కన్నీటి కవితలో జీవితప్రహేళిక

 

-ఏల్చూరి మురళీధర  రావు 

~

 

కంఠంలో శోకవిషాదాల దుర్భరవిషాన్ని దిగమ్రింగి మానవాళి మనుగడకోసం తన వేదనానివేదనను అజరామరమైన అశ్రుగీతిగా మలచిన ఛు యువాన్ ప్రపంచ మహాకవులలో మహనీయుడైన మహాత్మకవి. చైనీయ సాహిత్యమహీభరం మొత్తాన్ని మోస్తున్న మహోన్నత మహీధరం ఆయన. వాఙ్మయసరస్సుకంతటికీ అందాలను అలవరిస్తూ వేయిరేకులతో పూచిన పుండరీక పుష్పం. సారస్వతవ్రతుల అంతరంగ తేజోమయలోకానికి నిండువెలుగును ప్రసాదిస్తున్న ప్రకృష్ట ప్రభామండలం. చిరంతన మధురకవితావాయువులు కొనివచ్చిన సురభిళ పరిమళం. సాహిత్యాకాశంలో సర్వోపరిగా వెలుగొందే ధ్రువతార.

ఛు యువాన్ క్రీస్తుకు పూర్వం 340-వ సంవత్సరంలో జన్మించాడు. రక్తసిక్తమైన చైనా రాజకీయచరిత్రలో పెనుగడ్డుకాలం అది. అప్పటికి చైనీయ పంచకావ్యాలలో చివరిదైన వాసంత శరత్సమాపన సంచికల(Spring and Autumn Annals) సంపుటీకరణ పూర్తయింది. ల్యు దేశపాలకులైన ఝావో రాజవంశీయుల విక్రమలీలలు, ఆనాటి వీరుల విశ్వవిజిగీష, విశాల రాజ్యవిస్తరణ గాథలు, అర్హపూజాదులలో సాంప్రదాయిక బలిసమర్పణవిధానం, జానపదుల ఆచారవ్యవహారాలు, వివిధ దేవతారాధనప్రక్రియలు, స్వర్గమర్త్యలోకాలలోని స్త్రీపురుషసంబంధాలను సజాతీయంగా ప్రతిబింబించే ప్రభావశీలి కథాచిత్రణలతోపాటు ప్రకృతివైపరీత్యాలతో సతమతమై, సంకులసమరాలతో తల్లడిల్లి కాందిశీకులైన సామాన్యుల జీవితం అల్లకల్లోలమైనప్పటి దుఃఖానుభవపరంపర సార్వజనీనంగా నిరూపితమైన మహారచనమది. భూస్వామ్యమదోన్మత్తుల నిర్విరామ యుద్ధోన్మాదం పట్ల వైముఖ్యాన్ని కలిగించే ఆ సంపుటి వల్ల ప్రభావితుడైన ఛు యువాన్ పెరిగి పెద్దయాక తననాటి ప్రభుసమాజంలోని ఒక్కొక్కరిచేత తిరుగులేని శాంతిపత్రం మీద సంతకం చేయించాలని ఆరాటపడటం సహజమే.

అప్పటికి – అంటే క్రీస్తుకు పూర్వం 770-403 మధ్య అని ఒకనాటి చరిత్రకారులు, 771-476 అని ఆధునికులు నమ్ముతున్న తరుణానికి – ఒకప్పుడు తీవ్రభయావహమైన చైనీయ ద్వాదశ రాజ్యాల ప్రాబల్యం క్రమక్రమంగా అంతరించిపోయింది. ఎడతెరిపి లేక సాగిన ఆనాటి మారణహోమాల ఫలితంగా క్రీస్తుపూర్వం 403-221 సంవత్సరాల నడిమికాలంలో మునుపటి ఆ రాజ్యాలు పన్నెండూ – మళ్ళీ పెద్దచేపలు చిన్నచేపలను మింగటం పూర్తయాక పునర్విభక్తాలై – మొత్తం ఏడు రాజ్యాలయ్యాయి. పశ్చిమ సరిహద్దులో వీ ద్వీపకల్పం చుట్టూ చీన్ మండలం నెలకొన్నది. దానికి ఈశాన్యాన ద్వాదశ రాజ్యాల కాలంలో ప్రముఖమైన ఒకనాటి త్సిన్ రాజ్యమే హాన్, ఛావో, వీ అన్న మూడు రాజ్యాలుగా ముక్కలయింది. తూర్పున ఛి; దక్షిణాన ఛు; ఇంకా యెన్ మండల ప్రాంతం వెలిశాయి. ఈ ఏడింటిలో చీన్ రాజ్యం అన్నింటికంటె శక్తిమంతమైనది. యాంగ్ త్సె నదీలోయలోని ఛు రాజ్యం అతివిశాలమైనదే కాని, ఛి రాజ్యం షాన్‌టుంగ్ ద్వీపకల్పానికి చేరువలో ఉండటం వల్ల మత్స్యసంపదకు, లవణోత్పాదనకు పేరుపొంది వాణిజ్యమూలకంగా బలపడింది. వీటన్నిటికీ ఆధిపత్యపోరు మొదలై నానాటికీ ఘోరం కాసాగింది. ఆస్తినష్టానికి, జననష్టానికి దారితీస్తున్న ఆ యుద్ధాల ఫలస్వరూపంగా రాజ్యాలన్నింటిని ఒక్క గొడుగు పాలన క్రిందికి తెచ్చి అవిభాజ్య చైనా మహాసామ్రాజ్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. చరిత్రలో ‘పోరాట రాజ్య యుగం’ అని చెప్పబడే దుష్కాలం అది.

చైనీయ నాగరికతకు పుట్టినిల్లయిన హ్వాంగ్ హ నదీపరీవాహకప్రాంతంలో జనసమ్మర్దం అధికంగా ఉండేది. నీటిచాళ్ళ వద్ద కొంగలు బారుతీరినట్లు దగ్గర దగ్గరగా తీర్చిదిద్దినట్లుండే ఇళ్ళు, అంతకంటె సన్నిహితంగా మనుషుల మనస్సులు, శ్రేయోరూపకమైన సహజీవనం, ఆత్మీయతలూ ఆప్యాయనాలకు పెట్టింది పేరయిన ప్రాంతమది. ఛు రాజవంశీయుడైన ఛు యువాన్ జన్మించేనాటికి యెన్ రాజ్యం సరిహద్దున లియాఓటుంగ్ ద్వీపకల్పం, కొంత వరకు ఉత్తర కొరియా ఈ పోరాట రాజ్య యుగపు యుద్ధవాతావరణానికి దూరంగా ఉండేవి. మానవాళికి అభ్యుదయానందోల్లాసకరాలైన సంగీత సాహిత్య చిత్ర శిల్ప గానకళలు వెల్లివిరిసిన చోట్లవి. చదువుసాములకు పుట్టినిళ్ళు. అక్షరాస్యులు ప్రాచీనకావ్యసంపదను కాపాడుతుండేవారు. పట్టణవాసపు కృత్రిమ నాగరికత ప్రభావం, అస్తిత్వపు పెనగులాటలు లేక ఇంద్రియశాంతికి పట్టుగొమ్మలయిన ఆ పరిసరాల మట్టివాసన ముక్కుపచ్చలారని వయసులో ఆయన ఊహలకు రెక్కలు తొడిగింది.

రాజవంశానికి చెందినవాడని ఛు యువాన్ అంటే రాజు హ్యూవాయ్ కి మక్కువ కలిగింది. లోకజ్ఞుడు, విద్యావంతుడు కాబట్టి సమస్యలు తలయెత్తినపుడు వివేకంతో వ్యవహరింపగలడని నమ్మకం కుదిరింది. మంత్రివర్గంలో ఉన్నతపదవిని అప్పగించి రాజ్యతంత్రాన్ని నడపమన్నాడు. ఛు యువాన్ విశ్వాసపాత్రుడై మెలగుతూ ప్రభువుకు సన్నిహితుడయ్యాడు. రాజ్యంలో శాంతిభద్రతల రక్షణ నిమిత్తం కృషిచేశాడు. ప్రజోపయోగకర చట్టాలను రూపొందించటంలోనూ, ప్రభుత్వ విదేశాంగవిధానాన్ని తీర్చిదిద్దటంలోనూ తోడ్పడ్డాడు. సమర్థుడని పేరుతెచ్చుకొన్నాడు.

image1 (1)

అప్పటికే ఛు రాజ్యం పతనావస్థలో ఉన్నది. అవినీతిపరుడు, పరమక్రూరుడు అయిన హ్యూవాయ్, అతని చుట్టూ చేరిన స్వార్థపరులైన దళారీలు – ఛు యువాన్ ప్రగతిశీలభావాలను చూసి ఆందోళన చెందారు. ప్రజల సంక్షేమంకోసం పాటుపడుతూ ఎప్పటికప్పుడు రూపొందిస్తున్న వినూత్నపథకాల వల్ల ఆయనకు కలుగుతున్న ఆదరణను చూసి సహింపలేక – అడుగడుగున అడ్డుపడుతూ, లేనిపోని అవరోధాలను కల్పిస్తూ జీవితాన్ని నరకప్రాయం చేశారు. తను ఎదురుచూస్తున్న కాలపు కొత్తకెరటం తీరాన్ని చేరలేకపోతున్నదని తెలిసినా, జాతి భవితవ్యం మీది నమ్మకంతో ఛు యువాన్ రానున్న మంచిరోజులకోసం ప్రతీక్షిస్తూనే ఉన్నాడు.

చీన్ రాజ్యం నుంచి తమకు ప్రమాదం పొంచి ఉన్నదని ముందుగానే గుర్తించి, దానితో పొత్తు కుదుర్చుకోవటం మంచిదని ఛు యువాన్ భావించాడు. రాజు చుట్టూ చేరిన దళారీలకు, స్వప్రయోజనపరులకు ఆయన సూచన నచ్చలేదు. రాజుకు సలహాదారుగా ఉన్నతోద్యోగంలో ఉన్న త్జె ఛియావో, ఛు యువాన్ రాజకీయప్రత్యర్థి అయిన రౌతు నాయకుడు చీన్ షాంగ్, పట్టపు రాణి ఛెంగ్ హ్సీయు వంటివాళ్ళు శాంతి రాయబారాలు సాగకుండా ముందుకాళ్ళకు బంధం వేశారు. చీన్ దౌత్యాధికారి చాంగ్ యీ నుంచి లంచాలు మరిగి అధికారులు ఛు యువాన్ పలుకులను పెడచెవిని పెట్టారు. ఊహల పల్లకీలో పట్టుబాలీసులమీద పడుకొని ఎల్లకాలం స్వప్నలోకంలో సంచరించే మాటలమారికి ప్రత్యక్ష రాజకీయాలతో పనేమిటని రాజు చెవిలో ఇల్లుకట్టుకొని నూరిపోశారు. రాజు మనసు మారింది. వాళ్ళ కల్లబొల్లి మాటలు నమ్మి ప్రాణం మీదికి తెచ్చుకొన్నాడు. చేతిలో చేయివేసి చెలిమిచేస్తారని చీన్ దేశానికి స్వయంగా బయలుదేరి శత్రుకూటమి వద్ద బందీ అయ్యాడు.

చీన్ రాజ్యంలో హ్యూవాయ్ రాజకీయఖైదీగా ఉన్నప్పుడు ఉత్తరాధికారిగా వచ్చిన అతని కొడుకు చీంగ్ హ్సీయాంగ్ తండ్రికంటె అసమర్థుడైన రాజు. తిరుగుబాటు జరిగినపుడల్లా ఒక్కో సరిహద్దులో ఓడిపోయి ఎంతోకొంత భూమిఖండాన్ని పోగొట్టుకోవటమే తప్పించి ఎన్నడూ యుద్ధరంగంలో గెలిచి యెరుగడు. అతను రాచరికం చేపట్టిన ఇరవైఒక్క సంవత్సరాల కల్లోలకాలం తర్వాత – అంటే క్రీస్తుపూర్వం 278లో ఉన్నట్లుండి చీన్ సైన్యాధ్యక్షుడు పాయ్ చీ సాక్షాన్మరణదూత లాగా దక్షిణపు సరిహద్దు నుంచి విరుచుకుపడ్డాడు. దారుణమైన ప్రాణనష్టం జరిగింది. పంటపొలాలు ధ్వంసమయ్యాయి. ఛు రాజ్యం ఆ చావుదెబ్బ నుంచి తేరుకోలేకపోయింది. మరో అర్ధశతాబ్ది నాటికి రూపనామాల అవశేషాలు లేకుండా అంతరించిపోయింది.

ఛు యువాన్ కవితలలో అధికభాగం ఆయన ప్రతిపాదించిన ప్రజాసంక్షేమవిధానాలు రాజతిరస్కృతాలైన తర్వాత మనసు చెదిరి చింతాక్రాంతుడైనప్పటి చీకటిరోజులలో రచింపబడినవి. పాయ్ చీ దేశరాజధానిలో ఘోరకలిని సృష్టించిన రోజులలో ఆయన అజరామరమైన తన కన్నీటి కవిత ‘ఆక్రోశము’ (లి సావో) ను వ్రాశాడు. అప్పటికాయన వయస్సు అరవైరెండేళ్ళు. పదవీవిరమణ చేసి రెండు దశాబ్దాలు దాటినా మనసుకు సరైన విశ్రాంతి సమకూడలేదు. తన కళ్ళతో దేశాభివృద్ధిని చూడగల మంచిరోజులు రాగలవని ఆయనకు అనిపించలేదు. ఏదో తెలియని అలజడితో ఉక్కిరిబిక్కిరయాడు. శాంతి లేకపోయింది. తన శక్తియుక్తులతో అగతికమైన లోకానికి మార్గదీపనం చేసిన మేధావితల్లజుడు, పాలనావ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకుల సారవిచారం చేసిన రాజనీతివిశారదుడు, స్వానుభవంలో సుఖదుఃఖాల కడపటి అంచులను చూసిన దార్శనికుడు – రాజ్యంలో అధర్మం తాండవించి, జీవితంలో అగమ్యగోచరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు కర్తవ్యాకర్తవ్యాల అంతస్సంఘర్షణను తట్టుకోలేక – క్రీస్తుకు పూర్వం 278 నాటి డ్రాగన్ సంవత్సరం ఐదవ నెల, ఐదవ రోజున హ్యూనాన్ లోని మీలో నదిలో దూకి జీవయాత్రను చాలించాడు.

2

ఛు యువాన్ జీవితమంతా విషాదమయంగానే గడిచింది. రాజకీయవేత్తగా భరింపరాని ఓటమిని చవిచూసినవాడు అక్షరజగత్తులో తిరుగులేని గెలుపును సాధించాడు. కష్టజీవులకోసం కాలాతీతకావ్యశిల్పానికి ప్రాణంపోసిన కవిగా ప్రజల ఆత్మీయతకు నోచుకొన్నాడు. చరిత్ర పుటలలో చిరంజీవి కాగలిగాడు. ఛు రాజ్య ప్రజానీకమే గాక చైనా దేశీయులందరూ మేదురమైన ఆదరం చూపి మెప్పుల కుప్పలలో ముంచెత్తారు. రెండున్నరవేల యేండ్ల సుదీర్ఘమైన కాలపు గీటురాయిమీద ఆ ఆదరాభిమానాలు అణుమాత్రమూ తరుగులేక మెరుగులీనుతూనే ఉన్నాయి. ప్రతియేటా చాంద్రమానానుసారం ఐదవ నెలలో ఐదవ రోజున ఛు రాజ్యవాసులు ఆయన నీటిలో తన భౌతికజీవితాన్ని చాలించినందుకు గుర్తుగా దేశమంతటా డ్రాగన్ పడవ పోటీలను నిర్వహించి నివాళులను అర్పిస్తారు. నిడుపైన వెదురాకుజొంపంలో కట్టిన నమీ ఫాయీఁ అనబడే బియ్యపు పిండిని నీళ్ళలో ఉడకబెట్టి, ఉండ్రాళ్ళ వంటి వంటకంతో నైవేద్యాన్ని సిద్ధంచేసి – డ్రాగన్లు, గండుచేపలు ఛు యువాన్ దేహాన్ని ఆహారంగా స్వీకరింపరాదని ప్రార్థనలు చేస్తూ – జలచరాలకు అర్పణగా నదిలోకి విడిచిపెడతారు. ఆ తర్వాత బంధుమిత్రులతో కొలువుతీరి విందుభోజనం చేస్తారు. చైనీయుల ఈ సత్సంప్రదాయం క్రమంగా కొరియా, జపాన్, వియత్నాం, మలయా దేశాలకు కూడా వ్యాపించింది.

లోకంలో ఎవరికీ దక్కని ఈ అరుదైన గౌరవం ఛు యువాన్ తన ప్రజల పట్ల చూపిన ప్రేమాతిశయం మూలాన, దేశభవితవ్యం కోసం తపించిన అంకితభావపు లోతుపరపుల వల్ల సంప్రాప్తించింది. రాజవంశీయుడైనప్పటికీ ఆయన సామాన్యప్రజానీకపు కష్టసుఖాలతో మమేకం అయ్యాడు. రెండువేలయేళ్ళ క్రితం ఫ్రాక్తన చైనీయభాషలో ఆయన ప్రకాశింపజేసిన భావాలివి:

దుఃఖమున వంగి, కష్టసందోహ నిత్య

భయముచేఁ గ్రుంగియున్న నా ప్రజలఁ గాంచి

నేత్రయుగళినిఁ దొలఁకు కన్నీరు దుడిచి,

పేర్చిన యనుతాపమున నిట్టూర్చినాఁడ.                  (‘ఆక్రోశము’)

కదలిపోయితి నా వారి కష్టములకుఁ;

గదలఁబో నిఁక నీ జన్మపదము విడిచి.              (‘చెదురుమదురు ఆలోచనలు’)

అని. ఏ మహాత్ముడు తమ అభ్యుదయంకోసం నితాంతదుఃఖోద్విగ్నుడై యావజ్జీవం పరితపించాడో, ఆ మహాత్ముని ప్రజలు కృతజ్ఞతతో గుర్తుంచుకొన్నారు. ఆయన కవిత్వం తరతరాల పాఠకులకు లక్షణశాస్త్రం కాగలిగింది.

ఛు యువాన్ కవితలలో నిండైన నిజాయితీ ఉన్నది. తాను మనఃపూర్వకంగా ఆదర్శమని దేనిని నమ్మాడో, ఆ ఆదర్శాన్ని అత్యంతనిష్ఠతో ఆచరించి నిజానిజాలను నిర్ధారించుకొన్న తర్వాతనే జనాళికి అవశ్యకర్తవ్యంగా మలిచి చెప్పాడు. కొలువునుంచి బహిష్కరింపబడి ఇరవైయేళ్ళ పైచిలుకు కాలం అజ్ఞాతవాసంలో గడిపినప్పటికీ – ఎట్టి పరిస్థితిలోనూ జన్మభూమిని విడనాడకూడదన్న కృతనిశ్చయంతో ఉన్నాడు. “కదలిపోయితి నా వారి కష్టములకుఁ, గదలఁబో నిఁక నీ జన్మపదము విడిచి” అని  ప్రకటించాడు. తన దేశమంటేనూ, దేశప్రజలంటేనూ ఆయనకు గల భావబంధం అటువంటిది. అవ్యక్తుల మూలాన కలిగిన అవమానాలను సైరించి ఆత్మత్యాగానికైనా సిద్ధమయ్యాడే కాని తన ప్రజలనూ, ఛు రాజ్యాన్నీ విడిచిపెట్టడం మేలన్న ఆలోచన ఆయనకు రాలేదు. అంతగా ప్రజల గౌరవాభిమానాలను ఎట్లా పొందగలిగాడో అర్థం చేసుకోవటం సులభమే.

ప్రజల పట్ల పెంచుకొన్న గాఢమైన ఆ ప్రేమాతిశయమే ఛు యువాన్ కవిత్వంలో దీప్తమైన అభివ్యక్తిని పొందింది. ఆయన పేరుమీదుగా మొత్తం ఇరవైఅయిదు కవితలు లభిస్తున్నాయి. అందులో పదకొండు కవితలు ఓడ్ ఛందస్సులో వివిధ దైవతాలకు సమర్పితమైనవి. ఆధునిక సాహిత్యవేత్తలు కొందరు ఈ కవితలన్నీ వేర్వేరు కాలాలలో వెలసిన జానపద గీతికలు కావచ్చునని, ఏ ఒక్క కవీశ్వరుడో తన హృదయవీణపై శబ్దపు తంత్రులను మ్రోగిస్తూ పలికిన మధురస్వరసంగతులు కాకపోవచ్చునని వివదించారు కాని, ఛు యువాన్ కు సమీపోత్తరకాలికులైన హాన్ రాజవంశీయుల పరిపాలన కాలం నాటినుంచి మహాకవులను ప్రభావితం చేసిన రచనలుగా ఇవి ఆయన పేరిట పేరెన్నిక గన్నాయి. విమర్శకులు వీటిని పరిపరివిధాల వర్గీకరించారు. ‘ప్రాచీదిశా మహాచక్రవర్తి’, ‘అంతిమ క్రతువు’ వంటివాటిలో సాంప్రదాయికమైన చైనీయుల క్రతువిధానమే ప్రధానేతివృత్తం. ‘మేఘాంగన’, ‘యౌవన భాగ్యము’ కవితలలో సూత్రధారకృత్యాన్ని నిర్వహిస్తున్న గాయకుడో (లేక) క్రతుకృత్యానికి కూర్చొన్న ఋత్విజుడో మేఘమండలస్థితురాలై ఉన్న దేవతయెడ తనకు గల ప్రేమను వెల్లడించడమే వస్తువు. దేవతలకోసం క్రతువులను నిర్వహిస్తున్న తరుణంలో అతిమానుషవ్యక్తులతో ఈ భౌతికమైన వాంఛానివేశం ఏమిటంటే, మానవ మనోభావాల లీలాఖేలనవిలాసం అది. ప్రకృతిశక్తులతో భావుకులకేర్పడిన భావబంధానికి ప్రతీక. చైనీయ మహాకావ్యమైన ‘సంగీతికా సంకలనము’ (Book of Songs) లో చిత్రితమైనట్లు ఈ క్రతుకృత్యాలన్నీ కేవలం దైవతారాధనలకు మాత్రమే నిమిత్తీకరింపబడినవి కావు. మానవ మనస్సులో ఎల్లకాలం వ్యక్తావ్యక్తంగా నిబిరీసంగా ఉండే భావసంపుటులే క్రతుకృత్యవేళ మంత్రరూపంలో వ్యక్తరూపాన్ని పొందుతాయి. సర్వరసాశ్రయమైన ప్రేమభావం అందుకు అతీతమేమీ కాదు. ‘మహాభాగ్యము’ కవితలో మేఘమండలంలోని ఆ అతిలోకసౌందర్యరాశి మనస్సుకు నచ్చిన మనస్వినిగా సంబోధింపబడుతుంది. ‘పసుపువన్నె జాలు వేలుపు’ కవితలో యల్లో రివర్ అనబడే హ్సియాంగ్ నదీకాంత ప్రేమాధిదేవతగా, కవికి ప్రేయసిగా భావింపబడటం కనబడుతుంది. ‘హ్సియాంగ్ నదీ కాంత’, ‘హ్సియాంగ్ నదీ దేవత’, ‘పర్వతాత్మ’ కవితలలో ఆ నదీకాంత పర్వతరాజుపై తన మనస్సులో వెల్లివిరిసిన అనురక్తిని వెల్లడించడమే కథాసంగతి అయినప్పటికీ మొదటి రెండింటిలోనూ ఒక ఉదాత్తమైన నాటకీయసంవిధానం ఉట్టిపడుతుంటుంది. అవి సుదీర్ఘమైన వేరొక రచనకు నాందీప్రాయములేమో తెలియదు. ‘పర్వతాత్మ’ కవితలో కానవచ్చే కమనీయమైన కవనధోరణి మెచ్చదగినది. ‘సూర్యదేవుడు’ కవితలో సూర్యుని దైవత్వవిషయాన్ని స్తుతించటం గాక – జగత్ప్రీతిదాయంగా నిర్వహిస్తున్న క్రతువుయొక్క దర్శనీయశోభను చూసి కవి మైమరపు చెందటమే వస్తువు. దృశ్యమానమైన చరాచరలోకంలోని సౌందర్యానికీ, అవాఙ్మానసగోచరమైన అతిమానుషతత్త్వానికీ ముగ్ధుడు కావటమే తప్పించి, కవికి అలౌకికశక్తులంటే అణుమాత్రమైనా భక్తితాత్పర్యం లేకపోవటం ఈ కవితలలోని అంతస్సూత్రం. ఈ లౌకికతాభిమానం వల్లనే విమర్శకులు కొందరు ఇవన్నీ దేవతలను ఉద్దేశించినవి కావని, రాజును ఉద్దేశించి చెప్పివుండవచ్చునని భావించారు కాని, పదాల పోహళింపును బట్టి ఆ అన్వయం సరికాదని యాంగ్ హ్సియెన్-యీ, గ్లాడిస్ యాంగ్ వంటి ప్రామాణికవిద్వాంసుల అభిప్రాయం. ఇవిగాక, దేశంకోసం నిహతులైనవారిని సన్నుతిస్తున్న స్మృతిగీతం ‘రణరంగంలో నేలకొరిగిన వీరులకోసం’ ఒక్కటే ఈ ఓడ్ కవితల కూర్పులో విలక్షణంగా ఉన్నది. ఈ ఒక్కదానిలోనే తక్కిన కవితలలో వలె భావుక ప్రియంభావుకమైన ప్రేమభావం చిత్రవర్ణకిర్మీరాలతో మనస్సమ్మోహకంగా శబలితం కాలేదు. రణాంగణాన్ని ప్రత్యక్షీకరిస్తున్న కవి శబ్దశక్తి ఇందులో సర్వతోముఖంగా సాక్షాత్కరిస్తుంది. తెగిన మొండెం నేలపై గిలగిల కొట్టుకుంటున్నా శత్రుసంహారానికై ఉత్సవించే యోధాగ్రేసరుల ఆత్మశక్తికి నీరాజనం పడుతున్న ఈ కవితకు దేశభక్తి గీతాలలో ఉత్తమస్థానం లభించింది.

image2ప్రౌఢవయస్సులో జీవితం ఆనందోల్లాసాలతో హాయిగా గడిచిపోతున్న రోజులలో ఛు యువాన్ పధ్నాలుగు కవితలను రచించాడు. గ్రీష్మవేళాదక్షిణానిలవీచికలు నిదాఘతాపతప్తమైన తనువును తాకి తాదాత్మ్యాన్ని కలిగించినట్లు యుగయుగాంతరానుగతకర్కశసమస్యలతో సంతప్తమై సమ్యక్పరిష్కారంకోసం విలవిలలాడుతున్న మనస్సును మెత్తగా స్పృశించి, మైమరపింపజేసే ఒక చల్లదనం ఈ కవితలలో నిండి ఉంటుంది. ఒక సహజత్వం, ఒక సరళత్వం, ఒక సౌగంధ్యం, ఒక మాధుర్యం, ఒక గంభీరిమ, ఒక ఉద్వేజనం, ఒక సంగీతభంగి, ఒక సమతా గుణం, ఒక మాటలకందని వింత అందం మిరుమిట్లు గొలుపుతుంటాయి. తక్కిన కవితలన్నీ ఆయన కలలు కల్లలైన నైరాశ్యపు రోజులలో కూర్చినవి. పెనుతుఫాను వీచేముందు కమ్ముకొన్న కారుచీకటి లాగానో, కారుచీకటి కమ్ముకొన్న తర్వాత వచ్చిన పెనుతుఫాను లాగానో ఉక్కిరిబిక్కిరిచేస్తాయి. తీవ్రమైన ఆగ్రహావేశం, మనసు లోతులను తాకే భావతీవ్రత, శోకవ్యాకులత, చింతావిలీనత, దుఃఖనిర్భరత నిండి ఉంటాయి. సమానహృదయంతో భావన చేయగల సహృదయులకు ఆ మహాప్రభావం నుంచి తప్పించుకోవటం సులభసాధ్యం కాదు. ఆ కవితలలో తొమ్మిది స్మృతిగీతాలు. వాటిలో ‘నారింజకు నివాళి’ అన్నది కూడా ఓడ్ ఛందస్సులోనే ఉన్నది. ఇవి ఏకకాలంలో కూర్పబడిన కృతులు కావని, హాన్ రాజవంశీయుల కాలంలో విద్వాంసులు ఈ కవితలను వేర్వేరు ఆకరాల నుంచి సంపాదించి ఛు యువాన్ రచనలుగా నామకరణం చేశారని – స్యూంగ్ రాజవంశపు ఐతిహాసికుడైన ఛు హ్సీ పండితుడు అభిప్రాయపడ్డాడు. బర్టన్ వాట్సన్, జేమ్స్ లెగ్గీ వంటి సుప్రసిద్ధ చరిత్రకారులు ఈ వాదాన్ని అంగీకరింపలేదు. ప్రామాణిక సంకలనాలన్నిటిలో ఇవి ఛు యువాన్ రచనలుగానే ప్రచురింపబడుతున్నాయి. వాక్యబంధాన్ని అనుసరించి చూస్తే ‘నారింజకు నివాళి’ని ఆయన కవిత్వాభ్యాసం మొదలుపెట్టిన తొలిరోజులలో వ్రాసి ఉండవచ్చునని ఊహించటానికి వీలున్నది. ఇందులోని ప్రథమార్ధం నారింజ గుణోత్కర్షను ప్రశంసిస్తుండగా ద్వితీయార్ధంలో ఎవరో ఒక అజ్ఞాతవ్యక్తి మెచ్చుకోలున్నది. ఆ వ్యక్తి నవయౌవనుడని తెలుస్తూనే ఉన్నప్పటికీ – అది ఛు యువాన్ కావచ్చుననీ, కాకపోవచ్చుననీ నిర్ణయించేందుకు వీలులేకుండా ఉన్నది.

ప్రపంచ సాహిత్యంలోని స్మృతిగీతావళిలో ఛు యువాన్ స్మృతిగీతాలు ప్రథమగణ్యాలని భావింపవచ్చును. వీటి రచనాకాలం ఎప్పటిదో నిర్ధారించేందుకు ఆధారాలు లేవు. అయితే, ‘విషాదకర పంక్తులు’ అన్న గీతంలోని పశ్చాత్తప్తవాక్యాల తీవ్రతను బట్టి కవి దీనిని రాజతిరస్కృతుడైన తొలిరోజులలో చెప్పి ఉండవచ్చునని ఒక ఊహ. పరిస్థితుల ఒత్తిడి వల్ల ఇంద్రియోద్వేజనకు లోనైనప్పుడు కవి స్థితప్రజ్ఞతకోసం ఉవ్విళ్ళూరుతాడు. వైరశుద్ధికోసం ప్రయత్నాలు చెయ్యడు. ఆత్మసంయమాన్ని పాటించడం ఎంతో కష్టమవుతుంది. హృదయానికి, బుద్ధికి ఏర్పడిన నిశితమైన ఘర్షణకు తట్టుకొనలేక శరీరం అలసిపోతుంది. మనోలయం సిద్ధించినప్పటి నిర్వికల్పస్థితి అది. ఆ చిత్తావస్థలో స్వయంవ్యక్తాలైన దుర్భరవిషాదకర పంక్తులవి.

ప్రాక్చికీర్షితం బెల్ల నిష్ఫలతఁ జెంది

దుఃఖభాజన మయ్యె; సంతుష్టి దొఱఁగె;

మెట్టుమెట్టుగ నెక్కుచు మేడపైకి 

నిచ్చెనను నేలఁద్రోచితి నిలువకుండ.          

అని కథావ్యక్తి తన గతాన్ని, స్వయంకృతాన్ని నెమరువేసుకొంటాడు. ‘ప్రతికూల ఝంఝ’, ‘ప్రేమోత్కలిక’లు కూడా ఆనాటివే. క్రీస్తుకు పూర్వం 300 – 295 (±) నాటి ఆయన మనఃస్థితికి అద్దంపడతాయి.‘గతకాలపు నెమరువేత’, ‘రాజధానిని విడిచిపెడుతూ’ కవితలు పాయ్ చీ దక్షిణపు సరిహద్దునుంచి దేశరాజధానిపైకి దండెత్తి, కోటను సర్వనాశనం చేస్తున్న రోజులలో చెప్పినవి. రాచరికపు వ్యవస్థ తన శక్తియుక్తులను సంకుచిత స్వార్థప్రయోజనాలకోసం అన్వయించుకోవటం మొదలుపెట్టినప్పుడు సామాన్యుల జీవితం ఏ తీరున అల్లకల్లోలమై ధర్మానికి నిలువనీడ లేకుండాపోతుందో పరిపరివిధాల పదచిత్రాలతో వర్ణించటం ఆయన అన్ని కవితలలో గోచరించే దృగ్విషయమే. అదే కాలంలో ఆయన ‘నదీతరణం’ అన్న అమోఘమైన కవితను చెప్పాడు. విజ్ఞానపు

నిండైన వెలుగును అజ్ఞానాంధకారం ఆవరించి ధర్మం అధర్మం గానూ, అధర్మం ఆచరణీయంగానూ మారిన రోజులలోని నైతికపతనాన్ని చూడలేక తలవంచి తప్పుకొనిపోవటమే కర్తవ్యమని నిర్ణయించుకొన్నాక కాలస్రవంతిపై ఆయన ప్రయాణాన్ని వర్ణించే అద్భుతావహమైన సువర్ణరూపచిత్రం ఇది. తనను సుదూరమైన ఆవలి తీరానికి తీసికొనివెళ్ళగల పడవలోకి అడుగుపెట్టేముందు కూడా ఆయన మనస్సు రాచరికపు ఇనుప పాదాలకింద నలిగిపోతున్న నోరులేని బానిసల దుఃస్థితి పైనే మగ్నమై ఉన్నది. ఆ వెంటనే ‘చెదురు మదురు ఆలోచనలు’, ‘మునుక వేసే మునుపు’ కవితలను చెప్పినట్లుంది. అవే ఆయన పార్యంతికరచనలై ఉంటాయి.

ఛు యువాన్ కావ్యశిల్పానికి ప్రాణశక్తి అనర్ఘమైన కన్ఫ్యూషియస్ తత్త్వదర్శనాన్ని అధ్యయనించిన పుణ్యఫలంగా సమకూడింది. రాజకీయాలలోకి అడుగుపెట్టి ప్రజాజీవితంతో అనుబంధాన్ని పెంచుకొన్నవాడు కనుక ఆ మహోపాధ్యాయుని ప్రభావం ఆయనపై ప్రసరించటం సహజమే. పాలనావ్యవస్థలో అవినీతికి చోటుండకూడదని, సామాజికన్యాయకల్పనే రాచరికపు బాధ్యత అని విశ్వసించినవాడు కనుక జీవితంలో నైతికవిలువలను నెలకొల్పేందుకు తన కవిత్వమూలకంగా కృషిచేశాడు. అయితే అతిస్వతంత్రుడైన దార్శనికుడు కనుక ఆయన మేధావిత ఏ సమసామయిక భావజాలపు సంకుచితపరిధిలోనో ఇమిడిపోలేదు. ‘ప్రతికూల ఝంఝ’ కవితలో భవ్యమైన టావో దర్శనపు మార్గదీపనం, ఝువాంగ్జి బోధనల సారనవనీతం అగుపిస్తాయి. ‘గతకాలపు నెమరువేత’ కూర్పులో చైనీయ ఫా-జియా దర్శనపు ప్రభావం ఉన్నది. రాజు సర్వజనహితభావంతో సామాజికరాజనీతిని, పాలనావ్యవస్థను తీర్చిదిద్ది, పేదలయెడ దయగలిగి ప్రవర్తించాలన్న ఆలోచన ఈ ఫా-జియా న్యాయదర్శనఫలమే.

చరిత్రప్రసిద్ధమైన ‘లి సావో’ రచనకు పూర్వం ఛు యువాన్ ‘భవితవ్యబోధకుడు’ (జోస్యం చెప్పేవాడు), ‘జాలరివాడు’, ‘మృతులకై శ్రద్ధాంజలి’, ‘ప్రహేళికలు’ అన్న నాలుగు కవితలను వ్రాశాడు. అజరామరమైన ఆయన సాహిత్యప్రశస్తికి మూలకందాలివి. వీటిలో మొదటి రెండూ ఆయనవి కావని, రెండవదైన ‘జాలరివాడు’ కవితను హాన్ రాజవంశం పాలనకు వచ్చేనాటికే ఛు రాజ్యంలో త్సాంగ్ లాంగ్ నదీతీరవాసులెవరో ఛు యువాన్ శైలిని అనుకరిస్తూ చెప్పినది కావచ్చునని విమర్శకులు భావించారు. ఛు యువాన్ ఒక పాత్రగా ఇది ప్రథమ పురుషలో రచితమైంది. ప్రజాజీవితం కలుషితమైందని, జనసమ్మర్దం ఎక్కువై నదీతీరమూ,నదీజలాలూ కలుషితం కాసాగాయని, నది చెంతకు రాకపోవటమే మంచిదని – ఒక జాలరి వృద్ధునితో అంటూ ఛు యువాన్ బాధపడతాడు. ప్రపంచం పాడవుతోందని మనం ప్రపంచానికి దూరంగా బతుకుతామా?ఇక్కడే ఉంటూ ఇక్కడి కష్టసుఖాలలో పాలుపంచుకోవద్దూ? మార్పు తెచ్చేది మనమే కదా! అంటాడు ఆ ముసలి జాలరి. ఇక్కడ తలస్నానం చేస్తే ఆ మురికితో తలపాగా పాడవకుండా శుభ్రం చేసుకోవాలి. మునకవేస్తే దుస్తులనుంచి దుమ్ము దులుపుకోవటం ఒక పని. ఇంతటి కల్మషవాతావరణంలో పరిశుద్ధదేహాన్ని పాడుచేసుకొంటారా? ప్రపంచంలోని కాలుష్యమంతా ఇక్కడే ఉన్నది. ప్రపంచం పాడయేకొద్దీ ఈ చోటూ పాడవుతున్నది. ఈ నీళ్ళలో మునిగే కంటె దూకి ఏ చేపకడుపులోనో తలదాచుకోవటం మంచిది – అంటాడు ఛు యువాన్. మత్స్యోపజీవి అయిన ఆ జ్ఞానవృద్ధుడు చిరునవ్వు నవ్వుతూ, “నాకేమీ అట్లా అనిపించదయ్యా, నది నీళ్ళు బాగున్నాయనిపించినప్పుడు గిన్నెలు కడుక్కొని, స్నానంచేసి వెళ్ళిపోతాను. మరీ బాగాలేదనిపిస్తే పైపైనే కాళ్ళు మాత్రం కడుక్కొని వెళ్ళిపోతుంటాను” అని జవాబిస్తాడు. లయాత్మకమైన గద్యబంధంలో సాగిన కవిత ఇది. జీవయాత్రను ముగించే ముందు కర్తవ్యాకర్తవ్యాలు డోలాయమానంగా ఉన్నప్పటి మనఃస్థితిలో వ్రాశాడని ఊహింపవచ్చును.

‘మృతులకై శ్రద్ధాంజలి’ ఒక లోకోత్తరమైన కవితాఖండం. ఆనాటి చైనాలో ఎవరైనా జబ్బున పడ్డప్పుడు బంధువులందరూ రాత్రిపూట గుమిగూడి, రోగి ఆత్మను వెంటనే తిరిగి వచ్చెయ్యమని మౌనప్రార్థనలు చేసేవారట. జానపద రాగధోరణిలో పాఠ్యే గేయే చ మధురంగా కూర్చిన రచన ఇది. జన్మభూమి అంటే ఛు యువాన్ మనస్సులో ఉన్న అనుబంధానికి అక్షర రూపం. జగన్మోహనమైన కల్పనాశిల్పంతో,ఇంద్రధనుస్సులోని రంగులను విరజిమ్ముతున్న శబ్దసంపుటితో ఆయన దీనినొక రామణీయకనివేశంగా తీర్చిదిద్దాడు. గీతికాంతంలో యాంగ్ హ్సీయెన్-యీ గారి ఆంగ్లానువాదంలోని ఉపసంహారవాక్యావళి అపూర్వభావనిర్భరమై ఇందులోని ప్రతిపాదితాంశాన్ని సహజగంభీరిమతో  ప్రకాశింపజేస్తున్నది:

And once in early spring, in days gone by,

I rode to hunt beneath a southern sky.

Angelica and dogwood sprouted green,

My way stretched far across the stream was seen.

Then leftward o’er the lakes and woods I glanced;

Proudly my four black chargers stamped and pranced.

With thousand chariots thundering around,

They burnt the woods and passed the torches round.

The sky grew red, the slaves pursued my steed;

So on I rode and let the slaves succeed.

I curbed my steed and turned him toward the right

To join the king. My sov’reign came in sight.

I urged the slaves; my sov’reign drove ahead;

The fierce rhinoc’ros at one shaft fell dead.

 

The fiery orb arose, the night star waned,

The years went past, no hour could be detained.

Now hidden is the path where orchids teem;

Still stands the maple by the limpid stream.

A thousand miles away my heart doth yearn,

Beyond the Wailing stream, O soul, return!

ఛు యువాన్ తన రాగద్వేషాలన్నింటిని ఈ రెఖ్వియమ్ కవితలో ప్రస్ఫుటింపజేశాడని విమర్శకులంటారు. క్రీస్తుకు పూర్వం రెండవ శతాబ్ది నాటి సుప్రసిద్ధ చరిత్రకారుడు స్సూమా చీయెన్ దీనిని ఛు యువాన్ రచనగానే అభిమానించాడు. ఇందులోని ప్రసంగసంగతిని బట్టి కవి దీనిలో తన దేశపు రాజు ఆత్మను ఉద్దేశించాడని కొందరు; కాదు, కవి తనను తానే సంబోధించుకొన్నాడని కొందరు; స్యూంగ్ యు అనే కవి దీనిని రచించి, ఛు యువాన్ ను సంబోధిస్తున్నాడని కొందరు భావించారు. ఛు యువాన్ సాహిత్య పరిశోధకులలో అనేకులు రాజ్యబహిష్కృతుడైన తర్వాత ఛు యువాన్ దీనిని హ్యూవాయ్ రాజు చీన్ రాజ్యంలో బంధితుడై ఉన్నప్పుడు చెప్పాడని విశ్వసిస్తున్నారు.

జానపదకవిత్వపు భంగీభణితి ప్రాతిపదికగా ఛు యువాన్ తన కవితారూపాలను తీర్చిదిద్దాడు. పల్లెపట్టులలో ప్రవహిల్లుతున్న దేశి పలుకుబడులను జాతీయజనజీవనస్రవంతిలో ప్రవేశపెట్టి ఎన్నడూ లేని కావ్యత్వగౌరవాన్ని కల్పించాడు. అనూచానమైన చైనీయకవిత్వంలో ఒక నవవిప్లవాన్ని తీసుకొనివచ్చి, ఒక వినూత్నశకాన్ని మొదలుపెట్టాడు. రెండువేలయేండ్లు గతించినా ఆ విప్లవకాంతి ఈనాటికీ తరిగిపోలేదు. ఆయన కవితాదీక్ష చాలా గొప్పది. ప్రజలు ఆ మహాకవిత్వదీక్షను మనసారా మెచ్చుకొన్నారు. అభిమానంతో గుండెలకు హత్తుకొన్నారు. ప్రశంసల పుష్పవృష్టిని కురిపించారు. ఆనాటి పలుకుబడి తీరు మారి భాషలో చెప్పలేనన్ని పరిణామాలు వచ్చినా ఆధునిక చైనీస్ భాషలోకి, వివిధ విదేశీయభాషలలోనికి పరివర్తించినపుడు దాని ప్రభావశీలితలో మార్పేమీ రాలేదు. పాఠకహృదయాలను పరవశింపజేయటమూ మానలేదు.

సాహిత్యచరిత్రలో మహాకవులందరి విషయంలో లాగానే ఛు యువాన్ ఉనికిని గురించి, రచనలను గురించి, కర్తృత్వాదికాన్ని గురించి అనేక వాదవివాదాలున్నాయి. క్రీస్తుకు పూర్వం 206లో సామ్రాజ్యపాలన మొదలుపెట్టి, ఎన్నడూ లేని విధంగా చైనీయ భాషాసాహిత్యాల వ్యాప్తికి పూనుకొన్న హాన్ రాజవంశీయుల కాలం నాటికే ఛు యువాన్ కీర్తివల్లి దిగంతాలకు పాకుతున్నది. అందుకు సాహిత్యాధారాలనేకం ఉన్నాయి. రెండవ హ్యువాయీ చక్రవర్తి ఆస్థానంలోని విద్వాంసులు ఛు యువాన్ దివ్యానుగ్రహసంపన్నుడని భావించేవారు. క్రీస్తుశకం 1638లో ఛు యువాన్ కవితల తొలి సంకలనం లాయీ చీంగ్-చీహ్ వ్యాఖ్యానంతో రూపుదిద్దుకొన్నది. మీంగ్ రాజవంశీయుల ఆస్థాన దారుశిల్పి, ప్రముఖ చిత్రకారుడు అయిన ఛెన్ హంగ్-షావ్ (1599-1652) తన కాలంలో లభిస్తుండిన చిత్రం ఆధారంగా ఛు యువాన్ వర్ణచిత్రానికి జీవకళ ఉట్టిపడుతున్న ఒక ప్రతికృతిని కల్పించాడు. ఆజానుబాహు దీర్ఘ శరీరయష్టితో, సముజ్జ్వలమైన కాంతిపరివేషంతో, చైనీయ సంప్రదాయానుసారం పెద్దలయెడ గౌరవానికి నిదర్శకంగా కేశపాశం అగ్రభాగాన ముడివేసి – ఆ కేశబంధం చుట్టూ అలంకరించికొన్న స్వర్ణాభరణంతో, తెలివితేటలను సూచిస్తున్న విశాలమైన నెన్నుదురుతో, నిడుపైన ముఖరేఖతో, జీవితంలో తారసిల్లిన నిమ్నోన్నతాల చింతాక్రాంతి ఫలంగా ముడివడిన కనుబొమలతో, ఆకర్ణాయతనేత్రాలతో, కవులకు సహజమైన ఆవేశాన్ని, భావతీవ్రతను ప్రదర్శించే పలుచని పెదవులతో, ఆపాదభుజాగ్రం విస్తరించిన నానావర్ణమనోహరమైన ఛాంగ్ షాన్ కూర్పాసంతో,వీపున ఉన్నత రాజకీయోద్యోగులకు లాంఛనమైన కెంపులు పొదిగిన ఖడ్గలాంఛనంతో మహాపురుషలక్షణాలు ఉట్టిపడుతున్న చిత్రం అది. ఆయన చారిత్రికవ్యక్తి కాడని, పురావృత్తాలలోని కాల్పనికమూర్తి అని భావించటం సమంజసం కాదు.

3

ఛు యువాన్ భావుకత్వం, రూపశిల్పీకరణకౌశలం నిరుపమానమైనవి. ఆయన రచనావళిలో మహోదాత్తమని చెప్పదగిన ‘లి సావో’ (ఆక్రోశము) కవితలో మానవుడు స్వార్థపరుడై ప్రకృతిశక్తుల జీవశక్తిని,సత్త్వసంపదను స్వత్వానికి ఏ విధంగా మలచుకొన్నాడో చిత్రించటం కనుపిస్తుంది. అంతులేని అతని ఆశకు పగ్గాలుండవు. గాలి, వాన, ఉరుము, మెరుపు, మబ్బులు, చంద్రుడు మొదలైన ప్రకృతిశక్తులన్నీ అతనికి అనుచరగణమూ, పరివారమూ, రథచోదకులూ అయ్యారు. ఫీనిక్స్ పక్షి, డ్రాగన్ పక్షి అతని రథాన్ని నడుపుతాయి. తన సత్త్వసంపదతో వాటిని ఆకసానికి ఉరకలువేయించి, పరుగులు తీయించి, స్వర్గద్వారం మీదుగా భువనకోశపు పైకప్పు మీదికెక్కి అతను భూ పరిక్రమణకు ఉపక్రమిస్తాడు. అనంతానికి ఆవలి తీరాన ఉన్న అదృశ్య క్షితిజరేఖలపై అడుగుమోపేదాకా అతని అన్వేషణ కొనసాగుతుంది. అంతులేని ఆ ప్రయాణంలో అతనికి విశ్రాంతి దొరకదు. అంతాన్ని చవిచూసేంతవరకు అతని యాత్రకు ముగింపు ఉండదు.

ఛు యువాన్ తన భావుకతకు సనాతన సంప్రదాయం తొడిగిన సంకెళ్ళను తొలగించివేశాడు. సంప్రదాయ రూపచిత్రాలలోని స్వర్గాన్ని, నరకాన్ని, ఆత్మలను అభివర్ణించినా ఆయన వాటిని విశ్వసనీయ దృగ్విషయాలుగా విశ్వసింపలేదు. సర్వసుఖాలకు గమ్యస్థానమైన స్వర్గంలోనూ, పాపులకు శిక్షానిలయమైన నరకంలోనూ కూడా ఆ ఆత్మపదార్థం స్వస్థంగా ఉండటం సాధ్యం కాదని అన్నాడు. ‘ద రెఖ్వియమ్’(మృతులకై శ్రద్ధాంజలి) కవితలో ఆయన ఆత్మను ఉద్దేశించి,

వలదు స్వర్గమ్ము, నరకమ్ము వలదు నీకు,

దశదిశల వెదుకాడు దుర్దశకుఁ బోకు;   

వాంఛనీయమ్ము లే దెట్టి వలను నందు

క్షణము నివసింపలేవు సౌఖ్యముగ నెందు!

అని ఉద్బోధిస్తాడు. ఎండమావులలో దాహం తీర్చుకోవాలనుకొనేవారి సుఖభ్రాంతిని నిరసించే వాక్యమిది. ఆత్మ అంటూ నిజంగా ఒకటుంటే, జీవి మరణానంతరం శరీరం నుంచి బైటపడిన తర్వాత కూడా దానికి సుఖానికోసం వెతుకులాట తప్పకపోవటాన్ని విమర్శించటం ఇందులో కనబడుతుంది. ‘లి సావో’ కవితలో ఒక చిత్రమైన సన్నివేశం: అతను ఆత్మరూపంలో స్వర్గాన్ని చేరుకొని, అక్కడ గుమ్మానికి ఆనుకొని చిద్విలాసంగా నిలబడి ఉన్న ద్వారపాలకుణ్ణి లోపలికి వెళ్ళనివ్వమ్మని అర్థిస్తాడు. ఎంతో కష్టం మీద అనుమతి సంపాదించి లోపలికి వెళ్ళిన తర్వాత – అక్కడ సుఖభోగాలను అనుభవిస్తున్న జీవులు ఎవరెవరో గుర్తుపట్టాక – పెదవి విరిచి, “ఈ స్వర్గంలోనూ మంచివాళ్ళున్నట్లు లేదు” అనుకొంటాడు!

సంవిధానశిల్పం రీత్యా ఛు యువాన్ రచించిన అద్భుతావహమైన కవిత ‘తీయెన్ వెన్’ (ప్రహేళికలు) గురించి చెప్పుకోవాలి. ప్రకృతిని, మానవజాతి చరిత్రను మతాతీతమైన హేతువాద దృష్టితో అధ్యయనం చేసి, తన దర్శనసారాన్ని ఇంత గంభీరంగా కవిత్వీకరించినవారు విశ్వసాహిత్యంలో వేరొకరు లేరంటే అది అతిశయోక్తి అనుకోకూడదు. ఈ విశ్వోత్పత్తికి పూర్వం సృష్టిస్వరూపం ఎలా ఉండేది? ఆ సర్వశూన్యంలో ఏమేమి జరిగి ఏయే పరిణామాలు సంభవించాయో తెలుసుకోవటానికి ఏ శాస్త్రం ఉపకరిస్తుంది? మహనీయుడైన ఏ కళాకారుని అంతర్దార్శనికత తోడ్పడుతుంది? ఏ చిమ్మచీకటిలో రాత్రి కడుపున పగటి వెలుగు పురుడుపోసుకోవటం జరిగింది? తొమ్మిది ద్వీపాలతో విలసిల్లుతున్న ఈ భూమిఖండముయొక్క నిర్మాణం ఎట్లా జరిగింది? ఏ అదృశ్యశక్తి యొక్క కుశల కరాంగుళులు భువిలోనూ, దివిలోనూ నివసించే జీవరాశిని పోతపోశాయి? అన్న విచికిత్సతో ఈ ప్రహేళికాపరంపర ఉత్తరోత్తరానుసంధానపూర్వకంగా కొనసాగుతుంది. పురాగాథలను గురించి, పూర్వమహావ్యక్తులకు సంబంధించి, చారిత్రిక ఘటనలను అధికరించి కవి ప్రశ్నలను సంధిస్తాడు. నూటడెబ్భైకి మించిన ప్రహేళికలే గాని ఒక్కదానికీ సమాధేయరీతిలో సమాధానం కనుపింపదు. ఒకప్పుడు చరిత్రకు గుర్తులు తెలియని కాలంలో వెలసిన ఏవో కొన్ని పురాగాథల స్వరూపం ఈ ప్రహేళికలను బట్టి ఊహింపవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. వీటిలో ప్రసక్తులైన కొందరు మహనీయుల కథావిశేషాలు బహుశః ఒకప్పుడు ప్రచారంలో ఉండి, ఈనాడు ఏ వివరాలూ తెలియనందువల్ల ఈ ప్రహేళికలలోని కొన్ని ప్రశ్నలను అర్థం చేసుకోవటం కష్టం. ఈ ప్రశ్నలన్నీ వేర్వేరు కాలాలలో వేర్వేరు రూపాలను సంతరించికొని ప్రహేళికలుగా రూపొందేనాటికి వీటి స్వరూపం పరిపరివిధాల మారి ఉండవచ్చును. ప్రహేళికల క్రమసంఖ్యలోనూ మార్పులు జరిగి ఉంటాయి. కొన్నింటి పూర్వాపరస్థానాల వ్యత్యయం వల్ల తర్కసంగతి లోపించి, అర్థాంతరసంక్రమణం జరిగినట్లు కనబడుతుంది. పైగా ‘తీయెన్ వెన్’ కు ఉన్న అనువాదాల సంఖ్యకూడా తక్కువేమీ కాదు. వీటిలో క్యూవో మో-జో గారి అనువాదం భాషాశాస్త్రరీత్యా ప్రామాణికమని ఆధునిక చరిత్రకారులు నమ్ముతున్నారు.

ఆధిభౌతిక శక్తులను గూర్చిన, గ్రహనక్షత్త్రతారకాదులను గురించిన విజిజ్ఞాస ఇందులో ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఈ ఆకాశాన్ని నిర్మించినదెవరు? ఆకాశం ఎక్కడి వరకు వ్యాపించి ఉంటుంది?ఆకాశానికి ఆధారభూమిక ఏమిటి? జ్యోతిర్విజ్ఞానంలో పన్నెండు రాశిచిహ్నాల విభాగానికి కారణం ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్త్రాలు క్రిందికి రాలకుండా తమతమ స్థానాలలో ఎలా ఉండగలుగుతున్నాయి?ఒక రోజులో సూర్యుడు ఎన్ని మైళ్ళ దూరం ప్రయాణిస్తాడు? నెలలో చంద్రుని వృద్ధిక్షయాలకు కారణం ఏమిటి? ప్రాతస్సంధ్యకు మునుపు సూర్యుడు ఎక్కడ దాగివుంటాడు? ఇత్యాదిగా ఈ అడుగుతున్న ప్రశ్నలన్నీ తర్కబద్ధమైనవని వేరే చెప్పనక్కరలేదు. ప్రకృతిని ఛు యువాన్ ఎంత సూక్ష్మదృష్టితో పరిశీలించాడో, ఆయన భావనాశక్తి ఎంత పుష్కలమో మనము చూడవచ్చును.

Li_sao_illustré_(crop)

ప్రపంచ సంస్కృతివిశేషాల తులనాత్మక అధ్యయనం పట్ల ఆసక్తి కలవారికి, భారతీయ – చైనీయ సంస్కృతుల సాజాత్యాన్ని తెలుసుకోవాలనుకొనేవారికి ఈ ‘తీయెన్ వెన్’ ఒక తరగని గని వంటిది. కృతి ప్రారంభంలోనే భూమిని ఎనిమిది స్తంభాల వలె మోస్తున్న దిగ్గజాల ప్రసక్తి వస్తుంది. “భూమిని ఎనిమిది ఏనుగులు మోయటం” అన్నది ఎంతటి విశ్వజనీనమైన భావుకతావిశేషమో! అన్న ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రునిలోని మచ్చ కథ; ఛావోస్ చక్రవర్తికి పౌర్వికుడైన ఝి రాజును ప్రసవించిన వెంటనే తల్లి అతనిని మంచుపై విడిచిపెట్టగా పక్షులు తమ రెక్కలతో కప్పి కాపాడిన సన్నివేశం; మునుపు పర్వతాలకు రెక్కలుండిన రోజుల్లో చూంగ్ పర్వతపుత్త్రుడైన కు రాజుకు రెక్కలు వచ్చి, అతను ప్రజావాసాలపై వాలుతూ లోకకంటకుడు కావటం; హ్సీయా రాజవంశానికి మూలపురుషుడైన యు రాజు త్యు పర్వతం వద్ద నది పొంగును అరికట్టటానికి వెళ్ళి, అక్కడొక వనితను చూసి ఆకర్షితుడై ఆమెతో సంగమించటం, ఆమె భర్త కోపించి ఆమెను రాయిగా మారమని శపించటం, శాపావధి ముగిసిన తర్వాత ఆమె చీ రాజును కనటం;పూర్వం గగనసీమలో తొమ్మిదిమంది సూర్యులుండటం, హ్సీయా రాజవంశానికి చెందిన మహాధానుష్కుడు యీ అనే రాజు వారిలో ఎనిమిది మందిని కూల్చివేసి ఒక్క సూర్యుని మిగల్చటం వంటివి పాఠకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి. ఒకప్పుడు యుద్ధంలో మహావీరుడైన కావో యాంగ్ చక్రవర్తి చేతిలో ఓటమి పాలైన కుంగ్ కుంగ్ అన్న డ్రాగన్ పక్షి క్రోధంకొద్దీ పూఛావ్ పర్వతం కేసి తలను మోది, భూమిని మోస్తున్న ఆగ్నేయస్తంభాన్ని కూలద్రోసిందట. అందువల్ల అప్పటి వరకు చదరంగా ఉండిన నేల దక్షిణానికి ఒరిగి, సముద్రపు నీటిని తాకిందట. ఈ ఘటన అంతరార్థం ఏమిటి? అని ‘తీయెన్ వెన్’ చిత్రంగా వితర్కిస్తుంది. భూ ఉపరితలం పైని గొడుగు పైకప్పు వంటి అర్ధగోళాకృతిలో తొమ్మిదివేల తొమ్మిదివందల తొంభైతొమ్మిది చిన్ని చిన్ని స్వర్గాలుంటాయట. వీటి ఉనికి పరమార్థాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఇహపరాలకు మధ్యనున్న సూక్ష్మమైన విభాజకరేఖ పైని నిలబడి, అజ్ఞేయమైన పరాన్ని విడిచి సుజ్ఞేయమైన ఇహం కేసి మొగ్గుచూపుతున్న ఛు యువాన్ మనస్తత్త్వాన్ని పట్టిచూపుతుంది. విశ్వజయాని కంటె ఆత్మజయం మేలన్న నిశ్చయానికి వచ్చిన రోజులవి.

రత్నగర్భ నేకాతపత్రంబు గాఁగ  

నేలు నరపాలమౌళి నిర్వేలమైన 

భ్రాంతి విడలేక దేనినిఁ బడయఁగోరుఁ?      

గాంక్షను జయించు కాంక్షంబు గలుగదేల?

అని. ఛు యువాన్ కాలానికి చైనాలో విజ్ఞానశాస్త్రం మహోన్నతస్థితికి చేరుకొన్నది. ఖగోళశాస్త్రంలోనూ, కాలవిజ్ఞానంలోనూ, గణితశాస్త్రంలోనూ గణనీయమైన కృషి జరిగింది. సాధ్యనిర్దేశం మొదలుకొని నిగమనం దాకా వాదవిధానంలో నవీన సిద్ధాంతాలు రూపొంది, సప్రమాణంగా తర్కశాస్త్రం పరిణతిని పొందింది. ఛు యువాన్ కు కొద్దిరోజుల ముందు దాక్షిణాత్య తత్త్వవేత్తలలో పేరెన్నిక గన్న హ్యూవాంగ్ ఔత్తరాహులలో సుప్రసిద్ధ తార్కికుడైన హ్యూయీ షీహ్ వద్దకు వెళ్ళి అంతరిక్షంలోని గ్రహనక్షత్త్రాదులు నేలకు రాలకుండా ఉండటానికి శాస్త్రీయకారణం ఏమిటనీ, గాలినీ వాననూ ఉరుమునూ మెరుపునూ సృష్టించిన భౌతికశక్తి ఏదనీ సుదీర్ఘంగా చర్చించాడట. హ్యూయీ షీహ్ ఆయనకు సహేతుకంగా సమాధానాలను చెప్పాడట. దీనిని బట్టి ఆ కాలంలో విశ్వవిజ్ఞానాన్ని గురించిన మేధావుల ఆసక్తి ఏ విధంగా ఉండేదో వెల్లడవుతుంది.

చైనీయ నాగరికత సముజ్జ్వలంగా వెలుగొందిననాటి స్వర్ణయుగంలో ఛు యువాన్ ఉన్నాడు. సహజంగానే మేధాసంపన్నుడైనందున తనచుట్టూ జరుగుతున్న సామాజికపరిణామాలను పరిశీలించాడు. ప్రజాసమస్యలను లోతుగా అధ్యయన చేశాడు. వివిధవ్యక్తుల మనస్తత్త్వాలను అవగాహన చేసుకొన్నాడు. రాజకీయోద్యోగంలో ఉండటం వల్ల అన్ని వర్గాల జనులతో గాఢమైన సంబంధం ఏర్పడి సమకాలిక భావధారయొక్క సమగ్ర స్వరూప స్వభావాలు ఆకళింపుకు వచ్చాయి. అందువల్ల ఆయన ప్రతిభ సర్వతోముఖంగా వికసించింది. అయితే, ఆయన ప్రధానంగా కవి. కవిత్వం ఆయన జీవలక్షణం. ప్రతిభ సముజ్జ్వలమైనది. చిత్రకర్మకౌశలం సాటిలేనిది. అంకితభావంతో అక్షరవరివస్య చేశాడు. పట్టుమని పాతిక కవితలు లేకపోయినా పదికాలాలకు సరిపడే కీర్తిని పండించాడు. అహర్నిశం తన దేశప్రజలకోసం జీవించాడు. నిర్వికల్పమనస్సుతో ప్రజాసేవకే అంకితమయ్యాడు. కష్టజీవుల న్యాయసాధనకోసం ఆయనంతటి శక్తివిలాసంతోనూ, చైత్యచోదనతోనూ, శ్రేయోభిలాషతోనూ, అంతర్లీనపాండిత్యంతోనూ,ప్రకాశవిమర్శతోనూ గంభీరమైన భావసంపుటిని మనోహరమైన శబ్దసంపుటిగా పోహళింపగల కవులు ఎక్కడో కాని కనుపింపరు. వైదుష్యవిలసనానికి గాక కేవలం శ్రమజీవుల స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకోసం కవితలను రచించాడు. ప్రజాహృదయాలలో శాశ్వతనివాసం ఏర్పరచుకొన్నాడు.

*

మీ మాటలు

 1. శ్రీ మురళీధర రావు గారు

  మీరు <> అని అన్నారు

  మేము <> అని అంటున్నాము

  చాలా బాగుంది సార్!

  థాంక్యూ

  భవదీయుడు
  వంశీ

 2. శ్రీ మురళీధర రావు గారు

  మీరు “ప్రకృతిని ఛు యువాన్ ఎంత సూక్ష్మదృష్టితో పరిశీలించాడో, ఆయన భావనాశక్తి ఎంత పుష్కలమో మనము చూడవచ్చును.” అని అన్నారు

  మేము “ఛు యువానును మీరు ఎంత సూక్ష్మదృష్టితో పరిశీలించారో, మీ రచనాశక్తి ఎంత పుష్కలమో మేము చూడవచ్చును” అని అంటున్నాము

  చాలా బాగుంది సార్!

  థాంక్యూ

  భవదీయుడు
  వంశీ

  తా.క తా.క – ఇంతకుముందు కామెంటులో పరెంథిసీస్ లో పెట్టిన సమాచారం ఎందుకో కట్ అయిపోయింది. అందువల్ల మరల ఒక సారి.. :)

 3. ఏల్చూరి మురళీధరరావు says:

  శ్రీ వంశీ గారు,

  ఔదార్యపూర్ణమైన మీ ప్రోత్సాహక స్పందనకు హార్దిక ధన్యవాదాలు!

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

 4. చాలా మంచి వ్యాసాన్ని చదివాను చాలా రోజుల తరువాత. భారతీయ – చైనా నాగరికతల్లోని సామ్యాలు ఇటీవలి కాలంలో చాలామట్టుకు అంతరించినా, పూర్వపు రోజుల్లోనివి ఇప్పుడు మనకి ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎనిమిది దిగ్గజాల సామ్యంలా. ఈ విషయం బిబ్లికల్ సాహిత్యంలో కూడా ఉంది. బల్లపరుపుగా చక్రాకారంలో ఉండే భూమిని ఎనిమిది ఏనుగులు ఒక మహా కూర్మపు డిప్పమీద నిలబడి మోస్తున్నాయని ఉంటుంది.
  ఏల్చూరి మురళీధర రావు ఇటీవల కొంత అజ్ఞాతంలో ఉంటున్నా ఈ రచన ద్వారా దర్శనమిచ్చి నందుకు ఆనందంగా ఉంది.
  ఛు యువాన్ ని చాలా పరిశీలనగా చదివి మనకు గొప్పగా పరిచయం చేశారు. “కష్టజీవుల న్యాయసాధనకోసం ఆయనంతటి శక్తివిలాసంతోనూ, చైత్యచోదనతోనూ, శ్రేయోభిలాషతోనూ, అంతర్లీనపాండిత్యంతోనూ,ప్రకాశవిమర్శతోనూ గంభీరమైన భావసంపుటిని మనోహరమైన శబ్దసంపుటిగా పోహళింపగల కవులు ఎక్కడో కాని కనుపింపరు. వైదుష్యవిలసనానికి గాక కేవలం శ్రమజీవుల స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకోసం కవితలను రచించాడు. ప్రజాహృదయాలలో శాశ్వతనివాసం ఏర్పరచుకొన్నాడు.” నిజం!
  ధన్యవాదాలు సర్!

 5. మెర్సీ మార్గరెట్ says:

  ఏల్చూరి మురళీధరరావు గారు ధన్యవాదాలు . మీరు పరిచయం చేసిన “ఛు యువాన్ ” ని బట్టి మీకు కృతజ్ఞురాలను. మంచి వ్యాసాన్ని అందించారు . కన్నీటి కవితలో జీవితప్రహేళిక అనే మీ వ్యాసం ఆయన గురించి మరింత వెతికి తెలుసుకునేదిగా చేసింది . ధన్యవాదాలు

 6. ఏల్చూరి మురళీధరరావు says:

  మాన్యులు శ్రీ శివరామకృష్ణ గారికి
  నమస్కారములతో,

  వ్యాసరచన మీవంటి రసజ్ఞుల ఆదరానికి పాత్రమైనందుకు ఎంతో సంతోషమైంది. మీ సౌహృద్యవాక్యాన్ని చదువుతున్నప్పుడు “అజ్ఞానానికి అజ్ఞాతాజ్ఞేయాలతో నేస్తం” అన్న అందమైన అబ్బూరివారి గేయం స్ఫురణకు వచ్చింది. అది సత్యార్థప్రకాశమే 

  మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!

 7. ఏల్చూరి మురళీధరరావు says:

  సహృదయిని మెర్సీ మార్గరెట్ గారికి
  నమస్కారములతో,

  మీ సౌజన్యోదితానికి కృతజ్ఞుణ్ణి. ఈ లఘువిలేఖితం మిమ్మల్ని మహాకవి ఛు యువాన్ కృతుల గవేషణకు ప్రేరేచి ఉండటం రచనకు సార్థకతను కూర్చింది. ధన్యోఽస్మి.

 8. Professor K.Sujatha says:

  బాగుంది . మీ భాష ప్ర తిమ ( కమాండ్) మాములు పాఠకుల కు ఇబ్బంది కరం అనిపిస్తుంది . ముఖ్యంగా కవితల అనువాదం లో వాడిన భాష. కొంచం సులభతరం గ మాముల భాష లో వ్రాస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. బహుశ , నా తెలుగు భాష ప్రజ్ఞానం లోపం కూడా కావచ్చు . సాహిత్యం కవులని రచితల కె కాదు మాముల వాళ్ళు ను చదివెంచే ది గ వుంటే మంచిది .
  కే. సుజాత
  న్యూ ఢిల్లీ

 9. గురుదేవులకు ప్రణామములు..

  అధ్బుతం మీ కన్నీటి కవితలో జీవిత ప్రహేళిక, సాహిత్య ద్రువతార ఛు యువాన్ గురించి చదివి ముగ్డులమైతిమి సుమండీ.. సాహిత్య సేవకు కష్టములు, విషాదాలు మరియు వయస్సు అడ్డం కాదనిపించింది. ఆ మహనీయుని చరితము తరతరాలు గుర్తుండిపోతుంది. ఇంతటి అధ్బుతమైన చరిత్ర మాకందించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు.

  వరప్రసాదు.
  ఏలూరు

మీ మాటలు

*