పరవశం

 

-మమత కె.

 

గుక్కపట్టి  నువ్వు రాల్చిన పదాలకు దోసిలి పట్టి

మెరుగులు దిద్దుతూ అక్షరాలుగా విడగొట్టుకుంటాను

పదాలు, పల్లవై కోస్తాయని భయం

వాటి మధ్య పిడికెడు మట్టి కూరుతాను – నీవు నువ్వుగా నిలబడాలని సర్దిచెప్పబోతాను

నీకూ తెలుసు, అదంతా గడ్డిపువ్వుల మధ్యనుంచి తొంగిచూసే ఆమెను దాచిపెట్టాలనే

కంట్లో చిక్కుకున్న పదాలలోంచి ఆమె నవ్వుతుంది. దయగా.

ఆఖరికి

పద్యానికీ పద్యానికీ మధ్య ఖాళీలో నన్ను నిలబెట్టుకుంటాను. ఆమెనూ హత్తుకుంటాను.

అప్పుడు

కాసింత మట్టి మృదువుగా అంటుకుంటుంది నన్ను

నాన్న పిచ్చుక ఒకటి

నన్ను ముక్కున కరుచుకుని వెళ్లి గూడుకి అద్దుకుంటుంది

త్వరలోనే పిచ్చుక పాపాయిలు

అమ్మ పిచ్చుక తెచ్చిన బువ్వ తిని

వెచ్చగా నిద్రపోతారు

నన్ను ఆనుకుని

ఆనక

అమ్మలై నాన్నలై

సాగిపోతారు ఆకాశంలో

వాళ్ల రెక్కల్లో నన్ను ఇముడ్చుకుని

మీ మాటలు

 1. narayana swamy says:

  బాగుంది మమత – ఎత్తుగడ బాగుంది చాలా

  గుక్కపట్టి నువ్వు రాల్చిన పదాలకు దోసిలి పట్టి

  మెరుగులు దిద్దుతూ అక్షరాలుగా విడగొట్టుకుంటాను

  పదాలు, పల్లవై కోస్తాయని భయం

 2. Bhavani Phani says:

  మంచి కవిత . బాగుందండీ

 3. మమత కె. says:

  స్వామి, భవాని గారు – థ్యాంక్యూ

మీ మాటలు

*