ఇలియడ్ చెప్పిందీ ‘కలికాలం’ గురించే!

 

స్లీమన్ కథ-31

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

అనేక గొప్ప ఇతిహాసాలలానే ఇలియడ్ కూడా ఒక దుష్టకాలంలో, వీరోచితంగా ఎదుర్కొన్న ఒకానొక ఓటమి గురించి చెబుతుంది. ఉత్తములు నాశనమవుతారు, చెడు వర్ధిల్లుతుంది.1 అయితే దేవతల తీర్పు వ్యక్తులు చేసిన మంచి పనులపైనో, చెడ్డ పనులపైనో ఆధారపడి ఉండదు. మనిషి భవితవ్యంతో వారికి నిమిత్తం లేదు. అంతిమంగా దేవతలు మనిషిలోని పచ్చి తెగింపునకే ప్రాధాన్యం ఇస్తారు. తమను కూడా ధిక్కరించి ప్రమాదభూయిష్ఠమార్గంలో మనిషి ఎంత ధైర్యంగా, ఎంత హుందాగా అడుగువేశాడన్నదే చూస్తారు. ఆ ధైర్యమూ, ధిక్కారమే మనిషిలోని ఉన్నతోన్నత సుగుణం. మనిషిని దేవుడితో సమానం చేసేది అదే. అదే సమయంలో, అతనిలోని మార్దవం అతన్ని మానవీకరిస్తుంది.

అపార ధైర్యసాహసాలు, మానవీయత అనే ఈ రెండుప్రపంచాల మధ్య హోమర్ అనాయాసంగా సంచరించాడు.     అప్పటికింకా మనిషి అమాయకతనూ, నరాలలో స్వచ్ఛంగా జ్వలించే అగ్నినీ నింపుకున్నప్పటి ప్రపంచాన్ని తన కృతుల్లో ప్రతిఫలించాడు. అపరాధభావనతోనూ, నిరంతరాయమైన విషాద పునరావృతితోనూ భయభీతుడు కావడం నాటి మనిషికి తెలియదు.  నాలుగు దిక్కుల నడవలో సహజమైన ఇంద్రియస్పందనలతో  సరళజీవితం గడిపిన ఫ్రాక్చరిత్ర కాలపు జీవి అతను. ముదిమి పైబడిన దశలో, తనకు రెండు వందల ఏళ్ల క్రితం జరిగిన ఘటనలను హోమర్ చిత్రించాడు. పారంపరికంగా అందుతూ వచ్చిన కథలకు తన యవ్వనస్మృతులను మేళవిస్తూ; ఆయా పాత్రలను ఉన్నదానికంటే ఎక్కువ ఉజ్వలంగానూ, ఆకర్షకంగానూ అతను చిత్రించి ఉండవచ్చు.

అయితే, అతనిలో ఒక వృద్ధుడిలోని సహజమైన శాంతీ, స్వచ్ఛతా ద్యోతకమవుతాయి. గతించిన యవ్వనకాలపు జవసత్వాలపై  ఒక వృద్ధుడికి ఉండే మమకారం ఉట్టిపడుతుంది. తన ఒడిస్సే చివరి అధ్యాయంలో చిత్రించిన మారణకాండలాంటిది అతనికి స్వయంగా తెలుసు. ఆ కృతిలో, ఒడీసియెస్ అర్థాంగి పెనలోపి పునస్వయంవరానికి వచ్చిన రాజులను నరికి పోగులు పెడతారు. పనికత్తెలను ఉరితీస్తారు. తన రోజుల్లో ఒక యువసామంతరాజును చంపి, రక్తం ఓడుతున్న మృతదేహాన్ని ఒక రథానికి కట్టి శిథిల నగర ప్రాకారాల చుట్టూ ఈడ్చుకు వెళ్ళిన ఘటన అతనికి తెలుసు. తను రాజుల గుడారంలో కూర్చుని ఉండగా, యుద్ధంలో పట్టుబడిన స్త్రీలను విజేతలు పంచుకోవడం తెలుసు.  ఊరూరా తిరుగుతూ తంత్రీవాద్యాన్ని మోగిస్తూ, ఇలాంటి అనేక అనుభవాల మేళవింపుతో కథలు చెప్పుకుంటూ వెళ్లాడాయన. ఆ తర్వాత ఆయన శిష్యులు ఈ కథలను గానం చేశారు. అనంతరకాలంలో ఇవి గ్రంథస్థమయ్యాయి.2

ఎన్నో తరాలు గడిచిపోయాయి; అయినా ఈ కథలు పెద్దగా మారింది లేదు. కథన దాహార్తి తీరని ఆ గొంతు మూగవోయింది లేదు. ఆ గొంతు ఎంత శక్తిమంతమూ, ఎంత అనర్గళమూ అంటే; ఒకానొక నాగరికత మొత్తానికి అది ఆకృతినిచ్చి, రంగులద్ది తనతో మోసుకెళ్లింది. ఆ తర్వాత అలాంటిది మరెప్పుడూ జరగలేదు. హోమర్ చిత్రించిన ఆ నాగరికత సుసంపన్నమైనది, సుసుందరమైనది, ఇంద్రియస్పందనలను ఎంతో ఉదాత్తంగా వ్యక్తీకరించినది. ఇంకా అది ఎలాంటిదంటే, ఒక స్వాప్నిక అంశను ధరించినదిగా దానిని జనం విశ్వసిస్తూ వచ్చారు. అయితే, స్లీమన్ దానిని మెలకువలో స్వప్నంగా నిరూపించి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేశాడు. 3

***

ఇన్నేళ్లలోనూ అతనిలో పెద్ద మార్పేమీ లేదు, అదే మంకుతనం, అవే అలవాట్లు. తన జీవితం పొడవునా పుంఖాను పుంఖంగా ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు, గ్రంథరచన చేస్తూనే ఉన్నాడు. తనెంత సంపన్నుడు, ప్రసిద్ధుడు అయినా తన రాతకోతలకోసం సహాయకుని నియమించుకోలేదు. ఆ అవసరం అతనికి కనిపించలేదు.  మధ్య మధ్య ఒక భాషలోంచి ఇంకో భాషలోకి దూకుతూ తన ఉత్తరాలు తనే రాసుకునేవాడు,

అతని సంపద పెరుగుతూనే వచ్చింది. స్టాక్ మార్కెట్ మీదా; పారిస్, బెర్లిన్, ఎథెన్స్ లలోని తన నివాసాల పైనా ఎప్పుడూ ఒక చూపు ఉంచేవాడు. తను కిరాయికి ఇచ్చిన ఇళ్ళలో ఏ ఒక్కటైనా ఖాళీగా ఉంటే, అందుకు రెండు నిద్రలేని రాత్రుళ్ళను మూల్యంగా చెల్లించేవాణ్ణని చెప్పుకున్నాడు. అలాగని మనిషిలో అసలే మార్పు లేదనీ చెప్పలేం. ఇంతకుముందు దుస్తులపై పెద్ద శ్రద్ధపెట్టేవాడు కాదు, ఇప్పుడు దుస్తులపైనా, టోపీల పైనా  కాస్త అభిరుచిని చూపిస్తున్నాడు.  కోటు జేబులోంచి ఒక ఎర్రటి సిల్కు జేబురుమాలు వేలాడదీసే అలవాటు ఒకటి అతనికి కొత్తగా వచ్చింది. నలుగురిలో ఉన్నప్పుడు సాధారణంగా నిశ్శబ్దం పాటించేవాడు, చాలా అరుదుగా నోరువిప్పేవాడు. తన తవ్వకాలపై చర్చలు అతనికి ఇష్టముండేవి కావు. అడుగు బడుగు జనాలపై ఆదరణ చూపించేవాడు. ఏదో సాధించాలన్న తపన ఇప్పటికీ అతనిలో అలాగే ఉంది. స్వర్ణనిక్షేపాల దాహమూ తగ్గలేదు.

125446-004-0C269211

ఎప్పుడూ ఏదో తొందరలో ఉన్నట్టూ, అస్థిమితంగానూ గడిపేవాడు. గడచిపోయే కాలం పట్ల విపరీతమైన స్పృహతో ఉండేవాడు. ఒక్క క్షణం వృథా అయినా సహించేవాడు కాదు. రోజులో ఇన్నిగంటల చొప్పున ప్రతి పనికీ కేటాయించుకునేవాడు. వేసవిలో ఉదయం మూడు గంటలకే లేచి భార్యతో కలసి గుర్రం మీద సముద్రస్నానానికి వెళ్ళేవాడు. ఉప్పునీటిలో గొప్ప ఔషధగుణాలు ఉన్నాయనీ, సముద్రస్నానం అన్ని రకాల రోగాలనూ నయం చేస్తుందనీ నమ్మాడు. వయసు మీదపడిన కొద్దీ మరింత నియమబద్ధమైన జీవితం వైపు మొగ్గుతూ వచ్చాడు. తన అరవై నాలుగవ ఏట, పెదవిపై ఏర్పడిన కణితిని మత్తుమందు తీసుకోకుండా కోయించుకున్నాడు. అంతకు కొన్ని మాసాల ముందు గుర్రం మీంచి పడి, కళ్ళద్దాల తునకలు చెక్కిళ్లలో గుచ్చుకున్నప్పుడు కూడా వాటంతట అవే బయటికి వచ్చేవరకూ ఓపికతో ఎదురుచూశాడు తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్లలేదు.

అయితే, శరీరానికి ఎంతో మంచిదని తను నమ్ముతూ వచ్చిన సముద్రస్నానమే నెమ్మదిగా అతని ఆరోగ్యాన్ని హరించడం ప్రారంభించింది. 1877లో, తన మైసీనియా (Mycenae) గ్రంథానికి గ్లాడ్ స్టన్ ప్రసిద్ధమైన ముందుమాట రాస్తున్న తరుణంలో మొదటిసారి స్లీమన్ వినుకలి సమస్యకూ, అస్వస్థతకూ లోనయ్యాడు. సముద్రజలం చెవుల్లోకి ప్రవేశించి విపరీతమైన చెవిపోటుకూ, తలనొప్పికి దారితీయించింది.  తన జీవితంలోని చివరి పదమూడేళ్లూ ఈ రెండు సమస్యలతో అతను బాధపడుతూనే ఉన్నాడు.

తనకు అత్యంత ప్రతిష్ఠను కట్టబెట్టిన ట్రాయ్ ఇప్పటికీ అతని బుద్ధికి పని చెబుతూనే ఉంది. హిస్సాలిక్ లో తను జరిపిన తవ్వకాల పూర్తి వివరాలను పొందుపరుస్తూ, ఆత్మకథాంశాలను జోడిస్తూ, అనంతర పరిశోధనల వెలుగులో కొన్ని వెనకటి సూత్రీకరణలను సవరించుకుంటూ 1879లో ఇలియోస్ (Ilios) అనే పుస్తకాన్ని తీసుకొచ్చాడు.

ఆ తర్వాత కూడా కొన్ని ప్రశ్నలు అతన్ని వేధిస్తూనే ఉన్నాయి. ఇంతకీ ట్రాయ్ ఉనికి హిస్సాలిక్ దగ్గరేనా? ఆ చిన్న దిబ్బను హోమర్ చిత్రించిన సువిశాల నగరంగా ఊహించుకోగలమా? ఆ దిబ్బే ట్రాయ్ అయుంటే అందులో అయిదువేలమంది జనమూ, అయిదు వందలమంది సైన్యమూ మించి ఉండగల అవకాశం లేదని అంచనావేశాడు. అప్పుడు హోమర్ వర్ణించిన అరవై నాలుగు గదుల విశాల ప్రాసాదాలు ఎక్కడున్నట్టు? పైగా ట్రాయ్ గిరిదుర్గం మైసీనియా గిరిదుర్గం కన్నా కూడా చిన్నది.

హిస్సాలిక్ గురించి ఆలోచించినకొద్దీ అతన్ని సందేహాలు అలముకుంటూనే ఉన్నాయి. బహుశా ట్రాయ్ హోమర్ ఊహాజనితం కావచ్చుననుకున్న క్షణాలూ ఉన్నాయి. హిస్సాలిక్ దిబ్బే హోమర్ చిత్రించిన ట్రాయ్ అన్న సంగతిని నిస్సందేహంగా నిరూపించే ఏ పురాతన లిఖిత ఆధారమో, లేదా మరో స్వర్ణకోశాగారమో కనిపిస్తుందన్న ఆశతో అతను తన జీవితాంతమూ ట్రాయ్ లో తవ్వకాలు కొనసాగిస్తూనే వచ్చాడు. ఇంతవరకు ట్రాయ్ గురించిన అతని పరిజ్ఞానం హిస్సాలిక్, బునర్ బషీ, స్కామందరస్ లోయ, దాని దగ్గర ఉన్న చిన్న చిన్న ఊళ్ళకు పరిమితమైంది. ఈసారి వాటిని దాటి వెళ్ళి పరిశీలిస్తే తన సమస్యకు పరిష్కారం దొరకచ్చేమో ననుకుని 1881 మే నెలలో గుర్రం మీద ట్రాయ్ అంతటా సుదీర్ఘపర్యటన చేశాడు. అందువల్ల అతను ఆశించిన ఫలితం దక్కలేదు కానీ, ఈదా(Mount Ida)పర్వతాన్ని ఎక్కగలిగాడు. హోమర్ ప్రకారం ఆ పర్వతం మీద దేవతలు నివసిస్తారు.4 అక్కడినుంచి ట్రాయ్ లో జరిగే యుద్ధాలను వీక్షిస్తారు. అక్కడ అడవి మృగాలు సంచరిస్తూ ఉంటాయి. అయితే, ట్రాయ్ అంతటా సర్వసామాన్యంగా కనిపించే ఒక్క కోకిల తప్ప ఆ పర్వతం మీద మరే జీవీ కనిపించలేదు. ఒక కొన మీద ఒక అజ్ఞాత పశువుల కాపరికి చెందిన ఒకే ఒక సమాధి కనిపించింది. ఇంకో కొన మీద ఒక పాలరాతి పలక కనిపించింది. అది దేవతల రాజు అయిన జియస్ సింహాసన అవశేషం కాబోలని స్లీమన్ అనుకున్నాడు. ఆ కొండ మీదనుంచి చూస్తే హిస్సాలిక్ దిబ్బ కోటు బొత్తమంత చిన్నదిగా కనిపించింది. అంతదూరం నుంచి కింద  సైన్యాల కదలికలను జియస్ ఎలా చూడగలిగాడోనని స్లీమన్ అనుకున్నాడు.

అదే సంవత్సరంలో హిస్సాలిక్ మీద చిన్నపాటి తవ్వకాలు జరిపించాడు కానీ అవి నిరుపయోగమయ్యాయి. అవే రోజుల్లో మరో ముఖ్యసమస్య అతని బుర్రను తొలుస్తూవచ్చింది. అది, ట్రాయ్ నిక్షేపాలను ఎక్కడ ఉంచాలన్నది. గ్రీస్, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్ లు అతని ఆలోచనల్లో నానుతూ వచ్చాయి. ఒక దశలో స్వర్ణహారాలను రష్యాకు విక్రయించాలని కూడా అనుకున్నాడు. నిక్షేపాలను హెర్మిటేజ్ మ్యూజియంకు అప్పగించే పక్షంలో మంచి ప్రతిఫలం లభించేలా చూస్తానని వాగ్దానం చేసిన ఒక రష్యన్ ఏజెంటుతో కొన్ని వారాలపాటు ఉత్తరప్రత్యుత్తరాలు జరిపాడు. అయితే, నిక్షేపాలను అమ్మాలన్న బలమైన కోరిక స్లీమన్ కు లేదు. అవి ఎంతటి ధనంతోనూ తూచలేని అమూల్యాలన్న సంగతి అతనికి తెలుసు. సిస్టైన్ చాపెల్ కు 5 ఎంత ధర కట్టగలరు? ఆయా ఘటనలు జరిగేవరకూ ఓపికగా ఎదురుచూస్తూనే, నిరంతర సందిగ్ధాల మధ్య నలగడం అతని స్వభావంలోనే ఉంది. తన పరిశోధనలను ఎన్నడూ గుర్తించి హర్షించని జర్మనీకి ట్రాయ్ నిక్షేపాలను అప్పగించే ప్రశ్నలేనేలేదని, 1878 చివరిలో ఒక బెర్లిన్ వర్తకుడికి కరాఖండిగా లేఖ రాశాడు. అయితే, ఆరునెలలు తిరిగేలోపల తను నిక్షేపాలను జర్మనీకే అప్పగించబోతున్న సంగతి అతనికి తెలియదు. అందుకు ఒక నల్లని ముళ్లచెట్టు తాలూకు పూల కొమ్మ కారణం. అదెలాగంటే…

స్లీమన్ జీవితకాలం మొత్తంలో తనకు స్నేహితులంటూ చెప్పదగిన వారు ఇద్దరే.  ఒకరు, యువపురావస్తు శాస్త్రవేత్త విల్హెమ్ దార్ఫెల్త్. ఒలింపియాలో స్లీమన్ చేపట్టిన తవ్వకాలకు సహకరించడానికి ప్రష్యన్ ప్రభుత్వం అతన్ని పంపించింది. ఇంకొకరు, ప్రసిద్ధ వైద్యుడు రుడాల్ఫ్ విర్కో. విచిత్రం ఏమిటంటే, స్లీమన్,అతనూ స్వభావంలో ఉత్తర, దక్షిణాలు. విర్కో నెమ్మదస్తుడు, పద్ధతిగా తూచినట్టు వ్యవహరించేవాడు, ఉపాయశీలి, తర్కబద్ధంగా మాట్లాడేవాడు, ధనదాహం, కీర్తిదాహం బొత్తిగా లేనివాడు.  తన శక్తియుక్తులను ఏక కాలంలో వంద వేర్వేరు పనులకు మళ్ళిస్తూనే నిదానంగానూ, పద్ధతిగానూ వ్యవహరించగల అతి కొద్దిమందిలో ఒకడు. స్లీమన్ అతన్ని చూసి ఒకవిధంగా అసూయ చెందేవాడు, అతని స్నేహాన్ని కోరుకునేవాడు, వైద్యసంబంధమైన ప్రశ్నలను అదేపనిగా గుప్పించేవాడు. చివరికి, సత్కారాలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, పసిపిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో అతన్నే అడిగేవాడు.

heinrich-schliemann-1822-1890-german-traveler-and-archeologist-schliemann-addressing-a-scientific-group-in-london-england-wood-engraving-from-an-english-newspaper-of-1877-granger

1879 వసంతంలో, హిస్సాలిక్ తవ్వకాలలో కొద్ది విరామం దొరికినప్పుడు, స్కామందరస్ లోయ వెంబడి విహారయాత్రకు వెడదామని స్లీమన్ అతనితో అన్నాడు. స్లీమన్ వెంట వెళ్ళే అవకాశం దొరికినందుకు విర్కో సంతోషించాడు. ఇద్దరూ ఈదా పర్వతపాదాల దగ్గరికి చేరుకున్నారు. స్లీమన్ తన స్వభావానికి భిన్నంగా, ఏవో ఆలోచనలతో సతమతమవుతూ మౌనంగా ఉండిపోయాడు. ఏమిటి విషయమని విర్కో అడిగాడు. “రకరకాల విషయాలుంటాయి, ఏదని చెప్పను?” అని స్లీమన్ అన్నాడు.

కాసేపటి తర్వాత, ఇద్దరూ ఒక నల్ల ముళ్లచెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, విర్కో అదే ప్రశ్న మరోసారి అడిగాడు. “తను మరణించిన తర్వాత ట్రాయ్ నిక్షేపాల పరిస్థితి ఏమిటన్న ఆలోచన నన్ను తొలుస్తోం”దని స్లీమన్ జవాబు చెప్పాడు. హఠాత్తుగా విర్కో పూలు చిగురుస్తున్న ఆ చెట్టు కొమ్మ ఒకటి విరిచి స్లీమన్ కు ఇచ్చి, “ఇదిగో అంకెర్షాగెన్ 6 పూలచెండు” అన్నాడు.

తను ఆ మాట ఎందుకు అన్నాడో అతనికే తెలియదు. అప్రయత్నంగా వచ్చిన మాట అది. అది చెవినబడగానే స్లీమన్ ముఖకవళికలు మారిపోవడం విర్కో గమనించాడు. అతని మీంచి ఓ పెద్ద బరువు దిగిపోయిన ఛాయలు వాటిలో కనిపించాయి. ఆ కొమ్మను అందుకున్న స్లీమన్, “అవును, అంకెర్షాగెన్ పూల చెండే” అన్నాడు. అంతకు మించి మాటలేవీ జరగకుండానే నిర్ణయం జరిగిపోయింది. ఆ సంగతి ఇద్దరికీ తెలుసు.

కొన్ని గంటల తర్వాత విహారయాత్రనుంచి తిరిగి వస్తున్నప్పుడు విర్కో యథాలాపంగా అన్నాడు, “ ఆ నిక్షేపాలు జర్మనీకి చేరవలసిందే. వాటినక్కడ భద్రంగా చూస్తారు. మీకు సముచిత సత్కారం లభిస్తుంది. అంతా సాఫీగా జరిగిపోతుంది. మీరు సరే నంటే యువరాజు బిస్మార్క్ తో మాట్లాడతాను”.

స్లీమన్ తల ఊపాడు. ఏడేళ్లుగా తనను వేధిస్తున్న ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. ఆ వసంత దినాన ఆ పూల కొమ్మను చూడగానే చిన్నప్పుడు అంకెర్షాగెన్ తోటలో తను చూసిన పెద్ద పెద్ద పూల రాశులు అతని స్మృతిపథంలో మెదిలాయి. అంతే, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాడు.

(సశేషం)

***

అథోజ్ఞాపికలు

  1. ‘దుష్టకాలం’ అన్న భావన మన పురాణ ఇతిహాసాలలోనూ ఉంది. ఉదాహరణకు, కలియుగం, లేదా కలికాలం. మహాభారతంలో ఈ కలియుగం ప్రస్తావన చాలాచోట్ల వస్తుంది. ఉత్తములు నశిస్తారు, చెడు వర్ధిల్లుతుందన్న భావనా అందులో అడుగడుగునా వ్యక్తమవుతుంది. పాండురాజు మరణించిన తర్వాత వ్యాసుడు సత్యవతికి చేసిన బోధలో “గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్” అనే వాక్యం సుప్రసిద్ధం.
  2. మహాభారతం విషయంలోనూ ఇదే జరిగింది. హోమర్ తర్వాత ఆయన కృతులను శిష్యులు గానం చేస్తూ ప్రచారం చేసినట్టే, వ్యాసుని శిష్యులు మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ప్రచారం చేశారు. పండిత నిర్ధారణ ప్రకారం, వ్యాసుడు చెప్పిన మహాభారత కథ ఎనిమిది వేల శ్లోకాలే. ఆ తర్వాత ఆయన శిష్యులు రెండు అంచెలలో దానిని లక్ష శ్లోకాలకు పెంచారు. విచిత్రమేమిటంటే, ఇలాంటి విస్తరణ క్రమమే ఇలియడ్ కూ ఉంది. తంత్రీవాద్యం, గానం పోలిక రామాయణానికి మరింత దగ్గరగా వర్తిస్తుంది. రామాయణం “తంత్రీలయ సమన్వితం”. దానిని వాల్మీకి శిష్యులు కుశలవులు గానం చేశారు.
  3. ఈ అభివర్ణన THE GOLD OF TROY రచించిన Robert Payne ది.
  4. గ్రీకు దేవతలు ఈదా పర్వతం మీద నివసించినట్టే, మన పురాణాల ప్రకారం మన దేవతలు మేరు పర్వతం మీద నివసిస్తారు.
  5. సిస్టైన్ చాపెల్: వాటికన్ సిటీలోని పోప్ అధికారనివాసం.
  6. అంకెర్షాగెన్: జర్మనీలోని ఒక గ్రామం. స్లీమన్ తన బాల్యాన్ని ఈ గ్రామంలోనే గడిపాడు.

 

 

మీ మాటలు

*