మంచి పుస్తకానికి తోడూ నీడా!

 

 

-సుజాత 

~

 

నవోదయ షట్టర్లు దించేశారనే వార్త “ది హిందూ” లో చూసి అక్కడ పుస్తకాలు కొని ఉన్న వాళ్లమంతా ఉలిక్కి పడి విషాదంలో మునిగి పోయి ఫేస్బుక్ గోడల మీద విచారాలు వ్యక్తం చేశాం మూకుమ్మడిగా !

వార్తలో చివరి లైన్లోని ముక్కలు (షాపు వెనక సందులో చిన్న షాపు తీసుకుంటున్నామనీ, అక్కడ పుస్తక విక్రయం కొనసాగుతుందనీ) కాస్త సందేహాన్ని మిగల్చడం తో ,దాన్ని నివృత్తి చేసుకునే దాకా నిద్ర పట్టక నవోదయ రామ్మోహన రావు గారికి, వాళ్లబ్బాయి సుధాకర్ గారికి ఫోన్ చేశాను.

అమ్మయ్య, రామ్మోహనరావు గారి నోటి వెంట “ఏం, కంగారు పడద్దు, నవోదయ మూత పడలేదు. మూత పడింది రిటెయిల్ సేల్స్ షాపు మాత్రమే” అన్న మాట వినపడింది.

ఆయన మాటల్లోనే “కొత్త పుస్తకాలు వేయడం మానేసి చాలా రోజులైందిగా? కేవలం అమ్మకాలు మాత్రమే సాగిస్తున్నాం కదా! ఇప్పుడు మూసేసింది రిటెయిల్ సేల్స్ కౌంటర్ మాత్రమే! నవోదయ ఇంకా ఉంది. వెనక షాపు తీసుకున్నాం కదా! ఎవరికి ఏ తెలుగు పుస్తకం కావాలన్నా, ఈ మెయిల్ ద్వారా ఆర్డర్ పంపినా సరే, మా దగ్గర లేక పోతే సేకరించైనా సరే అందించడానికి సిద్ధంగా ఉన్నాను. త్వరలో మాదిరెడ్డి సులోచనవి 60, 70 పుస్తకాలు కొత్తవి వేయాలనే ఆలోచన కూడా ఉంది! ఏం చేద్దాం, పుస్తకాలు చదివే అలవాటు చాలా వరకూ తగ్గి పోయింది జనంలో! ఆన్ లైన్లో పుస్తకాలు అందుబాటులో ఉండటం, ఈ బుక్స్ రావడం ఇవన్నీ కూడా ఇలాటి పరిస్థితికి కారణాలే! దేన్నీ కాదనలేం”

షాపు మూసేసినట్లు అద్దె షాపు తాలూకు తాళాలు కూడా ఓనర్ కి ఇచ్చేసినట్టు చెప్పిన సుధాకర్ “నాన్నగారికి పుస్తకమే జీవితం. అందుకే ఆయన దీన్ని కొనసాగిస్తారు, కాక పోతే వెనక చిన్న షాపులో” అని చెప్పారు.

ఇదంతా అలా ఉంచితే,

పూలమ్మిన చోటే కట్టెలు అమ్మడమనే సామెత పబ్లిషర్ , పుస్తకాలు వేయడం మాని కేవలం పుస్తక విక్రేత గా మిగిలి పోవడానికి కూడా వర్తిస్తుందేమో! ఏ వ్యాపారమైనా ఏదో ఒకనాటికి మూత పడటానికి దాని కారణాలు దానికి ఉంటాయి. పాఠకుల పఠనాభిరుచి మీద ఆధారపడి నడిచే పుస్తక ప్రచురణ మూత పడటానికి ఆర్థిక కారణాలెన్నున్నా, వాటికి దారి తీసేవి మాత్రం సాంస్కృతిక కారణాలే! గత పదిహేను, ఇరవయ్యేళ్ళుగా పుస్తకాలు చదవడం అనేక కారణాల వల్ల గణనీయంగానే పడి పోయింది.   సిలబస్ తప్ప వేరే పుస్తకాలు ముట్టడానికి సమయం లేని టెక్నికల్ చదువుల్లో విద్యార్థులు మునిగి పోవాల్సి రావడం,మధ్య  తరగతి లివింగ్ రూములోకి టీవీ ప్రవేశించి పఠనాభిరుచిని హత్య చేయడం, ఆక్టోపస్ లా చుట్టూ అల్లుకున్న సోషల్ నెట్ వర్క్ .. కారణం ఏదైనా కానివ్వండి పుస్తకాల సంఖ్య జీవితంలోంచి నెమ్మది నెమ్మదిగా తగ్గి పోవడానికి వీటన్నిటి ప్రమేయం ఉంది!

నవోదయ విశాలాంధ్ర లాంటి గట్టి సంస్థలు కొన్ని తప్పించి అనేక ప్రచురణ సంస్థలు ఏ నాడో మూత పడ్డాయి.

విజయవాడ ఏలూరు రోడ్ లో పుస్తకాల షాపులన్నీ చూసుకుంటూ తిరగడం నవోదయలోనో విశాలాంధ్రలోనో గంటల కొద్దీ పుస్తకాలు తిరగేస్తూ, ఏ పుస్తకం కొనుక్కోవాలో తేల్చుకోలేక, అన్నీ కొనాలని ఉన్నా, డబ్బులు చాలవని దిగులు పడిన రోజులు మన గత చరిత్రలో ఉండటం ఒక గొప్ప గౌరవమూ గర్వకారణమూ! స్మార్ట్ ఫోన్లు లేక ఎన్ని సెల్ఫీలు మిస్ అయి పోయామో ఆ రోడ్డులో!

ఎమెస్కో పాఠకుల కోసం “ఇంటింటా గ్రంథాలయం” పేరుతో బుక్ క్లబ్ నడిపింది చాలా యేళ్ళు. అందులో స్కూలు రోజుల నుంచీ సభ్యత్వం, ఎన్నో పుస్తకాలను నా లైబ్రరీలో చేర్చింది. నెల నెలా 20 లేక 30 రూపాయలు కడితే ప్రతి నెలా ఇంటికో పుస్తకం వచ్చేది పోస్టులో .(నా సభ్యత్వ నంబర్ EBC 7463) వాళ్లెంత మంచి వాళ్లంటే, నెల నెలా వాళ్ళు వేసే పుస్తకం మనకి నచ్చకపోతే వేరే పబ్లిషర్ వేసిన పుస్తకం కావాలంటే తెప్పించి మరీ పంపే వాళ్ళు. ఆ అవకాశాన్ని వాడి అరుణా పబ్లిషింగ్ హౌస్ నుంచి చలం, రంగనాయకమ్మ గారి పుస్తకాలన్నీ ఎమెస్కో బుక్ క్లబ్ నుంచి కొన్నవే!

బుక్ క్లబ్ లే కాదు, చాలా చాలా వార పత్రికలు, మాస పత్రికలు కూడా అంతర్థానమై పోయాయి. యువ, జ్యోతి, వనిత,విజయ, పల్లకి, ఈ మధ్య నాటిదే హాసం, బాల్యపు అద్దం చందమామ, మరెన్నో!

పుస్తకాలని వ్యసనంగా మార్చిన లెండింగ్ లైబ్రరీలు, సర్క్యులేషన్ కాన్సెప్టూ మాయం! వర్తమానం లోంచి జ్ఞాపకాలు గా మారి చరిత్రలో కల్సి పోయాయి. శాఖా గ్రంథాలయాల్లో కొత్త పుస్తకాలు శూన్యం!

మార్పు ఏ సమాజంలో అయినా అనివార్యం! ఐతే అది అభివృద్ధికి దార్లు వేస్తుందా, సాంస్కృతికి విషాదానికి దారులు తీస్తుందా  అనేది అది ప్రయాణించే మార్గం నిర్ణయిస్తుందేమో బహుశా! ఆర్ట్సు గ్రూపులు పనికి రానివి గా ముద్ర వేసుకుని చదువుల్లోంచి దాదాపుగా అంతర్థానం అయ్యాయి! బుర్ర కథ, హరికథ వంటి కళారూపాలు వాస్తవం లోంచి జారి పాఠ్యాంశాల్లో ప్రస్తావనలు గా మారాయి. తోలు బొమ్మలాట అంతరించి తోలు బొమ్మలు వాల్ డెకార్లు గా, టేబుల్ లాంపులు గా అవతరించాయి,   కళల్ని, సంస్కృతిని చంపుకునే వాళ్లని ఎవరు బాగు చేస్తారు? రేపటి రోజున పత్రికలు ఆగి పోయినా, పుస్తక ప్రచురణ సంస్థలు మూత పడినా ఆశ్చర్యపోకుండా ఆమోదించే స్థాయికి మనమే చేరాలి!

కానీ పుస్తకం మాత్రం చావకూడదు. రూపం మారినా , అది పాఠకుల చేతిలోనే ఉండాలెప్పుడూ! పబ్లిషర్స్ అందరికీ ఆశ కల్గించేది ఏటా జరిగే బుక్ ఫెయిర్లే! ఒక పుస్తక విక్రేత హాస్యానికిలా అన్నారు నాతో “చదువుతారో లేదో తెలీదు కానీ, ఫేస్బుక్ లో ఫోటో పెట్టడానికైనా సరే, కొంటున్నారు పుస్తకాలు” ఇది వినోదమో విషాదమో గానీ పుస్తకాల అమ్మకాలకి ఆ రోజుల్లో ఢోకా లేదు

మధ్య తరగతి జీవితంలోంచి పుస్తక పఠనం నిష్క్రమిస్తోందని బాధ పడ్డా, పుస్తకానికెప్పుడూ మంచి రోజులే అని భరోసాగా రామ్మోహనరావు గారు మాట్లాడ్డం చాలా రిలీఫ్ ని ఇచ్చింది.  కానీ ఇకపై దుమ్ముతో రద్దీతో కిట కిట లాడే ఆ ఏలూరు రోడ్ లో ఇక నవోదయ బోర్డు కనిపించదు. ఎక్స్ ప్రెస్ బస్సు ఎక్కక పోతే ఆదా చేయగలిగే పధ్నాలుగు రూపాయలతో ఏ పుస్తకం అదనంగా కొనచ్చనే ఆలోచనలతో స్నేహితులతో పాసెంజర్ ట్రైన్ ఎక్కి పుస్తకాల కోసం విజయవాడకు చేసిన ప్రయాణాలే ఇక జ్ఞాపకాల్లో మిగిలేవి!

నవోదయ వెనక సందులోకి మారినా, ఆ బొర్డు కనిపించక పోయినా, రేపో మాపో అసలు మూత బడే పోయినా, ఎవరు మాత్రమేం చేయగలం? చూస్తూ “ఎటు పోతున్నాం” అని రొటీన్ ప్రశ్న వేసుకోడం తప్పించి!

 

*

 

మీ మాటలు

  1. Manibhushan says:

    అన్నీ కొనాలని ఉన్నా, డబ్బులు చాలవని దిగులు పడిన రోజులు మన గత చరిత్రలో ఉండటం ఒక గొప్ప గౌరవమూ గర్వకారణమూ! >> చాలా బాగా రాశారు.

    అబ్బా, మీకింకా ఎమెస్కో కార్డ్ నెంబర్ గుర్తుందా!! గ్రేట్. నేనెప్పుడో మరచిపోయాను.
    —-
    పుస్తకం స్థానాన్ని అనేకం ఆక్రమించాయి. అందులో అతి ముఖ్యమైనది తల్లిదండ్రులు పిల్ల కెరీర్ విషయంలో తీసుకుంటున్న అతి శ్రద్ధ.
    ఇంటర్ నుంచే చరిత్ర పాఠం మాయమైదంటే చాలా విడ్డూరం, విచారం.

    అప్పట్లో సైతం…రోజులో కాసేపైనా టెక్ట్స్ బుక్సేతర బుక్స్ చదవమని ప్రోత్సహించిన పేరెంట్స్ అతి తక్కువే! వీళ్ళ సంఖ్య ఇప్పుడు మరింత దిగిపోయింది.

  2. కె.కె. రామయ్య says:

    జీవితంలోంచి సాహితీ పుస్తక పఠనం నిష్క్రమించటం సాంస్కృతి విషాదం అన్న సుజాత గారు, విజయవాడ ఏలూరు రోడ్ లోని పుస్తకాల షాపులన్నీ చూసుకుంటూ తిరగడం గతకాలపు బంగారు జ్ఞాపకాలు. నవోదయ రామ్మోహన రావు గారికి మీరు ఫోను చేసి మాట్లాడటం సంతోషం కలిగించింది.

  3. మంచివార్త చెప్పారు సుజాత గారు. మంచివార్త అనలేనుగాని…. గుడ్డి కంటే మెల్ల నయం కదా! మీరు చెప్పినట్టే ఈ-పుస్తకాల హోరులో పడి అచ్చు పుస్తకం చదవడం తగ్గిపోయింది. అందరూ ఫ్లైట్లో, ట్రైన్లో పోష్ గా ఐపాడో, ఈ-రీడరో, కిండిలో పట్టుకుని పోజులు కొట్టేవారేగాని…పుస్తకాలని చదివేవారెవరూ? ఏమంటే… అన్ని పుస్తకాలు మోసేకంటే.. చెట్లని నాశెనం చేసేకంటే ఇది బెటర్ కదా! అనే సన్నాయినొక్కులు కూడా వినిపిస్తుంటాయ్!! (అప్పుడే గుర్తొస్తాయ్లెండి… మన చుట్టు చెట్లు కూడా ఉన్నాయని ;) ) ఏదేమైనా కొత్తపుస్తకం వాసన పీలుస్తూ…రెపరెపలాడే పేజీలు తిప్పుతూ… ఆత్రంగా పుస్తకం ఎలాగైనా పూర్తిచేసేయాలని చదివే రోజులు గుర్తు చేసారు…ధన్యవాదాలు!

  4. పఠనాసక్తి తగ్గిపోతుందనటం పూర్తిగా నిజం కాదేమో. వాల్డెన్ వంటి ఆంగ్ల పుస్తక విక్రయ కేంద్రాలకి వ్యాపారం నడుస్తూ, తెలుగు పుస్తకాంగళ్లు మాత్రమే మూతబడటం దేనికి సంకేతం? తెలుగు రాష్ట్రాల్లో పాతికేళ్లలోపు వయసుండే పాఠకుల్లో ఎందరికి కూడబలుక్కోకుండా తెలుగు చదవగలిగే శక్తుంది? ఆ మాత్రం కూడా చేతగాని వాళ్లు ఎందరు?

    • Sujatha Bedadakota says:

      వాల్డనూ, క్రాస్ వర్డూ ఇవన్నీ గిఫ్ట్ ఐటెములూ స్టేషనరీ, గేములూ ,సాఫ్ట్ టాయిసూ ..వీటితో సగం కవర్ చేసుకుంటారు గమనించారా ఎప్పుడైనా ?

      తెలుగు గురించా? నాకేం హోప్స్ లేవు పాతికేళ్ల లోపు వాళ్ళు పుస్తకాలు చదివేంతగా తెలుగు సులభంగా చదవగలరని! మన జనరేషన్ దాటాక కష్టమే

  5. Vijay Koganti says:

    చదవాలనుకునేవాళ్ళు కొందరు ఉంటూనే ఉంటారు . నవోదయ లాటి పుస్తకాల షాపు లే లేవు.
    గుంటూరు లో శంకర విలాస్ సెంటరు కు కేవలం నవోదయాకోసమో హిగ్గింబోడంస్ కోసమో వెళ్ళేవాళ్ళం. చాలా బాగా వ్రాశారు. గతాన్ని ఒక్క సారి కుదిపి గుమ్మరించారు.

  6. ‘హిందూ ’ ప్రచురించిన వార్త సరైన సమాచారాన్ని స్పష్టంగా అందించలేదు గానీ నవోదయ ప్రచురణ సంస్థ నిజంగానే మూతబడితే పాఠకుల, సాహిత్యాభిమానుల వచ్చే స్పందన ఎలా ఉంటుందో తెలిసేలా చేసింది.
    .

    రామ్మోహనరావు గారితో మాట్లాడి, నవోదయ మూతబడలేదనేది తెలియజేసినందుకు మీకు అభినందనలు. నవోదయ ప్రచురణలు ఈమధ్య అసలేమీ లేవు కదా? ఆ రకంగా చూస్తే మాదిరెడ్డి సులోచన నవలలను ఈ సంస్థ ప్రచురించబోతోందని తెలియటం నిజంగా సంతోషకరం. నవోదయ విక్రయకేంద్రం మూతబడటం బాధాకరమే గానీ ప్రచురణ సంస్థ కొనసాగుతుందనేది మంచి వార్తే కదా!
    .

    నండూరి రామ్మోహనరావు గారి నరావతారం, విశ్వరూపం, విశ్వదర్శనం లాంటి పుస్తకాలూ, సత్యం శంకరమంచి అమరావతి కథలూ; ఎమ్వీయల్ కానుక, శ్రీ రమణ హాస్యజ్యోతి, ఇంకా… బాపు రమణల కార్టూన్లూ, రచనల పుస్తకాలను అభిరుచితో ప్రచురించిన నవోదయ… పాఠకుల మనసుల్లో ఎప్పటికీ నిలిచివుంటుంది.

  7. భాస్కరం కల్లూరి says:

    ఆన్ లైన్, ఈ బుక్కూ, టీవీ వగైరాల వల్ల జనంలో కాగితం పుస్తకాలు కొనుక్కుని చదివే అలవాటు, ఆసక్తి తగ్గిపోయిందనీ, ఇదొక సాంస్కృతిక పరివర్తన అనీ జెనరలైజ్ చేసే ఈ కింది అంశాలను కూడా పరిశీలించి సమాధానాలు వెతికితే బాగుంటుందేమో?
    1. కాగితం పుస్తకాలను చదివే అలవాటు మనదేశంలోనే తగ్గిపోయిందా? పాశ్చాత్యదేశాల్లోనూ, ఇతర దేశాల్లోనూ కూడా ఇదే పరిస్థితి ఉందా? విదేశంలో ఉంటూ, లేదా తరచూ విదేశాలు తిరిగే పుస్తకప్రియులు దీనికి సమాధానం చెప్పగలుగుతారు.
    2. మన దేశంలోనూ సార్వత్రికంగా ఆ అలవాటు తగ్గిందా? లేక తెలుగువాళ్లలోనే తగ్గిందా? తమిళులు, మలయాళీలు, బెంగాలీలు, హిందీ రాష్ట్రాల వారి పరిస్థితి ఏమిటి? ఇతర రాష్ట్రాలలో ఉంటూ, లేదా ఇతర రాష్ట్రాలకు తరచూ వెళ్ళి వచ్చే పుస్తకప్రియులు దీనికి సమాధానం చెప్పగలుగుతారు.
    3. మనదేశంలో గత పదిహేనేళ్ళ కాలంలో రైలు, విమానం, బస్సు ప్రయాణాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా రైల్లోనో, విమానంలోనో గంటలతరబడి ప్రయాణాలు చేసేవారు ఈ బుక్కు కన్నా, కాగితం బుక్కు చదవడమే ఎక్కువ సౌలభ్యంగా భావిస్తారా?! అందులోనే ఎక్కువ తృప్తిని పొందుతారా?! సమాధానం వెతకాలి.
    4. తెలుగు పుస్తకాలను మాత్రమే చదవడం తగ్గిందా, ఇంగ్లీషు పుస్తకాలను కూడానా అన్నది ఇంకో ప్రశ్న. గత ఒకటి రెండు తరాలుగా తెలుగు బాగా చదవగలిగినవారి సంఖ్య తగ్గుతున్న మాట నిజమే. వారు ఇంగ్లీషు కాగితం పుస్తకాలు చదువుతూ ఉండచ్చు. కనుక పుస్తక పఠనాసక్తి తగ్గిందని చెప్పగలమా?
    5. ఇంకో ప్రశ్న కూడా ఉంది. తెలుగు చదవగలిగినా ఇప్పటి తరాలలో అభిరుచి, ట్రెండు మారవచ్చు. మరింత వైవిధ్యాన్ని వాళ్ళు కోరుకుంటూ ఉండచ్చు. రచయితలు, ప్రచురణకర్తలు ఆ అభిరుచిని దృష్టిలో పెట్టుకుని పుస్తకాలు ఇస్తున్నారా?!
    6. ఏటా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ బుక్ ఫెయిర్స్ జరుగుతున్నాయి. వాటి అనుభవం ఎలా ఉంది?

  8. చాలా బాగుంది సుజాత గారు. నాకు పెద్దగా అవగాహన లేని ఒక imaginary past కోసం nostalgic చేసింది. అయితే, ఈ వ్యాసం లో పాయింట్ చేయబడ్డ చదవని-చదవలేని జెనరేషన్ లో ఒక సభ్యుఢ్ని నేను. పాఠకులు తగ్గడానికి మీరు చూపిన కారణాలు కరెక్టనే చెప్పాలి. ఒక రకంగా చూస్తే evoltionలో ఇది భాగమేమొ. The future always gravitates towards a certain hurried way of consumption that rewards instant gratification. జనాలు పుస్తకాలు చదువుతున్నారు అంటే సోక్రెటీస్ అన్నాడట, “జీవితాన్ని చూడటం, ఆస్వాదించటం, నేర్చుకోవడం, బ్రతకడం primary source నుండి secondary source కి వెళ్ళిపోయింది”. He was nostalgic for his own past, as certain people of your generation are. How can the kids of today miss something when they don’t even know it, when they don’t have fond memories of the activity. They’ll carve their own ways of learning and experiencing.

    But all said and done, books are not going anywhere anytime soon. పుస్తకాన్ని రీప్లేస్ చేసే వస్తువు ఇంకా రాలేదు. తెలుగు పుస్తకాల విక్రయం తగ్గడానికి నాకు తెలిసి ఒక్కటే ప్రధాన కారణం: తెలుగు పుస్తకాలు చదవటం is not sexy. Boys of a certain age take up Karate or Cricket not because they love the activity but they’re in love with those who pursue it. ప్రతి కుర్రోడికీ కోహ్లీ లా కావలని తాపత్రయం. Early 90స్ లో అమెరికా లో మనలాంటి గొడవే. పిల్లలు, యువకులు చదవటం లేదు. సాహిత్య చర్చలు mainstream mediaలో రావు. టీ.వీ వల్ల సమాజం నాశనం అయిపోతోంది అని. రాసేవాళ్ళున్నారు, వారికి dedicated followers ఉన్నారు. కానీ అది ఒక sub-culture మాత్రమే. అలాంటి సమయంలో డేవిడ్ ఫాస్టర్ వాలేస్ అనే రచయిత brought a certain coolness to the act of reading and writing. తన వెయ్యి పేజిల post-modern పుస్తకం చదివిన వాళ్ళు తక్కువే, కాని కొని పెట్టుకున్న వాళ్ళెకువ. “I read”, went from being a nerdy-loser-intellectual’s warcry to a smart-sophisticated-complete man’s pick-up line. ఆ పుస్తకం opened floodgates for a new generation of writers.

    And I think we’re on the brink of a paradigm shift of that magnitude. ఫదేళ్ళ కింద వరకూ తెలుగు సినిమా అంటే మాస్, మసాలా, పాట, ఫైటు. కానీ అందులోనూ మార్పొచ్చింది కద. ఇదీ అంతే. యువకులు చదవాలంటే వాళ్ళు కనెక్టయ్యే కథలు వారి వయసు వాళ్ళు రాయాలి. అలాంటీ వాళ్ళు రాయాలి అంటే they should find the act of being called a writer appealing. నాకు తెలిసి వొచ్చే అయిదేల్లళ్ళో తెలుగు పాఠకుల సంఖ్య పెరుగుతుంది. అందులో చాలా మంది young readers ఏ ఉంటారు.

    We better get ready with our surfboards to ride that wave.

  9. పలమనేరు బాలాజీ @ 9440995010: నమస్కారం మిత్రులారా..
    పుస్తకాలు కొని చదివే వాళ్ళ ఒకటి జాబితా తయారుచేసాం .చిత్తూరు జిల్లా పలమనేరు లో సాహితీ మిత్రులకు,ఇంకా జిల్లా లోని ఇతర ప్రాంతాలలోని మిత్రులకు ఎస్.యం.ఎస్ ద్వారా కొత్త పుస్తకాల గురించి వివరాలు పంపుతున్నాం.పలమనేరు ,చిత్తూరు,
    కర్నూల్,ఒంగోలు,తిరుపతి,బెంగళూరు,చౌడేపల్లి లాంటి చోట్ల సాహితీ మిత్రులు ఒకేసారి పదీ,పదైదు ప్రతులు కొంటున్నారు కదండీ.పుస్తకాలు చదివే వాళ్ళు ఉన్నారు.కొని చదివే వాళ్ళు ఉన్నారు.మంచి పుస్తకాలకు,కొని చదివే పాటకులకు మధ్య ఒక వారధి,సమాచార స్రవంతి అవసరం.ప్రతి మండల కేంద్రాల్లో,జిల్లా కేంద్రాల్లో,స్తానికంగా పుస్తకాల కేంద్రాలు ఏర్పాటు చేసుకునే అవకాశాల గురించి కాని,పుస్తకాలు,దొరికే చోటు గురించిన వివరాలు కాని అంతర్జాల పత్రికల్లో అందుబాటులో ఉండి, సదరు సమాచారాన్ని అన్ని గ్రంధాలయాల ద్వారా అందరికీ అందుబాటు లోకి తెస్తే బావుంటుంది. మంచి పాటకులు , కొనుగోలుదారులు సమాచారం సేకరిద్దాం.

  10. కె.కె. రామయ్య says:

    ” పుస్తకాన్ని రీప్లేస్ చేసే వస్తువు ఇంకా రాలేదు. నేటి తరం యువకులు (తెలుగు సాహిత్యం) చదవాలంటే వాళ్ళు కనెక్టయ్యే కథలు వారి వయసు వాళ్ళు రాయాలి. అలాంటీ వాళ్ళు రాయాలి అంటే” … అన్న శిరీష్ ఆదిత్య గారూ అందుకు మీలాంటి ప్రతిభావంతులు మరింతగా రచనలు చెయ్యాలి.

    చాసో, రావిశాస్త్రి, బీనాదేవి, కారా మాస్టారు, కొ.కు., రంగనాయకమ్మ, శ్రీపాద, చలం, తిలక్, త్రిపుర, బుచ్చిబాబు, పాలగుమ్మి పద్మరాజు, ముళ్ళపూడి, నామిని ఇలా ఎందరెందరో తెలుగు సాహితీ దిగ్గజాల రచనలు ఒకసారి చదివితే మరి ఆ రసాస్వాదన వ్యసనం నుండి బయటపడగల శక్తి ఏ తరంవాల్లకైనా ఉంటుందా.

    పలమనేరు బాలాజీ గారు చేపడుతున్నటువంటి మంచి ప్రయత్నాలూ చెయ్యాలి.

  11. Nageswar rao says:

    Sujatha gaaroo.. please give me the email of NAVODAYA

  12. కె.కె. రామయ్య says:

    నాగేశ్వర రావు గారు విజయవాడ నవోదయ పబ్లిషర్స్ వారి వివరాలు ఇవి :
    Atluri Ram Mohan Rao
    Navodaya Publishers, Eluru Road, Vijayawada
    Ph : 0866 – 2573500, Mobile : 9849825204
    Email ID : vjw_booklink@yahoo.co.in

    • శ్రీనివాసుడు says:

      రామయ్య గారూ!
      మీరు చేస్తున్న సాహితీ సమాచార సేవకు అభినందనలు. నాక్కూడా ఒక్క సమాచారం చెప్పరూ.
      పైడి తెరేష్ బాబుగారి **చికెన్ మసాలా** రేడియో నాటకం ఎక్కడయినా లభ్యమయితే చెప్పరూ. సోమాలియా మేక, మరియు చికెన్ మసాలా చదివి, విని వారికి గాఢాభిమానిగా మారిపోయాను. సోమాలియా మేక వుంది గానీ, చికెన్ మసాలా ఒక్కసారే చవిచూడడం జరిగింది. మళ్ళీ మళ్ళీ ఆ రుచి నెమరువేసేందుకు మీ మిత్రులు, మిత్రుల మిత్రుల మిత్రుల దగ్గర ఎవరి దగ్గరయినా ఆ శ్రవ్య నాటిక ప్రతి వుంటే అందించగలరు.
      ముందస్తు నెనరులతో.

  13. కె.కె. రామయ్య says:

    సర్, పైడి తెరేష్ బాబుగారి “చికెన్ మసాలా” రేడియో నాటకం గురించి వారి మిత్రులు “గాలి అద్దం” కవి ఎం.ఎస్ నాయుడు గారు, సాక్షి అన్వర్ గారు, రమణజీవి, మనసు ఫౌండేశన్ శ్యామ నారాయణ గారు ఇతరులను అడుగుతాను.

    రేడియో ప్రయోజనంపై స్వర్గీయ పైడి తెరేష్ బాబు గారు రాసిన ”రేడియో నాటకం” కి లింకు ఇక్కడ :

    https://sarasabharati-vuyyuru.com/2014/10/12/%E0%B0%B0%E0%B1%87%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%A8%E0%B0%82%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B0%E0%B1%87%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF/

Leave a Reply to Manibhushan Cancel reply

*