ఇంతకీ ఎవరు గెలిచినట్లు ?

 

 

 

 

ఖాన్
అబ్బూఖాన్
మేకల అబ్బూఖాన్
ఆ ఊళ్ళో అబ్బూఖాన్ అంటే తెలియందెవరికి ?
ఎన్నో మేకలుండేవి అబ్బూఖాన్ దగ్గర
కావలసినవాళ్ళు అబ్బూఖాన్ దగ్గరికొచ్చి కొనుక్కుపోయేవాళ్ళు
వేట కోసం, జాతర కోసం, నోట్లో తగలాల్సిన ముక్క కోసం
కొనుక్కోటానికి వచ్చే రకరకాల జనాలు, వాళ్ళ మాటలు
చాలా కాలక్షేపంగా ఉండేది అబ్బూఖానుకు
పనిలో పనిగా పైకం కూడా
ఇహనేం ? ఇల్లు కట్టాడు, దాన్ని బంగళా చేశాడు
ఇంకా ఎన్నో ఎన్నో చేశాడు ఆ పైకంతో
 

అయితే అన్ని రోజులూ ఒకలా ఉండవుగా
ఎక్కడినుంచో ఒక తోడేలు వచ్చింది
అబ్బూఖాన్ ఇంటి పక్కనే ఉన్న కొండమీద ఉన్న కొండగుహలో కాపరం పెట్టిందయ్యోయ్
అబ్బూఖాన్ మేకలు, రోజూ ఈయన పెట్టేవి చాలక కొండగాలి తిరిగింది అని పాటలు పాడుకుంటూ కొండ మీదకెళ్ళిపోదామని చూస్తూ ఉండేవి
కట్టిన తాళ్ళు తెంచుకుని కొన్ని పోయేవి కూడాను
ఉన్నదాంతో సుఖంగా ఉండాలని లేకపోతే తాళ్ళు ఒక లెక్కా డొక్కా?
అంతే మరి , అలా పోయిన వాటిని చూసి మిగతావాటికి ఉబలాటం
ఒకటి అరా రెండూ మూడు నాలుగు ఇలాగలాగ కొన్ని రోజులకి మేకలన్నీ ఖాళీ
అబ్బూఖాను కానీ, ఆ ఊళ్ళో జనాలు కానీ ఆ తోడేలుని ఏమీ చెయ్యలేకపోయారు
తోడేలు రాజ్యంలో తోడేలు చెప్పినట్టే అన్నీ
సరే చివరిగా మిగిలున్న మేకలకు చెప్పి చూసాడు అబ్బూఖాన్
అటువైపు వెళ్ళబాకండి పోతారు అని
అయినా వింటేగా మేకల మంద
సందు చూసుకోవటం, స్వాతంత్రం లభించిందని పరుగెత్తుకుంటూ కొండమీదకు వెళ్ళిపోవటం
సందు మేకలకు, పసందు తోడేలుకి
అలా జీవితార్పణం చేసుకునేవి
కేవలం పచ్చని పచ్చగడ్డి కోసం, దూరపు కొండల నునుపు కోసం, బంధాల వంటి తాళ్ళ నుంచి స్వాతంత్రం కోసం
అబ్బూఖానుకు అర్థమయ్యేది కాదు
బాధపడుతూ ఉండేవాడు
చివరకు ఒకే ఒక్క మేకపిల్ల మిగిలింది
ఇదంతా చూసి అబ్బూఖానుకు ఓ రోజు చిరాకొచ్చింది
 

ఇక మేకలూ లేవు ఏమీ లేవు అని కూర్చున్నాడు
ఉన్న ఒక్క మేక పిల్లను అమ్మేద్దామనుకొన్నాడు
కానీ అలవాటైపోయిన ప్రాణం వల్ల చేతులు రాలా
ఏం చేస్తాడు ?
ఆలోచించి ఆలోచింది మొత్తానికి ఒక ఉపాయం చేశాడు
ఈ మేకపిల్ల కొండమీదకు పారిపోకుండా ఒక దొడ్డి ఏర్పాటు చేశాడు
దొడ్డి నిండా గడ్డి ఏర్పాటు చేశాడు
దొడ్డి నిండా తొట్లు పెట్టించాడు
దొడ్డి నిండా చెట్లు నాటించాడు
ఇక ఎటు నుంచి చూసినా కొండ కనపడితేగా
అన్నీ అయ్యాక ఒక బలమైన గుంజ కట్టాడు
ఆ గుంజకు ఇంకా బలమైన తాడు కట్టాడు
ఈ చివరన మేకపిల్లను తగిలించాడు
మేకపిల్ల చాలా అందంగా ఉండటంతో దానికో పేరూ పెట్టాడు
ఏమని ?
 

చాందినీ అని
చాందినీ అంటే ఏమిటి ?
చాందినీ అంటే మేలుకట్టు
చాందినీ అంటే చంద్రోదయం
అంతందంగా ఉన్నదీ మేకపిల్ల
ఒకసారి పేరు పెట్టామంటే అనుబంధం మరింత బలపడినట్టే
అది వస్తువు కావొచ్చు, జంతువు కావొచ్చు
ఇక ప్రాణాలన్నీ దానితో పెనవేసుకుపోయినట్టే
ప్రాణాలు పెనవేసి పెంచుతున్న మేకపిల్ల పెద్దదవుతున్నది
 

ఈయన తాడు పొడవు పెంచుతూనే ఉన్నాడు
కాసంత దూరపు గడ్డి అందుబాటుకు రావాలని
నోటికి పట్టాలని
పొట్టకు పట్టాలని
చిన్ని పొట్టకు శ్రీరామరక్ష అవ్వాలని
అయితే స్వాతంత్ర తృష్ణ ఉన్నది చూసారూ ?
దాని ముందు బంధాలు ఎంత?
ఆ అగ్గికి ఊతంగా జన్యువుల పాత్ర ఒకటి
పిల్ల వాళ్ళమ్మ కూడా స్వాతంత్రాభిలాషతో కొండ మీదకెక్కేసింది ఒకప్పుడు
పిల్ల వాళ్ల నాయన కూడా అదే అభిలాషతో కొండకు ఆహారమైపోయినాడు
అదే! కొండ మీద తోడేలుకు ఆహారమైపోయినాడు
ఆ జీవులు ఉత్పత్తి చేసిన ఈ చాందినీకి కూడా లోపల ఎక్కడో ఆ జన్యువు సలపరం ఉన్నది
అదే జీవోత్పత్తి క్రమం
అదే జీవన్యాయం
అదే ప్రకృతిన్యాయం
ఆ న్యాయం హృదయాల్లో ప్రతిష్టితమైపోతుంది
అది తప్పించుకోవటం ఎవరి వల్లా కాదు కదా
పెద్దదవుతున్న కొద్దీ ఆ తృష్ణా పెద్దదైపోయింది
తాడు తెంచుకోవాలని చూసింది
ఉహూ కుదరలా
ఇక ఇలాక్కాదని సత్యాగ్రహం మొదలుపెట్టింది
తిండి తినటం మానేసింది
అబ్బూఖానుకు అర్థం కాలా
అరే ఇదేమిటి ఇలా చిక్కిపోతున్నదని డాక్తర్లను పిలిపించాడు
వాళ్ళన్నారూ – నాయనా అబ్బూ, దీనికి మనోవ్యాధి పట్టుకున్నది, దానికి మందు లేదన్నారు
అది విని దిగాలుగా చాందినీ పక్కన కూర్చున్నాడు
నీక్కావలసినవన్నీ చేస్తున్నాం ఇంకా ఏమిటి నీ బాధ అన్నాడు
ఇదే సందు అని, కొండ మీదకు వెళ్ళాలి నేను అంటూ మనసులో మాట బయటపెట్టింది చాందిని
అవాక్కయ్యాడు అబ్బూఖాను
అరెరే, ఆ ఆలోచన ఎట్లా వచ్చిందే నీకు,

అక్కడ తోడేలు ఉన్నది అక్కడకు వెళితే అనవసరంగా చచ్చూరుకుంటావు అని చెప్పచూశాడు
వినలా, అసలు విననే వినలా
పైగా, సమర్థనగా –
అబ్బూజాన్, నువ్వెన్నా చెప్పు ఇక్కడ అంతా బందిఖానాగా ఉన్నది నాకు,
ఇక్కడ ఉండలేను, అయినా చూశావా దేవుడు నాకు రెండు కొమ్ములిచ్చాడు,
వాటితో ఆ తోడేలు పని కట్టేస్తానని బీరాలు పలికింది
ఇక ఇలా లాభం లేదని గుంజ నుంచి వేరు చేసి, గదిలో బంధించేశాడు
అయితే తెలివైన వాళ్ళు కూడా ఎక్కడో ఒకచోట తప్పు చేస్తారు
ఆ తప్పు అబ్బూఖాను, ఆ గదికి ఉన్న కిటికీ మూయకపోవటం
అంతే! పొద్దున్న వచ్చి చూసేసరికి మేకపిల్ల మాయం
ఆ తెరిచి ఉన్న కిటికీ లోనుంచి పారిపోయింది చాందినీ
అబ్బూఖాను లబోదిబో
చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభమేమి?
ఇదీ అంతే!
 

ఆ కిటికీ వంక చూశాడు అబ్బూఖాను
నోరంతా తెరుచుకొని పగలబడి నవ్వుతున్నట్లనిపించింది
దైన్యంగా చూస్తూ నిలబడిపోయినాడు
అక్కడ మేకపిల్ల కొండ ఎక్కేసింది
చెంగు చెంగున దూకుకుంటూ
అక్కడ ఉన్న చెట్లూ చేమలూ, పచ్చగడ్డీ, పూలమొక్కలు అన్నీ తన కోసమే అనుకున్నది
గంతులు వేస్తూనే ఉన్నది
వేస్తూ వేస్తూ కొండ చివరకు వచ్చేసింది
అక్కడినుంచి ప్రపంచం మొత్తం కనపడుతోంది
కింద ఉన్న అబ్బూఖాన్ ఇంటివంక చూసి నవ్వుకుంది
ఇల్లు, దొడ్డి అంతా చిన్నగా కనపడ్డవి
 

అంత చిన్న ఇంట్లోనేనా నేనున్నది అనుకొన్నది
అంత చిన్న దొడ్డిలోనేనా నన్ను బంధించింది అనుకొన్నది
ఇప్పుడు చూడు నేనెక్కడ ఉన్నానో అని మరల చిందు వేసింది
ఇప్పుడు నేనెంత ఎత్తున ఉన్నానో అని మరల మరల చిందు వేసింది
చిందులు వేస్తూనే ఉన్నది
ఇంతలో సాయంత్రం
సూరీడు సాబు గారు దిగిపోతున్నాడు
చాందినీ చిందులు వేస్తున్న ఆ కొండనానుకునే దిగిపోతున్నాడు
ఏకాంతం, స్వేచ్ఛ అంటూ ఆ మేకపిల్ల పడిన సంతోషం కూడా ఆ కొండ అంచునుంచి దిగిపోవటం మొదలయ్యింది
ఇంతలో ఎక్కడో దూరంగా కొంకికర్ర చప్పుడు
దానివెంటే అబ్బూఖాన్ పిలుపు
చాందినీ చాందినీ చాందినీ అంటూ గొంతు పగిలేలా అరుపు
సంతోషం ఆవిరైపోతున్న చాందినీకి ఆ పిలుపు ఆశ పుట్టించింది
అంతలోనే మళ్ళీ నిరాశ ఆవరించుకొన్నది
అయ్యో, మళ్ళీ బందిఖానాలోకి పోవాలానని సంకటంలో పడ్డది
ఇంతలో మరో అరుపు
అలాటిలాటి అరుపు కాదది
ప్రాణాలు తోడేసే అరుపు
తోడేలు అరుపు
 

కొండపైనుంచి, అటుపక్కగా
భయం, ఆశ్చర్యం కలిగినాయ్ మేకపిల్లకు
అప్పటిదాకా లేని ఆలోచనలు హఠాత్తుగా చుట్టుముట్టాయి
ఏమో అబ్బూఖాన్ చెప్పినట్టు తినేస్తుందేమో
ఏమో అబ్బూఖాన్ చెప్పినట్టు చంపేస్తుందేమో
అబ్బూఖానుతో వెళ్ళిపోదామా వద్దానని ఊగిసలాడిన సంకటం
కాస్త ఇప్పుడు తోడేలు రాకతో ప్రాణసంకటంగా మారిపోయింది
ఒకసారి చుట్టూ చూసింది,
అటూ ఇటూ అంతా పచ్చదనం, ఆహారం,
బంధాలు లేని స్వేచ్ఛ
అప్పుడనిపించింది ఆ మేకపిల్లకు, చాందినీకి –
అక్కడ బానిసగా బతకటం కంటె ఇక్కడ తోడేలుకు ఆహారమైపోవటమే మంచిదని
అబ్బూఖాను పిలుపు ఆగిపోయింది
దబ్ అని చప్పుడు పక్కనే
ఉలికిపడి ఇటు చూచింది
ఇంకేముంది ?
రానే వచ్చింది
ఎవరు ?
 

ఇంకెవరు తోడేలు
ఎర్రగా మెరిసిపోతున్న కళ్ళు, వికృతమైన పళ్ళు – ఆ తోడేలుకు ఆభరణాలు
అవన్నీ చూసి మొదట్లో భయపడినా, చచ్చిపోయేప్పుడు వెంటవచ్చే తెగువతో, ఆ తెగువ ఆసరాతో కొమ్ములు విదిల్చింది
తోడేలు ఒకడుగు వెనకడుగు వేసింది
అంతే! మేకపిల్లకు దమ్ము ధైర్యం వచ్చేసినాయ్
హోరాహోరీ మొదలయ్యింది
ఆ హోరాహోరీ మేకపిల్లకే, మేకపిల్ల మనసుకే
తోడేలుకు అది ఒక ఆట
మేకలు ఏమీ చెయ్యలేవని తోడేలుకు తెలుసు
అయినా ఆడుకుంటోంది మేకపిల్లతో
మేకపిల్ల మధ్య మధ్యలో ఆకాశం వంక చూస్తోంది
ఆ మిణుకు మిణుకు నక్షత్రాల వంక చూస్తోంది
ఆ దేవుణ్ణి వేడుకుంటోంది
కొమ్ములు విదిలిస్తోంది
 

ఉదయం దాకా ఇలా యుద్ధం జరగనిస్తే, ఎవరో ఒకరిని ఆ దేవుడు సాయానికి పంపిస్తాడని ఆశగా ఎదురుచూస్తోంది
నెమ్మదిగా నక్షత్రాలు మాయమైపోయినాయి
తొలివెలుతురు కిరణాలు
తొలికోడి కూత
మేకపిల్ల ఉన్న శక్తంతా కూడగట్టుకొని పోట్లాడుతోంది
చివరిగా మిగిలున్న శక్తంతా కూడదీసేసుకుని మరీ పోట్లాడేస్తోంది
తోడేలుకు ఆశ్చర్యం, ఒకింత భయం కూడా కలగటం మొదలుపెట్టింది
కిందనున్న మసీదులోనుంచి నమాజు వాణి – తెరలు తెరలుగా
అల్లాహో అక్బర్ అని తలుచుకుంటుండగానే రాయి తగిలి కిందపడిపోయింది
తోడేలు వెయ్యాల్సిన దెబ్బ వేసేసి …………

కొండ మీద పక్షులు మాట్లాడుకుంటున్నాయి
చాందినీ ఓడిపోయిందని అనుకుంటున్నాయి
ఒక ముసలి పక్షి మాత్రం చాందినీ గెలిచిందని పొలికేక పెట్టింది

ఇంతకీ ఎవరు గెలిచినట్లు ?

పుస్తకాలంటే ప్రాణం పెట్టే మన రాష్ట్రపతి, మూడవ రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సైన్ గారి రచన “అబ్బూఖాన్ కి బక్రీ” చదివినాక, 2009లో నాకొచ్చిన మాటల్లో స్వేచ్ఛానువాదంగా రాసుకున్న ఒక చిన్న కథ….

మీ మాటలు

  1. Mallik k kaja says:

    నేను అయితే ముగ్గురు అబ్బుఖాను, చాందిని, తొడేలు ఒడిపోయారు అంటాను. జకిర్ హుస్సన్ గరు రాసిన కథ, మెరు చెసిన ట్రన్స్లెషన్ చల బగుంది

    మల్లిక్

    • మొత్తానికి అందరూ ఓడిపోయారంటారు! బాగుందండి మల్లిక్ గారు… :)

      భవదీయుడు
      వంశీ

  2. ahalya says:

    మీ కద చదివాక ..డాక్టర్ జాకిర్ హుస్సైన్ గారి రచన “అబ్బూఖాన్ కి బక్రీ” చదివినాను.
    మీ శైలి చాలా బాగుంది .
    అన్నీ మరచి చిన్నపిల్లల్లా.. ఇలాంటి కదలు చదువుకోవడం ..మనసు కి హాయి..ఆరోగ్యకరం. :-)

    • సంతోషమండి… అదేగా, ఆ హాయేగా కావలసింది… ధన్యవాదాలు

      భవదీయుడు
      వంశీ

  3. ahalya says:

    “కథ ” ( sorry ..typing mistake) ..:-)

  4. Venkata S ADDANKI says:

    చాందినీ గెలిచింది, తోడేలు దెబ్బ వేసినా కింద పడింది తోడేలు కదా ముసలిపక్షి చెప్పినట్లూ చాందినీ గెలిచింది ఆఖరి పోరాటంలో. మీ స్వేచ్చానువాదం నిజంగా పూర్తి స్వేచ్చతో చేసారు ధన్యవాదాలు మరియు ఇంత మంచి కధ అందించినందుకు అభినందనలు.

  5. తోడేలులో భయం చూసిన క్షణమే చాందినీ తెగువ గెలిచింది.
    తోడేలు వెనకడుగేసిన క్షణమే భయం గెలిచింది.
    భయంతో బతకుని తీయడం నేర్చిన తోడేలు బతికినన్నినాళ్ళు తింటూ గెలిచింది, ఆఖరి క్షణం తప్ప.
    అబ్బూఖాన్ ప్రాణంగాపెట్టి పెంచాడు అని చాందినీ తెలుసుకోవడంలో అబ్బూఖాన్ పెంపకంలో పెద్దలా గెలిచాడు.
    ఒక్కటైన బతకాలని పెంచి జీవరాసిని మాయం కాకుండా చూసిన అబ్బూఖాన్ మనసుతో మనిషిలా గెలిచాడు.
    బతికే నాలుగు క్షణాలు బందీగా కాక, స్వచ్చపుప్రేమ, ప్రేమపుస్వేచ్చ, కూసింతభయంతో
    ప్రకృతి సహజీవనం చేయమన్న వంశీగారు కవిగా గెలిచారు.

  6. Well, he, Dr Zakir wrote this during the colonial rule. While the wolf is the Brits, Lamb was the colonized country. I bet Dr Zakir was a warrior spirit inside coming from a family of pashtuns, away from ahimsAvAd! and in subtlety it was the essence of the story. Techincally and methodically NO, but yes, Chandni and the free spirit won even when the wolf got its meat!

    So long dear readers.

    Thanks for all your comments

    – V

మీ మాటలు

*