తక్షణ క్రియాశీలత కోరే ‘అసందిగ్ధ కర్తవ్యం’

 

  

-ఏ.కె. ప్రభాకర్

~

 

 “మనది దేశంలో అతి పెద్ద రసాయనిక కర్మాగారం. మనవి అత్యంత కీలకమైన ఉత్పత్తులు … కికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు గెలిస్తే ఆనందంతో కేరింతలు కొట్టి మిఠాయిలు పంచుకొనే ‘వాళ్ళ’ ను కీలక స్థానాల్లో కూర్చుండబెట్టి నిశ్చింతగా కునుకు తీయగలమా? … పై పదవుల్లో ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు అనధికారికంగా , దేశభక్తి అనే అంశాన్ని కూడా గుర్తించాలి”

  • -అసందిగ్ధ కర్తవ్యం (ఆడెపు లక్ష్మీపతి)

రాజ్యాంగంలో పొందుపరచిన సమాన హోదా , సమాన అవకాశాలు (Equality of status and opportunity) అన్న  ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించే పై విధమైన ఆలోచన మన సమాజంలో యెప్పుడు మొదలైందో తారీఖులు దస్తావేజుల్తో చెప్పలేక పోవచ్చుగానీ , అది యివ్వాళ వ్యవస్థాగతంగా ఆధికారికంగానే అమలౌతుంది. మనువాద పాలకులకి సెక్యులరిజం బూతుమాటయి ‘అసహనం’ కలగజేస్తుంది.

మతతత్త్వం దేశభక్తి ముసుగేసుకొని చట్టసభల నేలమీద వికృతంగా నాట్యం చేస్తున్న ప్రత్యక్ష రాజకీయ సందర్భంలో మనం జీవిస్తున్నాం. ఫాసిస్టు శక్తులు హిందూ రాజ్య స్థాపన నినాదంతో  జాతీయవాదాన్ని భుజానికెత్తుకొని లౌకిక ప్రజాస్వామ్య సమత్వ భావనల్ని రూపుమాపడానికి ప్రణాళికా బద్ధంగా  ప్రయత్నిస్తున్నాయి. దేశాధ్యక్ష యెంపికల్లో  రాజకీయ కుట్రలు జరగడం , మతం అందుకు సాధనంగా మారడం మనకు కొత్త కాదు కానీ ప్రభుత్వ యంత్రాంగంలో పాలనా వ్యవహారాల ప్రధాన శాఖల్లో విశ్వవిద్యాలయాల్లో కీలక పదవుల్లో ‘సొంత మనుషుల్ని’ నియమించుకొని  ‘దేశద్రోహుల్ని’ యేరిపారేసే ‘ప్రక్షాళన’ కార్యక్రమం యిటీవల వూపందుకొంది. ఈ వ్యూహం మతవాద హంతకుల చేతికి బాహాటంగానే ఆయుధాలు అందిస్తుంది.

గుజరాత్ ప్రయోగాన్ని దేశమంతటా అమలు చేసే యీ తతంగానికి వొక నిర్దిష్టమైన  ఆధిపత్య ఫిలాసఫీ వుందని ప్రగతిశీలవాదులు గ్రహించి అప్రమత్తమయ్యే లోపు జరగాల్సిన నష్టం జరుగుతూనే వుంది. కేవలం సంఘటన జరిగినప్పుడే కాకుండా వ్యక్తులూ సమూహాలూ  నిరంతర స్వీయ చైతన్యంతో వున్నప్పుడు మాత్రమే లౌకిక ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడుకోగలం. సామాజిక దైనందిన జీవితాల్లోకి చాపకింద నీరులా చొచ్చుకొచ్చిన మతవాదుల ప్రమేయాల గురించి హెచ్చరిస్తూ నిర్దిష్టంగా  స్పష్టమైన అవగాహనతో ఆడెపు లక్ష్మీపతి రాసిన విశిష్టమైన కథ

’( ఈ వారం జనవార్త , 24 ఫిబ్రవరి , 2 మార్చి 2008 – కథాసాహితి ,కథ 2008 లో పునర్ముద్రితం ).

తెలంగాణా కథా రచయితల్లో విలక్షణమైన శైలి లక్ష్మీపతిది. డెబ్భై యెనభైల్లో అల్లం రాజయ్య , బి యస్ రాములు , తుమ్మేటి రఘోత్తం రెడ్డి , పి చంద్ మొదలైన రచయితలు నాగేటి చాళ్ళలో రగిలిన రైతాంగ పోరాటాన్నీ అడవిలో వెన్నెలలా విరగ పూసిన గిరిజన గూడేల చైతన్యాన్నీ బొగ్గుగుట్టల్లో కార్మిక వాడల్లో రగిలిన అగ్గికణాల్నీ కథలుగా మలిచిన రోజుల్లోనే  కరీంనగర్ కల్లోల పొత్తిళ్ళలోనే కలం తెరచిన రచయిత ఆడెపు లక్ష్మీపతి. అయితే రాకాసి బొగ్గుగనుల నేపథ్యం నుంచీ , గల్లీదాదాగిరీ స్వైరవిహారం చేసే పారిశ్రామిక వీథుల్లోంచీ , సెమీ అర్బన్ సంస్కృతిలో నెలకొన్న అరాచక స్నేహాలనుంచీ , జేమ్స్ జాయిస్ , వర్జీనియా వుల్ఫ్ , టాల్ స్టాయ్ , మామ్ , కుష్వంత్ సింగ్ , అబ్బాస్ , ముల్కరాజ్ ఆనంద్ మొ. విదేశీ – స్వదేశీ కలాల మీదుగా నడిచి రావడం మూలాన లక్ష్మీపతి కథారచనలో తనదైన ప్రత్యేకతని సాధించుకోగలిగాడు. జీవన్మృతుడు , తిర్యగ్రేఖ , ముసల్దాని ముల్లె , వ్యభిచారం , నాలుగు దృశ్యాలు, విధ్వంస దృశ్యం , త్రిభుజానికి నాలుగో కోణం , అసందిగ్ధ కర్తవ్యం వంటి కథలు వస్తు స్వీకరణలో – శిల్ప నిర్మాణంలో –  కథన సంవిధాన రీతిలో లక్ష్మీపతి చూపించిన వైవిధ్యం తక్కిన సమకాలీన రచయితల నుంచీ అతణ్ణి వేరుచేసి చూడడానికి కారణమౌతుంది.

తెలంగాణాలో  అప్పుడప్పుడే రూపొందుతోన్న ఆధునికానంతర సమాజంలో చోటుచేసుకొంటున్న సంక్లిష్టతల్ని లక్ష్మీపతి పట్టుకొన్నంత వొడుపుగా అతని సమకాలికులెవరూ పట్టుకోలేదంటే తప్పు కాదేమో! ఆ సంక్లిష్టతల్ని ఆవిష్కరించడానికే అతను కావాలనే విభిన్న శిల్పరీతుల్ని వుపయోగించి కథలు అల్లాడు. వస్తురూపాల్లో కొత్తదనం కోసం నిరంతరం తపించాడు. ఇమాన్యుయేల్ కాంట్ ఖలీల్ జిబ్రాన్ సీల్ గ్రాంట్ వంటి రచయితల కథనరీతుల్ని అధ్యయనం చేసిన నేపథ్యం నుంచీ రూపొందినదని విమర్శకుల మెప్పు పొందిన అరుదైన కథ  ‘అసందిగ్ధ కర్తవ్యం’ .

లక్ష్మీపతి యీ కథ రాసింది 2008 లో .  కానీ అప్పటికంటే యిప్పుడు  – సమాజపు ప్రధాన స్రవంతి ఆలోచనల్లో సైతం హిందూ – ముస్లిం అనే ద్విజాతి సిద్ధాంతాన్ని వేళ్ళూనికునేలా , పాలకుకులే ప్రధాన రాజకీయ యెజెండాగా పెట్టుకొని వొక పూనికతో పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న సందర్భంలో – ఆ కథ  అవసరం యెక్కువగా వుంది. దాని ప్రాసంగికతను తెలుసుకోడానికి ముందు కథలోని వస్తువు క్లుప్తంగా :

కథ యెంత సరళమైందో అంతక్లిష్టమైంది. పబ్లిక్ రంగానికి చెందిన రసాయన కర్మాగారంలో ఇంజనీర్ గా అంకిత భావంతో పనిచేసే  మౌళి అనే ప్రధాన పాత్ర  అంతరంగ సంక్షోభంగా వుత్తమపురుష దృక్కోణంలో కథ నడుస్తుంది. అతని మానసిక క్షోభకి కారణం వొక వుద్యోగి ప్రమోషన్ విషయమై  పై అధికారులతో యేర్పడ్డ వివాదం.

‘సమయపాలన , విధేయత , విషయపరిజ్ఞానం , విశ్లేషణాపటిమ , రిస్క్ తీసుకొనే చొరవ , నాయకత్వ లక్షణాలు … వగైరా అంశాల్లో మామూలు ‘సంతృప్తికరం’ కన్నా మరింత ఉన్నతమైన రిమార్కులు పొంది వెరసి ‘చాలా మెరుగైన’ అభ్యర్థిని’ ఫోర్ మెన్ స్థానం నుంచి మెరిట్ కేటగరీలో యింజనీర్ గా ప్రమోట్ చేయాలని మౌళి చేసిన సిఫారసు అతని పై అధికారులు చీఫ్ డిప్యూటీ చీఫ్ ఇండస్ట్రియల్ యింజినీర్లకి , పర్సనల్ మేనేజర్ కి నచ్చలేదు. కారణం ఆ అభ్యర్థి అబ్బాసలీ అనే ముస్లిం.

అబ్బాసలీ ముస్లిం అయిన వొకే వొక్క కారణంగా  ప్రమోషన్ కి అనర్హుడై పోయాడు. మతం  ‘పుట్టుమచ్చ’తో దేశద్రోహి అయిపోయాడు. తమకి అనుకూలమైన ‘టెంపుల్ కమిటీ మెంబర్’ని ‘నమ్మకస్తుడిగా’ అందలమెక్కించాలంటే , అబ్బాసలీని చీడపురుగులా చూపాలంటే – చూపి యేరిపారేయాలంటే యేదో వొక కేసు అతని మీద బనాయించాలి. ఉద్యోగ విధుల్ని సరిగా నిర్వర్తించడం లేదని నిరూపించి క్రమశిక్షణ చర్య తీసుకోవాలి. లేదా దేశద్రోహి ముద్ర వేయాలి. వృత్తి పట్ల అతని నిబద్ధతని బద్నాం చేయాలి   ( జె యెన్ యూ లోనూ హెచ్ సి యూ లోనూ  యిటీవలి వ్యవహారాలు గుర్తు రావడం లేదూ!). నిఘా షురూ. వేట మొదలు. అబ్బాసలీ డ్యూటీలో వుండగా లెబనీస్ ఫిలాసఫర్ రాసిన పుస్తకం అతని టేబిల్ మీద కనిపించిందని  (చదువుతున్నాడని కాదు) వింత ఆరోపణ. అందులో యే ఫండమెంటల్ సిద్ధాంతాలున్నాయోనని  విచిత్రమైన అనుమానం. అతనికి వ్యతిరేకంగా డిపార్ట్ మెంటల్ స్థాయిలో డిసిప్లీనరీ యాక్షన్ మౌళియే తీసుకోవాలి. కాదంటే మౌళిని యిరుకున పెట్టడానికి ఫ్యాక్టరీ వ్యర్థాలని వూరి చెరువులోకి వదిలిన కారణంగా జరిగిన ప్రమాదానికి సంబంధించిన పాత కేసును వెలికి తీస్తారు. అందుకు అతణ్ణి బాధ్యుణ్ణి చేసే వ్యూహాన్ని రచిస్తారు. దీన్నుంచీ బయట పడాలంటే అతను తన సిఫారసుల్ని వెనక్కి తీసుకోవాలి. అబ్బాసలీ కెరీర్ ని నాశనం చేయాలి.

ఈ సందర్భంలో సెక్యులరిజం గురించి దేశభద్రత గురించి అంతర్జాతీయ ‘ఉగ్రవాదం’ గురించి ప్రతిభ గురించి ప్రమాణాల గురించి ముస్లింల ప్రొఫైలింగ్ విషయమై దేశంలో ‘చాప కింద నీరులా అమలవుతున్న విధానాల’ గురించి గ్లోబల్ సందర్భం గురించి పై అధికారుల ముఖత: రచయిత పలికించిన మాటలు రాజ్యాంగం దేశ పౌరులకిచ్చిన హక్కుల్ని పాలక వర్గాలు యెంత బేఖాతర్ చేస్తున్నాయో స్ఫుటంగా తెలియజేస్తాయి.

ఆబాల్యం నమ్మిన – అమ్మ శిక్షణలో నేర్చుకొన్న విలువలకీ వుద్యోగంలో యెదురైన ధర్మసంకట పరిస్థితికీ మధ్య నలిగే మౌళి ‘పంటి నొప్పి’ కారణంగా మెడికల్ లీవ్ పెడతాడు. దాన్ని కూడా తమకి అనుకూలంగా మార్చుకోడానికి అధికారులు శాంక్షన్ చేస్తారు. కానీ చివరికి మౌళి అబ్బాసలీకి న్యాయం చేయడానికే నిశ్చయించుకొని యుద్ధానికి సన్నద్ధుడౌతాడు. అయితే అతనా నిర్ణయానికి రావడానికి కారణమైన చిన్ననాటి సంఘటనే కథకి ఆయువుపట్టు. ఆ సంఘటనకీ పంటి నొప్పికీ వున్న సంబంధాన్ని విప్పి చెప్పడానికీ , ఆ సంఘటనని కథలోకి అన్ ఫోల్డ్ చేయడానికీ లక్ష్మీపతి యెన్నుకొన్న టెక్నిక్కే కథని వుత్తమ కళాఖండంగా రూపొందడానికి దోహదం చేసింది.

సెలవులో వున్న మౌళి టౌన్ షిప్ సంక్షేమ సమితి నిర్వహించే ఉగాది వారోత్సవాల్లో అతని కూతురు నటిస్తున్న ‘చిట్టచివరి యుద్ధం’ నాటికని చూడ్డానికి వెళ్తాడు. ‘ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం గనుక సంభవించి పరస్పర మత, జాతి విద్వేషాలతో వివిధ దేశాలు ఒకదానిపై మరొకటి వినాశకర అణ్వస్త్రాలు , జీవ రసాయనిక ఆయుధాలు ప్రయోగించుకున్నట్లయితే …’ అన్నది నాటిక వస్తువు. స్టేజి మీద యుద్ధరంగాన్ని మౌళి మనసులో ఆశలకూ ఆశయాలకూ నడుమ , అంతరాత్మ ప్రబోధానికీ కెరీరిస్టు ప్రలోభానికీ మధ్య జరిగే సంకుల సమరాన్ని , పంటి నొప్పిని కొల్లేజ్ చేస్తూ గత వర్తమానాల మధ్య కథని ముందుకీ వెనక్కీ స్వింగ్ చేస్తూ చెప్పిన తీరు అమోఘం.

స్టేజి మీద ప్రదర్శన జరుగుతూండగా మౌళికి ‘ఎవరైనా బలంగా కొట్టారా మిమ్మల్ని?’ అని డెంటిస్ట్ అడిగిన ప్రశ్న గుర్తొస్తుంది. కంపినీలో ప్రమాదం సంభవించినప్పుడు అబ్బాసలి ప్రాణాలకి తెగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన సంఘటన కళ్ళ ముందు కనిపిస్తుంది. అతని ప్రమోషన్ని అడ్డుకొనేందుకు పై అధికార్లు పన్నుతోన్న కుట్రలు , వాళ్ళతో తన ఆర్గ్యుమెంట్లూ జ్ఞప్తికొస్తాయి. ప్రదర్శనలో కోతి పాత్రలో యెంతో చురుగ్గా అద్భుతంగా నటిస్తున్నబాలనటుణ్ని చూస్తే చదువులో ఆట పాటల్లో అందరికన్నా ముందుండే తన బాల్యమిత్రుడు సలీం గుర్తొచ్చాడు. ఈర్ష్యతో తను అతనికి చేసిన ద్రోహం , అందుకు అమ్మ తనని బలంగా మూతి మీద కొట్టిన దెబ్బ ‘మస్తిష్కంలో తుఫానులా’ అలజడి చేశాయి. అలాంటి ‘తప్పు ఇంకెప్పుడూ చేయకు’ అన్న అమ్మ హెచ్చరిక తాను నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని నిర్దేశించింది. నాటికలో థియేటర్లో ముందువరసలో కూర్చొన్న చీఫ్ యింజినీర్ కళ్ళలోకి నిర్భయంగా చూపులు కలిపి  సెలవు కేన్సిల్ చేసుకొన్నట్టు భార్యకి చెబుతాడు.

స్టేజి పై పిల్లల నాటక ప్రదర్శన  , ప్రేక్షక స్థానంలో కూర్చొన్న మౌళి అంతరంగ శోధన , బాల్యంలో  ముస్లిం స్నేహితుడు సలీం జ్ఞాపకాలు , అతని పట్ల తన ప్రవర్తన , అమ్మ బోధించిన జీవితపు విలువలు వాటిని పాటించలేకపోతున్న అపరాధ భావన , చేసిన తప్పుని దిద్దుకోవాలనే తపన … కథకి అవసరమైన వాతావరణాన్ని, మౌళి  అంతరంగ సంక్షోభ చిత్రణకి కావాల్సిన సంఘర్షణని , యేకకాలంలో మనశ్శరీరాలనుభవించే వేదననీ  కథలోకి తీసుకురావడంలో , వొకేసారి నాలుగు స్థల కాలాల్లో గత వర్తమానాల మధ్య వూయలూగే కథన నిర్మాణంలో లక్ష్మీపతి చూపిన నేర్పు అబ్బురపరుస్తుంది.

వస్తువు రచయిత స్వీయ వుద్యోగ జీవితానుభవం నుంచీ తీసుకున్నందువల్ల , యిన్ సైడర్ కథనం కావడం వల్ల  కథకుడి విషయ పరిజ్ఞానం పట్ల పాఠకుల్లో విశ్వసనీయత కలుగుతుంది. ఫ్యాక్టరీ పాలనా వ్యవహారాలన్నీ ఆధిపత్య మత కుల శక్తుల అధీనంలో వున్నాయని చెప్పడానికి ప్రతి సూక్ష్మాంశాన్నీ రచయిత పరిగణనలోకి తీసుకొన్నాడు( అధికార్లకి పెట్టిన భార్గవ కాశ్యప్ వర్మ వామనరావు వంటి పేర్ల దగ్గర్నుంచీ ).

స్టేజిపై జరిగే ప్రదర్శనని  సమాంతరంగా నడపడం వల్ల అందులోని సన్నివేశాల్ని పాత్రల్ని మౌళి అంతరంగ సంక్షోభానికి కారణమైన సంఘటల్ని వ్యక్తుల్నీ పోల్చి చూసుకొనే అవకాశం రచయితే కల్పించాడు. స్టేజి మీద యుద్ధం మౌళి లోపల యుద్ధం అన్నంత వరకూ , ఏంజిల్ పాత్రలో అనుపమని (మౌళి కూతురు) చూసినపుడు అమ్మ గుర్తుకురావడం , నాటిక పోటీలో ప్రతిభకి గుర్తింపుని అబ్బాసలీ ప్రమోషన్ తో ముడిపెట్టడం వరకూ   బాగానే వుంది కానీ …. నాటికలో  సూక్ష్మ క్రిమి గుర్రం పాము సింహం చివరి మనిషి  వంటి పాత్రలు యేవి యెవరికి ప్రతీకలుగా వున్నాయో తెలుసుకోవడంలో కొంత గందరగోళం యేర్పడి పాఠకుడికి మానసిక శ్రమ కలుగుతుంది. అయితే మౌళి ఆలోచనల్లో సుదూర – సమీప గత వర్తమానాల మధ్య వారధిలా , మరీ ముఖ్యంగా సలీం జ్ఞాపకాలని తవ్వడానికి , ప్రదర్శన చక్కగా వుపయోగపడింది. అంతిమంగా మనిషి మానవీయ విలువల్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని బోధించింది. కథలోనూ కథ లోపలి కథలోనూ అంతస్సూత్రంగా వున్న యీ సారాన్ని ముడివేయడానికి లక్ష్మీపతి అడుగడుగునా మెలకువతో వర్తించాడు.

సలీం మౌళిల మధ్య చోటుచేసుకొన్న వైరుధ్యంలోని సామాజిక కోణాన్ని ఆవిష్కరించడంలో సైతం రచయిత గొప్ప కౌశలం చూపాడు. సలీం ‘చదువులోనూ ఫస్టు. ఆటల్లోనూ ఫస్టు’. వాడికన్ని శక్తి సామర్థ్యాలు యెక్కడివంటే – వాడి ‘ఇంట్లో ఎద్దు మాంసం తింటార’ ని మౌళి మిత్రులకి  చెబుతాడు. అదే విధంగా మౌళి  మిత్రులంతా కోతికొమ్మచ్చి ఆడడానికి ‘తెల్లగున్నోడు దొరా , నల్లగున్నోడు దొంగ’ అని చప్పట్లు వేసినప్పుడు ‘సలీంది తెల్లనిదీ మిగతా ముగ్గురివీ నల్లనివీ’ వస్తాయి. ఆట నీతి ప్రకారం సలీం దొంగ కాకూడదు. కానీ ఆటలోని సహజ న్యాయాన్ని ‘మెజార్టీ’ బలంతో రద్దుచేసి మౌళి సలీంని దొంగగా తీర్మానిస్తాడు. పాపం సలీం మౌనంగా అంగీకరిస్తాడు. అలా సమకాలీన సమస్యలుగా పరిణమించిన బీఫ్ తినడం , మెజార్టీ ఆధిపత్యం వంటి విషయాలు కథలోకి అలవోకగా వచ్చి చేరాయి.

ఈ కథ యిప్పుడు రాసి వుంటే యీ విషయాల్ని రచయిత కథలో పనిగట్టుకు చొప్పించినట్టు భావించడానికి అవకాశముండేది. కానీ 2008 లోనే యింత లోతైన అంశాల్ని కథలో ప్రస్తావించిన లక్ష్మీపతి క్రాంతదర్శిత్వాన్ని మెచ్చుకోకుండా వుండలేం. అడ్డగోలు పారిశ్రామికీకరణ కారణంగా జీవితాలు విచ్ఛిన్నమైన తన ప్రాంత  ప్రజల  తీరని వెతల్ని స్టోరీగా రిపోర్ట్ చేసిన కడప గ్రామీణ విలేకరి ముస్లిం అయిన కారణంగా (ఇస్మాయిల్) వార్తా పత్రిక ఎడిటర్ అతణ్ణి ‘హిందూ సంపద’కి వ్యతిరేకిగా ముద్రవేసి పత్రికలో న్యూస్ స్టోరీని తిరస్కరించడాన్ని అద్భుతంగా చిత్రించిన కేతు విశ్వనాథ రెడ్డి ‘విరూపం’ కథ (2002) కూడా నాకీ సందర్భంలో  గుర్తుకొస్తుంది. పాఠకులు పాఠ్యం లోతుల్ని అర్థం చేసుకొని రచయిత దృక్పథాన్ని అందుకోడానికి  అవసరమైన పరికరాలు కథ బయటకన్నా కథలోనే ప్రత్యక్షంగానో పరోక్షంగానో మిళితమై వుంటాయని  చెప్పడానికి ఆడెపు లక్ష్మీపతి ‘అసందిగ్ధ కర్తవ్యం’ గొప్ప వుదాహరణ. శిల్పం వస్తువుని వున్నతీకరించడానికి యెలా దోహదం చేయగలదో  తెలుసుకోడానికి లక్ష్మీపతి కథలు పాఠ్య గ్రంథాల్లా వుపయోగపడతాయని చెప్పడం యే మాత్రం అతిశయోక్తి కాదు.

తిండిని సంస్కృతిలో భాగంగా భావించిన బుద్ధిజీవులు బీఫ్ ని నిషేధించడం దళితుల మైనార్టీల సాంస్కృతిక అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా , భారతీయ సమాజంలోని బహుళత్వాన్ని నాశనం చేసే యెత్తుగడగా  అభివర్ణిస్తూ వ్యాఖ్యానించడం తరచుగా వింటున్న కోణమే. అయితే నా మట్టుకు నాకు లక్ష్మీపతి రాసిన  ‘అసందిగ్ధ కర్తవ్యం’  చదివాకా యిటువంటి నిషేధం ప్రత్యేకంగా కొన్ని సెక్షన్ల పౌరుల్ని శారీరికంగా బౌద్ధికంగా బలహీనులుగా మార్చడానికి రహస్యంగా నిర్మించుకొన్న అజెండానేమో అన్న అనుమానం సైతం కలుగుతుంది. అంతే కాదు కథలో ఆటలో సలీంని ‘సీసాపెంకుల్లోకి తోసేయాలన్న పాడు ఆలోచన’ మౌళికి కలిగినందుకు అతని అమ్మ యెంతో నొచ్చుకొంటుంది. సలీం తల్లిదండ్రుల్ని ‘రసూల్ మామ బీబీ అత్త’ అని పేర్కొని వాళ్ళ పట్ల సహానుభూతినీ ప్రకటిస్తుంది. తెలిసో తెలీకో కొడుకు చేసిన తప్పుని భవిష్యత్తులో తిరిగి చెయ్యొద్దని శాసించింది.

మౌళి చిన్నతనంలో మన సమాజంలో వుండిన యీ స్నేహ బాంధవ్యాల్ని మాయం చేసి విభజన రేఖలు సృష్టిస్తున్న ‘అసాంఘిక’ శక్తులు యివాళ రెచ్చిపోతున్నాయి. వాటిని  అణచివేయాల్సింది పోయి  వాటికి పాలకులే వత్తాసు పల్కుతున్న సందర్భంలో అబ్బాసలీకి అండగా నిలవడానికి మౌళి నిశ్చయించుకొన్నాడన్న ముగింపు గొప్ప భరోసానిస్తుంది. ‘ద్వేషంతో ఏకపక్ష కోణంలోంచి ఆలోచించకండి’ అని నాటక ప్రదర్శనలో హితవు పల్కిన ఏంజిల్ వేషం కట్టిన కన్నకూతురిలో కన్నతల్లిని చూసుకొని తప్పు దిద్దుకొని ‘మనిషిని కాపాడడానికి’  సిన్సియర్ వుద్యోగిగా తనకున్న సమస్త శక్తులూ –  అస్త్ర శస్త్రాలు -వుపయోగించడానికి వెనుకంజ వేయని మౌళిలోని క్రియా శీలతని అందిపుచ్చుకోవడమే యివ్వాళ మనముందున్న అసందిగ్ధ కర్తవ్యం.

 

*

 

 

 

మీ మాటలు

  1. ramnarayana battula says:

    విలక్షణమైన రచయిత లక్ష్మిపతి , ఈ మద్య అతని రచనలు రావడం లేదు .

  2. దేవరకొండ says:

    “…అయితే నా మట్టుకు నాకు లక్ష్మీపతి రాసిన ‘అసందిగ్ధ కర్తవ్యం’ చదివాకా యిటువంటి నిషేధం ప్రత్యేకంగా కొన్ని సెక్షన్ల పౌరుల్ని శారీరికంగా బౌద్ధికంగా బలహీనులుగా మార్చడానికి రహస్యంగా నిర్మించుకొన్న అజెండానేమో అన్న అనుమానం సైతం కలుగుతుంది.” అంటే బీఫ్ తినని వారంతా శారీరకంగా, బౌద్ధికంగా బలహీనులా? వ్యాస రచయిత వివరించగోర్తాను.

  3. S.Radhakrishnamoorthy says:

    దేవరకొండగారి ప్రశ్నకు అనుబంధ ప్రశ్న: ‘బలహీనులుగా మార్చడానికి నిర్మించుకొన్న’.మార్చడం మరొకరిని, ‘నిర్మించు కోడం’ఎవరికివారు,అనుకొంఅనుకొంటున్నాను. కాదా ? ఎవరిని మార్చడానికి ఎవరు నిర్మించుకొన్నారు?
    అసహనం మతతత్వ రాజకీయాల మోనాపోలీ కాదు. ఏ ఎన్నికలో నైనా. యూనివర్సిటీ ,ట్రేడ్ యూనియన్, పంచాయతీలనుండి పార్లమెంటు దాకా, ఏ పార్టీ ఉదారంగా మరో పార్టీతో వ్యవహరిస్తుంది?

  4. Sashanka says:

    —-
    తెలంగాణాలో అప్పుడప్పుడే రూపొందుతోన్న ఆధునికానంతర సమాజంలో చోటుచేసుకొంటున్న సంక్లిష్టతల్ని లక్ష్మీపతి పట్టుకొన్నంత వొడుపుగా….
    —-
    తెలంగాణాలో రూపొందిన ఆధునికానంతర సమాజం ఏమిటో దాని లక్షణాలేమిటో వివరించండి ప్రభాకర్ గారూ …

    -శశాంక

  5. ఎ కె ప్రభాకర్ says:

    బీఫ్ తినని వాళ్ళు బలహీనులని చెప్పడం నా వుద్దేశం కాదు. బౌద్ధిక శారీరిక బలాన్నిచ్చే పోషక విలువలున్న ఇతరేతర ఆహారం పేద దళిత మైనార్టీ సెక్షన్లకి అందుబాటులో లేదు. మిగతా మాంసాహారాలకంటే కూడా పోషక విలువలు బీఫ్ లో ఎక్కువ ; అంతే కాదు దాని ధర తక్కువ. కథలో సలీం ఎద్దు మాంసం తినడంవల్లే అన్నిటా ముందున్నాడని మాత్రమే రచయిత చెప్పాడు. బీఫ్ పై నిషేధం ద్వారా ఆ సెక్షన్లని వారికి అందుబాటులో వున్న బలవర్ధక ఆహారానికి దూరం చేసే రాజకీయపు రహస్య ఎజెండా ఏదైనా అగ్రకుల మతతత్త్వ వాదుల్లో వుందేమోనన్నది నా అనుమానం.దేన్నయినా తినడం తినక పోవడం వ్యక్తి స్వాతంత్ర్యానికి సంబంధించిన విషయం. తిండి ఆ యా సమూహాల సంస్కృతిలో భాగం కూడా. వ్యక్తుల ఆ స్వేచ్చనీ సమూహాల సాంస్కృతిక అస్తిత్వాల్నీ గౌరవించమని రాజ్యాంగం నిర్దేశిస్తూ వుండగా అంగీకరించాల్సింది పోయి తిండిని రాజకీయాలకు సాధనంగా వాడుకోవాలననే ప్రయత్నం తప్పు అని చెప్పడం నా వుద్దేశం.

  6. Sivalakshmi says:

    ముందుచూపుతో భావితరాలకు పనికొచ్చే మంచి కథ రాసిన లక్ష్మీపతి గారికీ,సహేతుకమైన విశ్లేషణ నందించిన ప్రభాకర్ గారికీ హృదయపూర్వక ధన్యవాదాలు

  7. ఎ కె ప్రభాకర్ says:

    శశాంక గారూ! మీ స్పందనకి థాంక్స్.
    ఆడెపు లక్ష్మీపతి పారిశ్రామిక వాడల నుంచీ ఎదిగి వచ్చిన రచయిత.పారిశ్రామికీకరణ ద్వారా లభించిన అభివృద్ధినీ దాని దుష్ఫలితాల్నీ రెంటినీ అనుభవించిన తరానికి చెందిన వాడతను. పారిశ్రామికీకరణ సమాజాన్ని వ్యావసాయిక భూస్వామ్య ఉత్పత్తి సంబంధాల నుంచీ కార్మిక యాజమాన్య పెట్టుబడీదారి సంబంధాలవైపు నడిపించడానికి దోహదం చేస్తుంది. ఆ క్రమంలోనే సమాజం ఆధునికమౌతుంది. మధ్య తరగతి కూడా అక్కడే రూపొందుతుంది. తెలంగాణాలో ఈ పరిణామ క్రమం కొంత ఆలస్యంగా మొదలైంది.కానీ ప్రపంచీకరణ నేపథ్యంలో 90 ల నుంచీ అమలవుతున్న ఉదార ఆర్ధిక విధానాల వల్ల అది వేగవంతమయింది. సాంప్రదాయిక పారిశ్రామిక ఉత్పత్తి విధానంలో , ఉపాధి రంగాల్లో సైతం మార్పులు వచ్చాయి. అదే కాలంలో ఆధునిక సమాజం ఆధునికానంతర దశ వైపు పయనించడం మొదలైందని నా అభిప్రాయం. కానీ ఆ ప్రయాణం సజావుగా సాగలేదు. విపరీతమైన కుదుపుకి గురైంది. ఆ కుదుపునీ అందుకు కారణమైన పరిస్థితుల్ని జీవన్మృతుడు విధ్వంసదృశ్యం వంటి కథల్లో లక్ష్మీపతి బలంగా ఆవిష్కరించాడు.

  8. A Laxmipathi says:

    In a bid to capture the essence of my short story “Asangdigdha Karthavyam”- A K Prabhakar has examined all aspects of the narrative layer by layer.His analysis aims to reveal the spirit and significance of the story.I am sure the article not only gives readers fascinating insights into theme and technique of the story- but also draws the attention of my fellow writers who, for reasons not known, ignored it hitherto. I appreciate AK Prabhakar who has brought a thought provoking story-which is thematically relevant to present socio-political situation in the country, to sharper focus. One thing: it appears that, despite all his efforts to critically appraise the story collating all the aspects -events,characters etc.- Mr.Prabhakar has omitted the character of cook in the restaurant and thumris of begum akhtar – which were indeed intended to reinforce the theme or the “thing” that the writer wanted to communicate. It may be because of lack of space this is a minor thing. I thank AK Prabhakar, the critic,and the readers who expressed their views on his article.

మీ మాటలు

*