కరువు కాలం

 

 

-ప్రసాదమూర్తి

~

 

ఒక బావురు కప్ప

మనిషిని చూసి బావురుమంది

గుక్కెడు నీళ్ళు దొరకడం లేదని కాదు

గుండెలో చుక్క నీరు కూడా నీకెందుకు కరువైందిరా అని

కప్ప చకచకా బెకబెకామంది

 

ఎంత కరువొచ్చి పడిందిరా బాబాయ్

కూటికీ నీటికీ మాత్రమేనా !

అంతా కరువేరా

మాటల్లో మాటకి కరువు

నవ్వుల్లో నవ్వుకి కరువు

స్పర్శల్లో స్పర్శకి

మనుషుల్లో మనిషికి కరువు
ఎంత కరువొచ్చి చచ్చిందిరా

ఏం కాలమొచ్చిందిరా అబ్బాయ్

ఒక పశువు మనిషిని తిట్టింది

మేం తినాల్సిన గడ్డి నువ్వు తింటున్నావ్

అందుకే మేత కరువై మేం కబేళాలకు పోతున్నామంటూ

పశువు ఖాళీ నోటితో నెమరేస్తూ కసురుకుంది
ఏం కరువు కాలంరా అబ్బిగా

మాయదారి కరువు..మహమ్మారి కరువు

చట్టసభల్లో చట్టానికి కరువు

న్యాయాలయాల్లో న్యాయానికి కరువు

నేతల్లో నీతికి..

పాలకుల్లో పాపభీతికీ కరువొచ్చి చచ్చిందే
రాళ్ళు బద్దలవుతున్నాయి

ఊళ్ళు దగ్ధమవుతున్నాయి

పొలాలు హలాల్ అవుతున్నాయి

జలాలు ఆకాశ ఫలాలవుతున్నాయి

కరువురా కరువు.. పైనా కిందా చుట్టూ అంతా

ఎంత కరువొచ్చి వాలిందిరా నాయనా

చెట్టు మనిషిని ఛీత్కరించుకుంది
ఉద్గారాలు ఊదుతున్నాడని కాదు

కడుపులో కాసింత పచ్చదనానికే

ఎందుకు కరువొచ్చి కొట్టుకుంటున్నావురా అని

నీడల చేతులతో చెట్టు మనిషి చెంప ఛెళ్ళుమనిపించింది

కరువే..కష్టకాలమే..కోరల చారల దెయ్యం కాలమే
ఆపమనండిరా వాళ్ళని ఆ చావులెక్కలు ఆపమనండి

లెక్కించాల్సింది ఆత్మహత్యలనో ఆకలి చావులనో కాదు

హంతకులను లెక్కపెట్టమని చెప్పండ్రా

గుర్తించాల్సింది కరువు పీడిత ప్రాంతాలను కాదు

వాటి మహారాజ పోషకులను పోల్చుకోమనండ్రా
పాడుకాలం..చేటుకాలం

కరువు కరువు కరువు కరువు కాలం..

మీ మాటలు

 1. Ravinder vilasagaram says:

  కరువు కరువు కరువు
  మా మాటలూ కరువు మూర్తి గారు

 2. THIRUPALU says:

  అవును మాటలకు కూడా కరువైపోయింది మాకు.

 3. Knvmvarma says:

  karuvochchimdi

 4. నిజమే ,అన్నిటికీ కరువే …చాలా బాగా స్పందనతో రాశారు ధన్యవాదాలు ప్రసాదమూర్తిగారూ

 5. SREEKANTH SODUM says:

  కవిత చాలా బాగుంది. మనిషి కల్తీ ఐనాక అంతా కల్తీ ఐనట్లు అసలు కరువు మనిషి లో తడార్నాక వచ్చిందని సెప్పడం బాగా నచ్చినాది.

 6. Buchireddy says:

  అంత గొప్పగా. మూర్తి. గారే. రాయగలరు
  ——–_——————-
  Buchi reddy gangula

మీ మాటలు

*