స్థిర కల్లోలిత

 

 

నిశీధి 

~

 

ప్రాణమా !

ఈ అర్ధరాత్రి నిదుర మరిచిన కళ్ళనిండా నీ జ్ఞాపకాలు నిండుతున్నపుడు మబ్బుల అలజడికి తాళలేని చినుకేదో ఆకాశాన్ని వీడి వెన్నెల్లో ఇంకిపోయినట్టు రెప్పల నిండా ఉలిక్కిపాటు . ఇప్పటికిప్పుడు కలలరెక్కలు తగిలించుకొని నీ కౌగిలి వెచ్చదనంలో గువ్వలా ముడుచుకుపోవాలనుకునేంత ఉద్వేగం . రోజంతా  నీ మృదుహాసం కోసం , మంద్ర స్వరంలో నువ్వందించే ఆ చిగురంత ధైర్యం కోసం , నీ  మాట వినగానే  సంతోషంగా  వెలిగే  నా మోహంలో కాంతికోసం ఎదురుచూస్తూనే ఉంటాను . వచ్చెయ్యి ! గుండె నొప్పులు కళ్ళలో  దాచుకొని ఎంతకాలం ఇలా , నేనున్నానుగా జీవితం పరుస్తాను , మనసు తలుపులు తెరచే ఉంచుతున్నాను అంటావు . సముద్రాల కవతల నీ గూడులో నాకింత చోటిస్తానని ప్రతిరోజూ బ్రతిమిలాడతావు . ఒక్క క్షణం స్వార్ధపు వలయం చుట్టుముడుతుంది , నాకోసమే  ఎదురుచూసే చినుకులలో తడిచి కొత్త సెలయేళ్ళు కట్టుకోవాలనిపిస్తుంది . ఉప్పు నీటి సముద్రాల్ని వదిలి తిమింగలపు హృదయానికో మంచి నీటి కొలను బహుమతిగా  ఇచ్చుకోవాలనిపిస్తుంది .

పక్కగదిలో పండుటాకులేవో ఊపిరిసలపక సతమవుతున్న అలికిడి , ఉలికిపాటులో నిన్ను  నీజ్ఞాపకాలని కలంతో మూతేసి కాసేపు గందరగోళం . రోజు ఉండేదే అయినా  సెకను పాటు వళ్ళంతా ప్రవహించే  భయం , రేపుదయం మా ముగ్గురికీ శుభోదయమేనా లేక ఈ  చీకటి  రాత్రి మరో కాళరాత్రవుతుందా అన్న ఊహ వెన్నులో జలదరిస్తూ గుండె చేరే సన్నని  నొప్పి . మన యవ్వనపు మొదటి పడిలో ఒకర్నొకరం  చేరి ఉంటే , బహుశ ఈ క్షణం నువ్వు ఊహలో కాకుండా  నన్నింకా హత్తుకొని పడుకుంటూ ఏం కాదులే అన్న ధైర్యపు ముద్దు మెడ వంపుకో స్థిరత్వాన్ని ఇచ్చేదేమో ? కాలం  ప్రవాహంలో ఇన్నేళ్ళ  వంటరితనాలు అలవాటయ్యాక , ఇపుడిలా  చుక్కలు కరువయిన  చీకటి ఆకాశాన్ని నెలవంక  వెలుతురులో మురిపిస్తున్నావు . ఎంత దోసిళ్ళు  నింపుకున్నా,  తనివి తీరదు. ఎపుడే మేఘం  ఆ ఆనందాన్ని  తన్నుకుపోతుందోనన్న గగుర్పాటు  కునుకు పడనివ్వదు .

~

నీకు టీం స్పిరిట్ లేదు , అందర్ని కలుపుకుపోవడం రాదు , నువ్వెప్పటికీ ప్రొఫెషనల్ నిర్ణయాలు సమయానికి  తీసుకోలేవు ఇలా అయితే  నీతో  కలిసి పనిచేయడం  కష్టం ముందు ముందు  అధికారపు పింక్ స్లిప్ బెదిరింపులు చివుక్కుమంటాయి . రాత్రింబగళ్ళు శ్రమ ఇంకొకరి చేతిలో  అవార్డుగానో , అతను మెచ్చిన  లలనామణి చేతిలో  రివార్డుగానో కనిపించినపుడు కూడా రాని నిస్పృహ కలుపుకుపోవడం  రాదు  అన్నప్పుడు  కళ్ళ వెంట  కారుతుంది .

ఎలా  చెప్పను పెద్ద సంఖ్య  నిండిన  కుటుంబాలలో మొదటి వారిగా  పుట్టకపోయినా బాధ్యతలెత్తుకొని సిబిలింగ్స్  అందరి జీవితాలకో కేర్ ఆఫ్  అడ్రెస్గా మారి , ఉద్యోగ హింసలు , ఆర్ధిక కష్టాలు , మానసిక వేదనలు వాళ్లై నిలబడి క్రుంగిపోయాక  ఐసియు బెడ్ల మీద మరణపు  అంచులలో లోపల వాళ్ళిద్దరూ , మసక వెలుతుర్ల హాస్పెటల్ కారిడార్లలో బయట వంటరితనపు నిర్ణాయాధికారాలలో మిగిలిన నేను .

మీకు  తెలియంది  ఏముంది  స్టంట్ వేయటం లాంటివి చాలా  ఖర్చుతో  కూడుకున్నవి , తర్వాత  మందులు కాస్ట్లీనే , చాల కాలంగా  డైయాబిటిస్ ఒకో కణాన్ని  తినేయడం  పైకి తెలియకుండా  కళ్ళ తో సహా  చాలా  నష్టం  జరిగింది . బ్రెయిన్ స్కాన్స్ కూడా చిన్న చిన్న క్లాట్స్ చూపిస్తున్నాయి , ఇమిడియట్గా  పెద్ద నష్టం  లేకపోవచ్చుకాని ముందు ముందు పసి పిల్లలని  చూసుకున్నట్టు చూసుకోవాలి . నిర్ణయం  మీదే అని తెల్ల కోట్లు  ఏసీ రూముల్లో కూర్చోబెట్టి  చెమటలు  పట్టించే  మాటలు చెప్పినప్పుడు . ఏడవడానికి కూడా  టైం లేదు . అప్పటి దాక  నవ్వుల్లో  వెంటాడిన చుట్టాలు పక్కాలు  ముఖ్యంగా స్నేహితులు తుఫానేదో మింగేసినట్లు మాయం అయ్యాక  చుట్టూ  మిగిలిన  నిశబ్దంలో నేను ఏ  టీం తో సంప్రదించి నిర్ణయాలు  తీసుకోవాలో అర్ధం కాకా మొదలయిన  ప్రయాణం  ఇప్పటికీ  ఎడేమెంట్ డెసిషన్లా సాగుతుంటే కలుపుకుపోవడం  ఎలానో ఇప్పటికీ  నేర్చుకోలేకపోతున్నాను . దెబ్బ ఒకసారి తగిలితే కదా . పడే పదే తగులుతున్నపుడు ఎలా  లేచి  ఎలా  నడవాలో బలవంతంగా  ప్రాక్టిస్ చేసిన వ్యాయామంగా మారక  . ఇపుడు నిన్ను నువ్వు మార్చుకోకపోతే స్నేహితులు మిగలరు లాంటి వాక్యాలు నిర్లిప్తతే తప్ప  బాధగా  ఏమి ఉండటం  లేదని

ఎవరికీ  చెప్పుకోలేనితనం .

~

ఇదంతా  నీకు  తెలుసుగా , ఎవరికీ  చోటివ్వని  మనసులో నిన్ను  దాచి , అక్కడ అదిమిపెట్టిన  ఎన్ని రహస్యాలు నీతో పంచుకున్నాను ? నువ్వుంటావన్న నమ్మకమేగా  అంత సాహసం నాతో  చేయించింది లేకపోతే పెదవి విప్పి నేనేమిటో  చెప్పిందేవరికి ఈ పదేళ్ళలో . కానిప్పుడు నువ్వో  కొత్త  విపత్తు పాతుకుపోయిన  కాళ్ళని తవ్వుకొని కొండలు దాటుదామంటావు , అలిసిపోయినప్పుడుల్లా  చెయ్యందిస్తానంటావు , ముందుకు వెల్దాం పదమంటూ ముద్దులు పెడతావు . నీకెలా చెప్పడం విత్తనాలు బ్రతుకుతాయి కాని మహావృక్షాలు వేర్లతో పెకిలించి  కొత్త చోట  నాటడం సాధ్యం కాదని , బలవంతంగా సాధించినా మన చేతుల్లో వాటి మరణానికి రోజులు  లెక్కెయ్యాలని  ఎలా  చెప్పడం  నీకు . మనిద్దరిలో  ప్రాక్టికల్  మనిషివి  నువ్వు కదా , అసలలా ఎలా  అడిగావు అని ఎంత మదనో , మళ్ళీ  అదంతా  నా పై ప్రేమగా అన్న ఓదార్పు . నా కలవరం , కల వరం  ఇహ నువ్వేగా .

ప్రవాస బాధల్లో సైతం బంధాలు  మర్చిపోలేని కొడుకు తనకోసం తనకి వండి వార్చి , ముందు పుట్టే వారసులకో ఆయా అవసరాలకి పైసా  ఖర్చులేని అమ్మ తనాన్ని  వాడుకోవడానికో ఏమో ముందు కాళ్ళకి బంధంలా విమానమెక్కబోతున్న తల్లి కోసం  చింత ఎలాగైనా కిటికీ  పక్క సీట్ ఇవ్వమని అక్కడనుండి పాపం  విడియో కాల్  చేసి మరీ ఫ్లైట్ అధికారులనో కోరిక కోరుతున్నాడు . మా అబ్బాయి మీతో మాట్లాడాలంట ఇదుగో  ఒకసారి  ప్లీజ్ అని నవ్వుమొహంతో ఫోన్ అందించిన అమ్మతనం నిండా ఇలాంటివి ఎన్నో చూసిన అనుభవం . కాన్వర్జేషన్ పూర్తి అవ్వగానే చివరగా మల్లెలు అన్ని  కుప్పపోసినట్లు చిరునవ్వుల శబ్దంలో  “ ఐ  నో  ఎవరీథింగ్ , బట్ వాట్ టు డు , మై  సన్ ఐజ్ లైక్  దట్ “ పుత్రోత్సాహపు మెరుపులు .  పదే పదే అదే పాట వినిపించి కనిపించి హిప్నటైజ్ చేసే అడ్వర్టైజ్మెంట్ కనికట్టు,  మనుష్యుల మధ్య  అనుభందాలని ఎత్తి చూపి అలా కనిపించకపోతే , ప్రవర్తించకపోతే అసలు మీ  బ్రతుక్కో అర్ధమేలేదని  మాటికి మాటికి నిరూపించే మాయాజాలం నింపుకున్న ఇడియట్ బాక్స్లో నిన్నో కొత్త యాడ్ , సెల్ ఫోన్ కంపెనీ సూపర్ కొడుకులు నాన్నలు  ఎలా కావాలో నయా మోడల్ సిద్ధం చేసి  జనం మీదకి  వదులుతుంది . మాములుగా  చిరాకే కాని  ప్రస్తుతం  నా మనస్థితి సరిగ్గా అలాగే  ఉండటం వలనో ఏమో మనసుకి హత్తుకుపోయింది అచ్చం  నీ  నవ్వులా .

ఏదో కలుక్కుమంటుంది లోపలెక్కడో . ఇంకొంత వయసు మిగిలే ఉందన్న నమ్మకంలో వదిలేయడం  సులువే . కాని వద్దన్నా  నాకిబ్బంది అని  వొంటిగా దగ్గరలో కూరల మార్కెట్లు వెతుకుతూ ఇల్లెక్కడో మర్చిపోయిన అల్జీమర్స్ ఈగలా ఎవర్ని అడగాలో అసలేమి అడగాలో కొద్ది సెకనుల  తడబాటు సిగ్గులో చితికిపోయే పెద్దరికాలని . ప్రతి రోజు గుర్తు చేస్తే  తప్ప మందులు కూడా  వేసుకోలేని  నిస్సహాయతలని , వివాహ వ్యవస్థ మీద నమ్మకంలేక పోయినా  వయసు వేడిలో  విసిగిపోయి వదిలేల్లిపోతుందేమో అన్న అపనమ్మకంలో చిన్న చిన్న అసహన యుద్ధాలు . టెక్నాలజీ అరచేతిలో  ఇమిడిన రోజుల్లో  సైతం మాకెందుకులే బంగారం నువ్వున్నావుగా , ఆ మెసేజీలు  అవి చూసుకోవడం కుదరదుకాని ల్యాండ్లైన్తోనే మా పని కానిద్దు అంటూ కొత్తగా నేర్చుకోవడాల వెనక నిరాసక్తతతో పాటు నేర్చేసుకుంటే దూరంఅవుతామేమొనన్న అనవసరపు బెంగలు .  నా వర్క్  టైం ముగిసిన  మరుక్షణం  నుండి వాకిళ్ళు నిండిపోయే ఎదురుచూపులు . ఇవన్నీ  వదిలి ఎలా రావడం నిన్ను  హత్తుకోవడం . ఒకవేళ స్వార్ధపు అతిపెద్ద  కుట్రలో సైతం కొన్నాళ్ళు నీ కోసం  ఎగిరొచ్చినా , అక్కడ తృప్తిగా  నీతో గడపగలనా . కలయిక లో మనం  ఏకమయ్యే  క్షణాన సైతం ఏ రింగ్ టోన్ ఏ వార్త మోస్తుందో దిగులేగా .

నిజం చెప్పనా  నువ్వు లేవన్న  దిగులు  తప్ప నిన్ను చేరలేనన్న బెంగ తప్ప నేను బాగున్నాను , చేపలు సముద్రంలో పక్షులు ఆకాశంలో నేను అమ్మ వడిలో భద్రంగా  ఉన్నాము . అప్పటి స్నేహితులు ఎవరన్నా  ఎలా   ఉన్నావు  అని అడిగినప్పుడు ఇప్పుడు ఇద్దరు పిల్లలు  నాకు , ప్రస్తుతం ఎల్కేజీ కొచ్చారు  త్వరలో డైపర్లు మార్చేంత ఎదుగుతారు . నాసాయం లేకుండా హాస్పేటల్ వెంటిలేటర్లు దాటలేరు  ముందు ముందు , అని పెదవుల నిండా  నవ్వుతో కళ్ళు  నిండిన కన్నీటితో గుండె నిండిన భారం దాచడం సులువేం కాదు .

ఎపుడో ఇంకోన్ని శిశిరాల వచ్చిపోయాక ,మనిద్దరిలో ఒకరం మరణపు మంచాల మీద చివరి శ్వాసలు  పీలుస్తూ ఉంటే మాత్రం  ఇంకొకరం బయట దిగులు మొహంతో పాత ఉత్తరాలు  చదువుకుంటూ ఉంటామన్న  నమ్మకం మాత్రమే ఇప్పుడిక మిగిలిన  ధైర్యం .

ఎప్పటికయినా  తిరిగొస్తావన్న ఆశ తో !

 

 • వోడాఫోన్ సూపర్ సన్ యాడ్ లో హుందాగా నవ్వుతూ ఒక్కసారయినా కలిసి  హత్తుకోవాలన్న వ్యక్తిత్వం మోమునిండిన ఓ వెన్నెల తల్లికి . మదర్స్ డే డెడికేషన్ .

మీ మాటలు

 1. Ravinder vilasagaram says:

  కథ కంటే కవిత్వం అధికమయింది. కవులు కథలు రాస్తే ఇలాగే ఉంటుంది మరి. నాకు నచ్చింది.

 2. kcube varma says:

  నిజం చెప్పనా నువ్వు లేవన్న దిగులు తప్ప నిన్ను చేరలేనన్న బెంగ తప్ప నేను బాగున్నాను , చేపలు సముద్రంలో పక్షులు ఆకాశంలో నేను అమ్మ వడిలో భద్రంగా ఉన్నాము .

  చాలా ఆర్థ్రతతో తల్లి మనసును ఆవిష్కరించారు. అభినందనలు

 3. Nityaa V says:

  మనిద్దరిలో ఒకరం మరణపు మంచాల మీద చివరి శ్వాసలు పీలుస్తూ ఉంటే మాత్రం ఇంకొకరం బయట దిగులు మొహంతో పాత ఉత్తరాలు చదువుకుంటూ ఉంటామన్న నమ్మకం మాత్రమే ఇప్పుడిక మిగిలిన ధైర్యం .
  ఈ స్థితిని ఊహించుకోవడం కష్టం…భరించలేని గుండె కోత ఇద్దరికీ…ఏ తల్లికీ రావొద్దు ఇటువంటి పరిస్థితి. అనుబంధాలు artificial అయిపోయిన ఈ రోజుల్లో ఈ మీ కథ కన్నీరు తెప్పించింది.

 4. V Jaya Chandra says:

  నిజం చెప్పాలంటే నాకు కవిత్వం పెద్దగా అర్ధం కాదు, అయినా కథని అర్ధం చేసుకొనే ప్రయత్నం చేసా.
  గుండె లోతుల్లోంచి ఆర్ద్రతని తోడే అమ్మ కథ.

 5. shrutha keerthi says:

  కవులే కథను యింత హృద్యంగా రాయగల్గుతారేమో..చాలా బాగుంది.అంతులేని కథ మూవీ గుర్తొచ్చింది పేరెంట్స్ కోసం తన త్యాగం చూసి.ఇలాగే చాలా కథలు రాస్తూ వుండండి.

 6. mithil kumar says:

  సముద్రంలో చేపలు ,ఆకాశంలో పక్షులు, అమ్మఒడిలో మీరు….మీ ఫ్లోలో కొట్టుకుపోయిన నేను….

 7. jhansi papudesi says:

  ఎవరికీ చెప్పుకోలేనితనాన్ని చాలా బాగా చెప్పారు. నిజానికి దాచుకోవడమే awesome ga vuntundi.

 8. నిశీధి గారు…మీ రచనని చది వాను…దీనినేమంటారు..కధ కాదు …దీనిని కవిత్వమనీ అనరు. ఇది ఓ హృదయం ఆర్తి తో తనని ప్రాణంగా కోరుకుంటున్న హృదయానికి హృదయం లో రాసుకున్న లేెఖ కదా!.ఏదైతే నేమి లెండీ..కానీ మీ లేఖలోని పాత్రలు గురించి! వారు నిజంగా ఉన్నారు…వారి దే ఈ బాధ అనిపించింది…తల్లిదండ్రుల వ్యాెధులు..తోడబుట్టినవారి.బాధ్యతలు. ఇవన్నీ తలకెత్తుకున్నా తీర్చినా బాధ్యతలు..తల్లిదండ్రులను.వదలకపోవడం న్యాయమే ఐనా…అప్పటివరకు మిగిలినవారికోసం జీవించిన తనకి న్యాయం జరగాలి…తన తోడుని ఇక్కడకు రమ్మని తన తోడుతో తల్లిదండ్రులని చూసుకోనాలని కోరుకుంటున్నా ..లేకపోతే ఏదో నాటికి తను ఒంటరవుతుంది…పుస్తకాలలో బాగుంటాయవన్నీ.మరణశయ్య లమీద ఉత్తరాలు చదువుకోటం…కానీ తను ఒంటరితనం భరించలేదు….తప్పక తను వెళ్ళాలి…తల్లిదండ్రులని తీసుకునో…లేక ప్రియుడినిక్కడికి రప్పించటమో…చేసితీరాలనిపించిందీ..లేెఖని చదువుతుంటే…

 9. lasya priya says:

  అసలు ఇంత అద్భుతంగా ఒక రచన ఉందీ అంటే ఎవరు రాశారు అని చూసుకొనవసరం లేదు ..అదీ మీదే నిశి మేడమ్ …అద్భుతం ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే రచన ఇది … సూపర్

 10. Srinivas Sathiraju says:

  నేనూ నిజంగా దయాబిటీసు వ్యాధి గ్రస్తుడిని అందుకే మీ కధతో మిళితం కాగలిగాను. చాలా కాలం తరువాత ఒక చక్కని కోణంలో మీ లోని నిజమయిన రచనా పరమైన పద్దతులు ఆవిష్కారమయ్యినందుకు ఆనందంగా ఉంది. మన కోసం రాసుకున్నా అందులో కలుపుకు పోయే అంశాలు ఉన్నప్పుడు తప్పకుండా కలిసే హృదయాలు ఉంటాయి నేను నా గోడ పై మీ మీద విరుచుకు పడిన సందర్భాలెన్నో ఉన్నాయి. కానీ ఈ రోజెందుకో మీ రచనలో స్త్రీతత్వం ముందు మోకరిల్లాలి అనిపిస్తోంది. మంచి భావాన్ని పిల్లి మొగ్గలు వెయ్యకుండా సూటిగా చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నా షో మస్టు గో ఆన్ మిమ్మలిని మీరుగా ఒక మనిషిగా అభిమానించే మీ మిత్రుడు

 11. Lokesh says:

  నిజాయితీగా చెప్పాలంటే నన్ను పెద్దగా ఆకట్టుకోలేదు.మీరు క్రియేట్ చేసుకున్న మీ స్థాయికి ఇది బాగా రొటీన్ అనిపించింది.అక్కడక్కడా కొన్ని అక్షరాల చమక్కులు తప్పించి చివరిదాకా చదివాక గుర్తుండేది/వెంటాడేది ఏమీ లేదు.

మీ మాటలు

*