1930 తరవాతనే తెలంగాణా ఆధునికత

 

 

 

(ఛాయ 12 వ సమావేశం 1 మే, ఆదివారం సాయంత్రం 6 గంటలకి హైదరబాద్ స్టడీ సర్కిల్, దోమలగూడ, హైదరబాద్ లో జరగబోతోంది.  ప్రఖ్యాత రచయిత, విమర్శకుడు, పాత్రికేయుడు, సంపాదకుడు,    కె. శ్రీనివాస్ “సాహిత్య చరిత్రలో ఖాళీలు “ అనే విషయం మీద మాట్లాడుతారు.  ఈ సంధర్భంగా ప్రఖ్యాత రచయిత, విమర్శకుడు,  సంగిశెట్టి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నలకి,  కె. శ్రీనివాస్ యిచ్చిన వివరణలు.)

  • తెలంగాణలో ఆధునిక సాహిత్యం ఎప్పటి నుండి ప్రారంభమైంది?

ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించేముందు, అనేక అంశాలను స్పష్టం చేసుకోవాలి. ఆధునిక సాహిత్యం అంటే ఏమిటి? ఆధునికత అంటే ఏమిటి? తెలంగాణలోనే కాదు, తెలుగులో ఆధునిక సాహిత్యం ఎప్పటినుంచి మొదలయింది? –  చాలా మాటలను మనం నిర్దిష్ట నిర్వచనాలు లేకుండా ఉపయోగిస్తూ ఉండడం వల్ల కొంత అస్పష్టత  ఉన్నది. పాతవి ముగిసిపోవడం, కొత్తవి మొదలుకావడం- ఇవి కొన్ని తేదీలకో సంవత్సరాలకో ముడిపెట్టగలిగిన సంఘటనలు అనుకోవడం కూడా పొరపాటు. 1900-1940 మధ్య కాలాన్ని నేను నా పుస్తకం( తెలంగాణ సాహిత్య వికాసం)లో ఆధునికతలోకి తెలంగాణ సొంత అడుగులు వేసిన కాలంగా చెప్పాను.  ఆధునికత ప్రవేశించని భౌగోళిక ప్రాంతాలు, భావప్రాంతాలు ఇప్పటికీ తెలంగాణలో ఉన్నాయి. అయినంత మాత్రాన తెలంగాణ ఇంకా ఆధునిక పూర్వ దశలో ఉన్నదని అనలేము. భారతదేశంలో అయినా, బ్రిటిష్‌ ఆంధ్రలో అయినా ఆధునికతలోకి జరిగింది ప్రయాణమే. ఆ ప్రయాణం ఇంకా సాగుతూనే ఉన్నది. ముగిసిపోలేదు.

హేతుబద్ధమైన ఆలోచనలు, సంస్కార దృష్టి, సార్వత్రిక విద్యాకాంక్ష,  సార్వజనీన విలువల వక్కాణింపు, వ్యక్తుల స్వేచ్ఛాభావనలు, బృందాల హక్కులు- ఇవన్నీ సమాజంలో కనిపిస్తున్నాయంటే, ఆ సమాజంలో ఆధునికత బలంగానే ఉన్నదన్న మాట. ఆధునికత గుణవాచి. అటువంటి గుణాలు ఒకానొక నిర్దిష్టకాలంలోనే సాధ్యమైనప్పుడు కాలవాచి కూడా. అయితే, అసమాన ప్రపంచంలో ఒక్కొక్క సమాజం ఒక్కో దశలో ఉంటుంది కాబట్టి,  వాస్తవార్థంలో సమకాలికమైనవన్నీ కూడా సమకాలికమైనవి కావు. దశలు అంటున్నామంటే, అనివార్యంగా ఒకదాని తరువాత మరో దశ వచ్చి తీరాలని, పారంపరిక దశలని కాదు. నైజాము పాలనలో ఉన్న తెలంగాణ, బ్రిటిష్‌ పాలనలో ఉన్న ఆంధ్ర ప్రాంతాలు 1900-1940 మధ్య కాలంలో ఒకే రకంగా లేవు. ఆధునికత లోకి ప్రవేశించిన తీరు, సమయం ఒకటే కాదు. తెలంగాణ ఆలస్యంగా ఆధునికతలోకి రావడమే కాక, భిన్నంగా కూడా వచ్చింది. ఒక ప్రతిపాదనగా చెబుతున్నది ఏమిటంటే, వలసవాదంతో ముడిపడిన ఆధునికత, దాని బౌద్ధిక చట్రం తెలంగాణలో బలంగా లేదు.

  • స్థూలంగా ఆధునికత తెలంగాణలో ఫలానా కాలంలో ప్రవేశించిందని చెప్పలేమా?

మన సదుపాయం కోసం చెప్పుకోవచ్చు. 1930ల తరువాతనే ఆధునిక సాహిత్యం అని చెప్పదగ్గది తెలంగాణలో వచ్చింది. అంతకు ముందు కాలంలో కొందరు వ్యక్తుల రచనలలో ఆధునిక భావాలు, వ్యక్తీకరణ రీతులు లేవని కాదు. ఆధునికతకు కావలసిన సన్నాహాలలోనే 1940 దాకా తెలంగాణ ఉద్యమసమాజం తలమునకలయింది. 1920లు, 1930లు అందులో క్రియాశీల కాలం.

తెలంగాణ నుంచి వచ్చిన మొదటి పత్రిక  శేద్యచంద్రిక (1887), అది అనువాద పత్రిక, ప్రభుత్వ పత్రిక అయినప్పటికీ, వివిధ రంగాలలో హైదరాబాద్‌ తలపెట్టిన ఆధునిక వ్యవస్థల నిర్మాణాల పురోగతిని నమోదు చేసింది. ముఖ్యంగా వ్యవసాయరంగంలో ఆధునిక పద్ధతులను ప్రచారం చేయడానికి ఉద్దేశించిన ఆ పత్రికలో,  టెలికమ్యూనికేషన్‌, రోడ్లు వంటి ఇతర ఆధునిక వ్యవస్థల గురించి కూడా ప్రస్తావనలు ఉన్నాయి.  దానిని సాహిత్యేతర పత్రిక అని పరిగణనలోకి తీసుకోకపోయినా,  సాహిత్యాంశాలు కలిగిన మొదటి తెలంగాణ పత్రిక హితబోధిని (1913) లో కూడా ఆధునిక భావాలను పుష్కలంగా చూడవచ్చు. సంస్థానాధీశులలో నూతన భావాలు కలిగిన సంస్కారిగా నాడు పేరు పొందిన బరోడా రాజు ప్రసంగాలను పునర్ముద్రించింది కూడా ఆ పత్రిక.  తెలంగాణ నుంచి మొదటి మహిళాకవి రచన కూడా ఆ పత్రికలోనే ఉన్నది. ఆధునికమనదగ్గ రీతిలో రాసిన కథనాలున్నాయి.  అయినప్పటికీ, 1915 నాటికి తెలంగాణ సమాజం ఆధునికతలోకి ప్రవేశించిందని చెప్పలేము. వ్యావహారిక భాషా రచనలు 1930లోపే వచ్చాయి. మాండలికంలో కథారచన  1930లలో నే చురుకుగా మొదలయింది. గోలకొండ కవుల సంచిక  లో ఆధునిక సాహిత్యం తక్కువే అయినప్పటికీ, ఆ ప్రయత్నమే ఆధునికమయినది.

1930 దశాబ్దారంభంలో ఆంధ్రమహాసభ ప్రారంభమయింది.  ఆధునిక విద్యావంతుల వర్గం ఒకటి చిన్నగా అయినప్పటికీ ఏర్పడింది. పత్రికల సంఖ్య పెరిగింది. వివిధ సామాజిక, కుల సంఘాలు క్రియాశీలంగా పనిచేయసాగాయి. గ్రంథాలయాలు విస్తృతంగా వ్యాపించి, ఊరూరా మార్పును కోరే యువతరం ఒకటి రూపుదిద్దుకున్నది. ఇవన్నీ సాహిత్యంలో ఆధునికత కు తోడ్పడ్డాయి. తెలంగాణ సమాజ వికాసానికి సాహిత్యంలో ఆ మార్పులు అవసరమయ్యే పరిస్థితి వచ్చింది.

  • తెలంగాణ అస్తిత్వ ఉద్యమ సాహిత్యం ఎప్పటి నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు?

తెలంగాణవాద సాహిత్యం లేదా తెలంగాణ అస్తిత్వ ఉద్యమసాహిత్యం 1995 తరువాతనే మొదలయిందని చెప్పాలి. 1969 ఉద్యమ సందర్భంగా వచ్చిన సాహిత్యం తెలంగాణవాద సాహిత్యం కాదా? అన్న సందేహం వస్తుంది.జాషువా కవిత్వాన్ని దళిత వాద కవిత్వం గా అనడం సాంకేతికంగా ఎట్లా పొరపాటు అవుతుందో, 1970ల నాటి కవిత్వాన్ని తెలంగాణ వాద కవిత్వం అని అనడం కూడా పొరపాటు అవుతుంది. 1969 ఉద్యమానికి  కూడా సైద్ధాంతికత లేదని కాదు. చైనా సాంస్కృతిక విప్లవం ప్రతిఫలనంగా తెలంగాణ ఉద్యమాన్ని చెప్పినవారు, భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన దశగా నాటి కాలాన్ని నిర్వచించినవారు ఉన్నారు. లోతుగా నాటి ఆకాంక్షల మూలాన్ని వెదికిన వారున్నారు. కానీ, ఆ సైద్ధాంతికత ఒక బలమైన, సమగ్రమైన రూపం తీసుకోలేదు. ప్రాంతీయ వివక్షను తీవ్రంగా ఖండించడం, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఉద్వేగపూరితంగా వ్యక్తం చేయడం, సాంస్కృతిక భేదాలను ప్రస్తావించడం నాటి సాహిత్యంలో, ముఖ్యంగా కవిత్వంలో కనిపిస్తుంది కానీ, దాన్ని 1990ల నాటి తెలంగాణవాదంతో సమానం చేయలేము. నాటి ఉద్యమానికి ఉండిన పరిమితులు సాహిత్యంలోనూ ఉన్నాయి.

మలిదశ తెలంగాణ ఉద్యమం- ఉద్యోగ, విద్యావకాశాలతో పాటు, వనరుల పరిరక్షణ, మనుగడల సంరక్షణలను ప్రధానంగా తీసుకున్నది. సాగునీటి సమస్య, గ్రామీణ సంక్షోభం- నేపథ్యంలో, ప్రజలను ఏకత్రితం చేసేవిధంగా సాగిన సాంస్కృతిక సాహిత్యోద్యమాలు ఉద్యమానికి చోదకాలుగా ఉన్నాయి. మాది మాకు కావాలె- అన్న నినాదం- ప్రపంచీకరణ నేపథ్యంలోనూ, అస్తిత్వవాదాల ప్రభంజనంలోనూ భాగంగా వచ్చినది. ఆ రెండు పరిస్థితులూ 1970 నాటికి లేవు.

  • తెలంగాణలో మధ్యతరగతి ఏర్పడిందా? ఏర్పడితే ఎప్పటినుంచి?

తెలంగాణలో మధ్యతరగతి ఉనికి గురించి గతంలో నేను వ్యాఖ్యానించినప్పుడు మిత్రులు కొందరు సందేహం వ్యక్తం చేశారు. మధ్యతరగతి- ఒక  నిర్దిష్ట ఆర్థికవర్గాన్ని సూచించే వాడుక పదం. పట్టణజీవితంలోని వేతనజీవులు, వృత్తినిపుణులు, చిన్నవ్యాపారులు- వీరితో కూడిన వర్గం అది. గ్రామీణమూలాలతో నామమాత్రపు సంబంధాలు మిగలడమో, పూర్తి తెగదెంపులో జరిగిన వర్గం అది.  దాని ఆలోచనావిధానం భిన్నంగా ఉంటుంది. సమాజంలో విలువల ఘర్షణకు ఆ వర్గం వేదికగా ఉంటుంది.  బ్రిటిష్‌ ఆంధ్రలో తొలిదశల్లో బ్రాహ్మణవిద్యావంతులతో ప్రాథమికంగా ఈ వర్గం ఏర్పడింది. అక్కడి ఆధునిక సాహిత్యం ఈ వర్గం నుంచి అధికంగా వచ్చింది. తెలంగాణలో మధ్యతరగతి సాహిత్యం తక్కువ.  కథలు, నవలలు వంటి ఆధునిక ప్రక్రియలలో కూడా ఈ వర్గ జీవితం ఉన్నవి తక్కువే.

ఇందుకు కారణమేమిటి?

1913 నాటికి తెలంగాణలో చదువుకున్నవారే 3 శాతం ఉన్నారట. అందులో తెలుగువారు పది శాతం కూడా లేరు. నిజాం ప్రభుత్వంలో పనిచేసిన తెలుగువారు స్వల్పం. ఉర్దూ చదువుకుని న్యాయవాద వృత్తిలో ఉన్నవారు అక్కడక్కడా కనిపించేవారు. వారు కాక ఉపాధ్యాయులు. అంతే. ఆ పరిస్థితి 1948 నాటికి కూడా విప్లవాత్మకంగా ఏమీ మారలేదు. ఇప్పటికయినా, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చదగ్గరీతిలో తెలంగాణలో మధ్యతరగతి లేదు. ఆ కాలంలో  హైదరాబాద్‌, వరంగల్‌ తప్ప పట్టణాలని చె ప్పదగ్గవే లేవు. ఈ మధ్యకాలంలో మాత్రం తెలంగాణలో మధ్యతరగతి వేగంగా ఏర్పడుతున్నది. అయితే వారిలో మధ్యతరగతి స్వభావం ప్రస్ఫుటంగా వ్యక్తం కావడానికి ఇంకా సమయం పడుతుంది.   తెలంగాణ ప్రాంతం వివక్షకు లోనయిందని చెబుతున్న రంగాలలో విద్యా, ఉద్యోగరంగాలు ముఖ్యమయినవి. ఆ అంతరమే మధ్యతరగతి నామమాత్రం కావడానికి, మధ్యతరగతి కేంద్రిత  సాహిత్యం రాకపోవడానికి కారణాలని చెప్పుకోవచ్చు.

 

  • తెలంగాణ సాహిత్యంపై మార్క్సిజం ప్రభావం ఏ మేరకు ఉన్నది?

వికాసోద్యమకాలంలో ఉన్నదని చెప్పలేము. 1930 ద్వితీయార్థం నుంచి మొదలుపెట్టి, మార్క్సిస్టు భావాల ప్రత్యక్ష, పరోక్ష ప్రస్తావనలు కనిపిస్తాయి. సమకాలంలోని వివిధ రాజకీయ సిద్ధాంతాల గురించిన ఆసక్తితో, వాటిని ప్రజలకు తెలియజెప్పాలన్న సంకల్పంతో  కెసి గుప్త, వట్టికోట ఆళ్వారుస్వామి  పనిచేశారు. 1940ల ఆరంభం నుంచి కమ్యూనిస్టుపార్టీ తెలంగాణలో క్రియాశీలంగా విస్తరిస్తూ వచ్చింది. ప్రపంచపటం మీద తెలంగాణను ఆవిష్కరించిన  తెలంగాణ సాయుధపోరాటంమీద, పోరాట సాహిత్యం మీద మార్క్సిజం ప్రభావం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. స్తబ్దంగా ఉన్నదని అనుకున్న 1960లలో కూడా ప్రగతిశీల సాహిత్యం, కవిత్వం, కథలు రెండూ తెలంగాణ నుంచి వచ్చాయి.  1965 తరువాత విప్లవోద్యమం ప్రభావం గురించి కూడా తెలిసిందే. 1990 దాకా విప్లవసాహిత్యోద్యమ ప్రభావం గణనీయంగా ఉన్నది.  తరవాత కాలంలో కూడా  ఒక ప్రధాన కోవగా కొనసాగుతూనే ఉన్నది.  తొలి, మలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలలో పార్లమెంటరీ కమ్యూనిస్టుల వైఖరులు ఎలాగ ఉన్నా, విప్లవ కమ్యూనిస్టులు క్రియాశీలంగా పాలుపంచుకున్నారు.  అందువల్ల 1995 తరువాతి తెలంగాణవాద సాహిత్యంపై కూడా మార్క్సిజం ప్రభావం స్పష్టంగా చూడవచ్చు.

  • మార్క్సిజం వరమా, శాపమా?

వరాలు ఇవ్వడానికి అది దైవమూ కాదు, శపించడానికి దెయ్యమూ కాదు. అది ఒక సైద్ధాంతిక సాధనం, ఆచరణ మార్గం.   కమ్యూనిస్టు పార్టీలతో మనకు సమస్యలు ఉండవచ్చు, వారి ఆచరణ విధానాలతో విభేదాలు ఉండవచ్చు. కానీ, చరిత్రను, వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తును నిర్మించుకోవడానికి పనికివచ్చే  శాస్త్రీయమైన సిద్ధాంతం గా  విలువైనది మార్క్సిజం.  భౌతికవాద ఆలోచనలకు భారతీయ గతంలో కూడా మూలాలున్నాయి. మార్క్సిజం ఇప్పటికే అనేక కొత్త వ్యాఖ్యానాలకు, జోడింపులకు, విస్తరణలకు గురిఅయింది.  వర్తమాన భారతానికి అవసరమైన అన్వయాలను, సవరణలను చేసుకోవడం ఇక్కడి మార్క్సిస్టుల పని. వారికి ఆ తెలివిడి  కలగడానికి లోపలినుంచి, బయటినుంచి కూడా ఒత్తిడులు పెరుగుతున్నాయని మనకు తెలుసు.

  • సమాజంలో వివిధ డైమన్షన్లలో ఉండే ఖాళీలను సాహిత్యం ఎప్పటికైనా పరిపూర్ణంగా పూరించగలదా?

బాలగోపాల్‌ చెప్పినదాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అడుగుతున్నట్టున్నారు. ప్రామాణికతా భావనలకూ నిజజీవితాని కీ మధ్య ఉండే అంతరం గురించి చెబుతూ, ఆ అంతరం వల్ల ఏర్పడే ఖాళీ కారణంగా ఏర్పడే దాహం గొప్ప సాహిత్య సృష్టికి దోహదకారి అవుతుందని ఆయన అన్నారు.  విస్మృతి వల్ల, అజ్ఞానం వల్ల, పాక్షికత వల్ల చూడలేకపోయిన వాస్తవికతలు కూడా ఖాళీలేనని, మంచి సాహిత్యం వాటిని భర్తీచేసి, అగోచరాలను కూడా గోచరం చేస్తుందని బాలగోపాల్‌ అన్నారు. మనం చూడలేకపోయిన వాస్తవికతలను కళ్లముందుకు లాక్కురాగలిగే సాహిత్యం సమాజంలోని ఖాళీలను పూరించే ప్రయత్నాలకు దోహదకారి అవుతుంది.  పరిపూర్ణత అనేది సాపేక్షం. భర్తీచేసుకుంటూ పోవడం ఒక ప్రక్రియ.

  • తెలంగాణ భాషను పూర్తిస్థాయిలో, కనీసం పాలన, విద్య, పత్రికారంగాలలో, అమలులోకి తీసుకురావడానికి తీసుకోవలసిన చర్యలేమిటి?

ఈ విషయంలో నావి ఉద్యమకారులు అంతగా మెచ్చని అభిప్రాయాలు. తెలంగాణ భాష అనడం పొరపాటు. దేన్ని భాష అనాలి, దేన్ని మాండలికం అనాలి – నిర్ణయించడానికి భాషాశాస్త్రం ఉన్నది. మాండలికం ( అది కూడా పరిభాషాపదమే) అన్న మాట నచ్చకపోతే, మరో మాట పెట్టుకోవచ్చు.

మనం చేయగలిగింది, తెలుగుభాషలో తెలంగాణ పదజాలం ప్రాతినిధ్యం పెంచడం. తెలంగాణ వ్యక్తీకరణలను, జాతీయాలను, సామెతలను మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకురావడం. సాహిత్యకారులు ఇప్పటికే విస్తృతమైన స్థానిక పదజాలాన్ని తమ రచనల ద్వారా ఆవిష్కరించారు. ఏది తెలంగాణ పదం, ఏది కాదు అని నిర్ణయించడం నిఘంటుకారులు చేయవలసిన పని. సమగ్ర తెలంగాణ పదకోశం ఒకటి రూపొందాలి. అప్పటికి కూడా అందులోని పదజాలం ఇతర తెలుగు ప్రాంతాల్లో ఎక్కడా వాడుకలో ఉండదని చెప్పలేము. తెలంగాణ లోని వివిధ వృత్తులవారు, కులాల వారు ఉపయోగించే పదజాలాన్ని మొత్తం సేకరించాలి. సాహిత్యంలోని పదప్రయోగాలను క్రోడీకరించాలి. సాంకేతిక పరిభాషా నిర్ణయంలో స్థానిక పదజలాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయాలి.  అచ్చమైన తెలంగాణ స్థానిక వాడుకను సృజనాత్మక రచనల్లో మిగుల్చుకోవచ్చు. కానీ ఆధునిక వినియోగం కోసం, మాధ్యమాల వినియోగం కోసం ప్రమాణీకరణ అవసరం. యంత్ర భాషగా వాడడానికి కూడా ప్రమాణీకరణ కావాలి. తెలుగును యంత్రానువాదం కోసం, కంప్యూటర్‌ వినియోగం కోసం ప్రమాణీకరించే ప్రయత్నాలు మునుపే మొదలయ్యాయి, ఒకమేరకు పూర్తయ్యాయి కూడా. వారు వినియోగించే పదజాలంలో  స్థానిక పదజాలం ఎంత ఉన్నదో పరిశీలించి, తెలంగాణ పాఠాంతరాలను, వాడుకను కూడా అందులో చేర్చాలి.

  • పరిశోధన అనేది థ్యాంక్‌ లెస్‌ జాబేనా?

ఎవరి కృతజ్ఞతలూ  మనకు అవసరం లేదు కానీ, ఇదొక అనాకర్షణీయమైన వ్యాసంగం. ఎంతో కష్టపడాలి. ఫలితం ఏమీ ఉండదు. మనకు మాత్రమే ఎక్సైటింగ్‌గా ఉంటుంది, ఎదుటివారికి చాదస్తంగా ఉంటుంది. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు, ముఖ్యంగా సాహిత్యరంగ పరిశోధనలు, చాలా వరకు మొక్కుబడిగా సాగుతుంటాయి. సామగ్రి సిద్ధంగా ఉన్న అంశాన్నే ఎంచుకొమ్మని గురువులూ చెబుతుంటారు, లఘువులూ అదే చేస్తుంటారు. మౌలిక సమాచారం సేకరించవలసి వచ్చే పని తీసుకోవడంలో ఎవరికీ ఆసక్తి ఉండదు.  స్వచ్ఛంద పరిశోధకులలో ఉండే తపన, డిగ్రీల పరిశోధకులలో లేదేమో అనిపిస్తుంది, ఏ డిగ్రీ కోసమని మీరు అంత పరిశోధన చేశారు?

*

మీ మాటలు

  1. THIRUPALU says:

    చాలా మంచి ఇంటర్వ్యూ.
    చాలా ప్రామాణిక విషయాలు తెలిసాయి

  2. ఎ కె ప్రభాకర్ says:

    ఇంటర్వూ చాలా బాగుంది . కప్పు కాఫీతో చెప్పుకొన్న కబుర్లు కావు. ఆలోచనలు ప్రేరేపించే అంశాలతో నిండి ఉంది . ఇద్దరు శ్రీనివాస్ లకూ అభినందనలు .

  3. క్విడ్ ప్రొ కో😊

  4. V. SATHI REDDY says:

    “మార్క్సిజం వరమా, శాపమా?” ప్రశ్న ఒక ఎక్కిరింపు ప్రశ్న, సమాధానం ఇంటర్వ్యూ చేసిన సంగిశెట్టిని సమాధాన పర్చిందో లేదో గానీ ,,మొత్తంగా చూస్తే, ఈ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూయర్ మెదడు తుప్పు వదలగోట్టిందని చెప్పవచ్చు .

  5. jilukara sreenivas says:

    చాల మంచి ఇంటర్వ్యు. తెలంగాణా దళిత ఉద్యమం గురించి కే.శ్రీనివాస్ చాల పరిశోధన చేసారు. ఆ విషయాలు కూడా చెప్తే బావుండేది. ప్రశ్నలు అడిగిన వ్యక్తీ ఈ సంగతి మరిచినట్టున్నారు. ఆధునికత గురించి పదేపదే మాట్లాడుకోవటమే తెలంగాణా దుస్థితి.

    • sangishetty srinivas says:

      ఉద్దేశ్య పూర్వకంగానే పరిశోధక పుస్తకం లోనికి వెళ్ళలేదు. చర్విత చరణం అవుతుందని… మిత్రమా

  6. వాగీశ్ says:

    “పరిపూర్ణత అనేది సాపేక్షం. భర్తీచేసుకుంటూ పోవడం ఒక ప్రక్రియ.”

    బాగున్నది .

  7. చందు తులసి says:

    చాలా విలువైన సమాచారం అందించారు. ఇద్దరు ఘనాపాఠీలకు అభినందనలు.
    ముఖ్యంగా మాండలికం గురించి శ్రీనివాస్ గారు విలువైన అభిప్రాయం చెప్పారు. తెలంగాణ సాహిత్య కారులు ఆలోచించాలి.

Leave a Reply to jilukara sreenivas Cancel reply

*