మొదటి శ్లోకం…

 

 

-హెచ్చార్కె 

~

 

  1. మాలో ఒకరు ఎప్పుడైనా విసిగిపోయి

ఆత్మహత్యించుకుని వార్త అవుతారు

మిగిలినోళ్లం మాత్రం మరణించమా?

అందరం చనిపోతాం

అకాలంగా సకాలంగా

అందాక ధిక్కరించి బతుకుతాం

బతికి వుండటమే మా నిరసన

మమ్మల్ని అసుంటా వుండమనే నిన్ను

ఆసుంటా వుండమనడం ద్వేషం కదూ?

మా స్త్రీలు మీ చెరబడినప్పుడు మా

నొప్పి నొప్పిగా వున్నంతవరకు సరే

అదొక ‘మా నిషాద….’ శోకం కూడా

శోకం ఏ మాత్రం క్రోధంగా మారినా

గల్లీ గల్లీ కి గాంధీ కర్రల రౌడీల్ రెడీ

 

  1. రుతువులు మారుతాయి

ఎండలు వానలవుతాయి

వానలు శీతగాలులవుతాయి

వెలుగును ప్రేమించి ఒక సారి

చీకటిని భరించే శక్తికై ఓ సారి

మమ్మల్ని మేం కూడదీసుకునే

ఆనందాలు మాకు పండుగలు

అవి మెలిపెట్టే మా దుఃఖాలకు

ఒక్క రోజు చిరు విరామాలు

మేము కూడా గొంతెత్తి మావైన

రెండు పద్యాల్ రెండు భక్ష్యాలు

అక్కడ కూడా మీరు తయారు

మేము మొక్కడానికి మీ పాదాలు

విని తరించడానికి మీ వీరగాథలు

 

  1. మేము దేన్ని ప్రేమించాలో

మేము దేన్ని ద్వేషించాలో

ఏం తినాలో ఏమి అనాలో

ఎవరి పేరిట పానకం పంచాలో

ఎవరి బొమ్మల్ని మంటల్లో వేసి

ఎలా కాల్చి చిందులేయాలో

వ్రత నియమాలు నువ్వు రాసి వుంటావు

దాన్ని కాదన్న వాడినెలాగైనా హతమార్చి

హత్య ఎంతటి పుణ్యకార్యమెంత

మహిమాన్వితమో వాడి పిల్లలకు

నప్పి వుంటావు. పూర్వస్మృతులు

వదలని మా దుఃఖ ధిక్కారాల స్వరాల్ని

వధించడానికి

నీ కర్మాగారంలో యుగానికొక జంటగా

రామలక్ష్మణులు తయారవుతుంటారు

 

 

 

  1. నేను ఎప్పుడూ మా నొప్పిని మరవని

మీ పంక్తిలో భక్ష్యం అడగని వాల్మీకిని

నన్ను దగ్దం చేసే మంటల్లో

కణం కణం దగ్ధమవుతూ

మంటల నాలుకలు సాచి

నా  వాళ్లకు చెప్పుకోవలసింది

చెప్పుకుంటూనే వుంటాను

చెప్పడం కోసం మంటలతో పాటు

మళ్లీ మళ్లీ మళ్లీ పుడుతుంటాను.

*

మీ మాటలు

  1. indra Prasad says:

    there is incompleteness like the struggle which is continuous.

  2. విలాసాగరం రవీందర్ says:

    తరాల అంతరం
    యుగాల దాస్యం వాడి పంతం
    ధిక్కరించిన వారిని అంతమొందించడమే వాడి నైజం

    అయిదు తలల ఆ నాగుపాము కు
    ముంగీస లాంటిది మీ కవిత హెచ్చార్కే గారు.

    • THIRUPALU says:

      అయిదు తలలు కాదు సర్! పదితల ల హైందవ నాగ రాజు.

  3. Sreekanth says:

    నన్ను దగ్దం చేసే మంటల్లో
    కణం కణం దగ్ధమవుతూ
    మంటల నాలుకలు సాచి
    నా వాళ్లకు చెప్పుకోవలసింది
    చెప్పుకుంటూనే వుంటాను
    చెప్పడం కోసం మంటలతో పాటు
    మళ్లీ మళ్లీ మళ్లీ పుడుతుంటాను

  4. కె.కె. రామయ్య says:

    యుగయుగాల దాస్య, తరతరాల అంతరాల దుఃఖ ధిక్కారాల స్వరాల్ని వినిపించిన హెచ్చార్కే గారికి వొందనాలు.

  5. Pratap R Reddy says:

    చాలా బావుంది

  6. Narayanaswamy says:

    కవిత బాగుంది హెచ్చార్కె! నీ మొదటి శ్లోకాన్ని నీకు కాకుండా చేసిన పరిణామాన్ని బాగా చెప్పావు – నొప్పితో కూడిన ఒక విసురుంది కవితలో – అయితే ఈ రెండు వాక్యాలే కొంచెం అనవసరమేమో అనిపించింది – ఇవి తీసేసినా కవిత ఇంకా బాగుందేమో అనిపించింది

    శోకం ఏ మాత్రం క్రోధంగా మారినా
    గల్లీ గల్లీ కి గాంధీ కర్రల రౌడీల్ రెడీ

  7. విషయం సరే, కవిత్వ మేదీ?

    • శ్రీనివాసుడు says:

      అదేమిటి దేశరాజు గారూ! ముంబై ఎక్స్ ప్రెస్ సినిమాలో కమలహాసన్ ‘‘స్టీరింగేది?’’ అని అడిగినట్లుగా అడిగేరు? తరువాత ” ఇది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవా? నాకు నడపడం రాదే‘‘, అని అంటారా కొంపతీసి?

    • భాస్కరం కల్లూరి says:

      1. “కవిత్వం సరే, విషయమేమిటి?” (విషయమేది? అని కాదు) అని ప్రశ్నించుకుంటే ఎలా ఉంటుంది? అలా ప్రశ్నించుకోవలసిన సందర్భాన్ని హెచ్చార్కే గారి కవిత సూచిస్తోందనుకుంటాను.

    • భాస్కరం కల్లూరి says:

      1. కవిత్వమే ముఖ్యం, విషయం ముఖ్యం కాదనే సాహసం ఎవరూ చేయరనుకుంటే, “కవిత్వం సరే, విషయమేమిటి?” (విషయమేది? అని కాదు) అని ప్రశ్నించుకుంటే ఎలా ఉంటుంది? అలా ప్రశ్నించుకోవలసిన సందర్భాన్ని హెచ్చార్కే గారి కవిత సూచిస్తోందనుకుంటాను.
      2. హెచ్చార్కేగారికి అకవిత్వాన్ని ఆపాదించదలచుకుంటే అసలు ఏది కవిత్వం అన్న చర్చలోకి వెళ్లాల్సివస్తుంది.ఆయన ఒక నొప్పిని వ్యక్తం చేశారు. ఒక కవితలో నొప్పినో దుఃఖాన్నో వ్యక్తీకరిస్తున్నప్పుడు ఆ కవిత బాగుందనో, గొప్పగా ఉందనో కితాబు ఇవ్వడం నాకైతే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఒక తల్లి ఏ గర్భశోకంతోనో ఏడుస్తున్నప్పుడు ఆ ఏడుపు చాలా బాగుందనో అందంగా ఉందనో అనం. అలాంటిదే ఇది కూడా.

  8. “బతికి వుండటమే మా నిరసన”….In many angles it speaks volumes. అయితే, ఫీనిక్ష్ పక్షులమే, పీలికలమై పోయి ఏలికలకి ఎక్కడ లేని బల సంపత్తిని సమకూర్చి పెట్టి ప్రేక్షకత్వం లో పల్టీలు కొడుతున్న వాళ్ళం ….ఎంత ఐరనీ ..ఏమి ఎదుగుదల ..ఏమి చైతన్యం..కడుపు నిండి పోయే కలాల కదనాలు..ఓహ్!

  9. 1. భలే స్పందనలు. థాంక్సెలాట్.
    2. పద్యాన్ని ఓసారి చూడమని ఆడిగాను, ఏం చేస్తాడు పాపం దేశరాజు. నేను మాత్రం ఏం చేయగలను, ‘అరసికేషు కవితా నివేదనం మా లిఖ మా లిఖ’ అని నుదురు కొట్టుకోడం వినా. ‘దేశమంటే మట్టి కాదోయ్’ కవితలో కవిత్వమేదని ఆడిగితే, పాపం, గురజాడ మాత్రం ఏం చేయగలడు?.
    3. థాంక్స్ శ్రీనివాసుడు! దేశరాజుకు స్కూటరు మీద తిరిగి కూర్చోమని చెప్పినందుకు. ఆ కమల్ హాసన్ జోకు నాక్కూడా భలే ఇష్టం. నిన్ననే మా అమ్మాయికి ఈ జోకు చెప్పాను, మీ లాగే మరి దేనికో ఉదాహరణగా.
    3. ‘నొప్పితో కూడిన ఒక విసురుంది కవితలో ’, విసురును, నొప్పిని కలిపి చూసిన నారాయణ స్వామికి మరిన్ని థాంక్యూలు. ఔను స్వామి, ఇది అధిక్షేప ‘నిషాద’మే.
    4. పద్యాన్ని మరో కోణంలో చూసిన కె ఎన్ రావు, రవీందర్ విలాసాగరం, ప్రతాపరెడ్డి, శ్రీకాంత్, ఇంద్ర ప్రసాద్, కె కె రామయ్యల మెచ్చికోళ్లకి భలే సంతోష పడ్డాను. థాంక్యూ సో మచ్.

  10. కె.కె. రామయ్య says:

    “మాలో ఒకరు ఎప్పుడైనా విసిగిపోయి / ఆత్మహత్యించుకుని వార్త అవుతారు” అని హెచ్చార్కే గారు వ్యక్తం చేసిన నొప్పిని రోహిత్ వేముల పట్లనేమో అనుకున్నాను కల్లూరి భాస్కరం గారు.

    ఇతర కర్మ ఫలాని యదృచ్ఛయా
    విలిఖితాని సహే చతురానన
    అరసికేషు కవిత్వ నివేదనం
    శిరసి మా లిఖ మాలిఖ, మాలిఖ !!!

    ఓ బ్రహ్మ దేవుడా, నా నుదుటి మీద ఎన్ని కష్టాలనయినా రాయి. సహిస్తాను. కానీ, అరసికులకు కవిత్వాన్ని వినిపించే దుర్గతి మాత్రం రాయకు. ముమ్మాటికీ రాయకు.

  11. ఓహ్, అదేంటో, భాస్కరం గారి వ్యాఖ్యను నేను చూళ్ళేదు అప్పుడు. ఎస్. కవిత్వం చదివి ఏమైనా ఫీలియ్యామా లేదా అనేదే చూడాలి. థాంక్సండీ. కె కె రామయ్య గారు, చాల థాంక్స్, ఆ చాటువు పూర్తి పాఠం ఇంతకు ముందు నాకు తెలీదు. ఔను, మొదటి లైన్లలో వున్నది రోహిత్ వేములయే.

  12. భాస్కరం కల్లూరి says:

    అవును రామయ్యగారూ…ఈ కవితలో వ్యక్తమైన వేదన రోహిత్ వేములను దృష్టిలో ఉంచుకున్నదే. అలాగే, ఈమధ్య వంశీగారి వ్యాసంపై జరిగిన చర్చ నేపథ్యం కూడా ఈ కవితకు ఉంది. అది నాకు అర్థమైంది. “కవిత్వం సరే, విషయం ఏమిటి?” అన్న నా ప్రశ్న, ఈ కవితలోని విషయం అర్థం కాక కాదు. ఇప్పుడు కవిత్వానికి ఏది వస్తువు అవుతోందన్న పరిశీలనవైపు దృష్టి మళ్లించడం కోసమే ఆ ప్రశ్న వేశాను.
    ఈ కవితలో వ్యక్తమైన నొప్పిని ప్రకటించే కవితలు ఇప్పుడే వస్తున్నాయని అనను కానీ, ఈ మధ్యనే, ఇంకా చెప్పాలంటే, గత రెండేళ్లుగానే విరివిగా వస్తున్నట్టున్నాయి. సామాజిక, రాజకీయ ప్రభావాలు కవితకే కాక, ఇతర సాహిత్యప్రక్రియలకు కూడా కొత్త (లేదా, పాతదే అయినా సరికొత్తగా)వస్తువును ఎలా సమకూరుస్తాయో, వస్తువును ఎలా మార్చుతాయో తెలుసుకోడానికి ఇది కూడా ఒక సందర్భం.
    కవిత్వంలో కేవలం కవిత్వాన్ని మాత్రమే చూస్తూ అందులోని అందాన్ని, అనుభూతిని, పొందికను, బిగువును ఉగ్గడించడానికే పరిమితం కాకుండా విషయం వైపు కూడా దృష్టి మళ్ళిస్తే, అనుభూతికి అదనంగా అది ఆలోచనకు, స్పష్టతకు తోడ్పడుతుంది.

  13. మహిషాసురుణ్ణి పొగడ్డానికి జగన్మాతని సెక్స్ వర్కర్ అనటం కూడా ఆదర్శమే కాబోలు!
    తమరు తప్పు చేస్తే నెప్పి ఎకువై గింజుకోవడం అని సరిపెట్టుకోవాలి కాబోలు,అంతేనా?

  14. srinivas sathiraju says:

    అజ్ఞానం వేర్రితలలేస్తే విజ్ఞానం వెర్రి గంతులేసింది అన్నట్టు ఉంది. నిజంగా చెప్పాలంటే ఎడిటర్ గారు ఇలాంటి విషయాలు ప్రచురణార్హమా కాదా అనే విచక్షణా జ్ఞానం కలిగిన నాడు లేదా అసలు సమాజం మారడానికి ఎటువంటి భావ జాలం కావాలి అనే అవగాహన కలిగిన నాడు ఇటువంటి అర్ధం పర్దం లేని పైత్యాలు మనలోకి విసర్జించ బడవు. కేవలం ఒక రచ్చ జరగడానికి తద్వారా పది మందిని ఆకర్షించాలి అనే పిచ్చి ముదిరి కోన సాగింప బడుతున్న ఒక అస్తిత్వ నిరూపణ కోసం కుమేదావులు జరుపుతున్న ఒకానొక వికృత సాహిత్య ప్రయోగం ఇది. ఎటువంటి ప్రయజనాన్ని సిద్దించదు సాధించదు కారణం స్పృశించ కూడని చోట అహంకారంగా స్పృశించి రచయితా తన అల్పజ్ఞానాన్ని (పురాణాలు సామాజిక అవగాహన ఇతరత్రా ) చాటుకోవడమే.

Leave a Reply to Pratap R Reddy Cancel reply

*