ఇంకేం రాయనూ ?

 

 

11 ఏళ్ల క్రితం మా అమ్మ (వైజాగ్ లో) చనిపోయినప్పుడు ఈ ఉత్తరాన్ని కృష్ణాబాయిగారు హైదరాబాద్ నుండి నన్ను ఓదారుస్తూ రాశారు . మళ్లీ ఇన్నాళ్ళకు ఈ ఉత్తరాన్ని టైప్ చేస్తుంటే గుండె బరువెక్కి , అమ్మ మరణం కళ్ళలో మెదిలి మెదడు మొద్దుబారి పోయింది. బహుశా అప్పట్లో వర్మ, మధు (ఆకాశవాణి ) వంటి మిత్రుల తోడు , కృష్ణాబాయి, రంగనాయకమ్మ , కె. వరలక్ష్మి , ప్రతిమ గార్ల ఉత్తరాలే నన్ను ఆ బాధనుండి కొంత విముక్తుణ్ణి చేసాయనుకుంటా. కృష్ణాబాయిగారికి ప్రణమిల్లుతూ – గొరుసు
………………………….

Date: 26.02.05

జగదీశ్వర రెడ్డికి ,

బాగున్నావా అని ఎలా అడగను? ఇంత vaccum కష్టమే .
 

నిన్ను పొగడ్డానికి రాయడం లేదని నీకూ తెలుసు. తల్లి మాత్రమే బిడ్డకి చేయగలిగినట్టు , అనితరసాధ్యంగా , అమ్మని చూసుకున్నావ్ . ఎవరితో పోల్చడానికీ లేదు . నీకెంతో ఇష్టమయిన పనుల్నీ, అభిరుచుల్నీ పక్కకి పెట్టి మరీ చూసుకున్నావ్ . తల్లీ బిడ్డా సంబంధమే కాదు, మానవతా దృక్పధమ్ తో , గొప్ప మనసుతో అమ్మని చూసుకున్నావ్ . నీకు చేతులెత్తి నమస్కరిస్తా నెప్పుడూ మనసులోనే . ఒకటి రెండుసార్లు పద్మినితో అన్నాను కూడా – చేపల కూర చేసి ఆ అమ్మ దగ్గరకు వెళ్ళాలమ్మా ఎప్పుడో అని . ఆమె “ఆ వాసనున్నా చాలురా ” అన్న మాట నన్ను కుదిపేసింది , కాని మేం చేప వండనూ లేదు, నేను తేనూ లేదు .
ఒక్క ఊరిలో ఉండి , అనుకుని కూడా ఆమెని ఒక్క సారన్నా చూడని నా మీద నాకే చికాగ్గా ఉంది .
 

“60 ఏళ్ళు దాటిన వాళ్ళెవరి నైనా చూడాలను కుంటే వెంటనే వెళ్లి చూడాలి, ఆలస్యం చేయ కూడదు” అనేవాడు ప్రసాదు – BN రెడ్డి గారిని చూద్దామనీ వెళ్ళలేక పోయినందుకు . దిక్కుమాలిన ఒత్తిడీ, టైమ్ సెట్ చేసుకోలేక పోవడమూ ఫలితం ఇది .
ఇది నిన్ను ఓదార్చడానికి కాదు, నన్ను నేను మందలించు కోడానికే .
 

రాత్రి గాంధీ చెప్పాడు – వర్మ చేసాడని . ప్రతిమతో మాట్లాడా .
 

ఎలా ఉన్నావో నిన్ను ఒక్కసారి చూడాలి . మన మిత్రులందరూ నీ చుట్టూ ఉన్నారనుకో . నేను ఓదార్చ గలిగింది మాత్రం – ఇంత దూరాన్నుంచీ – ఏముంది?
అమ్మ – ఘోరమైన హింసనుంచి విముక్తు రాలయింది . అది తృప్తిగా మిగలాలి నీకు .
 

ఇంకేం రాయనూ ?
 

– కృష్ణాబాయి

మీ మాటలు

  1. Anil battula says:

    టచింగ్ లెటర్

    • తహిరో says:

      హాయ్, నీ కామెంట్ వెరీ టచ్చింగ్ అనిల్ :)

  2. చందు తులసి says:

    అదేంటో గొరుసు గారి కథల్లోనే కాదూ….ఆయన ఉత్తరాల్లోనూ గుండెతడి మనల్ని బరువెక్కిస్తుంది.
    అమ్మను కోల్పోవడం జీవితంలో అన్నిటికన్నా మించిన లోటు…
    ఈ ఉత్తరం చదివాక నేను మా అమ్మను ….గొరుసు గారిలా చూసుకోవాలనిపించింది.

    • తహిరో says:

      నేను ప్రామాణికం కాదు చందు – అమ్మను అమ్మలా చూస్తే చాలు మనమంతా .

  3. Buchireddy gangula says:

    ఎస్..touching .letter
    ———————————–
    Buchi reddy gangula

  4. సూరపరాజు రాధాకృష్ణమూర్తి says:

    ఉత్తరం టైప్ ఎందుకు చేశారు? రాత బాగలేదా? బాగుంది.కృష్ణాబాయి గారి గురించి నేను మొదటి సారిసదాశివ(యాది) గారి ద్వారా విన్నాను. ఆయనకు అమె అంటే అపార ఆదరం. ఎందుకో ఈ ఉత్తరంలో తెలిసింది.

    • గొరుసు says:

      కృష్ణా బాయిగారు ప్రేమకు ప్రతిరూపం రాధాకృష్ణమూర్తి గారూ. ఉత్తరం 10 ఏళ్ళ క్రితం రాసింది కాబట్టి , కాగితం నలిగిపోవడం వలన అందరికీ సరిగా అర్థం కాదని టైప్ చేసాము. మీ స్పందనకు ధన్యవాదాలు.

  5. కె.కె. రామయ్య says:

    అనారోగ్యంతో మంచాన పడిన తల్లికి చంటి బిడ్డకు చేసినట్లు సేవలు చేసాడు నాయనా గొరుసు అనేవారు ఆర్తితో త్రిపురగారి ఆప్తమిత్ర, సాహితీ సత్య హరిశ్చంద్ర, సత్తెకాలపు శ్రీ రామడుగు రాధాక్రష్ణ మూర్తి గారు. గజయీతరాలు, (పాలమూరు) వలస పక్షులు ల విషాదాన్ని రచనల్లో ఆలాపించిన గొరుసు జగదీశ్వర రెడ్డి గారు నిజ జీవితంలోనూ గుండె తడిచెమ్మ ఆరని వ్యక్తీ.

    రచనల్లో దుఖాలాపనలే కాదు పాత సినిమాల్లోని పాటలు ఏ ఎం రాజా యిస్టైల్లోనో మధురంగా పాడతారని కొత్తగూడెం భగవంతంగారు చెప్పేవారు.

    కృష్ణక్క (విరసం కృష్ణాబాయి) గారి అపురూపమైన ఉత్తరం ఇచ్చినందుకు గొరుసన్న పట్ల పాత నేరారోపణలను తాత్కాలికముగా పక్కన పెడుతున్నాను.

    • గొరుసు says:

      రామయ్య గారూ మీ స్పందనకు సంతోషం.
      భగవంతం చెప్పింది అబద్ధం.
      మాటి మాటికి గజ ఈతరాలు , వలస పక్షులు గుర్తు చేయాలా ? ఆ కథలు రాసిన గుర్తు కూడా లేదు నాకు.
      మీ పొగడ్తలకి ఎప్పుడొ ఒకప్పుడు నేను “డాం ” అని గుండె ఆగి “పోతే” మీరే బాధ్యులు సుమా !
      నేను చేసిన నేరాలు కూడా రాసి వుంటే బాగుండేది :)

  6. కృష్ణక్క ఉత్తరాన్ని ఇలా పంచుకోడం చాల బాగుంది, జగదీశ్వర రెడ్డి. ఆక్షరాక్షరంలోని ఆమె మంచి మనస్సుకు నమస్సులు. అమ్మను బాగా చూసుకున్న మీక్కూడా.

    • గొరుసు says:

      థాంక్యూ సర్,
      అదీ మాతృ దినోత్సవం రోజు పంచుకోవడం నాకూ ఒక తీయని బాధ కలిగించింది సార్ . నేను గతంలో కొంత కాలం (3 ఏళ్ళు ) వైజాగ్ లో ఉన్నాను సర్. కృష్ణాబాయి గారి ఆత్మీయత ఏమిటో అప్పుడే తెలిసింది.

  7. 2005 లోనే మా అమ్మ కాశీఅన్నపూర్ణ చనిపోయింది.
    జగదీశ్వర్ రెడ్డీ! మీ అమ్మ కూడా ఆ సంవత్సరమే చనిపోయారని నాకు తెలియదు.
    ప్రతిమ కూడా చెప్పినట్టులేదు.
    నా వరకు మా అమ్మ,నా చుట్టూ ఉన్న ప్రకృతి వేరు వేరు కాదు.
    మా అమ్మ మా ఊరిమట్టిలో కలిసిపోయింది.
    ఎవ్వరమైనా ఆ మట్టిలోనే కదా కలవాలి.
    నేను ప్రకృతికి దగ్గరగా ఉన్నంత కాలం,
    ప్రకృతిని ప్రేమించినంతకాలం మా అమ్మ నాతోనే ఉంటుంది.
    మీ అమ్మైనా,ఎవరి అమ్మైనా అంతే కదా!!!

    • గొరుసు says:

      సత్యవతి గారూ , ధన్యవాదాలు – మీ స్పందనకు.
      అమ్మ మరణానికి ముందు ప్రతిమ విశాఖ వచ్చారు. అప్పుడు ఆమె అమ్మను కలిశారు, అమ్మతో మాట్లాడారు.
      నేను కూడా అమ్మ నా వెంటే ఉండి ఉంటుందని అనుకుంటాను. ముఖ్యంగా అమ్మ చీరలూ , చెవి దుద్దులూ … ఆమె వాడిన వంట పాత్రలూ ఇంట్లో కనిపించి నప్పుడు మాత్రం కొంత భావోద్వేగానికి లోనవుతా – అంతే.
      నమస్కారాలతో …..

  8. కె.కె. రామయ్య says:

    ఉత్తమ సాహిత్యాభిమానులు, మీ శ్రేయోభిలాషులు ( డా. జంపాల చౌదరి గారితో సహా ), మీ అభిమానులైన నేటి యువతరం ప్రతిభావంత రచయితలు చౌరస్తా డా. వంశీధర రెడ్డి, అల్లం వంశీ కృష్ణ, చందు తులసిల వంటి వారెందరో కోరిక తళుకుబెళుకుల భాగ్యనగరం మింగేసిన గొరుసన్న సాహితీ పునరుజ్జీవనం. ‘గజయీతరాలు’ పుస్తకం పునర్ముద్రణ పొంది అందుబాటులోకి రావాలనేది నా లాంటి నేలక్లాసు ప్రేక్షకుల చిరుకోరిక.

    త్రిపుర గారి కొత్తగూడెం భగవంతం సానా మంచోడు. అబద్దాలెప్పుడూ చెప్పడు.

    ఆంద్రజ్యోతి తిర్పతి ఆర్.ఎం. ఉమా కొట్టి కొట్టి రాయించిన కధలు; గజఈతరాలు, వలస పక్షులు వదిలెయ్యి, దిక్కూ మొక్కూ లేని పాలమూరి వలస పక్షులకి మాటిచ్చినది కూడా గుర్తులేదా?
    గైరోం పే కరం! అప్నో పే సితం? ఏ జానే వఫా యే జులం న కర్!!

    కారా మాస్టారు, రాచకొండ బాబు (రావిశాస్త్రి), బీనాదేవి, రంగాజీ(రంగనాయకమ్మ), కృష్ణక్క, చలసాని ప్రసాద్, భరాగో, త్రిపుర ల లాంటి ఎందరెందరో సాన్నిహిత్యాని పొందిన మీరు … నేడిలా?

    ( మళ్లీ మళ్లీ రచనలు చెయ్యమని గొరుసన్నతో గొడవెట్టుకోవద్దని మందలించిన త్రిపుర తండ్రికి క్షమార్పణలతో )

  9. కె.కె. రామయ్య says:

    చేసిన పాపం, ఉత్తిపుణ్యానికి గొరుసన్నను బాధపెట్టిన పాపం నుండి నిష్కృతి పొందటానికి విశాఖ లోని కృష్ణక్క గారితో మాట్లాడాను. ( ఎంత గొప్పగా ఉందమ్మా మీ ఉత్తరం, ఎంత అందంగా ఉందీ మీ చేతి రాత అంటూ నట్లు కొడుతూ ). గొరుసు మంచి కధా రచయితే కాదు, చాలా సున్నిత మనస్కుడు, మంచి వాడు, మా కందరికీ బాగా కావాల్సిన వాడు అంటూ కృష్ణక్క తమ అభిమానాన్ని వ్యక్తం చేసారు. మళ్లీ కధలు రాయమని గొరుసుని హింసించకు రామయ్యా అని( త్రిపుర గారి లాగే ) కృష్ణక్క కూడా అన్నారు ఈ సందర్భంలో. నాదేవున్దమ్మా నేనో సత్రకాయగాడిని అంటూ సిగ్గుతో తలవంచుకున్నా.

  10. chandolu chandrasekhar says:

    గొరుసు గారు కృష్ణ అక్క ఉత్తరాన్ని పరిచయం చేసినందుకు , ధన్యవాదాలు .ఆమె నాకు పరిచయస్తురాలు .మీరు వుత్తరం ద్వారా అక్కని గుర్తు చేసినందుకు thanq

మీ మాటలు

*