స్వేచ్ఛకీ సముద్రానికీ మధ్య…

 

 

” ఇదిగో, ఇక్కడివరకే వెళ్ళాలి – దాటి నడిస్తే నాశనమే ” అన్న కట్టు ఉన్నంతవరకు తెంపుకు పోవాలనే అనిపిస్తుంది. ‘’నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది, ఏమైనా చేసుకోవచ్చు ‘’ నంటే దాన్ని ఉపయోగించుకోవాలని చాలా మందికి ఉండదు. మానవ స్వభావం లోని ఇలాంటి ఒక వైచిత్రి కి ఆవిష్కారం ఇబ్సన్ నాటకం Lady from the Sea లో. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా తీగలు  అక్కడ కదులుతాయి.

ఇబ్సన్ నాటకాలలో చాలా భాగం సమస్యలతో అంతమవుతాయి. ప్రసిద్ధికెక్కిన A Doll’s House  అటువంటిదే. ఎక్కువ వెలుగులోకి రాని విషయమేమిటంటే ఆ నాటకానికి మరొక ఆశాజనకమైన ముగింపు ని కూడా తర్వాతి కాలం లో ఇచ్చి రాశారు . ఈ నాటకాన్నీ దాన్నీ కలిపి ఇబ్సన్ తిరోగమనం గా వర్ణించేవారున్నారు. ఆయన  చివరి నాటకాలలో ఇది ఒకటి .

గోథె ఇట్లా అన్నారట – ” తొలి రోజుల్లో రాగినాణాలో వెండి ముక్కలో  పోగుచేసుకుంటాము, పక్వత వస్తూన్న కొద్దీ వాటిని మారకం చేసి బంగారాన్ని సంపాదించుకోబోతాము ” .  తొలినాళ్ళ సమస్యల కు తాను చెప్పుకున్న సమాధానాల కన్న మెరుగైనవాటిని – ఎదుగుతూన్న కొద్దీ రచయిత అన్వేషిస్తారు – తప్పదు. ఒకరి సృష్టి లో ఒకేలాంటి ఇతివృత్తాలూ   పాత్రలూ పునరావృత్తం అవుతూండటం మనకి తెలిసిందే – రచయిత ప్రశ్నలు తృప్తి పడి  తీరాన్ని దాటేవరకూ ఇది సంభవిస్తూనే ఉంటుంది.

మనిషి – తన లోపలి ప్రేరణలు ఏవైనా గాని, ఆత్మనాశనం వైపుకే వెళ్ళనక్కర్లేదని ఈ నాటకం లో ఇబ్సన్ ప్రతిపాదించారని అంటారు. ఎంత తీవ్రస్వభావానికైనా ప్రపంచం తో లయ కల్పించుకోగల శక్తి ఉండవచ్చుననే భరోసా ఇవ్వదలుస్తారని కూడా [Stephen Unwin ] . ఆత్మనాశనం అన్నది సాపేక్షమే. సాధారణమైన దృష్టి తోనే ఈ మాటలు – మనం ఎంతమందిమి అంత అసాధారణులం నిజానికి ?  మరింకొక స్థాయి లో ,  పరస్పర గౌరవమూ స్వేచ్ఛా ఉన్న పరిస్థితులలో వివాహవ్యవస్థ కొనసాగటం సాధ్యమేనని  ఈ దశ లో ఇబ్సన్ అనుకుని, మనకీ చెప్తారు.

సముద్రాన్ని స్వేచ్ఛకూ నేల మీది జీవనాన్ని నియమబద్ధులై ఉండటానికీ ప్రతీక లుగా తీసు కుంటారు .  ఈ నాటకం లో కొన్ని అతి మానుషాంశాలు ఛాయామాత్రంగా ఉంటాయి,  ఇబ్సన్ ప్రధానంగా వాస్తవిక రచయిత అయినప్పటికీ. తక్కిన ఇబ్సన్ నాటకాల శిల్పానికి ఇందులోది కొంత తగ్గుతుందని విమర్శకులు అంటారు , కాని సత్యదర్శనం లో మరింకే నాటకానికీ ఇది తీసిపోదు – ఒక మెట్టు పైనే ఉంటుంది.

నార్వీజియన్ అయిన ఇబ్సన్  ఈ నాటకానికి ప్రేరణ ని అక్కడి జానపద గాథ ల నుంచి తీసుకున్నారు. హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ Mermaid గాథ ని చిత్రిస్తారు. సగం మనిషీ సగం చేపా అయిన అమ్మాయి ఒకరిని ప్రేమించి పెళ్ళి చేసుకునీ హాయిగా  ఉండలేక , మరణిస్తుంది. Mermen కూడా అక్కడి గాథలలో ఉంటారు – మానవ స్త్రీలని వశం చేసుకోగలవారు. ఈ వైరుధ్యాల కలయికలలో అశాంతీ అంతమూ మటుకే ఉండాలా ? అక్కర్లేదేమోనని ఇక్కడ ఒక సూచన. తర్వాత ఆలోచించవలసిన విషయం-  అంత స్పష్టమైన వైరుధ్యాలు నిత్యమూ భార్యాభర్త ల మధ్యన ఉంటున్నాయా లేదా అనేది.  సున్నితత్వం కొంత ఎక్కువగా ఉందనిపించే ప్రతి స్త్రీ mermaid కాదు .

ibsen

Ellida సముద్ర తీరం లో పుట్టి పెరుగుతుంది. సముద్రమే  ఆమె ఉనికి, సర్వస్వం. పేరు స్పష్టం గా ఉండని ఒక అపరిచితుడు – సాగరమే మానవుడైనట్లు కనిపించేవాడు , వచ్చి ఆమెతో స్నేహం చేస్తాడు. చాలా ఆదిమమూ ప్రాకృతమూ అయిన ప్రేమ వారి మధ్య పుడుతుంది. ఇద్దరి ఉంగరాలూ కలిపి నదిలో వేసి పెళ్ళైపోయిందని ప్రకటిస్తాడు అతను. ఈ లోపు , తన వైయక్తిక న్యాయం ప్రకారం ఒకరిని హత్య చేస్తాడు. ఈ లోకపు మర్యాదలనూ నియమాలనూ చట్టాలనూ పట్టించుకోని వాడు అతను . ఆ తర్వాత నౌకలో సముద్రం మీదికి వెళుతూ ఎదురు చూస్తూండమని ఆదేశం ఇస్తాడు.. ..ఎన్నాళ్ళకీ

రాడు .అక్కడికి వచ్చిన Dr  Wangel  కోరితే వారిద్దరికీ  ప్రాపంచికమైన వివాహం జరుగుతుంది.Wangel  ఒక పల్లెటూరి వైద్యుడు. రెండో పెళ్ళి, ఇద్దరు కూతుళ్ళు. ఆ ఇంట్లో Ellida  కి ఊపిరాడదు. సముద్రపు అనంతత్వం అలవాటయిన ఆమె కి అది ఇరుకైన పరిమితి. రోజూ వెళ్ళి  దగ్గర్లోని చిన్న రేవులో మునిగివస్తుందే గాని, సముద్రాన్ని ఇంటికి తెచ్చుకోలేదు. ఆ పరిస్థితి గురించి రచయిత ఒక సంభాషణ నడిపిస్తారు –

” ఏమిటీ బొమ్మ ? ”

” mermaid ”

” అలా కృశించిపోయి ఉందేం ? ”

” సముద్రానికి దూరంగా బ్రతకలేదు కదా”

” అవును, చేపల సంగతి అంతే. మనుషులు వేరు. వారు అలవాటు పడగలరు ”

అతి ప్రాథమికమైన భావోద్వేగాలకు మనుషులు అస్తమానమూ లోబడిపోనవసరం లేదని రచయిత అభిప్రాయపడతారు.   దారి తప్పిపోయామనుకోవటం    అంత అనివార్యమైనది కాదు.

”  జీవ పరిణామ శాస్త్రం లో మన పాత బంధువులు చేపలూ పక్షులూ. ఆ అంతఃప్రేరణలు కొందరిని సముద్రానికీ ఇంకొందరినీ గాలికీ ఆకాశానికీ ఆకర్షించబడేలా చేస్తాయి – కాని ఆ దశలను మనం దాటివచ్చేశామని తెలుసుకోవలసి ఉంది ” – అంటారు ఆయన. ఇబ్సన్ మార్క్సిజం ప్రభావం ఉన్నవారు, భౌతిక వాది . మానవుడి సార్వభౌమత్వాన్ని ఆయన అంగీకరిస్తారు. ఆ ఆధిపత్యం ప్రకృతి పైనా, తన మీద పని చేసే ప్రకృతి శక్తుల మీదా కూడా – ఈ నాటకం లో.

[ ఇలా అంటే ఆశ్చర్యం గా అనిపించవచ్చు. సనాతన హిందూ ధర్మం లోనూ Victorian morality లోనూ conventional communism లోనూ కూడా ఉద్వేగాలకి విలువ తక్కువ , వివిధ స్థాయిలలో. ]

Ellida ఎవరినీ దేన్నీ పట్టించుకోకుండా కుములుతుంటుంది.  బిడ్డ పుట్టి మరణిస్తాడు – అదీ ఆమెని భయపెడుతుంది, అపరాధ భావన తో. ఒక దశలో భర్త తో ” మన ఇద్దరం బేరం కుదుర్చుకున్నాం అంతే, మనకి జరిగింది పెళ్ళే కాదు ” అనేస్తుంది. ఆ భర్త లౌకికుడైనా సజ్జనుడు, సహృదయుడు.

” అవును, క్రమక్రమం గా నువ్వు మారిపోతున్నావు – తెలుస్తోంది నాకు ” –  తన ఇంటినీ వృత్తినీ వదిలేసి ఆమె ని సముద్రానికి దగ్గరగా వెళ్ళి స్థిరపడదామంటాడు . ఈ లోపు ‘ అతను ‘ వస్తాడు. Ellida తన  భార్యే అతని దృష్టిలో. వెళ్ళిపోదాం రమ్మని, ఆమె వెనుకాడితే రెండు రోజుల వ్యవధి ఇస్తాడు.

మొదట భర్త భరించలేకపోతాడు. తర్వాత , అంచెలంచెలు గా – నిబ్బరించుకుంటాడు.

” నీకు పూర్తి స్వాతంత్ర్యం ఉంది ఇప్పుడు- ఏ నిర్ణయం తీసుకునేందుకైనా ” – అని ప్రకటిస్తాడు చివరికి. దాన్ని ఆమె ఉపయోగించుకోబోతోందనే అనిపిస్తుంది.

తీరా ఆ రోజు మొదలయాక ” నన్ను ‘ అతని ‘ నుంచి రక్షించు ” అంటుంది భర్త తో. ఊహించకుండా వచ్చిపడిన ఆ స్వేఛ్చ ఆమెని కలవరపెడుతుంది. అనంతర పరిణామాలను ఊహించుకుందుకు ధైర్యం చాలదు. భర్త కీ సవతి కూతుళ్ళకీ తన అవసరం ఉందనిపిస్తుంది , ఆ బాధ్యతని తీసుకోవటం ఒక సార్థకత అనుకుని, ఉండిపోతుంది.

స్వాతంత్ర్యం కొత్తగా వచ్చిన ఎవరికీ దాన్ని ఏం చేసుకోవాలో తెలియదు. ఆమె ఆ risk  తీసుకుని అతనితో ఎందుకు వెళ్ళిపోలేదు ? ఆమె సమస్య  తీరలేదనీ ఈ ముగింపు సుఖాంతం అవదనీ వాదించేవారు ఉన్నారు.

నాకు ఇలా అనిపిస్తుంది – ఆమె లో ‘ భద్రత ‘ ని కోరుకునే లక్షణం కూడా ఒకటి ఉంది. లేదంటే నిరంతరమూ ‘ అతని ‘ కోసం ఎదురు చూస్తూ ఉండిపోవలసిన మనిషి – ఏ కబురూ అందకపోతే మాత్రం , Wangel ని ఎందుకని పెళ్ళాడాలి ? అట్లాంటప్పుడు అతని మీద అంత విపరీతమైన ప్రేమ ఉన్నట్లూ కాదు .  పెళ్ళి ఒక లక్ష్మణ రేఖ  అనిపించినన్నాళ్ళూ ఆమె విలవిలాడింది. దాటరాదు  అన్నంతవరకూ చెలియలికట్టని బద్దలు కొట్టాలనుకుంది.

‘ కాదు ‘ అన్న తర్వాత – అనిశ్చితత్వాన్ని ఎంచుకోలేకపోయింది. ‘ అతని’తో జీవితం ఎంత ఆటవికం గా అరాచకం గా ఉండబోతోందో ఆమెకి స్పష్టంగా తెలుసు, దానికి ఇప్పుడు సిద్ధంగా లేదు . తను మరొకరికి ఉపయోగపడగలను అన్నది మనిషికి చాలా సద్గర్వాన్ని ఇస్తుంది , ఆ  వైపు కి వెళ్ళిపోయింది. ఆమె తత్వం అది –  మనుషులూ పరిస్థితులూ పలువిధాలు . A Doll’s House  లో డోరా ఇల్లు వదిలి వెళ్ళిపోవటాన్ని ఎట్లా సార్వత్రికం గా తీసుకోకూడదో దీన్నీ అంతే. రచయిత నొక్కి చెప్పే ఒక విషయం ‘ఆత్మగౌరవం .

అవును, ఇంతటి contrast ఉంది కనుక ఇక్కడి ఎంపిక సులభమవుతుంది- ఇది నాటకం కదా మరి. ఆ  contrast తగ్గుతూన్న కొద్దీ తేల్చుకోవటం భారమవుతుంది, అదీ నిజమే. సరిగ్గా ఇక్కడే , కళ్ళు తెరుచుకుని ఉంటే , సాహిత్యప్రయోజనం మనకి కనిపిస్తుంది.  కొత్త నియమాలను సిద్ధం చేయటం సాహిత్యం బాధ్యత ఎంత మాత్రమూ కాదు , అది చేయ గలిగినది సహాయమూ  సూచనా మాత్రమే- సందర్భానికి అనుగుణంగా.

కొంచెం పక్కకి వెళితే – అరేబియన్ నైట్స్ లో ఒక కథ – పక్షి తొడుగు తో ఎగిరే గంధర్వ రాజకుమారి , ఆ తొడుగు దొంగిలించిన వాడిని తప్పనిసరై పెళ్ళాడి బిడ్డలను కంటుంది .  తొడుగు ను సంగ్రహించగల అవకాశం రాగానే ఎగిరి వెళ్ళిపోతుంది. అతను అష్టకష్టాలూ పడి ఆమె కోసం వెళితే వెనకాలే వచ్చేస్తుంది – అంతలో ఉంటుందన్నమాట,  కనీసం కొన్నిసార్లు.

చలం గారి ‘ జీవితాదర్శం ‘ ముగింపు ని ఇక్కడ తలచుకోవటం అసందర్భం కాదు. ఏదీ కట్టి పడేయలేని లాలస దేశికాచారి ‘  ఇచ్చిన ‘ స్వేచ్ఛ కి లోబడిపోతుంది. జీవితాదర్శం శాంతి అనిపిస్తారు చలం .

” స్వేచ్ఛ కి ఉండే లక్షణం ఇది – దాన్ని అన్వేషించేకొద్దీ అది చేతికి అందదు – విస్తృతమవుతుంది. ఒక సంఘర్షణ  మధ్యన నిలుచుని ‘ నేను సాధించాను ‘ అన్న మనిషి దాన్ని ఆ క్షణాన్నే పోగొట్టుకుంటున్నాడని అనాలి ”  అని ఇబ్సన్ అంటున్నారు. జీవితపు హద్దులకి ఉన్న చలనశీలతను ఇంత బాగా చెప్పినవారు అరుదు.

*

మీ మాటలు

 1. ఎలీడా చాలా పరిణతి కనబరిచింది అనుకోవాలి. నిజానికి ఈ ఇబ్సెన్ రచన చాలా ఆలోచనాత్మకమైనది.
  ” స్వేచ్ఛ కి ఉండే లక్షణం ఇది – దాన్ని అన్వేషించేకొద్దీ అది చేతికి అందదు – విస్తృతమవుతుంది. ఒక సంఘర్షణ మధ్యన నిలుచుని ‘ నేను సాధించాను ‘ అన్న మనిషి దాన్ని ఆ క్షణాన్నే పోగొట్టుకుంటున్నాడని అనాలి ” అని ఇబ్సన్ అంటున్నారు. జీవితపు హద్దులకి ఉన్న చలనశీలతను ఇంత బాగా చెప్పినవారు అరుదు.” అని మీరన్న మాటలు అక్షరాల నిజం.
  మీ సమీక్షావ్యాసం చాలా బావుంది. ఇబ్సెన్ ని బాగా అర్థం చేసుకున్న తీరు, ఈ రచనని పరిచయం చేస్తూ మీరు ఉటంకించిన ఇతర పుస్తకాలూ మీ బహు గ్రంథ పరిచయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. అభినందనలు.
  కొద్దిగా ఇలాంటి సంఘటనలే ఉన్న తెలుగు సినిమాలు ఉన్నాయి (సప్తపది … ఐతే సినిమా ముగింపు నాకు నచ్చలేదు, విపరీతతర్కం ఉంది అక్కడ).

  • Mythili Abbaraju says:

   ధన్యవాదాలండీ. అవును, ఉన్నాయి చాలానే. రాధాకల్యాణం [బాపు ( భాగ్యరాజా ఒరిజినల్ ) ], హిందిలో హం దిల్ దే చుకే సనం వంటివి. నాటకం లో ఉన్నంత contrast సినిమా లలో చూపించలేదు, సహజం గానే.

 2. mallikarjuna says:

  మీ వివరణ చాలా బావుంది. స్త్రీకి భద్రత కావాలి, స్వెచ కావాలి .ఎల్లలెరుగని స్వెచ వినటానికి బావుంటుంది కాని అనుభవంలో భయం కలిగిస్తుంది.ఏమిటో జీవితం …మనుషులకు స్వెచ అప్పుడప్పుడు కావాలేమో..పిల్లలు చదివి చదివి సాయంత్రం ఓ గంట ఆడుకున్నట్లు.బంధనాలలోంచి స్వేచాను ఆశించటం భలే వుంటుంది .స్వేచాను వదులుకొని బంధనాల బాధ్యతను స్వీకరించటం మరీ బావుంటుంది. మనిషేప్పుడు తనకోసం బ్రతికితే ఎమ్బవుంటుంది? జీవితపు హద్దులకున్న చలనసీలత…కవితలాంటి పదాలవి.. మీకు అభినందనలు..

  • Mythili Abbaraju says:

   ధన్యవాదాలండీ ! అవును, స్వేచ్చ ను పూర్తిగా నిర్వచిం చామని అనటం ఎవరి తరం !

 3. “…తను మరొకరికి ఉపయోగపడగలను అన్నది మనిషికి చాలా సద్గర్వాన్ని ఇస్తుంది , ఆ వైపు కి వెళ్ళిపోయింది. ఆమె తత్వం అది :) ” థాంక్యూ సో మచ్ – చాలా లోతైన పరిచయం ఇచ్చారు Mam !

 4. Mythili Abbaraju says:

  ఎస్ . ఆ ‘ సద్గర్వం ‘ నడిపించగలదు – థాంక్ యూ రేఖా

 5. Dr. B.KANAKA RAJU says:

  A good guide for persons breaking their heads where to draw a line between freedom and bondage. Nice rendition.

 6. Vijaya Karra says:

  చందమామలో చదివిన ఎప్పుడూ గుర్తుకు వచ్చే అరేబియన్ నైట్స్ కథ – పక్షి తొడుగుతో వాక్ వాక్ దీవులకి ఎగిరి వెళ్ళిపోయిన గంధర్వ రాజకుమారి. అక్కడా కోల్పోయిన స్వేచ్ఛ ఆత్మగౌరవమే వెనక్కి వచ్చేలా చేస్తుందనుకుంటా! ఆ కథ పేరు వాక్ వాక్ దీవులేనా :-) , నైస్ ఆర్టికల్ !!

 7. Mythili Abbaraju says:

  అవునండీ.. మీకూ భలే గుర్తుందే! :)
  థాంక్ యూ.

 8. Venkat Suresh says:

  “స్వేచ్ఛ కి ఉండే లక్షణం ఇది – దాన్ని అన్వేషించేకొద్దీ అది చేతికి అందదు – విస్తృతమవుతుంది. ఒక సంఘర్షణ మధ్యన నిలుచుని ‘ నేను సాధించాను ‘ అన్న మనిషి దాన్ని ఆ క్షణాన్నే పోగొట్టుకుంటున్నాడని అనాలి ” ఒక మంచి కవిత లాంటి మీ పరిచయం చదివాక ….. వెంటనే ఈ పుస్తకం చదవాలి అనిపిస్తుంది.

 9. Mythili Abbaraju says:

  తప్పకుండా చదవండి, ఆన్ లైన్ లో ఇ పుస్తకాలు గా ఉన్నాయి దాదాపుగా అన్ని నాటకాలూ. ‘ఎనిమీ ఆఫ్ ద పీపుల్’ మొన్న నే స్వాప్నిక్ చదివాడు, నచ్చింది :)

 10. S.Radhakrishnamoorthy says:

  Man and rebellion are born together.If he is offered freedom,he is tempted by bonds.If he is bound,he wd die to break the chains. That is the nature of the will. To will is to believe. ‘The atheist denies. The rebel defies.'(The Rebel:Albert Camus)

 11. Mythili Abbaraju says:

  Well said, sir.

మీ మాటలు

*