కథలకు కొత్త వేకువ – లద్దాఫ్ని

 

   kaifiyath

 

   ‘హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌’లా గాకుండా గొంతు సరాయించుకొని ధిక్కార స్వరాన్ని, తన సొంత అస్తిత్వాన్ని అంతర్జాతీయ వేదికపై సైతం ఆలాపన చేస్తుంటే అగ్రకుల, బ్రాహ్మణాధిపత్య భావజాల ఆనకొండలు ఎప్పటికప్పుడూ ఆమెను మింగెయ్యాలని చూసినై. అనకొండల నుంచి తప్పించుకుంటూ దిగ్గజాలను ఢీకొంటూ తన సాహిత్యానికి సానబెడుతూ ఉంటే మరోవైపు పితృస్వామ్యం, పురుషాధిపత్యం ఫత్వాలను జారీ చేసింది. కలానికి సంకెళ్ళు వేయజూసింది. ఆంక్షలు విధించింది. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు, స్వీయ ఉనికిని చాటుతున్న పూల విహంగాన్ని సైలెంట్‌ మిస్సైళ్లతో కూల్చాలని ప్రయత్నం చేసినారు. అయినా తన రేజర్‌ ఎడ్జ్‌ లాంటి షార్ప్‌నెస్‌తో అటు కవిత్వంలోనూ, ఇటు కథల్లోనూ షాజహానా తమ జీవితాల్ని  చిత్రిక గట్టింది. దూదేకుల బతుకుల్ని బాధిత, పీడిత మహిళా దృక్కోణంలో ఆవిష్కరించారు. ముఖ్యంగా దూదేకుల మహిళ దయనీయ స్థితిని రికార్డు చేసింది. నిజానికి తెలుగు సాహిత్యంలో కుటుంబ, ప్రేమ, రాజకీయ కథలు వచ్చినంతగా పేదరికాన్ని అంత బలంగా చిత్రించిన కథలు ఎక్కువగా రాలేదు. షాజహానా మాత్రం అణగారిన పేద బతుకులకు అక్షరాలద్దింది. బ్రాహ్మణాధిపత్యాన్ని బరిబత్తల చేసింది. కొందరు ఎనుకముందాడుతుంటే ఆమె ‘బిల్లి’మెడలో గంట కట్టి ఊరేగించింది. ‘నాన్‌ వెజ్‌’ని తినిపించింది. చైతన్య స్రవంతి పద్ధతిలో కవితాత్మకంగా కథలల్లింది. ‘మనిషి పగిలిన రాత్రి’లో ‘మంచిరాయి’ని వెతుకుతానని ‘వాదా’ చేసింది. తెలుగు సాహిత్యంలో నెలకొన్న ఖాళీలను కొంత పూరించింది.

తాజాగా వెలువడ్డ ‘లద్దాఫ్ని’ కథల సంపుటిలో వేదనాభరితమైన ముస్లిం/దూదేకుల మహిళల పేదరికాన్ని, దుర్భర జీవితాల్ని, అవిద్య, గుర్తింపుకు నోచుకోని అవిశ్రాంత శ్రమను, ఆచార వ్యవహారాలు, తాగుడు వ్యసనం, తినేతిండి, ప్రేమల్ని కథల్లో చర్చించింది. లైంగిక దోపిడీని నాలుగ్గోడల మధ్య నుంచి నడి రోడ్డు మీదికి తెచ్చింది. సన్నాయి ఊదింది. నిద్ర నటిస్తున్న  వారిని మేల్కొల్పింది. సోయిమాలినోళ్ళ మీద కొరడా ఝులిపించింది. ముసుగులో గుద్దులాట కాదు. తన మనసులో ఏముందో చెప్పింది. మెదడుకు పని పెట్టింది. తన చుట్టూ ఉన్న జీవితాల్ని పెద్దమ్మ, అమ్మమ్మ, అత్తగారిల్లు, పనిచేసే చోటు, కళ్ళముందరి సమాజాన్ని అక్షరీకరించారు. ఇవన్నీ బురఖాల్లో, చీకట్లో, పురుషాధిపత్య సర్పపరిష్వంగంలో ఇప్పటి వరకు కప్పివేయబడి ఉన్నాయి. వాటన్నింటినీ నఖాబ్‌ తొలగించి వెన్నెల్లో ఆరబోసింది. బంధనాలు తెంచుకొని అక్షరాలను తెలుగు వాకిట అలికింది. ‘సితారే జమీ పర్‌ బిఛాతే రహు’ అంటూ ఉంది.

   గతంలో నఖాబ్‌, దర్దీ కవితా సంపుటాలు, స్కైబాబతో కలిసి చాంద్‌తారల్ని పూయించిన షాజహానా కవిగా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తన కవితల్ని వినిపించారు. ముస్లిం స్త్రీవాద కవిగా తనదైన ముద్ర ఏసిండ్రు. ఇప్పుడు తాజా పుస్తకం ‘లద్దాఫ్ని’తో ముందుకొచ్చింది. వెల్‌కమ్‌ టు లద్దాఫ్ని. నిజానికి ఇంతరకూ ‘ప్యూర్‌ ముస్లింలు’ తమ తోటి దూదేకుల వారిని హేళన చేస్తూ ‘లద్దాఫ్‌’ అని పిలిచేందుకు వాడేవారు. అదే విషయాన్ని దూదేకుల స్త్రీకి అన్వయిస్తూ షాజహానా 1998లో తన స్వీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, అవహేళనగా మారిన, అబ్యూజ్‌ అయిన పదానికి ఆత్మగౌరవాన్ని అద్దేందుకు

    ‘‘అబ్‌ సౌబార్‌ సబ్‌కే సామ్‌నే చిల్లావుంగీ

    హా… మై లద్దాఫ్నీ…హు!

           లద్దాఫ్నీ హీ రహూంగీ…’’ అని నినదించింది. తెలుగు అక్షరాల్లో ఉర్దూలో నినదించిందంటే ‘ప్యూర్‌ ముస్లిం’ని టార్గెట్‌ చెయ్యడమే ఉద్దేశ్యం. అందులో ఆమె సఫలీకృతమయింది. ఇప్పుడు ‘లద్దాఫ్ని’ పేరు తన కథల పుస్తకానికి పెట్టుకోవడమంటేనే తన స్వీయ అస్తిత్వాన్ని చాటుకోవడమే గాకుండా, సమాజంలో గౌరవాన్ని సాధించుకోవడంగా చూడాలి. తెంగాణలో ఇంకా చెప్పాలంటే మొత్తం తెలుగు సాహిత్యంలో (ఖాదర్‌ని మినహాయిస్తే) ముస్లిం జీవితాలు రికార్డు కావడానికి గట్టి పునాదులు ఖాజా, స్కైబాబ, అఫ్సర్‌, యాకూబ్‌, షాజహానాలు వేశారంటే అతిశయోక్తి కాదు. వీళ్ళంతా బాబ్రీ, గోద్రా, దాద్రీ, గుజరాత్‌, ముజఫర్‌ నగర్‌, హైదరాబాద్‌ను అతి దగ్గరగా చూడడమే గాకుండా నిరసన గళమెత్తిన దారిదీపాలు. తమ శక్తినంతా  చమురుగా చేసి సాహిత్య కాగడాలుగా వెలిగిస్తున్నారు. దీనికి తోడు షాజహానా తెలంగాణలో ‘మట్టిపూలు’ పూయిస్తున్నారు. స్త్రీ వాదం ముసుగులో కొనసాగుతున్న కోస్తాంధ్ర మనువాదాన్ని నిలదీశారు. నమ్మిన భావాజాలాన్ని నిక్కచ్చిగా, నిజాయితీగా ఆచరిస్తున్నారు.

sha

    ఇవ్వాళ ముస్లింల దుస్థితిని మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరముంది. ముస్లింల హక్కుల గురించి మాట్లాడితే, ధిక్కార స్వరాన్ని వినిపిస్తే దేశద్రోహిగా ముద్రవేసే దుర్మార్గమైన పరిస్థితి ప్రస్తుతం దేశమంతటా నెలకొంది. ఢిల్లీ జెఎన్‌యూ ప్రధాన కార్యదర్శి షెహ్లా రషీద్‌ ప్రభుత్వ దమనకాండను, హక్కుల అణచివేతను నిలదీసినందుకు హిందూత్వ వాదులు హతమారుస్తామని ఆమెను బెదిరిస్తున్నారు. అదే వర్సిటీ విద్యార్థి ఉమర్‌పై దేశద్రోహం కేసు నమోదు చేసిండ్రు. ఆయన చేసిన ‘నేర’మల్లా ఉరిశిక్ష రద్దు కోరడమే! ఈ దేశంలో ఉండాలంటే మేము చెప్పినట్లు వినాలే లేదంటే పాకిస్తాన్‌కు పోవాలె అని బిజెపి ఎంపీలే ఉగ్రోపన్యాసాలిస్తున్నారు. కాషాయ మూక ప్రవచించేదే దేశభక్తి. వీళ్ల ఉన్మాద నినాదాలకు కోరస్‌ ఇవ్వనట్లయితే కుత్తుకలు ఉత్తరిస్తామని బరితెగిస్తున్నారు. ఆవు మూత్రానికి ఉన్న విలువ మనిషి ప్రాణానికి లేకుండా పోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ముస్లింలుగా, ముస్లిం స్త్రీలుగా మరింత లోతుగా జీవితాల్ని సాహిత్యీకరించాల్సిన అవసరముంది. ఖాళీలను పూరించాలి. అగ్రకుల సాహిత్య సంస్థలు, మీడియా సైలెంట్‌గా ఉన్న అంశాల్ని ఎజెండా మీదికి తీసుకురావాలి.

    నిజానికి దేశ విభజన, హైదరాబాద్‌ రాజ్యం బలవంతపు విలీనం నుంచి బాబ్రీ మసీదు మీదుగా తెలంగాణ ఏర్పాటు వరకూ ఆ తర్వాతి పరిస్థితుల్లో ముస్లిం/దూదేకుల జీవితాల్లో వచ్చిన, వస్తూ ఉన్న మార్పును కొంచెం సామాజిక స్పృహతో చూసినట్లయితే ముస్లిం సమస్యను మరింత సులువుగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. గల్ఫ్‌ వాకిళ్లలో షాదీ పేరిట షేక్‌ల చెరలో చిక్కుకున్న చిన్నారుల జీవితాలు, అత్యాచారాలు అన్నీ సాహిత్యం లోకి రావాలి. ఇవ్వాళ తెలుగులో రాస్తున్న ముస్లిం మహిళల్ని ఒక్క చేతి వేళ్ళమీద లెక్కబెట్టొచ్చు. అలాగే ఉర్దూలో రాస్తున్న హైదరాబాదీలు మహా అంటే ఇంతకు రెండింతలు ఉండొచ్చు.  అయితే వీళ్లలో ‘ఇస్లాం స్వీకరించినా ‘దూదేకుల’, ‘లద్దాఫ్‌’, ‘పింజారి’ ‘నూర్‌భాష్‌’ లాంటి పేర్లతో పిలువబడుతూ.. అవహేళన చేయబడుతూ..ఇస్లాం స్ఫూర్తికి విరుద్ధంగా న ఘర్‌ కా న ఘాట్‌ కా’ గా మారిన వారి జీవితాల గురించి కన్సిస్టెంట్‌గా రాస్తున్నది ఒక్క షాజహానానే అంటే అతిశయోక్తి కాదు.

    ‘‘నువ్వు ఎలా పెరిగావో నాకు తెలీదు. కాని నేను కనపడని కత్తులు మెరిసే చూపుల మధ్య పెరిగాను. ఏం చేయాలన్నా, ఏం చదవాలన్నా ఆఖరికి ఏం కట్టుకోవాలన్నా ఏం తినాలన్నా అమ్మా నాన్న, నానమ్మ తాతయ్య, అన్నయ్య ఇంటి పక్కవాళ్ళు, ఇంటెదురువాళ్ళు, వీధి వాళ్ళు… ఇన్నిన్ని ఆంక్షల మధ్య నేను పొందే ఉపశమనం ఒక్క ఈ లైబ్రరీ మాత్రమే’’ అని ముస్లిం స్త్రీలపై ఉన్న ఆంక్షల్ని ఎత్తి చూపింది.

    షాజాహానా సంప్రదాయ వ్యతిరేకి. పక్కా ప్రజాస్వామిక వాది. సంప్రదాయాన్ని వ్యతిరేకించినందువల్ల మైనారిటీల్లో మెజారిటీ వర్గం ఆగ్రహానికి గురయింది. దూదేకుల మహిళ కావడంతో సహజంగానే హిందూ ఫండమెంటలిస్టులకు కూడా  ఆమె వైఖరి నచ్చలేదు. దీంతో అటు ముస్లిం, ఇటు హిందూ అతివాదులను ఎదుర్కొంటూ సాహితీ సృజన చేశారు. మతోన్మాదులనే కాదు కులాన్ని అర్థం చేసుకోవడంలో విఫమయిన లెఫ్టిస్టులూ  ఆమెపై కన్నెర్ర జేసిండ్రు. లెఫ్టిస్టులు కులాన్ని అర్థం చేసుకోవడంలో ఎలా విఫలమయ్యారో ముస్లింలను అర్థం చేసుకోవడంలో కూడా అలాగే విఫలమయ్యారు.  ఎంత సేపు ఆర్థిక దృష్టితోనే సమాజాన్ని చూశారు. కొలిచారు. అరచేతిలో స్వర్గం చూపిచ్చిండ్రు. ఆర్థిక అసమానతలు  తొలగితే సమసమాజం ఏర్పడుతుందనే థియరీనే చెప్పారు తప్ప ప్రాక్టికల్స్‌ని పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే కుల, మత సమస్యలు వామపక్షీయుల ఎజెండా మీదికి రాలేదు.

    నిజానికి ప్రపంచీకరణే ప్రధాన శత్రువు అని కొత్తతరానికి దిశానిర్దేశం చేసిన వామపక్షీయులు కన్వీనియెంట్‌గా  బాబ్రీమసీదుని ‘కూల్చడం’పై నిశ్శబ్దంగా ఉన్నారు. ముస్లింలను చైతన్య పరిచేందుకు వీరికి అనుబంధంగా పనిచేస్తున్న సాహితీ సంస్థలు, సాహితీ వేత్తలు ఎలాంటి చొరవ చూపలేదు. అన్ని ఎన్‌కౌంటర్లూ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు వ్యతిరేకమయినవే! అయితే కొంత మంది మేధావులు మావోయిస్టు ఎన్‌కౌంటర్లను మాత్రమే ఖండిరచి ‘ఆలేరు’ ఎన్‌కౌంటర్‌పై నిశ్శబ్దాన్ని పాటించారు.  చావులో కూడా ముస్లింలపై వివక్ష ఇంకా కొనసాగుతోంది. తెలుగు ప్రాంతాల్లో కారంచేడు, చుండూరు సంఘటనలు దళితోద్యమానికి దిశా నిర్దేశం చేశాయి. అలాగే బాబ్రీ మసీదు షహీద్‌ కావడం, బొంబాయి అల్లర్లు, ఉరితీతలు సాహిత్యంలో స్థానం సంపాదించుకోలేక పోయాయి. కనీసం బహిరంగంగా మాట్లాడుకునేందుకు చర్చనీయాంశాలు కాకుండా పోయాయి. వామపక్ష పార్టీలు, సాహితీవేత్తలు, వారి అనుబంధ సాహిత్య సంస్థలు దాన్నొక ఉద్యమంగా తీర్చి దిద్దడంలో విఫమయ్యారు. గుజరాత్‌ గాయం నుంచి మాత్రమే ముస్లిం సాధకబాధకాలు తెలుగు సమాజానికి తెలియ వచ్చింది. అది కూడా హైదరాబాద్‌ నుంచి గుజరాత్‌ రిహాబిలిటేషన్‌లో పాల్గొన్న ముస్లిం కవుల పుణ్యమా అని ఆ విషయం చర్చనీయాంశమైంది. మొత్తం తెలుగు సమాజాన్ని వీళ్ళు కదిలించగలిగారు. బాధితుల పట్ల సానుభూతిని, వారి పోరాటానికి సంఫీుభావాన్ని సాధించగలిగారు.

    బాబ్రీ మసీదు సంఘటన ఒక కట్టడం కూల్చివేతగా కాకుండా ఒక నమ్మక ద్రోహంగా, గంగా`జమునా తెహజీబ్‌లో దరార్ గాచూడాలి. ఆనాటి నుంచే తెలుగు సమాజం కూడా హిందూ`ముస్లింలుగా చీలిపోవడం ప్రారంభమయింది. ఈ చీలిక జిల్లాల్లో కూడా కనిపించింది. ఈ చీలిక నేపథ్యంలో బిజేపీ, దాని అనుబంధ సంస్థల ఆగడాలు గుజరాత్‌లో గాయాలు చేశాయి. దేశమంతటా చిచ్చు బెడుతున్నాయి. గ్రామాల్లో ముస్లింలు బతకలేని దుర్భరమైన పరిస్థితి నెలకొంది.  పీర్ల పండుగ చేసుకోలేని స్థితి. అట్లనే దర్గాకు పొయ్యెటోళ్ల మీద ఆంక్షలు. వీటన్నింటి నేపథ్యంలో షాజహానా కథల్ని (కవిత్వాన్ని కూడా) పరిశీలించాలి. విశ్లేషించాలి. కథలన్నీ ఒకదానికొకటి సంబంధం లేనివిగా పైకి కనిపిస్తున్నప్పటికీ అత: సూత్రంగా ముస్లిం మహిళా దృక్కోణం కనిపిస్తుంది. అంతేకాదు చైతన్య స్రవంతి పద్ధతిలో కథలు రాసి తన ప్రతిభను చాటుకున్నారు.

    సిల్‌సిలా కథ దుర్భర పేదరికాన్ని రికార్డు చేసింది. తాగుడు వ్యసనాన్ని, అవిద్య, గ్రామాల్లో ఎన్ని పనులు చేసినా రెండు పూటల తినడానికి తిండిదొరకని దయనీయ స్థితి. మాదిగ వాడలకు ఆనుకొని ఉన్న దూదేకుల కరీంబీ ఎన్ని ఢక్కామొక్కీలు తింటూ జీవితాన్ని గడుపుతున్నది షాజహానా హృద్యంగా చిత్రించింది. ‘‘ఇంగ మీ బడెబాపు ఎండా కాలం వాయించబోతడు, కతం, బిడ్డా! గా వాయించబోయినపుడు దెచ్చిన పైసలే పైసలు! ఇంగ పైసా సంపాయించడు. మీంచి దినామూ తాగుడు గావాలె. గా మూన్నెల్ల సంపాదన ఎన్నాలొస్తది నువ్వే చెప్పు బిడ్డా. నిఖా అయిన  కాణ్ణుంచి ఇప్పటిదాంక సుఖమంటేందో ఎర్కలేకపాయె! నాట్లకు, కలుపుకు, కోతకు బోవుడు.. అయినంక పెసలేర, దూదేర, మీర్చేర బోవుడు. ఏ పని దొర్కితే దానికి బొయ్యి పుట్టెడు పుట్టెడు గింజలు దెచ్చి ఇంట్ల బోస్తుంటే సంసారం నడుస్తుండె’’ అంటూ గ్రామీణ ప్రాంతాల్లో దూదేకుల స్త్రీలు పడుతున్న కష్టాలను, తెచ్చిన గింజలు తీస్కపోయి తాగుడుకు అలవాటయిన భర్తల్ని భరిస్తున్న భార్యల్ని షాజహానా కళ్ళకు కట్టిండ్రు. ఏడాదిలో కేవలం మూన్నెళ్ళు మాత్రం పనిదొరికే స్థితిలో మగవాళ్ళు, అందుకు తాగుడు తోడు కావడం మహిళపై భారం ఎంత పడుతుందో ఈ కథ తెలియజెప్పుతుంది. కరీంబీ ఒక్క షాజహాన పెద్దమ్మే కాదు. కింది కులాల వారి ప్రతి ఇంట్లో ఇట్లాంటి పెద్దమ్మో, చిన్నమ్మో కనిపిస్తారు. పేదరికమెంత దుర్భరంగా ఉన్నా ప్రేమ, ఆప్యాయతలకు, కమ్మని కాయి బువ్వకు ఎక్కడా లోటు రాదు.

    ‘సండాస్‌’ పూర్తిగా ముస్లిం స్త్రీ కథ. గ్రామాల్లో కింది కులాల వారందరూ చెంబట్కొని ఊరవుతలికి బహిర్భూమికెల్తరు. అయితే ముస్లిం స్త్రీలు  ఇంట్లోనే సండాస్‌కెల్తరు. పురుగులు జిబజిబలాడే సండాస్‌ కథ సదువుతుంటే ముక్కుకు వాసన పట్టేస్తదంటే కథ శక్తి అర్థం చేసుకోవొచ్చు. అనివార్యంగా కర్చీఫ్‌ని ముక్కుకు అడ్డం పెట్టుకొని కథ చదివేలా ఉంటది. పెండ్లికి ఇల్లు అమ్మి కిరాయింటికి మారే తల్లి, చెల్లి దీనగాథ కూడా ‘సండాస్‌’లో ఉంది. పాయఖాన సాఫ్‌గ ఉన్న తన ఇంటికే భర్తను తోడుకొని వచ్చి కాపురం పెట్టాలని ఆలోచిస్తున్న దశలో తల్లి పెళ్ళి కర్సు కింద యిల్లు అమ్మి రేకుల యింటికీ అదీ సండాస్‌ మాత్రమే ఉన్న ఇంటికే కిరాయికి మారడంతో కథ ముగుస్తుంది. స్త్రీ దృష్టి కోణంలో బహిర్భూమిని కూడా కథాంశంగా చేయడమే గాకుండా ప్రస్తుతమున్న భారీ స్వచ్ఛభారత్‌ పథకాలు, ప్రచారార్భాటాలు లేని కాలం లోనే పేదరికం దాని ద్వారా అంటిన అపరిశుభ్రతని ఆంగ్ల పుస్తకాల్లోకి కూడా ఎక్కించింది. కవితాత్మకంగా చైతన్య స్రవంతి పద్ధతిలో రాసిన మంచిరాయి నిజంగా ఫిలాసాఫికల్‌ అప్రోచ్‌తో సాగుతుంది. అట్లాంటిదే మరో కథ ‘మనిషి పగిలిన రాత్రి’. పెళ్ళుబుకుతున్న దు:ఖ సముద్రాలను, ఎంత అణచుకున్న అణగారని హృదయాంతరాల్లోని అలల్ని అక్షరీకరించారు. ‘వాదా’ ‘నేను’ కథల్ని ప్రేమకు ప్రతిరూపాలుగా ఆవిష్కరించారు. రంది కథా సంకనంలో బిల్లి కథ తీసుకున్నప్పుడు కొంతమంది శైలీ, శిల్పాలను లెక్కబెట్టిండ్రు. ఈ లెక్కబెట్టినోళ్ళంతా అగ్రకుల బాపనోళ్ళే. ‘బిల్లి’ కథలో అలెగరీ పద్ధతిలో బ్రాహ్మణిజాన్ని దోషిగా నిలబెట్టింది. టిఫిన్‌ బాక్స్‌ కథలో కూడా అంటు పాటించే అగ్రకులాల వారికి బుద్ధి చెప్పింది. అలాగే దివారే కథ తాత్విక చింతనను ఒక గైడ్‌, ఫిలాసఫర్‌ లాగా మెదళ్లలోకి ఎక్కేలా చెప్పింది. ఖతీజ గఫూరి కథలో లైంగిక దోపిడీకి గురవుతున్న ముస్లిం సమాజాన్ని ఆర్ద్రంగా చిత్రించింది. కంచెకాకర కథలో ఇంకా మనుషుల్లో మిగిలి ఉన్న మంచిని తెలియ జెప్పింది.

    ఒక దూదేకుల మహిళ చదువుకోవడమే గొప్ప. అలాంటిది పిహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ అందుకున్న విద్యావంతురాలు షాజహాన. చదువుకున్న కాలం నుంచి పనిచేస్తున్న కాలం వరకూ తాను అనుభవించిన, చూసిన జీవితాల్ని అక్షర బద్దం చేసింది. అంబేద్కర్‌ కృషి వల్ల  ‘హిందూ కోడ్‌ బిల్లు’ వచ్చి హిందూ స్త్రీలకు విడాకులు తీసుకోవడానికి వీలు ఏర్పడింది. అయితే ఇందుకు భిన్నంగా ముస్లిం సమాజంలో ఉన్న తలాక్‌ పద్ధతిని వ్యతిరేకిస్తూ కవిత్వమల్లింది. ఈ విషయం ఇప్పుడు మళ్ళీ   రంగం మీదికి వచ్చింది. దేశభక్తి వర్సెస్‌ దేశద్రోహం చర్చలు కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్న వాళ్ళు హేట్‌ పాలిటిక్స్‌ని, హేట్రెడ్‌ను  ప్రచారం చేస్తున్నారు. సహనానికి తావు లేకుండా అసహనంతో ఊగిపోతున్నారు. క్రికెట్‌లో పాకిస్తాన్‌ ఓడిపోవాలని ప్రార్థించడం దేశభక్తికి గీటురాయిగా మారింది. ఎవ్వరు బాగా ఆడితే వాళ్ళు గెలవాలె అంటే దేశద్రోహిగా ముద్ర వేస్తున్నారు. నిజానికి ముస్లింలంటేనే పాకిస్తాన్‌కు పంపించేయాల్సిన వాళ్ళు అని సంఫీుయుల ఉవాచ. పాకిస్తాన్‌లో ఏమో గానీ ఇండియాల మాత్రం ‘దాయాది’ని సాకుగా చూపిస్తూ ప్రజలు ఆకలితో చస్తున్నా అణ్వస్త్రాల స్టాకును పెంచుతున్నారు. దేశ ప్రజల మధ్య చిచ్చు రేపే ప్రకటనలే తప్ప ప్రేమ, ఆప్యాయతలకు ప్రభుత్వ చర్యల్లో తావుండదు. ఇట్లాంటి పరిస్థితుల్లో షాజహానా రచనలు అటు బురఖాను, తలాక్‌ని ఎదిరించినందుకు ముస్లింలకు, బ్రాహ్మణీయ భావజాలాన్ని, హిందూ అగ్రకుల మతోన్మాదాన్ని నిరసించినందుకు ‘హిందువుకు’ కంటగింపుగా మారాయి. ఇప్పుడు కంటగింపుగా మారినా భవిష్యత్‌లో అందరికీ సమానమైన విలువ దక్కే సమాజ నిర్మాణానికి ‘లద్దాఫ్ని’ కథలు  ఖాళీలు పూరించే ప్రయత్నంలో భాగంగా చూడాలి. మరిన్ని ఖాళీల పూరింపుకు మరిన్ని కథల్ని ఆమె నుండి ఆశిస్తూ…

*

మీ మాటలు

 1. విలాసాగరం రవీందర్ says:

  మంచి విశ్లేషణ సార్

 2. Y Pradeep says:

  ” ‘హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌’లా గాకుండా గొంతు సరాయించుకొని ధిక్కార స్వరాన్ని, తన సొంత అస్తిత్వాన్ని అంతర్జాతీయ వేదికపై సైతం ఆలాపన చేస్తుంటే అగ్రకుల, బ్రాహ్మణాధిపత్య భావజాల ఆనకొండలు ఎప్పటికప్పుడూ ఆమెను మింగెయ్యాలని చూసినై. అనకొండల నుంచి తప్పించుకుంటూ దిగ్గజాలను ఢీకొంటూ తన సాహిత్యానికి సానబెడుతూ ఉంటే మరోవైపు పితృస్వామ్యం, పురుషాధిపత్యం ఫత్వాలను జారీ చేసింది. కలానికి సంకెళ్ళు వేయజూసింది. ఆంక్షలు విధించింది. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు, స్వీయ ఉనికిని చాటుతున్న పూల విహంగాన్ని సైలెంట్‌ మిస్సైళ్లతో కూల్చాలని ప్రయత్నం చేసినారు. అయినా తన రేజర్‌ ఎడ్జ్‌ లాంటి షార్ప్‌నెస్‌తో అటు కవిత్వంలోనూ, ఇటు కథల్లోనూ షాజహానా తమ జీవితాల్ని చిత్రిక గట్టింది” సాజహానాని పొగడాలంటే ఈ అనకొండల వాక్యాలవసరమా?
  “క్రికెట్‌లో పాకిస్తాన్‌ ఓడిపోవాలని ప్రార్థించడం దేశభక్తికి గీటురాయిగా మారింది.” ఆంధ్రా వాళ్ళని ఎంత బాగా తిడితే అంత గొప్ప తెలంగాణా వాది అయినట్లుగా . ఇంకా కమ్మ్యునిస్తుల పైనా, ఇతరుల పైనా సంగిసెట్టి విసుర్లూ కసుర్లూ తన అజ్ఞానానికి నిదర్శనంగా ఉన్నాయి.

  • శ్రీనివాసుడు says:

   **Much that passes as idealism is disguised hatred or disguised love of power ** – Bertrand Russell
   “I don’t hate you.. I just don’t like that you exist”
   ― Gena Showalter, Seduce the Darkness
   “Hate, it has caused a lot of problems in the world, but has not solved one yet.”
   ― Maya Angelou
   “In time we hate that which we often fear.”
   ― William Shakespeare, Antony and Cleopatra
   “Hatred is the coward’s revenge for being intimidated.”
   ― George Bernard Shaw

 3. S.Radhakrishnamoorthy says:

  Great literature and hatred do not go together.The writer,Sahjahaanaa, I am sure has no such hatred.She might just be justly indignant, as an artist should be. The review has done great injustice to the writer and to her art . It has blocked many possible readers from her writings. The review makes needless and uncalled for observations like ‘kostaa manuvaada’.And what is this hegemony of the Brahmins? Where is it? One would like to see it. The brahmin is the most insignificant,ineffective,powerless factor in the society.Why is he targeted ad nauseum? Invent some other ghost,if you need one to frighten your fold.

  • శ్రీనివాసుడు says:

   అమ్మయ్య! మాయా బ్రాహ్మణ భూతాన్ని గురించి ఒక్కరు ఇన్నాళ్ళకయినా మాట్లాడినందుకు సంతోషంగా వుంది రాధాకృష్ణమూర్తిగారూ! గత రెండు, మూడు నెలలుగా ఈ సారంగ వ్యాఖ్యలలో విద్వేషులు సృష్టించిన ఆ భూతాన్ని ప్రశ్నిస్తూ అనేక విధాలుగా పోరాడుతూ వస్తున్నాను. ఇంకా చాలా భూతాలున్నాయి. హిందూ ఫాసిజం, బ్రాహ్మణ ఫాసిజంలాంటివి. నేను చూసిన కోణాన్ని మీరు కూడా చెప్పినందుకు కృతజ్ఞతలు. అవే ఈ భారతీయ సమాజానికి పట్టిన పీడ అనేవారిని గురించి కూడా మీ పరిశీలనని చెప్పవలసినదిగా మనవి.

   • S.Radhakrishnamoorthy says:

    శ్రీనివాసుడు గారూ,మన మాట వినిపించనిచ్చేవారు వినేవారు కూడా తక్కువై పోతున్నారు. నిజానికి నామాట పత్రికా సంపాదకులు అనుమతిస్తారని నేననుకోలేదు. మీ కొటేషన్లు చూసి ,మీరూ మీమాట ‘ఆ నోట ఆనోటా’ పలికించారని తెలిసి నా మాట చెప్పేశాను. చెప్పవలసింది చాలా ఉంది. సమాజంలో వాతావరణం అనుకూలంగా లేదు. ద్వేషం సాహిత్యంగా చెలామణి అవుతున్నది. దానికి మార్కెట్ బాగా ఉన్నది కదా! రాద్దాం. మన మనసులోని మాట చెప్పుకొంటూ పోదాం. చేప్పనిచ్సినన్ని నాళ్ళు. చాలాకాలం ఆ అవకాసము ఉండక పోవచ్చు. ధన్యవాదాలు.

 4. సమజంపై ఆదిపత్యం ఎవరీ చేతుల్లో ఉంటుందో వారి ఆలోచనులే సత్యాలుగా చలామణి అవుతాయీ అంటాడు- మార్క్స్ ఈదేశం
  పై ఆధిపత్యం ఎవరీ చేతిలో ఉందొ తెలియని అమాయకులు కారు ( బహుజనులకు అందరికి అర్ధం కాకున్నా- ఆధిపత్యం ద్వార లభించే అధికారాన్ని, హోదాను, సంపదను అనుభవిస్తున్న భ్రాహ్మన మేధావులకు అర్ధం కాదు అంటే అబద్ధం ) సమాజంలో మార్పు రావాలని కోరుకునేవారు అమలు లో ఉన్న సంప్రదాయ ఆదిపత్యాన్ని దెబ్బ కొట్టేలా చేయడం మెదటి కర్తవ్యమ్. మా ఆధిపత్యం యాడుంది అని అడగోచు- ఉదాహరణకు ఈదేశంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలను ఏ కులం నడిపిస్తుంది, రెండు తెలుగు రాష్ట్రాలలో పత్రికల్లో, టీవీ చానెల్స్ లో ఎడిటర్స్ ఏ కులం వారున్నారు, ఇంగ్లీష్ చానెల్స్ మెజారిటీ ఉద్యోగులు ఏ కులం, క్రికెటర్ల లో మెజారిటీ క్రికేటర్లది ఏ కులం – ఇవి తెలవక కాదు కాని, ఇవాల బహుజన్ సమాజం ప్రశించటం మెదలుపెట్టే సరికి అబ్బే అదేంటి “ద్వేషం” నింపుతున్నా రంటున్నారు

 5. MUDDANA SUDHAKARA RAO says:

  పత్రికల్లో , టీవీ చానల్స్ లో ఎడిటర్స్, క్రికెటర్స్ కులాన్ని బట్టి నియమించా బడిన వాళ్ళు కాదు , వాళ్ళ వ్యక్తిగత ప్రతిభ తో ఆ స్థాయికి వచ్చారు.

  అన్నిటికీ బ్రాహ్మణా వాదం , హిందుత్వం ,ఆంధ్రావాళ్ళు అనటం ఒక ఫాషన్ గ మారింది.

 6. Y Pradeep says:

  “రాజకీయ పార్టీలను ఏ కులం నడిపిస్తుంది, రెండు తెలుగు రాష్ట్రాలలో పత్రికల్లో, టీవీ చానెల్స్ లో ఎడిటర్స్ ఏ కులం వారున్నారు, ఇంగ్లీష్ చానెల్స్ మెజారిటీ ఉద్యోగులు ఏ కులం, క్రికెటర్ల లో మెజారిటీ క్రికేటర్లది ఏ కులం – ఇవి తెలవక కాదు కాని, ఇవాల బహుజన్ సమాజం ప్రశించటం మెదలుపెట్టే సరికి అబ్బే అదేంటి “ద్వేషం” నింపుతున్నా రంటున్నారు” –ఏశాల శ్రీనివాస్.

  అసలు దళితులే ఎందుకు రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రీ ప్రధానమంత్రీ కాకూడదు. ఎప్పుడూ ఒకడ్ని ఆడిపోసుకోవడం తప్ప ఇంకో పనీ గినీ దళితులకు లేదా. బ్లాక్మెయిల్ రాజకీయాలకు చిహ్నంగా దళిత రాజకీయాలు తయారయినా ఆచ్చర్యపోనవసరం లేదు .

  పైగా మార్క్స్ కొటేషన్ ఒకటి..కుల వాదానికీ ఈ కొటేషన్ కీ సంబంధమేమిటో మరి .

 7. chandolu chandrasekhar says:

  కొన్ని నెలల క్రితం ,హిందూ లో ఒక వ్యాసం వచ్చింది .ప్రత్రిక రంగంలో ఓకే దళితుడు లేడని వేదన చెందుతూ . సచిన్ కి ఇచ్చిన అవకాశాలు మహార్ ఐన నేరానికి కాంబ్లి కి రాలేదని .

 8. దేవరకొండ says:

  ప్రైవేట్, కార్పొరేట్ రంగాల్లో కూడా రిజర్వేషాలు అమలవుతే సదరు లోటు కొంత వరకూ తీరవచ్చు. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. ఉన్న ఆ కాస్త మందీ కూడా ప్రతిభకు మాత్రమే గుర్తింపును, గౌరవాన్నీ ఇచ్చే పరాయి దేశాలకు ఎగిరిపోతే సామాజిక న్యాయం పేరుతో కులాల్ని కలకాలం పెంచి పోషించుకుంటూ కుమ్ములాడుకు చద్దాం!

  • chandrika says:

   @ దేవరకొండ గారు :
   ఇంకా ఆ రంగాలలో కూడా రిజర్వేషన్స్ కావాలా? మీ లాంటి వారెవరో H1వీసా లకి కూడా కోటా ఉండాలి అన్నారట. ‘ఆ రోజు కోసం ఎదురు చూద్దాం.’ – మరి రోజు కి 24 గంటలు పడి పడి చదివే రిజర్వేషన్స్ లేని పిల్లలు ఏమవాలంటారు? ‘ఆ కాస్త మందీ కూడా ప్రతిభకు మాత్రమే గుర్తింపును’ – అంటే ప్రతిభ కి కాకపోతే దేనికి గుర్తింపు ఇవ్వాలని మీ ఉద్దేశ్యం ? కుల నిర్మూలన రిజర్వేషన్స్ లో వద్దా? ఇలా వ్యాఖ్యలు వ్రాయడానికి బానే ఉంటుంది. ప్రతిభ దేనీకో అర్ధం అవ్వాలంటే ముందు ఈ ప్రశ్నలకి సమాధానం ఆలోచించుకోండి. ఎవరైనా నిజం గా పేరు తెలియని జబ్బు వస్తే ప్రతిభగల వైద్యుడు దగ్గరికి వెళ్తారా లేక ఇలా సూక్తులు మాట్లాడతారా? ఇల్లు కట్టుకుంటే, అత్తెసరి మార్కుల తో పాసయిన ఇంజనీర్ తో కట్టించుకుంటారా గోల్డ్ మెడల్ తెచ్చుకున్న వాడితో కట్టించుకుంటారా? ఈ రిజర్వేషన్స్ వల్ల బాగుపడ్డ కుటుంబాలు ఉన్నాయి. అది కాదనలేము. రిజర్వేషన్స్ తో చదువుకున్న కుటుంబాలు తిరిగి ఏమి ఇస్తున్నారు దేశానికీ ?

 9. దేవరకొండ says:

  పై పోస్టులో రిజర్వేషాలు అని వచ్చింది. (బహుశ: ద్వేషాలు అని చదివి, చూసి కావచ్చు) అది ‘రిజర్వేషన్లు’ గా చదువుకో గోర్తాను.

మీ మాటలు

*