జ్ఞాపకాలు రాలిపోయిన ప్రపంచంలోకి ….

 

 

 

–      నారాయణస్వామి వెంకట యోగి

~

 

 

ఒక కవిని నాకు చాలా యేండ్ల నుండీ  తెలుసు అనుకోవడం కంటే, తొలి యవ్వన రోజులప్పటి నుండీ  తెలుసు అనుకోవడం ఒక గొప్ప విషయం. అట్లా తెలవడంలో ఒక ఆనందమున్నది. సాధారణంగా కవిత్వం రాసేవాళ్ళు తొలియవ్వన రోజుల్లోనే మొదలు పెడతారు. అట్లా అని వేరే దశల్లో రాయడం మొదలు పెట్టిన కవులు లేరా అంటే చాలా మందే ఉన్నరు కూడా. కానీ తొలియవ్వన రోజుల్లో రాయడం ప్రారంభించిన కవుల్లో మనం వేరు వేరు దశలను చూస్తాం. ఒక యెదుగుదలను, ఒక క్రమబద్ధ పరిణామాన్ని చూస్తాం. కవి వయసులో యెదుగుతున్న కొద్దీ కవిత్వంలోనూ పరిపక్వత (మెచూరిటీ) కనబడుతుంది. ఇదీ అందరి విషయం లో  నిజం కావాల్సిన అవసరమూ లేదు. యెన్నేండ్లు రాసినా యే యెదుగుదలా లేని కవులూ ఉన్నరు.

తొలియవ్వనం లో కనబడే ఒక ఆవేశమూ,విసురూ, ఉద్వేగమూ అప్పుడు రాసే కవిత్వం లో సహజంగానే కనబడుతుంది.  తర్వాత,  తర్వాత,  జీవితంలో అనేక ఒడి దుడుకులు సంభవించినంక,అనుభవం అనేక పాఠాలు నేర్పినంక కవిత్వం లో ఒక సాంద్రత వస్తుంది. చిక్కదనం వస్తుంది. వయసు తాలూకు పుస్తకాల్లో చిక్కిన అనేక క్షణాలు పూల రిక్కలై, నెమలీకలై కవిత్వంలో పరుచుకుంటాయి. కవిత్వానికి ఒక గొప్ప అందం వస్తుంది. కవితలో ఒక్కొక వాక్యం ఒక అద్భుత సౌందర్యం తో అలరారుతుంది. అయితే ఆ సౌందర్యం ఊరికే తళుక్కుమని మెరిసి మాయమయేది కాదు. గొప్ప పరిపక్వత తో వచ్చే సౌందర్యం. మనల్ని ఒకటికి పది సార్లు ఆగి ఆలోచించేటట్టు చేసే బాధతో కూడిన సౌందర్యం. కవికి అనుభవం నేర్పిన జ్ఞానమూ, తాత్వికతా, భావ పరిపక్వత కవిత్వం లో ప్రతిఫలించి మన అనుభవాన్ని మరింత సాంద్రంగా చేస్తుంది. సంపద్వంతం చేస్తుంది. ఒక కవిత మొత్తం చదివాక అందులో కవి చెప్పినదే కాకుండా చెప్పనివి కూడా మనకు గోచరించి మన ప్రపంచం మరింత విశాలమవుతుంది. మన ఊహా శక్తి కొత్త ప్రపంచాలకు ప్రయాణం  చేసి కొంగ్రొత్త ఆకాశాలను స్పృశిస్తూ విస్తరిస్తుంది. కవి చదువరి,  ఐతే అధ్యయన శీలి ఐతే, ప్రజా ఉద్యమకారుడైతే, తన కవిత్వం లో మనం ఆనందించేదే కాదు, ఆస్వాదించేదే కాదు నేర్చుకోవల్సిందీ చాలా ఉంటుంది.

అట్లా నాకు తొలియవ్వన రోజుల్లో పరిచయమైన కవి సుధాకిరణ్. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం లో జే యన్ టీ యూ ఇంజనీరింగ్ కాలేజీ  హైద్రాబాదు లో మా తొలి పరిచయం. ఇద్దరం ఒకటే అభిప్రాయాలని పంచుకున్నం . ఒకే రాజకీయ కార్యాచరణలో భాగమైనం. నేను సాహిత్యం లోనుండి రాజకీయాలలోనికి వస్తే తను రాజకీయాలనుండి సాహిత్యం లోనికి కవిత్వం లోనికి వచ్చిండని చెప్పవచ్చు – కొంచెం అటూ ఇటూ గా! కిరణ్ ఒక గొప్పకమిట్మెంటు తో కవిత్వం రాసిండు. రాస్తున్నడు. ఇన్నేండ్ల తర్వాత మేము యెవరి జీవితాల్లో వాళ్ళం పడినంక, క్రియాశీలక రాజకీయాచరణ నుండి ఒకింత దూరమై కనీసం సాహిత్యం లో నైన క్రియాశీలకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నం ఇద్దరమూ బహుశా నాకంటే యెక్కువగా కిరణ్! కవిత్వాన్ని జీవితంలో భాగం చేసుకుని కవిత్వమే జీవితంగా తపిస్తూ, మనం కలలు కన్న కొత్త సమాజం కోసం కవిత్వం యేదో మేరకు తోడ్పడుతుందని నమ్మి కవిత్వ సృజన చేస్తున్నడు కిరణ్.

కిరణ్ ఒక నిర్దిష్ట సామాజిక లక్ష్యంతో కవిత్వం రాసినట్టనిపించినా ప్రతి కవితలోనూ ఒక వైయక్తిక అనుభవం అనుభూతి ఉంటుంది. కవిత వైయక్తిక అనుభవం తోనే ఆ నిర్దిష్ట అనుభూతి తోనే ప్రారంభమైనా (అది విప్లవోద్యమం గురించి రాస్తున్నప్పుడు కావచ్చు అమరుల కోసం రాస్తున్నప్పుడు కావచ్చు బాబన్న, మల్లారెడ్డి లాంటి అన్ సంగ్ హీరో లగురించి వారి అమరత్వం గురించి రాస్తున్నప్పుడు కానీ ముందు గుండెల్ని కదిలించే వైయక్తిక అనుభూతితో ప్రారంభమౌతుంది కవిత. అట్లా యెత్తుకుని ఆ అనుభూతిని విశ్వజనీనం చేస్తాడు, తాత్వీకరిస్తాడు. అయితే ఇప్పుడు కిరణ్ రాసిన ఒక వైయక్తిక కవిత గురించి చెప్పబోతున్నాను. రాజకీయ అభిప్రాయాలను కవిత్వం లో ప్రకటించి, ఒక స్పష్టమైన సామాజిక లక్ష్యం తో కవిత్వం రాసే కవుల పైన ఒక దురభిప్రాయం ప్రచారంలో ఉన్నది. అదేమంటే వీరికి సహజమైన వైయక్తిక అనుభూతులుండవు – అన్నీ రాజకీయ అభిప్రాయాలనే నల్ల కళ్ళద్దాలనుండి చూస్తరు. అసహజంగా రాస్తరు అని. ఈ దుష్ప్రచారాన్ని చాలా మంది కవులు గతంలో అన్ని అంశాల గురించీ అద్భుతమైన కవిత్వం రాసి తిప్పికొట్టినరు. ఆ కోవలోకే కిరణ్ రాసిన‘విస్మృతి’  కూడా వస్తుంది. సామాజిక బాధ్యతతో రాస్తున్న కవుల కవిత్వం పట్ల ఇది ఒక దురభిప్రాయమే అని మరో సారి శక్తివంతంగా నిరూపించినడు కిరణ్ ఈ కవితలో. అల్జైమర్స్ కు గురై తన కళ్ళ ముందే క్రమ క్రమంగా క్షీణించి శిథిలమై పోతున్న తన అమ్మ గురించి రాసిన ఈ కవిత గుండె తలుపులు తట్టి యెక్కడో లోలోపలి పొరలను కదిలిస్తుంది.

 

జ్ఞాపకాలకీ, గుర్తు తెలియని తనానికీ మధ్య

దిగంత రేఖలా చెరిగిపోయిన

సన్నటి కన్నీటి పొరలాంటి గీత.

 

జ్ఞాపకాలు

ఒక్కొక్కటిగా ఆకులవలె రాలిపోతూ

ఎన్నటికీ తిరిగి చిగురించని

శిథిల శిశిరపు కరకు జాడలు.

 

అని ప్ర్రారంభమైన కవిత మనల్ని జ్ఞాపకాలు నెమ్మదిగా  చెదిరిపోతూ,  మెల్ల మెల్లగా ఒక రకమైన మసక వెలుతులాంటి చీకటిలోకి మాయమైపోతున్న  అమ్మ ప్రపంచంలోనికి తీసికుపోతుంది. అట్లా చెపుతూ యెందుకు జ్ఞాపకాలు యెందుకు రాలిపోతున్నయో మరింత కవితాత్మకంగా చెప్తాడిలా ….

 

జ్ఞాపకాలు..

చినుకులు చినుకులుగా

నిస్సహాయంగా నేలకు జారిపోగా

గాలి ముందు దీపంలా దీనంగా

మోకరిల్లిన ముదిమి మేఘం

అలలు అలలుగా విస్మృతి విస్తరించిన

సముద్రమొకటి.

తలపుల కెరటాలు తరలిపోగా
దిగులు దీపస్తంభంలా నిలిచిన

కడపటి తీరమొకటి..

 

గాలిముందు దీపంలా దీనంగా మొకరిల్లిన ముదిమి మేఘమని వృధ్ధాప్యాన్ని అద్భుతంగా చెప్తూ రెండు ఉత్రేక్షలలో అమ్మ పరిస్థితిని చెప్తున్నాడు కవి – ఒకటి అలలు అలలు గా విస్మృతి విస్తరించిన సముద్రమనీ, మరొకటి తలపుల కెరటాలు తరలిపోగా మిగిలిన దీపస్థంభం లాంటి తీరమనీ. కవి ఇక్కడ,  సముద్రాన్నీ తీరాన్నీ,  విస్తరించే అలలనీ  తరలి పోయే కెరటాలనీ,  ఒకే అర్థాన్ని శక్తివంతంగా చెప్పడం కోసం వైరుధ్యంలా కనిపించే ఉత్ప్రేక్షలను వాడుతూ ఒకే ఒక విరోధాభాసతో మన ముందు అల్జైమర్స్ బారిన పడ్డ తన అమ్మ చిత్రాన్ని చాలా శక్తివంతంగా కళ్ళకు గట్టినట్టుగా గీసి మనల్ని ఆ ప్రపంచంలోనికి పూర్తిగా తీసుకుపోతడు. ఇక మనం పూర్తిగా కవితతో కట్టివేయబడి కవితో అమ్మ ప్రపంచంలో ప్రవేశిస్తం.

 

 

 

జ్ఞాపకాల వెలుతురు

కొద్ది కొద్దిగా కుదించుకుపోతుందో

విస్మృతి చీకటి

మెలమెల్లగా విస్తరిస్తుందో

జ్ఞాపకాలు

జడివానలో కొట్టుకుపోతాయో

జ్ఞాపకాలు..

కరిగి, యిగిరి, ఆవిరై, ఎగిరి పోతాయో

 

మళ్ళీ ఇందులోనూ వెలుతురు కుదించుకుపోవడం చీకటి విస్తరించడం (రెండూ ఒకటే అర్థమైనపటికీ) రెండు వ్యతిరేకార్థాలతో సమానార్థాన్ని వెలుతురు చీకటీ జ్ఞాపకాలూ విస్మృతులతో సూచిస్తూ ఒక భావైక్యతను సాధిస్తున్నాడు కవితలో.

 

అట్లా ఈ కవితలో ఒకే భావాన్ని సూచించడానికి  వైరుధ్యాల్లా కనిపించే ప్రతీకలు ఉత్ప్రేక్షలూ వాడుతూ కవి గొప్ప విజయాన్ని సాధించిండు. చెప్పదలుచుకున్న భావాన్ని మరింత శక్తివంతంగా చెప్పిండు.

 

చివరగా కవిత ముగిస్తూ ….

చీకటిలో కదలాడే నిశ్శబ్దపు

నీడలకై వెదుకులాట.

వెలుగులో  కనిపించని నక్షత్రాలకై

శూన్యాకాశంలో అన్వేషణ.

వూడలుదిగిన మర్రిచెట్టులాంటి రాత్రి

ఋతువులు లేని కాలమొకటి.

కాలం కాటేసిన తలపుల వాకిలిలో,  

తలుపులు మూసుకుపోయిన

మలిసంధ్య జీవితమొకటి…

 

ముందు చెప్పిన కుదించుకుపోయిన వెలుతురు చీకటిగా, చీకటిలో కదిలే నిశ్శబ్దపు నీడల్లా మారిపోతే, చీకటేమో  వెలుతుర్లో కనిపించని నక్షత్రాలైపోయి , మర్రిచెట్టు లాంటి ఊడలు దిగిన రాత్రిలో రుతువులు లేని కాలంలా వృధ్ధాప్యం మిగిలిపోయిందని భిన్నమైన పొరలు  పొరలుగా చిత్రాలని గీస్తాడు. చివరికి ‘కాలం కాటేసిన తలపుల వాకిలి’ అని మతిమరపు వ్యాధి (అల్జైమర్స్) కాటేసిన తన తల్లి మలిసంధ్య జీవితాన్ని తన తల్లిలాంటిపరిస్థితినే యెదుర్కొంటున్న వారి జీవితాన్ని అద్భుతంగా మనముందుంచుతడు. తన వైయక్తిక వేదనకు పరిస్థితికీ ఒక విశ్వజనీనతను తీసుకొస్తడు. అటువంటి పరిస్థితినెదుర్కొంటున్న వారిని మనకు పరిచయం చేసి మన కంటనీరు బెట్టిస్తడు. తలుచుకుని దుఃఖింపజేస్తడు.

కవి ముఖ్యంగా కవితలో సాధించినది,   వైయక్తికతను విశ్వజనీనం చేయడం – అదీ పరస్పరం విభిన్నాలనిపించే ప్రతీకలతో ఉత్ప్రేక్షలతో సమానార్థాన్ని సాదిస్తూ  మన ముందు ఒక భిన్న పొరలు గల చిత్రాన్ని ఆవిష్కరించడం. హృదయాన్ని మెలితిప్పే అనుభవాన్ని కవితగా  మనలో  భాగం చేసిన కవి  సుధాకిరణ్ ను అభినందించకుండా ఉండలేము. ఈ కవితలో కవి చెప్పిన దానికన్నా యెక్కువగా చెప్పనిదే ఉన్నది – చెప్పని, మనకు తెలియని ఒక కొత్త ప్రపంచమూ దాని అనుభూతుల పొరలూ ఇంకా అనేకం ఉన్నయి. మనం కవితను నిదానంగా మన ఆలోచనల్లోకి ఇంకించుకున్నప్పుడు మన అనుభూతిలోకి వస్తుందా కొత్తప్రపంచం. కాలం కాటేసిన తలపుల ప్రపంచం –జ్ఞాపకాలు రాలిపోయిన యెండు మోడుల ప్రపంచం.

మీ మాటలు

 1. k v kurmanath says:

  బాగుంది, స్వామీ. నాకు ఇష్టమైన వ్యక్తుల్లో సుధాకిరణ్ ఒకరు. You like people for a reason . సుధాకిరణ్ వ్యక్తిత్వం నాకిష్టం. కవిత్వం, పఠనాసక్తి కూడా.

 2. kcube varma says:

  మీ పరిచయం మంచి అనుభూతిని పంచింది సర్..

 3. Aranya Krishna says:

  చాలా మంచి పరిచయం. ఏం విప్లవ కవులకి మాత్రం మనసుండదా? దానికి గాయాలవ్వవా? హృదయముండదా అది స్పన్దించదా? ఒక వేదనామయ అనుభూతినిచ్చిన కవిత ఇది.

 4. K N RAU says:

  “ఇన్నేండ్ల తర్వాత మేము యెవరి జీవితాల్లో వాళ్ళం (స్థిర) పడినంక, క్రియాశీలక రాజకీయాచరణ నుండి ఒకింత దూరమై కనీసం సాహిత్యం లో నైన క్రియాశీలకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నం” బాగుంది కదూ ఈ confession . కానీ “సాహిత్యంలో నైనా” అనడం నిందా వాచకం గా కన్పించడం లేదు ? సాహిత్య వ్యాసంగమొక కబుర్ల కార్ఖానగా భావించినట్లు లెదూ?

 5. narayana swamy says:

  కూర్మనాథ్ వర్మా అరణ్యా – మీకు నచ్చినందుకు నెనర్లు

  రావు గారూ – మీ కట్లా అనిపించిందా?

 6. మమత కె. says:

  విశ్లేషణ చాలా బాగుంది స్వామి. Haunting poem. Poetry reached the zenith. kudos to Sudha Kiran

 7. narayana swamy says:

  మమత – నీకు నెనర్లు

 8. Haunting poem. Great analysis.

 9. narayana swamy says:

  బాబా గారూ – మీకు నచ్చినందుకు నెనర్లు

 10. Vilasagaram Ravinder says:

  గొప్పగా ఉంది సర్ విశ్లేషణ.

 11. lasya priya says:

  అద్భుతంగా చెప్పారు సర్ .. మంచి విశ్లేషణ …/\….

 12. విమల says:

  స్వామీ ఇప్పుడే చదివా. చాలా చక్కగా రాసావు. కిరణ్ కవిత్వంలో చాలా సాంద్రత, ఒక తాత్విక అన్వేశణ, వుంటాయి. పొయటిక్ ఎక్స్ ప్రెషన్ అందంగా, సున్నితం గాను ఉంటుంది. విషయం పట్ల స్పష్టత, కవిత్మాకత కలిగిన అరుదయిన కవి కిరణ్ అని నా అబిప్రాయం. కవిత్వం , సాహిత్యమూ నాకు పెద్దగా తెలీవని బిడియం గా నవ్వేసే కిరణ్ కి ఆ రెంటిలో కూడా యెంత లోతయిన పరిజ్ఞానం ఉందో ఆయనతో పరిచయం ఉన్న వాల్లందరికీ బాగా తెలుసు. మీ తొలి యవ్వన రోజులప్పటి నుండీ మీ ఇద్దరూ నాకు తెలుసు. మీ ప్రయాణాన్ని చూసినప్పుడు నాకు సంతోషం గాను, ఒకింత గర్వంగానూ ఉంటుంది.

  ప్రేమతో
  విమల

 13. narayanaswamy says:

  రవీందర్ గారూ లాస్య గారూ మీకు నచ్చినందుకు సంతోషం – నెనర్లు మీకు

  విమలక్క – మీరన్నది అక్షరాలా నిజం – మీతో కలిసి ప్రయాణించామ్ కదా ఇద్దరం – మీ ప్రభావము మా మీద ఉంది – మీ మార్గదర్శకత్వమూ మాకెంతో ఉపయోగపడింది – మీకు నేను రాసినది నచ్చడం చాలా ఆనందం కలిగించింది – మీకు నా నెనర్లు!

 14. ఎ కె ప్రభాకర్ says:

  గుండె కదిలించే కవితకి అంతే చక్కటి విశ్లేషణ. చాలా బాగుంది .

మీ మాటలు

*