాలోని నృత్యనాటకాన్ని గురించి ఇలా…

***

సినిమాలొచ్చిన కొత్తల్లో అవెలా తియ్యాలో చేతగాకపోవటంతో సినిమాలన్నీ నాటక ప్రదర్శనని మూవీ కామెరాతో చిత్రించినట్టు ఉండేవి. చాలా రోజులవరకూ సినిమాలు తీసేవాళ్ళకి కథలూ నాట్యరీతులూ చూసివున్న అనుభవం వొదలక, సెమీ శాస్త్రీయ, జానపద నాట్యాలను శ్రద్ధగా సినిమాల్లో చూపించేవాళ్ళు. సినిమాకథకి ముడిపెడుతూ హరికథాకాలక్షేపాన్ని చూపించేవారు.  ‘వాగ్దానం’ సినిమాలో రేలంగి ‘భక్తులారా .. ఇది సీతాకళ్యాణ సత్కథ. నలభై రోజులనుంచీ చెప్పినకథ చెప్పినచోట చెప్పకుండా చెప్పుకొస్తున్నా’నని చెప్పుకుంటూ పోతాడు.

 

“ఫెళ్ళుమనె విల్లు, గంటలు ఘల్లుమనె, గుభిల్లుమనె గుండె నృపులకు, ఝల్లుమనియె జానకీ దేహము, ఒక నిమేషమునందె,  నయము, జయమును, భయము, విస్మయము గదురా!  శ్రీమద్రమారమణ గోవిందో హరి…” – అని ‘వాగ్దానం’ హరికథలో శివధనుర్భంగాన్ని వర్ణిస్తాడు కవి. ఈ పద్యంలోని క్రమాలంకారపు సొబగు ఘంటసాల గొంతులో రెట్టింపవుతుంది.

‘రామా కనవేమిరా’ అంటూ సీతాకళ్యాణ హరికథని మరోసారి సొగసుగా చూపించారు ‘స్వాతిముత్యం’ సినిమాలో.  ‘ఇదెక్కడిన్యాయం?’ అనే సినిమాలో హీరోయిన్ హరికథ చెప్తూ జీవిస్తుంది. నాయికగా వేసిన ‘ప్రభ’ నిజజీవితంలో హరికథా కళాకారిణి కావటంతో హీరోయిన్ని ఇలాంటి కొత్తరకం ఉద్యోగంలో చూపించే ఆలోచన వచ్చింది దర్శకుడికి.

రానురానూ ఈ కళారూపాలు ప్రభుత్వ సాంస్కృతిక సంస్థల్లో విదేశాలవాళ్లకి చూపించుకోడానికీ, దూరదర్శన్ లోనూ  తప్ప జనంమధ్య పెద్దగా లేకుండాపోవటంతో  సినిమాల్లో కూడా అవి కనబడటం మానేశాయి.  ఇవి ఎక్కువగా పురాణకథలు, జానపద కథలు. వీటితో సమకాలీన సమస్యలూ హాస్యమూ కూడా కలిపి సరదాగా చెప్తూ అలరిస్తారు కళాకారులు. వాళ్లకి భాష, నుడికారం, సంస్క్రతుల మీద మంచి పట్టు ఉంటుంది. అచ్చతెలుగు చిందుతో కలిసి సంస్కృత పదాలు నాట్యం చేస్తాయి. కథ చెప్పటంలో లయ, సాగదీత అన్నిటిలోనూ ఉంటాయి. చాలాకథల్లో సృష్టి కథ, ఎల్లమ్మకథ, భారత, రామాయణ గాథలూ, ఇంకా బొబ్బిలియుద్ధం, పల్నాటియుద్ధం లాంటి స్థానిక వీరగాథలూ ఉంటాయి.

ఈ కళారూపాలను సినిమాలకంటే ఎక్కువగా జాతీయ ఉద్యమం, కమ్యూనిస్ట్ ఉద్యమం తమ ప్రచారంకోసం బాగా వాడుకున్నాయి. డబ్బు పెట్టగలిగేవాళ్ళే సినిమాలు తియ్యగలరు కాబట్టి వాళ్ళ అభిరుచుల ప్రకారమే మొదట్లో సంగీత నాట్యాలు సినిమాల్లోకి వచ్చాయి. అవి శాస్త్రీయ, జానపద ఛాయలతో ఉండేవి. సినిమాల్లో దళితులంటే సానుభూతి చూపిస్తూ వొట్టి బాధితులుగా చూపించటమే ఎక్కువ. వారి కళాభివ్యక్తి ఇంచుమించుగా సినిమాల్లోకి రాలేదు. అందుకే ఒక జాంబపురాణం ఏ సినిమాలోనూ కనిపించదు. పూర్తిగా ఎదగని తెలుగుసినిమా స్థాయి రానురానూ ఏ ఆసక్తీ లేనివాళ్ళు క్రమంగా ఆక్రమించటంతో పల్టీలు కొడుతూ పడిపోయింది.

తెలుగుదేశంలో ఇప్పుడు ఎటుచూసినా కనబడేవి రెండే. ఒకటి ఇంజనీర్లు. రెండు సినిమాలు. సినిమాదెబ్బకి నాటకరంగం నేలకంటుకుపోయుంది. నాటకం కంటే ముందటి కాలానికి చెందిన రకరకాల కతలు మాయం అవటానికి ముందుదశలో ఉన్నాయ్.

***

girija1

అరవైల్లో ఒక మల్టీస్టారర్ సినిమా వచ్చింది. పేరు ‘రహస్యం’. ఆ సినిమా ఏమీ నడవలేదుకానీ అందులోని  ‘గిరిజాకల్యాణం’ ఆలిండియా రేడియోలోంచీ అందరికీ చేరింది. రేడియోతో పాటు చిన్నప్పుడు “తగదిది తగదిది తగదిది ధరణీధరవర సుకుమారీ తగదిదీ.” అని అర్థం తెలీకపోయినా పాడేసుకుంటుంటే గొప్పగా గుర్రపుస్వారీ చేస్తున్నట్టనిపించేది. పిల్లల్ని కూడా ఆకర్షించగల శబ్దసౌందర్యంతో మల్లాది పాట రాస్తే, దానికి తగ్గ సంగీత ఝరీసౌందర్యంతో ఘంటసాల వరుస కట్టాడని అసలు తెలీదప్పుడు.

పురాణ ప్రేమకథలుగా రుక్మిణీ కల్యాణం, పార్వతీ కల్యాణం ప్రసిద్ధాలు. బ్రాహ్మణుడిద్వారా రుక్మిణి శ్రీకృష్ణుడికి ప్రేమవిన్నపం చెయ్యటం, ఆయన రుక్మిణిని రథంమీద ఎక్కించి తీసుకుపోవటం, అడ్డొచ్చిన రుక్మితో కృష్ణుడు పోరాడి అతన్ని అవమానం చెయ్యటం, ఇదంతా సాహసంతో కూడిన ప్రేమకథ.  పార్వతీ కల్యాణంలో శివపార్వతులకు అంత రొమాన్స్ లేకపోయినా మన్మధుడు పిలవని అతిథిలా వచ్చి శివుడిని రెచ్చగొట్టటమే ఈ కథలోని సాహసకార్యం. మన్మధుడే కలిగించుకోకపోతే పార్వతి అలా శివుడికోసం తపస్సు చేసుకుంటూ కూర్చుండిపోతే, అసలే విరాగి అయిన శివుడు ఎంతకాలానికి ఆమె వలపునూ భక్తినీ కన్నెత్తి చూడాలి? శివుడి ప్రత్యేకత ఇంకోటుంది. నటరాజు కదా, కోపం వొచ్చినా సంతోషం వొచ్చినా తాండవ నృత్య ప్రదర్శన చేస్తాడు. దీనివల్ల కూడా మన్మధ విలాసంతో కూడిన శివపార్వతుల కళ్యాణ సంరంభం డాన్స్ డ్రామాగా ఎక్కువ బాగుంటుంది. అది కూచిపూడి భాగవతుల ప్రదర్శనైతే ?

కృష్ణాజిల్లా మొవ్వ మండలంలో ఉన్న చిన్నవూరు కూచిపూడి. అక్కడ పుట్టిన కొన్ని వంశాలవారు ఇప్పటికీ ఆ నాట్యాన్ని కొనసాగిస్తున్నారు. ‘దేవదాస్’ సినిమా దర్శకుడు వేదాంతం రాఘవయ్యదీ కూచిపూడే.  నేర్చుకున్న నృత్యాన్ని ఎంతో మనసు పెట్టి తను తీసిన ‘రహస్యం’ సినిమాలో చూపించాడు.

‘తక్కధింతాం తకతధింతాం’ అంటూ అశ్వగమన లయతో మొదలుపెట్టి, మూలపుటమ్మకూ చదువులతల్లికీ పరాకులు చెప్తూ మొదలౌతుంది ‘గిరిజా కల్యాణం’. తరువాత వినాయకుడు, కుమారస్వాములను తలుచుకుంటారు. స్థానిక దేవతలైన మంగళగిరి నరసింహుడూ, బంగరుతల్లి కనకదుర్గా, కూచిపూడిలో నెలవైన వేణుగోపాలస్వామీ వరుసగా బహుపరాకులు అందుకుంటారు. ఆ తరువాత కథలోకి దిగుతారు కూచిపూడి భాగవతార్లు.

ఆ నృత్యరూపకాన్ని తయారు చేసిన వాళ్ళు సామాన్యులా?  “ప్రౌఢవాక్యాల, ముగ్ధభావాల.. వచనరచనకు మేస్త్రి” అని ముళ్ళపూడి వెంకటరమణ కీర్తించిన మల్లాది రామకృష్ణ శాస్త్రి చేసిన రచనను నృత్యనాటకంగా తీర్చిదిద్దినది వేదాంతం రాఘవయ్య. సినిమా పాటలకు మెత్తని పట్టుదారాల్లాంటి వరుసలెన్నో అల్లిన ఘనుడు ఘంటసాల ‘గిరిజా కల్యాణా’నికి సంగీతాన్ని కూర్చాడు. (సినిమాపాటల గాయకుడిగా కొన్ని శృంగార గీతాల్లోనూ కెరీర్ చివర్లోనూ కాస్తగా ఫెయిల్ అయాడేమో గానీ,  సంగీత దర్శకుడిగా ఎల్లప్పుడూ మంచిస్థాయి సంగీతాన్నే సినిమాపాటలకిచ్చాడు ఘంటసాల).

సినిమాసంగీతం భాషా భావసౌందర్యాలకు ఎక్కువ విలువ ఇస్తుంది. శాస్త్రీయసంగీతంలో రాగ, స్వర ప్రాధాన్యత ఎక్కువ. భావాన్ని వినసొంపుగా చేయటంకోసం శాస్త్రీయసంగీత లక్షణాన్ని తగ్గిస్తూ లలితసంగీత లక్షణాలను పట్టించుకుంటూ వచ్చింది సినిమాసంగీతం. భాష బాగావచ్చిన కవులూ రచయితలూ, రాగాలు నేర్చి పాటకు వరసలు కట్టే కంపోజర్స్ ఉన్న కాలంలో సినిమాపాట గొప్పవెలుగు వెలిగింది. ‘రావో రావో లోలంబాలక రావో’ అని మల్లాది రామకృష్ణశాస్త్రి రాస్తే మరో రచయిత (కొసరాజు కావచ్చు) ‘ఉంగరాల ముంగురూల రాజా’ అని జానపద గీతాలతో మనసు దొంగిలిస్తాడు.  ఇక కర్ణాటక సంగీతాన్ని ఎన్నోయేళ్ళు అభ్యాసంచేసి, బడేగులాంఅలీఖాన్ ని కూడా అంతే ఇష్టంతో విన్న ఘంటసాల కూర్చిన తెలుగు సినిమాసంగీతం వినసొంపుగా ఉంటూనే రాగాలకు చక్కగా కట్టుబడి ఉన్న సందర్భాలే ఎక్కువని చెప్తారు. చిత్తూర్ సుబ్రమణ్యం పిళ్ళై లాంటి సంప్రదాయవాది ‘రహస్యం’ కు  ఘంటసాల ఇచ్చిన సంగీతాన్ని మెచ్చుకున్నాడట (వి.ఏ.కె.రంగారావు).

అంబా పరాకు  దేవీ పరాకు  మమ్మేలు మా శారదంబా పరాకు.

ఉమా మహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవనా గజాననా బహుపరాక్ బహుపరాక్

చండ భుజామండల దోధూయమాన వైరిగణా షడాననా బహుపరాక్ బహుపరాక్

మంగళాద్రి నారసింహ బహుపరాక్ బహుపరాక్ బంగరుతల్లి కనకదుర్గ బహుపరాక్ బహుపరాక్

కృష్ణాతీర కూచనపూడి నిలయా గోపాలదేవ బహుపరాక్”.

 

అని తాళాలు వాయిస్తూ వేదాంతం రాఘవయ్య సూత్రధారిగా చేసే నృత్యమూ, సరిజోరుగా ఘంటసాల ఇచ్చిన ఆ లయా ఏ పాప్ సాంగ్ ఊపుకీ తక్కువకాదు.

అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా లలిత కళల విలువ తెలియు సరసులు పదింబదిగ పరవశులై”..

అని తమ విద్యను ఆస్వాదించి పరవశులయే వాళ్ళు లలితకళల విలువ తెలిసిన సరసులని గడుసుగా చెప్తూ

ఈశుని మ్రోల హిమగిరిబాల కన్నెతనము ధన్యమైన గాథ అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా అంటారు  సూత్రధారీ వంతపాటగాళ్ళూ.

కణకణలాడే తామసాన కాముని రూపము బాపి, అల కాముని రూపము బాపి, ఆ కోపి, కాకలు తీరి కను దెరచి, తను దెలసి, తన లలనను పరిణయమైన ప్రబంధము అవధరించరయ్యా అని కథను పరిచయం చేస్తారు.

ఇంతలో గిరిబాలా ఆమె చెలులూ ప్రవేశం…

రావో, రావో! లోలలోల లోలంబాలక రావో అని పార్వతిని ఆహ్వానిస్తూ

చెలువారు మోమున లేలేత నగవుల కలహంస గమనాన కలికీ ఎక్కడికే ?” అంటూ సఖులు ప్రశ్న వేస్తే

మానస సరసిని మణిపద్మదళముల రాణించు అల రాజహంస సన్నిధికే అని రాజహంసై వయ్యారం పోతుంది గిరిజ.

వావిలి పూవుల మాలలు కైజేసి, వయ్యారి నడలా బాలా ఎక్కడికే ?” అని నిలదీస్తే

కన్నారా నన్నేల కైలాస నిలయాన కొలువైన అల దేవదేవు సన్నిధికే” అని పరవశిస్తుంది.

ఇంతలో మధ్యవర్తి మన్మధుడు

తగదిది తగదిది తగదిది ధరణీధరవర సుకుమారీ తగదిది. అండగా మదనుడుండగా, మన విరిశరముల పదనుండగా, నిను బోలిన కులపావని తానై వరునరయగ పోవలెనా? ఆఁ ఆఁ ” 

కోరినవాడెవడైనా ఎంతటిఘనుడైనా కోలనేయనా సరసను కూలనేయనా, కనుగొనల ననమొనల గాసిజేసి నీ దాసు జేయనా! ఆఁ ఆఁ ఆఁ.

అంటూ ఆర్భాటం చేస్తూ వచ్చేస్తాడు.

ఈశుని దాసుని చేతువా అపసదా! అపచారము కాదా?  కోలల గూలెడి అలసుడు కాడు. ఆదిదేవుడే అతడు. సేవలు జేసి ప్రసన్నుని జేయ, నా స్వామి నన్నేలునోయీ. నీ సాయమే వలదోయీఅని పార్వతి  మదనుడిని వారిస్తే,

చిలుకతత్తడి రౌతా!  ఎందుకీ హుంకరింత ? వినక పోతివా ఇంతటితో నీ విరిశరముల పని సరి. కింకిణి పని సరి. తేజోపని సరి. చిగురుకు నీపని సరి మదనా అని ఆమె సఖులు కూడా హెచ్చరిస్తారు.

సామగ సాగమ సాధారా, శారద నీరద సాకారా, దీనాధీనా ధీసారా. ఇవే కైమోడ్పులు ఇవే సరిజోతలు  అని పార్వతి తపస్సు మొదలెడుతుంది. మన్మధుడు ఆత్రంగా పూలబాణాలు వేసేస్తాడు శివుడి మీద.

కళ్ళు తెరిచి శంకరుడు తాండవమాడగా మన్మధుడు కాలి బూడిదౌతాడు.

రతీదేవి పరుగెత్తుకొచ్చి విరులన్ నిను పూజసేయగా, విధిగా నిన్నొక గేస్తుజేయగా దొరకొన్న రసావతారు చిచ్చరకంటన్ పరిమార్తువా ప్రభూ.. పతిభిక్ష ప్రభూ”  అని ప్రాధేయ పడితే,

అంబా యని అసమశరుడు నను పిలిచెను వినవో, జనకుడవై ఆదరణతో తనయునిగా జేకొనవో, శరణంభవ శరణంభవ శరణంభవ స్వామిన్…”  అని పార్వతి శివుడిని వేడుతుంది.

మన్మధుడికి రూపు రావటంతో రతీదేవికి ఆనందం… ఇద్దరూ కలిసి పార్వతీ పరమేశ్వరులకిలా వందనం పాడతారు.

బిడియపడి భీష్మించి పెండ్లికొడుకైనట్టి జగమేలు తండ్రికీ జయవందనం జగమేలు తల్లికీ జయవందనం

సూత్రధారి కూడా మళ్ళీ ప్రవేశించి “కూచెన్నపూడి భాగవతుల సేవలందు దేవదేవా శ్రీ వేణుగోపాలా జయమంగళం, త్రైలోక్య మందారా శుభమంగళం అని మంగళం పలుకుతాడు.

సంస్కృతాన్నీ అచ్చతెలుగునీ సవ్యసాచిలా ప్రయోగించిన మల్లాది కవితానైపుణ్యాన్నీ శబ్దార్థసౌందర్యాన్నీ  వర్ణించటానికి నా భాష చాలదు. సినిమాపాటలను అంతెత్తున కూర్చోబెట్టేశాడాయన.

(లోలంబాలక=తుమ్మెదలవంటి ముంగురులు గలది. కోల=బాణం. గాసి=కష్టపెట్టు. అపసద=నీచుడా.  చిలుకతత్తడి రౌతు, అసమశరుడు, రసావతారుడు=మన్మధుడు.  కింకిణి=విల్లు.  గేస్తు=గృహస్థు)

***

ఈ పాట చెవులకి ఎంతగా పట్టేసినా, మల్లాది రవళికి దృశ్యాలను ఊహల్లో పేర్చుకోవటమే తప్ప సినిమా ఎక్కడా  దొరకలేదు. యుట్యూబ్ వచ్చాక ‘రహస్యం’ సినిమా దొరికింది. చక్కటి పాటలూ సంగీతం తప్పించి మిగతాదంతా చప్పగా, ఏవేవో రంగులేసిన భీకరమైన సెట్స్ తో ఉన్న ఆ సినిమాను రెండుగంటలపైగా భరిస్తే, ఈ గిరిజాకల్యాణ ఘట్టం లేనేలేదే! మొత్తానికి యుట్యూబ్ లోనే పాటకూడా రెండు భాగాలుగా కనబడింది. (యూట్యూబ్ లో పెట్టి, దీనిని చూడాలన్న నాలాంటివాళ్ళ చిరకాల వాంఛను తీర్చిన వసంత మాధవ గారికి కృతజ్ఞతలు) అరిగి రంగులుపోయి దీనావస్థలో ఉన్నా, ఈ నృత్యనాటకం చూస్తుంటే కూచిపూడి నాట్యరీతిని బాగానే పాటించినట్టుగా తోస్తుంది. సత్యభామ వేషంలో ఆరితేరిన కళాకారుడు వేదాంతం సత్యనారాయణశర్మ మన్మధుడుగా, కోరాడ నరసింహారావు శివుడిగా అభినయించటం వల్ల ఒక ప్రామాణికత వచ్చిన భావన. సూత్రధారి రాఘవయ్య, వంతపాటగాళ్ళు వేదాంతం రత్తయ్యశర్మ, భాగవతుల యజ్ఞనారాయణశర్మ. పార్వతిగా వేసిన బి.సరోజాదేవి, రతీదేవిగా వేసిన గీతాంజలి సినిమానటులు. మిగతా వేషాలలో కూచిపూడి భాగవతుల చేతనే నటింపజేస్తూ రాఘవయ్య తాను నేర్చిన కళపట్ల ఎంతో ప్రేమతో దీనికి నృత్యదర్శకత్వం చేశాడు. సినిమాసంకరం కాని కూచిపూడి శాస్త్రం దీనిలో ఎంతవరకూ ఉందో నాట్యశాస్త్ర విమర్శకులే చెప్పగలరు.

సంగీత సాహిత్య నృత్యాలు ముద్దుగా కుదురుకుని గర్వించదగ్గ తెలుగు సినిమాపాటగా ‘లలితకళల విలువతెలియు సరసులకు’ రసఝరీయోగాన్నిచ్చిన నృత్యనాటకం ‘గిరిజా కల్యాణం’. ఇది చక్కగా దక్కిన మనదైన తెలుగు వైభవం.

గిరిజా కల్యాణాన్ని ఇక్కడ వినండి.

http://www.allbestsongs.com/telugu_songs/Search-Telugu-Movie-Songs.php?st=Girija+Kalyanam&sa=Go%21

 

 

 

 

 

 

మీ మాటలు

 1. శ్రీనివాసుడు says:

  గిరిజా కళ్యాణాన్ని ఇక్కడ చూడవచ్చు.
  https://www.youtube.com/watch?v=HANPKOsTpho
  ఇది మొదటి భాగం. ప్రక్కనే రెండవభాగం కూడా వుంటుంది, చూడండి.

 2. శ్రీనివాసుడు says:

  ‘‘రహస్యం’’ చలన చిత్రాన్ని ఇక్కడ చూడవచ్చు.

 3. g b sastry says:

  అత్యుత్తమమైన సంగీత సాహిత్య స్థాయితో నన్నెంతో అలరించిన అలరిస్తున్న మాహాను భావుడు మల్లాదిగారి రచనకు మరో స్రష్ట ఘంటసాల సంగీతం అద్దిన సొబగులు అజరామరం
  మీరు గుర్తుచేసిన తీరు పాటలలో బాపుగారి భక్త కన్నప్ప సినిమాలోని కిరాతార్జునీయం తలచ దగినది యక్షగాన తరహాది కాకున్నా వేటూరివారి రచన బాలుగారు పాడిన తీరు బాగుంటుంది
  మంచి సంగీత సాహిత్యాలు గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు

 4. Gorusu Jagadeeshwar Reddy says:

  ల లి త గారూ , మరోసారి మధురమైన సంగీత ప్రపంచం లోకి తీసుకెళ్ళారు – ధన్యవాదాలు. ఔను, సినిమా పరమ బోరు. గిరిజా కల్యాణం తో పాటు “చారడేసి కనులతో దోచుకుంటి నిన్ను” అనే మరో పాట తప్పించి అంతా శూన్యమ్.
  భరాగో తెచ్చిన “నూట పదహార్లు ” కేసెట్లలో ఈ గిరిజా కల్యాణం తో పాటూ ఘంటసాల “త్యాగరాయ గానసభ” లో తనొక్కడే పాడిన గిరిజా కల్యాణాన్ని కూడా వినవచ్చు.
  ‘షావుకారు’, “వాగ్దానం ‘ చిత్రాల్లోని హరికథలు, రహస్యం లోని గిరిజా కల్యాణం, మల్లీశ్వరి లోని “ఉషా పరిణయం ” యక్షగానాలు మనలాంటి వారికి వరాలు – ఏమంటారు ?

  • భాస్కరం కల్లూరి says:

   ల.లి.త. గారూ, ధన్యవాదాలు. నేను ఎంతో ఇష్టపడే మల్లాదివారి గిరిజాకళ్యాణం గురించి రాసినందుకు. నా చిన్నప్పుడు హైదరాబాద్ లో కంచి పీఠాధిపతుల వారి సమక్షంలో ఆగమశిల్పసదస్సు జరిగినప్పుడు ఘంటసాల తన బృందంతో వచ్చి కోరి మరీ భక్తి గీతాలు గానం చేశారు. అప్పుడు గిరిజాకళ్యాణం కూడా గానం చేశారు. బృందంలో అందరూ పురుషగాయకులే కావడంతో సినిమాలో స్త్రీ గాయకులు పాడినవి కూడా వాళ్ళే పాడారు. హైదరాబాద్ ఆకాశవాణివారు దానిని రికార్డ్ చేసి చాలాకాలం దానినే వినిపించారు. ఒక సినిమాగా రహస్యం ఫెయిల్యూరే. చివరిలో అదో సస్పెన్స్ థ్రిల్లర్ లా ముగుస్తుంది. మల్లాదివారు ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ, ఆసక్తి చూపేవారని విన్నాను, ఎందుకో?!
   గొరుసుగారూ! ఈ సినిమాలో శ్రావ్యమైన పాటలు ఇంకా చాలా ఉన్నాయి. 1. ఉన్నదిలే దాగున్నదిలే. 2. ఏవో కనులు కరుణించినవి, 3. తిరుమలగిరివాసా 4. ఇదియే దేవరహస్యం 5. మగరాయవలరాయా 6. శ్రీలలితా శివజ్యోతీ సర్వకామదా…మరికొన్ని.

   • Lalitha P says:

    ఇంకా ‘లలితభావ నిలయా నవరసానంద హృదయా’ కూడా రహస్యంలోని మల్లాది రాసిన అతిచక్కటి పాటే. మంచి సంగీతం సాహిత్యం నటులూ అంతావుండీ అంత పేలవంగా సినిమా తీయొచ్చని ఇది చూశాకే అర్థమైంది. దేవదాస్ తీసిన రాఘవయ్య రహస్యం తీసిన రాఘవయ్యా ఒకరేనా అనేంత ఆశ్చర్యం భాస్కరంగారూ.

   • గొరుసు says:

    థాంక్యూ భాస్కరం గారూ,
    మీరన్నది నిజమే. అయితే నా మనసుని ఆకట్టుకున్నవి గిరిజా కల్యాణ యక్షగానం తో పాటు చారడేసి , శ్రీ లలితా …
    మీకు ఇచ్చిన జవాబులో లలిత గారన్నట్టు దేవదాసు, సువర్ణ సుందరి, చిరంజీవులు వంటి సినిమాలు తీసిన వేదాంతం గారేనా అనిపిస్తుంది . అయినా చెప్పలేము లెండి – మాయా బజార్ వంటి రత్నాన్ని తీసిన కె,వి. గారు కొన్ని “భాగ్య చక్రం “, “ఉమా చండీ …..” వంటి “బోరు ” సినిమాలు కూడా తీశారు మరి. స్వర్గ సీమ, బంగారుపాప , మల్లీశ్వరి , రంగుల రాట్నం లాంటివి తీసిన బి.ఎన్ . గారు బంగారు పంజరం వంటి జీడి పాకం తీయలేదా? మన అదృ ష్టం ఏమంటే – వాళ్ళు తీసిన సినిమాల్లో సంగీతం అమృతమ్ లా ఉంటుంది.
    ఇప్పుడు ఒక మాట చెప్పాలి – “రంగుల రాట్నం ” లో ని “కన్నుల దాగిన అనురాగం ” , “బందిపోటు దొంగలు ” లోని “విన్నాను లే ప్రియా ” పాటలు నాకు చాలా చాలా ఇష్టం. అనుకోకుండా ఆ పాటల చిత్రీకరణ చూసి సొమ్మసిల్లి పోయా :) అంట ఘోరంగా పిక్చరైస్ చేశారు మరి.

   • భాస్కరం కల్లూరి says:

    అవును ల.లి.త. గారూ…’లలితభావనిలయా’ కూడా మంచి పాట. లవకుశ లానే (అదే బ్యానర్)రహస్యం సినిమా తీయడంలో కూడా బాగా గ్యాప్ వచ్చిందని ఎప్పుడో చదివిన గుర్తు. బహుశా సినిమా ఫెయిల్యూర్ కు అదీ ఒక కారణం కావచ్చు. మల్లాది వారి ప్రత్యేక అభిరుచి కూడా ఈ సినిమా వెనక ఉందని విన్నాను, బహుశా అది అమ్మవారి ఉపాసనకు సంబంధించినదేమో! సినిమా కవిగా మల్లాదివారి స్థానం కూడా ప్రత్యేకం. ఆరుద్ర ఆయన గురించిన కొన్ని ముచ్చట్లు రాశారు. గొప్ప సాహిత్యభరితంగా మనందరం భావించే తన సినీగీతాలను మల్లాదివారు ఎప్పుడూ గొప్ప సాహిత్యంగా భావించలేదట. ఎవరైనా తన పాటను పొగిడితే చికాకు పడేవారట. ఆయన సముద్రాల సీనియర్ కు ఘోస్ట్ రచయితగా సినీరంగ ప్రవేశం చేశారు. అదెలా జరిగిందో అబ్బూరి వరద రాజేశ్వరావుగారు రాశారు. ఆయన రాసిన ‘కవన కుతూహలం’, ‘వరదకాలం’ అనే రెండు పుస్తకాలు రెండు మూడు తరాల కవుల గురించిన ముచ్చట్లను ఎంతో హృద్యంగా అందించిన ఎన్నదగిన పుస్తకాలు, నాకు ఎంతో ప్రియమైనవి. అవి ప్రస్తుతం లభ్యమవుతున్నట్టు లేదు.

  • Lalitha P says:

   అలాగే ‘ఓ సీతకథ’లో ఒక హరికథ ఉంటుంది. గుర్తుచేయగలరా జగదీశ్వర్ రెడ్డి గారూ.

   • శ్రీనివాసుడు says:

    ‘‘భారతనారీ మధుర కథా భరితము’’
    http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=4878
    పి. లీల, వేటూరి, మహదేవన్

   • గొరుసు says:

    ల లి త గారూ … మీరు అలా గుర్తు చెయ్యడం ఆలస్యం – శ్రీనివాసుడు గారు చిటికేసి వీభూది చిలకరించినట్టు పాట తో సహా లింకు ఇస్తున్నారు – ఆయనకు థాక్స్ చెప్పాలి మనం.

 5. mohanbabu says:

  చక్కటి జ్జ్ఞాపకం .పాట అడపాదడప వింటున్న , సవివరణ తో ముందుకు తెచ్చినందుకు బహుత్ షుక్రియ , బడే మెహర్బానీ .

 6. raamaa chandramouli says:

  ‘సంస్కృతాన్నీ అచ్చతెలుగునీ సవ్యసాచిలా ప్రయోగించిన మల్లాది కవితానైపుణ్యాన్నీ శబ్దార్థసౌందర్యాన్నీ వర్ణించటానికి నా భాష చాలదు. సినిమాపాటలను అంతెత్తున కూర్చోబెట్టేశాడాయన.’
  మల్లాది వారి స్మరణే ఒక పులకింత.

  ఒక మహాద్భుతమైన పాత అనుభూతిని ( ఏ అట్టడుగు పొరల్లోనో దాగి ఉన్న ) ఈ వ్యాసం ద్వారా మల్లీ అనుభవంలోకి తెచ్చిన లలిత గారికి ధన్యవాదాలు.
  – రామా చంద్రమౌళి

 7. శ్రీనివాసుడు says:

  అది ’’కింకిణి‘‘ కాదు ‘‘సింగిణి’’
  కింకిణి అనగా గజ్జె లేదా చిఱుగంట : సింగిణి అనగా విల్లు
  గాసి = అలసట, బడలిక
  ఈ పాటను గురించి ఇల్లాలి ముచ్చట్లు బ్లాగులో శ్రీమతి సుధ గారు వ్రాసిన వ్యాఖ్యానం ఈ లింక్ కి వెళ్లి చదవండి(http://illalimuchatlu.blogspot.in/2012/02/blog-post_20.html). ప్రతిపదార్ధ వివరణతో పద ప్రయోగం లోని విశేషాలను వివరిస్తూ అద్భుతంగా వ్రాశారు.

  • Lalitha P says:

   చాలా ముఖ్యమైన సవరణ శ్రీనివాసుడుగారూ.. నాకు subconscious గా కింకిణి అని ఉండిపోయి సింగిణికి బదులు అలా రాశాను. గాసిపెట్టు అనే మాటకి కష్టపెట్టటం అనేది బ్రౌణ్య నిఘంటువులోని అర్థం. అలసట, కష్టం, శ్రమ ఇవన్నీ దాని అర్థాలే. సుధగారి వ్యాఖ్యానం చాలా బాగుంది. కానీ ఆ సినిమాకు మొత్తంగా వెంపటి సత్యం, హీరాలాల్ నృత్యదర్శకులైనా, గిరిజా కల్యాణానికి మాత్రం రాఘవయ్యే నృత్యదర్శకుడని టైటిల్స్ ద్వారా స్పష్టం. అలాగే లోలంబము అంటే తుమ్మెద. “తేజో” పని సరి — అనటంలో తేజో అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. ఎవరైనా వివరిస్తే సంతోషం..

 8. శ్రీనివాసుడు says:

  ఈ పాటలో ఇంకొక విశేషమేమంటే, సూత్రధారి వేదాంతం రాఘవయ్యకు పాట మొదట్లో ‘‘ఉమా మహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవనా గజాననా బహుపరాక్ బహుపరాక్’’ చరణాన్ని ఘంటసాల పాడతారు.
  పాట చివర్లో అదే సూత్రధారికి ’’బిడియపడి భీష్మించి పెండ్లికొడుకైనట్టి జగమేలు తండ్రికీ జయవందనం… జగమేలు తల్లికీ జయవందనం” అన్న చరణాన్ని మాధవపెద్ది సత్యం పాడతారు.
  ఇలా ఒకే పాత్రధారికి ఒకే పాటలో ఇద్దరు గాయకులు పాడడం అనే ప్రయోగం అప్పట్లోనే చేసినట్లున్నారు. కాబట్టి మన మణిశర్మ ‘‘ఇంద్ర’’ సినిమాలో హరిహరన్, శంకర్ మహదేవన్ ఇద్దరి చేతా ఒకే పాటలో ఒకే పాత్రకు, అంటే ‘‘భం భం భోలే’’ పాటలో పాడించడం క్రొత్తేమీ కాదన్నమాట.
  అయితే, ఇద్దరు మహాగాయకులు విరగదీసిన ఆ పాటకి నృత్యరీతులను గోపీకృష్ణ (ఝనక్ ఝనక్ పాయల్ బాజే, భూకైలాస్‌లో శివతాండవ నృత్యం, ఇంకా అనేకం) సమకూర్చితే ఎలా దద్దరిల్లేదో!

 9. AHALYA MAMILLAPALLI says:

  “కాని పనీ మదనా.. అది నీ చేత కాని పనీ మదనా…
  అహంకరింతువ ..హరుని జయింతువ..
  అది నీ చేత కాని పని మదనా… కాని పనీ మదనా…”

  జ్ఞాపకాల పొరల్లో మరుగున పడిన తియ్యటి పాట , హఠాత్తుగా ..నిన్న రాత్రి FM లో వినిపించేసరికి ఆనందాశ్చర్యాలలో మునిగి పోయి , ఆ మధురిమ ను ఆస్వాదిస్తూ..అలా..అలా.. నిద్రలోకి జారుకున్నానా…
  ఉదయం లేవగానే ..”అవధరించరయ్యా” …అంటూ మెయిల్ లో ప్రత్యక్షమయ్యేసరికి ….ఇహ ఏం చెప్పను?

  ఓ చేతి లో ఫిల్టర్ కాఫీ ఘుమఘుమలు..
  మరో చేతి లో గిరిజాకళ్యాణపు గమకములు ..
  మీకు ధన్యవాదములు.

 10. శ్రీనివాసుడు says:

  నాదేముంది జగదీశ్వరరెడ్డిగారూ! మానవ మేధస్సు చిలకరించిన చిటికెడు విభూది ప్రసాదాలు – గూగూలమ్మ, అంతర్జాలయ్యల దయ.

 11. మంచి జ్నాపకం లలిత. చిన్నప్పుడు జనరంజనిలో రికార్డు రెండు వైపులా వినిపించేవాళ్లు ఈ పాటను. నా పాటల సెలెక్షన్ లో ఇది కూడా ఉంటుంది. పాట అంతా అల్లుకొన్న అచ్చ తెలుగు పదాలు భలే సంతోషపెడుతున్నాయి ఈ మధ్య. ‘లోలంబాలక, కోలనేయనా, చిలుకతత్తడి రౌతా’ ఈ పాదాలు విభిన్నంగా చెవులకు, నోటికి శ్రమ కలిగించకుండా ఉంటాయి. అర్ధం తెలియక పోయినా పాడుకొనే దాన్ని. పాట మధ్యలో అగస్మాత్తుగా వచ్చే లీల గొంతు జీరగా వచ్చి ఆనందపెడుతుంది. శివ పురాణం ఎవరు రాశారో తెలియదు కానీ నా పదవ తరగతి తెలుగులో ఉండేది. అందులో వచనం కూడా చాలా బాగుండేది. హిమాలయాలలో దొరికే పూలు, ఆకుల వర్ణన అందులో ఉండేది. మా తెలుగు మాష్టారు భలే చెప్పేవారు ఆ పాఠం.

 12. శ్రీనివాసుడు says:

  భాస్కరం గారూ!
  ఈ క్రింది లంకెలో కవన కుతూహలం, వరదకాలం లభ్యం, నవోదయ బుక్ హౌస్
  http://www.telugubooks.in/products/kavanakuthuhalam-varadakaalam

  • భాస్కరం కల్లూరి says:

   చాలా ధన్యవాదాలు శ్రీనివాసుడుగారూ… పునర్ముద్రించారన్నమాట. తెలుగు సాహిత్యాభిమానులందరూ తప్పక దగ్గర ఉంచుకోవలసిన పుస్తకాలవి.

 13. శ్రీనివాసుడు says:
 14. D Subrahmanyam says:

  ఈమధ్య ఇంత మంచి విశ్లేషణ రావటంలేదు. వివరంగా రాసినందుకు. అభినందనలు. నాకింకా జ్జ్ఞాపకం, 1959 లో నాసర్ గారి బుర్రకధ లో డార్విన్ సిధాంతాన్ని దసావతరాలతో పోల్చినప్పుడు మొదటిసారిగా హేతువాదం కొంచెం తెలిసింది.

 15. Sujatha bedadakota says:

  శ్రీనివాసుడు గారూ, గిరిజా కళ్యాణం చివర్లో “బిడియ పడి భీష్మించి” పాడింది మల్లిక్ గారు. అందర్నీ డామినేట్ చేస్తుంది ఆయన స్వరం ఆ మంగళ హారతి లో!
  విజయవాడ రేడియో లో వేసినపుడు ఒక్కసారి కూడా ఆయన పేరు మిస్ అయినట్టు గుర్తు లేదు

 16. Sujatha Bedadakota says:

  ఓ సీత కథ లోని హరికథ గురించి నా బ్లాగ్ లో వివరంగా రాశానొకసారి. అది వేటూరి తొలి గీతం కూడా! పాటల పుస్తకంలోని పేజీలు, వీడియో తో సహా

  http://manishi-manasulomaata.blogspot.com/2012/10/blog-post.html?m=1

  • శ్రీనివాసుడు says:

   బోలెడు నెనర్లు సుజాత గారూ!
   అయితే ఆ పాటలో సూత్రధారునికి ముగ్గురు గాయకులు పాడేరా? మల్లిక్, మాధవపెద్ది, ఘంటసాల.
   పాటలో పాల్గొన్న గాయనీ గాయకుల జాబితా ఇది
   గిరిజా కల్యాణం – ఘంటసాల,పి.సుశీల,లీల,కోమల,వైదేహి,పద్మ,మల్లిక్,మాధవపెద్ది
   అయితే, మన్మథుడి సజీవుడి అయిన పిదప, ‘బిడియపడి భీష్మించి’ అనే చరణంలో మన్మథుడికి మల్లిక్, సూత్రధారుడికి మాధవపెద్ది పాడినట్లున్నారు.
   ’’కూచన్నపూడి భాగవతులు’’ అనేది కచ్చితంగా సత్యమే పాడినట్లున్నారు.
   ఇది ఆపాత సినిమా సంగీత పండితులు తేల్చవలసిందే. నా వల్ల కాదు.
   గిరిజా కళ్యాణం గురించిన ఇంకొక అద్భుతమయిన రాగపూర్వకమైన విశ్లేషణ, వివరణ ఇక్కడ దొరికింది నాకు. మిత్రులందరూ చదివి, విని ఆనందించగలరు. అక్కడే దాని లంకె కూడా వున్నది.
   http://vulimirighantasala.blogspot.in/2013_08_18_archive.html
   ఇది ఘంటసాలగారు స్వయంగా మొత్తం పాడేరు.

   .

   • Lalitha P says:

    బ్రహ్మాండమైన లింక్ ఇచ్చారు శ్రీనివాసుడు గారూ. మీకు చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇది రాగమాలిక అని తెలుసుగానీ రాగాల వివరాలు తెలియవు. అనన్నీ చక్కగా వివరించిన సంపూర్ణ వ్యాసం. సంగీత దర్శకుడిగా ఘంటసాల గొప్పతనాన్నిస్పష్టంగా తెలుసుకోవాలని కోరిక. పాతాళ భైరవి మ్యూజిక్ నుంచీ కూడా ఘంటసాల ప్రయోగాలంటే చాలా కుతూహలం. ఆయన సినిమా సంగీతం టాలెంట్ ను వివరించే ఇంకేవైనా పుస్తకాలు, లింక్స్ ఉంటె తెలుపగలరు. వులిమిరి గారి బ్లాగ్ కనులవిందు.

  • Lalitha P says:

   థాంక్స్ సుజాత గారు. భారతనారీ చరితము చూపించినందుకు…

 17. అబ్బ ! వాతావరణం ఒక్కసారి చల్లబడినట్లుంది . ల.లి.త. గారి విశ్లేషణ , శ్రీనివాసుడు గారి వివరణ ఒక్కసారి నన్ను గతం లోకి తీసుకువెళ్ళింది. అందరికి అభినందనలు .

 18. Sujatha Bedadakota says:

  శ్రీనివాసుడు గారూ, కొన్ని కొన్ని వినేసి వూరుకోవాలి గానీ దృశ్య రూపాలు చూసే ధైర్యం చేయకూడదని నా అభిప్రాయం. గిరిజా కళ్యాణం నాకు అలాటిదే! విజయవాడ రేడియోలో చాలా తరచుగా వేసే వారు.

  సుశీల ఎంత బాగా పాడిందని మురిసే లోపు లీల వచ్చి ఒక పద్యంతో (సావేరి రాగం లో) అందర్నీ పడగొట్టి వెళ్ళి పోయేది! అంత డెప్త్ లీల గొంతులో!

  గిరిజా కళ్యాణం రాగ మాలిక కాబట్టి సాహిత్య ప్రస్తావన కాక, సంగీత పరంగా గిరిజా కళ్యాణం విశ్లేషణ కోసం చాలా రోజుల క్రితం వెదికాను. మీరిచ్చిన లింక్ లో వ్యాసం చాలా సమగ్రంగా ఉండి, ఇందులో వాడిన జన్య రాగాల గురించి చాలా సందేహాలను తీర్చింది. ప్రతి పదానికి ఏ రాగం వాడారో, కింద పట్టిక లో స్వరాలతో సహా వివరణ ఇచ్చారు. చాలా ఉపయోగకరంగా ఉంది.

  వులిమిరి సూర్య గారికి రుణపడి ఉంటాను ఈ వ్యాసానికి గాను
  చాలా గొప్ప లింక్ ఇచ్చారు, మీకు చాలా చాలా ధన్యవాదాలండీ

 19. శ్రీనివాసుడు says:

  ఆ బ్లాగు ’’విషయసూచిక‘‘ లంకె. దీనిలో వున్న అనేక మధురమైన పాటల వివరణలలో మీరు కోరిన పాతాళభైరవిలో ‘‘ప్రేమకోసమై వలలో పడెనే’’ అనే పాట వున్నది.
  http://ghantasalagaanapadasoochika.blogspot.in/2014/03/blog-post_4.html

 20. శ్రీనివాసుడు says:

  ఘంటసాల గారి గురించిన బ్లాగుల, జాలగూళ్ళ వివరాలు

  మన ఘంటసాల – ఘంటసాల ప్రాజక్టు: ఈ సైటులో ఘంటసాల మాస్టారికి సంబంధించిన అన్ని వివరాలు దొరుకుతాయి. ముఖ్యంగా మాస్టారికి పలువురు సమర్పించిన నివాళులు, ఛాయా చిత్రాలు, వ్యాఖ్యానాలు, మాస్టారి కచేరీలు (న్యూయార్క్, చికాగో, మరియు కలకత్తా), పద్యాలు, పాటలు, భగవద్గీత, ఫన్ గేమ్స్, పాటల డేటాబేస్, గీతాల సాహిత్యము (లిరిక్స్) లభ్యమవుతాయి. ఈ సైట్ ను అభివృద్ధి పరచడంలో పలువురు ఘంటసాల అభిమానులు చేయూతనిస్తున్నారు. మాస్టారు పాడిన మొదటి పాట నుండి 60 ల వరకు మాస్టారు పాడిన, సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలలోని పాటలు, పద్యాలు, కాలక్రమంలో అమర్చబడి వున్నాయి. ఈ పాటలన్నిటినీ వినొచ్చు లేదా భద్రపరచుకొన (download) వచ్చును. ఆయా లింకుల కోసం కావలసిన పదం మీద క్లిక్ చేయండి.
  ఘంటసాల యాహూ గ్రూప్: ఇది ఇ-లేఖ (e-mail) గ్రూప్. ఇందులో మాస్టారికి సంబంధించిన పాటల, చిత్రాల తదితర విషయాలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకొనవచ్చును, లేదా పాల్గొనవచ్చును. అంతేకాక ఘంటసాల గారి పాటల లిరిక్స్, ఆడియో ఫైల్సు, యూ ట్యూబ్ వీడియో లింకులు మాస్టారి అభిమానులచే పోస్టు చేయబడతాయి.

  ఘంటసాల గళామృతం – పాటల పాలవెల్లి: పలువురు ఘంటసాల మాస్టారి అభిమానులు కలసి వారి పాటల, చిత్రాల వివరాలను సేకరించి, సమకూర్చిన వెబ్ సైట్ ఇది. ఇందులో అక్షరక్రమంలో ఘంటసాల గారు పాడిన, సంగీత దర్శకత్వం నిర్వహించిన చిత్రాలలోని పాటల, పద్యాల వివరాలు పొందుపరచబడి వున్నాయి. దీనిని నిర్వహిస్తున్నది శ్రీ కొల్లూరి భాస్కర రావు గారు. వీరు హైదరాబాదు ఘంటసాల సంగీత కళాశాల సంచాలకులు.
  సఖియా: ఈ వెబ్ సైటు పైన పేర్కొన్న “ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి” కి అనుబంధమైనది. ఇందులో 1930 ల నుండి 1960 ల వరకు వచ్చిన చాల తెలుగు చిత్రాల వివరాలన్నీ దొరుకుతాయి. ప్రతి చిత్రానికి సంబంధించిన సాంకేతిక వర్గం, పాటల విషయ సూచిక, మరియు ఆడియో ఫైల్సు పొందుపరచబడి వున్నాయి.

  Old Telugu Songs: ఈ సైటులో తెలుగు చిత్ర పరిశ్రమ ఆరంభం నుండి సుమారు 1960s వరకు విడుదలయిన చిత్రాల పాటలు free గా download చేసుకోవచ్చును. అంతేకాక కావలసిన సినిమా, గాయని లేదా గాయకుడు, సంగీత దర్శకుడు/దర్శకురాలు, లేదా గీత రచయితను, లేదా వారి కాంబినేషను గాని ఎన్నుకొని పాటలను వెదుక్కోవచ్చు.

  ఘంటసాల పాటల సాహిత్యం దొరికే కొన్ని వెబ్ సైట్లు:
  *పాడుతా తీయగా చల్లగా * తెలుగు పాటలు * గీత లహరి * Lyrics in Telugu * తెలుగు సుమధుర గీతాలు * ఆణిముత్యాలు * Old Telugu Songs *

  • Lalitha P says:

   ధన్యవాదాలు శ్రీనివాసుడు గారూ. ఒక్క పాటలే గాక ఘంటసాల ఆయా దృశ్యాల మూడ్ ను నేపథ్య సంగీతంలోకి తెచ్చేవారు. పాతాళభైరవి లో మాంత్రికుడి గుహలో ధ్వనులు మంచి ఉదాహరణ. తను స్వరపరచిన పాటల్లోని ఇంటర్ లూడ్స్ కూడా. ఇంటర్ లూడ్స్ లోని వైచిత్రిని బట్టి సంగీత దర్శకుడి ప్రతిభను అంచనా వెయ్యొచ్చు. ఘంటసాలతో బాటు పనిచేసిన టెక్నిషియన్స్, అందరి టీంవర్క్ ని బట్టి కూడా చాలా మంచి పాటలూ నేపథ్య సంగీతం మనకి అందాయి. సారథి మాత్రం ఆయనేగా.

   తమ అనుభూతులు ఇక్కడ పంచుకున్న మిత్రులందరికీ ధన్యవాదాలు…

 21. Vijay Koganti says:

  Beautiful reminiscences ! Successfully recreated the old time memories . Congrats and big thank you !

 22. Bhavani Phani says:

  మంచి విశ్లేషణ లలిత గారు . ధన్యవాదాలు

మీ మాటలు

*