చీకటి అరలు

 

     

 -మేడి చైతన్య

~

కిటికి సందుల్లోంచి సన్నగా సూర్యకాంతి  గడిచిన నిశిరాతిరి జ్ఞాపకాల దొంతరల పొరలను చీల్చుకుంటూ నా మొహం మీద పడింది. పిడచగట్టుకుపోయిన పెదాలను నడి జామంతా నికోటిన్ తో కలహపడిన నాలుకతో హత్తుకున్నా.

ఉప్పో, వగరో వర్ణించలేని నిర్జీవ ”వాసన” లోపలికిమల్లే.

సీసాదొర్లి అడుగంటిన మందు చుక్కల ప్రవాహంలో కొట్టుమిట్టాడుతున్న కుంటిచీమోకటి నన్ను ఈ లోకంలోకి నిశ్శబ్ధంగా ఆహ్వానించింది. ఆనకట్టలు కట్టి కాపడదామనుకునే నా అభావ ఆలోచనలకు, రాజీపడని పోరాటపటిమే నా జీవితానికి పరమార్దమని అర్ధంచేసుకొలేని చిన్న వయస్సునాదని చూసే దాని చులకన చూపు, ఆ నడ్డి విరుపు నడక తట్టుకోలేక పెళుసులూడోచ్చిన బ్రష్ పట్టుకున్నా. దోమలంతా గుంపులు గుంపులుగా గొడవపడి ఎటూతేల్చుకోలేక జాలిపడి వదిలేసిన రక్తాన్నంతా వేళ్ళ కొనలలోకి లాగి కుత్తుక పిసికితే రెండు నురగలు తెల్లటి పెంటకక్కి, తల గిరాటేసింది టూత్ పేస్ట్ గొట్టం నా జీవితంతో తనకేమి ఇక సంబంధం పట్టనట్టు. తనగోడు ఆలకించమని ఫోను వైబ్రేట్ అవుతూనేఉంది. నిరాసక్తిగా ఒక చూపు చూసి, అద్దంలో మానని  గాయాలను చూస్తూ తడుముతున్నా వెలుపల, లోపల, “ఆవల.”

మాటిమాటికి  గోలచేయొద్దని పేగులను బెదిరించి, డొక్కలో కాళ్ళు మునగతీసుకొని పడుకున్నాడు వాడు. నాన్న సారా కుళ్ళు కంపు  మాటలు, అమ్మ ముక్కు  చీదడాలు, ఆకలేస్తుందని  చైతుగాడి ఆర్తనాదాలు. నాన్న మగతనానికి గుర్తుగా నల్లగా కమిలిన అమ్మ వీపు, చింకిపోయిన అమ్మ  రొమ్మువైపు ఆబగా చైతుగాడి చూపు. నిస్సత్తువుగా చొంగకార్చుతూ చైతుగాడు వాడి దగ్గరకొచ్చాడు. ఆకలి నీరసం ఆవహించకుండా ఒకరికొకరు గాడంగా హత్తుకొని పడుకొని, గుచ్చుకుంటున్న పక్కటెముకలను లెక్కబెట్టుకుంటున్నారు అన్నదమ్ములిద్దరు.

తాటాకు కప్పు కన్నాల్లోంచి కారుతున్న వానచుక్కల్లో, సంసారపు పంజరానికి చిక్కుకుని రెక్కలు విప్పుకోలేని అమ్మ దైన్యస్తితి, తడిచినకట్టెల మంటల్లో పొగచూరిన వాడి కళ్ళల్లో, తనకర్ధంకాని భావాలతో తరుముకొస్తున్న నాన్న!
ఆదరణలేని బాల్యం అడుగడుగునా అడ్డుపడుతుంది రోజులు గడిసేకొద్ది. ఓ పీడకలలాగ మస్తిష్కపు చీకటి అరలలోకి తోసేద్దామనుకున్నా, వీడని నీడలా ఎదురవుతూనే ఉంది. మరువలేని ఆ మాసినకాలం మదికొచ్చినప్పుడల్లా పరుగు, నేను వాడుకాదని మర్చిపోయేంత దూరంవరకు, మరొక కాలంలోకి! బహుశా వాడు ” నిన్ను” చూసి జాలిపడతాడేమో!

మధ్యాన్నం వరకు కాలేజి, దాని ఫీజుల కోసం రోజుకో అవతారం. టికెట్టు కౌంటర్ దగ్గరా, సెంట్రింగ్ మేస్త్రీగా, ఉదయాన్ని “మేలుకొలిపే” పేపరుబాయ్ గా. ఒక్కసారైన క్లాస్ లో వెనక్కితిరిగి చూస్తుందేమోనని “అతను” తపనబడ్డ “ఆమె”.  వెంటే నడూస్తూ ఎన్నటికైనా పక్కన నడచే సమయం రాదా? అని అతడాలోచించినా ఆమె. ఆమెగొంతు వినబడేసరికి అప్రయత్నంగా కాలుజారింది(ఆమెకు అతడి అవతారం కానరాకూడదనే ఆత్రం). గోడ గుద్దుకుని  రక్తంవస్తోంది అతడికి. మీద ఒలికిన నల్ల పెయింటింగు చూసుకుని బిగ్గరగా నవ్వాడు. మరల ఎన్నటికోఒక రోజున మరొక వేషంలో తలవాల్చి బెరుకు చూపుతో వడ్డిస్తున్న అతడి చేతికి ఇంకొక చేయితగిలితే ఖాళీపళ్ళెంలో “విషపు నవ్వొకటి మధురంగా” నవ్వుతూ ఆమె కనిపించింది. ప్రేమ కూడా కుళ్ళుకంపు కొట్టింది బాల్యానికిమల్లే అతడికి. ప్రేమ విఫలమైందనే గుర్తుగా క్యాటరింగ్ కాంట్రాక్టరికి ఆరోజు జీతం అతడు మిగిల్చివెళ్ళాడు. పరిపక్వతలేని తలంపులకు పక్కన నెట్టేసి చదువుపై మనసులగ్నం చేసిన అతడికి కూడా “నేను” దూరంగా పరుగెడుతున్నా.
ఎండిపోతున్న అతడి జీవితంలో నేల నెమ్మదిగా బీటలువార్చడం మొదలెట్టింది. గూడుకట్టుకున్న సంశయాలను చిదిమేస్తూ రూపమేదో తెలియని నిజమొకటి దరిచేరింది. ఎక్కడో దొరికితే పెంచుకున్నారట పిల్లలులేరని తన అమ్మని. తీరా పిల్లలుపుట్టేసరికి వంటిళ్ళుకి, వాకిలూడవడానికే పొద్దు తెల్లారింది అమ్మకి. భారం వదిలించుకోవడానికి బాధ్యతే తెలియని భర్తనంటగట్టింది అమ్మమ్మ. గొడ్డును బాదినట్టుబాది, గూట్లోంచి తరిమేస్తె తల్లిగా చేరదిసి “అమ్మగోరు”లాగ పనుల మీద పనులప్పగించేది. అతడి ఊహలన్నీ గుండెగోడలు చిత్రవదలుచేస్తున్నాయి. క్షణకాలం బ్రతుకుమీదనే అసహ్యం, మరుక్షణమే ఏదో కసి మనిషిగా ఎలా బ్రతకాలో అమ్మగోరు “అమ్మమ్మ”కు చూపించాలని.!

పట్టుదలగా చదివి విశ్వవిద్యాలయలంలోకి ఒపేన్ గా ఎంటరయ్యాను. భావజాల ఆవేశాల్లో పురుగుల్లా కొట్టుకోవడం, ధ్యేయం ఒక్కటైనా మన మార్గాలు వేరని వాదించడం. దేశభక్తి జబ్బొచ్చి “కాషాయాన్ని” కషాయములా తాగినోల్లకి “ఎరుపు” విరుగుడు విచికిత్స. ఎరుపులో కూడా నాది “నల్లనైన” ఎరుపని వేలెత్తిచూపెడితే ఊడలు తెగిన మ్రానులా పుడమికంటుకుంటే “నీలైన అంబరం” నన్ను తల నిమిరి గుండెలకద్దుకుంది.

తరుముకొస్తున్న నాన్నలో తక్కువకులం దాన్ని అంటగట్టారనే ఆయన అ “న్యాయ” ఆక్రంధన,
అమ్మమ్మని “అమ్మగోరు” అని పిలవడంలో “దత్తత”తీసుకోలేని కులాల ఆంతర్యం,
అనామకుడిననా లేక అన్యుడని ఆమె నన్ను వదిలేసిందా అనే వీశెడంత సందేహం పుట్టుకొచ్చింది!
ప్రేమకు కులాలంటుగడుతున్నానని తిడతారేమో!

artwork: Mandira Bhaduri

artwork: Mandira Bhaduri

 

ఒళ్ళు తెలియకుండ నిద్రపోయాననుకుంటా తెల్లని చారికలా చొంగ చెపమీద. అపరచిత స్థలంలో ఉన్నానని తెలియగానే, బద్దకంగా లేచా. ఎంతోకాలంగా నేనెరిగినట్టు నవ్వుతూ నా నుదుటిమీద చెయ్యేసి ఎలా ఉందని మెల్లగా అడిగింది “తను”. గడ్డకట్టిన రక్తాన్ని చూడగానే గత రాత్రి  క్షణాలు దృశ్యాలుగా మెదలాడాయి. కర్రలతో కాషాయి దేశభక్తి చాటుకోవడం, డొక్కలో గుద్ది భారతమాతని స్తుతించడం. తర్వాతఎవరో ఆడగగొంతు. ఏమి మాట్లాడాలో తెలియక వానపాములా మెల్లగా ప్రాకూతూ వెళ్తుంటే వెనిక్కిపిలిచింది మాత్రలేసుకొమ్మని. జమలమ్మ అంటే మీ అమ్మేనా? అని అడిగేసరికి పొరపడినట్టుగా నీళ్ళన్నీ మాత్రతో సహ బయటకు కక్కితే, నెత్తిమీద నిమురుతూ నా కాలేజి ఐడెంటి కార్డు చేతికిచ్చింది. పదినిముషాలు రుబ్బుడుబండ కింద నలిగి డబ్బులు లెక్కపెట్టుకుంటే పీలగోంతు వినపడి నా “పూల ఫ్రాక్” అనుకొని వచ్చి చూస్తే తీరా అది నువ్వు. నీ నుదుటనుండి రాలిన రక్తానికి, రుబ్బురోలు డబ్బులకు లెక్కసరిపొయింది దవాఖానాలో. ఎందుకిదంతా చేశారంటే అంటే మీ అమ్మ పేరు కారణమంది. జమలమ్మపెద్దమ్మ నన్ను అమ్మి అమ్మి అని పిలుస్తూ ఉండేది. ఒకసారి సరుకారు కంపకు నా ఫ్రాక్ పట్టుకుని చిరిగితే తనే కుట్టింది. నాన్న తనకే భయపడేవాడు. అమ్మికి  నీ  ఎంగిలి యవ్వారాలు తెలియనియ్యొద్దని నాన్నని తిడూతూ ఉండేది. ఆ పెద్దమ్మ పేరు మీ అమ్మ పేరు ఒకటే.
సరైన  దెబ్బలు కూడ తట్టుకోలేని నీ కాయానికి ఎందుకంత కష్టం కలిగిస్తావని తనడిగితే,
ఆకలి అని ఏడిస్తే పుణ్యవేదభూమిలో ప్రతిఘటించకుండా చనిపోవాలన్నారు.
కుళ్ళు సమాజం చేసిన గాయాలు చూపెడితే, ఆధ్యాత్మికంలో తేలియాడలంటా.
నేరం అని ఎలుగెత్తితే విద్రోహశక్తులని నోరు మూయిస్తారు.
న్యాయం కావాలంటే, దేశద్రోహుడిముద్రవేస్తున్నారు అని చెప్పా.
ఏమని పిలవాలో తెలియక తటపాయిస్తున్న నన్ను, రాతిరి రాతిరికి పేరు మార్చుకునేదానిని ఏ పేరు పిలిచినా పలకడం నేర్చుకున్నాఅని విషాదంగా నవ్వింది. తత్తరపాటుగా కృతజ్ఞతలుచెప్పి బయటకెల్తుంటే ఎక్కడకనే తన చూపుకి సమాధానంగా బాల్యపు “వాడికి”, యవ్వనపు “అతడికి” దూరంగా అని చెప్పేసి వచ్చేశా.
ఆదర్శాల రొచ్చులో ఆకాశంవైపే చూస్తూ, నేలమీద పాకుతున్న నిజాలను చూడలేకపోయా. వడ్డించిన విస్తరిలా కొందరి జీవితాలలో ఉద్యమాలు కాలక్షేపాలని, తమ సౌఖ్యానికి భంగం కలిగితే తాబేలు డొప్ప లోపలికి మూసుకుంటారని జ్ఞానోదయమయింది. కాలం తెచ్చిన కొత్త సంకెళ్ళతో కాళ్ళీడ్చుకుంటూ ఎన్నో ఆఫీసులకు తిరిగా, పని కోసం అన్నం పెట్టని సిద్దాంతాలనువదిలిపెట్టి. షరామాములుగా కొన్ని నెలల నిరాశయమయజీవితం.
నీళ్ళతో పొట్టనింపుకోవడమే రెండురోజుల నుండి. పెంటకుప్పలమీద ఎంగిలివిస్తరాకులు తింటున్న కుక్కకేసి అసూయగా చుస్తుంటే భుజాన్నెవరో తట్టారు. ఎండతో ఎక్కువ సహవాసం చేయడంవల్ల కళ్ళ మసకలలో తన రూపం పోల్చుకోలే. నువ్వంటనే ప్రశ్నకు చినిగిన ఫైలులో సర్టిఫికెట్లు చూపించా నా అప్రతిహత దండయాత్రలకు చిహ్నంగా. తనతో రమ్మని కళ్ళతో సైగ చేయగానే మారు మాట్లడకుండా హత్యచేయబడ్డ శవంక్రింద రక్తంలా, మెల్లగా, నిశ్శబ్దంగా వెంటవెళ్ళా. కడుపునిండా అన్నం పెట్టింది. నా అమ్మవాళ్ళు ఎక్కడని అడిగిన తన ప్రశ్నకి నా మొహంలో వచ్చిన కవలికలు కనుక్కొని తనెవరో చెప్పడం మొదలెట్టింది.
నాలుగోదికూడా ఆడబిడ్డైన నెత్తినెక్కించుకొని పెంచాడట తన నాన్న. చింకి లంగాలు, చిల్లుల గౌనుల గుడిసెల నడుమ వాడిపోని “పూలఫ్రాక్” లాంటి బాల్య జీవితం! ఎల్లిపాయకారాల సందిట్ల ఎద్దుకూరమాపటన్నెం. రంకుతనపు రొచ్చుముండల చెమట కంపు సొమ్ముసోయగాలని మా మీద అమ్మలక్కల చీదరింపులు.
నాన్నని పల్లెత్తుమాటంటే, లంగాలుదోపి “మగోళ్ళలా” మంది మీదకు దూకేవాల్లం నలుగురం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మబ్బులకంటిన ఆశలు ఒక్కసారే అఖాతంలోకి నెట్టబడ్డాయి.

ఎముకలగూళ్ళు, గుంటలపడిన కళ్ళు, సన్నని వెదురు కర్రల్లాంటికాళ్ళు, ఒకటే ఎగశోస. ”తాతేంటి” పిన్నినా లాగా నత్తినత్తిగా మాట్లడుతున్నాడంటే తల ఎత్తి చూడలేనంతగా కళ్ళలో నీళ్ళు. పెబుగుడిలో చావుకి దగ్గరపడిన సైతాను మోష. నలిగిన తన జీవితం నేర్పిన మాటేదో చెప్పాలని వణుకుతున్న బైబిలుతో నాన్న పిచ్చిమాటలు. పదాలకు అర్ధాలేమి అందకపోయినా విరిగిన నాన్న గాజుముఖంలో పశ్చాత్తాప ప్రతిబింబాలను లీలగా చూస్తున్నారు “గొర్రెలమందంతా”.

యవ్వనంలో నీరెండలో మెరిసే ముఖవర్చస్సు, నల్లని కండలు తిరిగిన దేహం. జీతమున్న కమ్మోరి పశువులకొట్టంలో దొరసాని “వేడిలో” చలికాగటం, ఆమె ఆనందానికి కానుకగా పాకలో నలుగురపిల్లల కడుపులో అంతముద్ద చల్లటన్నం. ”తప్పు” కాదు “తప్పదనిపించింది” ఆ సమయంలో.
నాగలి వరస గాడితప్పి అడ్డదిడ్డంగా సాలెరువాల్ల దుక్కి. కండకావరమెక్కి వంగిన చెట్టుకాయల్లా వలచడం, ఎన్ని పంటలు నాశనం చేశాడో ఆ మత్తులో.తురకోడి పొలంలో పరిగ ఏరడం అని చెప్పి గడ్డివామంతా తగలబెట్టాడు కదా. చివరకు తనపొలం గట్టుమీదున్న పిచ్చి బెండుతీగలను కూడా వదలలేదుకదా! నయంకాని మాయరోగం వస్తే, చెదలుపట్టిన గుండె అరుపులను  పెబుకాడ మొరపెట్టుకుంటున్నాడు నాన్న. పగుల్లిచ్చిన నాన్న సమాదిలోంచి పుట్టుకొచ్చిన చెట్టుకు నీళ్ళుబోసి, మంచంలోఉన్న అమ్మ ఏరుక్కుంటే డబ్బాకోసం గాబుకాడికి పోతే, పెళ్ళెప్పుడు చేసుకుంటావని పక్కింటి తుమ్మెద  పెడాల్న మొహమ్మీదంది.  పీతిచేతిని కడుక్కుంటూ “మురుకిగుంట ప్రవాహాన్ని” ఎగాదిగా చూశా! పెద్దక్క 12 సంవత్సరాల వీపువాతలు చూడలేక చిన్నిగాడు పొట్టలోంచి బయటకొచ్చాడుఅప్పుడే. నడిపక్క బొట్టుబిళ్ళను కబళించిన పనిచేయని లారీ బ్రేకులు. అత్తింటి కిరసనాయిల వాసన పసిగట్టలేక సగంకాలిన చిన్నక్క. లోకంచూడలేక కళ్ళుమూసుకుని కుక్కిన మంచంలో అమ్మ. నాన్న జీవీతం శాపంలా వెంటాడుతుందేమో కుటుంబాన్ని అంతా! నన్నెవరింకా పట్టించుకుంటారనే బాధేలేకుండా, చారులో చెంపలమీదనుండి కారుతున్న కన్నీళ్ళను ముంచుకొని  అన్నం తిన్నా.
ఏటిదగ్గర  వాడిపోని  నా ”పూలఫ్రాక్”  మరీచికలా వేలాడుతుంటే అన్నీ వదిలేసి వచ్చేసా. పెద్దక్క, నడిపక్క ఎవడితోనే లేచిపోయిందని మిగిలిన ఇల్లు, మంచం అమ్మ మౌనరోద సాక్షిగా పంచుకున్నారు. వాడిపోని ఆ పూల ఫ్రాక్ కోసమే ఈ ఊరొచ్చా. మనిషిలో దాగిన రంగులన్నీ చూపించింది ఈ పట్నం.
ఆకలి, మోసం, నేరం, క్షణికావేశం, కామం, క్షామం, జబ్బు, జల్సా.
చీకటి రైలుపట్టాల మాటున ఎదమీద సిగరెట్తో కాల్చిన గుర్తులు, పోలిసోడి మీసాల చాటున నలిగిన నా కాళ్ళు, బాధగా మూలిగే మంచం కిర్రు కిర్రులు. ఈ జీవితం ఇంతకంటే నాకు ఒనగూర్చినదేమిలేదు అని ముగిచ్చింది తన కథ. నిన్ను చూస్తే ఆ పెద్దమ్మకి కొడుకుంటే నీలాగే ఉండేవాడనిపించి నీతో చెప్పుకున్నా. నేను మరువలేని బాల్యంకోసం వెడుతుంటే, నువ్వేమో కోరి వస్తున్న దానిని అసహ్యించుకుంటున్నావు.
తనవైపు తదేకంగా చూస్తూ అక్కా…….అని పిలిచా.
నల్లనైన మేఘంలో చుక్క మెరసినట్టు, నింపాదిగా నవ్వింది నన్ను నుదుటిమీద ముద్దాడుతూ! తన గుండెలోతుల్లోంచి పొంగిన అల ఏదో అశ్రుబిందువై నన్ను అశనిపాతంలా తాకింది. తలుపు చప్పుడైతే తన శరీరానికి గాయమయ్యే తరుణంమొచ్చిందని చెప్పి నన్ను పంపించివేసింది.
తను, నేను  భిన్న ధృవాలం.శిధిలమైన బాల్యంవైపు తను, ఎంతకు ఘనీభవించని “వాడికి”, ఆవిరయిపోని” అతడికి” నేను దూరంగా పరుగెడుతున్నాం. “నా”లోంచి “నేను” వేరు పడాలని నేను, తన లో,లోపలికి కుచించుకుపోవాలని తను.
చాలరోజులయింది అక్క కనిపించి. ఒక రోజు నడుచూకుంటూ వెళ్తుంటే రోడ్డుకు ఆవల పూల ఫ్రాక్ అమ్మాయికి ఐసుక్రీం కొనిపెడుతూ నా వైపు చూపిస్తూ ఏదో చెప్తుంది ఆ పిల్లకు. ఎక్కడ కారిపోతుందనే ఆత్రతతో దాన్ని తింటూ వచ్చి నా చేతిలో ఒక కవరు పెట్టిందిఆ పెంకి పిల్ల.
“ఎన్నాళ్ళని నీకు నువ్వు దూరంగా పారిపోతావ్? నువ్వంటే అతడు, వాడు కూడా కదా !?.
నా “నిజానికి” దగ్గరగా నే వెళ్ళిపోతున్నా. నీలాంటి తమ్ముడికి ఉండాల్సిన అక్కని కాదు నేను. జమలమ్మ పెద్దమ్మని జాగ్రత్తగా చూస్కో. చీటితో పాటు తన చెమటతో తడిచిన కొన్ని నోట్లు కనిపించాయి ఆ కవర్లో.”
అకస్మాత్తుగా వచ్చిన ఈదురుగాలికి ఆ కాగితం కొట్టుకుపోతే తను ఎటువెళ్ళిందో అని తలెత్తి చూశా. పూల ఫ్రాక్ లేదూ, తనూ లేదూ.

ఆ రోజు నుండి వెదుకుతూనే ఉన్నాం “అక్క” కోసమే కాదు,  “మా” అక్కే అని చెప్పుకోలేని అక్కలందరి కోసం నేను, వాడూ, అతడు “ముగ్గురం” కలసి.

 

మీ మాటలు

  1. bhanu prakash says:

    చాలా చాలా బాగున్నాయి కొన్ని వాక్యాలు “నడిపక్క బొట్టుబిళ్ళను కబళించిన పనిచేయని లారీ బ్రేకులు. అత్తింటి కిరసనాయిల వాసన పసిగట్టలేక సగంకాలిన చిన్నక్క. లోకంచూడలేక కళ్ళుమూసుకుని కుక్కిన మంచంలో అమ్మ. నాన్న జీవీతం శాపంలా వెంటాడుతుందేమో కుటుంబాన్ని అంతా! నన్నెవరింకా పట్టించుకుంటారనే బాధేలేకుండా, చారులో చెంపలమీదనుండి కారుతున్న కన్నీళ్ళను ముంచుకొని అన్నం తిన్నా.” ఎంత బాగా రాసారు ఈ లైన్స్ అద్భుతః అన్తె

  2. అజిత్ కుమార్ says:

    కధను కవితలాగా వ్రాశారు.

మీ మాటలు

*